కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/311వ మజిలీ

వికీసోర్స్ నుండి

అనంగమోహిని నెత్తుకొనిపోయినాఁడని యాక్రోశించుచుఁ బోయి యావార్త హేమా వతి కెరింగించిరి. అనంగమోహినికి వచ్చిన కష్టపంరంపరల కామెమిక్కిలి విచారించినది. ఈ వృత్తాంతము నలువురకుఁ దెలిసిన దనగుట్టు క్రమముగా బట్టబయలగునను భీతిచేఁ యెవ్వరికిం దెలియనీయక కప్పిపుచ్చెను. అప్సరోయువతులఁ దిరస్కరించు రూప లావణ్యముల నొప్పియున్న యనంగమోహిని యెట్లయిన నమరలోకమునుండి యవుల కేగుటకు హేమావతి మనంబున సంతసించెను.

రక్కసుండొక్క డేతెంచి యెవరినో వేలుపు ముద్దరాలి నపహరించుకొని పోయెననువార్త యెట్టులో స్వర్గపుర వీధులయందెల్లడల వ్యాపించి క్రమముగా శచీ కళత్రునికిఁగూడ దెలిసినది. స్వర్గమందలి వారెవ్వరును దప్పిపోలేదని తెలిసికొని యా వార్త‌ ప్రమాదజనితంబని యూహించి యూరకుండిరి.

311 వ మజిలీ

అలకాపుర సమీపప్రదేశ మొక్క నిముసములో మహాసంగ్రామరంగస్థల ముగా మారినది. యక్షలోకంబంతయును సంవర్తసమయసముద్భూత ప్రచండజంతళా మారుతవిలోలకల్లోల మాలావికీర్ణ మహార్ణవంబు తెఱంగున భయంకరంబయ్యెను. మణి గ్రీవజలంధరుల కలహము మొదట ద్వంద్వయుద్దములోనికిదిగినది. ఈ వార్త పురము లోని వారికిఁ దెలిసి పలువురా యుద్ధరంగమున కేతెంచి యతి దారుణముగాఁ బోరుచున్న వారింగాంచి యెవరిపక్షమువారు వారివైపు జేరి కయ్యమొనర్ప సాగిరి. ఆ ద్వంద్వయుద్ధమే సంకులసమరమయ్యెను. ఈ యుదంతము పిన్నలనుండి పెద్దలవరకుఁ బ్రాకినది. యక్షులలో రెండుపక్షములేర్పడి‌ చివురకయ్యది దారుణసంగ్రా మముగా మారినది. ఆ సంగ్రామ రంగమునందు కత్తుల సవరించువారును బల్లెముల నెత్తువారును వింటినారుల సరిజేయువారును బాణపుంఖములకు ---లలం గట్టువారును పరశువులం బట్టువారును భిండివాలములఁ గదల్చువారును పట్టిసములు బరికించువారును తోమరమునఁ జేఁబూనువారును, గదలద్రిప్పువారును, గలిగి యయ్యెదిమహాసంరంభ దుర్నిరీక్షమై యొప్పెను.

అంతకుపూర్వ మత్యంతమైత్రితోఁ దిరుగువారిప్పుడిట్లు దారణసంగ్రామము నకు గడంగుట కేమిహేతువో యందిరువాగుల వారెవ్వరికిని దెలియదు అంతకంతకా సాంపరాయక మతిభీభత్సమగుచుండెనేగాని ప్రశాంతమొందు సూచనలేమియుఁ గనం బడుటలేదు. చిత్రకేతుండును సబాంధవ మిత్రబృందముగాఁ గొడుకుబక్షమునకేగి యీసుమెయి బ్రత్యర్థులతోఁబోరాడుచుండెను. ఆ సమయమునఁ గుబేర నలకూబరులు దేవసభకు స్వర్గమున కేగియుండుటచే దమ పురమున జరుగుచున్న యీ యుద్ధ విషయమేమియు నెరుఁగనే యెరుఁగరు.

