కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/338వ మజిలీ

వికీసోర్స్ నుండి


    యత వక్షోజముఖాదిసంపదలచే నాతిథ్యమున్‌ బొంది యం
    చితలీలన్‌ సుఖియించుచుండ నింక హానింగాంచు టెట్లొప్పెడిన్‌.

గీ. అట్లు చిరకాల మాకోమలాంగియందుఁ
   దవిలి సుఖియించు నాదు చిత్తంబదెల్లఁ
   దద్వశంబయ్యె నింకెట్లు తరలఁగలదు ?
   ఉవిద విడనాడివచ్చుట‌ యొదవుటెట్లు ?

కావున

గీ. అరయ బ్రహ్మండమను వార్ధి నధిమధింప
   గలుగు శ్రీదేవివోలె నాకలికిమిన్నఁ
   బడిసి యురమందుదాల్చి నే వసుధయందు
   నచ్యుతుఁడనై చెలంగెడ నహరహంబు.

మఱియు నాదృష్టి యనంగతాప దుస్థితింబడు విరహిణివిధంబునఁ జరణ పల్ల వాస్తరణంబున నెప్పుడు పొర్లాడును ? ఎప్పుడు చిగిర్చిన లతవలె జంఘోరు దండము నూతగొని మహానందంబునఁ బ్రసరించును ? విలాసవతియగు వేశ్యలాగున నెప్పుడు జఘనాంగణంబున నిలచియుండును ? భయాకులయైన భుజగిపోల్కె నాభీ రంధ్రంబున నెప్పుడు బ్రవేశించును? విస్మయప్రచారంబున నలసటంబడిన పడతిగతి నెపుడు త్రివళిమండపము నాశ్రయించి యుండును ? యౌవనవిడంవితయగు స్వైరిణి లీలఁ గురులాంధకారంబున నెపుడు సంచరించును ? రాగిణియను సిందూర లేఖచాడ్పున సీమంతసీమ నెపుడుజేరును ? హర్షోద్రేకంబునఁ ద్రుళ్ళిపడు శహాచందమున నెపుడు లావణ్యపయోధి నెల్లెడల విహరించును ? హృదయమునకు సుఖమొనఁగూర్చు నామె మంజులాలాపములు మదీయకర్ణ వివరంబున నెన్నదఁబడును ? పర్యంత తీక్ష్ణ‌మగు తూలికకరణి నామెదృష్టి యెప్పుడు నాయంగభిత్తికపైఁ బరిభ్రమించును? కళ్యాణవతి యగు నామెనిధానకలశముభాతి మత్కర మందెపుడుబడును? రత్నమాలపోలిక నవరుచిస్థానమగు మదీయకంఠము నెన్నఁ డామె యాలింగన మొనర్చుకొనును? అని యీ రీతి ననేక విధంబులఁ దద్రూపభావనా విశేషంబున ననుక్షణము హృదయంబునఁ బుట్టు కోర్కెలచేత విశ్రాంతి నెఱుంగక మన్మధపరితాపంబున నాఁడు గడపెను.

