కాశీమజిలీకథలు/పదవ భాగము/214వ మజిలీ
పంచచామరము. హరే హరే హరే హరే సితాంబరాయతేనమో
సురేశముఖ్య సర్వదేవ సుందరోత్తమాంగ స
త్కిరీటదీప్త పాదపీఠ దివ్యమంగళ స్వరూ
ప రాజీతాపరాజితారి పంచచామరస్తుతా.
అని భజియించుచు మాలావతివలనఁ దన మరణవృత్తాంతము విని యందున్న దేవతా బృందములకు వందనంబొనరించుటయువారందఱు నాదంపతుల నాశీర్వదించుచు బతివ్రతా ప్రభావమింతయొప్పునే యని యచ్చెరువందుచు సంతోషముతో నిజనివాసంబులకుఁబోయిరి.
మాలావతి చెల్లెండ్రతో భర్తతో నింటికిం జని యత్తమామల కావృత్తాంత మెఱింగించి బ్రాహ్మణుల కనేక దానములు గాంవిచినది. అనేకవ్రతములు సేసినది. మరికొన్నిసంవత్సము లాయుపబర్హణునితో సంతోష మనుభవించినది అని యెఱిఁగించి... పై మజిలీయందిట్లు చెప్పదొడంగెను.
- _________
214 వ మజలీ.
నారదుని దాసీ పుత్రజననము.
కలావతి కథ
గీ. వరములిచ్చిన దేవతావరులు వచ్చి
శూద్రయోని జనించుట సురుఁగదయ్యె
బ్రహ్మశాపప్రసక్తి నారదమహర్షి
కరయ విడుచునే ప్రారబ్ధమవని జనుల.
కన్యాకుబ్జదేశంబున కధినాయకుండై ద్రుమిళుండను గోపా లుండు కళావతియను భార్యతోఁ గావురముసేయుచుండెను. ద్రుమీళుఁడు హరిభక్తుఁడు. సంతతము శ్రీహరినామసంస్మరణము గావించుచుండును. కలావతియుఁ గలావతీశిఖామణియనఁ ద్రిలోకమోహ జనకంబగు సౌందర్యంబునం బ్రకాశించునది.
సీ. శారదపూర్ణిమా చంద్రబింబము డంబు
దెగడు చక్కని ముద్దుమొగముతోడ
దేహలావణ్యప్రవాహప్లవోరుకుం
భము లనఁదగునురోజములతోడ
మేలిమిబంగారు మిసిమిరంగుబెడంగు
జడిపించు నునుమేనిచాయతోడ
మునులకై నను మోహమొదవించు బలుచూపు
లను జిమ్ము తెలిసోగకనులతోడ
గీ. కలదు లేదను భ్రమగొల్పు కౌనుతోడ
రత్నభూషణరుచిర గాత్రములతోడ
దనరు నయ్యింతి బలు చక్కఁదనము కళకు
సాటివత్తురె తెరగంటి చానలైన.
నవరత్నప్రభాధగర్ధగితములగు భూషణంబుల ధరించి యమ్మించుబోడి వేడుకలతో భర్తసమీపమునఁ జిట్టకంబుల వెలయింప నతండు వాని నేమియు గణింపక హరిధ్యానలాలసుండై యొప్పుచుండును. అతని విరక్తి గ్రహించి గోపిక యోపికతోఁ బతిసేవచేయుచుండును. మఱియును.
చ. కనుఁగవమూసి యాతఁడధికంబగు. భక్తిరమేశునామ చిం
తనమొనరించుచుండఁ బ్రమదామణి దాపునఁ దాళవృంతమున్,
గొని తగవీచుఁ బాదములకుం బ్రణమిల్లు నతండు లేచి న
ర్తనమొనరింపఁ దాను ననురక్తి రమాధవుఁబాడు నింపుగాన్ .
మ. త్రిజగన్మోహన రూపసంపదల నుద్దీపించు నయ్యింతి యం
బుజ నాభాంఘ్రిసరోజయుగ్మ భజనాప్తుండై మనోనాధుఁడా
త్మజ కేళీవిముఖాత్ముఁ డయ్యెననుచుం దర్కించిసద్భక్తితో
భజియించున్ సువిరక్తి రాగరహితుం బ్రాణేశునెల్లప్పుడున్ .
