కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/315వ మజిలీ
ఆ గదినంతయును దివోదాసుండతి శ్రద్ధతో విమర్శింప నొకవైపునఁ గ్రిందిభాగమునఁ జిన్నతలుపు గోచరమయ్యెను. దానిని తెరచుటకు వానికి సాధనము గనిపింపలేదు. బుద్ధిమంతుండగు నతండది యొక గుప్తద్వారమని గ్రహించి దాని కీ లెచ్చటనుండునో యెరుంగ నందందుఁ బరీక్షింప నాగదిగోడమూలఁ జిన్నమీట యొకటి దృగ్గోచర మయ్యెను. దానిని చేతితో నదుముటయు నా గుప్తద్వారము వివృతమగుటయు నొక్క సారి జరిగెను. అదిచూచి దేవకాంతలు భయాశ్చర్యస్వాంతలైరి దివోదాసమహారాజు మహాసాహసముతో నందున్న సోపానమార్గమునఁ గ్రిందకు దిగెను. తోడనే యా తలుపు మూసుకొనిపోయెను. అది మొదట నెప్పగిదిఁ దెరువఁబడినదో దేవకాంతలు గ్రహించియుండలేదు. కావున దానిని దిరుగఁదెరచుటకు వారనేకసాధనము లుపయో గించి చూచిరిగాని యేమియును గార్యము లేకపోయినది. పెక్కుసంవత్సరములనుండి వారందుఁ దిరుగుచున్నను నమ్మందిరమున నిట్టి గుప్తద్వారమున్నదని యెరుంగరు. శాంభవీదేవి యాలయనిర్మాణ సమయముననే యమ్మందిరముగూడఁ గట్టబడినది. ఆ గుప్తమార్గము నెద్దియో యుద్దేశ్యముతోనే మొదట యక్షపుంగవుం డేర్పరపించి యుండవచ్చును. ఆ దేవకాంతలు రాజేంద్రుని రాకకై యాద్వారముచెంత నెంత వేచి యుండినను వానిజాడ తెలిసినది కాదు. పిమ్మట వారు దేవీపూజకై యాలయమున కరిగిరి.
315 వ మజిలీ
మణిగ్రీవ జలంధరుల కథ
యక్షపురమున మణిగ్రీవ జలంధరులకుఁ గుబేరుని మూలమున మైత్రి కుదిరినది. వాని వైరభావం బంతయునుబోయి క్రమక్రమముగాఁ దొంటి యాంతరంగిక స్నేహ మలవడ నెప్పటియట్లు మెలంగఁదొడంగిరి. చేతి కబ్బిన యనంగమోహినిని యవివేకులమై యనుభవింపజాలకపోతిమని మాటి మాటికిని బశ్చాత్తాప మందు చుండిరి. హేమావతి తమ్మాడిన నిష్టురములకు దానియం దీర్ష్యవహించి తిరుగ నెన్నఁ డును దానింటికి వారరిగియుండలేదు ఆ యచ్చరకును నామిత్రద్వయమునందు విర క్తి బుట్టి వారి నెన్నడును దలంచియుండలేదు దానంజేసి వారికి స్వర్గలోక ప్రయాణావ సరముదరుచు కలుగదయ్యెను.
ఒకనాఁడా మిత్రు లిర్వురును వాడుక ప్రకారము విహారార్థమై కొండొకదూర మరిగి వచ్చుచుండగా నరిందముండు వారికి దారిలోఁ దారసిల్లెను. వారికిట్లు సంవాదము జరిగెను. మణి --- మిత్రమా ! ఈ మధ్య నీవు బొత్తిగా మాకుఁ గనిపించుట మాని వేసితివేమి? నీవెద్దియో వ్రతదీక్షయందున్నావని వింటిని. అయ్యది పూ ర్తియయ్యెనా ?
అరి౦ద - మణిగ్రీవా ! నావ్రత మంతయును గొలఁది దినముల క్రిందనే పూర్తియైనది కాని యా వ్రతఫలము మాత్రము శూన్యమయినది.
జలం --- అదెట్లు? గుణవతిని బరిణయ మగుటయే యా వ్రత ఫలంబని దెలిసినది. నీ కామె నిచ్చుటకుఁ జిత్రకేతున కభ్యంతర మేమియును లేదుగదా?
మణి --- ఈ సంబంధమునకు మా తల్లిదండ్రులు లిదివరకే యిష్టపడిరి.
