కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/310వ మజిలీ
మాటలుడిగి యీపాటి కీవలకు రమ్ము నన్నందుఁబోనిమ్ము. ఇందు వేరొక వైఖరి నీవు ప్రవర్తించిన మన నేస్తములు నిలువనేరవు. సత్వరమ రమ్మని పిలుచుచుండ మణిగ్రీవుండు కటకటంబడుచు నిట్లనియె
జలంధరా ! నీయవాచ్యములకు మేరలేకున్నది. మన నేస్తము. లిఁకమీద నిలువ నేరవనియా యంటివి తధాస్తు. ఈ క్షణము మొదలు మనకొకరితో నొకరికి సంబంధము లేదు. ఇంక నధిక ప్రసంగము జేయక యవులంబొమ్ము. ఈ ముద్దు మోముం జూడ నేవగించుకొనుచున్నది. ఆ పలుకులు విని జలంధరుండు నాది మొద్దు మొగమును నీది రాకాచంద్రబింబమునా ? నీ యందమునకు నీవ విఱ్ర వీగవలెను. ఆ యెలనాగ నందు విడిచి నీ విందుండి నిమిషములో లేచిపోవలెను. లేకున్న యవులకీడ్పించెదను. అని యనుటతోడనే మణిగ్రీవుండు మండిపడుచుఁ దటాలునఁ దలుపు తీసికొని యీవలకు వచ్చి జలంధరుని జుట్టుపట్టి వంచి వీపుమీద రెండు గ్రుద్దులు వేసెను. జలంధరుఁడు వానిపై దిరుగఁబడి పాదప్రహరణంబులఁ బ్రత్యుత్తరమిచ్చెను. ఆ యదనున ననంగ మోహిని తన్మందిర కవాటము లోన బిగించుకొనియెను.
ఇట్లా పురుషులిర్వురు దమ పూర్వపుమైత్రిందలపకయన్యోన్య విజిగీషేచ్చా మనీషులై ముష్టియుద్ధం బొనరించుచుండ హేమావతి చర చర నచ్చటికివచ్చి వారిని గారులుచ్చరించుచు మ్రుచ్చులారా ! మీ మూలమున నాకుఁగూడ నవమానము రాఁగలదు. మీపోరు విధం బెవ్వరేని విన్న నాగుట్టు దేవేంద్రునికిగూడఁ దెలియగలదు. ఇఁక మీ నీగసహవాసము నాకు చాలును తక్షణమ నాగృహమునుండి యవులంబొండు. లేకున్న బలవంతముగ గెంటింపవలసివచ్చును. మఱియొక యుచితస్థలంబునకుఁ బోయిన నొకరిబలము లొకరు తెలిసికొనవచ్చును. అని పలుకుచుండగనే మణి గ్రీవుండు జలంధరుని నాంత్రములూడునట్లు గట్టిగాకొట్టెను. వాఁడాదెబ్బకోర్వఁజాలక బైటకుఁ బారిపోయెను. వానిం దరుముకొని మణిగ్రీవుం డేగెను. హేమావతి వారు తిరిగి రాకుండునట్లు కట్టుదిట్టములు జేసెను.
310 వ మజిలీ
అనంగమోహినికథ
మణిగ్రీవజలంధరు లరిగిన యనంతరంబున హేమావతి యనంగమోహిని యున్న గదియొద్దకువచ్చి అమ్మా! ఆ మ్రుక్కడు లిక్కడలేరు. తలుపుదీయుము వారిమైత్రి నేటితో తీరినది. స్త్రీ మూలకమగు విరోధము మాటలతోఁ దీరునదికాదు, అందెవ్వఁడో యొక్కఁడు మడియువఱకు నదివృద్ధిఁబొందుచునేయుండును. తలుపు తీయుము. నీకు వచ్చిన భయమేమియునులేదు. అని పలుకుచుండగనే యనంగమోహిని కవాటము తెఱచుకొని యావలకు వచ్చి హేమావతి పాదమూలమునఁ బడినది.
