Jump to content

కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/313వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఈ లోకమాత నికటంబును జేర మరణదేవత భీతిఁజెందవచ్చును. ఈలోకేశ్వరికి జీవ హింస గిట్టదనుటకిది నిదర్శనముగాదా ? ఈమె సన్ని ధానమునఁ బశులిశసనం బొన రించి కోర్కెలం బడయ నెంచుట యవివేకమని తెల్లమగుచుండ లేదా ? అని యనేక ప్రకారముల నా భైరవీదేవిని గొనియాడెను.

అప్పుడాదేవి వెండియు నశరీరవాక్కుల నిట్లనియె రాజేంద్రా ! నీ యొద్ద గల యనంగమోహినీ శిరోరత్నమే యరిందమునకు సంజీవనమయ్యెను. ఇయ్యది మృతసంజీవిని యనెడి యనర్ఘరత్నము. రత్నచూడుడను నా గోత్తముని శిరమునఁ బుట్టుకతోనే పుట్టి యనంతరము వాసుకివశమై యనంగమోహినికి శిరోభూషణమైనది. ఈ మణి శ్రేష్టము నీ యొద్ద నుండుటచేతనే నీచేఁ గొనిపోఁబడినఁ మందసములోని శబరబాలకుఁడు గూడబునర్జీవితుండై పైకివచ్చియా పెట్టెం బట్టుకొని భయోద్రేకమునఁ బారిపోయెను. నాఁడు హిమవన్నగమున వ్యాఘ్రము నీచేఁ జావకుండుటకు నిమ్మణియే కారణము. ఇప్పుడు నీకు మరణము గలుగకుండుటకుఁగూడ నా రత్నప్రభావమే మూల మని వేరుగఁ జెప్పఁబనిలేదుగదా ?

ఈ యరిందముఁడు నీకిఁకమీద మిత్రుఁడై సేవకుఁడై సహచరుండై మెలంగగలవాఁడు. శబరబాలకు నన్వేషించుటలో మీఁకు గొంతశ్రమ గలుగఁగలదు. కాని శీఘ్రకాలములోనే సౌఖ్యములఁ బడయఁగలరని మిన్నకుండెను. ఆ పలుకుల నాల కించి వారిరువురును సంతోషాశ్చర్యములఁ బొందిరి. దేవి యానతివడువున వారొకరి కష్ట సుఖములకొకరు సహాయులగుచుఁ బ్రాణమిత్రులై యుండుటకు బాసఁ జేసికొని యా భైరవీదేవికి నమస్కరించి యందుండి శబరబాలకు నన్వేషించుటకు వెడలి పోయిరి.


313 వ మజిలీ

శబరబాలకునికథ

దివోదాసుఁడు మొదట బైరవీదేవి యాలయములో నరిందముఁడు స్నానార్ద మరిగినప్పుడు శబరబాలక శవమున్న మందసము మూత పైకెత్తి విమర్శించినప్పుడే వానియొద్దఁగల మృతసంజీవనీ రత్న ప్రభావము తత్పేటికాంతరమున బ్రవేశించెను. పిమ్మట నతండా పెట్టెంబట్టుకొని కాసారతీరమున కేగుచున్నప్పుడే శబరబాలకునకు చైతన్యము లభించెను. సరోవరతీరమునఁ బెట్టెనుబెట్టి దివోదాసుఁడు స్నానమున కరుగు నప్పటి కాబాలకునకు బూర్తిగా దెలివివచ్చినది. పిమ్మటఁ దైలద్రోణియందుండుట కూపి రాడక వీపుతో దానిమూత పై కెత్తి యీవలంబడెను. వానికంతయు నంధకారబంధుర ముగా దోచెను. ఆ పెట్టియందు దన్నెవ్వడో బంధించి యచ్చటకుఁ జంపునుద్దేశముతో దెచ్చి నట్లు వాడు తలంచెను అచ్చటనున్న దనకు బ్రాణాపాయము రాగలదని నిశ్చయించి యందొక నిముసమైన నుండవెరచి యా మందసమును నెత్తిపై బెట్టికొని యతి జవమున నొక దారిం బట్టి పారిపోయెను.

