కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/309వ మజిలీ
కన్యక లిరువురును విమానమునెక్కి నిజనివాసంబున కరిగిరి. వారిపోక నెరింగి దివో దాసుండు హతాశుఁడై యవ్వనంబు విడచివచ్చి ముందు దానొనర్పఁదగిన కృత్య మెఱుంగక మందమంద గమనంబున నెచ్చటికోఁ బోయెను.
309 వ మజిలీ
హేమావతి కథ
స్వర్గలోకమందు మహేంద్రుని మ్రోల సుధర్మ సభాభ్యంతరంబున నిత్యము నాట్యమొనరించు నచ్చరలలో తిలోత్తమ యనుదానికి గూర్మి చెలికత్తెయగు హేమావతి రూప యౌవన విలాస విశేషంబుల ననవద్నయై యొప్పియుండెను. వెనుక తారకాసురుండు స్వర్గంబుమీఁదకు దాడివెడలి దేవతలఁ గాందిశీకుల నొనర్చి నప్పుడు రక్కసు లుక్కుమిగిలి తత్పురంబు ప్రవేశించి యదేచ్చగఁ గొల్ల పెట్టిరి. ఆ యదనున గామాంధుఁడగు రాత్రిం చరాధముం డొకఁడు హేమావతిఁని బట్టుకొని భోగలాలసుఁడై హిమశైల శిఖరంబునకు దీసికొనిపోయి యందామెను బలాత్కరింపఁ జూచెను.
వాని బారినుండి యెట్లయినను దప్పించుకొననెంచి యామించుబోణి యను రాగ ముట్టిపడునట్లు మంచిమాటల నిట్లనియె. సుందరుఁడా ? నీ యందము గాంచి నప్పటినుండియును నీవే నా మనోహరుండవని దలంచుచుంటిని పిరికిపందలగు బృందా రక బృందముల నిర్జించి యవలీలగ స్వర్గము నాక్రమింపఁగలిగిన మీకు మే మెల్ల రము వశంవదుల మైతిమి. ఇట్టి మమ్మిచ్చ వచ్చినట్లు నియోగించుటకు మీకు సర్వ స్వతంత్రము కలదు ! దీనికై శ్రమపడి యింతదూరము రావలయునా ? నీయట్టి సర సుఁడు లభించుటచే నేను నిక్కము ధన్యురాలనైతిని. నాప్రాణధనంబు)లు భవ దధీ నములైనవి. అమరావతీ నగరంబున నాకుఁగల దివ్యమందిరంబు సర్వవస్తు సమృద్ధమై యొప్పియున్నది. నేఁటి నుండియు నీవే దానికి నాయకుఁడవై తివి. మహారణ్యమధ్యం బున మనముండఁ బనిలేదు. మదీయ విలాస సౌధంబునకుఁ బోవుదము రమ్ము. అందు నీ యభీష్టము తీర్చుకొనవచ్చునని పలుకుచున్న యా యన్నుమిన్న మాటల కంగీక రింపక యా శైలశిఖరంబునఁ దనతో గలియక తీరదని యా రక్క సుండు నిర్భం ధింపఁదొడంగెను.
ఇంతలో నా ప్రాంతముల విహరించుచున్న యక్షమారులు మణిగ్రీవ జలంధరులు దైవికముగా నచ్చటి కేతెంచుటయు హేమావతికి ధైర్యముగలిగి యొక్క పరుగున వారియండఁ జేరి రక్షింపుఁడని వేడుకొనెను. వారామె కభయప్రధాన మొసఁగుచున్న యవసరమున నా నిశాచరుండు వారి సన్నిధికేతెంచి తీక్ష్ణముగా నిట్ల నియె.
ఓరోరి దుర్మదాంధులారా ! పాపశంక లేక పరనారినిఁ జేరదీయుటకు మీ రొనర్చు ప్రయత్నములు నా ముందు సాగనేరవని యెరుంగుడు. ఇది నా భార్య. నవ యౌవనముచేఁ జెన్ను మీరియున్న మీ రూపములకు వశంవదయై యిప్పుడీ కులట మీ సన్నిధి కేతెంచినది. దీనిని సత్వరమ విడిచిపెట్టకున్న నా యాగ్రహమునకు పాత్రు లగుదురు.
