కాశీమజిలీకథలు/పదవ భాగము/218వ మజిలీ

వికీసోర్స్ నుండి

రముతో నాలోచింపుచుండఁ బద్మసేన ఆర్యా! మీచరిత్రమువిని మీరు భయపడుచున్నట్లు తోచుచున్నది. మిమ్మునాహృదయంబునం బెట్టుకొని కాపాడెదను నేను మీదాసురాలనై యుండఁ గొదవయేమి? యదేచ్ఛముగా సుఖింపుఁడని పలికిన నవ్వుచు వీరవర్మ యిట్లనియె.

ప్రేయసీ! నీయాదరణణోక్తులవలన నాకెంతేని సంతోషము విశ్వాసముకలిగినది. ప్రాణదాయినివైన నీచెప్పినట్లు నడుచుటకంటె నాకు వేరొకమంచిమార్గములేదు. నేనిందలిరాక్షసులకువెరచి చింతింప లేదు. నన్నుఁబోలే నాతమ్మునిఁగూడ వాఁడు సొరంగములోఁ బడఁజేయును నేను మీమూలమున బ్రతికితినికాని వానింజంపక విడుతురా? అనిపరితపించుచుంటి ననవుఁడాజవరాలు “ఆయువుమర్మములఁగాపాడు"నని యున్నదిగదా. దైవవశంబున నతండు సొరంగమునఁ బడుట తటస్థించినప్పుడాయనమాత్రము వేరొకరీతి బ్రతుకరాదా? లోకములన్నియు దైవాయత్తములుకావా! అవృత్తాంతముదెలిసికొనియెద మీరు విచారింపవలదని ధైర్యముగఱపినది. అతండామెచేయు సుపచారములచే నానందించుచుఁ గొన్ని నెలలు సుఖముగా వెళ్లించెను.

అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది. అయ్యవారు తదనంతరోదంతమం బవ్వలి మజలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

__________

218 వ మజిలీ

సుధన్వునికధ

లంబోదరి - ఏమిరాకుంభా! యింతయాలస్యమైనదేమి? ఆ కళేబరము నరాంతకుని కప్పగించితివా? ఏమనిరి! ముహూర్తము మారినదఁటకాదా!

కుంభుఁడు - అమ్మయ్యో! నేఁడెంతగండము ఎంతగండము, గుండెలిప్పటికిఁ గొట్టుకొనుచున్నవి చూడుము?

లంబో - ఏమియుపద్రవమువచ్చినదో వేగిరముచెప్పరా రాజుగారు చూచిరాయేమి?

కుంభు -- నాగ్రహచారము నేనాదారినే పోవలయునా?

లంబో - ఏదారిఁబోయితి వేమిజరిగినదియో చెప్పరా విధవ కాన నాగుండెలు కొట్టుకొనుచున్నవి.

కుంభు - నాకిదిపునర్జన్మమే. యీలాటిపని యెన్నఁడును జేయఁగూడదు బాబు!

లంబో - ఏమిజరిగినదియో చెప్పరా.

కుంభుడు — నీకేమి? అమ్మాయిగారు మంచివారుగనుక బ్రతికి వచ్చితిని లేకున్న నీపాటికి వల్లకాటికే.

లంబో — అమ్మాయిగారు దారిలోఁగనంబడినదా యేమి?

కుంభు - అవును బండిమీఁద నెక్కడనుండియో వచ్చుచు నాకెదురుపడినది.

లంబో — (భయముతో) అదేమని అడిగినదాయేమి.

కుంభు -- అడిగి యూరకున్నదియా? మూఁతతీసి చూపువఱకు వదలినదికాదు.

లంబో — కొంపముంచి నేను పంపుచున్నానని చెప్పితివాయేమి?

కుం — మఱియేమని చెప్పవలయునో నీవే చెప్పుము.

లంబో - యథార్థము చెప్పితివి కాఁబోలు కొంపముంచితివిరా. కుంభా పైన నేమి జరిగినది.

కుం – అమ్మాయిగారు మంచివారు. కావున మందలించి విడిచిపెట్టినారు.

లంబో - ఏ మన్నారో అచ్చముగా నామాటలం జెప్పుము.

కుం -- రాజుగారు భుజింపఁదగిన మాంసము దొంగతనముగా నరాంతకు నింటికిఁ దీసికొనిపోవుట సామాన్యపు నేరమనుకొంటివా? లంబోదరి చెప్పినంతనే దొంగపని చేయుదువా ! జాగ్రత. ఈసారి యిట్టిపని చేసితివేని నీప్రాణములమీదికి వచ్చునని యేమేమో మందలించినది.

లంబో - ఇం కేమి? లంబోదరి పంపున దీసికొని పోవుచుంటినని చెప్పితివి కాబోలు.

కుం - దేవీ లేదు. ఏ మన్నానో జ్ఞాపకములేదు.

లంబో - పోనిమ్ము రాజుగారితో, జెప్పెద ననలేదు గదా.

కుం – మొదటి తప్పుగా గణించి విడిచిపెట్టినది.

లంబో - మఱి ఆకళేబరమేమైనది ?

కుం — బండిమీఁదఁ బెట్టుకొని తీసికొనిపోయినది.