అవ్విధం బొరులకుఁ దెలియనీయక కలావతి సంతతము పతిసేవా పరాయత్తచిత్తయై వర్తించుచు నొకన్నాఁ డేకాంతముగాఁ గాంతు నంతికమున వసించి చిఱునగవుమొగంబునకు నగయై మెఱయఁ గరకమలంబులు ముకుళించి యిట్లనియె. ప్రాణేశ్వరా! హరిపాదసేవా నిరతులైన మీచరణసేవ నా కనేకజననకృత సుకృతపరిపాకంబున లభించినది. అందులకు నిత్యము డెందంబున సంతసించుచుందు. మఱియు లోకవాసనాలబ్ధంబగు నభిలాషచే మిమ్మొక్కటి కోరుచుంటి. వినుండు. పుత్రోత్పత్తికై నాయందు వీర్యాధానంబు గావింపవలయు. కామాభిలాష నిట్లడిగితినని తలంపవలదు. మీపాదంబుల తోడు నాకయ్యభిలాషలేదు అని లజ్జావనతవదనయై యడిగిన నతండు సిగ్గును విషాదంబును మనంబుస బెనఁగొన దలవాల్చి యిట్లనియె.
గీ. ఏ నపుంసకుండ నెఱుఁగవో నీవయో
వాంఛలేదు నాకు వనితలందు
నిన్నుఁ జూచిచూచి నే నెదఁజింతింతు
మగతనంబులేమి మగువ! యెపుడు.
గీ. ఒడలునిండంగఁ దొడుగ నీతొడవులెల్ల
కడుపునిండంగఁగుడువ నీ కుడుపులెల్ల
కలుగనీ భాగ్యమది యెంతగాని సతికి
గలుగదించుక రతికేళిఁ గలుగు ప్రీతి.
అని శాస్త్రప్రవాద మున్నది. విలాసవతీ! భవదభినవరూప యౌవన శృంగార విలాసంబులం దిలకించియు ససమర్థుండనగుట, బరిత పించుచుందును. నీవును మదసమర్ధత్వంబు గ్రహించి రట్టుసేయక సతీధర్మంబు నెరవేర్చుచుంటి విది లెస్సయగుతెరు విందులకు దేవతలు మెచ్చుదురు. అది యట్లుండె. నీవిప్పుడు సంతానాపేక్షం జేసి కామాభిలాష సూచించితివి కావున నాయుపదేశంబొండు వినుము. నీ విప్పు డెందేనింబోయి యుత్తమపురుషునివలన వీర్యాధానంబువడసి రమ్ము. దానం బుత్రునిం బడయుదువుగాక. ఇది శాస్త్రదూష్యంబు గాదు. కులాభివృద్ధికై పూర్వు లాచరించిన పని. పురాణముల వ్రాయఁబడి యున్నదని యుపదేశించిన విని యవ్వనితారత్నం బొక్కింతసేపు ధ్యానించి యిట్లనియె.
ప్రాణేశ్వరా! నేను మీయాశయము గ్రహింపక యిట్లడిగినందులకుఁ జింతించుచుంటి. క్షమింపుఁడు మీపాదసేవకన్న నాకు సంతాన మెక్కువదికాదు. ఇఁక త్రికరణముల నామాట తలపెట్టనని పలికిన నతండనునయపూర్వకముగా నిట్లనియె. ప్రేయసీ! నీ వడుగకున్నను నీ కీమాట చెప్పఁదలఁచికొనియే యున్నాను. ఇది తప్పుపనికాదు, మరియొక తెరువునఁ గులాభివృద్ధి బడయఁజూలము పొమ్ము. ఉత్తమపురుషు నరసికొమ్మని పలుకుచు బలవంతముగా నామె నిల్లు కదలించెను.
గోపికయు భర్తృ నిర్బంధమున శుభముహూర్తమున నిల్లువిడిచి యొక మహారణ్యమార్గంబునఁ బడి పోవుచు ,
గీ. వర్ణములకెల్ల గురువు విప్రవరుఁడరయ
నందు సత్కర్మనిరతుఁ డత్యధిఁకుడంత
కన్న శ్రేష్ఠుండు సత్తపఃకరణశాలి
యట్టితాపసుఁడెందు నొప్పారునొక్కొ.
అని తలంచుచు నగ్గోపిక యోపికతోఁ బెక్కు దేశములు తిరిగి తిరిగి యొక్క వనంబునఁ దపోనిష్ఠాగరిష్టుండై యోగధ్యానరతుండై యున్న కాశ్యపుండను బ్రాహ్మణోత్తముంగాంచి గ్రీష్మకాలమధ్యాహ్న మార్తాండతేజమువోలె దుర్నిరీక్ష్యంబగు తదీయతేజంబు గన్నులకు మిఱిమిట్లు గొలుపవెరగందుచు దూరమున నిలువంబడి నమస్కరించుచు,
గీ. ఇతఁడు హరిభక్తుఁడుత్తమ వ్రతరతుండు
బ్రహ్మ తేజఃప్రపూర్ణ విగ్రహుఁడు విప్ర
వంశభూషణుఁ డిమ్మహావరుని బొంది
పడసెదనుగాక సుగుణాఢ్యుఁ గొడుకునేను.