జల -- ఇఁక గావలసిన దేమున్నది. భైరవీదేవి వీనియందుఁ బ్రసన్నత వహించియున్న దనవచ్చునుగదా చేసిన పూజా వ్యర్ద మెన్నటికిని గానేరదు.
అరిం - ఎవరి కిష్టమున్న నే మాయెను, గుణవతికి నాయందిసుమంతైనను గోరిక లేదు.
మణి -- తల్లిదండ్రుల యనుమతంబు నెన్నఁడును నా సహోదరి యతిక్రమింపదు.
అరిం - అట్లయిన నీ పంచమీ శుక్రవారమునాఁడు స్వయంవరముఁ బ్రకటించుట యెట్లు జరిగెను.
మణి - అయ్యది లోకవిడంబనార్థమని గ్రహింపవలెను.
అరిం - నీ వేమి చెప్పినను గుణవతి నన్ను వరింపదను సంగతి మాత్రము నాకుఁ బూర్తిగఁ దెలియదు. అట్టి యిష్టములేని వనితం బెండ్లియాడఁ దలంచుట మిగుల నవివేకమని నే నిప్పుడు నిక్కముగఁ దలంచుచున్నాను.
జలం - [నవ్వుచు] మా మిత్రున కింతలో నింత మనఃపరివర్తనము గలు గుట మిగుల నబ్బురముగానే యున్నది.
మణి -- [అరిందమునితో] నీ మాటలు విన నామెయందు నీకు విరక్తి గలిగినట్లు దోచుచున్నది గదా ? ఇంతకు మించిన సుందరాంగి నీకు లభింపఁగలదా! ఊరక మనస్సంకులముం బొందక స్వయంవరమున కేతెమ్ము. నిన్నే యామె మా తల్లిదండ్రుల యాదేశము వడువున వరింపఁగలదు.
అరిం --- ఆమె హృదయమున నింతకు వేఱొక పురుషపుంగవుని వరించియే యున్నది. అయ్యది నాకు పరమసమ్మతము. కావున నే నామెను గలనైన నిఁక దలంపఁబోనని యెరుంగుము.
మణి - ఆమె వరించియున్న పురుషుఁ డెవ్వరు ?
అరిం - దివ్యబల ప్రభావ ప్రతాప తేజోవిరాజితుండగు దివోదాస ధారుణీ చక్రవర్తియే యామె మనోహరుండని నమ్ముము.
మణి, జలం - [ఆశ్చర్యమును సూచింతురు.] జలం -- ఆ మహారాజు నీమె వరించుట యెట్లు గలిగెను ఆతఁడు మనుషుఁడును నీమె యక్షకన్యకయునుగదా! లోకాంతరమందున్న వాని నీమె యెట్లె ఱింగెను.
అరిం - ఆ మహారాజిప్పు డీ లోకమునందే యుండెను. శబరబాలకాన్వేష ణంబు నెపమున నతండిందు యోగమార్గమున విచ్చేసెను. అని యాకథ నంతయును సంక్షేపముగఁ గొంతకొంత వారికి జెప్పెను.
మణి --- ఉత్కష్టమగు యక్షవంశమందు బుట్టిన గుణవతి మనుష్య మాత్రున కిచ్చుటకు నే నంగీకరింపఁజాలను. ఆ మానవనాధు నిందుండి యేటో మాయో పాయమున నావలకు సాగనంపు వఱకు నామనమున నూఱట గలుగనేరదు. మిత్రమా! జలంధరా! ఇందులకు నీ వేమందువు.
జలం - ఇందులకు నాకు పరమసమ్మతము. యక్షకన్యక మనుష్యమాత్రున కిల్లాలగుట మనలోకమున కంతకును దలవంపులుగా నుండును.
మణి - [అరిందమునితో] మిత్రమా! నీవిప్పుడు దివోదాసుని పనిమీదఁ బోవుచుంటివిగదా? ఇట్లు జేయుట నీకుఁ దగనిపని యని యెందులకుఁ దోచలేదు నీవా నరనాయకుని సేవకుఁడవా యేమి? నీవు పూనిన కార్యమునుండి విరమించి ముందు మా యుద్యమమునకు సహాయ మొనర్పుము.