లంబో - నేటికి ధన్యులమే. కాని మనప్రయత్న మన్నివిధముల నిరర్ధకమైనది. నరాంతకు నింట సీమంతోత్సవమింక పదిదినములున్నది. ముహూర్తము మార్చిరఁట నీవక్కడికి దీసికొనిపోయినను నుపయోగము లేకపోయెడిదే. అని యామాటలే చెప్పికొనుచు నాఁడు వెళ్ళించిరి.

మఱి ఱెండుదినములు గడిచినంత నొకనాఁడు లంబోదరి కుంభా ! గర్తాంతరమున గంటమ్రోగుచున్నది. సొరంగమునుండి యేదో కళేబరము పడుచున్నది. కాఁబోలు. కాచికొనియుండుము. మృగమైన వెంటనే జంపుము మనుష్యుడైన జంపకుము. ఎట్లైన నరాంతకునికోర్కె తీర్పక తప్పదని పలికిన వాఁడు దేవీ ! నీవే పనిచెప్పినం చేయుదును గాని ఆకళేబరముమాత్రము నరాంతకు నింటికిఁ దీసికొని పోఁజాలను. నన్ను రక్షించుమని పలికిన లంబోదరి పోనిమ్ము నీవు దీసికొని పోవలదు చీఁకటిపడిన తరువాత నేనే తీసికొనిపోయెదను. మనుష్యుడైనచో చంపవలదని యుపదేశించినది. అందులకు వాఁ డొడంబడి బడియఁదీసికొని వధ్యశిలాఫలకము దాపున నిలువంబడియుండెను. అంతలో జరజరజాఱి దివ్యమంగళవిగ్రహుండగు నొక పురుషుండు గుభాలున వచ్చి యాపజుపుపైఁ బడియెను.

మనుష్యుఁడని యెఱింగి కుంభుండు బడియతో నేయక దేవీ ! లంబోదరీ! నీకోరికయే ఫలించినది. మసష్య దేహమె వచ్చిపడినది యేమి చేయుమనియెదవో చెప్పుమని యడిగిన లంబోదరి యాదరి కరిగి చూచి వీఁడు నాకెంత బరువు, వీనిఁ దట్టలోఁ బెట్టి నొక్క నక్కరలేదు చీఁకటిపడిన తరువాత బుజముమీఁద వైచికొని తీసికొనిపోయెదను. అంత దనుక నామూల దాచియుంచుము. ఈదేహము పదిదినములు నిలవయుండవలయును. కావున గాయము దగులనీయ వద్దని యుప దేశించిన వాఁ డట్లు కావించెను.

చీఁకటి పడిన తరువాత లంబోదరి యాకళేబరమును చంటిపిల్లనువలె బుజముమీఁద వైచుకొని నరాంతకు నింటికిఁ దీసికొనిపోయి వాని కప్పగించి వీనిం భద్రముగా స్వల్పాహారమిచ్చి కాపాడు కొనుఁడు వీఁడు బ్రతికియేయున్నవాఁడు సీమఁతోత్సవమునాఁడు చంపి మాంసము తీసి పెట్టినఁ జాల రుచిగానుండును. ఇందులకై విశ్వప్రయత్నమైనది రాజుగారికిఁ దెలిసిన ముప్పురాఁగలదు సుమీ యని చెప్పి లంబోదరి శిలాస్థానమున కరిగినది.

నరాంతకుడాకళేబరమును భద్రముగాఁ బెరటిలోనికిఁ దీసికొనిపోయిబోనువంటియొక యింటిలోఁబెట్టి యజ్ఞపశువునకుఁబోలె నాహారము వైచి కాపాడుచుండెను. వారుచేయు నుపచారమువలన మొదటిదినమందే స్మృతివచ్చి వానికాహారము కావలసివచ్చినది. ఆయాహార దార్ధములంతగా రుచింపకపోయినను దారుణంబగు నాకలితో నుండుటంబట్టి దేహధారణమునకై తినకతీరినదికాదు. అతనికిస్మృతివచ్చిన తరువాతఁ దానక్కడి కెట్లువచ్చేనో తెలిసికొనలేక పరితపించుచు బందీగృహమువంటి యింటిలోనుండి తనవృత్తాంతమునుగుఱించియే వితర్కించుచుండెను.

వానికి నిత్యము నాహారమిడుటకు నరాంతకుని మేనకోడలు రత్నావతియను చిన్న దానిని నియమించిరి. రత్నావతి మిక్కిలి చక్కనిది. అచ్చరకన్యక, నరాంతకుని బావమఱఁది వజ్రకంఠునితోఁ గూడ నొకప్పుడు నాకముపై దండెత్తినప్పుడుపోయి యందొకయచ్చరను జెఱబట్టి తెచ్చెను. రత్నావతి ఆయచ్చరకుఁ జనించినదగుటఁ బద్మసేనవలెనే రాక్షసస్త్రీలంబోలక దేవతాకన్యలం బోలియున్నది.

