Jump to content

కాశీమజిలీకథలు/పదవ భాగము/220వ మజిలీ

వికీసోర్స్ నుండి

యంబులంబఱపి పరలోకాతిధులంగావించెను. కుంటి గ్రుడ్డి వృద్ధుఁడుం దప్ప బేరుపొందినరక్కసుం డొక్కడును మిగిలియుండలేదు. వజ్రకంఠుడు గూడ వారితో మడియుటందెలిసి రాజపుత్రిక శోకింప వీరవర్మ నర్మాలాపములచే నూఱడించి యందుఁజచ్చినరాక్షసులగాత్రములనెల్లనగ్నిసాత్కృతము గావింపఁజేసి శుభముహూర్తంబున నాపద్మసేనతోఁ గూడ దద్రాజ్యలక్ష్మింబరిగ్రహించి మహా వైభవముతో సింహాసన మెక్కెను. అనియెఱింగించి . . . ఇట్లు చెప్పదొడంగెను.

_________

220 వ మజిలీ

అతల రాజ్యము

వీరవర్మ యతలరాజ్యమునకుఁ బట్టభద్రుండైనతోడనే యాపట్టణమంతయుఁదిరిగి యందలి యంత్రరహస్యములన్నియుం దెలిసికొనియెను. అందుఁబేరుపొందిన రక్కసులెవ్వరునులేరు. ఉన్న వారతనిభుజబలమునకు మించినవారుకారు. కావునఁ బట్టణవాసులెల్ల నతనికి దాసులై యతనిపరాక్రమగ్గించి కొలుచుచుండిరి. అన్నగరము దిక్పాలుర నగరములకన్న నెక్కువశోభగలిగి విశాలమై ప్రకాశించుచున్నది. అతండు దినమునకొక్క వీధివడువునఁ దిరుగుచు నందలివి శేషములఁ దెలిసికొనుచుండెను.

మఱియు భూవివరాంతమునందలి యంత్రశిలాఫలకముకడకరిగి యందుఁగావున్న లంబోదరీకుంభులవలనఁ దనతమ్ముఁడు సుధన్వుని వార్త కొంతవిని వారపకారము చేయఁదలంచినను నప్పుడు చంపక పోవుట యుపకారముచేసినట్లే తలంచుచు వాండ్రకుఁ గానుకలిప్పించి యందు దప్పించి మఱియొక చోటికనిపెను.

అందుఁబడినవారు మడియకుండ మెత్తనిపానుపులఁ బఱపించి క్రొత్తనిబంధనల నేరుపరచి విశ్వాసపాత్రులగు దూతలఁగొందఱగాపు పెట్టించెను. నరాంతకుని మేనకోడలు రత్నావతి తనతమ్ముని వరించి యతనిమరణమునుండితప్పించినవార్త భార్యవలనవిని యున్నవాఁడగుటా వెంటనే యావాల్గంటి దనయింటికి రప్పించుకొనియాదరించుంచుండెను...

ఒకనాఁడతండు కొల్వుకూటంబలంకరించియున్న సమయంబునఁ బ్రతీహరి యరుదెంచి మహారాజా! త్రికూటనగనివాసినియఁట కుటిలాలకయోర్తు, రాజభటవేషముతోవచ్చి ద్వారముకడనిలిచి యీకమ్మ మీకిమ్మని యిచ్చినది. అనుటయు నతండు దానినందుకొని విప్పియిట్లు చదివెను.

