కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/307వ మజిలీ

వికీసోర్స్ నుండి

307 వ మజిలీ

కుంభనికుంభులకథ

దానవేశ్వరుని యనుమతంబునఁ గుంభదానవుం డిట్లనియె. దానవకుల సౌర్వభౌమా ! రత్నచూడుండరిగిన వెనుక దివోదాస మహారాజు చేరువనున్న కాసార తీరంబునకుఁ బోయెను అతడు నాగలోకమువారు భూమిపై నుండరాదని శాసించిన పుడమియొడయుండని యెరెంగిన కతంబున నాయొడల భీతి జనించినది. నన్ను జూచి యతండు శిక్షించునేమో? యను భయంబున మరియొక మారు మూలదారిని పారిపోతిని.

నేనట్లొకమార్గంబున భయోద్రేకంబునఁ బోవుచుండ ముందొకచో నా కనంగమోహానీ నికుంభులు దృగ్గోచరమైరి. నికుంభుఁడామె పాదంబులంబడి బ్రతిమాలు చుండ నావేదండయాన ఛీ! మూర్ఖుడా! ఆవలఁబొమ్మని యదలించుచున్నది. ఆ దృశ్యము గోచరమైనతోడనే నాకెక్కడలేని కోపమువచ్చినది. ఒక్క పరుగున వానిం డాసి నికుంభా తిరుగవచ్చితివా? ఎన్ని చెప్పినను నీ యాగడము మానకుంటివి. ఈసారి గాచికొనుము నీ మదము సదమదము జేసెద నని మహాక్రోధముతో వానిపై కురికితిని.

నన్ను చూచుటతోడనే వాఁడు తోకతెగిన పిట్టవలె వెనుకకు జూడకుండ కాలికొలఁది పారిపోయెను. వానిని వెంబడించి పోయిన నక్కాంతాలలామ నెడబాయ వలసి వచ్చునేమో యను భయంబున నేనచ్చటనే నిలచితిని. అయ్యంగనామణి నన్నుఁ జూచి విభ్రాంతయయ్యెను. మేమిరువుర మామె నాసించి తిరుగుచున్న సంగతి పాప మామె యెరుఁగనే యెరుఁగదు. మరియును మేమన్నదమ్ము లిద్దర మొక్క పోలిక నుండుటచేత నామెకు వింతదోచి యుండవచ్చును. అప్పుడు నే నామె కిట్లంటిని.

సారంగనయనా ! ఏల నీకీ రిచ్చపాటు. వాఁడు నా తమ్ముడు. నేను నిన్నిందుఁ దీసికొనివచ్చుట యెరింగి నీకై యాసఁగొని వాఁడు మనల వెన్నంటి వచ్చెను. ఇదివరకు నా చేత నొకసారి పరాభూతుఁడై యిప్పుడు సిగ్గులేక మరల వచ్చినాఁడు. ఇంకొక మారు నీ సమీపమును జేరినయెడల వానిని తుదముట్టింపక మానను. మానవతీ శరోమణీ ! ఆ సెజ్జనుండి లేచి యచ్చటకేగితివి. నీకొర కీయరణ్య మంతయును వెదకుచుంటిని. అబ్బా ! నీ వియోగంబునకు నేనెంత పరితపించితి నను కొంటివి ? ఇప్పటికైనను కనిపించి నాకు నేత్రోత్సవం బొనరించితి వదియు చాలును. ఇంతవరకు నేపడిన శ్రమ యంతయును నిన్ను జూచుటతోడనే మటుమాయమయ్యెను. నాపై నింత కఠినముం బూనదగునా! నిన్నిచ్చటకు బలవంతముగాఁ దీసికొనివచ్చి శ్రమ‌ పెట్టితినని నాపై కినుక వహింపకుము. యెంత శ్రమ పెట్టితినో యంత సుఖ

పెట్టుటకు నేను సిద్ధముగా నుంటిని.


