Jump to content

కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/312వ మజిలీ

వికీసోర్స్ నుండి

312 వ మజిలీ

అరిందమునికథ

నాఁటి సాయంకాలము భైరవీదేవి యాలయ ప్రాంగణమున కొక యక్ష కుమారుఁ డరిందముఁడనువాఁ డొకపరిచారకునిచేత పెట్టె నొకదానినిఁ బట్టించుకొని వచ్చి యందుఁబెట్టించి వానిఁబంపివేసెను. పిదప నతండా మందరము నొకప్రక్కకుఁ ద్రోసి యాదేవి విగ్రహము ముందుఁ జక్కఁగా నలికి చిత్రచిత్రములగు మ్రుగ్గులం బెట్టి వలయువస్తు సంచయమునెల్ల నాయత్తము జేసికొని యిఁక‌ నుపాసనకుఁ గడంగ వచ్చునని యనుకొనుచుఁ జేరువనున్న కాసారంబునకు స్నానార్థ మరిగెను.

వానిపోకడఁ గనిపెట్టి యా దేవీవిగ్రహము వెనుకనున్న యొక వ్యక్తి యీవలకువచ్చి యా పెట్టెలో నేమున్నదోయని దాని మూతను బై కెత్తి చూచెను. అందుఁ దై లావలిప్తసర్వాంగముగానున్న యొక మృతబాలక కళేబరము గనంబడినది. అదియెయ్యదియో తైలముతోఁ దడపఁబడియుండుటచే నించుకైనను రూపము మారక యప్పుడే ప్రాణములఁ బాసినట్లుండెను. దానింజూచినతోడనే యా వ్యక్తికి హృదయం బున నపరితోత్సాహ మంకురించినది. ఆ వ్వక్తి యెవ్వరుఁ మన దివోదాస మహారాజు గారే ! గుణవతి యంతఃపురమునఁ జిత్రలేఖ వలన నరిందముని ప్రయత్నము సర్వము నెరింగి యాశబరబాలక శవంబు నెట్లయిన సంగ్రహింపనెంచి యా భైరవీదేవియాల యంబునకు ముందుగాఁబోయి యాశ క్తి విగ్రహము వెనుకఁ డాగియుండెను.

ఆ మందసములోనున్న శవమును జూచినతోడనే వాఁడు బ్రతికినట్లుగానే సంతసించెను. ఎవ్వానిని బ్రతికించుటకుఁ బ్రతిన దాల్చి సర్వరాజ్య భోగ్యములఁ ద్యజించి తిరుగుచుండెనో యెవ్వానిదేహాన్వేషేణంబు నిమిత్తముగా లోకాంతరముల కఱిగెనో యట్టి శబర బాలకుని శరీరముగా దానిని నిరూపించి మరల నమ్మందసము నెప్పటియట్ల భద్రపరచి తనపూన్కె నెరవేర్ప నయ్యమ్మవారిని భక్తిపురస్సరముగా నిట్లు నన్ను సన్నుతించెను.


చ. కడుపునఁబెట్టికొంచు, ద్రిజగంబులఁదోషణ సేయుతల్లి వీ
    వుడుగక జీవహింసలను నోర్పెదవొక్క ! వ్రతంబుపేర ని
    ట్లెడపక ప్రాణహత్య లొనరించుదురాత్ములు నీకుభక్తులే ?
    పడయఁగలరెవారలుశుభంబుల నేవిధినైన నమ్మరో !

చ. ధరణికిచ్చి నానియతిఁ దప్పుటెగాక వనాటబాలకున్
    బొరిఁగొనివాని దేహమునుమ్రుచ్చువలెన్‌ గొనివచ్చి యిచ్చటన్‌


    కరముదురాశఁగుచ్చితపు గార్యమొనర్పఁగనున్న యక్ష ము
    ష్కరునివధింతు నేఁగడఁగి శాంకరి ! నాపయినల్గఁబోకుమా.

అని దండప్రణామము లాచరించి యారాజమార్తాండుడు యధాప్రకార మాశక్తి విగ్రహము మాటునకుఁబోయి యందు వేచియుండెను.

