కాశీమజిలీకథలు/పదవ భాగము/216వ మజిలీ
మునకు వగచుచు నారదుంజూచి మామా! నేను తొందరపడి నిన్ను శపించితిని. నాశాపము మరలించెదనన్ను స్వర్గమునకుబోవునట్లనుగ్రహింతువా? అనియడిగిన నతండంగీకరించెను. ఒండొరులశాపములఁ గ్రమ్మఱించుకొనిరి. పర్వతుఁడు నాకంబునకుఁబోయెను, నారదుండు వెనుకటి ముఖముతో నొప్పుచుండె నాదమయంతి మిక్కిలిసంతసించుచుండెను.
దమయంతినిమిత్తముగా నారదుండా సృంజయునకు సువర్ణష్ఠీవియను పుత్రుందయచేసి వానిమృత్యువువలన రక్షించి వంశహాని కాకుండ ననుగ్రహించెననియెఱింగించునప్పటికిఁ గాలాతీతమగుటయు
క. లే లెమ్ము మిగిలెఁ బయనపు
వేళకథాగతరసప్రవృత్తాస్థన్ గో
పాలా! యని యమ్మునిశా
ర్దూలుఁడు చని చేర శిష్యుతోఁ బయినెలవున్.
- _________
216 వ మజిలీ
నారదుని స్త్రీ జన్మము.
సౌభాగ్యసుందరి కథ
క. శ్రీనారదవరవీణా
గానస్వానానురక్త కరుణావిలస
న్మానస తాపసహృదయా
స్థానసుఖాసీన భక్తజనసంతానా.
దేవా! అవధరింపు మమ్మణిసిద్ధుఁడా నివాసదేశంబున నిత్య కృత్యంబులఁ దీర్చికొనిపిదప రమ్మస్థలాసీనుఁడై శిష్యునుద్దేశించి
క. హరిమాయామోహితుఁడై
తరుణీమణియగుచు దేవతాముని భూమీ
శ్వరుఁ బెండ్లియాడి తమిఁబె
క్కురఁ బుత్రులఁగనినకథ తగుంజిత్రంబై .
పుత్రా! తచ్చరిత్రం బెఱింగించెద నవహితుండవై యాలింపు మొక్కనాఁడు నారదమహర్షి ప్రహర్షపులకితగాత్రుండై
క. హరినారాయణ దామో
దర కేశవ వాసుదేవ దానవవైరీ
మురహరసురవరపూజిత
చరణ రమారమణ భక్తజనహృచ్ఛరణా.
అని విపంచిపై శ్రీహరిం గీర్తింపుచు నమ్మహాత్ముని సేవింప శ్వేతద్వీపముకరిగి తదభ్యంతరమంది రంబున.
గీ. ప్రక్కనిలఁబడి సురటిచేబట్టి దుగ్ధ
వారినిధిపట్టి వీవ శృంగారలీల
లమరఁ నర్మోక్తులాడు చత్యంతవిభవ
మునవసించిన హరిఁగనుంగొనియెఁదపసి.
క. అనిమిషముని దవుదవ్వుల
కనుఁగొని కమలావథూటి గ్రక్కున లజ్ఞా
వనతముఖియగుచు లోనికిఁ
జనియెన్ జలదమున నడఁగు చంచలవోలెన్.
తన్నుఁజూచి జలధికన్య దిగ్గున సిగ్గున లోపలికిఁ బోయినదని తెలిసికొని తన కప్పని తలవంపుగాఁ దలంచి పలుతెఱంగులఁ దలపోయుచుఁ గ్రమంబున నయ్యంబుజాక్షు సమక్షమునకుం జని నమస్కరించుటయు దామోదరుం డతని నాదరించి కరుణామేదురములగు చూపులతనిపై వ్యాపింపఁజేయుచు నుచితాసనాసీనుం గావించిదీవించి వత్సా! నీకు సేమమా ఎందుండి వచ్చితివి ? త్రివిష్టపములనేవైన విశేషములు గలిగియున్నవియా! అని యడిగిన నారదుండు చిన్న వోయిన మోముతో స్వామీ ! మీదయవలన నన్నిలోకములవారు సుఖులై యున్నవారు. ఎచ్చటను నే విశేషము గనంబడదు. ఇందే క్రొత్తవింత బొడఁగంటి వినుఁడు.
