కాశీమజిలీకథలు/పదవ భాగము/217వ మజిలీ

వికీసోర్స్ నుండి

అని యెఱింగించువఱకు వేళయతిక్రమించుటయు నయ్యవారు తదనంతరోదంతంబు పై మజిలీయం దిట్లు సెప్పందొడంగెను.

__________

217 వ మజిలీ

వీరవర్మ కథ.

తాళధ్వజుండు కుమారుల కందఱకు వేరు వేరు విద్యామందిరములు వ్యాయామశాలలుగట్టించి తగిన యుపాధ్యాయుల నియమించి విద్యలు గఱపించుచుండెను. అందు వీరవర్మయు సుధన్వుండును పదియారేఁడుల ప్రాయము వచ్చునప్పటికి ధనుర్వేదమంతయు సాంగముగా నభ్యసించిరి. ఇతర విద్యలయందుఁ గూడ నిరుపమానమైన బ్రజ్ఞసంపాదించిరి.

ఒకనాఁడు వీరవర్మ తమ్మునితోఁ గూడఁదండియొద్దకుఁబోయి నమస్కరించి ఆర్యా! మేమిప్పుడు ధనుర్వేదమంతయు జదివితిమి. తత్ఫలం బరయ దిగ్విజయయాత్రసేయ నభిలాషగలుగుచున్నది. అందుల కనుజ్జయిండని కోరిన విని యతండు మీతల్లి నడుగుఁడని కనుసన్న జేసెను. వారు ప్రాంతమందేయున్న యామెకు నమస్కరించుచుఁదమ యభిప్రాయమెఱింగించుటయుఁ గటకటంబడి యాసాధ్వీమణియిట్లనియె

బిడ్డలారా! మీరు విద్యామందిరమునుండి యింటికివచ్చుటకు గడియ యెడమైన నెడదఁ దల్లడిల్ల యుగములైనట్లు తోచును. మీరు విదేశయాత్రకరిగిన బ్రదుకఁగలనా? దిగ్విజయమన మాటలతో నున్నదా! మహాశూరులతోఁ బోరుసంఘటిల్లును. వాడిశరంబులేసి మీ మృదుగాత్రంబులు నాత్రపఱతురు. శత్రువులకు జాలియుండునా ! జయాపజయంబులు దైవాయత్తములు మీరు ధనుర్వేదము జదివితిరేని కాని తత్పరిశ్రమయెట్టిదో యెఱుంగరు యువరాజ్యపట్టభద్రులై యింటికడసుఖింపక కయ్యమున కేలకాలుద్రువ్వవలయునుబాబులారా ! యుద్ధమునకుఁ బోవలదు. సుఖంబుండుఁడని గడ్డముపట్టుకొని బ్రతిమాలికొనినది.

అప్పుడు వీరవర్మ నవ్వుచుఁ దల్లీ! నీవు క్షత్రియపుత్రికవు. కావాయేమి? మునికన్యకవలెఁ బిరికిమాట లాడుచుంటివే! వీరమాత లిట్లనవచ్చునా? రాజపుత్రులకు సంగ్రామము సేయక పేరెట్లువచ్చును? ఆఱుమాసములు దేశములు దిరిగి క్రమ్మఱరాఁగలము, పోవుట కాటంకము సెప్పక యనుజ్ఞయిమ్మని ప్రార్ధించెను. ఆమాటల కేమియు సమాధానము జెప్పనేరక విజయమందుఁడు పొండు. అని దీవించివారి యాత్రకనుమతించినది.

ఆరాజకుమారులిరువురు దివ్యాలంకారభూషితులై ధనురాది సాధనంబులధరించి చతురంగ బలంబులు వెంటనంటిరాశుభముహూర్తంబున నిల్లువెడలి ప్రాఙ్ముఖముగాఁ బోయిపోయి యంగ వంగ కళింగాది దేశంబులం జొరఁబడి,

క. శరణాగతులగు నృపతులఁ
    గరుణింపుచు నెదురుకొనిన క్ష్మాపతులన్ సం
    గరమున నోడించి కడుం
    బరిభవ మొనరించి విడుచుఁ వన్నుల గొనుచున్ .

ఇట్లా రాజకుమారద్వయంబు గుమారద్వయంబు భాతి నిర్వక్రపరాక్రమంబున బహుదేశములాక్రమించి భూచక్రాధిపతులనెల్లఁ బాదాక్రాంతులఁ గావించుకొని తమకీర్తిసస్యంబుల నెల్లకడలం జల్లి యల్లుకొనఁజేసి తల్లిచెప్పినగడువుదాటకుండ నింటికింబోదలంచి క్రమ్మఱి వచ్చుచు నొకనాఁడొక మహారణ్యమధ్యంబునమధ్యందిన దినకరకిరణ జాలంబుల వేడిమికోడి యలసినబలంబుల పరితాపంబపనయింప విశ్రమింపఁజేసి మఱియుఁ బయనంబగుచుండు నంతలో,

సీ. త్రుంచివైచెనదే భ్రమించి కాల్బలము మం
             జుల ఫలప్రనవప్రసూనతతులఁ
    ద్రొక్కివైచినవవే తురగముల్ ఖురపుటీ
             కోటీహతులఁ బుష్పవాటికలను
    విరచివైచినవవే వేదండములు కరాం
             తములెత్తి ఛాయాప్రధానతరుల
    జెఱచివైచినవవేపఱచి తేఱులునేమి
             ధారాగతులను గేదారములను

గీ. మీరలెవ్వారలధిక కాంతారమధ్య
    గతతపోవనభంగంబుఁ గలుగఁజేయ
    వచ్చితి రెఱుంగరో మునీశ్వరులమహిమఁ
    గన్ను లెఱ్ఱైనబసుమంబు గాకయుండ్రె.

