కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/314వ మజిలీ

వికీసోర్స్ నుండి

హేమ -- సఖులారా ! శాంభవీదేవి నర్చించుటకు కాల మతిక్రమించు చున్నది. ముందాపని నిర్వర్తించుకొని వచ్చిన పిదప వీని విషయమై యాలోచించు కొనవచ్చును. ఇంతలో వీఁడెక్కడకుబోగలడు.

ఇట్లు వారు సంభాషించుకొని యమ్మవారి నర్చించుట కతి జవంబున నా గుడిలోనికిఁ బోయిరి. శబర బాలకుండు వారిం జూచినప్పటి నుండియు నివ్వెరపాటున మైమరచియుండెను. అట్టి యద్భుత లావణ్యముగల యలివేణుల నెన్నఁడును గనివిని యెఱుఁగని కారణమున వానికి వారి దర్శనము వింతఁగొల్పుట యబ్బురముగాదు. ఆ యంగనామణులు గుడిలోనికిఁ బోయినతోడనే వాఁడును వెనుకకుఁ దిరిగి గుడి యొద్దకు వచ్చి వెనుకటి ద్వారమునఁగాక మఱొక దానివెంట నా యాలయమును బ్రవే శించెను.


314 వ మజిలీ

దేవతా స్త్రీలకథ

హిమవన్న గరమునఁ గాంచనకూట మను శిఖరము మిగుల నెత్తైనది దానిని మనుష్యు లెవ్వరును జూచి యెరుంగరు సరేకదా యట్టి శిఖర మున్నదనియైన నెవ్వ రును వినియుండలేదు. పూర్వమొక యక్షుండు సంతాన మపేక్షించి యందు శాంభవీ దేవికి స్వర్ణమయ దేవాయతనంబు గట్టించి నవరత్నములతో నిత్యము నర్చించుచుఁ గొంతకాలమునకుఁ దన యభీష్టము బడయఁగలిగెను. ఆ యక్షునిచేఁ బూజ సేయఁ బడిన రత్నములతో నా యాలయప్రదేశమంతయు నిండిపోయెను. పిదపఁ గొంత కాలమునకు నల్వురు దేవతాస్త్రీలా యాలయంబున కేతెంచి రత్నకాసులెల్లఁ బ్రోవు సేసి యందొక భాగమున భద్రపరచిరి. కొన్ని యనర్ఘరత్నముల గర్భాగారము నందును నితర ముఖ్యప్రదేశములయందును నందముగా నమరించి యా యమ్మవారిని నిత్యమును బూజించుచుండిరి. ఆ గుడివెనుక నొక రమణీయోపవనము నిర్మించి యందు పూజార్హ ములగు వివిధ కుసుమ జాతులఁ బెంచుచుండరి. ప్రతిదినము మూడు వేళలయందును జేరువనున్న పద్మాకరంబున జలకములాడి వచ్చి యా యుద్యానవన ముననున్న పుష్పములఁ గోసి తెచ్చి‌ యా యమ్మవారి నధిక భక్తితోఁ బూజించు చుండిరి. రాత్రి ప్రొద్దుపోవువఱకు నా దేవీమండపమున భజనకీర్తనలం బాడుచుఁ బిమ్మట నల్వురు దల‌యొకదారిం బోయి యుదయమున కక్కడ చేరుకొనుచుందురు. ఇట్లు కొన్నియేండ్లు గడచిన పిమ్మట నొకనాఁటి యుదయమున వా రతిభక్తి నయ్యమ్మవారిం బూజించి తమ యిక్కట్టుఁ బాపి శీఘ్రమ యనుకూలవాల్లభ్యము గలుగునట్లనుగ్రహింపుమని ప్రార్థించిరి. భక్తసులభ యగు నా యంబికాదేవి వారికి బ్రత్యక్షమై, బిడ్డలారా ! మీ యాపద కొలఁది దినములలోఁ దీరఁగలదు. మీకు దివ్యప్రభావసంపన్నుఁడగు నరకంఠీ రవుండు యొడయం డగును. అనతి కాలముననే మీకు సర్వభద్రములు జేకూరఁ గలవు ఇచ్చటఁగల రత్నరాసుల కన్నింటికిని మిమ్ము జేపట్టు పురుషుఁడే యధికారి యగును. భర్తృసమాగమం బగువరకు మీరిచ్చటనే యుండవలయునని పలికి యంత ర్హితురాలయ్యెను.