క. ఏ నటుఁడఁగాను ధూర్తుఁడ
గాను భుజంగు డనుగాను కామక్రోధా
ధీనుఁడఁగాను జితేంద్రియుఁ
డైన తపోధనుఁడ దావకాంఘ్రిప్రియుఁడన్.
గీ. ఇట్టి నన్నుఁ జూచి యేకాంతవాసంబు
జేరె లోకమాత సిగ్గుతోడ
యతులయెడల నిట్టి యాటంకములుసూప
నెట్లు కొలుచు వారమింకనిన్ను.
మఱియు నేను వీణాగాన పరిశ్రమ సేయుటం బట్టి నీయిల్లాలు నన్నుఁ గాయకుంగాఁ దలంచినదేమో యది యసంభావ్యంబు గాయత్రసామంబు సంతతము బాడుచు నిన్నుఁ గీర్తించుట వేదసమ్మతము గాని దూష్యంబు గానేరదు సంసారమాయాబలంబు దెలిసికొని సంపదలరోసి భవత్సేవారతుండనై యరుదెంచిన నన్నుఁ జూచి లోపలికేగుట నాకు మిక్కిలి యవమానకరముగానున్నది. తాతా ! నీవైన వలదని చెప్పితివి కావుగదా! అని సాభిమానముగాఁ బలికిన విని జనార్దనుండు నవ్వుచు నారదా! నీవింతబేలవైతివేమి ! నీశాస్త్ర పరిశ్రమయంతయు వ్యర్ధమైనట్లు తోచుచున్న దే. మాయాప్రభావంబు దెలియనివాఁడవగుట ని ట్లంటివి వినుము.
క. మాయాబలమరయఁగ దు
ర్జేయముబ్రహ్మాదులకు న జేయంబహహా
పాయకనది మోహితులం
జేయు మహామునులనైనఁ జెప్పఁగనేలా ?
తాతా! మాయాబలమున ధర్మజ్ఞుండుగూడ విపరీతమతియగునని చెప్పితివి. తత్స్వరూప మెట్టిదో యేయాధారముగలదియోప్రత్యక్షముగాఁ జూచినంగాని నామనసు సమాధానము పడకున్నది తద్విశేషము జూపఁగోరెదనని యడిగినవిని ముకుందుడు మందహాసము గావింపుచు వత్సా! సర్వాధారమైన యామాయ జగంబంతయు నిండియున్నది. ఇచ్చగలదేని తత్ప్రభావము జూపింతు నాతోరమ్ము. అనిపలికి గరుత్మంతుని స్మరించుటయు నవ్విహగపతి సన్నిహితుండయ్యెను.
విష్ణుండు నారదునితోఁగూడ నానీడజవరంబు నధిష్ఠించి యుత్తరాభిముఖముగాఁబోవుచు బహువిధఫలదళకిసలయవిలసితములగు తపోవనంబులు శరభశార్థూలాది మృగభయంకరము లగు మహారణ్యములు కమల కల్హారవాసితములగు సరోవరంబులు నగాధజలపూరితంబుల గుహ్రదంబులు బహుజనాకీర్ణంబులగు పురగ్రామపక్కణ విశేషంబులం జూచుచుఁ బెద్దదూరమరిగి యరిగి కన్యాకుజ్జమను పట్టణంబున కల్లంతదవ్వులోఁ జక్రవాక హంసకారండవాది జలవికిర పరివృతంబు బంకజపరాగరంజితంబునగు కాసారమొకండు నేత్రపర్వంబు గావించుటయు వాసుదేవుండు గరుత్మంతునాపి నారదున కిట్లనియె.
క. సారసనాద సువాసిత
సారసవనముదిత సాంధజనమగు నా కా
సారవిలాసము గంటివె
నారద దుగ్ధాబ్ధిగతి మనంబలరించెన్.
గీ. తాపసోత్తమ! అందుదీర్ధంబులాడి
పోవలయునంచు మది వేడ్కఁబుట్టె నాకు
నల్లదే రాజధాని గమ్యస్థలంబు
మునిఁగిపోవుద మన నతం డనుమతించె.
పుండరీకాక్షుండు పక్షిపతి నాక్షణమ తత్తాటాకతీరంబు జేరంబనిచి నారదునితోఁగూడ వాహనావతరణంబు గావించి యజ్జటివరుచిటికెనం గైకొని యక్కాసారతీరవిశేషంబులఁ జూపుచుఁ బోయిపోయి యొకచోటఁదటవిటపిసాంద్రచ్ఛాయానికటంబునఁగూర్చుండియతనికిట్లనియె
క. మునునీవు గ్రుంకుమిట వ
చ్చిన పిమ్మట స్నానమేను జేసెద దివిష
న్మునివర యందాకసరి
ద్ఘనతగనుంగొనుచునుందుఁ గద యిచ్చోటన్ .