అని యుచ్చస్వరంబునఁ బలుకుచు నచ్చటికొక తాపసకుమారుండరుదెంచుటయు వానింగాంచి వీరవర్మ నమాస్కారముగావించి స్వామీ! మీరెవ్వనిశిష్యులు ఇది తపోవనంబని దెలియక నిందుసేనలతో విడిసితిమి క్షమింపుఁడు మేమరుగుచున్నారమనిన నామునిశిష్యుఁడు మీరిప్పుడు పోవలదు. మాగురువుగారనతిదూరములోనున్నారు. అమ్మహాత్మునికడకువచ్చి తప్పుజెప్పుకొని సెలవడిగిపొండు. లేకున్న మీకు ముప్పురాఁగలదని పలికినవినియనుమోదించి వీరవర్మవినీత వేషముతో నాశిష్యునివెంట నాయత్యాశ్రమమున కరిగెను. రుద్రాక్షమాలికా విరాజితవక్షుండు భసితావలేపితసకలాంగుఁడు జటామకుటవిరాజితుండునగు నాయోగింగాంచి వెరగందుచు వీరవర్మ తత్పాదములమ్రోల సాష్టాంగమెఱగి మహాత్మా! నేను తాళధ్వజుండును క్షత్రియునిపుత్రుడ నాపేరు వీరవర్మయండ్రు సుధన్వుఁడను తమ్మునితోఁగూడ దిగ్విజయముసేసి యింటికరుగుచున్నవాఁడను తెలియక నేఁడు మీవంబున వసించితిమి మాబలమువలన మీయాశ్రమమునకుఁ జెరుపుగలిగినదని మీశిష్యుండు సెప్పుచున్నాడు మాతప్పుమన్నించి మాయెడఁ బ్రసన్నులై పోవుట కనుజ్జయిండని ప్రార్ధించుటయు గన్నులెత్తి చూచి యాతపోధనసత్తముండు హస్తసంజ్ఞచేఁ గూర్చుండుమని నియమించి మఱికొంతసేపునకు జపముసాలించి యక్షమాలికచెవికిఁ దగిలించి యిట్లనియె.

ఓహో! నీవు తాళధ్వజుని కుమారుండవా! సంతోషము మీయుదంత మెఱుగఁక మాశిష్యుండు మిమ్మదలించెను. పోనిండు అది యొకశుభమే నేఁడిందు మాయతిధిపూజనంగీకరించి ఱేపుపోవుదురు గాక. అదియేమదీయతపోవనశైలముఅందలి విశేషములపూర్వములు తద్గుహాంతరమున నిలిచిచూచిన దిక్పతులనగరములుగనంబడును. మఱియుననేక వినోదములున్నవి. నేఁడువానిం జూడవచ్చును. నిలువుడఁని పలికిన మనమున నిష్టములేకున్నను నతని కేమికోపమువచ్చునోయని యమ్మాటల కంగీకరించి నేటికిఁబయనంబు సాగింపవలదు. ఆశ్రమ భంగంబుగాకుండ నందే యుండవలయు జాగ్రతయని తమ్మునికివార్త నంపి వీరవర్మతనకాశైల విశేషంబుఁ జూపింపుడని ప్రార్థించుటయునమ్ముని యందొక శిష్యునిజీరి యోరీ! యీతండు సామాన్యమానవుండు కాడుసుమీ! మహావీరుఁడు జాగ్రతగాఁ దీసికొనిపోయి గుహావిశేషంబుల జూపింపుము మర్యాదదాటకుండఁబ్రాణముల రక్షించుకొనిరమ్ము పొమ్ము. అనియెఱింగించి శిష్యుని వాని వెంటనంపెను. అయ్యతిశిష్యుండారాజకుమారుని వెంటనిడుకొని యందున్న సోపాన మార్గంబున నప్పర్వతమెక్కించి యశేషతరులతావిశేషంబులం జూపుచు నానావిధ ప్రసూనవాసనలు నాసాపర్వంబుగావింపఁ దత్తత్ప్రదేశములు త్రిప్పి త్రిప్పి క్రమంబున శిఖరారోహణంబు గావింపఁ జేసెను.