రత్నావతి రెండవనాఁ డాహారము దీసికొనిపోయి యాపురుషుని యాకారముజూచి మోహపరవశయై పరిశీలించి అయ్యో! దివ్యమంగళవిగ్రహముగలయట్టి పురుషునికిఁక వారముదినములలోమరణము విధింపఁబడియున్నది. వీనింజంపక నాకువివాహముజేసిన సంతసింతును గదా!దీర్ఘ జిహ్వునికొడుకు హ్రస్వపాదునకు నన్నిచ్చి పెండ్లిచేయుదురఁట వానితోనేనెట్లుకాపురముచేయుదును? వీనింజూచిన జాలిగలుగు చున్నది కానిమ్ము. నాకుఁ దోచినసహాయముజేసి రక్షించెదఁగాక అని యాలోచించుచు నాహారముదీసికొని యొకపాత్రలోఁబెట్టి వాని ముందరకుఁ ద్రోసియందునిలువంబడినది, అపురుషుడాచిన్న దానిమొగంబుజూచి వెఱఁగుపడుచునదియేదేశమోనేనిక్కడికెట్లువచ్చితినో ఈమె నడిగి తెలిసికొనియెదంగాక అని యాలోచించి కల్యాణీ! ఇదియేదేశము నీ వెవ్వనిపుత్రికవు నీ మొగంబుజూడఁ గరుణారస మొలుకుచున్నది. నన్నిట్లు మీరేమిటికిఁ బోషించుచున్నారని యడిగిన నాచేడియ వానికిట్లనియె.

ఆర్యా! నీవీదేశము పేరు తెలియకిక్కడకెట్లువచ్చితివి? నీమాటలు విపరీతముఁగానున్నవి. నన్నుఁ బల్కరించునెపంబున నిట్లంటివనిత లంచితిని నీకథనీవేముందుఁ జెప్పవలయునని యడిగిన నాతండిట్లనియె. కల్యాణీ! నేనుభూలోకచక్రవర్తియగు తాళధ్వజుని రెండవకుమారుండ నాపేరు సుధన్వుండందురు. నేనుమాయన్నతోఁగూడ దిగ్విజయయాత్రకు బయలుదేరి పెక్కండ్రరాజులజయించియింటికిఁబోవుచు నొకనాఁడొక కొండప్రక్క విడిసితిమి. అందొకమహర్షితపంబొనరించుచుండుటందెలిసి మాయన్నగారాయన దర్శనార్ధమైయరిగి తత్ప్రేరణంబున నాశైలమెక్కియేమయ్యెనో తిరుగానాకడకు రాలేదు. ఆదివసమెల్ల వానినిమిత్తమెదురుచూచుచుంటిమి మఱునాటికినిరాలేదు. అమ్మఱునాఁడు సాయంకాలమ నేనాఋషియొద్దకుబోయి మాయన్నయేమయ్యెననియడిగితిని. కొండశిఖరముమీఁద నున్నాఁడని అందలివింతలతని రానిచ్చినవికావు కాబోలు నేఁడుకూడనిలిచెను. ఈసాయంకాలమునకు రాఁగలడు ఇచ్ఛఁగలదేని నీవుగూడఁబోయి చూడవచ్చును. మా శిష్యుఁడు దారిఁజూపగలడని యుపదేశించిన వానిమాటనిజమనుకొని కొండయెక్కి గుహలో జొరఁబడి యందున్న బల్లపైఁగాలుమోపితినో లేదో తటాలున నొకగోతిలోఁబడి శరవేగముగా జారఁదొడంగితిని. కొంతసేపటికి నాకు స్మృతిదప్పినది. పిమ్మట నేమిజరిగినదియోనాకుఁ దెలియదు. తరువాతకథ నీవే చెప్పవలయునని యడిగిన నాపడతి యిట్లనియె.

ఓహో! నీవు రాజకుమారుఁడవా! మంచియాపదలోనే చిక్కుకొంటివి. వినుము. ఈలోకము ఆతలము వజ్రకంఠుఁడను దానవుడు దీనింబాలించుచున్నవాఁడు. ఇందున్నవారందరు దయాసత్య శౌచములులేని రాక్షషులు నీవువధ్యశిలపైబడినతోడనే కూరలతట్టలోఁ బడవలసినదే. ఆయుశ్శేష ముండఁబట్టియింకను బ్రతికియుంటివి. నరాంతకునిభార్య సీమంతోత్సవమునాఁడు నిన్ను విశసింతురు. అందులకై నీకీయాహారమిడుచున్నవారని యారహస్యములన్ని యు నెఱింగించినది.

ఆకథవినినతోడనే వానికాహారము నోటికిఁబోయినదికాదు. కన్నులవెంబడి బొటబొట నీరుగారఁదొడంగినది. బంధువులందరు జ్ఞాపకమువచ్చిరి. కట్టఁబడియుండుటచేఁ దనపరాక్రమ ముపయోగముకాదని తెలిసికొనియెను. హృదయంబున నధైర్యము ప్రవేశించినది. కన్నులు మూసికొని ధ్యానించుచుండ నాజవరాలు సౌమ్యా! ఆహారము గుడువుము నేనుబోయి వత్తుననుటయు నతఁడాహా? నాలుగుదినములలోఁ జచ్చువాని కాహారమేమిటికి? నాకక్కరలేదు. తీసికొనిపొమ్ము అని యుత్తరము జెప్పెను?

అప్పుడాచిన్నది వానిదైన్యముజూచిదుఃఖించుచు సుందరుడా! నేనబలనుగదా! నీవు దుఃఖించుచుండ నాడెందము పగిలిపోవుచున్నది. ఏమిచేయుదును? కానిమ్ము. ఇంకను బదిదినము లవధియున్నదిగదా. నాఁటికేదేని యుపాయము తోపించకపోవునా విచారింపకుము. నా యోపినసహాయము జేసి నిన్ను దాటించెద నాహారము గుడువుమని ధైర్యముజెప్పినది. ఆమాటలువిని యారాజకుమారుఁ డాచేడియం బొగడుచుఁ గడుపుచిచ్చు చల్లారుట కామె తెచ్చిన పదార్థముల భుజించెను. మరల ఱేపువత్తుననిజెప్పి యప్పడతి తలుపులువైచి లోనికిఁ బోయినది.

