కాశీమజిలీకథలు/పదవ భాగము/212వ మజిలీ

వికీసోర్స్ నుండి

212 మజిలీ.

ఉపబర్హణునివివాహము.

అరవింద - ఆచార్య! తుంబురా! నేఁడు సంగీతసభాదివసమగు గదా! ఇంకను శయనగృహము వీడకుంటిరేల? సూర్యోదయమగుచున్నది. అప్పుడే సంగీత విద్యావిశారదులందఱు సభాస్థలమున కరుగుచున్నారు. లెండు లెండు.

తుంబురుఁడు - (కన్నులు నులిమికొనుచు లేచి నిట్టూర్పుతో) అరవిందా! సూర్యోదయ మగుచున్నదా? కానిమ్ము. నేఁడు మన మా సభకుఁబోవకునికియే శ్రేయమని తోచుచున్నది.

అరవింద - స్వామీ! అట్లునుచున్నా రేమి? మీశిష్యురాండ్ర మందరము ప్రధమపారితోషిక మామహతి మీచేతంబడునని యనుకొనుచున్నామే సభకేపోవలదందురేల? మీముందరనిలిచి పాడెడి వైణికుఁ డెవ్వఁడుగలఁడు? మీకాదైన్యమేలగలుగవలయును?

తుంబు - నిన్న నీవాసభకు రాలేదాయేమి?

అరవింద - లేదుసామి. లేదు. క్రొత్తగీతములనాలపించుచున్నాను.

తుంబు - అందులకే అట్లడుగుచున్నావు. మనకిఁక నాలాపములుకావు విలాపములే.

అరవింద - నిన్నటిసభలొ నేమిజరిగినదిసామి!

తుంబరు-క. ఉపబర్హణుఁడఁట భళి మన
                మెపుఁడెఱుగమువానిఁజూచి యింతీ! తద్గా
                నపరిశ్రమ మీవిధమని
                నిపుణతఁబరికింపఁ దెలియనేరముకాదె.

గీ. రమణి! గంధర్వకులభర్త రత్న కేతు
   నందనుండఁట యట్టిగానప్రశస్తి
   యెందునేర్చెనో దేశికుండెవఁడొవాని
   కహహ! తత్కల్పితము లగమ్యములుసూవె.

అరవింద - అయ్యో! గానవిద్యా మహామహోపాధ్యాయులైన మీరే యిట్లు మెచ్చుకొనుచుండ నగ్గంధర్వకుమారుని గాన పాండిత్యం బనన్యసామాన్యమని తెలియఁబడుచున్నది. అతనిపేరు పట్టికలో వినియుంటి మిక్కిలి చక్కనివాఁడనియు హరిభక్తుండనియుం జెప్పిరి. కాని సంగీతములో నింతవాఁడని యెవ్వరును దెలిపి యుండలేదు.

తుంబురు—త్రిలోకమోహజనక రూపుఁడగుఁగాక. హరిభక్తుఁడగుఁగాక దాన మన కేమి? అట్టియద్భుత గాన కౌసల్యమెట్లునేర్చెనో తెలియదు. నిన్న నొక్కగీతముపాడి తన ప్రావీణ్యము తెలియఁ జేసెను. నేడెంత ప్రగల్భముజూపునో తెలియదు కానిమ్ము వేళ యగుచున్నది.

నీవీ వీణఁబట్టించుకొని సభకుఁబొమ్ము. రాజపుత్రికలు నాకై వేచి యుందురు వారిందోడ్కొని వచ్చెద.

అని తుంబురుఁడు శిష్యరాలగు నరవిందకు నియమించి తాను రాజపుత్రికలయంతఃపురమున కరగెను. అప్పుడు చిత్రరథునికూఁతురు మాలావతి చెల్లెండ్రతోఁగూడికొని యుపబర్హణుఁడు పాడినస్వర విశేషంబులఁ బాడఁ బ్రయత్నించుచుండెను. అలవడినవికావు. అంతలో సంగీతోపాధ్యాయుఁడు తుంబురుఁడు వచ్చెననువార్త విని సంతోషముతో నార్యా! నిన్న నాగంధర్వకుమారుఁడుచేసిన స్వరకల్పనలెట్టివో యని విమర్శింపఁజేతగాకున్నవి. ఆమెలకువ మా కెఱింగింతురా ! అతఁ డేపాటి గట్టివాఁడు? అని యడిగినఁ దుంబురుఁ డిట్లనియె. మాలావతీ ! ఇప్పుడు వేళచాలదు. తరువాత నారహస్యము లెఱింగింతు. సభకుఁ బదుఁడు. అతండెట్టివాఁడో నేడు తెలియఁబడుఁ‘గాదె. ఇప్పుడు చెప్ప నేల? అనిపలికి యటఁగదలి సామాన్య వేషముతో నువబర్హణునిబసలోని కరిగెను. అందొక వీణ సవరించి యాలాపించుట కమరింపఁబడి యున్నది. తుంబురుఁడు అందున్న శారదుం బల్కరించి యుపబర్హణుం డెందున్న వాఁడని యడుగుచు నావీణనంటి తంత్రులమ్రోగించి మెట్లుపరికించి యాప్రస్తారప్రకార మేమియుం దెలియక సిగ్గుపడుచు దిగ్గునమరలి నీవెవ్వండ వెందులకువచ్చితివని శారదుఁడడుగుచుండ వినిపించుకొనక మెల్లగా నవ్వలకుఁబోయెను.