ఆ దేవి పలుకులకు వారెల్లఁ గులుకుచుఁ దమ నలువురకు నొక్కఁడే పతి యని నిశ్చయించుకొని యం దొకతె యెవ్వరినైనఁ బతిగాఁ వరించినచోఁ దక్కినవారు గూడ వారినే విభునిగా గ్రహింపవలయు నని వారప్పుడే బాస జేసికొనిరి.

పిమ్మటఁ గొన్నిదినముల కొకొనాఁడు వారు రాత్రి చాల గడచువరకు నా దేవీమండపమునఁ గీర్తనలం బాడుకొనుచుండ నందు మువ్వురు మాత్రమే వాడుక ప్రకార మెచ్చటకోఁ బోయిరి. హేమలత యను నచ్చర యచ్చటనే యుండి యుదయ మగుసరికి తక్కినవారిం గలుసుకొనెప. మరునాటి రాత్రి యిరువురు మాత్రమే వెడలి పోయిరి. హేమలతతోఁ దటిత్ప్రభ యారాత్రిశేష మా మండపము మీదనే గడి పెను. మూఁడవనాఁడొక్కతె మాత్రమే యరిగినది విద్యున్యాలయను నచ్చరలేమకూడ యం దుండిపోయెను. నాలుగవ దినంబున మదనమంజరి కూడ తెల్లవారు దనుక నమ్మండ పమునందే తక్కిన చెలికత్తెలతోఁ గాలక్షేప మొనరింపఁ గలిగెను.

వాడుకప్రకార మర్ధరాత్రమునఁ దలయొక దారింబోక యచ్చటనే యుండఁ గల్గుటకు వారానందించుచుఁ దమ శాప మే మహానుభావునివలననో తీరెనని యుబ్బుచు నాడబ్బోకవతులాదివసమున నత్యుద్సాహంబుతోఁ దటాకమున జలకములాడి నయ్యమ్మవారిని బూజించుటకుఁ బుష్ఫములఁ గొనివచ్చుచు దారిలోఁ బేటికాహస్తుండగు మనుష్య యువకుంజూచి శంకించి పూజాసమయ మతిక్రమించునను భయమున వాని విమర్శింపకుండ నమ్మవారి యాలయమునకుఁ బోయిరి.

అందా సుందరీమణులు శాంభవీదేవిని యధావిధిఁ బూజించి భక్తితత్పరలై చేతులు జోడించికొని యమ్మవారి యెదుర నిలచి యిట్లు స్తుతించిరి.


మ. జననీ ! నీదయచేత నిప్పటికి మా శాపాతిదోషం బదె
     ల్లనడంగెన్ నశియించె బాధల మహోల్లాసము సేకూరె ని
     న్ననయంబున్‌ మదినమ్మి గొల్చిన ఫలం బబ్బంగ మమ్మింకిటన్‌
     అనురూపుండగు ప్రాణనాయకునితో నమ్మా ! వడిన్‌ గూర్పుమా.

చ. మనుజుఁడె మీవిభుండగు జుమా యని నీవిటఁ బ్రేమ నానతి
    చ్చినవిధమెల్ల మాహృదయసీమల గాటము గాఁగ నాటియుం
    డెను గద యట్టిఁ దెన్నఁడు ఘటించునొకోయని యాత్రమందుమా
    మనముల నూరడింపఁగల మాటలఁ దెల్పఁగదమ్మ యమ్మరో ?