మ. పొలతీ ! నీకు వశంవదుండ నయితిన్‌ బూజింతు ని న్నెప్పుడున్‌
     దలపైఁ దాల్చెద నీదు శాసనము నిత్యం బేను నీకన్ను స
     న్నల‌ వర్తించెద ప్రాణపంచకము కన్నన్‌ మిన్నగాఁ జూచి ని
     న్నలరన్‌ జేసెద నేలుకోగదవె మా ద్యత్ప్రీతి నన్నింకిటన్‌.

మదవతీ ! మదనుఁ డదయుఁడై పదను టడిదంబుల నాపై నేయు చున్నాఁడు నీ కటాక్షరప్రసారం బించుక బరపి నా హృదయతాపంబు జల్లార్పుము. అని మిక్కిలి దీనుడనై బ్రతిమాలుకొంటిని.

అప్పుడా బిబ్బోకవతి తోకత్రొక్కి.న త్రాచువలె గస్సుమనిలేచి నన్ననేక దుర్భాషలాడుచు ఛీ ! ఛీ! మూర్ఖుఁడా ! బుద్ధికలిగి‌ ప్రవర్తింపుము. నోటికి వచ్చి ట్లెల్ల వదరుటమాని యవలం బొమ్ము అని వామపాదం బెత్తి గట్టిగా నన్ను తన్ని నది.‌ ఆ తాపుతో నా కెక్కడలేని క్రోధావమానంబులు బుట్టినవి. ఆమెతో తీక్ష్ణంబుగా నేమీ ! నెమ్మదిగా బలుకుచుంటినని నోటికి వచ్చినట్లెల్ల దూషించుచుంటివి. నీకొక నిముషము వ్యవధి నొసంగితిని ఆలోచించుకొనుము. వృధాగా గష్టములఁ బడక నా కోరిక తీర్పుము. లేదేని నిన్నిందు బలాత్కరింపక మానను అప్పుడు నీకెవ్వరడ్డము వత్తురో జూచెదంగాక యని పలుకు నా పలుకుల కా కలకి తలమిన్నబొమలు ముడి వైచుచు నీచుఁడా ! నేనిం దేకాకినై నీకుఁ జిక్కియుంటినని యిచ్చవచ్చినట్లు కారు లరచుచున్నావురా ? సర్వవ్యాపకుండైన పరమేశ్వరుండు నీదుందుడుకు చేష్టల‌ గమ నించుచునే యున్నాఁడని యెరుంగుము. నీ బీరములు వానియెదురఁ బనికిరావు‌. పో, పొమ్మని గద్దించి పలికినది.

అప్పుడు నే నహంకరించుచు పాపినీ ! మంచిమాటల నేనెంత బ్రతిమాలు కొనుచున్నను మీదుమిగులచుంటివిగదా ! నిన్నుగాపాడఁ గలవారి నెవ్వరినో వైళమ రమ్మని బలుకుచు నా నారీశిరోమణి శిరోజంబులం బట్టికొని నేను చెప్పినట్లు వినెదవా లేదా యని యదలించుచుండగా నామె పెద్ద యెలుంగున‌ హా! పరమేశ్వరా! రక్షింపు రక్షింపు మని యాక్రోశించుచు నేల కొరిగినది. అప్పుడు తచ్చిరోరత్నము నాచేతిలోఁ జిక్కినది.