అనుటయు వల్లెయని యమ్మునితల్లజుండు వల్లకియుఁ గృష్ణాజినంబు మెల్లగ నొకచోట నునిచి చేతులకును శిఖకును ధర్భలు ముడివైచి కాళ్ళుఁ గడిగికొని సంకల్ప పూర్వకముగ రెండు మునుంగులు మునింగి మూఁడవమాటు మునుంగునంతలో,
సీ. తళుఁకుచూపుల ముద్దు గులుకు వాల్గన్నుల
బెళుకు చెక్కులనిగ్గు పెద్దసేయ
రదనాంశుకముకెంపు వదలించి చిఱునవ్వు
లేతవెన్నెలరుచుల్ పూఁతబూయ
మోము దామరనళుల్ మూఁగుచున్నవి నాగఁ
జికురముల్ నొసలిపైఁ జిందులాడ
చనుదోయి పెనుభారమునుబూన స్రుక్కుమ
ధ్యమున కూతగ నితంబము దలిర్ప
గీ. నూరుమృదుకాంతి వల్వపై కుబికిరాఁగ
మేనిడాల్తళ్కుగమి మిఱమిట్లుగొలుప
మహితసకలాంగ సౌభాగ్యమహిమతోడ
నారదుం డొక్క చక్కని నవలయయ్యె.
అప్పుడమ్మహర్షి కించుకయుఁ బూర్వస్మృతి లేకపోవుటంజేసి తానెవ్వరో తెలిసికొనలేక కర్తవ్య మెఱుంగక జగన్మోహనంబగు తన రూప మూరక చూచుకొనుచు విస్మయము జెందుచు జలమునుండి యొడ్డుపైకెక్కి యున్మత్తవోలెఁ జిత్తమోహముతోఁ దటాకముదెసఁ జూచుచుండెను. అంతలోఁ దాళధ్వజుండను నృపాలుండొకడు చతురంగ బలపరివృతుండై వేటకై యవ్వనమున కరుదెంచి పిపాసాలసుండై దైవవశంబున నత్తటాకంబున చెంతఁజేరి తత్తీరంబున జగన్మోహనాకారంబునం బ్రకాశించు నమ్మించుఁబోడింగాంచి పంచశరచంచలిత హృదయుండై యబ్బురముగాఁ జూచుచు నిట్లనియె.
సీ. పొలతి! నీవెవ్వని పుత్రిక వొంటి నీ
వనమున కేమీట వచ్చినావు
అతివ! నీనామధేయాక్షరంబులను గ
ర్ణోత్సవంబుగఁ జెప్పు మొకట నాకు
గలికి! నీయాకృతిగన నురగరుడోర
గాదిఖేచరకన్య వనుచుఁ దోచె
నాతి! నూతనయౌవనవిభూషితాంగివై
తగు నిన్నుఁజూడ డెందము చలించె
గీ. నెలఁత! సౌందర్యరాశివౌ నీవు నన్ను
గనుల వీక్షింపు మమర సౌఖ్యములభించు
సరసి దెసజూచుచుంటి వచ్చటఁ ద్వదీయు
లెవ్వరుండిరొ వచియింపు మింతి నాకు.
క. తాళధ్వజుఁడను వాడన్
గాళీభక్తుండఁ బ్రధితకన్యాకుజ్జా
ఖ్యా లలితనగరపతినై
పాలింతున్ భూరిభూమిభాగంబెలమిన్.
ఉ. పెండిలియాడలేదు తగుభీతమృగాయతనేత్ర లభ్యగా
కుండుటఁజేసి యీసరికి నోసరసీరుహనేత్ర! త్వద్వయో
మండితచారురూప లసమానవిలాసములా ప్రసూనకో
దండ నిశాత సాయకవితానములై ననునేచె నిత్తఱిన్.