అరిం - అయ్యో! మీ యవివేకమునకు మేర లేకున్నది భైరవీదేవి స్వయముగా నన్నా ధాత్రీకళత్రున కప్పగించినది. అమ్మహారాజు బలపరాక్రమ ప్రభావముల దివ్యులఁ దలదన్ను వాఁడని యా యమ్మవారే సెలవిచ్చియుండెను. అట్టి వానితో శత్రుత్వము వినాశ హేతువగును గదా ? మీ యూహలు నా కించుకయును రచింపవు. మీ యవివేకమునకుఁ బిమ్మట మీరే పశ్చాత్తప్తు లగుదురు. మీతో నే నేకీభ వింపఁ జాలను. మీ దారిని మీరింక పొండు. శబరబాలకుని వెదకుట యందు నేను మసలరాదు.
మణి - ఇప్పుడా రాజెక్కడ నుండెను ?
అరిం - శబరబాలకు నన్వేషించుట కా యనఘుండు తూర్పు దిక్కునకు స్వయముగాఁ బోయి నన్నీ పడమటివైపున వానిజాడ లెరుంగఁ బంపెను.
జలం - శబరబాలకుఁ డీలోకమునుండి వెడలిపోయిన యుదంత మెరుం గరు కాఁబోలును. మీ ప్రయత్న మంతయు నిందు వ్యర్థమే యగును.
అరిం --- వాని వృత్తాంతము నీ కెట్లు తెలిసెను.
జలం - నాలుగు దినముల క్రిందట బ్రాతఃకాలమున భైరవీదేవి యాలయ మునకు గ్రోశుదూరమున బేటికావలంబకుం డగు మనుజబాలకుండు మా కంటబడెను. ఆ పెట్టి లోపలను వాని శరీరమందును నెద్దియో తైలముండుట జూచి మేము వానిని చోరునిగా సంశయించి యా పెట్టియందు వానిని బంధించి భూలోకమున హిమ శైలముమీద బడవైచి వచ్చితిమి. వాడీసరి కాపేటికాంతరము నందో లేక యే యడవి మృగము వాతనోబడి మృతినొందియుండును. ఓపిక గలదేని వానికొరకు మీరు యమ లోకమునకు బోయిన నందు వాడు గనంబడగలడు.
మణి -- ఈ సంగతి నీ యజమానునితో మనవిజేసి సత్వరమ వానిని నర లోకమునకు దోడ్కొని పొమ్ము అని పరిహాసమాడెను.
ఆ మాటల నమ్మి యరిందముండు ముందేగుట మాని యా వృత్తాంతము దివోదాసునితో జెప్పవలయునని వెనుకకు మరలెను. మణిగ్రీవజలంధరులును వానితో నడచుచుండిరి. వారు మువ్వురు నిట్లు కొంతదూర మరుదెంచువరకు వారికి ముందు గుణవతి లిలోద్యానము గోచరమయ్యెను. అందు గుణవతి యనంగమోహినితో గాత్యా యనీవ్రత మొనరించుచుండెను. నాడు దివోదాసుడు దమ సన్నిధినుండి యెచ్చటకో పోయి తిరిగి రాకుండుటకు భయమందుచు శీఘ్రమ యాతని నిరపాయునిగా దమ సన్నిధిం జేర్చుటకు గాత్యాయనిం బ్రార్దించుచు నా వ్రతమును జేయుచుండిరి నాడు వ్రతసమాప్త మొనరించి యోషిజ్జనమునకు బసుపును, గుంకుమను బంచిపెట్టుచుండిరి.
ఆ సందడి నాలకించి మణిగ్రీవుండు జలంధరుని నిష్కుటద్వారమున నిలిపి తాను లోనికి బోయెను. అరిందముని మనంబు దివోదాసునియందె లగ్నమై యుండుటచే నతఁడందు నిలువక యెచ్చటికో పోయెను. మణిగ్రీవుడు దిన్నగా గుణ వతి మందిరమున కరిగెను. అందు గుణవతియు ననంగమోహినియు వేలుపుబేరం టాండ్రను బూజించుచు వారికి గనంబడరి. అనంగమోహినిని జూచుటతోడనే యతండు విభ్రాంతుడయ్యెను. కొంతసేపటివరకు నందలివారెవ్వరును వీని రాక గమ నించి యుండలేదు. పిమ్మట యనంగమోహిని వానింజూచి భయవివశయై యొక్క పరుగున నభ్యంతరమంధిరమునకు బారిపోయి యందు దలుపు బిగించుకొని యుండెను. మణిగ్రీవుని రాక యచ్చటనున్న మచ్చకంటు లెల్ల దెలిసికొని చెట్టొక పిట్టలై యందుండి వెడలిపోయిరి. గుణవతి యిరువురు చెలికత్తెలతో నందు మీగిలియున్నది. ఆమె సోదరున కెదురువోయి తోడ్కొనివచ్చి యుచితాసనమున గూర్చుండబెట్టి మిగుల నక్కటికముతో నిట్లనియె.