అందొక గుహాముఖంబు గోపురద్వారమువలె భూరికవాట గుప్తంబై విచిత్రముగాఁ గనంబడుటయు రాజకుమారుండా మునిశిష్యునితో నార్యా! ఇదియేమి? సౌధద్వాంరంబా గుహాముఖంబా? దీనిలో నెవ్వరైననుండిరా? అని యడిగిన నాశిష్యుండు రాజుపుత్రా! ఇదియేకాదా మాగురుఁ డెఱింగించిన కందరము దీనిలోపలికిఁబోయి చూచిన దిక్పాలురనగరంబులు గనంబడునని జెప్పెను.

వానింజూడ వేగిరపడుచు నానృపకమారుండు పదపదతలుపులు తీయుము దారిజూపుమని తొందరపెట్టిన వాఁడు. రాజపుత్రా! ఈ తలుపులు బలశాలులుగాని తీయలేరు నావలనఁగానేరదు నీవు రమ్ము. త్రోయుమని యుపాయముచెప్పిన నతండొక్కత్రోపుతో నాకవాటముల తెరచివైచెను. తదంతరంబు మిక్కిలి విశాలముగానున్నది. కుడ్యభాగములు విచిత్రచిత్రప్రతిమలచే నిండింపంబడి యున్నవి తద్విశేషములరయుచు రాజకుమారుఁడు మెల్లగాలోనికి నడచుచుండెను. వెనుక శిష్యుఁడు పోవుచుండెను.

కొంతదూరమరిగి యతండార్యా ! దిక్పతుల నగరంబులు గనంబడలేదేమి? బొమ్మలేదిక్పతులా వేగ వానిం జూపింపుమని యడిగిన వాఁడిట్లనియె,

రాజపుత్రా! దాపునకువచ్చితిమి అదిగో యాబల్లమీఁద నిలఁబడిచూచిన నావిశేములుగనంబడును దానినెక్కి చూడుమని పలికిన నిజమనికొని యారాజపుత్రుఁడు తటాలున నాబల్లపై కెక్కెను. అప్పుడు గుబేలుమని మీటసడలి యాబల్లయొక గర్తములోనికొఱిగినది. అతండా గర్తములోఁబడి క్రిందికి జాఱదొడఁగెను. ఆసొరంగము గుండ్రముగా నునుపుగానుండి పట్టుకొనుట కేమియు నాధారములేక యంధకారబంధురంబై యొప్పుచున్నది. అతం డందుఁబడి యూరక క్రిందికి జాఱుచుండెను నిమ్నాభిముఖముగా జాఱుచుండుట నతనిమేనికిఁ జాలనొప్పిగాఁ దోచుచుండెను. అప్పు డతండాత్మగతంబున నౌరా! ఆకపటాత్ముఁడు నన్నెంత మోసముజేసెను? నన్నిట్లీయగాధ గర్తములోఁ బడద్రోయ వానికేమి ఫలమువచ్చెను. ఒకవేళఁ బోవం బోవ దిక్పతులనగరములు గనంబడునా? సీ నాకిదేటియూహ. ఈజాఱుటవలన నాకాయాసమధికమగుచున్నది. ఇఁకగడియలోఁ బ్రాణములు బోఁగలవు. అక్కటా మాతల్లిమాట వినకపోవుటచే నీముప్పువాటిల్లినది. మాయునికిఁ దెలియకెంత చింతించునో? మాతమ్ముఁడుగూడ నన్ను వెదకుచువచ్చి వీనిమాయకు జిక్కునేమో! అని యనేకవిధంబులఁదలంచుచుండ గొంతసేపటికి వానికి స్మృతి దప్పినది.

గోపా! వినుమతండొకదివసంబెల్ల జాఱిజాఱి తుద నొక విశాల శిలాఫలకంబునందలి యిసుకపఱుపు పయింబడియెను ఆదేహమట్లుపడినతోడనే యంచుఁగావున్న రక్కసుండొక్కడొక బడియతో వానితల మీఁద వేయఁబోయిన ఆ వలదు వలదు నిలునిలుమని యాప్రక్కనే కూర్చున్న లంబోదరియను రాత్రించరి వారించినది. ఆమాటవిని యా దానవుఁడు దేవీ! అట్లంటివేమి? ఈకళేబరములో నింకను బ్రాణములున్నవి. పూర్తిగాజంపి రాజుగారివంటశాలకు దీసికొనిపోవలదా? అని యడిగిన నాదానవి కుంభా! ఇటురా. చెవిలోమాట. నీవునరాంతకు నెఱుంగుదువా! వాఁడు నాకుఁ జుట్టమగును. వాని యిల్లాలు చూలాలై యున్నది. సద్యోహతనరశవమాంసము దిన వేడుకపడుచున్నదఁట అందులకై వాఁడు నన్నాశ్రయించుచున్నాడు. ఎల్లుండి యామెకు సీమంతోత్సవము గావింతురఁట. అప్పటికెట్లైన నట్టిమాంసము సంపాదించి పంపుమని బ్రతిమాలికొనియెను. ఇప్పుడువీనింజంపినచో నెల్లుండికాకళేబరముక్రుళ్లి పోవును. వీఁడుసగముచచ్చియున్నాడు. ఎల్లుండికిఁబూర్తిగాఁ బ్రాణములు పోవును. పోకున్నను వాండ్రేకడ తేర్తురు. నీవీ కళేబరము నీతట్టలో నిమిడించుకొని మూతబెట్టి వారింటికిఁ దీసికొని పోయి యప్పగించిరమ్ము. నాకు మాటదక్కగలదు వారిల్లా తోటలో నున్నదని యుపదేశించిన నించుక సంశయించుచు వాఁడిట్లనియె.

