కాశీమజిలీకథలు/పదవ భాగము/215వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఆవిషయమై యిరువురకు మరలసంవాదము జరిగినది. నారదుండు కాంతల గర్హించుచుఁ బెండ్లియాడనని నిర్భయముగాఁ బ్రత్యుత్తురమిచ్చెను. కానిమ్ము నీచేఁ బెండ్లియాడింపక పోవుదునా చూతువుగా అని తలకంపించుచు నప్పటికూరకొనియెను.

అని యెఱింగించి....

__________

215 వ మజిలీ.

నారద వివాహము

దమయంతి కథ.

నారదమహర్షి యొకనాఁడు | భాగినేయుండగు పర్వతునితోఁ గూడ భూలోకవిశేషంబులం జూడవేడుకపడి గగనమార్గంబున భరతఖండమునకరుదెంచియందుఁగల తీర్థక్షేత్రారణ్యయ విశేషంబులంజూచుచుఁ దిరిగితిరిగి యొక గ్రీష్మాంతమునఁ జాతుర్మాస్యవ్రతంబు సేయఁదలంచి సృంజయుండను న్యపకుంజరుని గృహంబునకరిగి యతనిచే సన్మానితుఁడై యిట్లనియె. మహారాజా ! మహర్షులకు వర్షకాలమున యాత్రలు సేవించుట దుర్ఘటమగుట నొక్కచో నీనాలుగుమాసములు వసించి వ్రతంబు బూర్తిసేయవలసియున్నది. మీయింటవసించుట కనుకూలమగునే అని యడిగిన సృంజయుం డిట్లనియె.

మహాత్ములారా! మీయట్టి తాపసోత్తముల చరణరజస్సంపర్కంబుఁ బొందనిభవనంబు వనంబుగాదే. మదీయభవనోద్యానవస్తు వాహనాదికములనెల్ల మీయథీనముగావింతు మీయిచ్చవచ్చినట్లు వాడు కొనుఁడు అనుభవింపుఁడు. అనిపలికిన విని నారదుం డిట్లనియె. మహారాజా! ఇట్లనుటకు నీ కే చెల్లును. మాకస్తోకములగు భోగము లవసరములేదు. ప్రతనియమవిశేషంబులకుఁ దగిన పరికరంబులంగూర్ప నేర్పు గలిగిన పరిజనుల నియమింపుము. ఇంతియ చాలునని తెలిపిన నమ్మను జపతి సంతసించుచుదమయంతియను పేరుగలతనకూతుంజీరియిట్లనియె.

తల్లీ ! యిరువురు మునితల్లజులు మనయింటఁ జాతుర్మాస్య వ్రతంబు సేయనున్నారు. వారిశుశ్రూషకు నిన్నప్పగించుచున్నాను. నీవు వారిచిత్తములెఱింగి లజ్జాభిమానంబులం బూనక యుపచారములం జేయవలయు నీవు విద్యావతివి నీకుఁ జెప్పనక్కరలేదు. మునులు ముక్కోపులుసుమీ! యౌవన విలాసములం బ్రకటింపక భయభక్తివినయవిశ్వాసములతో నారాధింపుము నీకు శుభంబులం గూర్పఁగలరని బోధించి వారికడకుఁ బంపెను.

దమయంతియు యతులకన్న మున్నలేచి శాటీపటంబు లుతికి యారవైచుచు స్నానమునకుష్ణోదక మమరింపుచు వేదులనలికిమ్రుగ్గులు పెట్టుచుఁబూజాద్రవ్యంబులఁజేర్చుచు హోమోపకరణంబులగు దర్భల సమిత్తుల నాయత్త పరచుచు నుచితకాలమున స్వయముగావండి భోజనంబిడుచు నతిభక్తితో నిష్కాపట్యంబున వారినిద్దరసమముగా నారాధింపుచుండెను. వారు మనసులోఁ గావలసిన వస్తువు దలఁచికొనినతోడనే తెలిసికొని యెదురఁబెట్టుచుండును. వారు జపము జేసి కొనుచుండ వింజామర విసరుచుండును.