338 వ మజిలీ

మఱునాఁడు ప్రాతఃకాలమునఁ గృపావతియను విశ్వభూతి శిష్యురాలు రాజుసమక్షమున కేతెంచి జయజయధ్వానంబున వాని నాశీర్వదించుచుఁ బద్మదామం బుపాయనముగ నొసంగి యుచిత గౌరవమంది రాజున కిట్లనియె. రాజచూడామణీ ! నీవు మఠమునఁ దారావళిని విడచివచ్చినపిమ్మట మా నిర్బంధంబున నామె యాహ్ని విధుల నెట్లో నిర్వర్తించి యుదయసుందరికొఱకు బెంగఁగొని సంతతము గన్నీరు విడచుచు నారాత్రియెల్ల గడపినది. ప్రభాతంబుననే లేచి పుష్పావచయము నెపంబు,న గుసు... వాటికకుఁ బోయెను. కాని యామె తిరిగిరాలేదు. ఉదయసుందరీ వియోగ దుఃఖమున నొంటరిగా నెచ్చటికింబోయి యుండెనో యెఱుంగజాలక మే మామెకొఱ కం దందా దినమంతయును వెదకితిమిగాని యామెజాడ యేమియును దెలిసినదికాదు. తమతోఁగూడ జెప్పకపోవుటచేతఁ “బూర్వపరిచితుఁ డెవఁడైన గనంబడి యామెను నిజనిలయంబునకు సగౌరవంబుగ నాతిథ్య మొసంగ దోడ్కొనిపోయి యుండవచ్చును. మాతోఁ జెప్పకయె పోవుటకు దారావళి యవివేకురాలా యేమి? ఉదయమునఁ దప్పక తిరిగిరాఁగల” దని‌ తలంచితిమి. కాని యట్లు రాలేదు. నేఁటి కామె యరిగి మూఁడు దినములై నది. ఉదయసుందరిని విడచియున్న నిన్నుఁజూడజాలక యామెను వెదకి తెచ్చుటకు వెనుకఁ దనయింటినుండి యెట్లు వెడలివచ్చినదో యట్లే యిపుడును బోయి యుండును. కావున మీరామెకొఱకు విచారంపఁబనిలేదు. ఆమెను వెదుకఁ జూచుటవలన నిసుమంతయును బ్రయోజనములేదు. ఆ యన్వేషణ ప్రయాస ముదయసుందరికొఱకు బడుట యుక్తము. తారావళియును నుదయసుందరిని వెదుక నెల్లెడలఁ దిరుగుచుఁ దనంతట తానేరాఁగలదు అని యిట్లు విశ్వభూతి యాదేశ మెఱింగించిఱేని సమ్మతింప జేసి వాని నాశీర్వదించి సంతసంబున‌ నిజవాసంబున కరిగెను.

పిమ్మట నా రాజేంద్రుండు తారావళి మాయమగుటకు విస్మయంబందుచు నుదయసుందరీ సంస్మరణంబు మాత్రంబుననే మదన మూర్చితుండగుచు స్త్రీరత్న ఫలితమగు దన యాశాకల్పలతికకు మూలమై చెంతనున్న కుమారకేసరి నమృతరసావ నేకశుభగంబులగు చూపుల నీక్షించుచు నిట్లనియె మిత్రమా! తారావళి యెందేగి యుండును ? ఏ మార్గంబునఁ బోయియుండును ? అమె నిక్కముగఁ బ్రియసఖి నీ భూమండలంబున వెదకుటకే యరిగియుండునా ? మార్గమధ్యమం దెందైన నపాయము సంభవింపదుగదా ? ఏమిజరగియుండునని యడుగుచు నంతలో నీకా యుదయసుందరి యెచ్చట గనంబడెను? ఎట్లు చూచితివి? అందేమి చేసెను ? ఏమని పలికెను ? ఎచ్చటనుండి యేతెంచెను? ఏ కులంబునఁ బొడమెను ? ఎచ్చట దిరుగుచున్నది ? అని ప్రశ్నించుచు జెప్పినది చెప్పినట్లు వినినది వినినట్లు తెలిసినది తెలియనట్లు మఱల మఱల నడిగినదే యడుగుచు హృదయానువర్తియగు గుమారకేసరివలన మాటిమాటి కా వృత్తాంతమును వినుచున్నను మరచుచు నా రాజేంద్రుండు కొన్ని దినంబులు గడ పెను.

మేఘముల నలుపును బాపుచు నేను కూడదన్న హరిణలాంఛలుండు విశేష దీప్తింగాంచి నిజకరంబుల ననంగశరాహతి నవసియున్న యీఱేని బాధింపఁగలడని శరత్కాలము గతించెను. నిరంతరము నుదయసుందరీ థ్యాననియతుఁడైయున్న యా


నియమంబునకుఁ క్రొత్తవరిచేలయందుఁ దిరుగు క్రౌంచపక్షుల కఠని
నేనుండి యంతరాయము గలిగింపరాదని హేమంతము నిష్క్ర మించెను. స్మరానలదందహ్యమానుండగు భూమండలా ఖండలునకుఁ జిత్తసంతాప