ప్రాణభీతిచే వాడట్లు పోయిపోయి యలసట గలుగుటచేత ముందేగజాలక యందొకచో బెట్టెను దింపి దానిపై గూర్చుని యాయపరిచిత ప్రదేశమున తనయసహా యత్వమునకు జింతించుచుండెను. అప్పటికి వెలుగు వచ్చినది. దిక్కులు విస్పష్ట ముగ గన్పట్టుచుండెను. ఆ ప్రదేశమంతయు వానికివింతగ దోచుచుండెను. ఇంతలో నిరువురు పురుషులు వాడున్న చోటికి వచ్చుచున్నట్లు గనంబడెను. వారిం గాంచిన తోడనే శబరునకు మేను కంప మొందసాగెను వారే నిక్కముగ దన్ను జంపదలం చినవారిని భీతి జెందుచుండెను. ఎచ్చటికైన వారికి జిక్కకుండ బారిపోవ నుంకించు చుండెను. కాని వానికది సాధ్యపడలేదు. ఆ పురుషులు పరుగుపరుగున వాని సన్నిధి కేతెంచి చెరియొక ఱెక్కయును గట్టిగా బట్టుకొని నిలబెట్టిరి.

వాని యొద్దంగల మందసమును గాంచి వాడొక చోరుడని సంశయించి వారట్లు జేసిరి. ఆ యమాయక బాలకుండు వారిచే బట్టుబడి భయోద్రేకమున వివశు డయ్యెను. వారడిగిన ప్రశ్న కొక్కదానికిని వాడు బ్రత్యుత్తరం బొసంగకుండుటచే వారి సంశయము వృద్ధియయ్యెను. వానియొడల నంటియున్న తైలము గాంచి వారిరు వురు వాని దొంగయని నిశ్చయించిరి. పెట్టె నెచ్చట మృచ్చులించితివో నిక్కము జెప్పెదరా లేదా యని నిర్బంధింప దొడంగిరి. వారేమన్నను వివశుడై యున్నందున మారుమాటాడలేదు. కొండకవడిగా బాలకుండు వారి చేతులలోనుండి క్రిందకొరి గెను. చేష్టలు దక్కియున్న వాని నందు బరుండబెట్టి యా పురుషులు మందసమును బరీక్షించిరి. అందే వస్తువయును లేక తైలావలిప్తమై యుండుటకు నివ్వెరంబడుచు వారిట్లు వితర్కించుకొనిరి.

ఒకఁడు - సోదరా ! జలంధరా ! ఇదేమి చిత్రము ! ఈ పెట్టెలో నలు మూలల దైలమిట్లు పూయబడియున్న దేమి ?

జలం -- మణిగ్రీవా ? ఈ చోరుని యొడలగూడ నిట్టితైలమే యుండుట దిలకింపలేదా ? వీడెద్దియో ఘాతుక కార్యాచరణపరాయణుండై యచ్చటికి వచ్చి మనచే బట్టుపడెను.

మణి --- వీడతిభీరుడువలె దోచుచున్నది పట్టుబడినంతనే చైతన్యము బాసిన వాడెట్లు దొంగతనము జేయగలడు ?

జలం - ఇట్లుండుట గూడ దొంగవేసమే కావచ్చును. మనల మాయ జేయుట కిట్టి పన్నుగడ వేయుచుండెనేమో ? మణి --- వీడు మనుజుడువలె గన్పించుచుండె నీలోకమునకెట్లు రాగలిగెనో గదా?

జలం --- ఏ రాక్షసాధముడో యిట్టి వేషమున యక్షుల భాగ్య మపహరింప నిందేతెంచి యుండును. వీనిని విడువరాదు.