వారు వేదవ్రతపరాయుణులై వేదాధ్యయనంబు గావింపుచుఁ జాతుర్మాస్యవ్రతంబు నియమంబున జరుపుచుండిరి. అందు నారదుం డొకనాఁడు స్వరములఁ గల్పించి తనవీణపై గాయత్రమను సామంబు కర్ణరసాయనంబుగాఁ బాడఁదొడంగెను. నారదుని వీణాగానము వినిన మృగములుగూడ మేతమేయవు! ఇతరులమాట జెప్పనేల! దమయంతికి సంగీతమనినఁ జాల ప్రీతికలదు. స్వయముగాబాడును. నారదుని సంగీతమును వినినతోడనే యాశ్చర్యపడి హృదయము నీరుగాఁగ నాప్రాంతమునకు వచ్చి యాలించుచు దన్మయత్వమునొంది రాగలుబ్ధయై యనురాగ సముద్రములో మునిఁగిపోయినది. అమ్మహర్షి కొంతసేపు పాడి వీణం గట్టిపెట్టునప్పుడు దాపునకుఁ బోయి నమస్కరించి మహాత్మా! నాకు సంగీతప్రవేశము గొంత గలిగియున్నది. గాయకులలో నాకంటె నధికులు లేరని గర్వపడుచుండుదాన. మీసంగీతము వినుటచే నామది తన్మయత్వము నొందినది. ఇట్టి రాగములు ఇట్టి కల్పనలు నేనిదివఱకు భూలోకములో వినియుండలేదు. మీది దేవగానమనితోచుచున్నది. నారదమహర్షికిం గాక మహర్షులకు, గానలాలసత్వ ముండదు. మీరెవ్వరో తెలుపవలయు. నారదమహర్షివై యైనచో నేను మనుష్యకోటిలో నుత్తమురాల నగుదురు. నాజన్మము సార్ధకము నొందఁగలదని పలికిన నామహర్షి నవ్వుచు నిట్లనియె.

యువతీ ! నారదుని రథ నీవిదివఱకు వినియుంటివా యేమి? అతనియందు నీకంత ప్రీతి యేమిటికి గలుగవలయును. చెప్పుమనుటయు నక్కుటిలాలక మహాత్మా! మునులలో నారదునివంటి యుత్తముఁడున్నవాడా? నేను సంగీత ప్రియనగుట నాకతండు ప్రియుండయ్యె జెప్పితినా? అని పలికిన నతండు నన్ను నారదుఁడే యనుకొనుము. నీ కేరాగము ప్రియమో చెప్పుము. ఆరాగము పాడెదనని బోధించెను.

ఆమాట విని యాపాటలగంధి మోము వికసింప నాహా ! నేఁడెంత సుదినము? ఎన్ని దినములనుండియో దేవర దర్శనము సేయ గోరికొనుచుంటి. నేఁటికి నావ్రతము ఫలించినదని మురియుచు నతని పాదంబులకు లలాటము సోక మ్రొక్కుచుఁ పెద్దగా నగ్గించినది. నాఁడు మొద లమ్ముని సంతతము వీణాగానమే చేయుచుండును. ఆచిన్నది యితర వ్యాపారములు విడిచి దాపునఁ గూర్చుండి వినుచుండును. క్రమంబున నామెచిత్తము చిత్తజాయత్తమై యమ్ముని యందు లగ్నమైనది. అయ్యనురాగ మనుదినము వృద్ధినొందు చుండెను. లీలాతరంగితములగు చూపుల నతనిఁజూచుచు మత్స్యమును. బడిశమువలె నతని హృదయ మాకర్షించుచుండెను. మునిహృదయము క్రమంబునఁ దరళమై రాగలుబ్ధమై మోహాంబునిధిలోమునుఁగఁ జొచ్చినది. ఆమెను సంతతముదాపునఁ గూర్చుండఁ బెట్టుకొని పాడుచుండును.