వజ్రకంఠా! నీవు నరమాంసోత్కంఠుడవై మనుష్యలోకంబునఁ గపటమునిఁ బురికొల్పి బోనువంటి గిరికూటబిలమార్గంబున మనుష్యులఁబడ నేయించి యిందురప్పించుకొనుచుఁ గడుపునిండించు కొనుచుంటివి. ఆతిండియే యిప్పుడు నీకు మృత్యువైనది. పాపాత్మా! కాచికొనుము. ఎంతకాలమిట్లు చేయఁగలవు! మీపూర్వులగు పలలాశనులు లోకకంటకులై యేమైరో యెఱింగినవాఁడవై తేని యిట్టి ఘోరకృత్యములు సేయఁబూనవు. లోకైకవీరుండగు మాయన్న వీరవర్మను బిలమార్గమున రప్పించుకొని కడతేర్చియుందువు. అంతటితో విడువక యాదారినేనన్ను నీయింటికిం దెచ్చికొంటివి. అదియే నీకుముప్పైనది. నాకుగొప్పయైనది క్షుద్రా! నేఁటికేడవనాఁడు నీ పురికరుదెంచి నిన్నుఁ బుత్రమిత్రకళత్రాదులతో నాశనముజేసి నీరాజ్యము గైకొందుఁ గాచికొనియుండుము ఇదియే నీకుఁగడపటిసందేశము.

ఇట్లు, సుధన్వుఁడు.


ఆపత్రికంజదివికొని వీరవర్మ సంతోషపారవశ్యంబున మేనెఱుఁగక యొక్కింతతడవునకుఁ దెలిసి కన్నుల నానందబాష్పంబులుగార నాకమ్మ గన్నులకద్దికొనుచు నా లిపింజూచి తమ్మునించూచినట్లు సంతసించుచుఁ దక్షణము యాకమ్మదెచ్చిన పొన్నికొమ్మం దీసికొనిరమ్మని ప్రతీహారికాజ్ఞాపించెను. అతండరిగి యత్తెఱవకై నలుమూలలు వెదకిన నెందును గనంబడలేదు. అందలివార లాసుందరి యప్పుడే పోయినదని చెప్పిరి. ద్వారపాలుఁ డామాట వీరవర్మ కెఱంగించెను.

వీరవర్మ తనతమ్ముఁడా వీటిపై దండువత్తునని వ్రాసినదివసము లెక్కించుకొనుచు నాఁటి యుదయమునఁ బెందలకడలేచితురగారూఢుండై యతండువచ్చుమార్గమున కెదురుగాఁబోయెను. అప్పుడేసుధన్వుఁడు యక్షసేనాపరివృతుండై వచ్చుచుండెను. ఇరువురు మార్గమధ్యంబునఁ గలిసికొనిరి. సుధన్వుఁ డన్నగారింగురుతుపట్టి యోహోహో నాప్రియసోదరుఁడు వీరవర్మయే. నేఁడెంతసుప్రభాతము అని పలుకుచు గుబాలున గుఱ్ఱముడిగ్గనుఱికి యతనింగౌఁగిలించుకొనియెను, పెద్దతడవునకు నెలుంగురాల్పడ అన్నా ! యెట్లుబ్రతికితివి! నీయునికి వజ్రకంఠుఁ డెఱుఁగునా! యీగుఱ్ఱమెట్లువచ్చినది? అనియడిగిన సంతసముతో నాతండు తనవృత్తాంతమంతయు నెఱింగించి యిప్పుడునేనే యీభూమి పాలించుచుంటిని. నీవాదానవునిపేర వ్రాసినకమ్మఁ జూచి యిట్లు వచ్చితినని యెఱింగించెను. సుధన్వుండును తనవృత్తాంతమంతయుఁ బూసగ్రుచ్చినట్లు తేలియఁజేసి యతనివిస్మయసాగరమున నీఁదులాడఁ జేసెను.

తనకుఁ బ్రాణదాయినియైన రత్నావతి యన్నగారియంతఃపురముననున్నదని విని మిగుల నానందించుచు యక్షకాంతలనెల్ల త్రికూటశైలాంతరమునకనిపి తా నన్న వెంట నగగిలోనికిం జనియెను. వీరవర్మ తనభార్యకు దమ్మునింజూపుచు నతనిచిత్రమంతయుఁ జెప్పెను. ఆమె యాశ్చర్యపడుచు రత్నావతిని దీసికొనివచ్చి యచ్చిగురుఁబోడిచేసిన యుపకార ముగ్గడించుచు సుధన్వునికిఁ జూపినది. సుధన్వుండా యెల నాగంజూచి సంతోషము పట్టజాలక తటాలున చేయిపట్టుకొని ముద్దుపెట్టుకొనుచు నాముద్దుగుమ్మను బెద్దగా నగ్గించెను. అదియే పాణిగ్రహణ మహోత్సవమని యెల్లరు చప్పటులుకొట్టిరి. ఈసుపాణి నిదివఱకే గ్రహించితి నిది క్రొత్తకాదని యతం డుత్తరమిచ్చెను. నాడెల్ల యావృత్తాంత కధనముతో వెళ్ళించిరి.