మణి --- సోదరా ! వీని యాకారము జూడ నాకట్లు దోచుటలేదు.

జలం - మనుజుడుగానీ మనుజాశనుడుగానీ, ఈ లోకమున నుండదగిన వాడుగాడు. సత్వరమ వీనినిందుండి లేవగొట్టవలయును.

అని వారిరువురా శబరబాలకు నెత్తి యా పెట్టెలో బెట్టి మూతవైచిరి. జలంధరుడు విమానశాలకరిగి యొక దివ్యయానమును దెచ్చెను. ఆ పెట్టెను దానిలో బెట్టుకొని యా యక్షులిర్వురును భూలోకమున కేగి శీతశైలంబున నొక‌ మహారణ్య మధ్యంబున నా మందసమును బడవైచి నిజలోకంబున కేగిరి.

పిమ్మట గొంతసేపటికి శబరునకు స్మృతి వచ్చినది. తిరుగ దాను మందస ములో నుండుటకు భయపడుచు దాని మూతను వీపుతో బై కెత్తి యీవలకు వచ్చెను. అప్పుడొక మహారణ్యమధ్యమున దానుండుట గ్రహించి యేమి చేయుటకుం దోచక కొండకతడవు విభ్రాంతుడై యిటునటు బరికించుచుండెను. తన మేనంగల తైలమును జూచి అసహ్యించుకొనుచు నా పెట్టి నెత్తికొని యెచ్చటనైన జలాకరంబున నొడలు గడిగికొనుటకు గొంతదూరమరిగెను. అందొక పర్వతధారంగాంచి దేహమునంటి యున్న దైలంబుబోవునట్లు స్నానమొనరించి మందసమును గూడ నానీరంబులచే గడిగి యాపోవనీటింద్రావి యందున్న కందమూలాదుల నాకలి నడంచుకొని కొంతసేపట విశ్రమించెను.

ఆ యరణ్యమంతయును భయంకర దుష్టసత్వసమన్వితంబగుటచే మాటి మాటికి వానికి సింహ శార్దూలాది వన్యమృగముల భీకరారవములు వినంబడుచుండెను. ఇంతలో రెండు సింహములు చెలగాటము లాడుచు గ్రమముగా వాడున్న చోటికి వచ్చెను. వానింగాంచి యెటు పోవుటకును దోచక భయవిహ్వలుడై తటాలున దగ్గర నున్న పెట్టి మూత నెత్తి యందు దూరియుండెను. మనుజుని సవగ్రహించి యీ దుష్ట మృగములు దిన్నగా మందసము దాపునకు వచ్చి యందున్న వాని బొట్టబెట్టుకొన వలయునని ప్రయత్నించినవి. వాడు పెట్టిలో నిమిడి పైమూత యూడకుండ గట్టిగా నదిమిపట్టుకొని యుండుటచేత నా మృగములా పెట్టి నిటునటు గాళ్ళతో దొర్లించి నను వాని కేయపాయమును గలుగలేదు. ఆ పెట్టియును దృఢదారుఖండములలో లెస్సగా సమకూర్పబడియుండుటచే నెట్టి దెబ్బ తగిలినిను జెక్కుచెదరకుండెను. ఆ మృగములు చేయునది లేక కొంత సేపటికి వచ్చిన దారిని దుముకుచు బోయినవి. మృత్యుముఖమునుండి యీవలబడినట్లు తలంచుచు నా శబరబాలకుడు దనకట్టి సందిగ్ధ సమయంబున బ్రమాదరహితంబగు నుపాయమును దోపింప జేసి యా యాపద దప్పించిన పరమేశ్వరుని మనమున స్తుతించుచు నా పెట్టి వెడలివచ్చి దానింబట్టుకొని యొక దారింబడి నడువసాగెను. ఎదుర నెచ్చటనైన దుష్టమృగములు దారసిల్లినపుడు వెనుకటివలనే పెట్టెయందు దూరియుండి యవి వెడలిపోయిన పిమ్మట నడక సాగించు చుండెను. ఇట్లు నిర్భయముగా సాయంసమయమగువరకు నా యరణ్యమందు దిరుగు చుండెను. కాని యెప్పటికిని దాని యంతము వానికి దొరికినదికాదు. తిరిగినచోటనే తిరుగుచు నెక్కినమెట్లలే యెక్కుచు జూచిన ప్రదేశమునే చూచుచు నేమి చేయుటకుం దోచక విభ్రాంతుడగుచుండెను. అంత గొంతసేపటికి చీకటి దెసల నాక్రమింప సాగెను. కందమూలంబులదిని యాకటిచిచ్చు జల్లార్చుకొని యా పెట్టెనే శరణ్యముగ నెంచి యొక విశాల తరుమూలంబున నారాత్రి గడుపనెంచి యందు జేరెను. మృగభీతిచేబయల బరుండనోడి యా పెట్టిలోనే శయనించెను. ఆ మందసము దగినంత వైశాల్యము గలిగి నలువైపుల గవాక్షములవలె రంథ్రము లుండుటచే వానికొక చిన్న శయనమంది రమువలె నొప్పియుండెను. ఎంత నిర్భయముగా వాడందు శయనించినను నుక్క చే వాని కించుకేని యా రాత్రి నిద్రపట్టలేదు.