అలకాపురం బట్లు యుద్ధ నిమగ్నమైయున్న కతమున వీధులెల్ల శూన్యము లైనవి. పురుషుఁడైనవాఁ డొక్కరుడును నగరమందు లేఁడు. సౌధోపరిభాగములయం దచ్చటచ్చట స్త్రీలు మాత్రము గనిపించుచుండిరి. అట్టి ససుయమున మన దివో దాసుండు పాదచారియై రాజమార్గమునఁ బోవుచుఁ గ్రమమునఁ జిత్రకేతుని ప్రాసాద సమీపమునకు వచ్చి యా ప్రాంతములయందు కింకర్తవ్యతామూడుండై యిటునటు దిరుగుచుండెను.

తత్ప్రాసాదోపరిభాగమున నుండి దూరమందు జరుగుచున్న యుద్ధమును గమనించుచున్న గుణవతి దృ‌ష్టులు దటాలున వీధియందున్న దివోదాసునిపైఁ బ్రస రించెను. వాని రూపలావణ్యజాలముల నా మద గజయాన నేత్రరాజీవములు జిక్కు పడినవి. అందులకు సందడించుచు నయ్యిందువదన చిత్రలేఖను చేరఁబిలిచి మోహా వేశమున నిట్లనియె.

నెచ్చలీ ! ఈ యుద్ధసమయమున నొంటిగా వీధి జరించుచున్న యా పురుషశ్రేష్టుం దిలకించితినా ? ఈ భాగ్యశాలి విమర్శింప మానవుఁడువలెఁ దోచు చున్నది. భూలోకయునుండి యిచ్చట కెట్లువచ్చునో గదా? ఆహా! వీని యంగసౌంద ర్యము త్రిభువనా సేచనకముగ నున్నది.


శా. ఔరా! మైజిగి ! హైసరే ! నడలయొయ్యారం ! బొహో మోము సిం
    గారం ! బద్దిర ! తళ్కులీను నిడువాల్గన్దోయి యందము! మ
    జ్జారే ! నెన్నుదు రొప్పిదంబు ! భళిరే ! చక్కదనంబెల్ల నీ
    తీరౌరూపముదాల్చెఁ గావలయుఁ బ్రీతిన్‌ జూడుమా నెచ్చెలీ.

శా. ఏమే ! చూచితివే నిదానముగ రాకేందుస్పురద్వక్త్రునిన్
    నా మాటల్‌ నిజమంచుఁదోచెనుగదా ? న్యాయంబుగా వీని నా
    కామున్‌ గీమునీతోడఁ బోల్పఁదగునా కళ్యాణరూపంబునన్‌
    నా మీఁదన్‌ దయఁజూపి తెల్పఁగదె ? యన్నట్లెల్లఁ దెల్లంబుగా.

ప్రియసఖీ ! స్వయంప్రభాదేవియే వీని నిప్పట్టున నా కొరకై తీసికొని వచ్చెనని తోచుచున్నది. ఈతఁడే నాపతి. త్రికరణంబుల నీతనినే కాంతునిఁగ వరిం చితిని. నీవువేగ మాయనఘుని సన్నిధికేగి వాని నా యంతఃపురంబునకుఁ దోడ్కొని రమ్ము. పొమ్ము అని తొందరబెట్టుఁటయు నా చిత్రలేఖ విస్మయం బభినయించుచు యిట్లనియె.

