Jump to content

కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/308వ మజిలీ

వికీసోర్స్ నుండి

యందున్న యనంగమోహిని శిరోరత్న మా సందడిలో జారిపడినది. దాని నమ్మహా రాజు సంగ్రహించి నిజోత్తరీయంబునఁ బదిలపరచెను. రత్నము పోయినది మొదలు నా సత్వము క్షీణింపసాగెను. ఆ రాజు తన కుటారధారచే నా మేనిపై నెన్ని నరకులు బెట్టెనో చెప్పఁజాలను. ఆపాదమస్తకము వాని కత్తిపోటు తగలని ప్రదేశములేదు. శరీరమునుండి నెత్తురు వెల్లువయై ప్రవహింపఁదొడంగినది. నన్నాతఁడెత్తి‌ గుహాముఖం బున విసరివేయుట కొంచె మెరుంగుదును. పిదప నేమైనదో నేనెరుంగను. నాకు తెలివి వచ్చుసరికి మీ చికిత్సాలయమున నుంటిని. ఇచ్చటికెట్లు వచ్చితినో యచ్చట వారేమైరో నేనెరుంగనని తన కథ యంతయును జెప్పి యూరకుండెను.

వాని యుదంత మంతయును విని విని యచ్చట నున్న వారెల్ల విస్మయ మందిరి బలిచక్రవర్తి కుంభుఁ డొనరించిన యపరాధమింకను విమర్శింపవలసి యున్నది. ఇప్పటికి వీనిని బందిగంబున నుంపుఁడని వానిఁబంపివేసి శేష వాసుకులతో నిట్లనియె. హితులారా ! వీనివలన ననంగమోహిని తన శీలమును రక్షించుకొనుచు కుశలముగా నున్నట్లు తెలిసినదిగదా ! మరియుసు సద్గుణగరిష్ఠుండగు దివోదాస ధారుణీచక్రవర్తి సంరక్షణంబున నామె యున్నదని గూడ తెలియుచున్నది. ఆమెకింక నేమియను‌ భయంబుండబోదు. మీరు నిశ్చిం తతొ నుండవచ్చును. కొలది కాలంబుననే యా రాజన్యుండామె నిచ్చటకు బంపఁగలడని వారి ననునయించి నిజనివాసంబులకు నంపివేసెను. అని చెప్పి మణిసిద్ధుఁడు తదనంతర వృత్తాంతమవ్వలి మజిలీ యందిట్లు చెప్పందొడఁగెను.


308 వ మజిలీ

గుణవతికథ

గోపా ! వినుమట్లా దివోదాసుండు యోగమార్గంబున దివంబున కెగసి దైవవశంబునఁ దిన్నగా నలకాపుర బాహ్యోద్యానవన సమీపంబునకుఁ బోయిచేరెను. ఆ యుద్యానవన రామణీయకమునకు మిగుల వెరఁగందుచు నచ్చటి విశేషంబులం జూడ నుత్సుకతంజెంది యా యుపవనాభ్యంతరమున కరిగి యందందుఁగల వింతలంజూచుచు విహరింపుచుండెను.

లయగ్రాహి

కాంతిఁగల యందపు కుడుంగముల యందతి పసందుగనుబొంది కవ హింపన్‌ ! ముందుఁగనువిందుగ నమందగతిఁ బెం పెనఁగ సుందర లతానిచయ మందొలయు నాయిం ! దిందిరములెల్ల మధువుందనిపి మైకమున సిందడియొనర్పఁ బలుచందముల నేత్రా నందముగ గ్రందుకొని కెందలిరుపందిళుల డెందమలరంగ నతఁడందు విహరించెన్‌.


సీ. అచ్చంపు నెలఱాల నమరి పచ్చలమెటఁ
              గొమరు మీరెడు గేళకుళులఁ గాంచి
    మగమానికపుఁ గాంతుల గణితంబుగ దిక్కు
              లకుఁ జిమ్ము దివ్యవేదికలఁ జూచి
    కుప్పకుప్పలుగాఁగ గప్పురంబును విప్పు
              తులలేని యనఁటి బోదుల నెరంగి
    పూల మొక్కలకెల్ల జాలుగా నీర్జల్లు
             జలయంత్ర సువిశేషములగ్రహించి.

గీ. ద్రాక్షపందిళ్ళ సౌరు బెద్దగ నుతించి
    పచ్చికబయళ్ళ సౌఖ్యంబుఁ బ్రస్తుతించి
    పోకమ్రాకుల శృంగారమును దలంచి
    మించి‌ యుద్యానమున విహరించె నతఁడు.