కృశోదరీ! నీవునన్నుఁ బెండ్లియాడితివేని త్రిభువనంబుల నన్నుఁబోలు భాగ్యవంతుఁడు లేడుగదా నాకుఁగల సకలసౌభాగ్యంబులు నీయధీంబు గావించి నీ చెప్పినట్లు నడుచువాఁడ న న్నను గ్రహింపుమని పలికిన విని యక్కలికి కలికిచూపు లతనిపై వ్యాపింపఁ జేయుచు దత్సౌందర్యాతి శయంబున కచ్చెరువందుచు మల్లన నిట్లనియె.
చ. సలలితరూప నుత్తసుమచాప! మదీయచరిత్రయేమియున్
తెలియదునాకు నీవనికి నేనెటువచ్చితినో యెఱుంగ మ
మత్కులమును దల్లిదండ్రులును గోప్తలు నెవ్వరొ? యేమిచేయఁగా
వలయునొ తోచకున్నయది భావమునందలపోసిచూడఁగన్.
అంతయు నాకగమ్యగోచరముగా నున్నది. నిరాధారనై చికీర్షితముల గుఱించియే వితర్కించుచుంటి నీవు ధర్మజ్ఞుఁడవు సత్యసంధుండవని తోచుచున్నది. నా కెవ్వరు దిక్కు లేరు. నేనీ యధీననగుదు బౌలకుండవై యేలికొనుము అనిపలుకుటయు నప్పలుకులమృతము పలుకులవలెఁ జెవులకుసోకి కుతుకపరుప మదనాతురుండై యనతిదూరములో నున్న భృత్యులచే ముక్తాజాలవిభూషితంబు మృద్వాస్తరణశోభితంబు కౌశేయాంబరవేష్టితంబునగు పల్లకిఁదెప్పించి యప్పంకజాక్షిఁ దానిబై నెక్కించి మహావైభవముతోఁ గన్యాకుబ్జనగరంబునకుం దీసికొనిపోయి. యంతఃపురమునఁ బ్రవేశపెట్టించెను మఱియు,
గీ. సూరులెన్నంగ సౌభాగ్యసుందరియని
సార్ధకాహ్వయముంచె నానరసిజాక్షి
కతఁడు శుద్ధాంతకాంత లత్యంతగౌర
వ ప్రపత్తుల నర్చింపఁబ్రభ్వియనుచు.
క. కాలాతిపాత మోర్వక
బాలామణిఁ బెండ్లియాడెఁ బతి యధికశుభ
శ్రీలగ్నమందుఁ దద్విభ
వాలోకనసక్తచిత్తులై ప్రజలొప్పన్ .
ధవళప్రభావిలసితదీపధూపాభిరామంబై బహువిధప్రసూనమాలికామోదబంధురంబై యొప్పు కేళీమందిరంబున నమ్మహారాజు దివ్యభూషణభూషితుండై సకలాలంకార భాసితవేషయగు నాయోషా రత్నమును తనవామపార్శ్వమునఁ గూర్చుండఁబెట్టి పెద్దయుం బొద్దు నర్మగోష్ఠీవిశేషముల వినోదము గలుగఁజేయ నానందించుచు సహచరవర్గంబు నిర్గమించిన తరువాత లజ్జావశంవదయై కదలఁబోయిన నదిమి పోనీయక నాయకుండు శయ్యాతలంబునఁ దలవాల్చికొనియున్న యాయన్ను మిన్నను ముట్టినఁ గందునోయనియుఁ బలుకరించిననా యానపడునోయనియు నెఱుచుచు,
ఉ. హార మణుల్ విచిత్రములటంచుఁ గరంబు నురోజయగ్మముం
జేరుచు నడ్డబాసతుదిఁజేర్చిన ముత్తెము కెంపుగాఁగ నొ
ప్పారె నిదేమియంచధరమంటు జడన్ ఘటియించుఁ బుష్పముల్
జారెనటంచుఁ జెక్కులను జందనముందుడుచు న్నె పంబునన్.
ఉ. అంటినఁ గందునీయొడ లహా సుమకోమలమౌట మాటలం
గంటకపెట్ట నొప్పిదముగాదిఁక నేమి యొనర్తునొక్కొ? పూ
వింటివలంతి నాయెడద భిన్నముసేసెడుఁ గాన నాకు వా
ల్గంటి ! మహోపచారకములం నినుఁగొల్చుటయే శుభంబగున్.
చ. అనుచువిపంచిగైకొని ప్రియంబున సుస్వరతానయుక్తి నూ
తనగతిఁ బాడుచుండ సతి దప్పులఁబట్టుచు నొండువీణ న
ల్లన బలికించెఁదత్స్వరవిలాసములన్వెరపించు రాగముల్
జనపతి హాయిహాయి యని సంతసమందుచుఁ గౌఁగలింపఁగన్.