నాటంగోలె రాజపుత్రు లిరువురు భూలోకమున కేగు మార్గ మరయుచు నొకనాఁడు బిలముఖంబున కరిగియందలి విశేషములు పరికించుచుండిరి. ఇంతలో లోపలిగంట మ్రోగినది. ఆమ్రోఁతవిని వారది యేమని యడిగిన నిప్పుడేదియో జంతువవచ్చి పడుచున్నది. అందులకే మ్రోగినదని కాపున్నవాఁడు చెప్పెను. అప్పుడప్పుడువాని జాగ్రత్తగాఁ గాపాడవలయునని పలుకుచు మెత్తని పాన్పులు సవరించి వేయించిరి. వారు సూచుచుండ జరజర జూరి మునిశిష్యుండొక డందుఁబడియెను. వానికిఁదగిన యుపచారములు సేయించుటచే వెంటనే యతనికిఁ దెలివివచ్చినది. వానిలో నొకయుంగరము కూడ జారిపడినది. దాని సుధన్వుండు కని అన్నా! చూడు. చూడు. ఇది మన తమ్ముఁడు ప్రతాపరుద్రునిదివలె నున్నది. ఇందలి విలాసము పరికింపుము. అని చూపుటయు నౌను వానిదే. వాఁడు గూడ నిందు జారిపడుచున్నవాఁడేమోయని తొందరపడుచు మెత్తని పఱుపులు. సవరించి యందు వేయించెను.

పిమ్మట మునిశిష్యుంజూచి యోహో! వీఁడా కపటయతిశిష్యుఁడు నాఁడుమనలను బెదరించినవాఁడు వీఁడే. వీనింబట్టికొని నిర్భంధించిన నిజము దెలియఁగలదని తలఁచుకొనుచు వా రిరువురు వాఁడు విశ్రాంతి వహించిన పిమ్మట నీ వెవ్వఁడవు. ఇం దేమిటికి పడితివని. యడిగిరి. వానికింకను బూర్తిగాఁ దెలివిరాలేదు. అట్లడిగినవారు వజ్రకంఠుని యాప్తులే యనుకొని మెల్లగా నిట్లు చెప్పెను.

మిత్రులారా! నేను భూలోకములోఁ జిత్రకూటనగపాదమున నున్న యలంబుసునిపరిజనుండ శిష్యరూపముతోఁ దిరుగుచు మనుష్యు..ల నాగుహాంతరమునఁ ద్రోయుచుందును. ఇరువురు రాజకుమారుల నిందుఁబడవేసినది మీరెఱిఁగియే యుందురు. వారితమ్ముఁడు ప్రతాప రుద్రుఁడట అన్నలజాడఁ దెలిసికొన నరుదెంచి యలంబసునొద్దకు వచ్చి నమస్కరించి తనయన్నల వృత్తాంతము చెప్పుమని యడిగెను. వాని కంఠధ్వని వినినంతనే వానికి నాకుఁ గూడ వెరపుగలిగినది. ఆవెరపు వెల్లడికానీయక మనయలంబుసుఁడు పన్నవలసిన వ్యూహమంతయుఁబన్ని చివఱకు వాని నాకొండశిఖరమెక్కి గుహచూచుట కంగీకరింపఁజేసెను. నాకుఁ గనుసన్నఁ జేసి వానికా గుహజూపింపుమని నియమించుటయు నేను వాని వెంటంబెట్టుఁకొని కొండయెక్క, దొడంగితిని.