అని తలంచి యమ్మహర్షి స్నానమున కఱుగు మార్గమధ్యంబున శృంగారచేష్టలు వెలయింపుచు వసియించినది. కాశ్యపుండునుకొండొక వడికిఁ దపోనిష్ఠ చాలించి స్నానంబుసేయ నా ప్రాంతమందలి జలా కరంబున కరుగుచు దారిలో దివ్యరూపంబునం బ్రకాశించు నమ్మించుబోడిగాంచి వెరగంది జవ్వనీ! నీ వేవ్వ తెవు? ఎవ్వనిభార్యవు? ఇవ్విపినంబున కేమిటికి వచ్చితివి? సీయొయ్యారంబుసూడ బుంశ్చలివివలెఁ దోచు చుంటివి. దాచక నీయుదంతము చెప్పుమని యడిగిన నయ్యెప్పుల కుప్ప లేచి నమస్కరించుచు నిట్లనియె. దేవా! నేను గోపకులసంజాతను ద్రుమిళుండను గోపశ్రేష్ఠుని భార్యను. నా పేరు కళావతి యండ్రు. నేను భ క్తయాజ్ఞవడువునఁ బుత్రార్ధినై మీకడ కరుదెంచితి. నాయందు వీర్యాధానంబు గావించి మంచికుమారుం దయచేయుఁడు. సర్వభక్షకుడైన పావకునకుం బోలెఁ దేజశ్శాలులకు నేపనివలనను దోసములంటవు. నా యభీష్టంబు దీర్పుఁ డిదియే నాయాగమన కారణంబని ప్రార్థించిన విని యాబ్రాహ్మణుఁడు భ్రుకుటీవికటనిటలుండై కటంబు లదర పండ్లు పటపటం గొఱుకుచు నిట్లనియె.
ఓసి రంకులాడీ ! నీవు నాకు శాస్త్ర ముపదేశించుచుంటివా? చాలుఁజాలు. జ్ఞానదుర్బలుండైన బ్రాహ్మణుఁడు శూద్రపత్నిం గూడినచో చండాలుండగుచున్నాఁడు. దేవపితృకార్యముల నట్టివానిం జీరరాదు. వాఁడు సాలగ్రామము ముట్టికొనఁదగఁడు వృషలీసంపర్కంబు గలిగిన విప్రుండు పిత్రులతోఁగూడఁ గుంభీపాకనరకంబునఁ బీడింపఁబడు. వాఁ డిచ్చిన తర్పణంబులు పిండంబులు మూత్రపురీష తుల్యంబులగుచుండును. శూద్రధరపానంబును గావించిన పాఱుఁడు రౌరవంబునొందు. కావున నీ భోగంబు నే నొల్ల. నీవిలాసంబు నాకడఁ జూపకుము. మఱియొకని నాశ్రయింపుమని పలికిన విని యక్కలికి యులికిపడి సిగ్గు పెంపున నే మాటయుఁ బలుకనేరక ముహూర్తకాల మూరకుండి వెండియు నిట్లనియె.
మహాత్మా ! మత్సంపర్కంబు కల్మషప్రదమని యొల్లకున్న నే నేమిసేయుదాన నాసపడివచ్చిన మచ్చెకంటింగూడిన దోసంబు లేదని లోకప్రవాదముగలదు. మీకిష్టములేకున్న పోనిండు. మత్పూర్వపుణ్యమెట్లున్నదియో యట్లు కాగలదు. శ్రీకృష్ణమంత్రంబు జపించుచు మీకడ వసించెద నాశుశ్రూష కంగీకరింతురే అని యడిగిన నతం డామాట వినిపించుకొనక తటాకంబున కరిగెను.
కలావతియు నమౌనమే యంగీకారసూచకమని తలంచి యయ్యాశ్రమమున కల్లంతదవ్వులోఁ జలాకరము దాపున వసించి కందమూలాదులం దినుచుం గృష్ణమంత్రంబు జపించుచు నమ్మహర్షి దయ కెదురు సూచుచుండెను. కాశ్యపుడు కొన్ని దినము లామెవంక చూడకయే స్నానముచేసి పోవుచుండును. కొన్ని దినము లటు చూచుచు మాటాడక పోవుచుండును. మఱికొన్నిదినము లామె గుణవంతురాలని తెలిసికొని స్నానమున కరుగునప్పుడు గోపీ ! నీ వేమీ తినుచుంటివి. కందమూలాదులవలన నాఁకలి దీరుచున్నదా ? అని పల్కరించి పోవుచుండును.
మఱియొకనాఁ డతండు కొలనికిం బోవుచు వానం దడిసిన పుట్టంబు విప్పి పిండికొనుచున్న యాచిన్నదాని యవయవలావణ్యంబు జూచి హృదయము చలింప నందు నిలువంబడి గోపీ! పాపము రాత్రి వానం దడిసితివి కాఁబోలు పర్ణశాలకు రాలేకపోయితివా ? అని యడిగిన విని చెలఁగుచు నచ్చెలున తళ్కు చూపుల నతనిఁ జూచుచు స్వామీ! మీసాన్నిధ్యంబున నుండ నన్ను జడి యేమి జేయఁగలదు ? ఈసారి వానవచ్చిన నట్లువత్తును లెండని సమాధానము జెప్పినది.