ఇంతలో నరిందముండు స్నానముమొదలు గాఁగల ధర్మంబుల నిర్వర్తించు కొని యయ్యమ్మవారి యాలయంబులోని కేతెంచి యందు ధౌతవస్త్రధరుఁడై నియమ యుక్తుఁడై శక్తిస్తోత్రంబులఁ పఠించుచుఁ దానలంకరించిన పట్టులో నమ్మవారి‌ విగ్రహ మున కభిముఖముగాఁ గూర్చుండి లఘువుగా దేవినర్చించి యోమెనుద్దేశించి యిట్లనియె.

తల్లీ ! శాంభవీ ! భవత్ప్రీతికై నేను దలపెట్టిన యీ వ్రతము నేఁటితోఁ బూర్తిఁజేయుచున్నాను. నేను కోరిన గుణవతి నన్నుఁబతిఁగా నంగీకరింపఁజేయుటకు నీవే కర్తవు. ఈ వ్రతసమాప్తమున కవసరమగు నరకళేబరమును సంపాదించుటకు నేను పడిన శ్రమకైనను నాపై నీ కనుగ్రహము కలుగవలెను. ఎన్నఁడును జీవహింస యొనర్పనని వృద్ధసర్ప మెందైననుండునా ? అట్టిదాని నెట్లో పుణ్య వశమునఁ గనుంగొనఁ గలిగీతిని. అయ్యది పరమనిష్టాగరిష్టయై వల్మీకగర్భమందు యోగనిద్రలో నున్నది. దాని నొరులెరుంగుట యెట్లు ! అదియొకరిఁ గరచి చంపుట యెట్లు ? కామరూపంబున నేనొక శబరబాలకుఁడనై నయ్యరణ్యమునఁ బశుల మేపుకొను చుండు వనాటబాలకులతో గలసి వారితో మైత్రి జేసితిని.

ఒకనాఁడొక్క బాలకునిఁ జేరఁదీసి యావల్మీకగర్భమందలి సర్పమును జూపించి యాపుట్టఁద్రవ్వి దానింజంప బ్రోత్సహించితిని. వాఁడును చేతనున్న గండ్ర గొడ్డలితో నా వాల్మీక‌ విచ్చేదం బొనరించి యానాగమును జిదుకఁగొట్టెను. అది చావలేదని నేనెరింగియును దాని తోకఁబట్టితెచ్చి మిత్రులకుఁ జూపింపుమని వానికిఁ బురికొల్పితిని. ఇట్లు చెప్పుట యాబాలకునెట్లయిన నాపాము గరచి చంపవలెనను నుద్దేశ్యముతోనే గాని మరొకటికాదు. అవ్వెంగలీడు నా మాట బాటిసేయుచు దానితోక బట్టి యీవలకీడ్చి యాటలాడసాగెను. నేను తలంచినట్లు తోడనే యాపఱేడు కినుక బూని నిజాభీలవిషజ్వాలల వానిని జంపి యవులంబోయెను.

అవ్వార్తవిని యందున్న శబరులెల్లవచ్చి చూచి యాక్రోశించుచుఁ దమ యేలిక కా యుదంత మెరింగింపబోయి యందుగొందఱ గాపుంచిరి. నేనును వారిలో నొకడనైయుండి యొరులెరుంగకుండ నా బాలకుని శరీరమును గగనమార్గమున నపహరించుకొని యిల్లుజేరి యిప్పటివరకు దైలద్రోణియందుబెట్టి కాపాడితిని. నేడద్దానిని నీకర్పించి నిన్ను మెప్పించి నా యభీష్టముము దీర్చికొందును.


చ. అనుపమమైన నీదు కరుణామృత శీకరసత్ప్రసార మె
    వ్వనికి లభింపగాగలదొ వాడెకదా కడుధన్యుడెన్నగా


    మనమున భక్తినిన్గొలిచి మాటి కభీష్టములందనట్టి డెం
    దునుగనరాడు నన్ను పరతోషితచిత్తునొనర్పుమీశ్వరీ.