మఱునాఁడు యథాకాలమునకే రత్నావతి యాహారముదీసికొనివచ్చి తలుపు తెఱచి యతనియెదుటఁ బెట్టినది. అప్పుడుసుధన్వుండు దైన్యముదోపఁ దన్వీ నాకీయాహార మేలతీసికొనివచ్చితివి? తినకున్న వారు చంపకముందే చత్తునుగదా! నాకు బలవన్మరణ మేలరావలయు నీవు నావిషయమై జాలిపడుచుంటి వదియపది వేలు జన్మజన్మములకు నీకుఁ గృతజ్ఞుండ నకారణ వాత్సల్యురాలవగు నీసుగుణములు లోకాంతరమందుఁగూడఁ గొనియాడుచుండెద నేఁడాహారము గుడవను. ప్రాయోపవిష్టుండనై ప్రాణములువదలెదను మీవారితో తినుచున్నవాఁడే యని చెప్పుము. ఇదియె నీవు నాకుఁజేయు కడపటి యుపకారమని రెండుచేతులుజోడించి మ్రొక్కినంతనక్కాంతారత్నము కన్నులనుండి ప్రవాహముగా వచ్చుచున్న యశ్రుబిందువులఁ బైటచెఱంగున నద్దుకొనుచు పురుషరత్నమా! నీమాటలు నేను వినలేకున్న దానను. నిన్నుఁ జూచినదిమొదలు నాహృదయు మేమియోకాని యుత్కంఠితమైయున్నది. నీవు మృతినొందిన నేనుగూడ నీతోమృతినొందెదనని తెలిసికొమ్ము. నీదైన్యోక్తుల నేవినఁజాలకున్నదాన మఱియు నొక్క విశేషంబెఱింగించెద నీవేమిచదివితివి? దేవనాగరలిపి నీకుఁదెలియునా అని యడిగిన నతండిట్లనియె.

కన్యామణీ! దేవనాగరలిపి యననేల సమస్తలిపులు నాకుఁదెలియును. అడవిఁగాసిన వెన్నెలవలె నాచదువిక్కడ నేమియుపమోగించెడిని? ఎంతేనిజదివితివి అట్లడిగితివేల! అనిపలికిన నక్కలికి యలరుచు మనోహరా! వీరింట నొకపుస్తకమున్నది. అందనేక సిద్ధులు వ్రాయఁబడియున్నవఁట దేవలోకమునుండి యాపుస్తకము నెత్తికొని వచ్చిరి. కాని యాలిపి వీరికిఁదెలియక తొట్రుపడుచున్నారు. శుక్రాచార్యుల యొద్దకుఁ దీసికొనిపోయి యడుగవలయునని తలంచుచున్నారు నేనాపుస్తకముఁదెచ్చి నీకిచ్చెదను దానింజదివిన నేదేని సాధనముతోపక మానదు. అందనేకసిద్ధులు సమస్తభువనముల విశేషములు వ్రాయబడి యున్నవఁట. తెమ్మందువా! అనుటయు నతండు కానిమ్ము నాకింక ఱేపటివఱకు నాయుర్దాయమున్నది కాఁబోలు. అందలి విశేషంబులఁ దెలిసి తరువాతనేమృతినొంద వచ్చును. అనిపలుకుచు నాచెలువదెచ్చిన యాహారము భుజించెను.

ఆరత్నావతియు నతని విడువలేక విడువలేక పెద్దతడవం దుండి ఱేపా పుస్తకము దెత్తునని చెప్పి తలుపులు వైచి లోపలకుఁ బోయినది. ఆరాత్రియెల్ల నతండు నిద్రఁబోవక తన దురదృష్టమును గుఱించి విచారించుచు నెట్ట కేలకుఁ దెల్లవార్చెను. రత్నావతియు నతిప్రయ త్నమున నాపుస్తకమును సంగ్రహించి యతిగూఢముగా నాహారపదార్థములతోఁగూడఁ దీసికొని వచ్చి యతని కర్పించినది. మిక్కిలి తొందరగా నావుస్తకమును బుచ్చుకొని చూడఁగాఁ జతుర్దశభువనసిద్ధి సంగ్రహము అని పుస్తకము పేరు వ్రాయఁబడియున్నది. ఆపేరు చదివినతోడనే యతనికిఁ గొంత ధైర్యము బొడమినది. పుస్తకమును విప్పి ముందుగానందలి విషయసూచిక చదివి వితర్కించెను. వానిలో నతలాదిపాతాళలోకసిద్ధులు అను పత్రములు తీసి చదువగా నొక పత్రమున నీక్రింది విధముగా వ్రాయఁబడియున్నది.