సోదరా! ఆడువాండ్రు విహరించు నీకేళికోద్యానమునకు నేడిట్లేల వచ్చితివి? నిన్నుజూచి యందలి స్త్రీ జనంబెల్ల యెట్లు పలాయనులైరో చుచితివా? నీ రాకవలన మా యుత్సవమునకు గూడిరాని యంతరాయము గలిగినది. ఈ యుదంతము బెద్ద లెరింగిన నీపై గినియకుందురా ?
మణి -- సోదరీమణీ ! నేను నీతో గొంత యత్యవసరముగా ముచ్చటింప వలసి యుండుటచే నసమయమైనను నేడిందు రావలసి వచ్చినది. ఇందులకు నాపై గినియకుందువుగాక.
గుణ - [ఆతురతతో ] నేడు విశేషము లేమి గలిగినవి ? నీ యాగమన కారణము సత్వరమ జెప్పుము. మణి - నేను వచ్చిన పని పిమ్మట జెప్పెదనుగాని ముందుగ నేనడుగు మాటకు సదుత్తరము నీవొసంగవలయును. నే నిందేతెంచువరకు నీ సన్నిధి నున్న పొన్నికొమ్మ యెవ్వతె? నన్ను జూచిన తోడనే యా చేడియ లోనికిబారిపోయె నేమిటికి? ఆ ముద్దులగుమ్మకు నీ సన్ని కర్షమున నంత స్వతంత్రమెట్లు గలిగెను ?
గుణ -- పరనారీమణుల ప్రసంగముతో నీ కించుకయు నిమిత్తములేదు. ఆ యన్నులమిన్న నాకు మిగుల నాంతరంగికురాలు. కొన్నిదినములనుండి నాతో గలసి మెలసి యున్నది. పరపురుషుని గాంచినతోడనే తొలంగిపోవుట శీలవతీ లక్షణమని యెరుంగవా ?
మణి -- ఆమె యాకార లక్షణముల బరికింప సురవనిత కాదని తోచు చున్నది. దివ్యకామినుల దిరస్కరించు సోయగముగల లలనామణి యిందుండుటకు వెరగందుచు నామె వృత్తాంత మెరుంగగోరితి నిందు తప్పేమియున్నది.
గుణ -- ఆమె యెట్టిదైనను నీకు తోడబుట్టువువంటిది కావున నామె విషయమై నా సన్నిధానమున నేమియును బ్రస్తావింపకుందువుగా.
మణి -- ఈమెను నేనిదివర కెచ్చటనో చూచినట్లుండెను. ఈ యోషా రత్నము మనుష్యలోకమునుండియే యిచ్చటకు వచ్చెను గదా?
గుణ --ఆమె విషయమగు ప్రసంగము గట్టిపెట్టుమన్న మానకుంటివేమి? ఈమె భూలోక చక్రవర్తియగు దివోదాస రాజమార్తాండుని యర్దాంగలక్ష్మి. కారణాంతరమున నిప్పుడు నా యంతఃపురమున నివసించియుండెను.
మణి -- ఏమీ ? ఈమెను నేనెరుగననుకొంటివా ? మనుష్యలోకమునుండి యీ దివ్యలోకమున కీ నారీమణి దెచ్చినవాడను నేను గాదా ? నా కామెతో బూర్వ పరిచయము లేదనుకొనుచుంటివి కాబోలును. నాతో నిట్లు మర్మముగా మాటలాడుట దగునా ? లోనికేగి యా యెలనాగతో నేనించుక ముచ్చటించుట కనుమతింపుము.
గుణ - మూర్ఖుడా ! అధిక ప్రసంగము జేయకుము. ఆ యంగనా మణి రూపమున కాసించి యిట్లసంబద్ధము లాడుచున్న నిన్నేమి చేయించెదనో చూడుము. పొమ్ము. ఆమె నీడ నైన స్పృశించుటకు నీకర్హతలేదని గ్రహింపుము.