మణిగ్రీవుడు - [నవ్వుచు] ఏమి ! ఈమె నీ భార్యయ్యా? నీవీమెకుఁదగిన భర్తవే? మీ దాంపత్యము చాల ముచ్చటఁగొలుపు చున్నది.
రక్కసుఁడు - అట్ల నుచుంటివేమి ? నేనీమెకుఁ దగననియా నీయభి ప్రాయము.
మణి - కాదు. కాదు. ఆమె సౌంధర్యముననుఁ దగిన యందగాఁడవు నీ వొక్కడవే. మిమ్ముఁ గూర్చినవారి నభినందింప వలసియున్నది.
హేమా -- నేను వీని భార్యను గాను. నన్నీ దురాత్ముండు బలాత్కార ముగా నపహరించి యిచ్చటికిఁ దెచ్చి తన్గలయ రమ్మని నిర్భంధించుచున్నాఁడు. ఇంతలో దైవము మిమ్మిందు బంపెను. అనాధను రక్షింపుఁడు.
జలంథరుఁడు -- సుందరీ ! భయపడకుము. మా కంఠముల జీవములున్నంత వఱకు నీ రక్కసుఁడు నీ నీడనైనఁ ద్రొక్కజాలఁడని యెరుంగుము.
మణి - [రాక్షసునితో] మ్రుచ్చువై యిమ్మచ్చకంటిం గొనివచ్చి భార్య యని బొంకెదవేమిరా ?
రక్క --- మే మిచ్చటకు వచ్చిన పిమ్మటనే యీమె నాకు భార్యయైనది. ఈమె సర్వస్వమునకు నన్నే నాయకునిఁగా నింతకు ముందే నిర్ణయించి మీరు గనం బడిన తోడనే యిట్లు బొంకుచున్నది. స్త్రీచిత్తము క్షణక్షణమునకును మారుచుండు ననుట కిది తార్కాణము. ఎట్లయిన నీమె నే విడువను. దేవతల నిర్జించి వారి స్థాన మును మేమాక్రమించుకొంటిమి. పరాక్రమోసార్జితయగు నీ సీమంతిని నా స్వత్వ మైనది. దీనిని విడువుఁడు. లే దేని మిమ్ముఁ దగురీతిని శిక్షింపక మానను. అని యీ రీతి వారికి వాదోపవాదములు జరిగి క్రమక్రమముగా ద్వంద్వయుద్ధమునకుఁ గడంగిరి. వారిపోరు ఘోరమై హేమావతికి భయవిషాద జనకమయ్యెను. ఎంత బలము గలవాని కైన నిరువురతో పోరువు కష్టము గదా ? ఇరువురు యక్షకుమారులు నవవయస్కులు. బలపరాక్రమో పేతులు, మీదు మిక్కిలి రణ విద్యా విశారదులు. ఇన్నిటికన్న వెక్కు డుగ హేమావతికిఁ బ్రియ మొనర్చి యామె మెప్పువడయుటయే తమ జీవత పరమా వధి యని తలంచిన యా యౌవనపురుషుల తెంపరితనమే యా రాత్రించరుని నిర్వీ ర్యునిఁ జేసినది. కొంతసేపటికి మణిగ్రీవ జలంధరు లారక్కసుఁ బరిమార్చి హేమా వతిని సమీపించిరి. వారి విక్రమ విహారము గన్నులారఁ జూచిన యా యచ్చర కాయక్షకుమారులయందు నిరూపమానమైన యనురాగము గల్గి సంతోషాతిశయంబున నిరువుర నొక్కసారిగఁ గౌఁగలించుకొన్నది. ఆ దృఢాశ్లేష విశేషమున నయ్యిరువురు పురుషులు సాత్వికానంద పరవశులైరి అయ్యోషామణి గలియ నిరువురకు బుద్ది బుట్టి నది. మోహ మూర్చితులై యానదివద్వయం బొక్కింతతడవు నిశ్చేష్టితులైరి. హేమా వతివైపుదృష్టులఁ బరగించుచు నొకరినొకరు జూచుకొనుచుఁ దమ యాంతర్యముల వ్యక్తీకరింపఁ జాలక యున్మాదుల క్రియఁ బ్రవర్తింపఁ దొడంగిరి
హేమావతి కాయిరువురు సుందర పురుషులయందును సమానానురాగము మనంబునఁ గలిగియున్న కతంబున వారిపై విలాస దృష్టులఁ బరగించుచు మంద హాసము మొగమునకు సగమై మెరయ నిట్లనియె.