ప్రాణసఖీ ! వాని కలగోత్రనామశీలము లెరుంగక చూచినంత మాత్రము ననే పతిగావరించు నించుఁబోడు లెందైనఁగలరా? నీవింత యాత్రముంబొంద మేలగునా? నిన్ను వంచింప నిట్లే రాత్రించరుఁడైన మాయవేషమున బూని వచ్చియుండిన నేమి జేయుదువు ? యౌవన ద్రుదుర్భావజనితమహామోహాతి రేకమున నా యపరిచితుని నంతఃపురమునకు దోడి తెమ్మనుట ప్రమాదముగాదా ? అని మందలించు చెలి క‌త్తియ కమ్మదవతి యిట్లనియె. చిత్రలేఖా ! నీ మాటలేమియును నా హృదయమునకు బ్రియంబులు గాజా లవు. అతడు తప్పక స్వయంప్రభాదేవి యనుగ్రహముననే యిందు విచ్చే సెను. నిర్దుష్టమగు మన్మనంబే యిందులకు బ్రమాణము. నా యభిప్రాయమునకు బ్రతికూల ముగా నీ వేమియు నింక జెప్పవలదు. నేను చెప్పినట్లు నీవు వినవేని నా ప్రాణములు మేననిల్వవని నిక్కముగ నమ్ముము. సత్వరమ నా మనోహరుని సమీపమున కేగి యెట్లయిన వానినిందు దోడ్కొని రమ్ము. ఈపాటి యుపకారము నాకు జేయుము. నీ మేలెన్నడును మరువనని బ్రతిమాలుచున్న గుణవతి కెదురాడనోడి యవ్వలనున్న యా నూత్నపురుషుని వృత్తాంత మరసి వచ్చెదంగాక యని చిత్రలేఖ యప్పుడే క్రిందకు బోయినది.

అప్పటికి దివోదాసుండా వీధిదాటి యదృశ్యుండయ్యెను. చిత్రలేఖ వాని నన్వేషించుచు నా చుట్టుపట్టులం దిరుగాడుచుండెను. ఇంతలో నా ప్రాంతమందాడుదాన యాక్రందనధ్వని వినంబడుటయు నా చిత్రలేఖ విభ్రాంతయై యిటునటు బరికింపు చుండ నొకవైపు నుండి వెఱవకుము, వెఱవకుమని పెద్దగా గేకలు పెట్టుచు పురుషు డొకడు పైకెగయుటయు గనిపెట్టెను. వానింజూచి గుణవతిచే వరింపబడిన వాఁడే యని నిశ్చయించి యాత్రముతో వానిపోక బరీక్షించుచుండెను.

ఆ పురుషుండట్లు పైకెగసిపోయి యొక యబల నెత్తికొని పోవుచున్న రక్కసి మ్రొక్కలీనిం గవిసి నిలు, నిలుమని యదలించెను. వాడీ పురుషుని జూచి చకితుడై ముందుబోవుట మాని తిన్నగా గుణవతి యున్న సౌధముమీద వ్రాలెను. దివోదాసుండును వాని వెంటాడి యా సౌధోపరిభాగముజేరి యా రక్కసుని జుట్టు పట్టుకొని నిలువబెట్టెను. వాని సందిటనున్న పూవుబోణి యీవలబడి భయోద్రేకమున నందొక గదిలోనికి బారిపోయెను. ఆ యద్భుత దృశ్యమున కందున్న యోషిజనంబెల్ల భయవివశలై యంతర్గృంహంబుల కేగిరి.

ఆ రక్కసుండట్లు దివోదాసునిచే జిక్కి చేయునది లేక చేతులు జోడించి నమస్కరించుచు రక్షింపుము, రక్షింపుమని ప్రార్దించెను.

దివో - [మహాక్రోధముతో] తుచ్చుడా ! నీ వెవ్వడవు? ఆ నారీశిరోమణి నేమిటి కట్లపహరించుకొని పోవుచుంటివి? ఆమె యెవ్వతె? నిజము చెప్పుము. లేకున్న నుత్కుఠారతీవ్రరాభిఘాతమున నీ కంఠం బూడి పడగలదని కత్తిపైకెత్తెను.

