కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/306వ మజిలీ

వికీసోర్స్ నుండి

పాలు జేసితిఁ గదా? యని నిందించుకొనుచు ఘాతుక మృగం బెద్దియైన వచ్చియామెం గబళించిపోయిన దేమో యని భయంపడుచు సేదదేరి యాప్రాంతముల నెందైన నరిగి యుండునేమో యని యాసఁగొనుచు నీరీతి ననేక విధంబుల దలంచుచు నెట్టకే నటఁ గదలి యాప్రాంత భాగంబుల నతిశ్రద్ధతో వెదుక నారంభించితిని.

చూచిన పొదరిండ్లే చూచుచు‌ నడచిన దారినే నడచుచు ననంగ మోహినీ ! యని పిలచుచుఁ గనంబడిన తరు లతాగుల్మాదుల వివిధ శకుంతసంతానంబుల నానా విధ మృగ సందోహంబుల నామనోహారిణింజూచితిరే యని యున్మత్తుండనై యడు గుచు నారీతినాప్రొద్దంతయుఁదిరిగితిరిగి వేసరి యొక విశాల శిలావేదికపై హతాశుండనై చతికిలంబడితిని.

ఇంతలోఁ బ్రాంతమందెద్దియో సందడి వినఁబడినది. దాని నెరుంగఁ గుతూ హం పడుచుఁ జయ్యన లేచి యోవైపునకు మెల్లగా నడచితిని. ముందొకచో నొక పురుషపుంగవుండు వేఱొకనిని చేత జుట్టుపట్టుకొని నిలిపి సవ్య హస్తంబునంగల కటారి నెత్తి వానితల నుత్తరింప నూహించుచుండెను. పట్టుపడ్డవాఁడు చేతులుజోడించు కొని మహారాజా! రక్షింపుము, రక్షింపుము. నీప్రభావం బెరుంగక యిన్ని చిక్కులం బెట్టిన నా తప్పులన్నియును మరచిపొమ్ము. నీ దాసానుదాసుండనని ప్రార్థించుటయు నామహాపురుషుండు వానింగరుణించి యెత్తిన కత్తి దింపి జుట్టువిడచిపెట్టి‌ యిట్లనియెను.

ఓరీ ! నీవెవ్వఁడవు సర్పంబవై వనచర బాలకు నేమిటికి జంపితివి. వాని కళేబర మెందులకు గుప్తపఱచితివి. నిక్కము వక్కాణింపుము లేదేని నిన్ను క్షమించు వాఁడనుగాను. అని గద్దించియడిగిన వానికి రెండవ వాడిట్లు తనకథ చెప్పందొడంగెను.


306 వ మజిలీ

రత్న చూడునికథ

మహారాజా ! నేను నాగవంశము వాఁడను. మాపూర్వులెవ్వరో రసాతలము విడిచి భూలోకమునకు కాపురమువచ్చిరఁట. వారందరును వింధ్యారణ్యము శరణ్యముగాఁ జిరకాలము స్వేచ్చగాఁ గాలముగడపిరి. నాతండ్రిపేరు పింగళాక్షుఁడు. వానికి విరజ యను భార్యయందుఁ బదివేల పుత్రులు, నందరు పుత్రికలును జన్మించిరి. వారిలో జ్యేష్ఠుఁడను నేను. నాపేరు రత్నచూడుఁడందురు. మేము పుడమియందే నివసించి యున్నను నాగలోకమునందుఁగూడ మా బందుగు లెందఱోకలరు. వారింజూడ మే మప్పుడప్పు డాలోకంబున కేగుచుందుము. నేను చిన్ననాఁటనుండియును తల్లి దండ్రులచే నతి గారాబముగాఁ బెంపఁబడితిని. నా యౌదలం బుట్టుకతోడనే పుట్టిన యనర్ఘరత్నముం బట్టి రత్న చూడుడఁని నాకన్వర్ద నామమయ్యెను. ఆ రత్నప్రభలు దిగంతముల వ్యాపించు చుండినవట. ఒకనాఁడు నా తిల్లితండ్రులు పుత్రులతో నాగ లోకంబున కేగ నందొక తపస్సిద్ధుండు రత్న ప్రభలచే మెఱయుచున్న నన్నుజూచి దగ్గరకుఁ దీసిఁకొని ముద్దాడుచు నా తలపైనున్న రత్నము దివ్యప్రభావము గలదనియు దానినిఁ బడసిన వారికి మృత్యుభయంబు లేదనియు నేమేమో విశేషంబులు నాతల్లి దండ్రులతోఁ జెప్పెనట.