సుందరపురుషులారా ! మీరు నేఁడీ రక్కసునిఁ బరిమార్చి నాకెంతేని మేలొనర్చితిరి. మీకు నేను సర్వదా కృతజ్ఞురాలను మీరు చేసిన యుపకారమునకుఁ బ్రతిగ నా హృదయమునే మీకర్పించుచున్న దానను. నేను అమరావతీ పురమున నుండు దేవవేశ్యను. మీవయోరూప విలాసములకుఁ బూర్తిగాఁ వశ్యురాలనైతిని. అమర నగరంబెల్ల నేఁడు రక్కసులచే నాక్రమింపఁబడియున్నది నే నందేగినఁ దిరుగ నెట్టి యాపదలకుఁ బాల్పడవలసివచ్చునో తెలియదు. కావునఁ గొంతకొలము నన్ను మీరే సంరక్షింపవలయునని ప్రార్ధించు నాయోషామణి పలుకుల కలరుచు మణిగ్రీవుం డిట్లనియె.
మదవతీ! మే మిరువురమును యక్షవంశ సంజాతులము. నేను చిత్రకేతుని తనూజుండును. ఈతండును నా ప్రాణమిత్రుఁడు. జలంధరుండనువాఁడు. అలకా పురమే మా కాపురము. మాకు దేహములు భిన్నములైనను ప్రాణము లొక్కటి యనియే గ్రహింపుము. మా యిరువురకు నీవు సమానోపభోగ్యవై యుండుటకు మాకుఁ బరమ సమ్మతము. మఱియుసు నీవు యదేచ్చగ మా క్రీడాసౌధమున నివసించియుండ వచ్చును. అందు నీ కేలోపము రాకుండఁ జూచుకొనుచుందుము. మా కన్నులలోఁ బెట్టుకొని నిన్ను కాపాడు కొనఁగలమని చెప్పెను.
జలంధరుఁ డందుల కామోదించెను. అనన్య సామాన్యరూప లావణ్యంబుల నొప్పియున్న యొప్పులకుప్ప తమ్ము వరించుటచే ధన్యుల మైతిమని తమ బాగధేయ మును బ్రశంసించుకొనెను. మణిగ్రీవునకుఁ దన యందుఁ గల వాత్సల్యమునకు వానినిఁ పెద్దగ నగ్గించెను. పిమ్మట నయ్యప్సరోభామినితో నా మిత్రులిర్వురును బెద్ద తడ వగ్గిరి. కూటముల విలాస విహార మొసరించి మించిన యానందమున నద్దివ సాంతమునకు నిజ నివాసంబున కరిగి హేమవతిని రహస్యముగా నొక క్రీడాసౌధం బున నుంచి సంతత మామెతో నిష్టోపభోగంబులఁ జెలంగుచుండిరి. హేమగిరి శిఖరం బునఁ దమకుఁ బ్రధమ సమావేశ మగుటచే నా ప్రాంతములయందు వారి కెక్కు డభి మానము గలదు. అక్కారణమున వారు హేమావతితో నందు విహరించుట కెప్పు డును ముచ్చట పడుచుందురు. ఇట్లు కొంతకాల మరిగిన పిమ్మట నింద్రాదుల నారాయ ణుని యనుగ్రహమునఁ జగతుర నిర్జించియమరావతిని నిష్కంటకంబుగఁ బరిపాలించు చుండుట యెరింగి హేమావతి తన నిలయంబున కరిగినది. మణిగ్రీవ జలంధరులు, నిత్యమును స్వర్గపురంబునకుఁ బ్రచ్చన్నముగఁ బోయి హేమావతీ నిలయంబున నామెతోఁ గ్రీడావినోదంబులఁ గొంత తడవుండి తిరిగి వచ్చుచుందురు. వారు విమాన మెక్కి యప్పుడప్పుడు విలాసముగా నందందు విహరించుటకూడఁగలదు.