రక్క - పురుషపుంగవా ! నీ బలపరాక్రమముల నేనెరంగుదును. హిమ వత్పర్వత ప్రాంతమును నాడు నా యన్నయగు కుంభుని నీవు నిర్జించుట నేను కన్ను లారా జూచితిని. నీవెత్తిన కత్తిని క్రిందకు దింపువరకు భయోద్రేకమున నా నోటమాట వెల్వడకున్నది. ఆపన్ను డనై ప్రార్థించుచుంటిని. ఇంచుక శాంతి వహింపుము. నాపై ననుగ్రహము జూపుము. శరణాగతత్రాణుండవుగమ్ము అని డగ్గుత్తికతో బ్రార్దించెను.

దివోదాసుఁడు - ఓరీ ! నా చేత నాడు నిర్జింపబడినవాడు నీకన్నయగునా? యప్పుడు నీవెందుండి‌ చూచితివి ? ఇచ్చటికేల వచ్చితివి? నీ యుదంతంబింతేని దాపక వైళమ చెప్పము

రక్కసుఁడు - మహాత్మా ! నేను రసాతలవాసుడను. కుంభనికుంభులమను మేమిర్వుర మన్నదమ్ములము. వాసుకి తనూజాతయగు ననంగమోహినింగాంచి మే మిరువురమును మోహించి యెట్లయిన నామెం గలయు నాసతో దిరుగుచుంటిమి. రసాతలమునుండి యామెను మేమే యపహరించి భూలోకమునకుం దెచ్చితిమి. హిమవ త్పర్వతసన్ని కర్షమం దామెను బలాత్కరించుచున్న మా యన్నను మీరు నిర్జించు నప్పుడు నేనొక ప్రాంతభూరుహము మాటున నుండి చూచుచుంటిని. పిమ్మట వ్యాఘ్ర నెపంబున మీరేగుటయు నంతలో నిరువురు యక్షులా మోహనాంగిని బట్టుకొని విమాన మునం బెట్టుకొని పోవుటయు గూడ జూచితిని. ఆ చిగురుబోణిపై గలి యాసంజేసి నేనా విమానము పోయినదారినే యంబరంబున కెగసి బ్రచ్చన్నముగా బోతిని.

ఆ విమానము స్వర్గమందు హేమావతీ గృహారామమందు నిలచినది. అనంగమోహినిం దీసికొని యందున్న వారు తత్సౌధము లోనికి బోయిరి. నేనా యుద్యానమందున్న మంజునికుంజమంజిరుల నడంగియుండి వారి చర్యలన్నియు గని పెట్టుచుంటిని. పిమ్మట గొంతసేపటి కాప్రాసాదంబునందు వాక్కలహము వినంబడు టయు నేనొరు లెరుంగకుండ తత్సౌధోపరిభాగంబున కెగసి యందొక రహస్య ప్రదేశ మున బొంచియుండి వారిమాట లాలకించితిని. అందొకడు మణిగ్రీవుండును రెండవ వాడు జలంధరుండును, వారా యనంగమోహిని కొరకు తగవులాడుకొనుచు తుదకం దుండి యవులం బోయిరి. పిమ్మట నిరువురు చెలికత్తెల సహాయమున ననంగమోహిని విమానశాలవైపు బోవుచుండుట గ్రహించి మించిన తమకంబున నయ్యబలను బట్టుకొని పైకెగసి పారపోతిని.

అట్లతిజవంబున బోవుచుండ నాకు ముందొక దివ్యయానము గనంబడినది. దేవతలెవరైన నందెక్కి నన్ను బట్టుకొను దలంపున వచ్చుచుండిరేమోయను భయం బున వెనుకకు దిరిగి పెద్దదూరమరిగి తిరిగి తిరిగి యిప్పటికి దైవోపహతుండనై పులి యున్న గుహకు జేరినట్లు వచ్చి నీకు జిక్కితిని. ఆ బాలామణికొరకు నేనెంత పరి తపించినను నాయందా నాతి కిసుమంతైన ననురాగము లేదు. అట్టి యిష్టములేని భామి నికై బలవంతబడుట మిక్కిలి యవివేకమని నాకిప్పటికి దోచినది ఇక బుద్ధివచ్చినది నేనెన్నడు నిట్టిపనికి బూనను. తప్పు సైరించి నన్ను క్షమింప బ్రార్థించుచున్నాను. అని వినయముదోప బలుకుచున్న యానికుంభుని వృత్తాంతమంతయును వినియా భూజాని యానంద విస్మయ పరితాపంబులు మొగంబున గనుపింప నల్లన వాని కిట్లనియె.

