కాశీమజిలీకథలు/పదవ భాగము/213వ మజిలీ
213వ మజిలీ
మాలావతి కథ
క. నారాయణ నారాయణ
శ్రీరాజితవక్ష దేవసేవితచరణాం
భోరుహ కారుణ్యా కూ
పారా క్షీ రాబ్ధిశయన పాలితభువనా.
బ్రహ్మలోకములో నొకనాఁడు సంగీతసభజరిగినది. ఆసభకు రమ్మని దేవలోకములోఁ బ్రసిద్ధివడసిన వైణికులకెల్లఁ బత్రికలువచ్చినవి. ఉపబర్హణుఁడు విమానమెక్కి యాగానసభకుఁబోయెను. ఉపబర్హణుని గీతప్రావీణ్యము మూడులోకములు వ్యాపించినది. అతండుండ మరియొకగాయకుఁడు నోరుమెదల్పఁ జాలడు. ఆసభలోఁగూడ నతండే వీణాగానంబున శ్రీహరిం గీర్తించుచు సభ్యులచే మెప్పువడసెను. తరువాత సభ్యులకుల్లాసము గలుగఁజేయ రంభచే నందు నాట్యము జేయించిరి. అప్పుడు,
చ. వలఁబడినట్టి జక్కవకవం బురడించి మెఱుంగుపైఁటలో
గులుకుమిటారిబోటి చను గుత్తులనట్టె నలంతిగాలిఁ బై
వలువఁదొలంగఁజూచి యుపబర్హణుఁడంగజబాణతప్తుఁడై
స్ఖలనమునొందెఁగన్కొని పకాపకనవ్విరి వేల్పులెల్లరున్ .
గీ. రంభకన్నను గడునభి రామలైన
రామలెందరొ కలుగభార్య లుగ నతఁడు
రంభకుచకుంభములఁగాంచి భ్రాంతిపడియె
పరతరుణులన్న రహిగాదె పురుషులకును.
మూలమునఁగాని యాత్మీయ సామర్థ్యము వెల్లడికాదని తలఁచి యతనినుద్దేశించి యిట్లనియె.
గీ. బ్రహ్మసభయంచునించుక భయములేక
నిట నసభ్యప్రవర్తన లెసఁగఁజేసి
తనయమతిఁగాన గంధర్వతనువువిడిచి
శూద్రయోని జనింపుమా క్షోణియందు.
అని శపించుటయు నుపబర్హణుఁడాత్మీయ ప్రమాదవిధానంబు తెనిసికొని లజ్జావనతవదనుఁడై దోసిలివట్టి,
గీ. అట్లెమీయాజ్ఞశూద్రుండనగుదుఁగాక
యపుడు శ్రీమన్ముకుందపాదారవింద
భక్తియేమరకుండఁగ వర మొసంగు
మిదియపదివేలు నాకులోకేశయనిన.
నీయభీష్టప్రకారంబె కాఁగలదని పలికి జలజగర్భుండతని వీడ్కొలిపి నుపబర్హణుఁడు క్రమ్మరనింటికి వచ్చి శాపప్రకారంబు భార్యల కెఱింగింపక వారితోఁగూడ విమానమెక్కి మలయపర్వతమునకరిగి విశాలరమణీయలతావేష్టితమగు నొక శిలాఫలకంబునం గూర్చుండి భార్యలకందలి వినోదంబులఁ జూపుచున్నంతలో,
క. తలనొప్పివచ్చె మేనికి
బలువేకిజనించె మిగులబడలికదోపన్
గలఁగియతఁడొక్క చెలితొడ
దలగడగాఁజేసికొని వెతన్‌శయనించెన్.