దేవీ! వంటవాండ్రు దీనికొఱకు వేచియుండి తీసికొనిపోకున్న రాజుగారి కెఱింగింపరా! నేఁడు పడినకళేబరమేమైనదని యడిగిన నేమిచెప్పవలయును? ఏలిక వలన మాటరాదా? అనియడిగిన నారక్కసి సరిసరి. ఇదియా నీశంక మనమిరువురము గలిసిన నీరహస్యమెవ్వరికిఁ దెలియును? నేఁడేకళేబరము శిలాయంత్రమునఁ బడలేదని చెప్పుదము. వరుసతప్పక నిత్యము పడుచున్నదా యేమి? అనుటయు వాఁడుదాని కనుచరుఁడగుట సప్పనికంగీకరించి తత్కళేబరముజిదియఁ గొట్టక మెల్లగానొకతట్టలోనికెక్కించి మూతవైచి నెత్తిపై బెట్టికొని యాతోట దెసగాఁ బోవుచుండెను.

__________

పద్మసేనకథ.

అప్పు డప్పురవరప్రభువగు వజ్రకంఠుఁడను రాక్షసరాజు కూఁతురు పద్మసేనయను చిన్నది ద్విజటయను చెలికతైయతోడ నశ్వశకటమెక్కి పూఁదోటకుఁబోయి మరలి వచ్చుచు దైవవశమున నాకుంభున కెదురు పడినది.

కుంభుం డాబండి రాజపుత్రికదని యెఱింగి వెఱచుచు మఱిగిపోవలయునని పెడతెరువున మఱలెను. అవ్విధమరసి రాజపుత్రిక యనుమానముతో వానిం దాపునకు రప్పించి నీ వెవ్వఁడవు ! ఆ గంపలో నేమియున్నది? నీమొగంబు జూడ నేదియో యెత్తికొనిపోవుచున్నట్లు కనంబడుచుంటివి. నిజము సెప్పుమని యడిగినవాఁడు గడ గడ వడంకుచు నిట్లయె.

తల్లీ ! నేను దేవరదాసుఁడ. శిలాయంత్రమును గాపాడుచున్న లంబోదరిచేఁతిక్రింది భృత్యుఁడ నాపేరు కుంభుండందురు నే నాలంబోదరిపంపునం బోవుచుంటినని గద్గదస్వరముతోఁ బలికిన నక్కలికి గంపలోనిదేమో చూపి పొమ్మనుటయు వాఁ డాగంపను మెల్లగా నేలకుదింపి పైమూత దీసి నంత.

సీ. ఆజాను దీర్ఘబాహాదండయుగళంబు
             సురుచిరకంబు సుందరగళంబు
    తొగలఱేని బెడంగు దెగడునెమ్మొగమురు
             ద్యుతిఁ గల్వరేకులదొరయు కనులు
    పిడికెడునడుము నొత్తెడు పళిత్రితయంబు
             రమ్య ప్రణాంకితోరస్థలంబు
    మేలిమిబంగారు డాలునేలఁగఁజాలు
             నొడలుతీరై యొప్పుతొడలు గలిగి

గీ. యవయవంబుల గుదియించి యణఁచి గంప
    లోన నిమిడించి కట్టినగాని కాంతి
    దొరగకందొంటి ప్రాణంబుతోవసించి
    యున్న రాసుతుఁగాంచి రక్కన్నె లపుడు.

తటాలున బండిదిగనుఱికి రాజపుత్రిక వాని కళేబరము పరిశీలించి చూచి తలయూచుచుఁ జెలీ! వీఁ డెవ్వఁడో యీలోకమువాఁడు కాడు అయ్యో! పాపము వీనిమేన నొక్క ప్రాణముమాత్రమే యున్నట్లు తోచుచున్నది. కటకటా ! వీనినిట్లు తట్టలోఁ నొక్కిపెట్టితివేమిరా! వీఁ డెవ్వఁడు? ఎందుఁ దీసికొనిపోవు చుంటివి. నిజము చెప్పుము లేకున్న నిన్ను దండింపఁజేయుదునని యదలించి యడిగిన వాఁడిట్లనియె.

తల్లీ ! వీఁ డెవ్వడో నేనెఱుంగ నేఁడు యంత్రశిలాఫలకంబునం బడియెను లంబోదరిపంపున నరాంతకునింటికిఁదీసికొనిపోవుచున్నానని యావృత్తాంతమంతయు నెఱింగించెను. ఆమాటవిని రాజపుత్రిక సఖీ ! యంత్రశిలాఫలకమన నేమి? అది యెక్కడనున్నది. దానిలో వీఁడెట్లు పడెను. దానివృత్తాంత మెఱుంగుదువా యనియడిగిన సఖురాలిట్లనియె.