ఓరీ! నీవిప్పుడు మ్రుచ్చులించుకొని వచ్చిన మచ్చెకంటి యల్లనాడు హిమవన్నగర పార్శ్వంబున నాతో గొంత ముచ్చటించిన మించుబోణియేనా ? యని యడుగుటయు వాడు దేవా ! ఆ వృత్తాంతముగూడ నేనెరుంగకపోలేదు. ఈమేయే నాడు మిమ్ముల బ్రాణేశ్వరునిగా గోరిన నారీశిరోమణి. అగ్ని శోధితమగు, సువర్ణంబు లీల నీ బాల వన్నెకెక్కినది. ఎన్నెన్ని సిలుగులం బడినను తన శీలము గాపాడుకొన గల్గినది. ఎచ్చ టెచ్చటకు ద్రిప్పబడినను జివురకు మీరున్న ప్రాంతమునకే వచ్చి చేరి నది. మీ యిరువురం గలుపుట దైవసంకల్పమై యుండవచ్చును. ఇట్టిదాని కెవ్వరేమి ప్రతిబంధకము గల్పించినను నిష్ఫలమగును. నేనా నారీమణి నిఁకఁ గలనైనఁ జెడు తలంపునఁ జూడనని ప్రమాణము జేయుచున్నాను. ఇంతటినుండి యామె నాకు తల్లి వంటిది. దేవరకొరకే సరసిజగర్భుఁడావిరిబోణిని నిర్మించెను. నాకిఁక నాగలోకమునకుఁ బోవ సెలవొసంగి యాయంగనామణిని బత్నిగా స్వీకరించి స్వర్గసుఖములఁ బొందుఁడు. అని పలుకుచున్న వానితో నాపుడమియొడయఁడు దయామేదురహృద యారవిందుఁడై గంభీరవచనముల నిట్లనియె.

ఏ యంగనామణీ యాక్రోశమువిని తదన్వేషణమునకై భూలోకమునుండి యీ లోకమున కేతెంచితినో యాతరుణీమణిని మంచితనముచేత, గాకున్నను నీవు నా సన్నిధింజేర్చి నాకు కొంతశ్రమ తగ్గించితివి. ఈ యుపకారమునకుఁ బ్రతిగా నీ తప్పు లన్నియును సైరించి క్షమించి విడిచిపుచ్చుచున్నాను. పొమ్ము పశ్చాత్తాపము బొందుట వలన బ్రతికిపోతివి. ఇఁకఁ నెన్నఁడునిట్టి యకార్యకరణములకుఁ బూనకు మని చెప్పి వాని నప్పుడే పంపివేసెను. వాఁడును మ్యత్యుముఖమునుండి యీవలఁబడినట్లెంచుచు నిజ నివాసమునకుఁ బోయెను.

ఈ సంవాద క్రమంబంతయు నాలించుచున్న యనంగమోహిని తటాలునఁ దలుపుదీసికొని యావలకువచ్చి మనోహరా ! రక్షింపుము. రక్షింపుమని దివోదాసుని పాదములంబడి తాఁబడిన యిుడుమలం దలచికొని వెక్కివెక్కియేడువఁ దొడంగినది. ఆ రాజేంద్రుడామెను లేవనెత్తి యక్కునంజేర్చుకొని యశ్రజలములనిజోత్తరీయమునఁ దుడుచుచు గాఢానురాగమున ముంగురులు సవరించుచుఁ బ్రీతిపూర్వకముగ మోము నివురుచు మోహాతిరేకమునఁ జెక్కులుముద్దుంగొనుచు నామె శోకమంతయును దృటిలో మరపు జెందునట్లు సుధాధారలొలుకు పలుకులం ననునయించుచు మఱియు నిట్లనియె.