అర్ధరాత్రమగు సమయమున నా శాఖాగ్రమునుండి సంగీతధ్వని వానికి వినబడ జొచ్చెను. దాని కబ్బురంపడుచు బైటకేతెంచి తత్కారణమరయుటకు భయము గలిగి తెల్లవారుఱకు పెట్టైలోనే యుండి యాగానమాధురి నా శబరబాలకుం డనుభ వింపుచుండెను. సంగీతమేమో యెరుంగని యా కిరాతునకు గూడ నా గానమువలన నపరిమితానందముగలిగి వాని యవస్థనంతయును మఱవజేసెను. తెలవారుసరి కాగానము ముగిసినది. పెట్టె సందులలోనుండి వెలుగులోనికి బ్రసరించుచుండెను. వివిధశకుంత సంతాన సంకులనిస్వనంబు వలన నా ప్రభాతం బతి మనోహరమయ్యెను. వాడప్పుడు పెట్టెనుండి బైటకేతెంచి రాత్రి సంగీతము పాడిన గాయకుని కొఱకై యా చెట్టుకొమ్మ లన్నియును బరిశీలింప దొడంగెను. కాని యందెవ్వరి జాడయును గనిపింపలేదు. ఆ వృక్షము నాశ్రయించి పిశాచమెద్దియైన నట్లు గాన మొనర్చెనేమో యని వానికి మన మున భయము బుట్టెను. ఆ ప్రదేశమున నుండుట యనర్దదాయకమని తలంచుచు నప్పుడే పెట్టెతో నటఁగదలి మఱొక దారింబట్టిపోయెను ఆ దివసాంతమువరకుఁ దిరిగి రాత్రికొక తరుమూలమునఁజేరి యధాప్రకారము మందసమున దూరియుండెను. వెను కటిరీతినే యర్ధరాత్రము మొదలు తెల్లవారు వరకు దివ్యగానము వానికి వినంబడు చుండెను. మరునాఁడు వేరొకవైపునకుఁబోయి రాత్రియగుసరి కింకొక వృక్షమూలమునఁ బెట్టెలోఁబరుండెసు. అచ్చటఁగూడ వానికి సంగీతధ్వని వినవచ్చెను. నాల్గవదివసమున వేరొక దిక్కునకుఁబోయి యారాత్రి మరొక్కపాతపముక్రింద మందసమున శయ నించెను. అచ్చటసైతము గీతనాదము వానికి శ్రవణానందముగ వినంబడెను. ఇట్లు నాలుగుదిక్కులంగూడ దివ్యగానము శాఖాగ్రములనుండి వినంబడుచు నిశాంతమున కంతయు శాంతమగుచుండుట కా శబరబాలకుండు భయవిస్మయావేశహృదయుఁడై దానిమూలమిదియని గ్రహింపఁజాలక యైదవదినమున నొకమారుమూలదారింబట్టి పోవు చుండెను ఆ ప్రశాంత ప్రభాతమున శీతలవాతపోతములు మేనికి సుఖముగూర్చు చుండెను. ఇంతలో నొకదండనుండి వేదండఁబొండు ప్రచండవేగమున ఘీంకరించుచు వానియండకు రాఁదొడంగెను ఆ ధ్వనితోడనే వానికి ప్రాణము లెగిరిపోయినట్లయ్యెను. జీవితాశచే నెట్లో యా పెట్టెలో దూరి‌ మూతఁ బిగించుకొనెను. ఆ యడవియేనుఁగు తిన్నఁగా మందసము దాపునకువచ్చి తొండముసాచి దానింబట్టుకొని యతిరయమున నెచ్చటికో పోవుచుండెను. పెట్టె సందునుండి చూచుచున్న యాబాలునకు జీవితాశ పూర్తిగా వదలినది‌. నాఁడే తన జీవితపరమావధియని తలంచుచుండెను. ఆ వేదండ శుండాదండమునుండి తప్పించుకొనఁగల్గుట కల్లయని నిశ్చయించుకొనెను. ఆ పెట్టె మూఁత యెప్పుడు విడిపోవునో యెచ్చట క్రిందఁబడి చూర్ణీభూతగాత్రుండనగుదునో యని యడుగడుగునకు భయపడుచుండెను. ఇంతలో నయ్యనేకపముఖ్యంబొక లోయలో దిగి నడచుచుఁ గ్రమమున నొకవిశాలప్రదేశమునఁ గల కమలాతీరముజేరి యాపెట్టె నందుఁ బడవైచి యాకొలనిలోనికిదిగి‌ తొండమున నీరముల బూరించి పైకెగఁ జిమ్ముచు బద్మకాండముల మూలములతో నూడఁబెరుకుచుఁ బెద్దతడవందు జలవిహార మొనరించి తనివిఁజెంది జలము వెడలివచ్చి యయ్యరణ్యమునఁబడి నిముసములో నదృశ్యమయ్యెను.