అంతలో నలంకరించుకొని యుపబర్హణుఁడు: మేడదిగి వచ్చి శారదునితోఁగూడ బండియెక్కి సభాభ్యంతరమున కరగి యొకపీఠంబునఁ గూర్చుండెను. తోడనేయతని పరిజనులావీణఁ దెచ్చి ముందరిపీఠంబున నునిచిపోయిరి.

అసభ విశ్వకర్మచే నిర్మింపఁబడినదగుటఁ బీఠములచే విచిత్రముగా బ్రస్తరింపఁబడియున్నది. సంగీత ప్రసంగముచేయఁగలస్త్రీలును బురుషులు గరుడగంధర్వసిద్ధవిద్యాధరాదులు దిక్పతులు యధాగతముగావచ్చి సభ నలంకరించిరి. పిమ్మటఁ బార్వతీపరమేశ్వరు లగ్రపీఠముల నధివసించిరి. చిత్రరథుండును భార్యయు నిరుగడల నిలిచి వింజామరలు వీచుచుండిరి.

నవరత్న ఖచితమై యద్భుతతంత్రీకలితమైన మహతియను విణారత్న మొకండెత్తుపీఠంబున మెఱయుచున్నది. అదియే పార్వతీనిర్మితమగు విపంచియని యెల్లరువిస్మయముతోఁ జూచుచుండిరి. సభ యంతయు నిండినపిమ్మటఁ బార్వతీపతి యనుమతిని బృహస్పతి లేచి యెల్లరు విననిట్టుపన్యసించెను. సభ్యులారా! గంధర్వులకుఁ గులవిద్యయగుట సంగీతమునకు, గాంధర్వమని పేరువచ్చినది. ఇది గంధర్వలోకమగుట నావిద్య: యిందుఁ బరీక్షింపఁబడుచున్నది. ఆవిద్యలోఁ బ్రసంగింప నింతకు మున్ను పేరులు వ్రాసిపంపినవారందఱు నీందు వచ్చియున్నవారని తలంచెదము. గానమన వీణాగానమేగానము. వైణికులే యిందుఁ బరీక్షింప బడుదురు. మనోహరముగాఁ బాడుట తచ్ఛాస్త్రములోఁ బ్రసంగించి గెలుపుగొనుట వీనిలో నెవ్వఁడు త్తముఁడని పేరుపొందునో వానికీమహతి పార్వతీమహాదేవి పారితోషికముగా నీయఁగలదు. పిమ్మట నీమహతిపై మంజులముగాఁ బాడి సభ్యుల రంజిల్లంజేసిన యంత సతనికిఁ ద్రిలోకసంగీతవిద్వద్రత్నమని బిరుద మీయఁబడును. అట్టి సమర్ధుఁడెవ్వఁడో లేచి ముందరకు రావలయుననిపలికి సురగురుండు గూర్చుండెను. క్షణకాలమాసభ చిత్రింపఁ బడినట్లు నిశ్శబ్దంబై యొప్పెను. అంతలో,

సీ. ఊర్ధ్వపుండ్రములు దామోదరోత్తమభక్త
            శేఖరత్వము ప్రతిష్ఠింపుచుండఁ
    జారుతేజము చిరాచరితాధిక తమప్ర
            భాసజ బ్రహ్మత్వపటిమ దెలుప
    లలితావయవ కోమలత సర్వగంధర్వ
           సార్వభౌమత్వ లక్షణము బలుక
    వాగ్వైభవంబు సర్వకళావిశేష పాం
           డిత్యోచ్ఛ్రయం బుగ్గడింపుచుండ

గీ. లీల నుపబర్హణుం డట్టెలేచి యాది
    జంపతుల కంజలిఘటించి సభ్యులెల్ల
    విన్మయంబంది చూడంగ వివశులగుచు
    జలద నిర్ఘోష లలిత వాక్కుల వచించె.