శ్లో. ప్రధమె వివరె విప్ర అతలాఖ్యమనోహరె
    మయపుత్రో బలోనామ వర్తతె ఖర్వగర్వకృత్
    షణ్ణవత్యోయేన సృష్టా మాయా స్సర్వార్ధసాధకాః
    మాయావినో యాశ్చ సద్యోధారయంతిచకాశ్చన
    జృంభమాణస్య యస్యైవ బలస్యబలశాలినః
    స్త్రీగణా ఉపపద్యంతె త్రయోలోక విమోహనా!
    పుంశ్చల్యశ్చైవ స్వైరణ్యః కామిన్యశ్చైవవిశ్రుతాః
    యావై బిలాయనంప్రేష్టుం ప్రవిష్టంపురుషంరహః
    రసేన హాటకాఖ్యేన సాధయిత్వా ప్రయత్నతః
    స్వవిలాసావలోకానురాగస్మితవిగూహవైః
    సల్లాపవిభ్రమాద్యైశ్చ రమయంత్యపితాస్త్రియః
    యస్మి న్నుపయుక్తోజనోమనుతె బహుధాస్వయం
    ఈశ్వరోహ మహంసిద్ధో నాగాయుతబలోమహాన్
    అత్మానం మన్యమాన స్సమదాంధ ఇవదృశ్యతె.

అని చదివి ప్రహర్షసాగరంబున మునుంగుచు రత్నావతీ ! నీవు జేసిన యుపకారమున కెన్ని జన్మములెత్తిన బ్రతిక్రియఁ జేయఁజాలను జుమీ నీదయవలన నీవుస్తకమున మంచి సిద్ధిప్రక్రియ దొరకినది. దాన నున్నతస్థితిఁ బొందవచ్చునని పలికిన విన్మయమందుచు నయ్యిందువదన యిట్లనియె.

మనోహరా ! నీకు బ్రతుకు తెరువుగనంబడిన నేను బ్రహ్మాండమబ్బినంత సంతోషము జెందుదుఁగదా. ఏదీ తద్విధానమెట్టిదో చదివి వినిపింపుడు సంతోషించెదంగాక యని యడిగిన నతం డిట్లు చెప్పెను. ఇది అతలలోకము సప్తపాతాళములలో మొదటిది. ఇందు మయుని కుమారుడు బలుఁడనువాడు కొంతకాలము వసించెను. అతండు తొంబదియారుమాయల రహస్యముల నెఱింగినప్రోడ. ఒకనాఁ డతం డావలింపఁగా బుంశ్చలులు స్వైరిణులు కామినులు అను మూడు విధములఁ స్త్రీలు జనించిరఁట. వాండ్రు కొండలమధ్యనున్న మహాబిలములో నివసించియుండ్రు. హాటకరససిద్ధిచే నా స్త్రీలువశ్యలై సల్లాపవిభ్రమవిలాసాదులచే రంజింపఁజేయుదురఁట మఱియు వారిం గూడిన వానికిఁ బదివేలయేనుఁగులబలము నిత్తురఁట వాడు సర్వలోకములకు నేనేయధిపతినని గర్వపడుచుండునఁట. మఱియునాహాటక రససిద్ధిప్రకరణ మంతయు నిందు వ్రాయఁబడియున్నది. స్త్రీవశ్యము తరువాతఁ జూచుకొనవచ్చును గాని యిప్పటి యాపద దాటఁగలదు. తలుపు తెఱచి నన్నీ యిల్లు మాత్రము దాటింపుము. ఆరససిద్ధిప్రక్రియయే సత్యమైనచో వెండియు వచ్చి యీలోకమునకుఁ గూడ ప్రభువగుదునని చెప్పినవిని యాచిన్నది యించుక విన్నవోయిన మొగముతో నార్యపుత్రా ! మీసిద్ధిప్రక్రియ నాకు హృదయశూలమైనది. పోనిండు మీరెందై న సుఖించినఁ జాలుగదా యని పలికెను.

అప్పుడతండు రమణీ ! దాపునకురా! నీయభిప్రాయము తెలిసినది. ఇదిగోనీపాదములుగొట్టు చున్నాఁడఁగొలదికాలములోవచ్చి యీరాజ్యముగైకొని నిన్నుఁ బట్టమహిషిగాఁ జేసికొనియెదఁగానిచో గృతఘ్నుఁడు బొందు నరకములఁబొందఁగలవాఁడ. వారు పుంశ్చలులనియు స్వైరిణు లనియుఁ గామినులనియు వ్రాయఁబడియున్నది. పేరులంబట్టి వారెట్టివారో తెలియఁబడలేదా వారిని మఱిఁగి నిన్ను మఱచిపోవుదునని నీయభిప్రాయము అట్లుసేయఁజాల నిదిగో నాయుంగరమునీకుఁ గురుతుగానిచ్చుచున్నాఁడ నీవేనాప్రాణేశ్వరివి. ఇదిగో గాంధర్వవిధినిన్నుఁబరిగ్రహించితినని పలుకుచు నామెచేయిపట్టుకొని ముద్దువెట్టుకొనియెను.

రత్నావతియు నతనిమాటలకు సంతోషించుచు మనోహరా! నీవుపవాసములచే డస్సియున్నావు. ఎక్కడికిఁబోదువో యేమిజరుగునో తెలియఁజాలదు. ఇంక నాలుగు దినములవఱకు నిందుండినఁ బ్రమాదము లేదు. ఎల్లుండిపోవుదువుగాక నీవియోగము నాకు దుర్భరవేదనగలిగించునట్లు తోచుచున్నది. ఇదెక్కడితగులమో తెలియకున్నది. ఈమూఁడు దినములు నాయిచ్చినయాహారము గుడుచుచు బలముగలుగఁజేసికొనుమని బ్రతిమాలిన నతఁడిట్లనియె.