ఇంతలో నల్వురుజవ్వనులు ముచ్చటలాడుకొనుచు నప్పద్మాకరంబున కేతెంచి మించిన యానందమున సంబరముల దీరమున బెట్టి యొండొరుల చేతులం బట్టుకొని యాసరోవరమున దిగి యధేచ్చగా జలవిహారము సేయఁదొడంగిరి. ఆ లేఁజవరాండ్రు సమానవయోరూపవిలాసజాతుర్యములం గలిగి యొండొరులపై జలము జల్లుకొనుచుఁ బందెములు వై చికొని యీదులాడుచు నొకరినొకరు పరిహాసము లాడు కొనుచు నీరెగజిమ్ముచు నరచేతులతోఁ దపతప తట్టుచు నెదురనున్న వారిపై నీరు ధారగాఁ బడునట్టుముప్టినిష్పీడనము తొనరించుచుఁ బెద్దతడ వందు జలక్రీడా వినో దములఁ బ్రొద్దుపుచ్చిరి.

మందసములోనుండి శబరబాలకుండు దత్క్రీడా విశేషములఁ జూచు చుండెను. ఆ సీమంతినీ రత్నముల యంగసౌష్టవమునకు విస్మయమందుచుండెను. వారి యపురూపపు రూపలావణ్యముల కద్భుతమందుచుండెను. పిమ్మటఁ గొంత సేపటి కా యంగనామణులు జలక్రీడలుచాలించి తీరమున కేతెంచి పుట్టములంగట్టికొని పటురయ మున నందొక మార్గమున బట్టిపోయిరి. వారరిగిన తరువాత శబరబాలకుండు మంద సము వెలువడి యాయన్నుమిన్న లరిగినదారినే వారినరయు దలంపునఁ బోయెను. ఇట్లు కొంతదూరమేగువరకు ముందు వానికొక దేవాలయము దృగ్గోచరమయ్యెను. సువర్ణ మణిమయ గోపురప్రాకారాదులచే నద్దేవతాయతనము గన్నులకు మిరుమిట్లు గొలుపుచుండెను. మహారణ్యమధ్యమున నట్టిదివ్యాలయముండుట కచ్చెరువువడుచుఁ దొందరగా వాఁడు ముం దరిగి తృటిలో దానిని సమీపింపఁ గలిగెను.

ఆ గుడి తలుపులు తీసియున్న కతమున లోనికి నిరాటంకముగఁ బోయెను. ప్రాకారమధ్యముననున్న శుద్ధస్వర్ణవినిర్మితంబగు దేవతాగారమునుజూచి భయవినయ విస్మయములతోఁ బ్రదక్షణములొనరించి తెంపున గర్భాగారముం బ్రవేశించెను. అందు