ఇంతలో నయ్యమ్మవారి విగ్రహము వెనుకనుండి యొకసుందర పురుష

ప్రవరుండు బటురయమున ముందుకు వచ్చి యా యచ్చర మచ్చకంఠులతో నిట్లనియె.


ఉ. ఓ సుమకోమలాంగవిభవోజ్వలులార ! మనంబులం దింకన్‌
    గాసిలనేల ? మీకొఱకె గావలయున్‌జుమ యమ్మవారు న
    న్నీసదనంబు జేర్చికొనియెన్‌, వినుతింపగా నొప్పుగాదె వి
    శ్వాసముతోడ నీమె ననివంబును భక్తసురద్రుమంబుగాన్‌.

చ. నరుడనెగాదు నేను నరనాధుడ దివ్యబలప్రతాప భా
    స్వరుడ మిమున్‌ గ్రహింప మది సమ్మతినందితి మీరుభక్తి నీ
    శ్వరి కొనరింప గల్గిన సపర్యలు సత్ఫల మందఁ గల్గె ను
    ర్వర నసమానసౌఖ్యముల భాసిలగాఁ గల రింక మీఱటన్‌.

ఆ పలుకుల కా కలికి తలమిన్న లలరుచు వాని యాగమమున కక్కు జం పడుచు నా పురుషుని రూపరేఖా విలాసములకు వింతపడుచు నమ్మవారి భక్తవత్సలత్వ మును వినుతించుచు దమభాగధేయము ఫలించెనని సంతసించుచు శృంగారవిలోకనముల నా సుందరాంగునిపై బరగించుచు గొండొకవడి లజ్జావనితవదనలై యేమియుం బలుక జాలకుండిరి.

అంత నా పురుషశ్రేష్టుండు విలాసదృష్టుల నా యోషామణులపై బర పుచు మందహాసము మొగమునకు నూత్నవికాసం బొనగూర్ప మృదుమధుర భావణ ముల నా మత్తకాశనుల చిత్తములు నిజాయుత్తము లగునట్లు జేసికొనెను. పిమ్మట వారిట్లు సంభాషించుకొనిరి.

పురుషుడు - .కాంతామణులారా ! మీ యుదంతంబంతయు వినవలయు నని నా యంతరంగం బుత్సహించుచున్నది మీ రెవరు! ఈ నిర్జనారణ్యమధ్యమున కెట్లు రాగలిగితిరి. శాపదోషము దీరిపోయెనని యంటిరి. అదెట్లు సంభవించి దొలం గెను ?

మదనమంజరి - పురుషప్రవరా ! మీకువలె మాకుగూడ మీ వృత్తాంతం బెరుంగ దలంపు గలిగియున్నది. మనుష్య సంచారానర్హంబగు నీకాంచన శిఖరమునకు మీరెట్లు రాగలిగితిరో మాకు వింత గొల్పుచున్నది వినదగుదుమేని తొలుత మీ యుదంతం బెరింగించి మమ్ము గృతార్దులం జేయుడని ప్రార్ధించుచున్నాను.

పురు -- నా యుదంత మెరింగించియే మిమ్మడుగుట ధర్మము. నేసు ధరణి చక్రం బేకఛత్రముగా బరిపాలించు దివోదాసుడను పార్దివేంద్రుండను. శబరబాలక ప్రేతాన్వేషణ నెపమున యక్షలోకమున కేగి యందు వాడు సజీవుడయి వెడలిపోవుట విని వానిని వెదకికొనుచు దిరిగితిరిగి నేటికిచ్చటి కేతించి మిమ్ముంగంటినని వృత్తాంత మంతయు గ్లుప్తముగా వారి కెరిగించి వారి యుదంతము దెలిసికొనగోరెను.

విద్యు -- (జనాంతికముగా) సఖీ! తటిత్ప్రభా ! ఆర్యపుత్రుని ప్రభావం బమానుషముగను నాశ్చర్యకరముగను నున్నది. మన యుదంతం బెరింగిన వీనికి మనయం దనురాగము గొఱతపడునేమో యని భీతి గలుగుచున్నది.