ఇట్లయ్యుపవన విశేషంబులం దిలకించుచుఁ బోయిపోయి ముందర గొంద రలినీలవేణుల విన్నాణంపు బలుకుల రొద విని యా ప్రాంతమందలి యొక పూ పొదరింటఁ బొంచియుండ వారి సంభాషణమిట్లు వానికి వినంబడెను.

గుణవతి -సఖీ ! చిత్రలేఖా ! అనుకూల వాల్లభ్యంబుగోరి భజింపుచున్న నాయందు స్వయంప్రభాదేవి కింకను ననుగ్రహంబు రాలేదేమి ! ఈ దేవి భక్త కల్పకంబందురు గదా ?

చిత్ర -- నెచ్చలీ ! ఏల నీకీ తొందరపాటు. స్వప్నగతయై నీకా లోకేశ్వరి చెప్పిన మాటలు మరచితివా యేమి ? అనురూపవరునిం బొందుటకు నీ కమ్మవారు బెట్టిన మితి నేఁటితోనే కదా తీరుచున్నది. ఎప్పటికెట్లు సంభవింపఁ గలదో యెవ్వరు చెప్పగలరు ?

గుణ - అమ్మవారు చెప్పిన మాట యనిన జ్ఞప్తికి వచ్చుచున్నది. నాకొక దివ్యప్రభావ సంపన్నుఁడగు పుడమి యొడయుండు మగం డగునని యా దేవి యాన తిచ్చినదేమి ? ఇది నిక్కువమగునా ? రుగ్జరామరణభయ వశంవదులగు మనుజులకు మనకును సంబంధమెట్లు సరిపోవును ?

చిత్ర -- బాలామణీ ! మనుజులలో రూపలావణ్య బలప్రభావై శ్వర్యంబుల దివిజులఁ దలఁదన్ను వారెందరులేరు ! పురూరవ చక్రవర్తి చరిత్రయే యిందులకు నిదర్శనము. అచ్చరలలో నందరకన్న చక్క.నిదని యెన్నికఁగన్న యూర్వశి వాని కిల్లాలై యుండలేదా ? గుణ -- ఎక్కడి మనుజలోకము ఎక్కడి యక్షుభువనము. ఎన్నడో యూర్వశీ ప్రభృతుల కట్టి యవకాశము గలిగినదని యందరకు నట్టి సంఘటనము గలుగునా ? నా కదేమి దైవయోగమో గాని యమ్మవారి మాటలు వినినదిగోలె నిన్ని దివిజలోకములుండఁగా మర్త్యలోకమునకే బుద్ధి మరలవలయునా ?

చిత్ర - నిక్కముగ నట్లుండుటకు దైవబలమే కారణము. అమ్మవారి మాటల కన్యధాత్వ మెట్లు సంభవింపఁగలదు. నీ యదృష్టము మంచిది అనతికాలము ననే ధారుణీరాజైక్య ధురంధురుండగు వానికి పట్టమహిషివై యనన్యసామాన్యభోగ భాగ్యంబుల నలరారగలవు ?

గుణ --- అట్టి మహాభాగ్యం బొదివినప్పుడు గదా యనుకొనవలయును. నా తండ్రి చిత్రకేతుండు నన్నొక స్వజాతి పురుషున కంటగట్ట వలయునని పట్టుబట్టి యున్నవాఁడు గదా? నా కోరిక యెట్లీడేరఁగలదో తెలియకున్నది.

చిత్ర -- నీ వేమనుకొన్నను‌ సరేకాని నీ తండ్రి వట్టిమూర్ఖుఁడు. కాకిముక్కు నకు దొండపండును గట్టినట్లుగా సర్వకళాప్రపూర్ణువగు నిన్నొక విద్యావైభవ శూన్యుం డగు యక్షకుమారునకు కట్టిపెట్ట నిట్టట్టనరాని ప్రయత్నముల జేయుచున్నాడు. వాని మాటల విని నీవెన్నడును మోసపోకుము. పిదప చింతించిన లాభముండదు.

గుణ - అయ్యో ! నా తండ్రి మాటల విని మా యమ్మయు నన్నిందుల కొడంబడుమని నిర్భంధించుచున్నది. ఈ గండమెట్లు దాటగలనో గదా ?

చిత్ర - నీ తల్లిదండ్రులు సెప్పుచున్న యక్షకుల కలంకమగు నీతండీ మధ్య నొక చిత్రము జేసెనఁ‌ట వింటివా?