శరచ్చందనిభంబగు నమ్మగువ మొగంబు జూఁచి యతండు చిత్తంబు సంకల్పభవాయత్త మగుటయు సీ ! ఇ దెక్కడి మోహము ప్రమాదమందితినే యని బుద్ధి మరలించుకొని కాసారంబునకుఁ బోయేను. స్నానము చేయుచున్నను ఇంటికివచ్చి కన్నులు మూసికొని జపముజేసికొనుచున్నను నాచిన్నదాని మొగము కన్నులకుఁ గట్టిన ట్లగపడుచుండెను. ఆ దరహాస మా చూపు లా మాటలు దలంచుకొనుచుండ నతని చేఁతినుండి జపమాల జారి నేలంబడినది. అదరిపడి తన ప్రమాదము తెలిసికొని అయ్యయ్యో! ఇదియేమి కర్మము నాచిత్తం బీశ్వరాయత్తముగాక యత్తరుణిమీఁదకుఁ బోవుచున్న దేమి ? సీ ! స్త్రీసాన్నిధ్యంబు తపసులకుఁ గూడదని చెప్పిన మాట తథ్యమగును ఱేపు దాని నీయాశ్రమమునుండి యవ్వలకుఁ బొమ్మని చెప్పెదం గాక యని తలంచుచు నాఁ డెట్టకే మనసుం బట్టికొని జపము గావించుకొనియెను.
మఱునాఁడు స్నానంబున కరుగుచు గోపీ యిటు రా నీకతంబున మాజపంబున కంతరాయము గలుగుచున్నది. నీ విఁక నిందుండ రాదు. ఎందేనిం బొమ్మని పలికిన విని యక్కలికి కలికిచూపుల నతనిం జూచుచు స్వామీ! నే నేమి యపరాధము జేసితీని? మీరు రమ్మన్నను మీపర్ణశాలకు రానైతిని. రాతిరి నా చెక్కిలి యొక్క కీటంబు గఱచినది. ఎట్లు గంటువడినదియో చూచితిరా! అప్పుడుకూడ మిమ్ముఁ బిలిచితినికాను. నన్నేమిటికి బొమ్మనుచుంటిరి? అని చెప్మిన నతండు మణిదర్పణమువలె మెఱయుచున్న యా చిన్నదాని కపోలమంటి చూచి వెనుకటి మాట యంతయు మఱచి మోహావేశముతో అయ్యో! పాపము నీ గండంబు దుండగపు కీటకము గఱచినదా. అక్కటా మిక్కుటముగా గంటు వడినదిగదా. ఇది నీ ముఖ చంద్రబింబమునకుఁ గళంకమువలెఁ గ్రొత్త యందము గలుగఁ జేయుచున్నది. అని పలుకుచు వ్రేళ్లతోఁ దుడిచి పడఁతీ ! నీ వింతటినుండి యీ పచ్చికలోఁ బండుకొనవలదు. మాపర్ణశాలకు రమ్ము. అందలి వేదికపైఁ బండుకొందువుగాక. ఈమాట నీకు వెనుకనేచెప్పితంగాదా! అని పలుకుచు నతండు తటాకంబున కరిగి స్నానముజేసి పర్ణశాలకుఁ బోయెను.
గోపికయు నతని పలుకులు తలుంచి యాహా! ఆ మహామహుని ఱాంతివంటి హృదయము నా కతంబున విచ్ఛిన్నము కాఁజొచ్చినది గదా. మత్కపోలతలస్పర్శంబున నతని మేనఁ బులకలు జనించుట మారవికారముకాక మఱియేమి? అయ్యో దీనివలన నాకు మఱియొక పాపము జుట్టబెట్టుకొనునేమో? మృగమువంటి మహర్షిని స్మరలీలలో దింపుచుంటినే! అని తలంచుచుండ నతండు పర్ణశాలనుండి గోపీ! గోపీ! యిటురా! అని పెద్ద కేక వైచెను.
ఓ! యని పలుకుచు నక్కలికి తదంతికంబున కరిగి ప్రాంజలియై దూరముగా నిలువంబడినది. తదీయ రూపాతిశయ మాపాద మస్తకముగాఁ బరిశీలించినంత నతని మూర్ధ్వరేతస్కత్వ మధోముఖముగా మారినది. అబలా? ఇఁక నీ వా పచ్చికలోఁ బరుండవలదు. ఇందే యుండుము, మద్భుక్తశేషంబు భుజించుచుండుమని పలికిన సంతసించుచుఁ గళావతి క్రమంబునఁ జనువుచేసుకొని దేవతార్చనకై కుసు మంబులఁ గోసికొనివచ్చి యర్పించుచుఁ దరుఁ లతాగుల్మాదుల కాలవాలములు గట్టుచుఁ బర్ణశాల వేదిక లలికి మ్రుగ్గులు పెట్టుచుఁ జెంత గూర్చుండి తాళవృంతమున వీచుచు నతనిశుశ్రూషఁ జేయుచుండెను. .