హృదయేశ్వరీ ! ఎన్నెన్ని బన్నములఁ బెట్టినను దైవమునకు మనయం దిప్పటి కనుగ్రహము కలిగినది. గతించినదానికి వగవకుము. ఇఁకనిన్ను నా యరచేతు లందు బెట్టుకొని సంరక్షించుకొందును. నీకే భయమునులేదు మనమున స్వస్థతతం బొందుమని యూరడించుచున్న మనోహరునకేమియును మాటలవలనఁ బ్రత్యుత్తర మొసంగజాలక వాని హృదయమున శిరముమోపి గాఢాశ్లేషమొనరించుటయే సమా ధానముగా మెలంగెను.

ఇంతలో వారియుదంతమంతయునుఁ బరీక్షించుచున్న గుణవతియును నామె చెలికత్తియలును వారి సన్నిధి కేతెంచిరి. వారింగాంచి యనంగమోహినియును దివోదాసుండును నివ్వెఱంబడుచు నొకరి నొకరు విడచి యించుక తొలగియుండిరి.

అప్పుడా గుణవతి పనికత్తియలచేత వారి కుచితాసనములం దెప్పించి వేయించినది అందరు సుఖాసీనులైన పిదప వారి వృత్తాంతము నామూలచూడముగాఁ దెలిసికొని గుణవతి యద్భుతమందుచు ననంగమోహిని సౌశీల్యముం బొగడుచు దివో దాసుని బలప్రభావముల కానందించుచుఁ గొంత ప్రొద్దుపుచ్చినది. చిత్రలేఖయు నింతలో నచ్చటికివచ్చి వారి వృత్తాంతమెరింగి యక్కజపడుచుండెను.

పిమ్మట దివోదాసుండా నారీమణుల గుర్తుపట్టి శబరబాలక శరీరమందున్నదో వారివలన నెరుంగఁగోరి యమ్ముద్దుగుమ్మలతో నల్లన నిట్లనియె. బాలికామణులారా! ఈ పుర బాహ్యోద్యానమందు విలాస విహారమొనరించు మిమ్మిదివఱకొకసారి చూచి నట్లు తలంచుచున్నాను అప్పుడు మీరొక నరబాలక ప్రేతమునుగూర్చి కొంత ముచ్చ టించుకొంటిరిగదా? ఆ వృత్తాంతము నేనెరుంగవచ్చునా యని యడిగెను.

అప్పుడు గుణవతి ప్రభృతులు ఆశ్చర్యము సూచించిరి.

చిత్ర -- అవును అప్పుడు మీరెచ్చటనుంటిరి.

దివో - అచ్చటి పూపొదరింటిచాటుననుండి మీ సంభాషణ మాలించు చుంటిని.

చిత్ర - [నవ్వుచు] పురుషప్రవరా ! ఆడువారము. కేళికోద్యానవనాభ్యంత రమున విలాసముగా విహరించుచుండ పురుషులు బొంచియుండవచ్చునా ? అంతియ కాకుండ సంభాషణము వినవచ్చునాఁ విచ్చలవిడి యాడువాండ్రు విహరించుచున్నప్పు డెన్నిప్రశంసలు వచ్చుచుండును. అనియన్నియును మగవారు వినఁదిరువుట సమంజస మేనా?

దివో - లోకాంతరమందుండి నూతనముగా వచ్చినవారి కెవరి ప్రసంగము లైన వినకున్న నందలి వృత్తాంతములెట్లు తెలియగలవు. ఇదియునుఁగాక యపురూపపు రూపయౌవనవిలాసయగు మీ‌ సఖీమణి లావణ్యతేజః పుంజమెదుటఁ బ్రకాశించుచుఁ గన్నులకుఁ మిరుమిట్లు గొలుపుచుండ ముందువెనుకలరయ శక్యమగునా ?