ప్రాణేశ్వరీ !నిన్ను విడిచిపోవుట నాకునుగష్టముగా నేయున్నది. నేను వెళ్లిననాఁడే నాయవసరమువచ్చి పారిపోయితినని తెలిసినచో నలుమూలలువెదకి పట్టుకొందురేమో!ఇంచుక వ్యవధియుండిన నేను దూరముగాఁ బోఁగలను మఱియు నీపుస్తకము నేను దీసికొని పోవచ్చునా? దీనివలన నీకు మాటవచ్చినచో నిచ్చియే పోయెదను. ఇందలి విషయములు కంఠస్థములు సేసికొనుచున్నాను. అని నొడివిన నప్పడంతి యిట్లనియె.

మా నరాంతకుఁడు వజ్రకంఠునికి దగ్గిరచుట్టము. వానిభార్య చిరకాలమునకు గర్భవతియైనది. ఱేపుచేయఁబోవు సీమంతోత్సవము మహావైభవముతోఁ గావించును. పదిదినములవఱకు త్రాగి మత్తిల్లి యొడలు తెలియకుండ సంచరింతురు. తరువాత రాజపుత్రిక పద్మసేనకు స్వయంవర మహోత్సవము జరుగును. అతొందరలో నీవుస్తకముమాట యెవ్వరికిఁ గావలయును! నీవు తీసికొనిపోవచ్చును. అనిచెప్పి చేతులు ముద్దుపెట్టుకొనుచు నతనియుంగరము భద్రపరచికొని మెల్లన తలుపు బీగము సంగ్రహించి యెట్లొ యాయిల్లుదాటించినది. సుధన్వుఁడాయిల్లు దాటి పుస్తకములో వ్రాసినప్రకార ముత్తరదిక్కు గురుతుజూచుకొని యాదెసగాఁ బోవుచు ఆహా! ఈదేశస్థితి చాలవింతగా నున్నది సూర్యుఁడు గనంబడఁడు వెలుఁగుమాత్ర మున్నది. అదియుఁ గొంతసేపుండి చీఁకటి పడుచుండును. దివారాత్రవిభేదము దానివలననే తెలిసికొనవలసియున్నది. నేను జీఁకటిపడకమున్నే యేదోగుప్తస్థానము జేరికొనవలసియున్నది. ఈలోపలరక్కసులు నానిమిత్తముతరుముకొనివత్తురేమో! పాపమాచిన్నది నాకొఱకెంత యుపకృతిగావించినది! మఱియు నెప్పుడుపోయి దానింగలిసికొందునో! అదిగో దూరములో నేవియో కొండలబారు గనంబడుచున్నది నాకదియేగమ్యస్థానమని యూహింపఁ బడుచున్నది. కానిమ్ము. దానినికటముజేరివిచారింపవచ్చుననితలంచుచు వేగముగా నడిచి యాకొండలదండ కరుగునప్పటికి చీఁకటిపడుచుండెను.

శ్లో. త్రికూటగిరి మధ్యస్థం బిలం రత్న ప్రభోజ్వలం
    సాధకస్తు పరిక్రమ్య పశ్యే త్పాషాణరోధి తత్.

దైవప్రేరితుండై యతండు తిన్నగా నాత్రికూటగిరిపాదసమీపమునకే పోయెను. అదిత్రికూట పర్వతమని తెలిసికొనునంతతో నలుదెసలఁ జీఁకటి వ్యాపించినది. అయ్యంధకారము భయంకరమై రాతివంటి యతని హృదయమును జెదరజేసినది. కన్నులం దెరచిచూడనేరక మూసికొని యిట్లు ధ్యానించెను.

క. ఎక్కడి కన్యాకుబ్జం
    బెక్కడి దిగ్విజయయాత్ర యీపాతాళం
    బెక్కడ నీగిరికూటము
    లెక్కడ నారాక యిటు విధీ ఘటియింతే.

గీ. కలిసికొందునె బంధువర్గంబుతోడ
    మఱియుఁ బురికేగి నాదుసోదరులనెల్ల

    జూతునే తల్లిదండ్రులచేత గౌఁగ
    లింపఁబడుదునే మ్రొక్కిదీవింప వారు.

అయ్యో! ఈయంథకారమువోయి తిరుగా వెలుగువచ్చునా ? యీఱేయి నేమృగమో భక్షించిన నన్నియిడుములు నటమటమై పోవును. అని మఱియు నేనెంతమూర్ఖుండనైతి, కర్తృత్వము మీఁదనిడకొని విచారించుచున్నాఁడ. రత్నావతి కైతవంబుగ మృత్యుముఖంబునుండినన్ను దాటించినవాఁడిప్పుడీ చీఁకటిని బోఁగొట్టిసుఖింపఁజేయలేఁడా? సుఖము దుఃఖమునకు దుఃఖముసుఖమునకు నొక్కప్పుడు హేతువగుచుండును. పుస్తకములో వ్రాయఁబడినప్రక్రియ సత్యమేయైనచో నాకునిరతిశయు సౌఖ్యంబుగలుగఁగలదు, అనియనేకవిధంబులదలంచుచుండ నతనిహృదయసాధ్వసంబుతోఁగూడ నాయంధకారమువిచ్చి నలుదెసల నేదో ప్రకాశము వ్యాపించినది.