మఱియు నమ్మహారాజు తదీయపాండిత్యవిశేషం బెట్టిదోయని ప్రసంగించి చతుష్షష్టి కళారహస్య వేతృత్వంబు వేదవేదాంగ పరిజ్ఞాతృత్వంబు ప్రకటింపఁ దెలిసికొని యురముపైఁ జేయిడుకొని యాహా ! యీమోహనాంగి వాణీవధూటి యపరావతారమని చెప్పనోపు. ఇన్నివిద్య లెఱిఁగిన కురంగాక్షు లెందైనంగలరాయని యచ్చెరువందుచుఁ గామకళావైదగ్ధ్యంబున నయ్యంబుజాక్షింగూడి రాగసముద్రంబున మునింగి తేలియాడుచుండెను.
మఱియు నాధాత్రీపతి రాజ్యతంత్రంబుల మంత్రులయధీనముగావించి యమ్మించుఁబోఁడితోఁగూడికొని మధుమాసముల ఫలదళకుసుమ కిసలయవిలసితములగు నుద్యానవనంబుల మధుకరరవ ముఖరితములగు చందనవాటికలమయూర కే కారవబంధురంబులగు క్రీడాశైలకందరంబులహంస కారండవాదిజలవికిరనికరవిరుత మనోహరంబులగు సరోవరతీరంబుల నదీసికతాతలంబుల సముద్రతటంబుల మనోజ్ఞప్రదేశంబుల విహరింపుచుఁ గ్రీడాపరతంత్రుఁడై పెద్దకాలము తృటిగా వెళ్ళించెను.
సౌభాగ్యసుందరియుఁ దనపూర్వజన్మవృత్తాంత మించుకయుఁ దెలిసికొనలేక లోకపరిపాటి వధూటియుం బోలె విదగ్ధుండగు తాళధ్వజుని కేళీవినోదములఁజిక్కి పరవశయై యొండు తెలియక రాగజలరాశి మునింగి కాలవ్యతిక్రమ మించుకయు నెఱుంగదయ్యెను.
క. పడతింజూడఁగ నిమిషం
బెడమైనన్ యుగములట్టు లెంచుం బతి దా
నొడయనిగన నరనిమిషము
తడవైన న్మేను విడువఁదలచున్ సతియున్.
క. మఱచెను బ్రహ్మజ్ఞానము
మఱచెను యోగప్రసక్తి మతిఁదాను మునీ
శ్వరుఁడగుట మఱచె నృపతిని
మఱిఁగి రతుల యువతి మాయమఱుఁగె ట్టిదయో!
అట్లు కొన్నివత్సరంబులు గడిచినంత నక్కాంతామణికి దౌహృదలక్షణంబులు పొడసూపుటయుఁ నాభూపతి యపరిమితానందంబుఁజెంది గర్భసంస్కారములఁ గావింపఁజేసి మహోత్సవములతోఁ బుత్రోదయ మభిలషించుచున్నంత,
క. అభినవమదనుండో యన
శుభలక్షణ లక్ష్మితుండు శూరాంకుండై
ప్రభవించె సుతుఁడు సుదతికి
శుభలగ్నమునందు భూభుజుఁడు గనిమురియన్.
ఆరాజు పాఱులకపారముగా షోడశమహాదానములు గావించి జాత కర్మానంతరము విప్రప్రేరితుఁడై పుత్రునకు వీరవర్మయను నామకరణముజేసెను. మఱియు నాశిశువుం బెనుప దాసీసహస్రములు గలిగియున్నను దదర్పితముసేయక తామేనుతపోషణలాలసులై తదీయ గమనహాసవచనరచన క్రీడావినోదములు మోదం బొనరింపుచుండ రెండుసంవత్సరములు తృటిగా వెళ్ళించిరి.