హేమావతి యామెను లేవనెత్తి యనునయించుచుఁ బుత్రీ! భయపడకుము. నీకా తుంటరులవలన నేయాపదయును రాకుండ నేను గాపాడెదను. శోకంబపనయించు కొనుము. నన్న న్యురాలిగా దలంపకుము. నీకోపినంత సహాయము జేయుటకు సంసిద్ధు రాలనై యుంటిని. అనన్యసామాన్యరూపలావణ్యముల నలరారు నీవు శుద్దాంతమున నుండక యాహిమవత్పర్వత ప్రాంతారణ్యముల కెట్లువచ్చితివి? నీ తలిదండ్రులెవ్వరు? నీ నివాసంబెయ్యదిఁ నీ వృత్తాంతమును విన గుతూహలపడుచున్న దానను గోప్య ముగాదేని చెప్పుమనుటయు నా యన్నులమిన్న యొకింత ధైర్యము దెచ్చుకొని యిట్లనియె.
అమ్మా ! నికృష్టురాలనగు నా యుదంతముఁజెప్పి నీకుఁగూడ విచారమును దెచ్చిపెట్టుట కిష్టము లేకున్నది. అయినను నీవింత యాదరమున నడుగుచుండఁ జెప్ప కుండుట సమంజసముగాదు. నేను నాగలోక వాసుండగు వాసుకియను నరేన్యప పరీవృఢుని తనూజాతను. అనంగ మోహినియనుదానను. నన్ను నా తల్లిదండ్రులు బిన్ననాటఁగోలె నల్లారుముద్దుగఁ బోషించుచు సమస్తవిద్యల నుపాధ్యాయులచేత మా యింటియొద్దనే నాకు నేర్చించిరి. అసమాన వయోరూపనిశాచాతుర్యముల నలరారు నాకు దగినవరుని సమకూర్పవలె నని నాతండ్రి విశ్వ ప్రయత్నములఁ జేయుచు నాగ లోకమునందెందును నాకనురూపుడైన పురుషుండు లభింపక యా విచారమున నిరం తరముఁ గృశించుచుండెను.
ఒకనాఁడు నేను చెలిమికత్తెలతో గృహనిష్కుమ ప్రదేశమున విలాసముగా విహరించుచుండుటఁ గనిపెట్టి యొక రాత్రించరుండు నన్నపహరించి పైకెగసెను. ఇంతవఱకే నే నెరుంగుదును. శోకభయ విహ్వలనై యుండుటచేత వాఁడు నన్నెచ్చో టకుఁ గొంపోయెనో చెప్పజాలనుగాని నాకుఁ దెలివి వచ్చుసరికి నేనొకపర్వత శిఖరమున గుహా ముఖమున నతనిచేఁ గల్పింపఁబడిన శయ్యయందుంటిని. అచ్చట నేనొంటిగా నుండుటకు భయంపడుచు నాశయ్యనుండి మెల్లగాలేచి నలుమూలలు బరికింపఁదొడంగి తిని. ప్రాంతమం దిరువురురక్క సులుక్కుమెయిఁ గయ్యమాడుచుండుటఁ బరికించి యక్కడనున్న నేమి కీడుమూడునోయని యొకమారుమూల దారింబడి పారిపోయితిని.
అట్లు పోయిపోయి యెదుర నిర్మలజలాశయముగని యందలి జలముల నాపోవఁద్రావి యాప్రాంతశీతలతరుచ్ఛాయల బడలికలువాయ విశ్రమించితిని. ఇంతలో నాకెక్కడ లేనినిద్ర వచ్చినందున నచ్చటనే హస్తోపధానముగఁ బండుకొని గాఢముగ నిద్రబోతిని కొంతసేపటికి నాకొకన్వప్న మిట్లు వచ్చినది.