మణి -- ఆమె నీడనే గాదు తద్గాత్రమునే యింతకుముందు స్పృశించియుంటి నని యెరింగిన నిట్లు వచించియుండవుగదా ? ఆమె నన్నే మనోహరునిగా నిరూపించు కొనిన మాట వినినచో నిట్లు కఠినముగా బల్క నేరవుగదా ?
గుణ - ఛీ! ఛీ!! నోరు మూసికొనుము. అచ్చమగు యక్షకులమున కంతకును మచ్చదెచ్చుచున్న నీ నీచ ప్రవర్తనమున కింకనైన బుద్ధి దెచ్చుకొనుము. ఒక్క మహాసాధ్వినిట్లు కారులుచర్చించు నీ నాలుకను వేయి చీలికలుగా గోయించినను దోసము లేదు. మణి --- సోదరి వని యెంత శాంతము వహించుచున్నను బెచ్చు పెరిగి యిచ్చకొలది మాటలాడుచుంటివి ! నీ సత్ప్రవర్తన మెరుఁగని వారియొద్దఁ జెప్పుము. యక్షకుల స్త్రీలు మనుష్యుని భర్తగాఁ బొందఁగోరుట కులధర్యమే గాఁబోలును ! ఆ దివోదాసుని రూపమున కాసించి వానిని దగుల్కొని వచ్చిన యొక్క పాపజాతి నాతి నింటఁ బెట్టుకొనియున్న నీవు నాకిందు ధర్మోపదేశ మొనర్పఁజూచుచుంటివా ! చాలు చాలు. తల్లిదండ్రులు యోగ్యుడని సమ్మతించిన యక్షకుమారుని భర్తగాఁ బడయ నెంచక తుచ్చమనుష్యజాతి వానిని భర్తగా గోరుచున్న నీవు నాకు నీతులు గరపు చుంటివా ! నీవును నేనును దక్కువ జాతియందే భార్యాభర్తల వరించుచుంటిమి. గావున నిందొకరి తప్పొక రెంచుకొన నగత్యము లేదు. నాతోనిఁక వివాదమునకుఁ బూనక యా నారీమణిని నాకిమ్ము. నీవు కోరిన దివోదాసునితో నిన్గూర్చుటకు నేను బ్రయత్నించెదను. లేదేని నేనీ మదగజగామినిని బలవంతముగా నీ సన్నిధినుండి కొని పోవుటయేగాక దివోదాసుఁడు నీకెప్పటికిని లభింపకుండఁ జేయుటకుఁ గూడ నేను సర్వ సిద్ధముగా నుంటినని నమ్ముము. అట్లు బెట్టిదముగా మాట్లాడుచున్న మణిగ్రీవునితో గుణవతి యేమియును సమాధానము జెప్పలేకపోయినది. తనగుట్టు వీఁడెట్లెరుంగఁ గలిగె నని యామె మనసునందుఁ బెక్కువిధముల నూహింపసాగెను. అనంగమోహిని యందలి మోహాతిరేకమున నామెఁ బడయనినాఁడు వీఁడు దనకోర్కె కెట్టి భంగము గలుగఁజేయునో యని యామె భయమందఁ దొడంగెను. తన సోదరుని వలన నామె కేమైనఁ గష్టము గలిగెనేని దివోదాసుఁ డదియెరింగి తన శీలమును సంశయించునేమా యని యాందోళనము బడఁజొచ్చెను. ఇట్లు భయాశ్చర్య విషాదంబులా వేదండయాన మన న నుత్తలపాటు గలుగఁజేయ నొకింతతడ వొడలెరుంగకుండెను.
ఆ యదనున మణిగ్రీవుండు లోనికిఁబోయి యనంగమోహని యున్న గది తలుపు దట్టెను. వారి సంభాషణమంతయును లోననుండి వినుచున్న యాయెలనాగ యంతకుముందె భయోద్రేకమున వివశయై పడియుండెను. మణిగ్రీవుండెంత పిలిచి నను దలుపు దీయఁబడలేదు. దానికతఁడు విసుగుఁజెందుచు నెట్లయిన నామెను బట్టు కొనవలయునను బూనికతోఁ గుడ్యోపరిభాగమునకెక్కి యా గదిలోనికి దుమికెను. తత్పతనవేగమున ననంగమోహినికిఁ దెలివివచ్చి మణిగ్రీవుని నందుఁ జూచి కాతర స్వరమున నమ్మోయని యొకబొబ్బపెట్టి తిరుగ గాడమగు మూర్ఛలో మునిఁగి పొయెను.