దివ్యప్రభావమునఁ దేజరిల్లు యంబికావిగ్రహము గనంబడినది. మణిదీపికలచే నాగర్భా లయమంతయు విస్పష్టముగఁ గనంబడుచున్నది. మన వనాటబాలకుఁడు మందసమును నేలఁబెట్టి యాయమ్మవారి కభిముఖుండై చేతులు జోడించుకొని యచ్చంపుభక్తి నా దేవిని బెద్దగా స్తుతించుచు నాపదలకాకరంబగు నయ్యరణ్యమునుండి దాను శీఘ్రమ యవులం బడుటకు వెరవుజూపుమని కోరుకొనెను. ఇంతలోఁ బ్రాంతమందు సంగీత ధ్వని వినంబడినది ఇదివరలోఁ దానువిన్నగానము దిరుగనందు వినంబడుటచేఁ జకి తుఁడై యందుండుటకు వెరచి మందసము గైకొని పరుగుపరుగునఁ దాణిద్వారమున నావలకుఁబోయెను. అచ్చటమిగుల రమణీయమగు నుద్యానము నేత్రపర్వమొనర్చెను. అందొకవైపునకుఁ బోవముందతిసుందరమగు మందిరమొండు గనంబడినది. దాని దాపున నున్న పుష్పవనమునందు యధేచ్చగా సంగీతము పాడుకొనుచు నల్వురు సుందరాంగులు పుష్పాపచయం బొనరించుచుండిరి. వారి సంగీతము దా నిదినవరకు నాలుగురాత్రులు విన్నగానము పోలికగానే యుండెను. వారి యాకారములు దానంతకు ముందు గాసారతీరమునఁ జూచిన యోషిల్ల లామల తీరునే తోపింపఁ జేయుచుండెను. అప్పుడు శబరబాలకునకు ముందేగుటకు వెనుకకు దిరుగుటకు మనంబొప్పదయ్యెను. రాత్రులయందు వృక్షాగ్రముల నివసించి మహారణ్యమధ్యమున గానమొనరించుట పిశాచలక్షణమని నమ్మి ముందేగిన స్త్రీ రూపమున నున్న నా భూతములు దన్ను విరచుకొని తినునేమో యను భయముగలిగె. అనన్యరూపలావణ్యముల డంబుమీరి యున్న యా యన్నుమిన్నల వారి విలాసవిశేషములఁ గన్నులారఁ జూడకుండ వెనుకకుఁ దిరిగిపోవుటకు మనంబొప్పకుండెను. ఇట్లు కొంతతడ వేమిచేయుటకుం దోచక యతం డచ్చటనే నిలువంబడి యాచేడియల చేష్టిలతంబుల గమనింపుచుండెను.