శమనం బొనర్పఁదగు పద్మకాననమందలి యివకఁ బోఁగొట్టుచు నేనుండుటఁ దగదని శిశిరంబ దృశ్యమయ్యెను. మలయగిరి శిఖరసరసీతరంజల సంపర్కంబునఁ జల్ల నైన పిల్ల వాయువులు వ్యజనోపకరణంబుగ గ్రహించి యవిరళవకుళకుసుమకోశము లందలి మధురసజలంబును నార్ద్రోపకరణంబుగఁబూని వికలదతివిశది సిందురారసంభృతాసల్ప తరపరాగంబు స్వేదాపహరంబగు కర్పూరచూర్ణంబు డంబునవహించి నవీన కోమల తరుప్రవాళ నికరంబును మృదుతల్పంబుగఁ గల్పించి సమయమునకుఁ దగినరీతి నీ రాజేంద్రున కుపచారముల నొనరింతునని వసంత మేతెంచెను.


మ. అతిసౌఖ్యాస్పదమౌ వసంతమునఁ జూతాంకూరమే మన్మధా
     యతబాణంబయి మానినీవిమలశీలాకర్షమున్‌‌జేసి, యు
     ద్దత రాగాంధులఁ జిత్తముల్‌ గలచి నిత్య౦బున్‌ వియోగిన్య సు
     ప్రతతిన్‌ బుచ్చుచుబాంధులన్‌ గెడపుచున్‌ బాధించుముల్లోకముల్‌.

మఱియును,

ఆ. వె. ఇంపుమీఱు నామ్రసంపదలను మించు
        నవ్వసంతసమయమందుఁ గలుగు
        పికరుతంబుదోచె విరహుల మదినాటు
        స్మరుని బాణశల్య శబ్దమట్లు.

త్రిభువనంబుల కానందమును‌గూర్చు నట్టిపసంత సమయంబున మలయ కామినీ కర్ణపూరారవిందకోశంబులం బ్రవేశించు నుత్సాహంబున నలసి పయోధితటా రామంబుల విశ్రమించుచు తా మపర్ణీ తరంగడోలికల శిశువువలెనే గేరింతములుగొట్టుచు గావేరీకూల లతాగృహంబులయం దతిధులవలెనే నివసించుచు గోదావరీజల తుషారము లతో బధికులవలెనే కరసికొనుచు, మృగమదమషీలిఖితంబులగు పాండీకపోలవ్రతంబుల బండితులవలెనే విమర్శించుచుఁ, గంతలీధమ్మిల్ల వేలీగతంబులగు కుసుమమంజరుల మాలికాకారుల విధంబున సరిఁజేయుచు, మన్మధనిధానములగు నాంధ్రసీమంతినీ స్తనకలశంబులసు సిద్దులవలెనే బయల్పెట్టుచు, పున్నాగమధురసస్వేదంబులగు మహా రాష్ట్ర కుటుంబినుల యూరుస్తంభంబుల మల్లురవలెనే కలయఁగలుపుచు, పరిమళ మిళితాళికవచంబులఁ జెలంగులాట లీలావతుల వళులను వీరభటులవలెనే యెగఁబ్రాకుచు గర్ణాటనారీకుచపత్ర కస్తూరికాప కిలపధంబున మందగమనంబు నందుచు త్రిలింగ తరుణీకురుల వనశీతలచ్చాయల సేవించుచు సవిభ్రమాభీరభామినీముఖా మోనంబునఁ బరిమళించుచు, జందనగిరిపరసరోద్యానమండలంబునఁ జలించి గుసుమలతికలకు హస్తకాభినయానాదుల నేర్పు భరతాచార్యునివలె నలరారుచుఁ జల్లనిపిల్ల వాయువులు దక్షిణదిగంగనాశ్లేష మిళితతర్పూరసౌరభంబుతోఁ బ్రసరించుచుండెను. అట్టి యుత్కృష్టవసంతసమయంబునఁ బుండరీకరాజేంద్రుండు సర్వదా యుదయసుందరినే ధ్యానించుచు మదనతాపంబునఁ బొగులుచుండెను. ఒకనాఁ డతఁడు ప్రియవయస్యుండగు కుమారకేసరింగూ ప్రమదావనంబున విహరించుచు నొకచో నక్షివిక్షేపంబున ముందుజూపుచు వాని కిట్లనియె. సఖా ! ఆకాసారతీరంబున నీక్షిం పుము.