ముదితా ! అదియొక బోనువంటి యంత్రము. భూలోకములోఁ జిత్రకూటమను నగముగలదఁట అలంబసుండను రాక్షసుండు ముని వేషధారియై యాగిరినాశ్రయించుకొనియుండును. ఆకొండశిఖరమున సుందరంబగు కందరమొకటిగలదు.ఆగుహలోనుండి మనలోకమువఱకు సొరంగము త్రవ్వించిరి. అలంబసుం డెఱుఁగనిమనుష్యుల నాగరిశిఖర మెక్కించిగుహావిశేషంబులం జూపునెపంబున శిష్యునిచేనాగర్తంబునం బఁడవేయించును. అందుఁబడినవారు సగము ప్రాణముతో నీలోకము జేరుదురు. ఆ దేహముశకలములుగాకుండమీతండ్రియందొక శిలాఫలక మమరించి దానిపై నిసుకపరుపు వైపించి యందుఁబడిన వెంటనే బడియతోఁజంపించి యామాంసము తెప్పించుకొని తినుచుండును. ఆయంత్రము మయునిచే నమరింపంబడినది. అందునల్లపూసవైచినను జారివచ్చి యీయిసుగపఱుపుపయింబడును. అని యీకథ నాకొకప్పుడు మాతల్లి చెప్పినది పాపమీపురుషుఁ డాలయంబసుని మోసమెఱుంగక యాసొరంగములోఁ బడి వీనిచేఁజిక్కెను. వీనియాకారముజూడ గొప్పవంశమువాఁడుంబలెఁగనంబడుచున్నాడు. వీనిదేహమును నరాంతకునిభార్యకు గబళమగునట్లు విధి విధించెనుగాఁబోలు ! నెట్లుతప్పునని పలికిన విని రాజపుత్రిక యిట్లనియె.

అట్లుకాదు దైవసంకల్పము వేరొకరీతినుండఁబట్టియే మనకంటఁ బడియెను. వినుము వీనిమన యింటికిఁ దీసికొనిపోయి బ్రతికింతము. వీని వృత్తాంతమువిని కర్తవ్యమాలోచింతము వీనిసౌందర్యము నాడెందము లాగుచున్నది వీడు బ్రతికిన నాపురాకృతము ఫలించినదనుకొనుము. అని యేమేమో పలికి దాని నొప్పించినది.

పిమ్మటఁ బరిచారిక కుంభునితో నోరీ ! రాజుగారు దినవలసిన నరమాంసము నీవుదెలియకుండ నితరులకీయఁ దీసికొనిపోవుచుంటి నిది యెట్టియపరాధమను కొంటివి? పో. పొమ్ము. రాజపుత్రిక మంచిది గనుక నీయాపదదాటినది దీనిమేము దీసికొనిపోయెద మనిచెప్పి వానిం బొమ్మని మెల్లగా నతనిశరీరము నొవ్వకుండ నెత్తి తమబండిలోఁ బండుకొనఁబెట్టి తమపుట్టము చెఱంగుగప్పి యప్పుడే తమయంతఃపురమునకుఁ దీసికొనిపోయి అందొకమెత్తని పానుపునం బవ్వళింపఁజేసి,

ఆ. గీ. చమురురాచికాచి సందులఁగదలించి
         కట్లుకట్టి పెక్కు పట్లువైచి
         వేడినీళ్ళఁగడిగి వెసగాత్రములనెల్ల
         సాగఁదీసిలాగిచక్కఁబడఁగ.

గీ. బాలునకుఁబోలె నోటిలోఁ బాలుబోసి
    త్రాగఁజేయుచుఁబెక్కు వైద్యములుసేయఁ
    గలిగే వానికిస్మృతి యొక్క నెలకు వారి
    గన్ను లెత్తి పరీక్షించి కలయఁజూచె.

ఆహా! నేనాగర్తములోఁబడి యీదివ్యభవనములోని కెట్లువచ్చితిని? నాకుపచారముచేయుచున్న యీజవరాండ్రెవ్వరు? తెలిసినది. ఇది స్వర్గలోకములోని సౌధముకావచ్చును. ఆగుహాంతరమునుండి దిక్పాలుర నగరములు గనంబడునని యయ్యతీశ్వరుఁడు సెప్పలేదా? అది కైతవమని యమ్మునిపతి నిందించితిని. నాపాపముశమించుఁగాక. వీరు దేవకన్యకలు అనితలంచుచుండ రాజపుత్రికవచ్చి వానిప్రక్కలోఁ గూర్చుండి మేను నివురుచు మొగము దుడుచుచు బంగరుగిన్నెతోఁ బాలుదెచ్చి సుందరుఁడా! నాపుణ్యమునఁ బ్రతికితివి. పాలుగ్రోలుము నోరుతెఱచుము. అనిలాలించి బలుకుటయు నతండు కడుపునిండఁ బాలు ద్రావి బలముగలిగి తనప్రక్కలోఁ గూర్చున్న యామెమొగము సాభి ప్రాయముగాఁ జూచుచు నిట్లనియె. కాంతామణీ! ఇది యేలోకము! నీవెవ్వని పుత్రికవు? నేనిక్కడి కెట్లువచ్చితిని? నాకునపూర్వోప చారములు సేయుచున్న నీకులశీలనామంబులువివరించి శ్రోత్రానందముగావింపుము. అనియడుగుటయుఁ జిఱునగవుతో నమ్మగువ యిట్లనియె.