తటి - ఈ యనఘుడు దన హృదయమున మన కిదివరికే యవకాశ మొసంగి యున్న కతమున నట్టి సంశయమునకు బనిలేదు. ఇదియునుంగాక పురుషులు నూతనప్రియులగుట నీషద్దోషముల నెన్నజాలరు గదా.

హేమలత - సఖులారా ! మనోహరునకు మనకథ నెరిగింపక కాలయాపన మొనరించెద రేమిటికి.

విద్యు -- మనయందరిలోను మాట పొందికగల మదనమంజరి నిందులకు నియోగింతము.

తటి -- సఖీ ! మదనమంజరీ ! ప్రాణేశ్వరునకు విసుగు బుట్టకుండ మన యుదంతంబెల్ల వేగ మెరింగించి వాని మన్ననలకు బాత్రురాలవు గమ్ము.

మద -- [దివోదాసునితో] ఆర్యపుత్రా ! మేము నలువురమును స్వర్గలోక మందుండు దేవకన్యలము. సంగీతవిద్య మేము తుంబురునొద్ద బరిశ్రమ జేసితిమి. అప్పటినుండియు మాకు చెలిమి యెక్కువయై క్రమముగా నాహార శయ్యా విహా రాదులయం దొక్క నిముసమైన నొకరి నొకరు విడచి యుండజాలక యేకదేహమట్లు మెలంగుచుంటిమి. మా గురువర్యుని యుపదేశ విశేషమున గానవిద్యయం దనవద్య పాండిత్యము మా కబ్చి దివిజలోకములందు మిగుల ప్రఖ్యాతి గాంచియుంటిమి. మా సంగీతవిద్యాప్రౌఢిమకు మెచ్చి బిడౌజుండు మా కనేక యోగ్యతా పత్రికల నొసంగి యుండెను. ఒకప్పుడు మా గురువు తుంబురునకును, నారదునకును సంగీతవిద్యా విషయమై వివాదము సంప్రాప్తమయ్యెను. వారి తారతమ్యము విమర్శించి యా విద్యయం దధికులెవ్వరో నిర్ధారణ చేయుటకు పాకశాసనుని వారు గోరుకొనిరి గాన కళాకౌశల్యమున బేరుకెక్కి యున్న మమ్ము నల్వురను సహాయసంఘముగ నేర్చరచు కొని దేవేంద్రుండు సుధర్మాభవనంబున గొప్ప సంగీతసభ జేసెను. అందు దుంబుర నారదులు దమ విద్యావైశద్యమును బ్రదర్శించిరి. అందు గాయకోత్తముడు నారదుం డనియు, వైణికశ్రేష్టుండు దుంబురుండనియును శాస్త్రానుభవ మిరువురకు సమాన మనియును మేమేకాభిప్రాయ మొసంగితిమి. దేవతావల్ల భుండును మా యభిప్రాయ ముతో నేకీభవించి జంత్రగాత్రములయందు గాత్రమే సర్వలోక ప్రమోదావహంబని యుపన్యసించుచు గాయకశ్రేష్టుడగు నారదునకు దివ్యరత్నహార మొండు బసదనముగ నొసంగి మిగుల గౌరవించెను. దేవ సభామధ్యంబున దన కవమానము గలుగుటకు మేము మూలమని తుంబురుడు మాపై నాగ్రహము సూపుచు బుత్రికల రీతి నాదరించి సంగీతవిద్య బూర్తిగ మీకు నేర్పినందులకు నాకు దగిన యుపకారమే చేసితిరి. ఇట్లు గురుడనగు నన్ను తిరస్కార మొనర్చుటయే గాకుండ మదీయ గాత్రవైరూప్యముం గూడ బ్రక టింప సాహసించిన మీ దోషమునకు నిష్కృతిలేదు. మీరు దేవభూమినుండ నర్హురాండ్రు గారు. భూలోకంబున బ్రహ్మరాక్షసులై వృక్షాగ్రములనుండి మహారణ్య మధ్యమందు దలయొక దిక్కు.నను సంగీతము బాడుకొనుచు గాలముబుచ్చుచుందురుగాక యని మమ్మతితీవ్రముగ శపించెను. అన్యాయము ! అక్రమము !! అతి దారుణము !!! అని యా దేవసభ యంతయు గగ్గోలు పెట్టదొడంగెను.