దమయంతియు భోజన భాజనాదిక్రియలఁ బర్వతు నుపేక్షగాఁ జూచుచు నారదున కెక్కుడుగా బరిచర్య సేయుచుండెను. ఆవిపరీతము గ్రహించి పర్వతుం డొకనాఁడు నారదునితో నేకాంతముగా నిట్లనియె. మామా! ఈ రాజపుత్రికచేష్టలు మొదటనున్నట్లు లేవేమి? మన యిరువురకుఁ జేయు పరిచర్యలోఁ జాల వ్యత్యాసము గనంబడుచున్నది. నీకు భోజనము పెట్టి దావునఁ గూర్చుండి రుచు లడుగుచు దాళవృంతమున వీచుచుఁ గొసరి కొసరి వడ్డించుచున్నది. నాకట్లు కాక విస్తరిలో నున్నదియు లేనిదియుఁ జూడక విసరి పారవేయును. నీకు భర్తవలే నుపచారములు చేయుచున్నది. నాకు దాసునకు వలెఁ జేయుచున్నది. నేత్ర వక్త్ర వికారాదులు పరీక్షించితిని. నిన్ను భర్తగాఁ బడయఁగోరి నట్లున్నది. నీవు గూడఁ దత్తదను గుణక్రియల జరుపుచుంటివి. నిజము చెప్పుమని యడిగిన నారదుం డిట్లనియె.

పర్వతా! నీవనిననట్లీచిన్నది నన్ను భర్తగా గోరినట్లున్నదిదాని చర్యలంబరీక్షించిన నాహృదయము గూడఁ దరళమగుచున్నది. సిగ్గుచే నీకుఁ జెప్పితినికాను. ఇందులకుఁ గోపింపకుమని పలికిన విని పర్వతుఁడు,

క. పటు కోపస్ఫురితా ధర
    నిటలుండై నిప్పులురుల నేత్రములంద
    క్కట ఎట్టిపనినొనర్చితి
    విటుఁడవగుచుఁ దలఁపనిది వివేకమె మామా.

ఉ. ఇద్దఱిలోన భేదము వహింపఁగఁ గూడదు లోన నెప్పుడే
     బుద్ధిజనించునోయపుడెపో యెఱిఁగిఁ పదగుం బరస్పరం
     బెద్దియు గోప్యముంచఁదగ దేకడనంచు వచించుకోమె యా
     సుద్దులు మూలఁద్రోసి యిటుశోభనమున్ భజియింతెనారదా?

క. నీయందము చందము గని
    యూయిందుముఖీవతంస యాసించెఁగదా
    పో యిఁక వానరవదనుఁడ
    వై యటునినుఁజూచి సకియ యానందించున్.

నిన్ను మగనిఁగాఁ జేసికొనుతలంపుతో నన్నవమానించిన యారాజపుత్రిక కిదియశిక్ష నీకోతిమొగంబుఁ జూచి యిటుపై నెట్లుచేయునో చూచెదంగాక! అనిశపించినవిని నారదుండు ఔరా! పర్వ తా! స్వల్పాపరాధమున కే నన్నిట్లుశపింతువురా! అసూయాపరతత్వముగాక దీననీ కేమివచ్చెడిని? కానిమ్ము. ఇందులకుఁ బతిఫలం బనుభవింతువుగాక యీమర్త్యలోకనివాసమే నీకు శాశ్వతమగుఁగాత. ఇఁకనీకు నాకలోకాలోకన సుఖం బాకాశకుసుమంబగు పోపొమ్ము. నీసహవాసంబు దోషప్రదంబని నారదుండు క్రమ్మఱశపించెను పర్వతుండు పశ్చాత్తాపము జెందుచు విచారముతో నెందేనింబోయెను.

నారదుండు వానరముఖుండై సిగ్గుతో నాఁడు రాజపుత్రిక మొగముజూడక మార్మొగముపెట్టుకొని వాడుకప్రకారము వీణం బాడుచుండెను. దమయంతి యంతికమునఁ గూర్చుండి యాకర్ణింపుచు హఠాత్తుగా నతని మొగముజూచి మునీంద్రా! మీ మొగంబునకు మసి బూసికొనిరా యేమి? అట్లునల్ల పడినదే! అని యడిగిన నతండులజ్జావనత వదనుండై యిదియొక ప్రారబ్ధమని యుత్తరము చెప్పెను. అవ్వనిత తత్కారణము తెలియక పరితపించుచు నతండు తన్నుఁజూడ సిగ్గుపడు చున్నాడని యెఱింగి యక్కొరంత పాటింపనట్లభినయించుచు మునుపటి కంతె నెక్కువప్రీతితో నాలించి శుశ్రూషచేయుచుండెను. నారదుఁ డాత్రముతో నప్పద్మనేత్రమొగము మొగమెత్తి చూడలేకుండెను.