ఆర్యా! మీరేదేశమువారో యెవ్వనికుమారులో యిక్కడి కెట్లువచ్చితిరో మీవృత్తాంతము ముందు మాకెఱింగించిన పిమ్మటఁ దరువాత మాకధ యెఱిగింతుమని పలికిన విని యారాజనందనుండు తాను తాళధ్వజునికుమారుండననియుఁ దమ్మునితో దిగ్విజయయాత్ర వెడలుటయు మునీశ్వరుని శాసనప్రకారము చిత్రకూటమెక్కి గర్తములోఁ బడిపోవుటయు లోనగువృత్తాంతమంతయుంజెప్పి అంతవట్టు నాకు జ్ఞాపకమున్నది పిమ్మట నేమిజరిగినదియో తెలియదు. అతండు సత్యర్షియేయైనచో నిది దిక్పతులనగరములలో నొకటికావలయు నీవు దేవకన్యకవు కావలయు నిఁకనున్న తెఱంగెఱింగింప నీ వేప్రమాణమని పలికి యూరకున్నంత నాజవ్వనిలేనవ్వు మొగంబునకునగయై యొప్ప నిట్లనియె.

రాజపుత్రా! మీమాట కన్యధాత్వమేలవచ్చును. ఇది నాకలోకమే. నేను రంభను. అదినాచెలికత్తెయ మేము దేవవేశ్యలమగుట నిన్నంటినదోషముండదు నీవుగావించిన సుకృతముచేఁ ప్రీతులమైతిమి. నీసేవసేయుటయే మాకు విధికృత్యము విస్రబ్ధముగా శయనింపుఁడు కావలసినపదార్ధములడిగి తీసికొనుఁడు. ఇదిస్వగృహములాగుదలంచి యుపచారములఁ జేయించుకొనుఁడు అనిపలికినవిని యక్కలికికతండిట్లనియె.

రాజపుత్రుఁడు - బోటీ! నీమాటలువినఁ బరిహాసజల్పితములు వలెఁదోచుచున్నవి. నీవు నిజముగా రంభ వే?

పద్మసేన — సందేహమేమిటికి ! నేనురంభనే నన్ను మీరు నిర్భయముగా ననుభవించవచ్చును. రాజపుత్రుఁడు - దేవతలనిమిషులని వ్రాయఁబడియున్నదిగదా? నీవురంభవైతే నీకంటిఱెప్పలట్లు వాలుచున్న వేమి?

పద్మసేన - సరిసరి ఇదియా! మిశంక పురాణవచనములన్నియు సత్యములనుకొనుచుంటిరా ! పూర్వకాలములో నట్లుండునవి చిరకాలమగుట బరువెక్కి యిప్పుడు ఱెప్పలువాలుచున్నవి.

రాజపుత్రుఁడు - మంచిసమాధానమే. కానిమ్ము. నాదేహము వెనుకటిదేనా మారినదియా?

పద్మసేన — అదిమీకేతెలియగలదు చూచికొనుఁడు?

రాజపుత్రుఁడు – (చూచికొని) పూర్వదేహమె! నేనీ దేహముతోనే స్వర్గము జేరితినా?

పద్మసేన - అవును, అమ్మహర్షిప్రసాదమువలన.

రాజపుత్రుఁడు - నేను దిరుగామాదేశమునకుఁబోవుదునా?

పద్మసేన - అది యసంభవము నాకమునకరిగినవారు తిరుగా స్వదేశమునకరుగుటయెట్లు?

రాజపుత్రుఁడు - నేనిక్కడ నేమిచేయుచుండవలయును?

పద్మసేన — మీరుపురాణములు చదివియుందురు. స్వర్గలోక వాసు లేమిచేయుచుందురో తెలియదా మీరునదియే?

రాజపుత్రు -- మదీయభుజపరాక్రమము తేటపడఁ బ్రత్యర్థులతోఁ బోరాడవలయు నిందుమహావీరు లెవ్వరైన నున్న రా!

పద్మ - కావలసినంతమంది మహావీరులున్నారు. ఇందున్నవారందరుశూరులే. మీభుజకండూతివ దల్పఁగలరు. అని పద్మసేనవీరవర్మతో నర్మాలాపము లాడుచున్న సమయంబునఁ బరిచారిక తలుపు దగ్గిరకువచ్చి రాజువుత్రీ! నీతో మాట్లాడుటకై అమ్మగారు వచ్చు చున్నారఁట తలుపువేసి యీవలకు రా అని సంజ్ఞచేయుటయు నదరిపడి యమ్మదపతి యిదిగో యిప్పుడే వచ్చెద నిందుండుఁడు. అని పలికి తలుపుఁ జేరవైచి ముందరిచావడిలోనికివచ్చి కూర్చుండెను. ఇంతలోఁ దల్లివచ్చి.