వాఁడు దారిలో నన్ననేక ప్రశ్నములడిగి నాహృదయాశయము గ్రహింపవలయునని తలంచెనుకాని నేనేమియు నవకాశమిచ్చితినికాను. వాఁడు మాకపటము మొదటనే గ్రహించెనని నే నెఱుంగకపోయితిని. వాఁడు కొండయెక్కునప్పుడు నా వెంట నడుగులో నడుగువైచి యెక్కుచుండెను. శిఖరమెక్కి గుహావిశేషములు నేను జూపించుచుండ వానియందుఁజూపులు వ్యాపింపఁజేయక నేలయే పరిశీలించుచు నడుగులు వైచుచుండును. నేనాగినఁ దానుగూడ నాగును. వానిముందుఁ బెట్టవలయునని నేనెంతయో కపటముజేసితిని. వాఁడు నావలలోఁ బడలేదు. గుహలోని మీటవఱకు నేనుముందునడిచి యందునిలువంబడి అయ్యా! మాయన్నలామళువులో నున్నారు. ఆబల్లయెక్కి చూడుఁడని నేను జెప్పఁగా కడునడు నీవేయెక్కి చూపుము. అని నన్ను బలాత్కారముగాఁబట్టి యాబల్లపైకిఁ ద్రోసివిడిచెను.

మీటసడలి నేను గుబాలున నీవివరములోఁబడితిని. పడునప్పుడు వానిచేయిబట్టింటి. అతఁడు కేలువిదళించుటచే వానియుంగర మూడి వచ్చినది. వాడు దొరకలేదు నేను జారివచ్చి యిందుఁబడితిని. ఇదియే నావృత్తాంతము తరువాత నతండు అలంబసుని నిజస్థితి గ్రహించెనో లేదో తెలియదు. అని తనవృత్తాంతమంతయు వాఁడెఱింగించెను. ఆమాటలువిని సుధన్వుఁడు కోపముపట్టఁజాలక వానింజంప నుంకించుటయు వీరవర్మ వారించుచుఁ దమ్ముఁడా! వీఁడు మనకు శత్రువైనను మనతమ్ముని క్షేమవార్తఁ దీసికొనివచ్చెను. వీనివలన మన మక్కడివృత్తాంతము దెలిసికొందముగాక తొందరపడకుమని వానికిఁ దెలియకండఁజెప్పి యోరీ! నీకీయలయిక యెట్లైనఁ బదిదినముల దనుక తీఱదు. నీకతంబున మనయేలిక వజ్రకంఠునికి నిత్యము నరమాంసము దొరకుచున్నది నీవుతిరుగా నందుఁబోవలయును. ఎప్పుడుపోయెదవు? అని యడిగినవాఁడు కన్నులు మూసికొనియే యిట్లు చెప్పెను.

మిత్రులారా ! నాకు నొడలేమియు స్వాధీనములో లేదు. మీరు జేసిన యుపచారములవలనఁ బ్రతికితినికాని చావవలసినదే. బలము గలిగినపిమ్మట భూలోకములోని కరిగెదంగాక, నన్ను రాజునొద్దకుఁ దీసికొనిపొండు. నాబన్న మాయనకు నివేదించి యేగెదను. అని పలుకుటయు వీరవర్మ, నిన్ను నేలికయొద్దకిప్పుడే తీసికొనిపోయెదము. నీకష్టములన్నియుఁ జెప్పెదము. నీకతనిచేఁ బారితోషిక మిప్పింతుము వెరవకుము నీవు భూలోకమున కే దారిఁబోయెదవు! ఈవివరములో నుండి పోవఁగలవా! అనియడిగినవాడు కన్నులఁ దెరచిచూచి రాజ కుమారులం గురుతుపట్టి వెరచుచు నది స్వప్నమేమోయని భ్రాంతిపడి క్రమ్మఱఁ గన్నులమూసికొనియెను. పిమ్మట వారేమియడిగినను బ్రత్యుత్తరమియ్యడయ్యెను.