ఆ సిద్ధుని పలుకులు విని నదిగోలె నాయందు మా వారికి యనురాగము వృద్ధిబొందినది. నాగలోకంబులో మాతల్లికి దగ్గర చుట్టమైన యొకనాగవంశ శ్రేష్ఠు నకు నన్నప్పగించి విద్యాబుద్ధులు సెప్పించిరి. నేనక్కడఁ బెక్కువిద్య లభ్యసించితిని. నాకు చదువుచెప్పుచున్న గురువుగారికి విద్యుత్ప్రభయను చక్కని కూతురు గలదు. దానిని మేనత్తకొడుకునకిచ్చి పెండ్లిజేసిరి. వాఁడువట్టి మూర్ఖుఁడు రూపమునకు దున్న పోతు. చదువుసంధ్యలు పూజ్యము. భార్యాభర్తల సంబంధ మెట్టిదో యెరుంగడు అట్టి దంపతుల కాపురము వినినవారికిఁ జూచినవారికి హాస్యాస్పదముగా నుండును గదా ! శృంగారరసము వానియందు శూన్యమని చెప్పవచ్చును. అట్టి భర్తతో భార్యకు పొత్తెట్లు కుదురును.

దానియత్త రాకాసి, మామ చండశాసనుఁడు. దానంజేసి యత్తింట నున్నప్పుడెప్పుడును నామె విలాసచాతుర్యములఁ జూపుట కవకాశములేకుండెను. ఎద్దియో వంకఁబెట్టుకొని తరుచు పుట్టింటనే నివసించుచుండునది అచట దానిస్వేచ్ఛా విహారమున కాటంకము సెప్పు వారెవ్వరు? ఇరుగుపొరుగులఁగల బొజంగుల కామె తంగేటి జున్నువలె నున్నది.

నేనొకనాఁడు వారింట రాత్రి చాలాసేపటివరకుఁ బాఠములు జదువుకొను చుంటిని. అర్దరాత్రంబున నా జవ్వని మూల్గుచు నెద్దియో బాధ నభినయింపఁ దొడంగి నది. దానితల్లి నా సన్నిధికేతెంచి అమ్మాయికి గుండెలో పోటు వచ్చినది. చేరువ నున్న వైద్యుని సత్వరమ తీసికొనిరమ్మని‌ నన్ను నియోగించినది. గురుపత్ని యానతి నేనేగి యాభిషగ్వరుని క్షణములోఁ దీసికొనివచ్చితిని. వాఁడు వచ్చి యామెం బరీక్షించి యెద్దియో మందిచ్చి యా రాత్రి మాటిమాటికిఁ జేయి చూచుచుండ వలయు నని చెప్పి యచ్చటనే పరుండెను. కొంతసేపటికి మేమందరము నిద్రా ముద్రితుల మైతిమి. నాకుఁ దిరుగ మెలకువ వచ్చుసరికి వైద్యుని సన్నిధిం గూర్చుండి యావిద్యు త్ప్రభ వానితో నెద్ధియో ముచ్చటించుచుండెను. దానికి నేను విస్మయంబందుచుండ నా సుదతిమాట లిట్లు వినంబడినవి.

మనోహరా ! నీ వీమధ్య నన్నుఁబొత్తిగా మరచిపోతివి. నీ విరహ మేను సైరింపఁగలనా? ఈ రాత్రి నీతో సుఖింపఁదలంపుకలిగి నిన్నిందురప్పించుట కీయుపా యము బన్నితిని. గుండెలో పోటనఁగా నీ కర్దమైనదా ? పంచశరుని పూముల్కులు గాఢముగా నెడదనాటి బాధించుచున్నవని భావము. ఇప్పటినుండి మనకీమాటలే సాంకేతి కము లగుఁగాక. అని చెప్పుచు వానిని ప్రక్కగదిలోనికిఁ గైదండయొసంగి తీసికొని పోయి కొంత సేపటికిఁ దిరుగవచ్చి యధాస్థానమున నేమియు నెరుఁగ నట్లు శయనించి నది. కన్నులారఁ జూచి చెవులార వినయున్న నాకు వారిచేష్టలు మిగుల నాశ్చర్య విషాదములం గలిగించినవి. తెల్లవారుసరికామె బాధ మటుమాయమైనది.