ఇంతలోఁ బువ్వులగోయుటఁ జాలించి యా మించుఁబోణులు దేవీపూజా సమయంబయ్యెనని పటురయమున నా గుడివైపున కేతెంచుచుఁ బేటికాహస్తుఁడై మార్గ మందు నిలువఁబడి తదేకదృష్టిగాఁ దమ్మీక్షించుచున్న యా యమాయకపు బాలకునిఁ గాంచి విస్మయావేశహృదయలై యిట్లు వితర్కించుకొనిరి.

హేమలత - సఖీ! విద్యున్మాలా ! మానవులకుఁ జేరరాని యీ కాంచన శిఖరాగ్రమున నున్న యంబికాయతనమున కీ నరబాలకుం డెట్లు రాఁగలిగెనే ? విద్యున్మాల - పేటికాహస్తుఁడై మనలఁ దదేకదృష్టిం గాంచుచున్న వీఁ డెద్దియో పాపఁపుటూహతో నున్నట్లు తోచుచున్నది.

తటిత్ప్రభ --- పాపఁపుటూహ లేకున్న మందసముం గొనిరాఁగతంబేమి యుండును. ఇచ్చోటఁగల యనర్ఘమణుల మ్రుచ్చిలించి యమ్మందసము నింపుకొని పోవలయునను తలంపున వీఁడిచ్చటి కెట్లో చేరఁగలిగియుండును.

మదనమంజరి -- సఖులారా! వీని చూపులం దిలకింప మన రూపముల నాశించి యున్నట్లు దోచుచున్నదిగదా ?

హేమలత - [మందహాసముతో] తన యందమునకు మనలఁబోలు రూప వతులు గావలయుఁ గాఁబోలును.

తటి - రూపము నాశించువానికి మందసమేటికే ?

విద్యు - మనుజబాలకునకు సౌరనారీ సహవాస యోగ్యత యెట్లు గలుగును.

హేమ - మనమందరకుఁ గూడ మనుష్యుఁడే యొడయుఁడగు నని యమ్మ వారి యాజ్ఞయైనదిగదా ?

మదన - అమ్మవారి యాజ్ఞయయ్యెనని యీ కురూపిని వరింతమందువా యేమి?

హేమ --- వీఁడు గాకున్న మరొక్కఁడైన మనుజుఁడే మనకు బతికావలసి యున్నదని నా యభిప్రాయము.

విద్యు -- మనము నల్వురము గూడ ననుకూలుఁడగు పతినొక్కనినే వరించుటకు నియమము జేసికొంటి మెరుంగుదురా?

మదన - ఆ నియమ మెన్నఁడును దప్పగూడదు. మనలో నెవ్వతెయైన నొకనిని వరించియున్నప్పుడు తక్కినవారికిఁ గూడ వాఁడే యొడయుఁడగును. ఈ యువకునందు మనలో నెవతెకైన ననురాగము గలిగియుండినఁ జెప్పవచ్చును.

అందరును - ఛీ! ఛీ! [అని అసహ్యించుకొందురు]

మదన -- భక్తులపాలిటి పారిజాతమన నొప్పు నియ్యమ్మవారు యోగ్యుఁ డగు పురుషసింహుఁడు మనకు భర్తగావలయునని దలంచునుగాని యిట్టి నీచునిఁ గట్టి పెట్టవలయునని జూడదుగదా?

తటి - అడవులంబడి తిరుగు కిరాతజాతివాఁడని వీనింజూచిన దెలియుట లేదా? ఇట్టి వానికై మీరింత తర్కించుకొనుటఁజూడ నాకు నవ్వువచ్చుచున్నది. వీడు తప్పక యందలి రత్నముల నపహరింప వచ్చినవాఁడు గాని మరొకటికాదు.