తల్లి - అమ్మా! పద్మసేనా! కుశలముగాఁ నుంటివా?

కూఁతురు - కుశలము కాకయేమి?

తల్లి — నీకొకశుభవార్త యెఱింగింపవచ్చితిని వినుము.

కూఁతు - అవహితనైతి నెఱింగింపుము,

తల్లి — నీతండ్రి నీకుఁ గొన్నిసంబంధములుతెచ్చిరి కానివాని నేనొల్లక స్వయంవరము చాటింపింపుఁడని చెప్పితిని ఆపధ్ధతినీకిష్టమేనా.

కూఁతు - ఎక్కడ చాటింపుమంటివి!

తల్లి - మనజాతివారు రక్కసులు వసించియున్న సుతలాది సప్త పాతాళలోకములలోను.

కూఁతు — రక్కసులం బెండ్లియాడనని నేనిదివఱకు నీతోఁ జెప్పలేదా

తల్లి - రక్కసులకుఁగాక నిన్ను మీతండ్రి శత్రువులైన దేవతలకును గబళములైన మానవులకు నిత్తురనుకొంటివా యేమి? వచ్చిన వారిలో నచ్చినవానిం బరిగ్రహింపుము.

కూఁతు - నాకు రాక్షసజాతీయే నచ్చలేదు.

తల్లి — పుత్రీ! నీకు మాతృసాంప్రదాయము వచ్చినది. యేమిచేయుదుము నన్ను మీతండ్రి నందనవనములో విహరింపుచుండగా బలాత్కరముగా నెత్తికొనివచ్చి పెండ్లియాడిరి. నేనచ్చరజాతి దాననైనను దానవునితోఁ గాపురము సేయుచుండలేదా ? దానవులలో మాత్రము మంచివారు లేరను కొనుచుంటివా యేమి. ప్రహ్లాదుఁడు బలి మొదలగువారు దానవులు కారా.

కూఁతు - ఆగొడవయంతయు నాకవసరము లేదు. నన్ను మనుష్యుఁ డెత్తికొనిపోయి పెండ్లియాడిన నేమి చేయుదురు ? తల్లి - నిన్నెత్తికొని పోఁ దగినట్టి మనుష్యుఁడు వచ్చినప్పుడు, చూతములే? నేను పోయివత్తు మీ తండ్రి నా నిమిత్తము వేచియుందురు. అని పలికి యారాక్షసరాజపత్ని నిర్గమించినది.

వీరవర్మ వారిసంవాదమంతయుఁ దలుపుదాపున నిలువఁబడి యాకర్ణించెను. అతండు సూక్ష్మబుద్ధియగుట నది పాతాళలోక మనియు నామె రాక్షసపుత్రికయనియు నామె వివాహము నిమిత్తము స్వయంవరము చాటింతురనియు లోనగువిశేషములు కొన్ని గ్రహించి తనరాకను గుఱించి యాలోచించుచు మఱికొన్ని దినములు గడిపెను.

మఱియొకనాఁడచ్చేడియ తనకు వీడియమిచ్చుచుండు నప్పు డా రాజకుమారుఁడా తరుణీమణి మణిబంధము పట్టుకొని ముద్దువెట్టుకొనుచు బాలా ! నీవృత్తాంత రహస్యముజెప్పక నన్ను మోసము చేయుచున్నావు నిజముగా నీవు రంభవైనచో విమానమెక్కి విహరింతము రమ్ము. నన్నీశుద్ధాంశములో దాచుచుంటివేమిటీకి ? నిజము చెప్పు దనక నీచేయి విడువనని పలికిన నవ్వనిత నవ్వుచు నింద్రునికిఁ దెలియకుండ నిన్నిందు దాచుచుంటిని. నీయునికినతం డెఱింగిన బంధింపఁగలఁడు నేను రంభనే నాసౌందర్యము నీకు నచ్చలేదా? నీవు నలకూబరునికన్నఁ జక్కనివాఁడవని నిన్ను వరించితిని. తెలిసినదియా అనుటయు నతండు నీవు రంభవు కావు గాని యూరుహసిత రంభవగుదువు. నే నంత తెలియనివాఁడను కాను నీ పేరు చెప్పువఱకు నిన్నుఁ గదలనీయనని చేయి వదలి కౌఁగిటిలోఁ బిగియఁపట్టెను. అప్పుడాచిన్నది నాధా ! నాపేరు పద్మసేన అనఁబోయి కాదు రంభ నిజము చెప్పినఁ బంధింపవచ్చునా ? విడువుఁడు విడువుఁడు అని పెనఁగులాడుచు నెఱుఁగనదివోలెఁ గొన్ని చిట్టకములు వెలయించుచు నిజముజెప్పెద వదలుఁడని మఱియుఁ బ్రతిమాలినది. కౌఁగిలివదలి యతండు మఱియుఁ గరగ్రహణముజేసి నిజము చెప్పుమని నిర్బంధించెను. సఖీ! సఖీ! ఇటురా ! ఈధూర్తుఁడేమిచేయుచున్నాఁడో చూడుమని కేకవేయుటయు నాపరిచారిక తలుపుత్రోసికొని లోనికి వచ్చి ఔరా! అప్పుడే పాణిగ్రహణమహోత్సవము జరుగుచున్న దా ! రాజ కుమారా! ఏమి యీతొందర ఏమి యీసాహసము చనువిచ్చితిమనియా! అని యడిగిన నతం డోహో నీసఖురాలు రంభకాదా రంభాసంభోగసౌఖ్యంబు బహుజన్మసుకృతపరిపాకంబునం గాని లభించునా! నాసంరంభంబు దూష్యంబుగాదు. బోటీ! మీపాటిమాటలు నాకు రావనుకొంటివా! మీరెవ్వరో నిజముచెప్పువఱకు నీవయస్యను గదలనీయనని యదలించుటయు నాపరిచారిక నవ్వుచు నిట్లనియె,