ఇట్లు పెద్దకాలము గతించిన పిమ్మట నొకనాఁడు వ్యోమయానంబున నొక సీమంతినీ రత్నమునుదెచ్చి మణిగ్రీవజలంధరులు హేమావతీ సౌధాభ్యంతరమంది రంబునఁ బెట్టిరి. ఇట్లొనర్చుట హేమావతికి మనంబున నిష్టము లేకున్నను నా మిత్రుల ప్రోద్బలంబు కతంబున మిన్నకున్నది. పిమ్మట మణిగ్రీవుండు మెల్లగా నయ్యబల సన్నిధింజేరి మోహావేశంబున నిట్లనియె.
నా శిరోమణీ ! త్రిలోక మోహజనకంబైన నీ సౌందర్యంబు గన్నులార గాంచి క్రొన్నన విలుకాని యడిదంపు పోటులసహింపఁజాలక నేనీ సాహసమునకుం బూనుకుంటిని. ఇందులకు నన్ను న్యధా తలంపక కటాక్షరసప్రసారంబున నన్నాదరించి యేలుకొనుము. నీ కనుసన్నల మెలంగఁ గలవాఁడను నేను మణిగ్రీవుండను. యక్ష కుమారుండను. కుబేరుని సంతతివాడను. సర్వభోగభాగ్య సంపన్నుఁడను. నన్ను జేపట్టిన నీవు మితిలేనిసుఖంబులఁ బొందఁగలవు. ఇందులకు నీవు సమ్మతించి భవదీయ సుధమధురాధర రసంబిచ్చి నన్నుఁ గృతార్థుం జేయుము. అని యింక నేమేమో మదనోన్మాదుండై వచించుచున్న వానికా యోషిల్లలామ శోకావమానజనిత క్రోధానల తీవ్రంబున ననేక నిష్టురములాడుచు మరియు నిట్లనియె.
ఓరీ ! బాలిశా ? నీ తులువతనంబెల్ల నీ చేష్టలవలననే తెల్లమగుచుండెను. నీవు దేవయోని సంభూతుండవైనను కుచ్చితకార్యాచరణంబునకు వెనుదీయని వాఁడవై నికృష్టుండవైతివి. పరనారీ సమాపహరణ మహాపాతంబునకుఁ గడఁగిన నీవు క్రూరరాక్ష సాధముండవు. నిన్నుజూచి నీతో సంభాషించినవారికిఁ గూడ నీ కిల్మిషము లంటఁ గలవు. పో. పొమ్ము. అని కఠినముగాఁ బలుకుచున్న యామె పలుకులు ములుకులై మర్మచ్చేదం బొనర్ప నరడాగ్రహంబున నిట్లనియె.
ఏమేమీ ! నీ విందు నాకు ధర్మోపన్యాసము నొనరించుచుంటివా దేశకాల పాత్రంబులెరింగి మాటలాడకున్న యవమానమురాఁగలదు. నీవు నాయధీనమైతివి. వంటయింటకుందేలెందుఁ బోఁగలదు. మచ్చిక నే జెప్పుమాటల కిచ్చగించిన మేలయ్యె డిని. లేకున్న నిన్నిందు బలాత్కరించి నా యభీష్టము దీర్చుకొందును. నన్నునీ విందంగీకరించినచో ననన్యసామాన్య దివ్యభోగంబుల సుఖింపఁగలవు. లేకున్న ముందు నీవేమగుదువో నీవ యాలోచించుకొనుము. ఇందులకు నీకొక్క గడియ యవ కాశ మొసంగితినని యూరకుండెను.