అతం డనురాగముతో నొకప్పుడు గోపీ! నీ వేమైన బాడగలవా? యని యడిగిన నక్కాంత సంతసించుచు పికస్వర వికస్వర స్వరంబుల మాధుర్యముగాఁ బాడి యా జడదారి మదిం బెడదారిఁ బడఁజేసినది. అమ్మహర్షి యేదియో నెపంబున గోపికం జీరుచుండును. లేనిపోని పనులు కల్పించి పల్కరించుచుండును. క్షణకాలము గోపిక గనంబడనిచోఁ బదిసారులు బిలుచుచుండును. ఇట్లుండ దైవికముగా నెక్కడికో పోవుచు మేనక యాశ్రమమున కరుదెంచి కలావతితో ముచ్చటించుచు నొకనాఁ డందు వసించినది. ఉబుసుపోక యొక లతాడోలికనెక్కి యా దేవకాంత వింతపాటలు పాడుచు నూగుటయు గాశ్యపుండా గానమాలించి స్మారవికారముతో నందు వచ్చి చూడ గాలిచే పలువదొలఁగి తదీయ మృదూరుస్త నజఘనంబులు బయల్పడుటయు నక్కాంచన గర్భాన్వయ తిలకంబునకుఁ దటాలున వీర్యము స్ఖలనమై నేలం బడినది.
అవ్విధంబెఱింగి యక్కురంగటనున్న గోపిక యతిరయంబునం జని పదిలంబుగఁ దత్తేజంబు చేతులతోనెత్తి నిశ్శేషముగా గ్రోలి తన్నుఁ గృతకృత్యురాలిగాదలంచికొనియె. నా కాశ్యపుఁడును దన ప్రమాదము దెలిసికొని వగచుచు అయ్యో! నేనెంత మూర్ఖుఁడ నైతిని! యోగభ్రష్టుండనగుచుంటినను జ్ఞానమే లేక పోయినదే చీ! చీ! పామరుఁడువోలె నీ గోపికమూలమున నా యుర్ధ్వరేతస్కత్వంబు పటాపంచలుచేసికొంటినే! హరిహరీ! యెంతప్రమాదము జరిగినది! మొదట నీమదవలితో నెంతయో చెప్పి చివరకు నగాధకూపములో బడిపోతినిగదా. ఈ స్త్రీసాన్నిధ్యదోషంబు లక్కవంటి నామనసును నిప్పుపలె మెత్తనగావించినది. ఇసిరో మేదోమాంస చర్మాస్థి పుంజంబగు కాయంబుజూచి మోహపడితినే! అహా! యేమి స్త్రీ మోహము. ఎట్టివారినైన మోసముజేయక మానదు. అని నిందించు కొనుచు పో, పొండు మీరిందుండరాదు. అని వారిం కసరి తరిమివైచి తాను స్నానమున కరిగెను.
మేనకయు నేఁటికి బ్రతికిపోయితిని. ఇతండు శపింపక విడిచెనిది పూర్వపుణ్యమేయని ముఱియుచు నాకమున కరిగినది. గోపిక యుఁ త్రిభువన సామ్రాజ్యమబ్బినట్లు సంతసించుచు నమ్మునివరునకు మ్రొక్కి యొకమార్గంబునంబడి తనగ్రామమున కరుగుదెంచి భర్తకు నమస్కరించి చేసిన కృత్యంబంతయు బోధించుటయు నతండు పరిశీలించి కలావతి కిట్లనియె.
క. తరుణీ! నీగర్భంబునఁ
బరమతపోనిష్ఠుఁడైన బాహ్మణు తేజం
బరుదుగ మెఱయుచునున్నది
యురుతేజస్ఫూర్తిఁ బుత్రుఁ డుదయించుఁజుమీ.
ఉ ఏసతిగర్భమందు జనియించునో వైష్ణవసత్తముండ హా!
ఆసతిభర్తయుం గులజులందఱు దివ్యవిమానసంస్థులై
వాసిగ జన్మరోగభయవర్జితమై తగు విష్ణులోకము
ల్లాసముతోడఁ బోవుదు రలంకృతభాసుర దివ్యగాత్రులై .
క. నీకతమున మెఱసెఁగదా
మాకులమెల్లను వెసం గుమారుంగనఁగాఁ
గోకన్తని! తగుధనముం
గైకొని యొక విప్రునింటికడకుం జనుమా!