గుణ - నాకేమియు దెలియదు చెప్పుము.

చిత్ర - త్రిలోక దుర్ల భంబగు నీదు సౌందర్య వాగునా బద్ధహృదయ రాజీవుండై నీవే తనకు భార్యగావలయునని కోరుచు భైరవీ దేవింగూర్చి యామూర్ఖుం డనేక క్షుద్రోపాసనల నొనర్చుచున్నాఁడట. ఆ వ్రత సమాప్తి ఱేపు జరుగఁగలదట.

గుణ -- (నవ్వుచు) నా మనంబొల్లనప్పుడు మంత్ర తంత్రంబులువ రించునా యేమి ? దేవతోపాసనలు విధివియోగమును దప్పింపగలవా ?

చిత్ర -- దేవతోపాసనలు దైవవిధి నెన్నఁటికిని దప్పింపజాలవు ఇందు వలన వానికి లాభము కలుగుమాట ముందెటులున్నను నేఁడు వాని యకార్యకర ణంబులు జగంబునకుఁ దెల్లమయ్యెను.

గుణ - అదెట్లు.

చిత్ర --- వినుము. తద్వ్రత సమాప్తమునకు నెన్నఁడు నొరులఁగఱచి యెఱుంగని వృద్దసర్పవిషంబునఁ దనువు బాసిన మనుజబాలక ప్రేతంబును దెచ్చి తచ్చిరోజముల వింజామరలుగ కపాలపుంజిప్పలు దీపపుం బ్రమిదలుగ మేనిక్రొవ్వు దైలంబుగా నాంత్రంబులు వర్తులుగ నేర్పరచి యా భైరవీదేవి నారాధించి యా శవాక్షి గోళంబులతో నీరాజనమెత్తి తదీయ హృదయపిండంబు నై వేద్యము పెట్టి యా వ్రత దీక్ష పూర్తిసేయవలయునట.

గుణ - అబ్బా ! నీవు చెప్పుచున్న పూజావిధానము వినిన హృదయగ్రంధి విడిపోవుచున్నదిగదా ? ఎట్టి దారుణము. ఎట్టి యనుచిత కార్యము ! ఎట్టి రాక్షస కృత్యము !

చిత్ర -- అట్టి నరబాలక కుణపంబునకై వాఁడెన్నియో పాట్లుపడి యెట్ట కేల కీనడుమ నెట్టులో యొకదానిందెచ్చి వ్రతసమాప్త దివసంబు వచ్చువఱకు నొక తైల ద్రోణియందుంచి కాపాడుచుండెనఁట. ఈ రహస్యము వాని యన్న భార్య నాతో నేదియో ప్రస్తావనమీద నిన్ననే చెప్పినది.

గుణ - ఛీ! వానిచర్యలిఁక నాయొద్దఁ జెప్పకుము. వానిఁ దలంచినవారికిఁ గూడ పాపము లంటఁగలవు వాఁడిట్టి వాఁడు గనుకనే నాజననీ జనకులెంత జెప్పినను వానిం జేపట్టుటకు నా మనంబున నేవగింపు గలిగినది నా విముఖత్వ మెరింగి యా తుచ్చుఁడిట్టి యకార్యంబులకుం గడంగెఁ గావలయును ప్రాణములైన విసర్జింతును గాని యా నీచునీఁ గలనైన నొల్లను.

అట్లు వారు సంభాషించుకొనుటవిని దివోదాస ధారుణీంద్రుండు నివ్వెఱం బడుచు నౌరా ! ఆ యక్షుఁడే గావలయు నాఁడరణ్యంబున సర్పదష్టుండై మృతినందిన శబర బాలకుని ప్రేతము నపహరించినవాఁడు ఇందలి నిక్కువంబెరింగి యాకళేబరము నెట్లయినను గ్రహించి యందు ప్రాణప్రతిష్ట జేయించవలెనని నా మనంబు తత్తరపడు చున్నది. మరియు నీ యక్షకన్యకా లభామ యంగసౌష్టవంబును సుగుణసంపదయును గాంచినప్పటినుండియు మన్మనంబు పంచశర శరావిద్దమగుచుండెను. ఈ బాలికామణికి భూభర్తయే ప్రాణేశ్వరుండగునని యమ్మవారు చేప్పినట్లు వింటినిగదా ? ఈమెం జేపట్టుట కొఱకే పరమేశ్వరుండు నన్నిందు జేర్చియుండవచ్చును. ఈ మోహనాంగి కూడ మనుజుని భర్తగాఁ బడయుట కువ్విళ్ళూరుచున్నది. ఆఃఆ ! ఈశ్వర సంకల్ప మతి విచిత్రమైనదిగదా !