అప్పుడు మేము విచారభారంబున గొంతతడ వొడలెరుంగక పడియుండి పిదప మాకు శాపాంతము గూడ బ్రసాదింపుమని తుంబురు ననేకవిధముల బ్రార్దించి తిమి. అతడెట్టకేల కించుక శాంతించి యీ సంగీతము నితరు లెప్పుడు విందురో యప్పుడే బ్రహ్మ‌ రాక్షసత్వంబు దీరగలదు. కాని మీకెన్నడును దేవలోక ప్రవేశార్హత మాత్రము కలుగనేరదని పలుకుచు బటురయంబున నవ్వలకుంబోయెను.

అప్పుడు మేము చేయునది లేక వెక్కి వెక్కి యేడ్చుచు చేతులు మోడ్చు కొని యున్న మధుసూదను మ్రోల వ్రాలి యేలికా ! నిష్కారణమ మేమిందు గురు శాప సంతప్తులమై యథోగతిపాలు కావలసినదేనా ! మంచియో చెడ్దయో నిష్కపట ముగ‌ బలుకుట యిందు దోసమని యెఱుంగమైతిమి. మూడులోకములకును బ్రభుఁడ వగు నీవు మమ్ము బెద్దజేసి యిక్కార్యమునకు నియోగించుటచే గాదనజాలక‌ పూను కొనినందుల కింత ముప్పు సంభవించెను. దివ్యసుఖంబులెల్ల స్వప్నప్రాయమైపోవ రుగ్జరామరణ భయనిలయంబగు మనుజలోకంబున నివసింపజాలము. అబలలమగు మమ్ము బిశాచరూపములం బూని మహారణ్యమధ్యమందు దిరుగ బొమ్మనుట మీ కెల్లరకు నొప్పిదంబుగ నున్నదా? సర్వసమర్దులగు మీరెల్ల రిట్లుపేక్షించుచుండ మాకింక దిక్కెవ్వరు. రక్షింపుడు, రక్షింపుడని వేడుకొంటిమి.

మా యాలాపముల కా శచీకళత్రుండు గటకటంబడుచు, బిడ్డలారా ! మీ కబ్బిన యీ విపత్తున కంతకును నేనే నిక్కముగ గారణమైతిని. అమోఘమగు తుంబురుని శాపమును గాదను శక్తి నాకు లేకపోయినందులకు మి‌గుల వగచుచున్నాను. సామర్థ్యంబున కతనికి దీసిపోవనివాడును బ్రహ్మమానసపుత్రుండగుట నెక్కుడు ప్రభావము గలవాడునునగు నీ నారదమునిచంద్రుడే యిందులకు బ్రతీకార మూహించు గాక యని వానివైపు జూడ్కులు బరపుటయును నారదుండు ముందున కేతెంచి మించిన యుత్సాహముతో నా వృత్రారి కిట్లనియె.