చిత్ర --- దేవా ? తమతప్పుగప్పిపుచ్చి యెదురనున్న వారియందు దాని నారోపించుట లోకస్వభావముగదా? ఇందు తప్పు మా నెచ్చెలియందున్నదో మీయందు న్నదో మీ యిరువురను సమముగా నిలఁబెట్టి విమర్శింవలసియున్నదని పలికెను.

అనంగమోహని - మందస్మితసుందర ముఖారవిందము బై కెత్తి యా రాజేంద్రునిపై శృంగారవిలోకనములఁ బరగించుచుఁ దప్పక యట్లు విమర్శింపవలసినదే యని యొత్తి పలికినది. తప్పెప్పుడు నాడువారిదేనగుఁగాని మగవారికి తప్పులేదూఱ కుండుమని చిత్రలేఖ మందమందాక్షయగుచు గుణవతి మందలించినది. ఇంటికివచ్చి యతిధిని యుచితరీతిని సత్కరింపక యిట్టువిరసోక్తులాడుట పాడిగాదని తక్కినవారు పలికిరి.

ఇంతలో నొక పరిచారిక పరుగుపరుగునవచ్చి యమ్మనేజల్ల! ఎంతదారుణ సంగ్రామమెంతలోఁ జల్లారెను! కుబేరనలకూబరులిప్పట్టున రాకున్న నీయక్షకులం బంతయు నీయకారణ సంగరమువలన నిర్మూలము. గావలసినదేగదా? దైవానుగ్రహ మున యక్షులందరు యుద్ధవిముఖులై నిజనివాసములకేతెంచుచున్నారు వారని చెప్పెను.

చిత్ర --- యుద్ధకారణమేమో యిప్పటికైనఁ దెలిసినదా!

పరి - ఏమియును దెలియలేదు. కుబేరనలకూబరులు స్వర్గపురమునుండి విమానముమీద నిజనివాసమున కేతెంచి యీ దారుణ సంగ్రామముజంచి యాదండ కరిగి యందున్న వీరవరేణ్యులఁ బేరుపేరునఁ బిలచి యుద్ధకారణమడిగిరఁట ! ఎవరికి వారే మేమెరుఁగమన్నవారేగాని దీనిమూల మిదియని చెప్పిన వాడొక్కడునుఁ గనం బడలేఁదట. దానికి వారు వెరఁగుపడుచు మరియు విమర్శింప మీ‌యన్న మణిగ్రీవుం డును జలంధరుండును నందులకు మూలమని తెలిసినదఁట. వారిరువురఁబిలచి యెంత యడిగినను సరియైన సమాధానము చెప్పలేదఁట.

దివో - మణిగ్రీవుఁడు మీ గుణవతి సోదరుఁడా ? జలంధరునితో వానికిఁ కలిగిన కలహకారణము నేఁజెప్పగలను.

అనం - (చెప్పవలదని కనుసన్నఁ జేయును)

చిత్ర - (ఆ సన్న గ్రహించి రాజుతో) దేవా ! ఆ సంగతి చెప్పుట కనంగ మోహిని కిష్టము లేనట్లున్నది. పోనిండు. మనకిప్పుడా ప్రశంస యేమిటికి?