అప్పుడు మణిగ్రీవుండు దలుపుతీసి యతిసాహసంబున నమ్మదవతి నెత్తు కొని యీవలకు వచ్చి తొందరగా ముందుఁ బోవుచుండెను. గుణవతి వానిపోకడఁ గని పెట్టి చెలికత్తెల సహాయముతోఁ దెంపున నడ్డు దగిలెను. మణిగ్రీవుండు దనకడ్డువచ్చిన మచ్చకంటుల హస్తప్రహారముల వివశులంజేసి నిముషములో జలంధరుని సమీపించి మిత్రమా ! చేతఁజిక్కి దాఁటిపొయిన చిలుక తిరుగఁ బట్టుపడినది. అవివేకులమై యపుడు గాలఁదన్నుకొనిపోయిన భాగ్యలక్ష్మి నేఁడు గ్రమ్మర మనవశమైనది. ఇపు డైనను మనము దీనిని జాగ్రత్తగాఁ గాపాడుకొనవలయును. అని వచించుచు నుద్యాన మందిరమున జరిగిన వృత్తాంతమంతయును వాని కెఱింగించి యీమెకుఁ దెలివిగలుగు లోపల నొకవివిక్త ప్రదేశంబునకుఁ జేర్పఁదగును గావున నతిశీఘ్రముగ విమానమును గొనిరమ్మని వానినంపెను. జలంధరుండును విస్మయస౦తోషాశ్చర్యములతో సత్వరమె యొక దివ్యయానమును విమానశాలనుండి కొనితెచ్చి మణిగ్రీవునను సంతోషమును గలుగఁజేసెను.
పిమ్మట నొడలెరుంగక పడియున్న యాసన్నుతాంగిని విమానము పైఁ బెట్టుకొని వారిరువురును భూలోకమునకుఁ బోయి యందు జనసంచారానర్హంబగు శీత నగాగ్రమున నొక సుందరకందరాంతరమునఁ బ్రవేశించిరి. యక్షలోకమున గుణవతి కిని నామె చెలికత్తెలకును మణిగ్రీవుం డరిగిన కొంతసేపటికి తెలివి వచ్చినది. అనంగ మోహినిని దన సోదరుండు బలాత్కారముగాఁ గొనిపోవుటకు గుణవతి మిగుల విచా రించెను. ఈ యుదంతము నితరులతోఁ జెప్పినఁ దనగుట్టు బట్టబయలగునేమోయను భీతిచేత దొంగఁ దేల్గుట్టిన చందమున నెవరికిని దెలియనీయక నిజనివాసమునకేగి లోలోన గుందుచుండెను.
316 వ మజిలీ
య౦త్రబిలముకథ
దివోదాసుండు గుప్తసోపాన మార్గమునంబడి కొంత దూరమరుగునప్పటి కంతకుముందందుగల చీఁకటి క్రమక్రమముగా నంతరించుచు నత్యద్భుతమగు తేజో రాశి గోచరమయ్యెను. ఆ యనఘుఁడు దానున్న దొక విశాల బిలాణ్విమని గ్రహించి దాని యంతమెఱింగి యందలి వింతలఁ దెలిసికొనఁ దలంపు మిగుల నతిసాహసమున ముందునకుఁ బోవుచుండెను. ఆ బిలమున కిరుప్రక్కల నచ్చట నుండియే యనర్ఘ రత్నములు స్థాపింపబడియుండుటచేఁ బట్టపగలువలె నా ప్రదేశమంతయును దేదీప్య మానముగ వెలుఁగుచుండెను. అట్లతడు కొంతదూర మరుగునప్పటికి ముందబ్బిల మార్గమున కడ్డముగానున్న యినుపబోనును బోలు యంత్రమునం దొకవ్యక్తి చిక్కు కొని కష్టపడుచుండుట కనంబడెను. ఆ దృశ్యమున కతండద్భుతమందుచు నతిజ వంబున నా యంత్రమును సమీపించెను. కోరలవలె నినుప నారసము లనేకముగాఁ బైనుండియుఁ గ్రిందనుండియు నా వ్యక్తిని గట్తిగా నొక్కి వేసెను. వాని సందునంబడి యావ్యక్తి కొట్టుకొనుచు బాధచే బిట్టమూల్గుచుండెను. అ ధ్వని యా బిలమంతయును