ఉ. ఆనళినీవనంబున నితాంతము గాంతనుబాసి విభ్రమా
     సూనమనఃప్రవృత్తిని మనోజమహాగ్రహమేచఁగాఁ బ్రలా
     పానుగతుండునై యళుఁ డహా ! యదె తమ్మిదుమారమూని పె
     న్దీనత శూన్యమందచటఁ ద్రిమ్మరు బంభరడింభకాళితో.

గీ. కేళికావనసీమ నీక్షింపు మదిగొ
    ప్రధిత పున్నా గపుష్పపరాగమెల్ల
    నరయ గంధోపలక్షోదమట్లె యువక
    హృదయముల నంగజాగ్ని దీవింపఁజేయు.

గీ. మలయమారుతడోలిక నలరి మొదలు
    విడచు ఘనరేణుధోరణి వెలయుచున్న
    చూతమంజరి క్రకచికఖాతి నహహ
    విరహుల మనంబులనునెల్లఁ దరుగఁదొడఁగె.

ఇట్లు మదనోన్మాదుండై పలుకుచున్న యా రాజేంద్రుని మాటల నాలకించి కుమారకేసరి డెందంబున నిట్లు తలంచుకొనెను. ఔరా! ఈ మహారాజిప్పుడు మన్మధ హతకునకుఁ బూర్తిగా వశ్యుఁడై యుండెనుగదా! ఇచ్చటనుండి వీనిని వేఱొకచోఁటికిఁ దీసికొనిపోవుట సాధ్యముగాదు. మఱియు నిట్టిప్రదేశమును విడిచిపోయిన విరహార్తుఁడగు వీన బాధ తగ్గనేరదు. కావున నిచ్చటనేయుండి వీనికిఁ గలిగిన మన్మధవ్యధ యేయుపా యంబున నివర్తింపఁబడఁగలదో యర సెదం గాక యని ముందుజూచి ససంభ్రమంబున ఱేని‌ కిట్లనియె. దేవా! అటుచూడుము వనవీరుఁడను కిరాతరాజువలనఁ నెచ్చటనుండియో సంపాదించికొనిరాఁబడుచు దారకుఁడు గళ్ళెమును బట్టుకొని నడిపింప జీనుగట్టఁబడి, సర్వర్తురాజగు వసంతుఁడుబంపిన కానుకయట్లు దిక్పాదులుకు నీవు నడచుట కిష్టపడక యొసంగినదానివలె ననన్యయోగ్యమగుటచే దేవేంద్రునివలనఁ నొసంగఁబడిన యుపా యమునవోలె, నీకుఁ దగినవాహనముగ విధాతచేత నిర్మింపఁబడినవోల్కె నొప్పుచుఁ బ్రభూతవేగంబున రూపొందిన వాయువురీతి, సాక్ష్కాత్కరించిన మనస్సుగతి, రూపాంతరోత్పత్తివిధ౦బున నలరారుచు, సర్వాంగసుందరమై, శుభలక్షణలక్షితమై యదృష్టపూర్వమగు మనోహరాకారమున మించు నాయశ్వ శ్రేష్టమును దిలకింపుమని కుమారకేసరిపలుక‌ నారాజేంద్రుండు విస్మయంబున నావైపు దిలకించెను. ఇంతలో నాయశ్వముతోఁ గిరాతరాజు సమీపమున కేతెంచి రాజునకుఁ బ్రణామము లాచరించి యిట్లనియె దేవా! నేఁడు నేను వింధ్యగిరిపరిసరారణ్యంబునఁ దిరుగుచుండ నొకచో నాయెదుట నంబరతలంబునుండి యీయశ్వరాజు మత్యంతహరిత దూర్వాస్తంబంబుపై మోరబై కెత్తుకొనిబడెను. అంబరమ నందలి రవిరథతురంగము సరసదూర్వాహారకాంక్షచే క్షోణీతలంబున కవతరించెనో లేక యీ యద్రిశిఖరమున నమతుఁ డెవ్వఁడై న విహరించుచుండ వాని వాహనము బ్రమాదమునఁ గ్రిందఁబడెనో నే నెఱుంగను. కాని దాని యద్బుతసుందరాకారమును దిలకించి విస్మయపడుచు నేనిట్లు తలంచుకొంటిని. ఆహా ! అసదృశాకారముననొప్పు నీయశ్వ మెవ్వరిదై యుండును? ఎచ్చటనుండి వచ్చినది? రవిరధతురంగమస ప్తముకన్న మిన్నగ దీనిని విధాత నిర్మించి యుండవచ్చును. సముద్రగర్భమునుండి వెల్వడిన యుచ్చైశ్రవంబు దీని నీక్షించి సిగ్గు పడుటచేతనే దానికి పుడమినుండుభాగ్యము లేకపోయెను. ఇట్టి వాహనరత్నమును బరిత్యజించి హరిణమునెక్కి దిరుగుటచేతనే సమీరణునకుఁ జంచలుఁడని లోకంబునఁ బ్రతీతిగల్గెను. దేవతలగుఱ్ఱముకన్న నుత్కృష్టాకారమున నొప్పు నీయశ్వము నధిరో హించుటకు మనుష్యమాత్రుం డర్హుండు గానేరఁడు. అధిష్టించినను నడిపింపనోఁడు. కావున దీనిని నతలోక దేవేంద్రుండవగు నీకుఁ గానుకగా సమర్పింపఁదలంచి యశ్వ శిక్షానిపుణుండగు దారకునిచే దీనిని బట్టించి జీనుమొదలగు పరికరంబుల నాయత్తపరి పించి దేవరసమక్షమునకుఁ దోడ్కొని‌వచ్చితిని. పిమ్మట దేవరయే ప్రమాణమని యూరకుండెను.