వానిని నిష్టురములాడిన లాభములేదని యెంచి యామించుబోణి కపటం బున వచించుటయే కర్తవ్యమని నిశ్చయించి కించిత్స్మితా స్వభాస్వరయై ప్రియంబుట్టి పడునట్లు వానితో నిట్లనియె. యక్షవంశ ప్రదీపకా? తావకీన రూపయౌవన విశేషంబులం జూచి యే చిగురుఁ బోణి పంచశరుని తాపంబు బొందకుండును ? అదృష్టవశమున నీయట్టి దివ్యపురుష సమాగమంబు లభింపఁ గాదనుటకు నేనెంత తెలియని దాననా యేమి? నీ నిశ్చయుంబెంతవరకుఁ గలదో యెరుంగుట కట్లు విరశోక్తులాడితిని గాని మఱొకటి గాదు అందులకు నీవు మనంబున గలఁతనొందఁ బనిలేదు. నేనెట్టులైన నీదాననైతిని. అయినను నాకొక్క విషయము గలదు. నేనేకభర్తృలాలస నగుటచేత నన్యపురుషునెవ్వనిని జూడనొల్లను. నేఁడు మనతో విమానము మీఁద నేతెంచిన భవ దన్యు డెవఁడు. వానికి నాయందభిలాష యున్నట్లు వాని చూపుల వలననే తెల్లమైనది. నా మనంబు నీయందే దృఢబద్దమైనది. వానినిఁక నెన్నఁడు నా యెదుటకు రానీయ వలదు. ఇందులకు నీవు బాసఁజేయవలయునని యూరకుండెను.
ఆ మాటలువిని యా యక్షకుమారుం డమందానంద కందళిత హృదయార విందుఁడై మన్మనోపహారిణీ ! నీ నియమంబు నాకెంతేని సంతసము గొల్పుచున్నది. వాఁడు నా పరిచారకుఁడు వానిలెక్క నీకేమియును లేదు. నిన్ను పోతుటీగయుం జొరని శుద్ధాంతమున బువ్వులలోఁబెట్టి కాపాడఁగలను. నీవితరశంకలన్నియును విడు వుము. అని పలుకుచుండగఁనే యవులనుండి జలంధరుండు తలుపుఁదట్టుచు మిత్రమా! మణిగ్రీవా? ఎంత సేపు నీవందుందువు. ఈపాటి కీవలకురమ్ము. నీవంతైనదిగదా. ఇఁక నా ముద్దుగుమ్మతోఁ గలిసి యానందించువంతు నాకిమ్ము సత్వరమురమ్మని పలుకుట యును మణిగ్రీవుం డదరిపడి వాని నలుక మెయి గద్దించుచు నిట్లనియె.