త్రిలోకనాయకా ! నిండుసభలో మీరు నన్ను బెద్దగా శ్లాఘించి గౌరవించి నందుల కీ‌ర్ష్యగ్రహావేశహృదయుడై మంచిచెడ్డ లెఱుంగక తుంబురుడు నిష్కరుణుడై యమాయకురాండ్రగు నీజవరాండ్ర నాపదపాలు జేసెను కానిమ్ము. శాపాంతమగువఱకు బ్రహ్మరాక్షసత్వము వీరికి దినమునకు యామద్వయము మాత్రమే యుండగలదు. అదియును నర్దరాత్రమునుండియే ప్రారంభమగుచుండును. ఉదయమునుండి శాప దోషము దగులువరకు వీరు నల్వురు నొక్కచోటనే యుండి యుల్లాసముగా గాలము గడుప గలవారలు. శీతశైలంబున గల కాంచనశిఖరము గడు పవిత్రమైనది. అందున్న శాంభవీదేవి యాలయమే వీరికి నిలయమై సర్వభోగభాగ్యముల సమకూర్చగలదు. ఆ శిఖరము జేరువరకు వీరికి శాపదోషం బంటనేరదు. పుడమియందున్నను స్వర్గ సుఖంబుల మరపించు సంతోషైశ్వర్యముల నందగలరని మమ్మనుగ్రహించెను. అందున్నవారెల్లరును వాని మాటల కానందించిరి. దేవేంద్రుడు సభ నంతటితో ముగించి యంతర్గృహమున కేగెను.

పిమ్మట మేము వాడిన మోములతో, గందిన హృదయములతో నా దేవ సభాభవనము వెడలివచ్చి చేసిన యవజ్ఞతకు వగచుచు స్వర్గలోకము నతికష్టమున విడచి యిక్కాంచన శిఖరమున కేతెంచితిమి. ఈ శాంభవీదేవిని దర్శించి దినమంతయు నీమె సన్నిధానమందు గడపితిమి. నాటి రాత్రి రెండుయామము లగునప్పటికి మమ్ము గురుశాపమలమికొని పూర్వాపు విజ్ఞానమంతయువిస్మృతి గలుగజేసినది వెంటనే తల యొక దిక్కునకు బోయి యిచ్చటకు గ్రోశద్వయ పరిమాణమున నున్న మహారణ్య ములో శాఖాగ్రముల నాశ్రయించికొనియుండ తెల్లవారువరకు సంగీత కాలక్షేపము జేసితిమి. ఉదయమగువరకే మా శాపదోషంబున దీరుటచే దిరుగ నిచ్చటి కేతెంచి యమ్మవారిని దర్శింపగల్గితిమి. ఇట్లే యమ్మహారణ్యంబున బ్రతిదినము నర్ధరాత్రము నుండి గానకళావైదుష్యము బ్రకటించుచు బిదప బూర్వపు రూపములంబూని యీ యమ్మవారి నతిభక్తి శ్రద్ధలతో బూజించుచు బెక్కు సంవత్సరములు గడిపితిమి. పిశాచరూపంబుల నున్నప్పుడు మాకు గానవిద్య మాత్రము స్ఫురణయందుండి సర్వదా ప్రకటింపబడుచుండునది. శాపమావహించుటే తడవుగ మమ్మిందుండి యే మహాశక్తి వృక్షాగ్రముల దృటిలో జేర్చుచుండెనో వచింపజాలనుగాని యుదయమున నటనుండి యీ ప్రదేశమున కేతెంచుట మాకతికష్టతమముగ నుండునది ఈ శాంభవీ దేవి భక్తలోకైకకల్పకంబు. నిత్యము నీమె యారాధన మీ రూపమున మాకు లభిం చుటంజేసి చరితార్ధులమైతిమి. ఈ దేవి మా ప్రార్థనల కలరి మమ్మెల్లప్పుడును గాపాడుచుండెను. ఈమె యనుగ్రహాతిరేకంబుననే‌ మా‌కు సర్వసౌఖ్యములు లభింప గలవని యాసించుచున్నాము. నాలుగు దినములనుండి శాపదోషం బొకటొకటిగా గ్రమంబున నిన్నటితో మా నల్వురకు నేపుణ్యాత్ముల మూలంబుననో విడిచిపోయినది. నేడిందు దేవరదర్శనం బబ్బుటచే మేమెంతయును ధన్యాత్ములమైతిమి. ఇందు మిగుల వెలగల రత్నములు గుప్పతిప్పలై యున్నవి. మమ్ము బరిణయంబాడు పురుష సింహుడే యీ యైశ్వర్యమున కంతకు నధికారి యని యమ్మవారు సెలవొసంగెను. మేము నల్వురము నొక్కనికే యిల్లాండ్రముగా యుండుటకు నియమము సేసి కొంటిమి. కావున మమ్మెల్లరను భార్యలగా స్వీకరించి కుబేరునితో బ్రతియనదగు రీతి నిందలి భాగ్యంబెల్ల ననుభవింపుమని పలికి యూరకుండెను.