నాగలోకమున ననుంగకత్తెలు బలువురు పరివేష్టించిరా విహారార్ధమై యా ప్రాంతముల కొకయశ్వశకటమునెక్కి యరిగితిని. ఆ బండికిఁగట్టిన యశ్వము చోద కుని యాజ్ఞానువర్తిగాక బండి నెక్కడికో తీసికొనిపోయి యొకచో నిలచినది. అప్పుడు బండివాఁడు క్రిందకు దిగి యశ్వమును ప్రాంతమందున్న సరస్తీరమున నీరుద్రావించుటకుఁ దీసికొనిపోయెను మేమును బండిదిగి యింతలోయూరకయుండనేల నని యాప్రాంతవిశేషములఁజూడ నొకమార్గమునుబట్టి కొంతదూర మరిగితిమి ఎదుర కనకమయగోపుర ప్రాకారములతో నొప్పు దేవతాయతబొండు నేత్రపర్వంబొనర్చు టయు మేమతికుతూహలమున నచ్చటి కరిగితిమి. అదియొక యమ్మవారి యాలయము. అందెవ్వరును లేరు. కవాటములు తెఱచియే యుండుటచే మేము నిరాటంకముగా నా దేవి యాలయమున వ్రవేశించి ముమ్మారువలఁగొని యమ్మవారిని సందర్శింప గర్భా లయమున కరిగితిమి. అందు సహస్రసంఖ్యాకములగు దీపములు వెలుగుచున్నవి. దివ్య ధూపవాసనలు దిశల వ్యాపించుచున్నవి. నానాజాతిపుష్ప పరిమెళద్గంఢ వహాంకూరములు హృదయంగమమై యొప్పుచుండెను. ఆ దేవినప్పుడే యెవ్వరో యర్చించినరీతిని యందున్న ధూపదీపమాల్యాలంకారములు తెలుపుచున్నవి. ఆ యమ్మ వారిపీఠముముందు పాఅతాళేశ్వరియని చెక్కఁబడిన సువర్ణాక్షరములు దీపకాంతులచే ధగద్ధగాయమానముగ వెలుఁగు చుండెను. ఆ దేవింజూచి భక్తిపురస్సరముగా ననేక విధముల స్తుతియించి చేతులు జోడించి, లోకైకజననీ ! నేఁడు నీ దివ్యదర్శనముఁజేసి చరితార్దురాలనైతిని నాజననము పావనంబయ్యెను. అనురూపవరుని సమకూర్చి నాకు సంతోషమాపాదింపుము. నీపాదభక్తి నెన్నఁడును నెడబాయని బుద్ధి నాకు గలిగింపుము. అని వేడుకొనుచున్న నాకమ్మవారు దరహాసిత ముఖాంబుజయై పుత్రీ! నీ యదృష్టము మంచిది. అనతి కాలముననే యొక్కదివ్యప్రభావ సంపన్నుఁడగు పురుషుని పాణింబట్టి యనంత సుఖములం బడయగలవు నీకు సంభవించు నిక్కట్టులన్నియు నాతడే తీర్పగలడు. నీ శిరోభూషణమందలి రత్నము మృతసంజీవిని యను నామముగలది మరణించినవారు దాని స్పర్శ లేశమాత్రంబుననే బ్రతుకగలరు. అని చెప్పుచు నొక యద్భుతఫలంబు నాకిచ్చి యీ ఫలంబును వెంటనే భుజింపుము. దీనిందినిన వారికి క్షుత్పిపాసలుండవని యానతిచ్చినది.
అప్పుడు నేను నిరతిశయానందహృదయ సరోజాతనై యాభువనేశ్వరి పాదపద్మంబులకు సాష్టాంగ మొనరించియున్న తఱి నా చెలికత్తియ లందున్న పెద్ద గంట మ్రోగింపఁ దొడంగిరి. ఆ ధ్వనిచేతనో మఱెందు వలననో నాకు నిద్రాభంగ మైనది. అంత మేల్కొని యిటునటు పరికింప నా ప్రక్కలో నమ్మవారిచ్చిన ఫలము గనంబడినది దానికి వెఱఁగందుచు నేను నిక్కముగా నమ్మవారి గుడికిఁ బోతినాయని వితర్కించుఁకొనుచు దేవీవచనంబు వడువున