దివో - ఆ సంగతి మఱొకప్పుడు సవిస్తరముగాఁ జెప్పెదను. దీనికేమి గాని నాఁడు మీరు ప్రసంగించిన నరబాలక కళేబరమేమైనది. జాతి ధర్మము నను సరించి నాకు తద్వృత్తాంతము వినఁ గుతూహలముగా నున్నది అని యడుగుటయుఁ జిత్రలేఖ దరహాసిత వదనయై యిట్లనియె ధాత్రీశ్వరా ?మీ ప్రభావంబమానుషంబు. మీ బలప్రతాపధైర్యసాహసాది యుత్కృప్టగుణంబులు లోకాతీతములు మీకడ మా రహస్యంబులు దాగునా ? యని యా వృత్తాంతమంతయుం జెప్పి యా యక్షుఁ డొనరించు వ్రతదినము నేటితోఁ దీరుటచేఁ నీరాత్రియే యీ పురమున కుత్తరముగఁ గ్రోశద్వయ దూరముననున్న భైరవీదేవి యాలయంబున నా కళేబరముతో నమ్మవారి యర్చన జరుగఁగలదని గూడఁ జెప్పెను.

ఆ నరబాలక కశేబర వృత్తాంతము నెఱుంగుటకా నృప కంఠీరవుండు మనంబున సంతసించుచు ప్రకాశముగా చిత్రలేఖ కిట్లనియె.

దివో -- చిత్రలేఖా ! మీ నెచ్చెలి యావ్రత మొనర్చు వానినిఁ బరిణయ మగుట కిష్టపడుచున్నదాఁ అదియంతయును వృధాశ్రమ కాదు. చిత్ర --- (నవ్వుచు) వృధాశ్రమకాకేమున్నది. వానిపేరుచ్చరించిన నీ సరో జానన యేవగించుకొనును.

దివో --- అట్లయిన మఱెవ్వనిఁ గృతార్థుంజేయుట కీమె తలంచుచున్నది ?

గుణ -- (సిగ్గునఁ దలవంచుకొనును)

చిత్ర -- కొలఁది దినములలో వచ్చు పంచమీ శుక్రవారమునాఁడు స్వయం వరము జాటించిరిగదా ! అందుఁ దనయిచ్చ వచ్చిన పురుషుని వరింపఁగలదు.

గుణ - (కోపముతో) అధికప్రసంగము చేయకుము.

చిత్ర --- నీకంతకోపమెందుకమ్మా ! (అని రాజు మొగంబై) ఆ స్వయం వర మహోత్సవమున సకలబంధు సమక్షమందు నార్యపుత్రునే పతిగా వరింపవచ్చును గదా?

గుణ - (చిరునగవుతోఁ దలవాల్చి యూరకుండును)

ఒకతె - చెలీ ! అర్యపుత్రుఁడనఁగా నెవ్వరు?

చిత్ర -- ఎవ్వరా ! ఎవరితో మాటలాడుచుంటివో వారు. తెలిసినదా ?

దివో - (సంతోషముతో) దివిజభామిని మానవుని వరించుట యెట్లు ? ఇదియుంగాక యనంగమోహినికి నా హృదయ మిదివరకే యర్పింపబడినదికదా? సతులకు సవతి సన్నిధానము సహజముగ నీర్ష్యను గలిగించునని చెప్పుదురు.

గుణ --- (చిత్రలేఖతో) సాపత్ని గలదను శంక నా కెన్నఁడును లేదని యార్యపుత్రుని కెఱింగింపవమ్మా ! మఱియును స్వయంప్రభాదేవి వరముపొందె నాకు మనుజుఁడే భర్తయగునుకదా ?

దివో - (నవ్వుచు) ఇందుల కనంగమోహిని యభిప్రాయ మెట్లుండునో ?

అనం - ఆర్యపుత్రునకు దేవభామినీ సహవాసము గలుగుటకు నేను హృదయ పూర్వకముగ సమ్మతింపుచున్నాను.

(అందఱును హర్షమును సూచింతురు)

ఇట్లు యిష్టాగోష్టీ వినోదముల నయ్యంతఃపురాంగనలతో నద్దివసాంతము వరకు ముచ్చటించుచు ననంగమోహిని నందే యుంచి దివోదాసుండు చంద్రాయుధ సహాయుండై యెద్దియో కార్యభారమున నెచ్చటికో పోయెను.