అప్పలుకులు కప్పుడమియొడయండు మహాశ్చర్యానందకందళిత హృద యారవిందుడై యావేదండయానల నల్వురును బరిణయంబగుట కంగీకరించెను. కాని శబరబాలకుని వాని యాప్తుల సన్నిధిం జేర్చువరకును దాను బెండ్లి యాడకుండుటకు నియమము జేసికొని యుంటిననియు బిదప గనిష్టభార్యలుగ వారిని స్వీకరింతునని యును వారి మనంబులు నొవ్వకుండ దగినరీతిని సమాధానము జెప్పెను. అందు లకు దేవకాంతలుగూడ సంతోషముతో నంగీకరించిరి. అప్పుడు మదనమంజరి దివో దాసు తో వెండియు నిట్లనియె.

ప్రాణేశ్వరా ! పిశాచరూపంబుల నరణ్యమధ్యమందు మేముచేసిన సంగీత ధ్వని నొరులు వినకున్న మాకు శాపావసానము గలిగియుండనేరదు గదా ! మనుష్య సంచార శూన్యంబగు నిబ్బయంకరారణ్యంబునకు మా యిక్కట్టు దొలగింప నేమహాత్ముఁ డేతెంచెనో గ్రహింపఁ జాలకున్నాము. ఆ ప్రాంతములయం దెన్నఁడును మాకెవ్వరును గనిపించియండలేదని దృఢముగా జెప్పగలము. కాని యింతకుముందు మేమీ యమ్మవారి యర్చన కేతెంచునప్పు డిందున్న యుపవనమున నొక మనుష్య బాలకునిఁ బేటికాహస్తుని మాత్రము జూచి పూజాసమయాతిక్రమణమునకు వెరచి వానిని విమర్శింపకుండ నందేతెంచితిమి. ఆ బాలకుఁ డెట్లిచ్చటకు రాగలిగెనో వాఁడెవ్వడో తెలిసికొనవలసి యున్నదని పలుకుటయు నా ధాత్రీకళత్రుండు సంభ్రమముగా నిట్లనియె.

ప్రియురాలా! యక్షలోకమునుండి మా శబరబాలకుండు మందసముం గైకొని యెందో పారిపోయెనని నాతో భైరవీదేవి యానతిచ్చియుండెను. వాఁ డిచ్చటకు వచ్చియుండెనేమో విమర్శింపవలయును వైళమ నీవిప్పుడు చెప్పినవాఁ డున్నచోటు చూపించుమని తొందరపెట్టుటయు నా యోషిల్లలామ మేము జూచినవానికి మీరు వచించిన శబరబాలక లక్షణములుండుట నిక్కమని పలుకుచు నప్పుడే తక్కినవారితో నద్దివోదాసుని బాణిద్వారమున నుద్యానమునకుఁ గొనిపోయెను. కాని యా బాలకుండు వారికి గనఁబడలేదు. వాఁడందెందేని ముందున్న వాడేమో యని యా ప్రాంతమంతయు వెదకిరి. గాని వానిజాడ యెందును గనంబడినది కాదు.