అప్పుడు వీరవర్మ వానిం బందీగృహంబునఁ బడవేయుఁడని యాజ్ఞాపించి తమ్మునితో వత్సా! మన ప్రతాపరుద్రుఁడు మన మీగుహలోఁ బడిపోయితిమని తెలిసికొనియుండును. అలంబసుడుచేయు కపటము గ్రహించియేకదా వీని నిందుఁబడద్రోచెను. అతండు మిగుల బుద్ధిమంతుడు మన వృత్తాంతము దెలిసికొనుట కేదియో సాధన మాలోచింపక మానఁడు. అలంబుసు నీపాటికిఁజంపి యాకొండ స్వాధీ నము జేసికొనియే యుండును. కానిమ్ము మనల మృత్యుముఖంబునుండి తప్పించి రాజ్యపట్ట భద్రులంగావించిన భగవంతుఁడిప్పు డెందుఁబోవును? అమ్మహాత్ముఁడే మనకాదారిగూడఁజూపఁ గలడని పలుకుచుఁ దమ్ముని యుంగర మంగముల నద్దికొని ముద్దుపెట్టుకొనుచుఁ దద్దయుఁబ్రీతితోఁ దనభార్య కత్తెఱంగంతయు నెఱింగించెను.

మఱియు వారిరువురు సంతతము బిలద్వారనికటంబుననే వసించి యందుండి యేదియైన వార్త వచ్చునాయని యాలోచించుచుండిరి. ఒకనాఁడందలి ఘంటాటంకారధ్వని వినంబడినంత వీరవర్మ సంతోషముతో దమ్మునికిఁదెలిపి పానుపుసవరింప నియోగించెను. అంతలో నొక యినుపగొలుసు చివరగట్టిగా గట్టఁబడిన గుండొకటి జారి యాతల్పంబునం బడినది. రాజకుమారులు విస్మయముతోఁ జూచుచు నా యినుపగుండు గొలుసు వీడదీసి విమర్శించిచూడ నందొక బిరడా గనంబడినది. దానిందీసినంత నందొకపత్రికయున్నది. ఉత్సాముతో నా పత్రికందీసి వీరవర్మమేను పులకింపనిట్లు చదివెను.

అన్నలారా! మీదిగ్విజయయాత్రా వృత్తాంతము చిట్టచివరఁ గొన్నిదినములు వినక మన తలిదండ్రులు పరితపించుచుండ దండనాధుండు చిత్రకూట నగపార్శ్వమునందున్న సేనానివేశమునుండి తండ్రి గారికొక సందేశపత్రిక నంపించెను. అందు మీ యిరువురునొకమునీశ్వరుని ప్రేరణంబున నందలి గిరికూటమెక్కి తిరుగరాలేదనియుఁ బది దినములు వేచితానాఋషినడిగినఁ దనకేమియు సమాధానము చెప్పక శపింతునని బెదిరించెననియు నిటుపైనఁ గర్తవ్యమేమని తెలియఁ జేయఁ గోరుచున్నానని వ్రాయఁబడియున్నది. ఆవార్త విని మనతలిదండ్రులు దారుణముగా శోకించుచుండిరి. అమ్మగారి జాలిగుండె తెఱంగు మీ రెఱింగినదియేగదా! పుత్రులందఱము మూఁగి యామెనోదార్చితిమి. వారి యాఱవకుమారుఁడు రాగవర్ధనుఁడు రౌద్రావేశము తో ధనుర్బాణములుధరించి నన్నా సేనానివేశము కడకనువుఁడు వారి సేమమరసివచ్చెద మీరిట్లు విచారించినఁ బ్రయోజనమేమని పలుకుటయుఁ దండ్రిగారనుమతించి యారౌతుల వెంటనతని నంపిరి.

అతండును దురగారూఢుండై యాసాదుల వెంట నరుగుచుండ నొకనాఁడొక మార్గమధ్యంబున సంవర్త సమయంబునంబోలె మహా రౌద్రముగా గాలివానపట్టి బిట్టుగా వానగురియ మొదలు పెట్టినది. వారావాతాఘాతంబునకు వగచుచు వానందడిసి దారితప్పి యెట్ట కే చీకటిపడునప్పటికి నతిప్రయత్నమున నా ప్రాంతమందున్న జయపురమను పట్టణమును జేరికొనిరి.