అంతలో నో భీరులోకామా ! భయపడకుము. నిన్ను రక్షించుటకు పర మేశ్వరుండు నన్నిందు బంపినాడని పలుకుచు నొక్క పరుగున దివోదాసుండు మేమున్న దెసకు వచ్చెను. వానిం జూచినతోడనే నేను భయవిహ్వలుండనై పారిపోఁ దొడంగితిని. కాని యా ధీరుండు పది యడుగులలో వచ్చి నన్ను కలిసికొని చంద్ర హాసముతో నొక్క పోటు పొడిచెను. అప్పుడు నేను విధిలేక వానితో ద్వంద్వయుద్ధంబు నకు గడంగితిని అనంగమోహినియు విస్మయముతో దూరముననుండి మా యిరువుర కయ్య మీక్షించుచుండెను. నేనమ్మహారాజుతోఁ బెద్ద యుద్ధము జేసితిని ఆ వీరోత్తము నితో నట్లు పెనంగుటకుఁ నాకెక్కడి బలము వచ్చినదో నాకే వింతదోచినది నా చేతి యందున్న యనంగమోహిని శిరోరత్న మా సందడిలో జారిపడినది. దాని నమ్మహా రాజు సంగ్రహించి నిజోత్తరీయంబునఁ బదిలపరచెను. రత్నము పోయినది మొదలు నా సత్వము క్షీణింపసాగెను. ఆ రాజు తన కుటారధారచే నా మేనిపై నెన్ని నరకులు బెట్టెనో చెప్పఁజాలను. ఆపాదమస్తకము వాని కత్తిపోటు తగలని ప్రదేశములేదు. శరీరమునుండి నెత్తురు వెల్లువయై ప్రవహింపఁదొడంగినది. నన్నాతఁడెత్తి‌ గుహాముఖం బున విసరివేయుట కొంచె మెరుంగుదును. పిదప నేమైనదో నేనెరుంగను. నాకు తెలివి వచ్చుసరికి మీ చికిత్సాలయమున నుంటిని. ఇచ్చటికెట్లు వచ్చితినో యచ్చట వారేమైరో నేనెరుంగనని తన కథ యంతయును జెప్పి యూరకుండెను.

వాని యుదంత మంతయును విని విని యచ్చట నున్న వారెల్ల విస్మయ మందిరి బలిచక్రవర్తి కుంభుఁ డొనరించిన యపరాధమింకను విమర్శింపవలసి యున్నది. ఇప్పటికి వీనిని బందిగంబున నుంపుఁడని వానిఁబంపివేసి శేష వాసుకులతో నిట్లనియె. హితులారా ! వీనివలన ననంగమోహిని తన శీలమును రక్షించుకొనుచు కుశలముగా నున్నట్లు తెలిసినదిగదా ! మరియుసు సద్గుణగరిష్ఠుండగు దివోదాస ధారుణీచక్రవర్తి సంరక్షణంబున నామె యున్నదని గూడ తెలియుచున్నది. ఆమెకింక నేమియను‌ భయంబుండబోదు. మీరు నిశ్చిం తతొ నుండవచ్చును. కొలది కాలంబుననే యా రాజన్యుండామె నిచ్చటకు బంపఁగలడని వారి ననునయించి నిజనివాసంబులకు నంపివేసెను. అని చెప్పి మణిసిద్ధుఁడు తదనంతర వృత్తాంతమవ్వలి మజిలీ యందిట్లు చెప్పందొడఁగెను.


308 వ మజిలీ

గుణవతికథ

గోపా ! వినుమట్లా దివోదాసుండు యోగమార్గంబున దివంబున కెగసి దైవవశంబునఁ దిన్నగా నలకాపుర బాహ్యోద్యానవన సమీపంబునకుఁ బోయిచేరెను. ఆ యుద్యానవన రామణీయకమునకు మిగుల వెరఁగందుచు నచ్చటి విశేషంబులం జూడ నుత్సుకతంజెంది యా యుపవనాభ్యంతరమున కరిగి యందందుఁగల వింతలంజూచుచు విహరింపుచుండెను.

లయగ్రాహి

కాంతిఁగల యందపు కుడుంగముల యందతి పసందుగనుబొంది కవ హింపన్‌ ! ముందుఁగనువిందుగ నమందగతిఁ బెం పెనఁగ సుందర లతానిచయ మందొలయు నాయిం ! దిందిరములెల్ల మధువుందనిపి మైకమున సిందడియొనర్పఁ