సృంజయుండు పుత్రికకు వివాహప్రయత్నము చేసి కొందఱ రాజపుత్రుల చిత్రఫలకములఁ దెప్పించి వారిలో నిచ్చవచ్చినవాన్ని గోరికొనుమని దాసీముఖముగా దమయంతియొద్దకనిపెను. దమయంతి వానినేమియుఁ బరికింపక వానిందెచ్చినదాసితో నోసీ! నామాటలుగా మాతండ్రితో నిట్లుచెప్పుము.

తండ్రీ ! మనయింటఁజాతుర్మాస్యవ్రతము సేయువారిలో నొకఁడు నారదమహర్షియని తెలిసికొనుము. మహతీయుతుండగు నమ్మునితిలకుని నేనువరించితిని. అతండేనాకుభర్త అతండెట్టివాఁడో మీరువినియే యుందురు. నేను తదీయగానవిద్యాపరవశనైతిని నక్రహీనంబై రసాత్మకంబై క్షారరహితంబై సుఖసంపూర్ణంబై తిమింగిలవర్జితమగు నాదసముద్రములోమునిఁగిపోయితిని. జనకా! నాకు మఱియొక పతియవసరములేదు. నారదునకే వివాహముగావింపుము.

అనియుపదేశించిపంపుటయు నాదాది యాపై దలిచెప్పినమాటలన్ని యు సృంజయున కెఱింగించినది. రాజు మిక్కిలి పరితపించుచు భార్యనురప్పించి దమయంతియుద్యమమెఱింగించి యిట్లనియె. అక్కటా నీకూఁతున కిట్టివిపరీతబుద్ధిపుట్టిన దేమి? ఎంతయో తెలివిగలదనుకొంటినే, ఔను స్త్రీబుద్ధి ప్రళయాంతక మనుమాట తథ్యమగును. వనితయు లతయు దగ్గరనున్న వారి నాశ్రయింతురనుమాటయేలతప్పును? అభిక్షుకుండు వానరముఖుండఁట! నేనప్పుడు తిన్నగాఁ జూడలేదు. మహర్షులు గదాయని శుశ్రూషకు నియమించితి ఛీ, ఛీ. ఆఁడుదానిగుణము కడు నింద్యమైనది. తానురాజపుత్రికయై భిక్షుకునెట్లువరించినదో తెలియదు. అందులకే గాయకులకడ నాఁడువారినుంపరాదని చెప్పుదురు. తెలియక మోసపోయితిని నీవుపోయిదానిమందలించుము కులముచెడగొట్టవలదని చెప్పుమని యెన్ని యోబోధించి భార్యం గూఁతునొద్దకనిపెను.

రాజపత్ని పుత్రియొద్దకుఁబోయి భర్త మాటలన్నియు జెప్పి ముక్కుపై వ్రేలిడికొని అయ్యో! యిదియెక్కడికోరిక. ఆకోతిమొగమువాఁడేమి? నీవేమి? వానివరించితినని పలుకుటకు నోరెట్లాడినది? నలువురు నవ్వుదురని యించుకయుసిగ్గులేకపోయెనే అయ్యయ్యో! ఇది యెక్కడివలపే! వానింబెండ్లాడి భిక్షమెత్తికొనుచు నూళ్లవెంబడి తిరుగుచుందువుకాఁబోలు నారదుఁడైననేమి? వ్యాసుఁడైననేమి? నీవులతా కోమలదేహవు. అతఁడు భస్మరూక్షవిగ్రహుఁడుకోఁతిమొగమేవాఁడు. నీవు నవ్విన పూవులురాలినట్లుండును వెన్నెలలుగాసినట్లు మెఱయును. ఇట్టి నీవాకోఁతిమొగము వానితో నెట్లుముచ్చటింతువు? ఎట్లువిలాసము లందెదవు? నిన్ను వరించి మన్మధునికన్నఁ జక్కనగు రాజపుత్రులనేకులు వార్తలనంవుచున్నారు. వారిలోఁ జక్కనివారినేరి వరింపుము. ఈ విపరీతబుద్ధి విడువుము నీవుపరిహాసమున కట్లంటివా! నిజముగానంటివా చెప్పుమనియెన్ని యోబుద్ధులు గరపిన నవ్వుచునాపువ్వుఁబోడియిట్లనియె.