తద్దేశాధిపతిజయదేవుఁడు మీచే సంగరమున నోడింపఁబడి తిరుగ స్థాపింపఁబడినవాఁడని యెఱింగినవారగుట నారౌతులతని నొక సత్రములోనిలిపి యావార్త కోటలోనీకిం దెలుపనరిగి తిరుగవచ్చి చూచునప్పటి కారాగవర్ధనుఁడందుఁ గనంబడలేఁదట. అతనినారాత్రి యెల్ల వెదకి మఱునాఁడువెదకి యతని జాడతెలియక యాదూతలు వెండియు మనవీటికరుదెంచి యాయుదంత మెఱింగించి మన తలిదండ్రుల శోకవిహ్వాలులఁ గావించిరి.

అప్పుడు నేనును జయమల్లుఁడునుధనుర్బాణములుధరించి వారి నూఱడించుచు వారియనుమతి వహించి బయలుదేరితిమి. కొంతసేనను సహాయముగానిచ్చి మససోదరు జయమల్లుని జయపురంబున కనిపితిని నేను ఖడ్గమాత్రసహాయుండనై తురగమెక్కి సేనానివేశమున కరుదెంచితిని. అందున్న చమూపతి నన్ను జూఁచి యచ్చటివృత్తాంతమంతయు నెఱింగించెను. పిమ్మట నేనాలోచించుచు నాయతియొద్దకుంబోయితిని. వానింజూచినతోడనే కపటాత్ముడని నాకు నంకోచముగలిగినది. నమస్కరించుచు నా కులశీలాదులెఱింగించి మీజాడ తెలుపుమని యడిగితిని. అప్పుడు వాఁడు నన్నుఁ గన్నులెత్తి చూచి గౌరవించుచురాజపుత్రా! మీయన్నలు మాశైలకూటమెక్కి యందలి గుహావిశేషములు పరికించుచు దిరుగరారైరి. అందుండిచూచిన దిక్పతుల నగరములన్నియుఁ గనంబడఁగలవు, అందులకు నేనేమి జేయఁగలను. అపూర్వవస్తుదర్శన మెట్టివారిచిత్తమునైన నాకర్షింపకమానదు. నీకు మాశిష్యుని సహాయముగానిత్తును. నీవుకూడ నాకొండయెక్కి యందలి వింతలుచూచి యన్నల వెంటబెట్టుకొనిరమ్ము పొమ్ము. అని పలుకుచు శిష్యున కేదియో కనుసన్నఁజేసెను. ఆసంజ్ఞలు జూచుటచే నాయనుమానము మఱింతబలమైనది. కొండశిఖరమున నేదియో కపటమున్నదని నిశ్చయించి యాశిష్యునివెంటఁ గొండయెక్కుచు వానితోఁ గొంతముచ్చటించితిని. వానిమాటలన్నియు నసత్యములని తెలిసికొంటి గుహలోనికింబోయితిమి. వాఁడునన్ను ముందునడిపింప వలయునని చూచెఁగాని నేనొప్పుకొనలేదు. గుహలో నొకచో నిలువంబడియాబల్లయెక్కి చూడుము. మీయన్నలు దిక్పతులు నగరములు గనంబడునని చెప్పిన నేనదికపటమని గ్రహించి వాని మెడబట్టుకొని నీవచూడుమని యాబల్లమీఁదికి గెంటితిని. మీట సడలి యాబల్ల యొఱిగినది. వాఁడాగర్తములోఁబడిపోయెను. మీరుగూడ నట్లుబడి యుందురని నిశ్చయించి పట్టరాని కోపముతో నాయతింజంపఁదలచి ఖడ్గముచేతంబూని రెండు జాములెక్కినకొండ రెండు గడియలలోదిగి రౌద్రావేశముతోఁబోయి యహంకారము ప్రకటింపక వానిదాపునకుఁబోయి నిలువఁబడితిని,