అక్కాంత కొంతసేపటికి లేచి యతనిమోము జూచుచు లేవనెత్తి యురంబున వైచికొని యవయవముల ముట్టుచు గడ్డముపట్టుకొని జీవితేశ్వరా ! యొక్క సారి మాటాడుము. అమృతమును దిరస్కరించు పలుకుల మమ్మొకమాటు అలరఁజేయుము హా! విదగ్ధ రసికప్రవరా ! హా సుందరమూర్తీ ! హా విష్ణుభక్తాగ్రేసరా ! మమ్ము విడిచియరగడియ తాళకుందువే అయ్యో, నీవియోగమెట్లు సైతుము మాలతీలతావిలసితములగు గంధమాదనశైలతటంబుల మలయపర్వతంబున జందనప్రవాళ తల్పంబుల మనోహరసరస్సికతాతలంబులఁ గోకిలలు గూయ నీవు గావించిన రహః క్రీడలెట్లు మఱచువారము ? అక్కటా! ఇంతలో మాకీవంతవచ్చునని యెఱుఁగకపోతమే. స్త్రీలకు బతివియోగము కన్న దారుణమగు విపత్తి మఱియొకటి లేదుగదా. ఇతర దుఃఖము లెన్ని యైనఁ బతింగలసికొనిన నట మటయైపోవును. అని దుఃఖించుచు నంతలో నత్తలోదరిశోకోన్మత్తయై తత్తరముతో నాకసమువంకఁ జూచి యంజలివట్టి యో దేవతలారా ! ఓదిక్పతులారా! త్రిమూర్తులారా ! మీరు మీభార్యలతో నెట్లు సుఖింతురో నాభర్త నాతోనట్లు సుఖింపరాదా ! ఈవియోగమేమిటికి గలిగించితిరి? కరుణించి నాభర్తం బ్రతికింపుఁడు ఏమంటిరి ! పల్క రేమి ! ఔను సామంబున నెవ్వరు నుపకారము సేయరు కానిండు. ఇఁక నాప్రజ్ఞజూపించెదఁ గాచికొనుఁడు అరే! వేల్పులార ! మీరు యజ్ఞభాగములఁ గుడిచి మత్తిల్లి యొడలెఱుంగకున్నారు తృటిలో మీనోఁటియన్నము పడగొట్టెదఁ జూడుఁడు! దామోదరా? నీవు జగదీశుండవని యెఱుంగుదు నామొర విని నాపతిం బ్రతికింపక పోయితివి. ఇఁక నీగొప్ప నాకేమిటికి ? పతివియోగదుఃఖావేశంబున నేను యుక్తాయుక్త వివేకశూన్యురాలనై యున్నాను. నీయధికార మూడ నిన్నుఁ గూడ శపింపకమానను. చతురాస్యుఁడా! నీవిది వఱకే యపూజ్యుఁడవై యున్నావు, ఇప్పుడు నేను గావించు ననర్థము తెలిసికొనుము నీయధికార మూడఁబెఱికి కుండలుజేయు కుమ్మరవానిఁ జేయుదుఁ జూడుము. శంకరా! నీ పేరు నేతిబీరకాయవంటిదే యైన దేమి? నాకుఁ బతిసుఖము లేకుండఁజేయుదువా ! నీవు మృత్యుంజయుఁడవై యొరులకు మృత్యువు నప్పగింతువా ! నిన్ను జ్ఞాన శూన్యుఁజేయఁదలఁచుకొంటి నెఱుఁగుము. యముఁడా ! నీవు ధర్మరాజని పేరుపెట్టుకొంటివి. నీధర్మ మేమూల దాచితివి ! నాబతిం గడతేర్చితివే ! ఆయనధర్మ లోపమేమి గావించెనో చెప్పుము. నీకడ మృత్యువు గాలుడు నున్నారఁట వారినెల్లఁ గుటుంబముతో నాశనము జేసి లోకోపకారము గావించెద నిన్ను స్థానభ్రష్టుం గావింతు సూర్యచంద్రాదుల గతులెట్టుసాగునో చూచెదం గాక నిలువుఁడని పెద్దయెలుఁగునఁ బలుకుచు నమ్మహాపతివ్రత వారినెల్ల శపింపం దలంచి యురంబునుండి పతిశవంబు మెల్లన నేలంబరుండబెట్టి స్నానముజేయఁ గౌశికితీరంబున కరిగినది అప్పుడు,
చ. గడగడలాడె లోకములు గంపమునొందెఁ గులాచలంబులున్
వడఁకె సమస్తదిక్కులును వార్థులుఘూర్ణిలెఁబంకిలంబులై
దడఁబడె దిగ్గజంబులు వితాకుపడెన్ ఫణినేతవేల్పులం
గడఁకశపింపఁ గాంత యుదకంబులచెంతకుఁ జేరునంతలో.