అప్పుడు కుమారకేసరి “ఆహా రాజేంద్రుని మనంబును రసాంతరంబునకు ద్రిప్పుటకు మంచియుపాయమే దొరకెను. ఈ యశ్వము నెపంబున వీని విరహావర్దను మరపించెదంగాకయని దలంచి యీయశ్వము సర్వాంగములఁ బరీక్షించి రాజేంద్రున కిట్లనియె. స్వామీ ! అవధారు అశ్వజాతులు తొమ్మిదింటియందును నుత్తమంబగు “తో కోరా” జాతియం దియ్యది సంభవించినది. శ్రేష్టంబులగు నశ్వలక్షణంబు చెనమి దింటిని దాల్చియున్నది. ఎత్తు పొడవు లావు యెన్నియంగుళము లుండవలెనో‌ యట్టి పరిమాణము గలిగియుండుటచే నతియుత్కృష్టమైనది. చెవులు శాస్త్రమందుఁ జెప్పఁ బడినట్లు లఘువులై శ్రేషత్వముకు దెల్పుచున్నవి. కేసరత్వక్తనూరుహంబు లెట్లు మృదువుగానున్నవో దిలకింపుము. జానుజంఘాననంబులు బుష్టిలేకయుండుట పరికిం పుము. నయనదళనస్తంబులు స్నిగ్ధములై యుండెను. మెడ నిడుపైనది. డెక్కలు గఠినములై యున్నవి. లలాటకటిస్కంధపుష్టాక్ష వక్షస్థలంబులు విశాలంబులై యున్నవి. వర్ణచతుష్టయంబులో ముఖ్యమైన పాటలవర్ణంబు గలగియున్నది. ఎచ్చట శుభావర్తము యుండవలెనో యచ్చటనే యవి చిహ్నితములై యుండెను. శంఖధ్వనిఁబోలు షేషారవం బునఁ జెలఁగియున్నది. దివసత్వంబును, నగ్నిచ్చాయమును బంకజసౌరధంబును, విలాసత్వరితగమనంబునుగలిగి, సప్తప్రకృతులయందును నుత్కృష్టుతులయందును నుత్కృష్టమగు సత్వప్రకృతిచే నలరారుచున్నది. వీని యదయవలక్షణము లన్నియును శ్రేష్టత్వమునే స్పష్టపరచుచున్నవి. ఇది యుత్తమాశ్వము దేవర యధిరోహింపఁదగి యున్నది. కావున నోదేవా ! నీవత్యంతముదంబున నీయశ్వంబు నధిష్టించి యశ్వశిక్షా నిపుణుండవై గతవిశేషంబుల నడిపింపుమని యాదరంబున మనవిసేయ నారాజేం ద్రుండు సకౌతుకంబున దాని నధిష్టించి వివిధగతుల నడిపింపఁ దొడంగెను.