క. ఏది దుష్కర మరు సుకరం
   బెది దుర్లభ మదియె సులభ మెద్ది దురాపం
   బదె సంప్రాప్యము దేహికిఁ
   గుదురుగ నా యీశ్వరాజ్ఞఁ గూడిన యెడలన్‌.

గీ. తలవని తలంపుగా నెందుఁ గలుగుచుండు
   శుభము లశుభంబు లనునవి చోద్యముగను
   వాని కరయంగఁ గర్త యెవ్వాఁడు లేఁడు
   సర్వ మీశ్వరాయత్తమై జరుగుచుండు.

అని యా రాజేంద్రుండిట్లు వితర్కించుకొనుచున్న సమయంబున నా యక్ష కన్యక లిరువురును విమానమునెక్కి నిజనివాసంబున కరిగిరి. వారిపోక నెరింగి దివో దాసుండు హతాశుఁడై యవ్వనంబు విడచివచ్చి ముందు దానొనర్పఁదగిన కృత్య మెఱుంగక మందమంద గమనంబున నెచ్చటికోఁ బోయెను.


309 వ మజిలీ

హేమావతి కథ

స్వర్గలోకమందు మహేంద్రుని మ్రోల సుధర్మ సభాభ్యంతరంబున నిత్యము నాట్యమొనరించు నచ్చరలలో తిలోత్తమ యనుదానికి గూర్మి చెలికత్తెయగు హేమావతి రూప యౌవన విలాస విశేషంబుల ననవద్నయై యొప్పియుండెను. వెనుక తారకాసురుండు స్వర్గంబుమీఁదకు దాడివెడలి దేవతలఁ గాందిశీకుల నొనర్చి నప్పుడు రక్కసు లుక్కుమిగిలి తత్పురంబు ప్రవేశించి యదేచ్చగఁ గొల్ల పెట్టిరి. ఆ యదనున గామాంధుఁడగు రాత్రిం చరాధముం డొకఁడు హేమావతిఁని బట్టుకొని భోగలాలసుఁడై హిమశైల శిఖరంబునకు దీసికొనిపోయి యందామెను బలాత్కరింపఁ జూచెను.

వాని బారినుండి యెట్లయినను దప్పించుకొననెంచి యామించుబోణి యను రాగ ముట్టిపడునట్లు మంచిమాటల ని‌ట్లనియె. సుందరుఁడా ? నీ యందము గాంచి నప్పటినుండియును నీవే నా మనోహరుండవని దలంచుచుంటిని పిరికిపందలగు బృందా రక బృందముల నిర్జించి యవలీలగ స్వర్గము నాక్రమింపఁగలిగిన మీకు మే మెల్ల రము వశంవదుల మైతిమి. ఇట్టి మమ్మిచ్చ వచ్చినట్లు నియోగించుటకు మీకు సర్వ స్వతంత్రము కలదు ! దీనికై శ్రమపడి యింతదూరము రావలయునా ? నీయట్టి సర సుఁడు లభించుటచే నేను నిక్కము ధన్యురాలనైతిని. నాప్రాణధనంబు)లు భవ దధీ నములైనవి. అమరావతీ నగరంబున నాకుఁగల దివ్యమందిరంబు సర్వవస్తు సమృద్ధమై యొప్పియున్నది. నేఁటి నుండియు నీవే దానికి నాయకుఁడవై తివి. మహారణ్యమధ్యం బున మనముండఁ బనిలేదు. మదీయ విలాస సౌధంబునకుఁ బోవుదము రమ్ము. అందు నీ యభీష్టము తీర్చుకొనవచ్చునని పలుకుచున్న యా యన్నుమిన్న మాటల కంగీక రింపక యా శైలశిఖరంబునఁ దనతో గలియక తీరదని యా రక్క సుండు నిర్భం ధింపఁదొడంగెను.

ఇంతలో నా ప్రాంతముల విహరించుచున్న యక్షమారులు మణిగ్రీవ జలంధరులు దైవికముగా నచ్చటి కేతెంచుటయు హేమావతికి ధైర్యముగలిగి యొక్క పరుగున వారియండఁ జేరి రక్షింపుఁడని వేడుకొనెను. వారామె కభయప్రధాన