నీపండుదినినఁ దప్పేమని యాలోచిం చుచు నా క్షణము దానింగోసి యాప్యాయనంబుగ భక్షించి దానిరుచి విశేషంబునకు మిక్కిలి యద్భుతమందితిని. పండు దినినది మొదలు నాకు క్షుత్ఫిపాశలు నశించి మేనికి నూతనోత్సాహ మంకురించినది ఆ ప్రదేశమును మూడుదినములవరకు విడువక యందే నివసించి నిద్రబోయినప్పుడెప్పుడైన నట్టి వింతకల వచ్చునేమోయను నాసతోఁ బ్రొద్దులు పుచ్చి తిని. కాని నాకట్టికల తిరుగనెన్నడును రాలేదు. నాలుగవదినంబున నా స్థలమువిడచి ముందునకుఁ గొంత దూరమఱిగితిని. ఆనాఁడు సూర్యాస్తమయసమయంబున నొక నరవననుసరించి పోవుచుంతఁ గొండపైనుండి యెద్దియో దొర్లివచ్చుచున్నట్లు కనంబడి నది నేనించుక విమర్శించి చూచుచుండ నొక రాకాసి శవము క్రిందఁబడినది
ఆ శరీరము పతనవేగంబునఁ దుత్తునియలైనది. దానిం దిలకించి దయఁ దలంచి మచ్చిరోరత్న ప్రభావం బమ్మవారివలన వినియున్న కతంబున నప్పుడే యా రత్నమును దలనుండితీసి వాని మేనంతయు దగిలించి నాసాపుటంబుసన్నిధి నించుక సేపుంచితిని. ఇంతలో నక్క ళేబరంబునఁ జైతన్యము గలిగినట్లు తోచినది. విస్మయ ముతో నేనట్లె చూచుచుండ నారక్కసుండు స్వస్థతగాంచి కన్నులుదెరచి యెదుర నున్న నన్ను జూచి దరహాసితముఖుండై దిగ్గున లేచెను. వాఁడు పునర్జీవితుండగుటకు నేను సంతసించుచు నమ్మవారిమాటలు కానందించుచు మదీయశిరోరత్న ప్రభావమున కుబ్బుచు నారాత్రించరుని వృత్తాంత మెరుంగఁగోరి వానినడిగిన నాతో వాఁడిట్లనియె.
తరుణీశరోమణి ! నేను నికుంభుఁడనువాఁడను. కుంభుని సోదరుండను. మేమిరువురము రసాతలనివాసులమే. నీరూపలాపణ్యాదులజూచి వలచిన మేమిరువురము నిన్నపహరించుకొనివచ్చి ఇందుఁజేరితిమి. నీనిమిత్తమే మాకిరువురకు నీప్రాంతమందు పెద్దయుద్ధము జరిగినది చివుర నేను నిర్జింపఁబడి పరాయితుఁడనై తిని. నిన్నుబొ౦దునాస యంతరించుటచే విరక్తుండనై సోదరునివలనబడిన పరాభవంబు హృదయంబెరియుచుండ జీవనముపై నాసవిడిచి యీ కొండనెక్కి భృగుపాతంబునఁ జావఁదలంచి క్రిందకురికి తిని. అచ్చటి దారుణ శిలాభిఘాతమున నిముసములో స్మృతితప్పినది. తరువాతనే మైనదో నాకు తెలియదు. తెలివివచ్చి చూచుసరికి భవధీయ దివ్యరూపంబు నా కన్నుల యెదుట సాక్షాత్కరించినది. భృగుపాతంబునఁబడిన శ్రమంబంతయును నిన్నుజూచుట తోడనే పోయెను. నాకిప్పుడు నూతనశక్తి గలిగినది. దైవమే నన్ను నీ సన్నిధికిం దెచ్చిపడవేసెను. భగ్నమనోరధుండనగు నాకు నిన్ను జూచునప్పటినుండియు హృదయక్షేత్రమున నూత్న యాశాంకురములు ప్రభవించుచున్నవి అని యేమేమో మదనోన్మాందమునఁ బ్రేలుచున్నవానిఁ దిరస్కరించి యావలంబొమ్మని నేననుచుండఁ గుంభుఁడక్కడి కెక్కడనుండియో వచ్చెను.