అతఁడప్పుడు నలుదెసలు పరికించుచుఁబుస్తకములోనున్న విధానమంతయుంజదివికొని త్రికూటగిరిమధ్యమప్రదేశమున నొకబిలముండునని వ్రాయఁబడియుండుట, ద్రికూటమును గురుతుజూచుకొని యాగిరి మధ్యదేశమునులక్ష్యముగానుంచుకొని యెక్కుట ప్రారంభించెను. మిక్కిలిశ్రమపడిజాముప్రొద్దెక్కునప్పటి కామధ్యభాగముజేరెను. అందుబిల మెందున్నదో యని రెండుగడియలు పరిక్రమించి పరిశీలింపుచుండనొకచోటఁబాషాణముచేతఁ గప్పబడియున్న ప్రదేశమునుజూచి మఱికొన్ని చిహ్నములంబట్టి యదియే బిలమని తెలిసికొనియెను.

అందొక వేదికపైఁ గూర్చుండి పుస్తకము చదివి తదుక్తప్రకారంబు రాతిసంఘట్టనంబున నగ్నిఁబుట్టించి సమిధలచేఁ బ్రజ్వరిల్లంజేసి కల్పోక్తరీతి మంత్రంబులు పఠించుచు వేయిసార్లు సమిద్ధోమంబు సేసి పూర్ణాహుతి గావించినతోడనే పఠేల్లుమనియడ్డముగానున్న రాయిపగిలి శకలములై మార్గమిచ్చినది. అంతలో నాసింహద్వారంబు నానామణి ఘృణీలసత్కవాటఘటితంబై యొప్పుచు నేత్రపర్వముగావించినది. తదభ్యంతరప్రదేశము,

సీ. లలితపల్లవపుష్ప ఫలవల్లరీభార
             నతమహీరుహ లతాన్వితవనంబు
    వనవిరాజిత సరోవరజలాంతర చర
             త్పతగసన్నాద మోదితజనంబు
    జనవిహారోపయోగ నవీన సికతా వి
             లసితవాపీ తటాకసురుచరము
    చిరపుణ్యలాభ సంసేవనీయ విచిత్ర
            మణి లసత్ప్రాసాద మంటపంబు

గీ. మంటపాశ్రిత దేవతా మానినీ ప్ర
    గీతసంగీత నాదసంప్రీత గగన
    చరదమర యుగ్మ మధిక తేజఃప్రకాశ
    దీపితంబగు తన్మధ్య దేశమరసె.

కనకమణిమయ శిఖరంబులఁ బ్రకాశింపుచున్న యన్నగమధ్యదేశం బతివిశాలంబై సమచతురంబై శృంగారకేళీవన తటాకాభిరామంబై భర్మమణిహర్మ్య శ్రేణీవిరాజమానంబై కన్నులకు మిఱుమిట్లు గొలుపుచున్నది. తత్ప్రదేశం బరయుచు లోనికి నాలుగడుగులు పెట్టినతోడనే యాద్వారంబు ఎప్పటియట్లు పాషాణాచ్ఛాదితంబైనంత నివ్వింతనరయుచున్న నతండు దూరమందుఁగనంబడు చున్న విచిత్ర సౌధంబుల చెంతకరుగఁ దెరువరయుచుండ నింద్రజాలపింఛికచేఁ దుడువఁబడిన వాఁడుఁ బోలె విభ్రాంతిఁజెంది కర్తవ్య మెఱుఁగక చూచుచున్నంతలో ననంతమణికాంతి సంతానంబులు దిగంతంబుల వ్యాపింప గాంచనరత్న ప్రదీప్తంబగు పల్లకీనూని మానిఁనీ సహస్రంబులు దివ్యాలంకారశోభిత గాత్రలై వేత్రంబులంగరంబులఁ బూని కొందరు వెనుక ముందునడువఁ గడుజవంబునఁ దన కడకువచ్చుచున్నట్లు పొడఁగనియుడు గనివెరపుతోఁ దెరవుదెసఁ బాఱఁజూచి తలయూచుచు నా చతురుండౌరా ! జవరాండ్రు పెక్కండ్రు, నా కెదురువచ్చుచున్నట్లున్నది. నా తపంబు ఫలించినదియాయేమి ? ఆహా! ఆపుణ్యాత్మురాలి రత్నావతి నెన్నిజన్మములకైన మఱువఁదగినదియా ! అని యాలోచించుచుండ నా స్త్రీమండలంబు దనదండ కరుదెంచి,

సీ. రమ్ముపుణ్యాత్మ ! మీరలె మాకునేతలం
           చడుగులఁగడిగె పద్మాక్షి యొకతె
    జయ పరాకు త్రికూట శైల దేశాధినా
           యక యంచు నిడె నర్ఘ్యమొకవధూటి
    స్వైరిణీరమణ ! వింజామరల్ వడయ నీ
           వే యర్హుడ గుదంచు వీచెనొకతె
    దివ్యమాల్యాంబరాది విభూషణము లివే
           పడయుమేలికయంచుఁ దొడిగెనొకతె

గీ. దేవ! నీకొఱ కందు మాదేవులెల్ల
    నెదురు చూచుచు నున్నారలిందుగూరు
    చుండుఁ డనివేగ నాందోళికోపవిష్టుఁ
    జేసిరొక కొందరందు రాజీవముఖులు.