అప్పుడు బ్రహ్మరుద్రేంద్రాది దేవతలా యుపద్రవ మెఱిఁగి శ్రీమన్నా రాయణునికడ కరిగి యిట్లు విన్నవించిరి. అందు ముందు యముండు కరకమలంబులు ముకుళించి తన ప్రభుత్వము నుద్దేశించుచు నిట్లనియె.
సీ. దురితాత్ములైననను మరణకాలమున మీ
పేరెన్నికొనినంతఁ జేర రాదు
నరకార్హులై యొప్పినను శంభుపూజ నిం
చుక చేయవారిఁ జేర్చుకొనరాదు
కాలంబుమూడినగాని పోయిపతివ్ర
తలభర్తలను దేరఁ దలఁపరాదు
బ్రహ్మవ్రాసినయట్టి బ్రదుకు చెల్లినను దా
పసకుమారులఁజేరి పట్టరాదు
గీ. అరసి మాకున్నయధికార మనుసరించి
చేయుటయుఁ దప్పులగుచుండఁ జెడ్డయేదొ
మంచియేదియొ ధర్మసూక్ష్మంబు దెలియ
సంకటంబయ్యె నిఁక నెట్లు జరుగు ప్రభుత.
మహాత్మా! నే నీ యధికారము సేయజాల. తవంబునకుం బోయేద నిప్పనికి మఱియొకని నియమింపుము, అయ్యయ్యో బ్రహ్మ శాపదగ్ధుండగు నుపబర్హణునిం బట్టికొనుటకు వ్యాధిపుంజంబులం బంపక కాలపురుషు సహాయమిచ్చి మృత్యుకన్యంబంపి రప్పించుకొంటి. నందులకై యలిగి యతనిపత్ని మాలావతి మృత్యుకన్యా కుటుంబముతో నన్ను మఠోద్వాసన జేయుటకు సంకల్పించుకొన్నదఁట, ఈమృత్యుకన్యక యన్నముతినక బెంగపెట్టుకొని సకుటంబ ముగా నాకడకువచ్చి మొఱ్ఱవెట్టుకొనుచున్నది. మేమందఱ మవ్వలఁ బోయెదము సెలవిండనిపలికె ననంతరము పరమేష్ఠి యిట్లుస్తుతించెను.
చ. బళిర! పతివ్రతా ప్రధితభాసురతేజము కాలదారుణా
నలముగతిం దహించె భువనంబులనన్నిటిఁ జూడుమేల్లవే
ల్పులకును మాకునుం భయముపుట్టగఁ జేయుచునున్న దయ్యయో!
తెలిసి యుపేక్షసేయుటిది దేవరకుందగునే రమాధవా!
అని బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు ప్రార్ధించుటయు నారాయణుఁడు నారి కభయహస్తమిచ్చి వారినెల్ల వెంటబెట్టుకొని బ్రహ్మచారి వేషముతో నమ్మహాపతివ్రతయున్న నెలవునకుంబోయి-
సీ. ఉరమునన్ జీవితేశ్వరు శవంబల్లన
బూని దక్షిణ హస్తమునఁదదీయ
వీణార్కమాలల వ్రేళులదాల్చి కాం
త ప్రీతి యోగముద్రను ధరించి
సారెకుఁ బలిముఖాబ్జము శుభేక్షణములఁ
గనుచు నద్భుత తేజమున దనర్చి
వహ్నిశుద్ధంబైన వస్త్రంబు రుచి శర
త్కౌముదీ రుచిరాంగ శాంతిఁ దెలుప
గీ. పోడశాబ్దవయః పరిస్ఫురిత యౌవ
నమున నొప్పుచు మణిమండనములతోడ
మోముదామర దిలకంబు ముద్దుగులుక
తనరు మాలావతిని గనుంగొనియె శౌరి.