అమ్మా! రసవేత్తలకు రూపముతో ధనముతోఁ బనిలేదు అవి దగ్ధులు మూర్ఖులునగువారు నారదనము గ్రహింపజాలరు రాజ్య మేమి జేసికొనవలయు వనములోనున్న లేళ్ళుగూడ గీతనాదమువినిధన్యము లగుచున్నవి. మృగములు గాయకునికిఁబ్రాణము లర్పించుచున్నవి. యెఱుంగుదువా మృగములకన్న మనుష్యులే మూర్ఖులు సప్తస్వరాత్మకమైన సంగీతవిద్య శంకరుండెఱుంగు. నారదుఁడెఱుంగు. వారింబోలిన వాఁడు మూడులోకములలో మఱియొకఁడులేడు. మూఢునితోఁ జిరకాలము సహవాసముచేయుటకంటె నుత్తమునితోఁ గడియచాలును గుణహీనుఁడగువాడు ధనవంతుఁడైన నేమి? రూపవంతుఁడైననేమి? అట్టివాఁడు విడువఁదగినవాఁడే బిక్షుకుండైనను గుణవంతుఁడైనచో స్వీకరింపదగినవాఁడే తల్లీ! నీకొక్కరహస్యము చెప్పుచున్నాను. వినుము సప్తస్వరజ్ఞుఁడుగ్రామవేత్త మూర్చనాభేదవిదుండుఅష్టరసజ్ఞుండు దుర్లభుండని యెఱుంగుము గంగాసరస్వతులు కైలాసము నెట్లు పొందించునో స్వరజ్ఞానవిశారదుండట్లు పొందించునుస్వరజ్ఞాన మెఱింగినవాఁడు మనుష్యఁడైనను దేవసమానుఁడు దానినెఱుఁగనివాఁడు దేవుఁడైనను మనుష్యునికన్నను హీనుఁడుసుమీ! దేవేంద్రుఁడైనను రసజ్ఞానము లేనిచోఁ బశువే. ఎవ్వడుమూర్చనా తానమార్గమువిని యానందింపఁడో వాఁడుగూడ పశువే మృగములు పశువులుకావు. రసజ్ఞానము లేనివానికన్న విషధరమే శ్రేష్టమైనది. చెవులులేకున్నను సంగీతమువిని యానందించును. చీ చీ చెవులున్నను గొందఱు గానప్రీతిలేనివారగుచున్నారు. శిశువులుగూడ సుస్వరయుక్తమగు గానమువిని యానందింతురు.