చ. అడుగుఁడు నన్ను గానకళ లం దెటనైన సదుత్తరంబుగా
    నుడివెద శాస్త్రపద్ధతి మనోజ్ఞముగాఁ దగఁబాడువాఁడ నె
    వ్వఁడు గలఁడిందు నాకుఁ బ్రతి వాది వచింపుఁడు వానిపేరు న
    న్గడచినవాని కిందు మణి కంకణమిచ్చెద మెచ్చి చెచ్చెరన్ .

క. గానం బొకఁడే కా దె
   వ్వానికి నేవిద్యయందుఁ బరిచితిగలదో
   దాని నడుగంగవచ్చుం
   బో నిపుణతదెలియ మెప్పు బొందఁగ నిందున్.

అని పలికి కూర్చుండెను. అప్పుడు

సీ. మోమెత్తకట మౌనముద్రఁబూనుచుఁ దుంబు
            రుఁడు కాలి పెనువ్రేలఁ బుడమివ్రాయు
    ఘనులు హాహా హూహు గంధర్వులురు లజ్జఁ
            దలవాల్చికొని యేమి పలుకరైరి
    వినుపించుకొననిచాడ్పునఁ బరాకుగ మాట
            లాడుదు రితరులతోడ సురలు
    వగచి డెందములఁ బన్నగులు విన్నదనంబుఁ
            దొడరంగఁ బడగలుముడిచికొనిరి

గీ. యూర్వశియు రంభ మేనకయును ఘృతాచి
   మారుపలుకక యొకమూల మసలుచుండి
   రెఱిఁగి యాసభ్యులందు నొక్కరుఁడు గాని
   నిలిచి యేనని పలుకంగ నేరఁడయ్యె.

అప్పుడు బృహస్పతియే వానికిఁ బ్రతివాదియై సంగీత శాస్త్రములో విపులముగాఁ బ్రసంగించి తత్సమాధానములకు మెప్పువడసి యతని నాలింగనముజేసి గంధర్వపుత్రా! నీవు కారణజన్ముండవు. హరిభ క్తాగ్రేసరుఁడవు. సంగీతమందే కాదు. ఏవిద్యలో నిన్ను మించి నవాఁడు లేడు. నీ నిమిత్తమే సర్వమంగళ యీవిపంచి నిర్మించి తెచ్చినది. దీనిపై సంతతము శ్రీహరిం గీర్తింతువుగాక. అని పలుకుచూ నాశర్వాణి పాదపీఠముదావునకుఁ దీసికొనిపోయి నిలువఁబెట్టెను.

ఆమె యతనిమ్రొక్కు లందుకొని పెండ్లికొడుకవుకమ్మని దీవించుచు నా విపంచి యతనిచేతం బెట్టినది.

అప్పుడు సభ్యు లతనిపైఁ బుష్పవర్షము గురిపించిరి. పిమ్మట నతం డగ్రపీఠ మలంకరించి యామహతి మేలగించి యనంతరాగము లుప్పతిల్ల సర్వజనమోహజనకంబుగా గీతంబులం బాడి వేద వేదాంగముల వినిపించి శాస్త్రప్రపత్తులం దెలిపి శ్రోతలరాగవివశులం గావించె నప్పుడు,

సీ. తుంబురుఁడు రులజ్జతో నెక్కడో డాగి
             కొనియె నింద్రుఁడు మెచ్చికొని నుతించె
    బాపురే యనుచు దిక్పతులు సన్నుతిఁజేసి
             రురగులు పొగడిరో హో యటంచు
    విద్యాధరులు మోహవివశులై కొనియాడి
             రౌరాయటంచు గుహ్యకులు మెచ్చి,
    రాదిత్యులెల్ల మేలౌనౌనటంచుఁ గై
            వారముల్ సేసి ర ప్సరసలెల్ల

గీ. ఫాలమునఁ గేలుగీలించి ప్రణుతిఁజేసి
    రోలగములోని వారెల్ల నొక్క. పెట్టు
    భళిర ! యువబర్హణా ! బలే ! బాగు బాగు
    లెస్సపాడితివని నుతుల్ సేసి రపుడు.

అప్పుడు చిత్రరథుఁడు పరమేశ్వరుఁడు వినఁ బార్వతీమహాదేవితో అంబా! నీ వాగంధర్వకుమారునికి వల్లకి నిచ్చుచుఁ బెండ్లికొడుకవు గమ్మని దీవించితివి. ఆదీవెన వరముగా దయచేయుము. మీ సేవకురాలు మాలావతి నతని యర్ధాంగింజేసి యాశీర్వదింపుమని జనాంతికముగాఁ బ్రార్ధించిన మహేశ్వరుఁడు నవ్వుచు మాలావతికే కాదు. నీకూతుండ్రందరకు నతండే భర్తకాఁదగినవాఁడని యుత్తర మిచ్చెను.