అట్లు చూచి తలయూచుచు నెఱుఁగనివాఁడుంబోలె బ్రహ్మాది దేవతల మీరిందేల వచ్చితిరని పల్కరించుచు మాలావతి నుద్దేశించి యిట్లు వలికెన. బ్రహ్మచారి — సాధ్వీమణీ ! నీవెవ్వని కూఁతురవు? ఎవ్వని భార్యవు? నీ పేరేమి?
మాలావతి — వటూత్తమా! ఆనందపూర్వకముగా విప్రరూపుఁడగు జనార్దనునకు నమస్కరించు చున్నాను.
బ్రహ్మ - స్వస్తి తేస్తు. సౌభాగ్యవతీభవ.
మాలావతి — మహాత్మా ! నీమాట సత్యమగుఁగాక. విను మేను చిత్రరథుని కూతురను. ఉపబర్హణుని భార్యను నాపేరుమాలావతి యండ్రు.
బ్రహ్మ – నీవీశవంబు నిట్లురంబున వహించియుంటివేల?
మాలావతి — ఈతండు నాపతి అకస్మాత్తుగా మృతినొందెను. సతులకుఁ బతులయందెట్టి యనురాగముండునో విద్వాంసుఁడవగు నీ వెఱుంగకపోవు.
బ్రహ్మ - ఎంతయనురాగమున్నను సతి పతిశవంబు దాల్చి యుండునా?
మాలావతి -- నాభర్తశవముగాదు. ఈతనిం బ్రతికింపవలయు నని వేల్పులంబ్రార్ధించుచుంటి. శుభాశుభ కర్మఫలంబుల దేవతలిచ్చుటకు కర్తలు. కర్మవృక్షచ్ఛేదముసేయుటకుఁ గూడ వారికధికారమున్నది. నాకు వారు పతిభిక్షబెట్టినలెస్సయే. లేకున్న వారిదారుణశాపపాత్రులం గావించెద.
బ్రహ్మ — తల్లీ! దేవతలు కర్మఫలంబిచ్చటకుఁ గర్తలేకాని వానివెంటనే యీయఁగలరా? కాలపక్వము కావలదా? కృషికుండు విత్తనముచల్లినతోడనే ఫలించునా? సుఖదుఃఖములు పూర్వజన్మకర్మ ఫలంబులని నీవేచెప్పితివిగదా. అందులకు దేవతలేమిచేయగలరు? విర్హేతుకముగా దేవతలశపించినఁ బ్రయోజనమేమి? మాలావతి -- వటూత్తమా! ఎట్టివారికిని స్వకార్యమునకై ప్రయత్నించుట సహజము కార్యతత్పరులు భావాభావములఁ దెలిసికొనజాలరు. నాభర్తం బ్రతికింపకపోయినచోఁ దప్పక వేల్పులనెల్ల శపింపకమానను నాశాప మెవ్వఁడడ్డము సేయునో చూతుగాక.
బ్రహ్మచారి — అమ్మా! మాలావతి! నీవుమహాపతివ్రతవు. నీశాప మమోఘమని యెఱుఁగుదును. ఇంచుక నిదానించుము నాకు సర్వరోగచికిత్సలుం దెలియును. ఏడుదివసంబులక్రిందట మృతినొందిన వానిం బ్రతికింపఁగలను నీభర్త యేరోగముచేత మృతినొందెనో చెప్పుము. మృత్యుజరావ్యాధిపుంజములు నావశములోనున్న వి. నీవు కోరినవానినెల్ల రప్పించి నీయెదుటఁ బెట్టెదను.
మాలావతి - (మోమెత్తి యతనింజూచి) మహాత్మా! నీవు ప్రాయంబున జిన్న వాడవైనను యోగవేత్తలకన్న బ్రౌఢముగాఁ జెప్పుచుంటివి. నీవునాపతింబ్రతికింపఁగలవు సంతోషమయినది. ఏరీ కాలమృత్యుకన్యాదుల రప్పింపఁగలనని చెప్పితివి. వారినొకసారినాయెదుట బెట్టుము కొన్ని మాటలడిగెదంగాక!