నన్నుఁజూచివాఁడు భయపడుచు రాజపుత్రా! పోయివచ్చితివా మీయన్నలు గనంబడిరా! మాశిష్యుఁడేడీ? అనియడిగిన నేనిట్లంటి. స్వామీ! మీశిష్యుఁడు మాఅన్నలజూడఁ బోయెను. ఆగుహాంతరమున నామీట యమరించితిరేమిటికి? మాయన్నలుగూడ నాబల్ల యెక్కి నివరములోఁ బడిపోయిరికాఁబోలు. ఆబిలమార్గము దిక్పతినగరములకుఁ దీసికొనిపోవునా? అని యెఱుంగనివాఁడుబోలె నడిగితిని. వాఁడు నామాట నిజమనుకొని యోహో! నీవాబల్ల యెక్కలేదా! అది యెక్కినతోడనే యొఱిగి స్వర్గమునకుఁ దీసికొనిపోవును. నీవు మొదటినుండియే మరలివచ్చితివి. తప్పుపనిచేసితివి తిరుగఁబోయి యెక్కుమని పలుకుచుండగనే నేను తొత్తుకొడుకా! నీకపట మెఱుంగననుకొంటివిరా? ఆవివరమునంబడినవారేమగుదురు? నిజము చెప్పుము లేకున్న నిన్నిప్పుడే ముక్కలుక్రిందఁగోసెదనని యదలించుచు నెడమ చేతితో జటాకలాపముఁబట్టుకొనితిగి చితిని. అవియంటింపఁబడినవగుటఁ జేతిలోనికూడివచ్చినవి. వాఁడు మొఱ్ఱోయని యఱచుచు నాపైఁదిరుగబడి యదలింపఁదొడంగెను. ఖడ్గంబు నుంకించుచు నొక్కవ్రేటున వానితలనఱకి పారవైచితిని అంతలో మన వీరులందఱుమూఁగికొనిరి. వాఁడు కపటాత్ముడనివిని దండనాఁధు డాశ్చర్యమందుచు నయ్యయ్యో తెలిసికొనలేకపోయితినే యెఱింగినచో వీనిమేను తునకలుగానఱికి కాకులఁకుఁ బాఱవేయకపోవుదునా అనిపలుకుచునాకపటము గ్రహించినందులకు నన్నుఁబెద్దగానగ్గించెను. పిమ్మట నందున్న వాని పరిజసమునెల్ల వెదకి వెదకి మన వీరులు హతముగావించిరి. సేనలతోఁ గొండయెక్కి స్వాధీనపఱచుకొని యందలి వింతలుజూచుచు మిమ్ము గుఱించి వితర్కించుచు నాలుగుదివసములా గుహాముఖంబున వసించితిమి.

అప్పుడు నాకు భగవంతుఁడీ యూహతోపించెను. మీరుబ్రతికియుందురా ఈజాబుజూచి ప్రత్యుత్తరము వ్రాయుదురు. లేనిచో జేయఁదగినది లేదుకదా! ఇదియే కర్తవ్యమని యూహించి గుహాముఖంబున నొకయంత్రచక్రమమరించి దాని కీగొలుసు దగిలించి చివర బరువైన యీయినుపగుండు దగిలించి దిగవిడిచితిమి దీనివలన దీని లోతెంతయున్నదియుఁగూడఁ దెలియఁబడగలదు. దైవకృపచేమీరీకమ్మ జూడగలిగితిరేని వెంటనే మీక్షేమము తెలియఁజేయుఁడు. ఒక్కదివసంబెల్ల నీనిగళంబిట్లుంచి తిరుగాఁ బైకిలాఁగికొందుము.

ఇట్లు మీప్రియ సోదరుఁడు, ప్రతాపరుద్రుఁడు.