అట్లైన మఱియుం బ్రమోదమేకదా. అని చిత్రరథుడు పలికెను. అందుఁ గల సంగీత విద్వాంసుల కందఱకు నువబర్హణునే కానుకలిచ్చునధికారిగా నియమించుటచే నతండందున్న గాయకుల పేరులు చదువుచుఁ బరీక్షించి వారివారికిం దగిన పారితోషికము లిప్పించుచుండెను.

మాలావతి మొదలుగాఁ గల చిత్రరధపుత్రిక లేబదుగురు తమ పేరులు వ్రాసియిచ్చియుండిరి. ఉపబర్హణుఁ డాపట్టికం జూచి మాలావతి యెవ్వతె? యని యడిగిన నమ్మగున నగజప్రక్కం గూర్చుండి యట్టెలేచి నేను నే నని యుత్తరమిచ్చినది. ఆతం డత్తలోదరి గానకళాప్రసక్తిం గొన్నిప్రశ్నము లడిగి సదుత్తరంబు వడసి మెచ్చుకొనుచు నా మచ్చెకంటి కీయఁదగిన కానుక యేవియని యాలోచించు చుండ జగదంబ గ్రహించి యిట్లనియె.

కుమారా! ఈ బాలిక చక్కఁగాఁ బాడినది. దీనికిం దగిన పారితోషిక మేమియిత్తువు? యీసతి మితముగా నిచ్చిన నొప్పుకొనదు. అమితప్రదుండవు కావలయునని మా యభిప్రాయము. ఏమందువని యడిగిన నామాట కర్ధము గ్రహించి యుపబర్హణుఁడు అంబా! నేను మీయాజ్ఞాకరుండ. నాకొక స్వతంత్రముగలదా. మీ రెట్లు చెప్పిన నట్లు చేయుటకు సంసిద్ధుఁడనని యుత్తరము జెప్పెను. అప్పుడు పార్వతి యాయువతి నొడిలో నిడుకొని,

ఉ. ఈమె మహాపతివ్రతల కెల్ల శిరోమణియై జగన్ను తో
    ద్దామయశఃప్రకాశముల ధర్మరతిం బతితోడఁగూడి నా

నామణికాంచనోరుభవనంబుల సౌధములందు సంత తే
చ్ఛామహితప్రచారముల సౌఖ్యములందుచు నొప్పుగావుతన్.

తక్కినవారింగూడ నట్లే పేర్కొనుచుఁ గీర్తించినది. అప్పుడు,

క. మ్రోగించిరి దుందుభులు న
    భోగులు గురిపించి రపుడు పూవులవానల్
    యోగులు దీవించిరి సు న
    భాగులు, వినుతించిరిష్ట పడి దంపతులన్.

అప్పుడు చిత్రరథుండు సఫలీకృతమనోరధుండై యుమామహేశ్వరులం బ్రార్థించి యింద్రాదిబృందార కుల వేడికొని రత్న కేతు సకుంటుంబముగా రప్పించి యయ్యుత్సవము పరిణయోత్సవముగా మార్పించి యామంటపంబు వివాహవేదికగాఁ జేసి తన కూతుండ్ర నేబదుగురనయ్యుపబర్హణున కిచ్చి వివాహము గావించెను. అయ్యు'త్సవానంతరమున దంపతులం దీవించి దేవతలెల్ల దమతమ నెలవులకుఁ జనిరి. రత్న కేతుండును కుమారుండును కోండండ్రును వెంటరా చిత్రరథు చేననిపించుకొని స్వనిలయంబునకుం జనియె.

ఉపబర్హణుఁ డే బదుగురు భార్యలతో విమానమెక్కి.. తిరుగుచు భక్తిరసము మూర్తీభవించినట్లా విపంచిపై శ్రీహరిఁగీర్తించుచు శృంగారరసము తనువుగైకొని నట్లాచేడియలతో, గ్రీడాశైలముల సుందరోద్యానవనములఁ కొలకుల కెలకులఁగాసారతీరముల నదీపులినంబుల మనోభవకళా వైదగ్ధ్యంబు తేడపడ సప్పడతులతో బ్రహ్మానంద సదృశమగు సుఖం బనుభవించుచుండెను. అని యెఱింగించునప్పటికిఁ గాలాతిపాతమైనది. తదనంతరోదంత మవ్వలిమజిలీయందిట్లు చెప్పం దొడంగె.


__________