వానింజూచి నికుంభుఁడు కాలికొలఁది పారిపోయెను. అందు కుంభుఁడు నన్ను బలాత్కరింపఁబోవ నొకదివ్యప్రభావ సంపన్నుఁడగు పురుషశ్రేష్టుం డక్కడకు వచ్చి కుంభుని బరిమార్చి నన్నుఁగాపాడెను. ఆ నూత్నపురుషుని రూపరేఖవిలాసాదుల వీక్షించిన నిర్దుష్టమగు మన్మనంబు సంచలించెను. అమ్మవారి మాటలు దలంపునకు వచ్చెను. అతఁడే నా పతియని నిరూపించుకొని నా యభిప్రాయ మమ్మహాపురుషున కెఱింగించితిని. ఇంతలో వ్యాఘ్రనెపంబున నతఁడు దొలఁగిచన నేనొంటిగానందుం టిని. అయ్యద నెరిఁగి యీతుచ్చులిర్వురునువచ్చి నన్నుబట్టుకొని బలవంతముగా విమానమెక్కించి నీతోగూఁడ నిక్కడకుఁ దీసికొనివచ్చిరి. మీద యుదంతబంతయు నీవెరింగినదే. అని తనకథ నామూలచూడముగా వక్కాణించి యనంగమోహిని వేడి నిట్టూర్పుల నిగుడించుచు వెండియు నిట్లనియె.
తల్లీ ! నా యుల్లమున హత్తియున్న యా పురుషప్రవరుండెవ్వరో నేనెరుం గను. ఏలోకమువాఁడో నాకు దెలియదు. నన్నా యరణ్యంబునఁ గానక నాకై యెంత విలపించుచున్నాడో గ్రహింపఁజాలను. అతనినే నేను త్రికరణములచేతనుఁ బతిగా వరించితిని. వానినే నాకీశ్వరుండొడయనిగా సృజించెను. వానిం గాక నింకొకనిఁ గంతువసంతజయంతాదుల రూపమున నిర్జించినవానినైన నేనొల్లను. ఇదియే నా నిశ్చ యము. ఆ పురుషోత్తముని నేనెట్లుచేరగలనో నీవ యాలోచించి నన్గాపాడుము. ఇదియే నీవు నాకు జేయదగిన మహోపకారంబని వేడుకొనుటయు హేమావతి యామెకిట్లనియె.
అబలారత్నమా ! నీ యుదంతంబు వినినప్పటినుండియు నాకు నీ యందు జాలిగలుగుచున్నది. నీ తండ్రి జగద్విశ్రాంత యశోవిరాజితుండు. అట్టివానికి బట్టివై పుట్టినను నీకిట్టి యిక్కట్టులు తప్పవయ్యెను. ప్రారబ్ధబెవ్వానికైన యనుభవింపక తప్పదుగదా ! మరియును నీవు వరించిన పురుషుడెవ్వడో యెరుంగక వానిసన్నిధికి నిన్జేర్ప గలుగుటెట్లు ? ఇప్పుడు నిన్ను నీతండ్రి సన్నిధికిం బంపెద నంగీకరింతువా యని యడుగుటయు ననంగమోహిని యందు జేరినపిమ్మటఁ జూచుకొనవచ్చునని యెంచి యందుల కంగీకరించుచు నిట్లనియె.
అమ్మా ! భూలోకమును దాటి నాగలోకమేగుటకు వీలులేదుగదా ? దివో దాసుని శాసనమతిక్రమింపవచ్చునా ? యని యడిగిన నయ్యచ్చర మందస్మితయగుచు తరుణీమణీ ! రసాతలమునుండి దివిజలోకమున కెట్లువచ్చితివో యట్లే యిందుండి యందుబోరాదా ఆపదలయందు శాసనము లాగగలవా ? భయములేదని పలికి నక్క లికి యందులకు సమ్మతించినది. అప్పుడే హేమావతి తన చెలికత్తెయ లిరువుర కనంగమోహిని నప్పగించి యామెను దివ్యయానమున రసాతలమునకు గొనిపోయి వాసుకి కప్పగించిరండని నియోగించినది.