ఆర్యా! మాభర్తృదారిక మీకింతవఱకు నిజముచెప్పక మీ కపరాధినియైనది. నే జెప్పెద వినుండు. ఇది అతలలోకము దీని వజ్రకంకుఁడను దానవనేత పాలించుచున్నాఁడు. ఈమే యమ్మహారాజు కూఁతురు. ఈమె పేరు పద్మసేన. ఈమె తల్లి యప్సరోవంశసంజాత యగుట నాసఖురాలు రాక్షసజాతి వ్యతికరమగు సౌందర్యము గలిగి యున్నది. భూలోకములోఁ జిత్రకూటము దాపున జపముజేయు వాఁడు అలంబసుఁడను రక్కసుఁడు. వాఁడు మనుష్యుల మాయఁజేసి యాకొండ యెక్కించి గుహాంతరములోని సొరంగములోఁ బడద్రోయించును. నీవు వాని వలలోఁబడి సొరంగమార్గంబున నీలోకమునకు వచ్చితివి. వధ్యశిలపైఁబడిన తోడనే మడియవలసినదే నరాంతకు నిమిత్తముగా వెంటనే చంపఁబడక భర్తృదారిక కన్నులబడితివి. ఆమె యిక్కడికిఁ దీసికొనివచ్చి యుపచారములుసేసి బ్రతికించుచున్నదని యావృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆవార్తవిని వీరవర్మ విస్మయక్రోధ సాధ్వనపరితాపములొక్క మొగి చిత్తంబుత్తలపెట్ట నొక్కింతసేపు ధ్యానించి తనకుఁ బ్రాణదానముగావించిన రాజపుత్రికయెడఁ గృతజ్ఞతఁజూపుచు నేదియోవిచా రముతో నాలోచింపుచుండఁ బద్మసేన ఆర్యా! మీచరిత్రమువిని మీరు భయపడుచున్నట్లు తోచుచున్నది. మిమ్మునాహృదయంబునం బెట్టుకొని కాపాడెదను నేను మీదాసురాలనై యుండఁ గొదవయేమి? యదేచ్ఛముగా సుఖింపుఁడని పలికిన నవ్వుచు వీరవర్మ యిట్లనియె.

ప్రేయసీ! నీయాదరణణోక్తులవలన నాకెంతేని సంతోషము విశ్వాసముకలిగినది. ప్రాణదాయినివైన నీచెప్పినట్లు నడుచుటకంటె నాకు వేరొకమంచిమార్గములేదు. నేనిందలిరాక్షసులకువెరచి చింతింప లేదు. నన్నుఁబోలే నాతమ్మునిఁగూడ వాఁడు సొరంగములోఁ బడఁజేయును నేను మీమూలమున బ్రతికితినికాని వానింజంపక విడుతురా? అనిపరితపించుచుంటి ననవుఁడాజవరాలు “ఆయువుమర్మములఁగాపాడు"నని యున్నదిగదా. దైవవశంబున నతండు సొరంగమునఁ బడుట తటస్థించినప్పుడాయనమాత్రము వేరొకరీతి బ్రతుకరాదా? లోకములన్నియు దైవాయత్తములుకావా! అవృత్తాంతముదెలిసికొనియెద మీరు విచారింపవలదని ధైర్యముగఱపినది. అతండామెచేయు సుపచారములచే నానందించుచుఁ గొన్ని నెలలు సుఖముగా వెళ్లించెను.

అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది. అయ్యవారు తదనంతరోదంతమం బవ్వలి మజలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

__________

218 వ మజిలీ

సుధన్వునికధ

లంబోదరి - ఏమిరాకుంభా! యింతయాలస్యమైనదేమి? ఆ కళేబరము నరాంతకుని కప్పగించితివా? ఏమనిరి! ముహూర్తము మారినదఁటకాదా!

కుంభుఁడు - అమ్మయ్యో! నేఁడెంతగండము ఎంతగండము,