ఇంతలో నతిరయంబునఁ గరభకుఁడను సేవకుఁడు రోఁజుచు యొడలెల్లఁ జెమ్మటలుగ్రమ్మ నిట్టూర్పులంబుచ్చుచుఁ బరువెత్తుకొని వచ్చి దేవా! మోసమయ్యెను. మోసమయ్యెను. ఎచ్చటనుండియో యొకదురాత్ముఁ డేతెంచి ధ్వంస మొనరంచు చున్నాఁడు. వానిని గ్రహింప మే మశక్తులమైతిమి ఉద్యానమును రక్షింపుము రక్షింపు మని భయగద్గదస్వరంబునఁ దడఁబడుచుఁ బలికెను. ఆ మాటలకు విస్మయమందుచు నందున్నవారు “ఓరీ! ఎవఁడు వాఁడని రెట్టించి యడుగ భయకంపితుండై “వాఁడు, వాఁడు” అని వచించు సేవకుని మాట లారాజముఖ్యునకు నవ్వుబుట్టించెను.

రాజు వాని పిరికితనంబునకు లోలోన నవ్వుకొనుచు మడమలచే నా తురంగము నదలింది బరువెత్తించి కుమారకేసరి ప్రభృతులు వెంటరా క్షణములో నా ప్రదేశమునుజేరి ముందు నలువంకలఁ బరికించెను. అందొక లతామండపమునుండి యింకొక లతామండపమునకు నొకచెట్టునుండి యింకొక చెట్టుమీఁదకును దుముకుచు, వనపాలుర బెదరింపుల లెక్కగొనక యతివిక్రమంబునఁ బరిభ్రమించుచు, ఱేని చిత్త వికారమును బోఁగొట్టు హాస్యరసంబున కాస్పదంబై దుర్ణయప్రవృత్తయై, వికటస్వ రూపయై చపలస్వభావయై, మాటి మాటికి నొడలు గోకికొనుచు, గోధుమవర్ణముగల త్రాచుబామువలెఁ బృష్టభాగంబున లాంగూలము వ్రేలాడుచుండ, నెఱ్ఱనిముఖమును దీర్ఘదంతములును జూపరులకు భీతిఁగొలుపుచుండ, దంతనిష్కర్షణంబున వనపాలకుల నెకసక్కెములాడుచు నటవీచరవేషముల యందు విదూషకపాత్రమువలె, కాంతార నగరమందలి విటునిలీల, నారామగ్రామఫలంబులకు భోక్త విధంబున నొప్పుచు నత్య ద్బుతమహాకారభాసురమగు నొకవానరశ్రేష్టము గనంబడెను.

దాని నీక్షించి యారాజేంద్రుడు తదీయస్వరూపంబునకువిస్మితుండగుచు, దాని చైతన్యప్రవృత్తి నగ్గించుచు, దానిఫలగ్రహణ సామర్థ్యంబు నెన్నుచు తిర్యగ్జాతి యందు బుట్టినను మనుష్యస్వభావ వ్యాపారంబుల మెలంగుదానిని బొగడుచు ప్లవగ జాతియందుఁ బుట్టినను నట్లు నిర్భయముగా రక్షకభటులనెల్ల మర్దింపఁగలిగిన దాని సామర్ద్యంబు నభివర్ణించుచు, నిట్లు మనంబున వితర్కించుకొనెను. ఔరా! ఎవ్వఁడైన నిజశరీరమును మరుగుపరచి యిట్టిస్వరూపంబున విహరించుటలేదుగదా? రామాయణం బున సుగ్రీవనలనీలోంగద ప్రభృతులు దివ్యాంశజులని విందుము. వారిలో నెవ్వఁడైన నిట్లేతెంచియుండలేదుగదా? లేక మధ్యలోకవర్తియగు నాహనుమంతుఁడే యిందు వచ్చి యుండెనేమో ! కానిమ్ము. ఈవానరచేష్టితం బులఁ బరికించి యేమిచేయవలెనో యట్లే యొనరించెదంగాక యని దలంచుచుండ‌ పసంతశీలుఁ డేతెంచి యిట్లనియె.