అపత్రికం జదివికొని వీరవర్మ తమ్మునితోఁగూడ నుబ్బిగంతుల వైచుచుఁ దమతమ్మునికట్టి యుపాయము తోపించినందులకు భగవంతున కనేక నమస్కారములుగావించుచు నానగరంబున మహోత్సవములు పెక్కు సేయునట్లు చాటింపఁబంపెను. మఱియు నప్పుడే మఱియొక పత్రికవ్రాసి మడిచి యాయినుపగుదెయరలోఁబెట్టి చీలబిగించెను. అందు మాముద్దుతమ్ముఁడు ప్రతాపరుద్రుని బ్రీతిపూర్వకముగా నాలింగనముజేసికొని వీరవర్మయు సుధన్వుఁడును వ్రాయునదియేమనఁగా, అతలమను పేరుగల యీపాతాళలోకమందు మేమిరువురమే యధిపతులమై భూలోక విలక్షణములైన మహైశ్వర్యము లనుభవించుచుఁ ద్రిలోకాతీతసౌందర్యంబునం బ్రకాశించు భార్యలం బెండ్లియాడి మహానంద మనుభవించుచున్నారము కాని జన్మదేశప్రాణబంధు వియోగంబునంజేసి యయ్యానందంబు రోగపీడితునకుఁ జేయు విందువలె హృదయరంజకంబుగాకున్నది. మనదేశమునకువచ్చు మార్గముదెలియక తొట్రుపడుచుంటిమి. మొన్ననీవు బిలంబునం బడనేసిన కపటముని శిష్యుఁడిందుఁబడియెను వానివలన నీవృత్తాంతము గొంత తెలిసికొంటిమి. నీవుజంపినవాఁ డలంబుసుఁడను రాక్షసుఁడు ఈయతలమును బాలించుచున్న వజ్రకంఠుని యాహారము నిమిత్తమై మనుష్యుల మాయఁజేసి యదానవుఁడు మునివేషముదాల్చి యిందుఁ ద్రోయించుచుండును. ఈ బిలముమయుఁడనువాఁడు నిర్మించెను. అని తానాబిలములోఁ బడినది మొదలు నాటితుదివఱకు జరిగిన కథయంతయు వ్రాసి మఱియు నిట్లు తెలియజేసిరి.

వినుమిందుఁగల రత్నములు, బంగారము, స్వర్గలోకమందైన లేవని చెప్పవచ్చును. వానినన్నియు మనదేశమునకుఁ దీసికొని రాఁదలంచితిమి. కావున నీగొలుసు చివర బిలపరిమాణముకన్న తక్కువగా వర్తులములైన మందసములఁగొన్ని గట్టించి దిగవిడుచు చుండుము వానిలో నీవస్తువులుంచి పంపుచుందుము. ఈబిలమొక మనుష్యుండు మాత్రము పట్టునంత వైశాల్యము గలిగియున్నది. కావున వరుసగా నాలుగైదు సంచులంగట్టించి విడువుము వానిలోమేము దూరి వచ్చు చుందుము, గాలి తగులునట్లిందుండి చర్మభస్త్రికలచే నూదింతుము. మేముపైకివచ్చుటకు నింతకన్న మంచియుపాయములేవియైనఁ దోచినచో నట్లుచేసి గొలుసు దిగవిడుచుచుండుము. ఎప్పటికప్పు డుత్తర ప్రత్యుత్తరములు దెలిసికొనుచుండవలయునని యెన్నియో విషయములందు వ్రాసి పంపిరి.

ప్రతాపరుద్రుఁడు వ్రాసినరీతిగా నొకదివసముమాత్ర మందు నిలిపి పిమ్మట నాగొలుసు లాగఁబడినది. పరమసంతోషముతో నా వింతజూచి రాజకుమారు లిరువురు నంతఃపురమునకరిగి భార్యలకుం జెప్పి కనకరత్నమండనాది విశేషముల మందసముల నెక్కించుచుఁ బ్రయాణసన్నాహములో నుండిరి,

అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది మణిసిద్ధుండవ్వలికథ పైమజిలీయందిట్లు చెప్ప మొదలువెట్టెను.

___________

221 వ మజిలీ.

రాగవర్ధనునికథ

గోపా! వినుము తాళధ్వజుని మూఁడవకుమారుఁడు రాగవర్ధనుఁడు తండ్రియాజ్ఞబూని యన్నలజాడఁ దెలిసికొనఁబయలుదేరి గాలి వానచే దారితప్పి జయపురంబుఁ బ్రవేశించెనని నీవెఱిఁగియుంటివిగదా..