అని యా భైరవీదేవికి భక్తియుక్తుడై ప్రణమిల్లుచు నిక దక్కినకృత్యము నెర వేర్చి కృతకృత్యుడ నయ్యెదంగాక యని లేచి చంద్రహాసము గరమునబూని యందున్న పెట్టెదాపునకేగి మూతనెత్తి వంగి యందున్న శవమును బైటకుదీయ నుంకించుచుండెను.

ఇంతలో బ్రళయకాల వలాహకంబుకైవడి దివోదాసుండు క్రోధాతిరేకమున హుమ్మని గర్జించుచు నయ్యమ్మవారి చాటుననుండి ముందునకురికి యా యక్షుని జుట్టు పట్టుకొని యీవలకీడ్చి భైరవీదేవి పాదమూలమున బడవైచి నిజకుఠారధారలచే నా కుచ్చితుని యుత్తమాంగము నుత్తరించి తద్రుధిర ధారలచే నా దేవి పాదములగడిగి వాని హృదయపిండము బెకలించి యా శక్తికి నై వేద్యమర్పింపనెంచెను.

కాకా వాని యభిమత మీడేరినదికాదు. ఎన్ని సారులు వాని తల నరుకబడి నను నెప్పటికప్పుడది మొండెమునకు జేరుచుండెను ఇట్లా రాజేంద్రుండా యక్ష ధోర్తుని సంహరింపజాలక నిర్విణ్గుడై యూరకుండెను. యక్షకుమారుండు విగత జీవుడుగాకున్నను దలవని తలంపుగా దనకందుగలిగిన విపత్తువలన గుండెచెదరి విస్పృహుడై యా యమ్మవారి పాదమూలమునబడి యుండెను.

ఆ రాజసింహుడు యక్షుండు మృతుండయ్యెనని దలంచి యా దేవి యెదుర వినయ వినమితగాత్రుడై చేతులు జోడించి నిలువబడి యనేకవిధముల స్తుతి యించెను. భైరవీదేవి వాని‌స్తోత్రంబుల కలరి ప్రత్యక్షమై యిచ్చవచ్చిన వరంబొండు కోరుకొనుమని యానతిచ్చెను. అమ్మహారాజు భయభక్తి పురస్సరముగ దల్లీ ! ఈ యక్షకుమార మరణమున గాకే దురితమును గలుగకుండ వరంబిమ్మని కోరుకొనెను.

వాని కోరికకు భైరవీదేవి సంతసించి యిట్ల నియె. కుమారా ! నీ యుదంత మంతయు నంతర్దృష్టిం దెలిసికొంటిని. నీ పరోపకార పారీణతకే నెంతయును సంత సించితిని నీ ధర్మబుద్ధి నీ నిర్మల ప్రవర్తనము నీ వినయవివేక విశ్వాసంబులు నీ సాహసౌందర్యసంపత్తి నీ బలపరాక్రమములు వర్ణనార్హ ములు. నీవొనరించిన కృత్యము లెన్నడును దర్మబద్ధములై యుండును. ఈ యక్షుడు కపటచిత్తుడు. యుక్తాయుక్త పరిజ్ఞాన శూన్యుండు క్రూరకార్యాచరణ పరాయణుండు. వీడు జచ్చి యక్షకులము నకు గళంకమేలేకుండ బోయెడిని వీనికై నీవు చింతింప నక్కరలేదని పలుకు నమ్మహాదేవికి మహారాజు వెండియు నిట్లనియె.

జననీ ! వంచనజేసి యీ యక్షుడు పుడమికేతెంచి యమాయకుండగు నీ శబరబాలకుని నొకనాగముచే గఱపించి యసుపులఁ బాయఁ జేసెను. ఈ బాలకుని బ్రతికించి యిచ్చెదనని వీని యాప్తుల సన్నిధి నేను బాసజేసి వచ్చితిని. నా మాట పొలివోకుండ వీని బునర్జీవితుంచేసి నన్ను గృతార్ధుని జేయుమని ప్రార్థించటయు నాదేవి దరహాసితముఖసరోజయై యిట్లనియె.