విద్యు -- మన మదనమంజరి వీనియందు లేని రసికత నిరూపించినదిగాని నీవు చెప్పినదే నిజము. వాని చూపులయందు మూఢత్వము దేటపడుచుండెనేగాని విలాసవిశేష మింతయును లేదు.

తటి -- ఏది యెట్లున్నను వీఁడిక్కడకు రాఁగలుగుట వింతగా నున్నది. హేమ -- సఖులారా ! శాంభవీదేవి నర్చించుటకు కాల మతిక్రమించు చున్నది. ముందాపని నిర్వర్తించుకొని వచ్చిన పిదప వీని విషయమై యాలోచించు కొనవచ్చును. ఇంతలో వీఁడెక్కడకుబోగలడు.

ఇట్లు వారు సంభాషించుకొని యమ్మవారి నర్చించుట కతి జవంబున నా గుడిలోనికిఁ బోయిరి. శబర బాలకుండు వారిం జూచినప్పటి నుండియు నివ్వెరపాటున మైమరచియుండెను. అట్టి యద్భుత లావణ్యముగల యలివేణుల నెన్నఁడును గనివిని యెఱుఁగని కారణమున వానికి వారి దర్శనము వింతఁగొల్పుట యబ్బురముగాదు. ఆ యంగనామణులు గుడిలోనికిఁ బోయినతోడనే వాఁడును వెనుకకుఁ దిరిగి గుడి యొద్దకు వచ్చి వెనుకటి ద్వారమునఁగాక మఱొక దానివెంట నా యాలయమును బ్రవే శించెను.


314 వ మజిలీ

దేవతా స్త్రీలకథ

హిమవన్న గరమునఁ గాంచనకూట మను శిఖరము మిగుల నెత్తైనది దానిని మనుష్యు లెవ్వరును జూచి యెరుంగరు సరేకదా యట్టి శిఖర మున్నదనియైన నెవ్వ రును వినియుండలేదు. పూర్వమొక యక్షుండు సంతాన మపేక్షించి యందు శాంభవీ దేవికి స్వర్ణమయ దేవాయతనంబు గట్టించి నవరత్నములతో నిత్యము నర్చించుచుఁ గొంతకాలమునకుఁ దన యభీష్టము బడయఁగలిగెను. ఆ యక్షునిచేఁ బూజ సేయఁ బడిన రత్నములతో నా యాలయప్రదేశమంతయు నిండిపోయెను. పిదపఁ గొంత కాలమునకు నల్వురు దేవతాస్త్రీలా యాలయంబున కేతెంచి రత్నకాసులెల్లఁ బ్రోవు సేసి యందొక భాగమున భద్రపరచిరి. కొన్ని యనర్ఘరత్నముల గర్భాగారము నందును నితర ముఖ్యప్రదేశములయందును నందముగా నమరించి యా యమ్మవారిని నిత్యమును బూజించుచుండిరి. ఆ గుడివెనుక నొక రమణీయోపవనము నిర్మించి యందు పూజార్హ ములగు వివిధ కుసుమ జాతులఁ బెంచుచుండరి. ప్రతిదినము మూడు వేళలయందును జేరువనున్న పద్మాకరంబున జలకములాడి వచ్చి యా యుద్యానవన ముననున్న పుష్పములఁ గోసి తెచ్చి‌ యా యమ్మవారి నధిక భక్తితోఁ బూజించు చుండిరి. రాత్రి ప్రొద్దుపోవువఱకు నా దేవీమండపమున భజనకీర్తనలం బాడుచుఁ బిమ్మట నల్వురు దల‌యొకదారిం బోయి యుదయమున కక్కడ చేరుకొనుచుందురు. ఇట్లు కొన్నియేండ్లు గడచిన పిమ్మట నొకనాఁటి యుదయమున వా రతిభక్తి నయ్యమ్మవారిం బూజించి తమ యిక్కట్టుఁ బాపి శీఘ్రమ యనుకూలవాల్లభ్యము గలుగునట్లనుగ్రహింపుమని ప్రార్థించిరి.