వారు చేయు నుపచారముల పరిమితాశ్చర్యము జెందుచు నారాజ నందను డొండనక యాందోళికంబున గూర్చుండి యయ్యండజయానలు జయజయధ్వానములతోఁ జుట్టునుం బరివేష్టించి రా మహావైభవముతో రత్న ప్రాసాదాంతరంబునకుఁ జేరి నారీరత్నంబులు కైదండలొసఁగ నల్లనపల్లకి దిగి నంతలో,

క. నావల్లభ నావల్లభ
   నావల్లభయనుచు నంగనలు మువ్వురు మే

    ఘావృతి బాసిన మెఱుఁగుం
    దీవెలగతివచ్చి దేహదీప్తు లెసంగన్ .

అతనిఁ గౌఁగలించుకొనుటయు విభ్రాంతుండగుచు నే మనుటకుం దోచక తదీయరామణీయకంబా పోవక నుపలక్షించుచు నొక్కింతవడికిఁ దెప్పిరిల్లి జవ్వనలారా ! మీరెవ్వరు ! ఏమిటి కిట్లు క్రొత్తవాఁడననక నాపయింబడితిరి ! అని యడిగిన నా చేడియలు,

క. మానిని నే నిది పుంశ్చలి
    యీనవలా స్వైరిణీప్రహీత నామ త్వదా
    ధీనులమైతిమి ముగురము
    ప్రాణేశుఁడవగుచు మమ్ముఁ బాలింపుమిటన్ .

మేము సమస్తమాయావేదియగు మయతనూజుండు బలుండనువాని పుత్రికలము హాటకరససిద్ధి వడసిన వానికి పత్నులమై తదిష్టక్రీడావినోదంబుల మెలుగునట్లు అమ్మయపుత్రుండు మాకు వరం బిచ్చియున్న వాఁడు కావున నీవట్టిసిద్ధివడసి యిక్కడి కరుదెంచితివి. నీవే మా ప్రాణేశుండవు. ఈమహారాజ్యముతోఁగూడ మన్మధరాజ్య పట్టభద్రుండవై మమ్మేలి కొనుమని ప్రార్థించిన నించుక సంశయించుచు నతం డిట్లనియె.

మోహనాంగులారా! మీరు దివ్య ప్రభావసంపన్నులు నేను మానవసాసూన్యుండ బాలుండ నిట్టి నాకు మీరు పత్నులగుట విపరీత ప్రక్రియకాదా! అదియునుం గాక మీపేరులు వినిన నాకు మఱియు వెఱపు గలుగుచున్నది. మీపేరులంబట్టి మీకు వివాహముతో బనిలేదని తోచుచున్నది. అట్టి తఱి భార్యాభర్తృత్వములతోఁ బనియేమియున్నది ! వేశ్యావృత్తి ననుకరించియున్న మీ పత్నీత్వము నాకభీష్టముకాదని పలికిన విని యామగువ లిట్లనిరి.

మనోహరా! మాపేరులట్టివేకాని వృత్తియట్టిదికాదు. మానవ సామన్యుండననియు బాలుండననియు వెఱవవలదు నీఁకు బదివేల యేనుఁగుల బలముగలుగునట్లు చేయుదుము. మమ్ముఁ గలిసినపిమ్మట బరమేశ్వరుఁడైన నాకుఁ జాలఁడని నీకొకగరువము గలుగఁగలదు. ఇందు నవనిధులు గలిగియున్నవి భాగ్యంబున నీకుఁగుబేరుఁడు సరిపడఁడు నీకిందుఁగొదవయేమున్నది. మేము నీకేది యభీష్టమో అట్లు మెలంగువారము మన్మధసాంమ్రాజ్యపట్టభద్రుండవై క్రీడింపుమని ప్రార్థించుచు నతనిమెడలోఁ బూవుదండలువైచిరి. పరిజనులందఱు కరతాళంబులు వాయించిరి.

తాళధ్వజుని రెండవకమారుఁడగుసుధన్వుండాకాంతాత్రితయముంబెండ్లియాడి యపూర్వక్రీడా వినోదములతోఁ గాలక్షేపముచేయుచుండెను.

అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది పై థ తరువాయి మజిలీయందిట్లు చెప్పందొడంగెను.

___________

219 వ మజిలీ

రత్నావతికథ.

రత్నావతి! సుధన్వుడరిగిన రెండుదినములదనుక వారి కేమియుం జెప్పక మూఁడవనాఁ డాహారము దీసికొనిపోయియంతలో గ్రమ్మఱవచ్చి అయ్యో! అయ్యో! ఆబద్ధపురుషుఁడేమయ్యునో తెలియదు. అందులేడు తలుపులబీగములు పగులగొట్టఁబడియున్నవి. వచ్చిచూచుకొనుఁడని లోపలికివచ్చి కేకలువైచినది. ఆమాటలువిని తటాలునవచ్చి నరాంతకు డాగదులన్నియువెదకి వానింగానక పరితపించుచునక్కటా! వీడుగజదొంగవలెనున్నాడు. సామాన్యునకీ కవాటములబీగములు విడఁగొట్టశక్యమా? దొంగలతల్లికి నేడున భయ మనినట్లీయవమాన మెవ్వరికిఁ జెప్పరాదు. అసమర్ధుండ నాభార్యకోరికఁ దీరుపలేక పోయితినిగదా! రేపుసీమంతోత్సవ మాపిమఱియొక ముహూర్తముంచిన లంబోదరి