వత్సా ! ఈ వనాటబాలకుని బ్రతికించుటకు నా యనుగ్రహమును గోర నవసరములేదు. నీవే వీనిం బ్రతికించుకొనగలవు. పొమ్మని యానతిచ్చి యా యమ్మవా రంతర్హి తురాలయ్యెను. ఆమె మాటల కమ్మేదినీశుం డక్కజంపడుచు నాశబరబాలక శవముగల మందసము గైకొని యందున్న కాసారతీరమున కేగి యొడ్డున నా పెట్టెను బెట్టి యా నీరంబుల శుచిస్నానం మొనరింప నందుదిగెను. అమ్మహారాజమందానంద మున నఘమర్షణస్నానం బొనరించి తీరంబుల కేతెంచిచూడ యందు మందసము గనుపింపదయ్యెను. దానికతండు వెఱగందుచు గొంతతడవా పెట్టైకొరకు నలుమూలలు విమర్శింపదొడంగెను. కాని దానిజాడ తెలిసినదికాదు అది యెట్లు పోయినదో యతడు నిరూపింపజాలక హతాశుడై యొక్కచో జతికిలం బడెను. తానింతకు పడిన శ్రమ యంతయును వృధయయ్యెనని విచారపడ దొడంగెను. యక్షలోకంబున దాను నిక్క ముగ మోసగింపబడితినని తలంచుచు క్రోధావమాననిరాశా విషాదములు మొగమున నొక్కసారి గనుపింప నట్టులేచి నిలువంబడి యెద్దియో దుష్కరకార్య మొనర్ప సమ కట్టి యటగదలి చరచర నయ్యమ్మవారి యాలయమునకు దిరుగవచ్చెను.

ఆ దేవీ విగ్రహమునకెదురుగా నిలచి అంబా ! నేనొనర్చినపని యంతయును నిష్ఫలమైనది. ఈ యక్షపురంబున నాకు కలిగిన యవమానమును సహింపజాలక నీమ్రోల బ్రాణవిసర్జనం బొనరింపవచ్చితిని. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనజాలని నా జీవనము నిరర్థకమైనది. ఒక్క పసిబాలుని బునర్జీవితునిజేసి యొసంగజాలనై తిని. ఇఁక నా జన్మ యేమిటికి ? ఇదే మదీయ యుత్తమాంగమును నీకర్పించుచున్నాను. అని నిజకుఠారధారచే గుత్తుక నుత్తరించుకొని క్రిందంబడెను. కాని తోడనే వాని తల యధారీతి గాయంబున నతుకుకొన జీవముల బాయడయ్యెను. అందుల కబ్బురపడుచు లేచి దృఢసంకల్పుడై తిరుగ సరిచూచి కంఠము నరుకుకొనెను వెంటనే యూడిపడిన వాని యుత్తమాంగము జిటికెలో యధాప్రకారమత్తుకొనెను తల దిరుగ దరిగికొనెను. అది వెంటనే యతుకుకొనెను. ఇట్లనేకసారులు కంఠము నుత్తరించుకొనుటయు నది వెంటనే యతుకుకొనుటయు జరిగెనేగాని వానికేయపాయమును రాదయ్యెను.

అమ్మహారాజిట్లు విఫలమరణప్రయత్నుడై యలసి యయ్యమ్మవారి కభిముఖ ముగా నిలిచి చేతులుజోడించి జననీ ! నేనెంతప్రయత్నించినను నాకు మరణము సంభ వింపదయ్యెను. నేను జచ్చుట నీయభిమతంబుగాదని తలంచుచున్నాను. అకృతకార్యుడ నగు నాకు బ్రాణధారణమునం దసహ్యము గలిగినది.


చ. పులిఁపొలియింపుగాఁ దెగకపోయె నదేమొహి మాద్రిసీమలన్‌
    తలదెగదయ్యె యక్షునకు దానినినేనిటఁ దృంపఁబూనినన్‌


పొలియుటకేఁ బ్రయత్నపడఁ బోయిననద్దియు వ్యర్థమయ్యె నిం
దులకు మదీయబాహుబల దోషమెకాక మరేమిమాయయో !