బ్రహ్మచారి - వారినెల్లంజీరి రప్పించి యామే యెదుట నలువంబెట్టి,
ఉ. నల్లనికాంతిగల్గి యరుణంబగు వస్త్రములంధరించి హా
సోల్లసితాస్యమొప్పఁద్రియుగోరు కరంబులతోడ భీతినం
ధిల్లగఁజేయు రూపున ననేకులు వ్యాధిసుతుల్ భజింపఁగా
నల్లదెమృత్యుకన్య కనుమా! పతికాలునిమ్రోలనిల్చెడిన్ .
సీ. ఆఱుమోములు పదియాఱుబాహువులు ని
ర్వదినాల్గునేత్రముల్ బాదషట్క
మమర గ్రీప్మోరుమార్తండ తేజముగల్గి
యసిత దేహచ్ఛాయలెసఁగమెసఁగ
వికట దంష్ట్రాభయానకరక్త నేత్రుఁడై
రత్తాంగరాగవస్త్రములుదాల్చి
సర్వసంహారదక్షస్వరూపముతోడ
వెలయుకాలుఁడువీఁడె కలికి! చూడు
గీ. మరసివరియించె మృత్యుకన్యాలలామ
వీనిమున్ను స్వయంవరవిధులనితఁడు
జమునకుహితుండు వ్యాధిపుంజములనెల్ల
గడుపునిండంగ మున్ను దాగన్న తండ్రి.
క. ఆలమృత్యుకన్య చెంగట
నిలిచి మహావృద్ధులయ్యు నిపుణత శిశువుల్
వలెఁ బాలుగ్రోలుదురు వ్యా
ధులువారదె జనకునూత దుర్జయులుసుమీ.
క. యముఁడీతఁడు ధర్మా ధ
ర్మములెఱిఁగినప్రోడ చూడు మధురాధర! రో
గములును మృత్యువు కాలుఁడు
సమముగనడిపింతు రితని శాసనమెపుడున్.
సాధ్వీ! ఆమెమృత్యుకన్యక పెద్దకూతురు జరాదేవి. ఆమువ్వురు వాతపైత్య శ్లేష్ములు కుమారులు వారందఱు ఆసంతతివారే వారి నే దేవియడుగఁ దలంచిన నడుగుమని పలికినవిని యక్కలికి తొలుత యము నుద్దేశించి.
మాలావతి - ధర్మరాజా! నీవు సమస్తధర్మముల నెఱింగిన వాడవుగదా? నాభర్తనేమిటికి మృత్యువశుంజేసితి? నీకుజాలిలేదా!
యముఁడు - అమ్మా! మాలావతి! కాలము మూఁడనివాని నెవ్వరుఁజంపనేరరు. కాలపురుషునియాజ్ఞ బూని యతనిభార్య మృత్యు కన్యక జంతువులసమయించుచుండు. కావున నీమాటకు మృత్యు కన్యయె బాధ్యురాలు నా కేమియుందెలియదు.
మాలావతి – (మృత్యుకన్యకంజీరి) ఓసీ మూర్ఖురాల నీయాకారము చూచినంతనే ప్రాణములుపోవఁ గలవు. నీవాఁడుదానవు కావా? భర్తృవియోగదుఃఖమెట్టిదో నీకుఁదెలియదా? నాభర్తనేమిటికిఁదీసికొని పోయితివి! దారుణశాపంబున నిన్ను నాశనముజేసి లోకముల కుపకారము గావింతుఁ జూడుము.
మృత్యుకన్య - (గడగడవడంకుచు) తల్లీ ! పరమేష్ఠి యిట్టి దారుణకృత్యములు సేయుటకే నన్ను సృష్టించెను. తేజస్వినివగు నీ యట్టి మహాపతివ్రతయే నన్ను భస్మముసేయ సమర్ధురాలగుచున్నది. నన్ను నాశనముజేయుము. భువనంబుల కుపకారమగుఁగాక. అమ్మా నా కేమియు స్వతంత్రములేదు నాభర్తయగు కాలపురుషునిచేఁ బ్రేరేపింపఁబడి ముందుగా బిడ్డల ననిపి తరువాత జీవకోటిని వశముజేసికొందును. ఇదియే నాపని నీభర్తను స్వతంత్రించి నేను దీసికొనిరాలేదు. ఆకారణము నాభర్తనే యడుగుము.