అక్కటా! నాతండ్రి నాదమహాత్మ్యమేమియు నెఱుంగఁడు నారదుఁడెవ్వడో యెట్టివాఁడో తెలిసికొనఁ జాలఁడు అట్టిప్రభావసంపన్నుఁడు మఱియొకఁడులేడు. ముమ్మాటికిని లేడు. అతనికి నాచేత వరింపఁబడినతరువాతఁ గోఁతిమొగమువచ్చినది. మొగమెట్లున్న నేమి తురగముఖులు పూజ్యులుగారా! అంబా! నీవొక్కసారివచ్చి యతని సంగీతమువింటివేనినన్నిట్లనవు పెక్కేలనేను ద్రికరణములచే నాతనిభర్తగావరించితిని. ఇఁక నామనసుతిరుగదు. ఇదిపూర్వజన్మసంబంధమనిమా తండ్రితోజెప్పి సమాధానపరుపుము అనికచ్చితముగా నుత్తరము చెప్పుటయు రాజపత్నియేమియు మాటాడనేరక భర్తయొద్దకుఁబోయి కూఁతు నుద్యమమంతయు నెఱింగించి యిట్లనియె. మనోహరా ! పిల్లదాని గాయకుని కడ శుశ్రూషజేయ నప్పగించుట మనదే తప్పు. అదినాద సముద్రములో మునింగి యతని వరించినది. మనమాటలేమియుఁ జెవికెక్కుటలేదు దానికర్మమ ట్లున్నది మనమేమి చేయఁగలము ! మందలించి చెప్పుటకది చిన్నపిల్లయా! మనమందఱము పశువులమఁట నాదజ్ఞులే యుత్తములఁట దానిమాటలకు నాకు గోపము నవ్వుగూడ వచ్చినది. ఇఁక దాని మనసు తిరుగదు. పోనిండు మునుల బెండ్లియూడినవా రెందఱు సుఖింపలేదు ! సుకస్య గ్రుడ్డి శతవృద్ధునగు. చ్యవనుం బెండ్లియాడి మంచి స్థితికి రాలేదా! అనుమతించి వానికే పెండ్లిచేయుఁడని యేమేమో బోధించి యంగీకరింపఁ జేసినది. సృంజయుండును మంత్రిముఖముగా నావార్త నారదున కెఱింగించుటయు నతండును దనప్రమాదము దెలిసికొని పశ్చాత్తాపము జెందుచు నప్పని కంగీకరింపనని ప్రత్యుత్తరమిచ్చెను. సృంజయుండు సంతసించుచు నామాట కూఁతునకుం దెలియజేయుఁడని నియమించెను. దమయంతి యావార్త మంత్రులవలనవిని యమ్మఱునాఁడు తాను జక్కగా నలంకరించుకొని నారదుఁడు పాడుచుండ దాపునఁ గూర్చుండి యాలించి వివశయై ముఱియుచు గానావసానంబునఁ జేఁతులు జోడించి యమ్మునీశ్వరున కిట్లనియె.

స్వామీ ! నేను భవదీయగాననాదామృతము గ్రోలిచొక్కితిని నాయింద్రియములన్నియు మీయధీనము లైనవి నేను మిమ్మే భర్తగాఁ గోరికొనియుంటి మీ పాదశుశ్రూషజేసి కృతార్ధురాల నగుదునని తలంచుచుంటి. నాదబ్రహ్మవేత్తలగు మీసేవకన్నఁ దరింపఁజేయ మఱియొక సాధనములేదు. నన్ను భార్యగా శిష్యురాలిగా దాదిగా ననుగ్రహించి స్వీకరింపవలయు లేకున్న నాకు మృతియే గతియని ప్రార్థించిన విని నారదుం డించుక తలయెత్తి యిట్లనియె.

తరుణీమణీ ! నీవు రాజపుత్రికవు. నేను తాపసుండ వానర ముఖుండ నన్ను నీవు బెండ్లియాడినఁ జూచినవారు నవ్వరా. నీ శుశ్రూషవలన నామనసించుక చలించినది. ఆప్రమాదము దాటించుకొంటి స్త్రీ సంపర్క మిఁక నంగీకరింపను తండ్రిగారి శాపమువలన నా కీవ్యామోహము గలుగుచున్నది. అక్కటా చాతుర్మాస్యవ్రత మేడ నీశుశ్రూషయేడ ? ఈవివాహ ప్రయత్న మేడ ? నే నొకచో నిలువరాదు మూడులోకములు తిరుగుచుండవలయును. వ్రతము పూర్తియైనది. పోయివచ్చెద ననుజ్ఞ యిమ్ము నీవలపు నాకాలికి సంకెలియై కదలనిచ్చినది కాదు. మోహము దెలిసికొంటి వలదు సంగమువలదని యుత్తరమిచ్చిన నమ్మచ్చెకంటి యల్లన ని ట్లయె. ప్రాణేశ్వరా ! నే నెవ్వతె ననుకొంటిరి ? వెనుకటి జన్మమున మీభార్యను మాలావతిని తెలిసినదియా ! మదీయపాతివ్రత్యమహత్వంబున జూతిస్మరత్వము గలిగినది. మీరు దాసీపుత్రులై జనించినప్పుడు మీవియోగమునకు వగచుచు మీకు భార్య యయ్యెడు తలంపుతో వేల్పులవలన వరములువడసి యిందు జన్మించితిని. మీయనురాగము వేయిజన్మములకైన మఱుపువచ్చునా? వెనుకటి ప్రేమదలంచి నన్నుఁ బాణిగ్రహణముజేసికొనుఁడు. అనిపలికిననారదుండులికిపడి యిట్లనియె.