తల్లీ ! నేనిందేమి చేయవలెనో యానతిచ్చి నన్ను ధన్యునిం జేయము. నీ యాదేశమువడవున బ్రవర్తింపగలవాడని పలికి యామె యాజ్ఞకు వేచియుండెను. అప్పుడద్దేవి యశరీరవాక్కుల నిట్లని బదులు చెప్పెను.

వత్సా ! అతి సాహసము నెప్పుడును బూనకుము. మరణము గోరినంతనే వచ్చునదికాదు. ఆపదలు కాపురము సేయవని చెప్పు పెద్దలమాటల నెన్నఁడును విన లేదా ! కష్టసుఖములలో ఏది యెప్పుడు వచ్చినను దేహికి‌ యనుభవింపక తప్పదు. కొలది దినములలోనే నీకు సర్వసౌఖ్యములు లభింపఁగలవు. నికుంభుని నిర్జించునప్పుడు నీకు లభించిన మణిభూషణ మనంగమోహినిది. అది నీ యుత్తరీయమున నుండుట నీవు మరచియుండవచ్చును. దాని నెచ్చటను విడువక భద్రముగాఁ గాపాడుము. నీకే యాపదయును వాటిల్లదని పలికి యూరకుండెను.

ఆ పలుకుల కచ్చెరువడుచు నిజోత్తరీయమునఁ గట్టబడిన యమ్మణిభూషణ మును ఫైకిఁదీసి కన్నుల నద్దుకొని తిరుగఁ బూర్వపురీతిని భద్రపరచెను. ఇంతలో నందు బడియున్న యరిందమునకు చైతన్యము గలిగెను. కొండొక తడవునకు వాఁడు నిదురఁబోయి మేల్కొన్నవానివలె లేచి యెదురనున్న యా రాజేంద్రుని జూచి చకితు డయ్యెను. దివోదాసుండును వాఁడు బునర్జీవితుండగుటకు నివ్వెరంబడుచు నందుల కయ్యమ్మవారి యనుగ్రహమే కారణమని తలంచి యామె మహిమ ననేక విధములఁ నంతరంగమునఁ గొనియాడుచుండెను.

అరిందముని స్వభావమంతయును మారిపోయెను వెనుక‌ నెంత దుష్ట చిత్తుడో యిప్పుడంత మంచిబుద్ధిగలవాఁడయ్యెను. తొనొనర్చిన కుచ్చిత చేష్టితములెల్లఁ దలంచి తనకుదానే యేవగించుకొనసాగెను. దివోదాసుని జూచినతోడనే భయభక్తి విశ్వాసములు వాని మనమున నొక్కసారి పుట్టెను. ఆ రాజమార్తాండునకు నమస్క రించుచు వాడిట్లనియె. ఆర్యా ! మీరెవ్వరో నాకుఁ దెలియదు. ఈ భైరవీదేవి యాలయ మున నేనొక ఘాతుక కార్యమునకు గడంగఁబోవుతరి నెవ్వరో నన్బట్టి దేవీ పాద మూలమునఁ బడవేయుటమాత్ర మెరుంగుదును. పిమ్మట నేమి జరిగినదో నెరుంగను. నేనొనర్చిన తప్పునకు పశ్చాత్తాపమును బొందుచుంటిని. మీరెవ్వరు ? ఇందేమిటికి వచ్చితిరి ? మీ యుదంతము సర్వము నెరింగించి నన్ను గృతార్థుని జేయుఁడని వినయముగాఁ బ్రార్థించుటయు దివోదాసుఁడు తన కథ సంగ్రహముగా వానికిఁజెప్పి వాని నయ్యమ్మవారిమ్రోలఁ జంపఁబూనినది తానేయనికూడ వెల్లడించి మరియు నిట్ల నియె. యక్షపుంగవా ! ఈ యమ్మవారి మహిమ మిగుల స్తోత్రపాత్రముగా నున్నది‌. ప్రాణములఁ బాయనెంచి యనేకసారులు దలఁదరిగికొన్నను నాకు మరణము సంభవింప లేదు. నీకుఁగూడ పెక్కుసారులు ఖడ్గప్రహారములుఁ దగిలినను నాపద గలుగదయ్యె. ఈ లోకమాత నికటంబును జేర మరణదేవత భీతిఁజెందవచ్చును. ఈలోకేశ్వరికి జీవ హింస గిట్టదనుటకిది నిదర్శనముగాదా ? ఈమె సన్ని ధానమునఁ బశులిశసనం బొన రించి కోర్కెలం బడయ నెంచుట యవివేకమని తెల్లమగుచుండ లేదా ? అని యనేక ప్రకారముల నా భైరవీదేవిని గొనియాడెను.