అనంగమోహిని ముప్పిరిగొను సంతసముతో హేమావతి యనుజ్ఞఁగైకొని యా చెలిమికత్తియలతో విమానశాలవైపు నడచుచుండెను. అప్పడెచ్చటనుండియో యొక భీకరాకారముగిల వ్యక్తి యువ్వెత్తుగవచ్చి యనంగమోహినిని సందిటఁబట్టుకొని రివ్వున బై కెగిరిపోయెను. హేమావతి చెలికత్తెలమ్మో ? రక్కసుఁడు రక్కసుఁడు, అనంగమోహిని నెత్తుకొనిపోయినాఁడని యాక్రోశించుచుఁ బోయి యావార్త హేమా వతి కెరింగించిరి. అనంగమోహినికి వచ్చిన కష్టపంరంపరల కామెమిక్కిలి విచారించినది. ఈ వృత్తాంతము నలువురకుఁ దెలిసిన దనగుట్టు క్రమముగా బట్టబయలగునను భీతిచేఁ యెవ్వరికిం దెలియనీయక కప్పిపుచ్చెను. అప్సరోయువతులఁ దిరస్కరించు రూప లావణ్యముల నొప్పియున్న యనంగమోహిని యెట్లయిన నమరలోకమునుండి యవుల కేగుటకు హేమావతి మనంబున సంతసించెను.
రక్కసుండొక్క డేతెంచి యెవరినో వేలుపు ముద్దరాలి నపహరించుకొని పోయెననువార్త యెట్టులో స్వర్గపుర వీధులయందెల్లడల వ్యాపించి క్రమముగా శచీ కళత్రునికిఁగూడ దెలిసినది. స్వర్గమందలి వారెవ్వరును దప్పిపోలేదని తెలిసికొని యా వార్త ప్రమాదజనితంబని యూహించి యూరకుండిరి.
311 వ మజిలీ
అలకాపుర సమీపప్రదేశ మొక్క నిముసములో మహాసంగ్రామరంగస్థల ముగా మారినది. యక్షలోకంబంతయును సంవర్తసమయసముద్భూత ప్రచండజంతళా మారుతవిలోలకల్లోల మాలావికీర్ణ మహార్ణవంబు తెఱంగున భయంకరంబయ్యెను. మణి గ్రీవజలంధరుల కలహము మొదట ద్వంద్వయుద్దములోనికిదిగినది. ఈ వార్త పురము లోని వారికిఁ దెలిసి పలువురా యుద్ధరంగమున కేతెంచి యతి దారుణముగాఁ బోరుచున్న వారింగాంచి యెవరిపక్షమువారు వారివైపు జేరి కయ్యమొనర్ప సాగిరి. ఆ ద్వంద్వయుద్ధమే సంకులసమరమయ్యెను. ఈ యుదంతము పిన్నలనుండి పెద్దలవరకుఁ బ్రాకినది. యక్షులలో రెండుపక్షములేర్పడి చివురకయ్యది దారుణసంగ్రా మముగా మారినది. ఆ సంగ్రామ రంగమునందు కత్తుల సవరించువారును బల్లెముల నెత్తువారును వింటినారుల సరిజేయువారును బాణపుంఖములకు ---లలం గట్టువారును పరశువులం బట్టువారును భిండివాలములఁ గదల్చువారును పట్టిసములు బరికించువారును తోమరమునఁ జేఁబూనువారును, గదలద్రిప్పువారును, గలిగి యయ్యెదిమహాసంరంభ దుర్నిరీక్షమై యొప్పెను.
అంతకుపూర్వ మత్యంతమైత్రితోఁ దిరుగువారిప్పుడిట్లు దారణసంగ్రామము నకు గడంగుట కేమిహేతువో యందిరువాగుల వారెవ్వరికిని దెలియదు అంతకంతకా సాంపరాయక మతిభీభత్సమగుచుండెనేగాని ప్రశాంతమొందు సూచనలేమియుఁ గనం బడుటలేదు. చిత్రకేతుండును సబాంధవ మిత్రబృందముగాఁ గొడుకుబక్షమునకేగి యీసుమెయి బ్రత్యర్థులతోఁబోరాడుచుండెను. ఆ సమయమునఁ గుబేర నలకూబరులు దేవసభకు స్వర్గమున కేగియుండుటచే దమ పురమున జరుగుచున్న యీ యుద్ధ విషయమేమియు నెరుఁగనే యెరుఁగరు.
అలకాపురం బట్లు యుద్ధ నిమగ్నమైయున్న కతమున వీధులెల్ల శూన్యము లైనవి. పురుషుఁడైనవాఁ డొక్కరుడును నగరమందు లేఁడు. సౌధోపరిభాగములయం