ఓహోహో! నీవు మాలావతివా! తెలిసినది ఔను నేను దాసీపుత్రజన్మము విడిచి తిరుగా బ్రహ్మలోకమున కరిగితిని నన్నుఁ జూచి మాతండ్రి క్రమ్మఱ నిర్బంధించుచు నీప్రియురాలు మాలావతి సృంజయునింట జనించినది. ఆయెలనాగ నీకుఁ దగినదగుటఁ బెండ్లి యాడుమని నియోగించెను. నేనంగీకరించితిని కాను. ఆహా! విధిఘటితంబననిదియేకాఁబోలు! ఇన్ని దేశములుండ నేనిక్కడకే రావలయునా? పూర్వజన్మ వాసనావిశేషమువలననేనామదియిట్లు చలించినది. అక్కటా తండ్రిగారి శాపమునన్నెట్లు బాధించినదో చూడుము. గంధర్వుఁడనై పెద్దకాలము గ్రామ్యధర్మనిరతుండనై కడపితిని. తద్ధేతుకముగాశూద్ర యోనిం జనించితిని. ఇప్పటికైన విముక్తిబొందుదమన్న నీవువెంటా డించుచుంటివేమిసేయుదును? సాధ్వీ! నాజోలికిరాకుము నన్నుఁ బోనిమ్ము కరుణింపుమని బ్రతిమాలిన దమయంతి యిట్లనియె.

మహాత్మా! నేను మిమ్ము వరించుట కామాభిలాషచేతగాదు భోగవిముఖనైమీశుశ్రూషచేయుచు ముక్తినొందవలెననికోరియుంటిని మనసులువిరక్తినొంద నెందున్న నేమి? ఇందులకుఁ జింతిల్లవలదు. అనుమతింపుఁడని వినయముగాఁ బ్రార్ధించినది. అతండనుమతించెను. సృంజయుఁ డిష్టములేకున్నను నారదునకు దమయంతినిచ్చి వివాహము గావించెను. అంతలో యదృచ్ఛముగాఁ బర్వతుఁడరుదెంచి స్వర్గభ్రష్టత్వ మునకు వగచుచు నారదుంజూచి మామా! నేను తొందరపడి నిన్ను శపించితిని. నాశాపము మరలించెదనన్ను స్వర్గమునకుబోవునట్లనుగ్రహింతువా? అనియడిగిన నతండంగీకరించెను. ఒండొరులశాపములఁ గ్రమ్మఱించుకొనిరి. పర్వతుఁడు నాకంబునకుఁబోయెను, నారదుండు వెనుకటి ముఖముతో నొప్పుచుండె నాదమయంతి మిక్కిలిసంతసించుచుండెను.

దమయంతినిమిత్తముగా నారదుండా సృంజయునకు సువర్ణష్ఠీవియను పుత్రుందయచేసి వానిమృత్యువువలన రక్షించి వంశహాని కాకుండ ననుగ్రహించెననియెఱింగించునప్పటికిఁ గాలాతీతమగుటయు

క. లే లెమ్ము మిగిలెఁ బయనపు
   వేళకథాగతరసప్రవృత్తాస్థన్ గో
   పాలా! యని యమ్మునిశా
   ర్దూలుఁడు చని చేర శిష్యుతోఁ బయినెలవున్.

_________

216 వ మజిలీ

నారదుని స్త్రీ జన్మము.

సౌభాగ్యసుందరి కథ

క. శ్రీనారదవరవీణా
   గానస్వానానురక్త కరుణావిలస
   న్మానస తాపసహృదయా
   స్థానసుఖాసీన భక్తజనసంతానా.

దేవా! అవధరింపు మమ్మణిసిద్ధుఁడా నివాసదేశంబున నిత్య కృత్యంబులఁ దీర్చికొనిపిదప రమ్మస్థలాసీనుఁడై శిష్యునుద్దేశించి

క. హరిమాయామోహితుఁడై
   తరుణీమణియగుచు దేవతాముని భూమీ