అప్పుడాదేవి వెండియు నశరీరవాక్కుల నిట్లనియె రాజేంద్రా ! నీ యొద్ద గల యనంగమోహినీ శిరోరత్నమే యరిందమునకు సంజీవనమయ్యెను. ఇయ్యది మృతసంజీవిని యనెడి యనర్ఘరత్నము. రత్నచూడుడను నా గోత్తముని శిరమునఁ బుట్టుకతోనే పుట్టి యనంతరము వాసుకివశమై యనంగమోహినికి శిరోభూషణమైనది. ఈ మణి శ్రేష్టము నీ యొద్ద నుండుటచేతనే నీచేఁ గొనిపోఁబడినఁ మందసములోని శబరబాలకుఁడు గూడబునర్జీవితుండై పైకివచ్చియా పెట్టెం బట్టుకొని భయోద్రేకమునఁ బారిపోయెను. నాఁడు హిమవన్నగమున వ్యాఘ్రము నీచేఁ జావకుండుటకు నిమ్మణియే కారణము. ఇప్పుడు నీకు మరణము గలుగకుండుటకుఁగూడ నా రత్నప్రభావమే మూల మని వేరుగఁ జెప్పఁబనిలేదుగదా ?

ఈ యరిందముఁడు నీకిఁకమీద మిత్రుఁడై సేవకుఁడై సహచరుండై మెలంగగలవాఁడు. శబరబాలకు నన్వేషించుటలో మీఁకు గొంతశ్రమ గలుగఁగలదు. కాని శీఘ్రకాలములోనే సౌఖ్యములఁ బడయఁగలరని మిన్నకుండెను. ఆ పలుకుల నాల కించి వారిరువురును సంతోషాశ్చర్యములఁ బొందిరి. దేవి యానతివడువున వారొకరి కష్ట సుఖములకొకరు సహాయులగుచుఁ బ్రాణమిత్రులై యుండుటకు బాసఁ జేసికొని యా భైరవీదేవికి నమస్కరించి యందుండి శబరబాలకు నన్వేషించుటకు వెడలి పోయిరి.


313 వ మజిలీ

శబరబాలకునికథ

దివోదాసుఁడు మొదట బైరవీదేవి యాలయములో నరిందముఁడు స్నానార్ద మరిగినప్పుడు శబరబాలక శవమున్న మందసము మూత పైకెత్తి విమర్శించినప్పుడే వానియొద్దఁగల మృతసంజీవనీ రత్న ప్రభావము తత్పేటికాంతరమున బ్రవేశించెను. పిమ్మట నతండా పెట్టెంబట్టుకొని కాసారతీరమున కేగుచున్నప్పుడే శబరబాలకునకు చైతన్యము లభించెను. సరోవరతీరమునఁ బెట్టెనుబెట్టి దివోదాసుఁడు స్నానమున కరుగు నప్పటి కాబాలకునకు బూర్తిగా దెలివివచ్చినది. పిమ్మటఁ దైలద్రోణియందుండుట కూపి రాడక వీపుతో దానిమూత పై కెత్తి యీవలంబడెను. వానికంతయు నంధకారబంధుర ముగా దోచెను.