ద్వితీయవత్సరాంతమునఁ గ్రమ్మర నయ్యువతి గర్భవతియై పదవమాసంబునఁ బుత్రరత్నమునే కనినది. సర్వలక్షణలక్షితుండగు నా బాలునకు భూపాలుండు సుధన్వుండని పేరు పెట్టెను. తిరుగా మూడేండ్లకు నారాచపట్టి యఱియొకముద్దులపట్టింగాంచినది. వానికి రాగవర్ధనుఁడని పేరుపెట్టెను. ఈరీతి నా నారీరత్నము మూఁడేండ్లకొకపుత్రుని వరుస క్రమంబున నిరువదిమంది పుత్రులంగనినది వారందరు ససమానరూపరేఖావిలాసంబుల నొప్పియు సమానరూపరేఖావిలాసములతో నొప్పారఁ జూచువారలకుఁ గన్నులపండువుగాఁ దోచుచుండిరి.
సీ. పాలీయవేయంచుఁ బైఁటలాగు నొకండు
బువ్వబెట్టుమటంచుఁ బొడుచునొక్కఁ
డంగీలు గూర్చవే యని లాగునొక్కండు
జుట్టుదువ్వు మటంచుఁ బట్టునొకఁడు
తొడవులిమ్మనుచుఁ బైఁబడునొక్క తనయుండు
చదువుజెప్పుమటంచు నదుమునొకఁడు
తలయంటుమంచుఁ జిందులుద్రొక్కు నొక్కండు
వంటకాల్దెమ్మని గెంటునొక్క
గీ. డూర్మినందఱకన్నియు నొసఁగి విసుగుఁ
జెంద కఱనవ్వుతో నరవిందగంధి
చేఁతనేయక కటువుభాషింపకెపుడు
బిడ్డలందరఁ గడుబ్రీతిఁబెనుచుచుండె.
సీ. ఒకనికి జాతకర్మోత్సవం బొక్కనం
దనున కన్నప్రాశనప్రశక్తి
రణసిద్ధి నస్త్రధారణ భద్ర మొక్క. ప
ట్టికి నిభారోహణాత్మకశుభంబు
అక్షరాభ్యాసకార్యారంభ మొకని క
శ్వారోహణోరు కల్యాణ మొక్క
సుతునకు స్నాతకవ్రత మొక్కనికి నుప
నయనక్రియ మఱొక్కనందునునకు
గీ. నెప్పుడునుజేయుచుంద్రు వారింట శుభము
లెడతెగక నిత్యకల్యాణమెసగఁ బచ్చ
తోరణముగాఁగ మఱియేకుమారునకు నొ
చూడ వారి కుటుంబమే చూడవలయు.
- __________
217 వ మజిలీ
వీరవర్మ కథ.
తాళధ్వజుండు కుమారుల కందఱకు వేరు వేరు విద్యామందిరములు వ్యాయామశాలలుగట్టించి తగిన యుపాధ్యాయుల నియమించి విద్యలు గఱపించుచుండెను. అందు వీరవర్మయు సుధన్వుండును పదియారేఁడుల ప్రాయము వచ్చునప్పటికి ధనుర్వేదమంతయు సాంగముగా నభ్యసించిరి. ఇతర విద్యలయందుఁ గూడ నిరుపమానమైన బ్రజ్ఞసంపాదించిరి.
ఒకనాఁడు వీరవర్మ తమ్మునితోఁ గూడఁదండియొద్దకుఁబోయి నమస్కరించి ఆర్యా! మేమిప్పుడు ధనుర్వేదమంతయు జదివితిమి. తత్ఫలం బరయ దిగ్విజయయాత్రసేయ నభిలాషగలుగుచున్నది. అందుల కనుజ్జయిండని కోరిన విని యతండు మీతల్లి నడుగుఁడని కనుసన్న జేసెను. వారు ప్రాంతమందేయున్న యామెకు నమస్కరించుచుఁదమ యభిప్రాయమెఱింగించుటయుఁ గటకటంబడి యాసాధ్వీమణియిట్లనియె
బిడ్డలారా! మీరు విద్యామందిరమునుండి యింటికివచ్చుటకు గడియ యెడమైన నెడదఁ దల్లడిల్ల యుగములైనట్లు తోచును. మీరు విదేశయాత్రకరిగిన బ్రదుకఁగలనా? దిగ్విజయమన మాటలతో నున్నదా! మహాశూరులతోఁ బోరుసంఘటిల్లును. వాడిశరంబులేసి మీ మృదుగాత్రంబులు నాత్రపఱతురు. శత్రువులకు జాలియుండునా ! జయాపజయంబులు దైవాయత్తములు మీరు ధనుర్వేదము జదివితిరేని కాని తత్పరిశ్రమయెట్టిదో యెఱుంగరు యువరాజ్యపట్టభద్రులై