నీవిఁక శూద్రాన్నంబు గుడువరాదు. బ్రాహ్మణశుశ్రూషా నిరతవై నిరంతరము నియమయుక్తినందు వసింపుము, విష్ణుభక్తాగ్రేస రుండు కుమారుం డుదయింపఁగలఁడని యుపదేశించి నిరతిశయ తపస్సంపన్నుడైన యొకానొక భూసురునకుఁ బోషింప బహు ధన యుక్తముగాఁ దనభార్య నప్పగించి తగులము వదలెఁగదాయని ముఱియుచు తనయాస్థి యంతయు బ్రాహ్మణులకుఁ బంచిపెట్టి విరక్తుండై బదరికారణ్యంబున కుంబోయి యందుఁ గంగాతీరంబున మాసమాత్రంబు యోగంబుపట్టి యెల్లమునులుసూచుచుండ విష్ణు సాయుజ్యమునొందెను.
క. ద్రుమిళుం డింతటివాఁడని
యమివర్యులకైనఁ దెలియదహహా పలుయో
గములం బ్రాపింప నశ
క్యమువైకుంఠము లభించె నతిసులభముగాన్ .
కలావతియు నిలామరునింట వసించి యెవ్వరివలననో భర్తృ మరణ వృత్తాంతము విని యత్యంత దుఃఖావేశముతో విలపించుచు,
క. తనయునిగని వెసరమ్మని
నను నిటకుం బనిచి ప్రాణనాధ! విరక్తిన్
వనమున కేగి సుయోగము
నను దనువుం దొరగు టిది ఘనంబగు తెరువే!
గీ. కొడుకుగాంచి నీదు నొడివెట్టి తగముద్దు
లాడఁజూచి వేడ్క నందఁదలఁతు
నేది లేకపోయె నెవ్వరు మత్పుత్రు
నరసి యింక ముద్దులాడువారు.
చ. సుతుఁగనఁగోరినాఁడు మిము సుందరవేషముతోడఁజేరి నే
రతికభిలాషజేసిన భరంబగు సిగ్గును జింతయుం దయా
ళుతయుఁ దగంగ నన్యు సుకలుం బతిగా భజియింపుమంచుఁ బ
ల్కితి రిది నామనంబును జెలింపఁగఁజేయుచు నుండె నయ్యయో!
క. మీరే పోయిన నింకఁ గు
మారుం డేమిటికి? నాకు మడిసెదను బలా
త్కారముగా నగ్నింబడి
వారక మిముఁ గలిసికొందు వైకుంఠమునన్.
అని దుఃఖించుచు నింధనములం జేర్చి యగ్నింబడఁ బ్రయత్నింప నెఱింగి తద్రక్షకుండైన బ్రాహ్మణుండు వారించుచుఁ బుత్రీ ! నీ గర్భంబున నుత్తముం డగు నర్భకుండున్నవాఁడు. నీవు మృతి నొందిన మహాపాతకముజుమీ! పతీ వియోగదుఃఖంబు సుతలాభంబున మఱతువుగాక యూరడిల్లుమని బోధించి యయ్యుద్యమంబు మానిపించెను.
మఱియు
క. ఆపన్నసత్వయగు నా
గోపిక యాపగిది మదిని గుండంగ నెలల్
బ్రాపించెఁ బొడమె గొమరుఁడు
రూప కళాకాంతి భాసురుఁడు శుభవేళన్.
అప్పుడు పెక్కండ్రు పెద్దముత్తైదువు లరుదెంచి సూతికా గృహంబున మధ్యందినమార్తాండ తేజంబునఁ బ్రకాశించుచున్న యక్కుమారశేఖరుం జూచి యాశ్చర్యమందుచు వాని చక్కఁదన మభివర్ణించుచుఁ దీర్ధములాడించి పాలం గుడిపించుచు ముద్దుపెట్టుకొని పెద్దతడవందుండి యిడ్లకుం పోయిరి.
ఆవిప్రుండును శంఖచక్రాదిరేఖాచిహ్నిత కరచరణుండగు నాడింభకుం గాంచి వానికారణ జన్మునిగాఁ దలంచి పోషింపుచుఁ గ్రమంబున జాతకర్మాదివిధుల నిర్వర్తించి యబ్బాలునకు నారదుఁడని పేరుపెట్టెను. అని చెప్పిన విని గోపకుమారుండు మణిసిద్ధునితో గురువర్యా ! ఆబ్రాహ్మణుఁ డాబ్బాలుండు నారదుని యవతారమని యెఱిఁగి యట్టి పేరు బెట్టెనా యేమి ? చెప్పుఁడని యడుగుటయు నవ్వుచు నయ్యతి యిట్లనియె.
వత్సా! అంతకు మున్నా దేశంబున ననావృష్టిదోషంబు గలిగి యాబాలుఁడు జనించినతోడనే వర్షముగురిసినది. దానంజేసి పండితుండగు నాపాఱుండు వానికి నుదకము నిచ్చినవాఁడని యర్ధమువచ్చునట్లుగా నారదుఁడని పేరు పెట్టెను. అంతియకాని యతండు నారదుని యవతారమని తెలిసికాదు. తెలిసినదా. తరువాత వినుము.