మాలావతి --- (కాలపురుషుం జూచి) ఓయీ! నీవు కర్మ సాక్షివి సనాతనుఁడవు. నారాయణాంశము నీయందున్నది నీకు నమస్కరించుచున్నదాన. నాభర్త నేమిటికి నీభార్య కప్పగించితివి ? ఈద్రోహకృత్యము నీవే చేసితివని యందఱు నీపై త్రోసివేసిరి. తగు కారణము సెప్పకున్న నిన్ను భస్మముజేసెద నాసామర్థ్య మెఱుఁగుదువా?
కాలపురుషుఁడు - తల్లీ! నీభర్తను దీసికొనిపోవుటకు నే నెవ్వఁడను? ఈమృత్యుకన్యక యెవ్వతె. యముఁ డెవ్వఁడు? వ్యాధులేమి చేయఁగలవు ? ఇందులకు మాకే స్వతంత్రమున్నచో రెండుగడియలలో బ్రహాండములన్నియుఁ గబళింపకపోవుదుమా ? ఏపరాత్పరునికి బద్ధులై సూర్యచంద్రులు పంచభూతములు సంచరించు చున్నవియో మహామాయ యెవ్వని స్వాధీనములోనున్నదియోఎవనియాజ్ఞ బ్రహ్మ సృష్టించునో రుద్రుఁడు లయముజేయునో యట్టి నారాయణునియాజ్ఞ లేక యెవ్వరు నే పనియుఁ జేయజాలరు. నీవు నిజము దెలిసికొని మమ్ము శపింపుము.
మాలావతి — (వారిమాటలు విని యాబ్రహ్మచారి మొగము చూచుచున్నది)
బ్రహ్మచారి – (నవ్వుచు) సాధ్వీ ! నీవు వీరి మాటలన్నియు వింటివిగదా! వీరిలో నీభర్తను హరించినవాఁ డెవ్వడో చెప్పుము వానిని శిక్షించెదంగాక. మఱియు నన్నేమియడిగెదవో యడుగుము.
మాలావతి — స్వామీ! వారి యధికారపుమాటలు వారు సెప్పెరి. వారితో నాకునిమిత్తములేదు. నీవు మొదట నాభర్తం బ్రతికించెదనని శపథముజేసితివి. అమాటయేనిలుపుకొనవలయును.
బ్రహ్మచారి -- వేల్పులారా! మహాపతివ్రతయగు. మాలావతి తనభర్తంబ్రతికింపవలయునని కోరుచున్నది. లేనిచో లోకముల భస్మము జేయునఁట. సతీశాప మమోఘముగదా. పరమేష్టీ! కర్తవ్య మేమియో చెప్పుము.
బ్రహ్మ – వటూత్తమా! నీవెవ్వఁడవో మాకుఁ దెలియదు వాక్పటుత్వముగలవాఁడ వగుదువు. మానిమిత్తమువాదించి యామె కోపము జల్లారఁ జేసితివి.