దేవా ! ఈకోఁతి యెచ్చటనుండివచ్చుచుండెనోగాని ప్రతిదినమిం దేతెంచి మమ్మెవ్వరిని లక్ష్యముసేయక నవపాకమధురంబులగు ఫలంబులేరి కోసికొనిపోవు చుండును. చిత్రమేమన దా నొక్కపండైన దినినట్లు గనంబడదు. ఆఫలంబుల నెచ్చటి కెందులకుఁ గొనిపోవుచుండెనో దీని నెట్లు నిగ్రహింపవలెనో మాకుఁ దెలియకున్నది. నేఁ డేలినవారు స్వయముగా నేతెంచిరి గావున జరిగినదెల్ల మనవి చేసికొంటినని పలుక నతివిస్మయావేశహృదయుఁడై యారాజేంద్రుండు దానిని స్వయముగా నిగ్రహింపఁ బూనెను. అప్పుడు -


గీ. శుభదళాప్రతిముఁడు భూభుజుండు నైన
    నతఁడు రా ధుర్దినమువోలె నాప్లవఁగము
    తరుణరవిక్తముఖముతోఁ దరలిపోయె
    వనమునందుండి ఫలసంపదను హరించి.

గీ. చరణవిన్యాసమున దూఁకు శక్తి దెలియఁ
    బూర్వదేహంబు నిగుడించి ముడుచుకొనుచు
    వడిగ నడచుచు మెడఁ ద్రిప్పు దెడపఁదడప
    నదిగొ యిదిగో యనఁగ మాయమయ్యెఁ గోఁతి.

అయ్యది యుద్యానమును ధ్వంస మొనరించెనను కోపంబును నందలిఫలం బులఁ దానుదినకుండ నేమిటికిఁ గొనిపోవుచుండెనోయను విస్మయంబును బొందుచు నారాజేంద్రుండు కళప్రహరంబున దురంగము నదలించి మహాక్రోధంబున నావాన రము పిరుంద నరిగెను. అతి జవంబునఁ బోవుచున్నదానిని బట్టుకొనుదలంపునఁ గుమారకేసరి ప్రభృతులు దన్ననుసరించి రాజాలక నిలిచియుండ నారాజేంద్రు డే కాకియై యాప్లవంగమువెంట మిగులదూర మరిగెను. అట్లు వాయువు కన్న వేగంబునఁ బోవు ప్లవంగ‌ము ననుసరించి పుండరీకునియశ్వమేఁగుచుండ దానినోటినుండి పడిన నురుగుముద్దలు వెనుకవచ్చు మారుతునకు మార్గముజూపు గుర్తులై యొప్పెను. ఒకదాని కన్న నింకొకటి ముందుండవలెనను స్పర్థచే దుముకుచున్న నగ్రచరణ ద్వంద్వముతో నాయశ్వము మహావేగంబున ముందుకుఁ బోవుచుండెను. ఆ యశ్వగమనవేగంబు నిక్షీంచి రాజు విస్మయమందుచు నౌరా! ఈ హయరత్నము వియత్పధంబున నెగిరి యరుగుచున్నదా యేమి? ఎవఁడయిన నదృశ్యరూపంబున దీనిని పైకెత్తుకొనిపోవు చుండలేదుగదా? ఎవఁడయిన మాయావి దీని నావేశించి యుండి యిట్లు బరువెత్తుచుండె నేమో ! లేకున్న దీని కిట్టివేగమెట్లు గలుగఁ గలదని బహువిద వితర్కవ్యగ్రహృదయం బున ముహూర్తమాత్ర మకృతావధానుఁడై యుండెను. అంత నొక్కచో ననేక తరుశకుంతకూజితారావతుములంబున దెలివిఁబొంది తా నొక మహారణ్యమధ్యంబునఁ దిరుగుచున్న ట్లెఱింగెను. ఎదుర నెందుఁజూచినను గొండలతో నిండియున్న ప్రదేశమేగాని యామర్కట మందుఁగనంబడదయ్యెను. ఇఁక ముందుఁబోవుట కశక్యమగురీతి నడ్డముగానుండి యగస్థ్యునివలన మోసగింపఁబడుట యెఱింగి రోషమొంది పెరుగుచున్న వింధ్యనగేంద్రములీల దక్షిణ దిక్కునెల్ల నాక్ర మించుకొనియుండి గౌరీతపశ్చరణపంచాగ్నులచే మంచు కరిగిపోయిన హిమాద్రివలె, హరపదస్పర్శాప్రభావంబున స్ఫటికపాండుకుష్టువుం బోఁగొట్టికొనిన కైలాసముగతి, వార్థక్యంబునఁ గాంచ నచ్చనింబాసిన మేరువువిధంబున నొప్పుచు నదభ్రశిఖర కృతా భ్రంబగు నొక్కభూభృద్వరంబును గనుంగొనెను.