కలావతియు బుత్రలాభంబున భర్తృవియోగశోకంబు గొంత మఱచి తల్లాలనావినోదములతో నొకరీతిఁ గాలక్షేపము సేయుచుండెను. ఆబాలుండును. ననుదిన ప్రవర్ధమానుండగుచుఁ బూర్వజన్మోపాసిత విష్ణుమంత్రంబు మాటలతోనే నేర్చికొని జపించుచు విజ్ఞానయుక్తుండై
సీ. ధూళిధూసరితగాత్రుఁడుగాఁగ నడివీధి
నాడుచు భక్తియై హరిని బాడు
ధూళిప్రోగిడుచు గోపాలవిగ్రహముగాఁ
బూజించు ధూళిచేఁ బూవులనుచు
బుధులు వీధి బురాణములు విష్ణుగాథలొ
య్యనఁ బఠింపఁగఁజేరి యాలకించుఁ
బఠియింపఁజేయు శ్రీపతిమంత్రముల ధూళి
వ్రాయుచుఁ దనతోడి బాలకులను
గీ. చూడ బోయినవారింటి గోడలందు
వాసుదేవునిప్రతిమల వ్రాయుచుండు
తల్లిచంకనయుండి గాత్రములనిండ
గీట్లుగా గీయు హరిమంత్ర కీర్తనముల.
ఉ. ఏమిరవత్స! యందుఁబనియేమి యొనర్చుచునుంటి విందు రా
వేమిరవేగ బువ్వ భుజియింతువుగాకని తల్లి పిల్వ న
మ్మా! మధుసూదనున్ హరిరమాధవు నర్చనసేయుచుంటినిం
దీమెయిఁ బల్కరింపఁదగ దిప్పుడు తీరదునాకు రా ననున్.
ఇట్లు నారదుఁడు బాలక్రీడలయందె విష్ణునారాధించుచుఁ దల్లికిని బ్రాహ్మణునకును నానందము గలుగఁజేయుచుండెను. గోపికయు నోపికతో నాపాఱు నారాధింపుచు నారదుం బెనుచుచు సంతోషముతోఁ గడుపుచుండెను.
అట్లు కొన్నిదివసంబు లరుగునంత నొకనాఁడా బాడబునింటికి నల్వురు మహర్షు లతిధులుగా వచ్చి యతనిచే నర్చితులై తద్భక్తి కి మెచ్చుకొని వారింటఁ జాతుర్మాస్యవ్రతంబు గావించుట కొడంబడిరి. ఆగృహస్థుండత్యంతభక్తితో యధాకాలమునకు ఫలమూలాదు లర్పించుచు సేవసేయుచుండెను.
మఱియు నారదుండును నామునిసత్తములు హరిభక్తులని తెలిసికొని సంతతము వారిదాపునఁ గూర్చుండిజపముఁ జేసికొనుచుండఁదాళవృంతమున వీచుచుఁ దిరిగివచ్చిన పాదములొత్తుచు హరికీర్తనలఁబాడుచుఁ దద్భుక్త శేషముల నేవగించుకొనక కన్నులకద్దికొని భక్షించుచుఁ దల్లితోఁగూడ నామహర్షులకోపినగతి నుపచారములు సేయుచుండెను.
గడియయైనఁ దమ్ము విడువక పరిచర్య సేయుచున్న యాబాలునిభక్తికి మెచ్చుకొని వారిలో నొకఁడొకనాఁడు వానిఁజీరి యోరీ! నీవూరక నిత్యము మమ్మారాధించుచుంటివి. నీయభీష్టమేమని యడిగిన వాఁడుచేతులు జోడించి స్వామీ! నా కేకోరికయులేదు జన్మ తారకంబై న విష్ణుమంత్ర ముపదేశింపుఁడనికోరి కొనియెను. ఆమాట విని యాతపస్విమంచివేళ వానిదాపునకురమ్మని చెవిలో శ్రీకృష్ణ మంత్రముపదేశించెను.
నారదుండామంత్రము సర్వదా జపించుచు వారికి శుశ్రూష చేయుచుండెను. ఒకనాఁడాబాలకునితల్లి గోపిక రాత్రివేళ వీధిలో నడుచుచుండఁ ద్రాచుపాముగఱచి హాపుత్రా! అని యఱచుచు నేలం బడినది. అవ్వార్త విని నారదుండార్త నాదముతోఁబోయి తల్లిం గౌఁగ లించుకొని అమ్మా! నీవు దుఃఖింపకుము. శ్రీహరిం దలంపుము జన్మ జరావ్యాధిశూన్యంబగు వైకుంఠమునకుం బోవుదువుగాక !అనికన్నుల నీరునించుచు నుపదేశించుచుండెను. అంతలో నాబ్రాహ్మణుఁడరుదెంచి జాంగలికులం బిలిపించి చికిత్సచేయించెం గాని విషమువిరిగినది కాదు.