ఇంతలోఁ బ్రాంతమందున్న మందిరమునందుండి యెవ్వరో బాధచే మూల్గు చున్నట్లు వినంబడుటయు వారందఱు నివ్వెరపడుచు సత్వరమ యందుఁ బ్రవేశించి నలుమూలలు విమర్శింపఁదొడంగిరి. అందేమియు వారికిఁ గనఁబడలేదు. కాని యా మూల్గు వారికి మిక్కిలి దాపుననే వినవచ్చుచుండెను. ఆ ధ్వని ననుకరించి వెదకు చుండ వారికొక యంతర్గృహమందుఁ గ్రిందనుండి యది వినఁబడుచుండుటఁ దోచెను. ఆ గదినంతయును దివోదాసుండతి శ్రద్ధతో విమర్శింప నొకవైపునఁ గ్రిందిభాగమునఁ జిన్నతలుపు గోచరమయ్యెను. దానిని తెరచుటకు వానికి సాధనము గనిపింపలేదు. బుద్ధిమంతుండగు నతండది యొక గుప్తద్వారమని గ్రహించి దాని కీ లెచ్చటనుండునో యెరుంగ నందందుఁ బరీక్షింప నాగదిగోడమూలఁ జిన్నమీట యొకటి దృగ్గోచర మయ్యెను. దానిని చేతితో నదుముటయు నా గుప్తద్వారము వివృతమగుటయు నొక్క సారి జరిగెను. అదిచూచి దేవకాంతలు భయాశ్చర్యస్వాంతలైరి దివోదాసమహారాజు మహాసాహసముతో నందున్న సోపానమార్గమునఁ గ్రిందకు దిగెను. తోడనే యా తలుపు మూసుకొనిపోయెను. అది మొదట నెప్పగిదిఁ దెరువఁబడినదో దేవకాంతలు గ్రహించియుండలేదు. కావున దానిని దిరుగఁదెరచుటకు వారనేకసాధనము లుపయో గించి చూచిరిగాని యేమియును గార్యము లేకపోయినది. పెక్కుసంవత్సరములనుండి వారందుఁ దిరుగుచున్నను నమ్మందిరమున నిట్టి గుప్తద్వారమున్నదని యెరుంగరు. శాంభవీదేవి యాలయనిర్మాణ సమయముననే యమ్మందిరముగూడఁ గట్టబడినది. ఆ గుప్తమార్గము నెద్దియో యుద్దేశ్యముతోనే మొదట యక్షపుంగవుం డేర్పరపించి యుండవచ్చును. ఆ దేవకాంతలు రాజేంద్రుని రాకకై యాద్వారముచెంత నెంత వేచి యుండినను వానిజాడ తెలిసినది కాదు. పిమ్మట వారు దేవీపూజకై యాలయమున కరిగిరి.


315 వ మజిలీ

మణిగ్రీవ జలంధరుల కథ

యక్షపురమున మణిగ్రీవ జలంధరులకుఁ గుబేరుని మూలమున మైత్రి కుదిరినది. వాని వైరభావం బంతయునుబోయి క్రమక్రమముగాఁ దొంటి యాంతరంగిక స్నేహ మలవడ‌ నెప్పటియట్లు మెలంగఁదొడంగిరి. చేతి కబ్బిన యనంగమోహినిని యవివేకులమై యనుభవింపజాలకపోతిమని మాటి మాటికిని బశ్చాత్తాప మందు చుండిరి. హేమావతి తమ్మాడిన నిష్టురములకు దానియం దీర్ష్యవహించి తిరుగ నెన్నఁ డును దానింటికి వారరిగియుండలేదు ఆ యచ్చరకును నామిత్రద్వయమునందు విర క్తి బుట్టి వారి నెన్నడును దలంచియుండలేదు దానంజేసి వారికి స్వర్గలోక ప్రయాణావ సరముదరుచు కలుగదయ్యెను.

ఒకనాఁడా మిత్రు లిర్వురును వాడుక ప్రకారము విహారార్థమై కొండొకదూర మరిగి వచ్చుచుండగా నరిందముండు వారికి దారిలోఁ దారసిల్లెను. వారికిట్లు సంవాదము జరిగెను.