ఓరీ ! తుచ్చుఁడా ! నేను మంచితనమున మిత్రునివలె నాదరించుచుండ నీ కెంతకండకావర మెక్కినది. నా ప్రాణేశ్వరితోఁ గలియుటకు నీకు నాతో వంతు కావలెనటరా ! మిత్రద్రోహీ ! ఇంకొకసారి యిట్టి యవాచ్యము లాడితివేని నీ నాలుక వేయి చీలికలుగాఁగలదు; జాగ్రత్త! పో, పొమ్మని యదలించిన విని జలంధరుండు నివ్వెరపడి యొకింతతడవేమియు మాటరాక యుండి వెండియు నిట్లనియె. మణిగ్రీవా! ఇప్పుడు వచించిన బెడిదంపు మాటలు నీనోట వెల్వడినవేనా! నీకాపూవుబోణి ప్రాణేశ్వరియా ? మనమిర్వురము భూలోకమున నామెంజూచి మోహించి బలిమిమై యిందుఁ దెచ్చుకొన్న సంగతిమరచితిరా యేమి? ఆమెయందు నీకెట్టి స్వతంత్రము గలదో నాకును నట్లేయుండునుగదా ! ముందుగా నీవామెతోఁ గలిసీకొనుటకు నేను సమ్మతించిన మాత్రమున నామెకు నీవే సర్వాధికారివగుదువా యేమి ! హేమావతి యెట్ల మనయిర్వుర కీమె సమానోపభోగ్యయగునుగాని యన్యము గాదు. పెక్కు మాటలుడిగి యీపాటి కీవలకు రమ్ము నన్నందుఁబోనిమ్ము. ఇందు వేరొక వైఖరి నీవు ప్రవర్తించిన మన నేస్తములు నిలువనేరవు. సత్వరమ రమ్మని పిలుచుచుండ మణిగ్రీవుండు కటకటంబడుచు నిట్లనియె
జలంధరా ! నీయవాచ్యములకు మేరలేకున్నది. మన నేస్తము. లిఁకమీద నిలువ నేరవనియా యంటివి తధాస్తు. ఈ క్షణము మొదలు మనకొకరితో నొకరికి సంబంధము లేదు. ఇంక నధిక ప్రసంగము జేయక యవులంబొమ్ము. ఈ ముద్దు మోముం జూడ నేవగించుకొనుచున్నది. ఆ పలుకులు విని జలంధరుండు నాది మొద్దు మొగమును నీది రాకాచంద్రబింబమునా ? నీ యందమునకు నీవ విఱ్ర వీగవలెను. ఆ యెలనాగ నందు విడిచి నీ విందుండి నిమిషములో లేచిపోవలెను. లేకున్న యవులకీడ్పించెదను. అని యనుటతోడనే మణిగ్రీవుండు మండిపడుచుఁ దటాలునఁ దలుపు తీసికొని యీవలకు వచ్చి జలంధరుని జుట్టుపట్టి వంచి వీపుమీద రెండు గ్రుద్దులు వేసెను. జలంధరుఁడు వానిపై దిరుగఁబడి పాదప్రహరణంబులఁ బ్రత్యుత్తరమిచ్చెను. ఆ యదనున ననంగ మోహిని తన్మందిర కవాటము లోన బిగించుకొనియెను.
ఇట్లా పురుషులిర్వురు దమ పూర్వపుమైత్రిందలపకయన్యోన్య విజిగీషేచ్చా మనీషులై ముష్టియుద్ధం బొనరించుచుండ హేమావతి చర చర నచ్చటికివచ్చి వారిని గారులుచ్చరించుచు మ్రుచ్చులారా ! మీ మూలమున నాకుఁగూడ నవమానము రాఁగలదు. మీపోరు విధం బెవ్వరేని విన్న నాగుట్టు దేవేంద్రునికిగూడఁ దెలియగలదు. ఇఁక మీ నీగసహవాసము నాకు చాలును తక్షణమ నాగృహమునుండి యవులంబొండు. లేకున్న బలవంతముగ గెంటింపవలసివచ్చును. మఱియొక యుచితస్థలంబునకుఁ బోయిన నొకరిబలము లొకరు తెలిసికొనవచ్చును. అని పలుకుచుండగనే మణి గ్రీవుండు జలంధరుని నాంత్రములూడునట్లు గట్టిగాకొట్టెను. వాఁడాదెబ్బకోర్వఁజాలక బైటకుఁ బారిపోయెను. వానిం దరుముకొని మణిగ్రీవుం డేగెను. హేమావతి వారు తిరిగి రాకుండునట్లు కట్టుదిట్టములు జేసెను.
310 వ మజిలీ
అనంగమోహినికథ
మణిగ్రీవజలంధరు లరిగిన యనంతరంబున హేమావతి యనంగమోహిని యున్న గదియొద్దకువచ్చి అమ్మా! ఆ మ్రుక్కడు లిక్కడలేరు. తలుపుదీయుము వారిమైత్రి నేటితో తీరినది. స్త్రీ మూలకమగు విరోధము మాటలతోఁ దీరునదికాదు,