అప్పుడగ్గోపిక నారదునొడిలో నిడికొని యాభూసురునకప్పగించుచుఁ డండ్రీ! నీ ముద్దుముచ్చటలు చూచుటకు నాకును మీతండ్రికిఁగూడ యోగములేకపోయినది. ఈపాఱుఁడే నీకుఁ దండ్రి. అమ్మహర్షులే నీకు గురువులు వీరినాశ్రయించిన నీకుసహాయము చేయుదురు. నేను నిన్ను విడచిపోవుచున్నదాన నామాటలు మఱువవలదని పలుకుచునే ప్రాణములువదలినది. ఆవార్తవిని యమ్మహర్షులువచ్చి దేహవాసనచే దు:ఖించుచున్న నారదు నూరడించుచు తత్వోపదేశముగావించిరి.
పెంచిన బ్రాహ్మణుఁడా గోపికకిపరిసంస్కారములు సేయించి యాకళావతిసుగుణంబు లుగ్గడింపుచుఁ బెద్దగావిలపించెను. నారదుండును దదుపదేశంబునంజేసి విరుక్తుండైతగు ......... లంగదాయని తలంచుచు నమ్మహర్షులవిడువక శుశ్రూషచేయుచుండెను.
ఆవ్రతంబు బూర్తియైనపిమ్మట నమ్మునులు బదరికారణ్యమునకుఁ బ్రయాణమగుచుండ నారదుండును దానుగూడ వారితోఁ బోయెద నన్నుజ్ఞ యిమ్మనిపెంచిన విప్రునిగోరికొనియెను. నీవుచిన్నవాడవు మహారణ్యములు తిరుగఁజాలవు. కొన్నినాల్లిందుండుమని బ్రతిమాలికొనియెను. కాని యతండంగీకరించక ..................... బదరీ వనంబునకుంబోయెను. నారదుండు .................... దాపసో పదిష్టమగు విష్ణుమంత్రంబు జపించుచుఁ బెద్దకాలము తపంబుగావించి శాపదోషంబు వాని మేనువిడిచి క్రమ్మఱస్వస్వరూపముతో బ్రహ్మలోకంబునకుంబోయి తండ్రికి నమస్కరించెను. బ్రహ్మ కుమారుం గౌఁగలించుకొని యాదరించుచుఁ బెండ్లియాడుమని నిర్బంధించెను. ఆవిషయమై యిరువురకు మరలసంవాదము జరిగినది. నారదుండు కాంతల గర్హించుచుఁ బెండ్లియాడనని నిర్భయముగాఁ బ్రత్యుత్తురమిచ్చెను. కానిమ్ము నీచేఁ బెండ్లియాడింపక పోవుదునా చూతువుగా అని తలకంపించుచు నప్పటికూరకొనియెను.
అని యెఱింగించి....
- __________
215 వ మజిలీ.
నారద వివాహము
దమయంతి కథ.
నారదమహర్షి యొకనాఁడు | భాగినేయుండగు పర్వతునితోఁ గూడ భూలోకవిశేషంబులం జూడవేడుకపడి గగనమార్గంబున భరతఖండమునకరుదెంచియందుఁగల తీర్థక్షేత్రారణ్యయ విశేషంబులంజూచుచుఁ దిరిగితిరిగి యొక గ్రీష్మాంతమునఁ జాతుర్మాస్యవ్రతంబు సేయఁదలంచి సృంజయుండను న్యపకుంజరుని గృహంబునకరిగి యతనిచే సన్మానితుఁడై యిట్లనియె. మహారాజా ! మహర్షులకు వర్షకాలమున యాత్రలు సేవించుట దుర్ఘటమగుట నొక్కచో నీనాలుగుమాసములు వసించి వ్రతంబు బూర్తిసేయవలసియున్నది. మీయింటవసించుట కనుకూలమగునే అని యడిగిన సృంజయుం డిట్లనియె.
మహాత్ములారా! మీయట్టి తాపసోత్తముల చరణరజస్సంపర్కంబుఁ బొందనిభవనంబు వనంబుగాదే. మదీయభవనోద్యానవస్తు వాహనాదికములనెల్ల మీయథీనముగావింతు మీయిచ్చవచ్చినట్లు వాడు కొనుఁడు అనుభవింపుఁడు. అనిపలికిన విని నారదుం డిట్లనియె. మహారాజా! ఇట్లనుటకు నీ కే చెల్లును. మాకస్తోకములగు భోగము లవసరములేదు. ప్రతనియమవిశేషంబులకుఁ దగిన పరికరంబులంగూర్ప నేర్పు గలిగిన పరిజనుల నియమింపుము. ఇంతియ చాలునని తెలిపిన నమ్మను