ఈగంధర్వకుమారుండు నా ---------------------- మఱి కొంతకాలమువఱకు నాశాపంబంటకుండఁ జేయఁగలను. ఇప్పుడీయాపద దాటినపిమ్మటం జూచుకొందముగాక. అనిపలుకుచుఁతన కమండ లూదక మతనిపైఁ జల్లినంత నతఁడు గదలఁజొచ్చెను. శివుండు జ్ఞాన మిచ్చెను. వహ్ని జఠరాగ్ని, కాముఁడు కామబలము, వాయువు ప్రాణములు, సూర్యచంద్రులు దృష్టులునిచ్చిరి వేల్పులెల్ల తమతమ సామర్థ్యాను సారముగా జీవనోపాధిగలుగఁ జేసిరి. కాని చైతన్యము గలుగలేదు. ఆత్మాధిష్టాతలేక పోవుటచేత బోధత్వము గలిగినదికాదు. అప్పుడు పరమేష్ఠి మాలావతితోఁ దల్లీ! నీవు శ్రీవిష్ణుంగీర్తింపుము. ఆయనశకి, బ్రవేసించినంగాని నీభర్తకుఁ జైతన్యముగలుగదు. మాకాసామర్థ్యము లేదు. మామాశక్తుల నిచ్చితిమని పలికిన విని యక్కలికి యలరుచులేచి స్నానముజేసి శుచియై యంజలిపట్టి యిట్లు స్తుతించినది.
గీ. ఎవఁడు లేకదేహులెల్లను శవములై
పోదురట్టి పరమపురుషుసర్వ
హేతుమూల హేతు నీశ్వరుసభవు న
నంతునాత్మఁ బ్రస్తుతింతునెపుడు.
గీ. ఎల్లరునుసేయు కర్మలకెల్లసాక్షి
యగుచు నిర్లిప్తుఁడై వానియందు నెప్పు
డెల్లకడ నిండియుండియు నితరులకు నొ
కింతయునుగానఁ బడని పరేశుఁగొలుతు.
అని వినుతించుచు నా వట్టూత్తముని పాదంబులంబడి మహాత్మా! నీవే సర్వాధిష్టాతవు. రక్షింపుమని ప్రార్ధించినది.అప్పుడు విష్ణుండు సర్వశక్తులతోఁగూడ నధిష్టానముగా నాయుపబర్హణుని దేహములోఁ బ్రవేశించెను. నిద్రితుండు మేల్కొనినట్లుపబర్హణుం డట్టెలేచి చెంగటనున్న మాలావతిజూచి ప్రేయసీ! నేను బండుకొని చాలసేపైనది కాఁబోలు లేపితివికావేమి? అని యడిగిన నాచేదియ యతని యడుగుల నంటి ప్రాణేశ్వరా! మీకుఁ జెప్పవలసినది చాల గలదు. స్నానముజేసి రండని ప్రార్ధించినది.
అతండు లేచి కౌశికీనదిం గృతావగాహుండై ధౌతవస్త్రంబు ధరించి వీణంగైకొని శ్రీహరి నిట్లు గీర్తించెను. పంచచామరము. హరే హరే హరే హరే సితాంబరాయతేనమో
సురేశముఖ్య సర్వదేవ సుందరోత్తమాంగ స
త్కిరీటదీప్త పాదపీఠ దివ్యమంగళ స్వరూ
ప రాజీతాపరాజితారి పంచచామరస్తుతా.
అని భజియించుచు మాలావతివలనఁ దన మరణవృత్తాంతము విని యందున్న దేవతా బృందములకు వందనంబొనరించుటయువారందఱు నాదంపతుల నాశీర్వదించుచు బతివ్రతా ప్రభావమింతయొప్పునే యని యచ్చెరువందుచు సంతోషముతో నిజనివాసంబులకుఁబోయిరి.
మాలావతి చెల్లెండ్రతో భర్తతో నింటికిం జని యత్తమామల కావృత్తాంత మెఱింగించి బ్రాహ్మణుల కనేక దానములు గాంవిచినది. అనేకవ్రతములు సేసినది. మరికొన్నిసంవత్సము లాయుపబర్హణునితో సంతోష మనుభవించినది అని యెఱిఁగించి... పై మజిలీయందిట్లు చెప్పదొడంగెను.
- _________
214 వ మజలీ.
నారదుని దాసీ పుత్రజననము.
కలావతి కథ
గీ. వరములిచ్చిన దేవతావరులు వచ్చి
శూద్రయోని జనించుట సురుఁగదయ్యె
బ్రహ్మశాపప్రసక్తి నారదమహర్షి
కరయ విడుచునే ప్రారబ్ధమవని జనుల.
కన్యాకుబ్జదేశంబున కధినాయకుండై ద్రుమిళుండను గోపా