అప్పుడు రాజు విస్మయమందుచు సత్వరంబునఁ గళ్ళెమును లాగిపట్టి గుఱ్ఱ మును నిలిపి దాని నవరోహాణం బొనరించి యలసట వాయ ఘనశీతలచ్ఛాయల నొప్పు నొకవృక్షముక్రిందకు జేరెను

339 వ మజిలీ

విచిత్ర సమ్మేళనము

అప్పు డాపుండరీకరాజేంద్రుండు నలువైపులం దిలకించి విభ్రాంతుఁడై యిట్లు చింతించెను. ఆహా ! ఇప్పుడు నే నేమహారణ్యంబునఁ జిక్కుకొనియుంటిని? ‌ బ్రహ్మాండవలక కీలకంబుగ నొప్పుచున్న యీ పర్వతము పేరేమి ? ఈ ప్రదేశమున కేనెట్లు జేరుకొంటిని ? కుమారకేసరి ప్రభృతిసహాయు లేమైరి ? మహాజపంబున నీ తురంగము నన్నెంతదూరము దీసికొనివచ్చినది ? నేను దీని వేగలాఘవంబులనెన్నుచు న న్నేమార్గమున విచ్చటకుఁ దీసికొనివచ్చెనో గమనింపనైతిని. దీనిని బట్టికొన నెంత దూర మేతెంచితినో, యామర్కట మేమైనది ? అదృశ్యభావమ దిన యొకమహాభూత మదికాదుగదా ? మాయావి యొకం డీరూపంబున నన్నిటకు లాగికొనివచ్చెనేమో ? ఇఁకముందు న న్నేమిచేయునో ? ఇందు దైవము కర్మానురూపమగు ఫలమెయ్యది నాకు సమకూర్చునో ? లేకున్న విధి నాకిట్లు ప్రతికూలుఁడై యుండుటెట్లు సంభ వించును ? నే నిప్పు డేమిచేయవలయును ? ఈ తురంగము నధిష్టించి వెనుకకుఁ బోదునా ? ముందున కరుగుదునా ? లేక యిచ్చటనేయుండి మాయమైన యా కోఁతిని వెదకుదునా ? ఈ యుత్తమాశ్వము నిముసములో నన్ను నగరమునకుఁ దిరుగ దోడ్కొనిపోఁగలదు. కాని మహాద్భుత రసాస్పదంబగు నా వాలీముఖంబును దిరుగఁ గావించు యెట్లు ? దగఁగొన్నవారు పరమ ధర్మార్తిభృత్తులను నితాంతసీతలస్వాదు జలంబులుగలిగి, తీరంబుల ఫలవృక్షములతో నొప్పుచుండు జలాశయంబులఁ దరుచుగ నాశ్రయించుచుందురు. కావున నిప్పు డట్టి ప్రదేశంబునకే బోయెదంగాక ! అచ్చట నైన నవ్వనచరంబు గనంబడకుండునా ? మనఃప్రవృత్తియే సంతోషవిషాదంబులఁ