మరియొకనాఁడు నేనొంటరిగా నున్న పఠనమందిరమున కా సరోజముఖీ వచ్చి నాతో ముచ్చటలాడఁదొడంగినది‌. క్రమక్రమముగా శృంగార ప్రసంగములోనికి దిగినది. పిమ్మట పరిహాసములాడఁ గడంగినది. తుదకుఁ దనతోఁ గలియరమ్మని సిగ్గు విడచి యడిగినది. నేను దాని మాటలకు మారేమియుఁ బలుకఁజాలక నిశ్చేతనుఁ డనై గొంత తడవుంటిని. మొదట నమ్మదవతి సౌందర్యంబు గాంచి నా మనంబు గొంచెము సంచలించినది. దాని స్వైరిణీవృత్తి దలంపునకువచ్చి విరక్తి గలిగినది. అన్నిటికన్న నెక్కుడుగా గురుపుత్రిక యన్నమాట హృదయంబునఁ బ్రతిధ్వనింపఁ గంపము జనించినది. అప్పుడెట్టులో యాపాప జవరాలిని మోసగించి యావలకుఁ బారిపోయితిని.

అందులకై యీర్ష్యవహించి యామించుబోణి తల్లితో నామీద లేనిపోని నేరము లెన్నేనిఁ జెప్పి నేనామెను బలాత్కరించినట్లు నమ్మకము బుట్టించినది. నేను భయకంపితుండ నై యెవ్వరితోడను మాటలాడలేదు, నిజమెరిఁగించి గురుపుత్రికకుఁ జెడ్డపేరు దెచ్చుట నా కిష్టము లేకుండెను. నన్నెల్లరు నిందింపఁ దొడంగిరి. గురువు గారికిఁ గూడ యీ వార్త క్రమక్రమముగా వినికిడియైనది ఆయన నన్నుజూచి బుద్ధి హీనుఁడా ! నేఁడు మొదలు నా యింటి కెన్నఁడును జేరవలదు. పొమ్మని కఠినముగా బలికెను నేను వాని పాదముల మీఁద పడి క్షమింప నెంత వేడుకొన్నను‌ దయగలుగ లేదు. కోపము ద్విగుణీకృతమైనది. అందు నన్ను జితుకఁగొట్టి నా శిరంబున వెలయు చున్న రత్నమును బలవంతముగ నూడఁబెరికికొని వివశుండ నైయున్న నన్ను బదు గురచే నూరిబైట పారవేయించెను.

పుట్టుకతోఁబుట్టిన రత్నముపోయెను. గురుద్రోహము జేసితినను నపనింద మీదఁబడెను. హతభాగ్యుండనగు నేను గొంత తడవునకు తెలివివచ్చి మెల్లనలేచి రత్న మూఁడదీయుటచేత గాయపడిన శిరంబు నిమురుకొనుచు నెవ్వరికింజెప్పక‌ యవమాన సంపీడితహృదయుండనై భూలోకంబునకు వచ్చితిని. నా యవస్థనంతయు నా తల్లి తండ్రు లెరింగి మిక్కిలి‌ విచారించిరి. శిరోరత్నము పోయినందులకుఁ గడుంగడు దుకు పిల్లిరి.

మా తండ్రి మరియొకప్పుడు నాగలోకమున కరిగి యా రత్నమిమ్మని మా గురువుగారిని నెన్నివిధముల బ్రతిమాలినను దానెరుంగనని బొంకి పంపివేసెను. ఈ విషయము ప్రభువగు వాసుకితో నా తండ్రి విన్నవించెను. అతండు మా గురువు గారిని భయపెట్టి యా రత్నము నెట్లో తెప్పించెనుకాని ప్రభావంబెరింగి మా తండ్రి కిది యొసగక మీరొకప్పు డిచ్చెదనని సమాధానముచెప్పి పంపివేసెను. తరువాత నెన్నిసారులు దానికొరకు వానిని ప్రార్దించినను నెప్పటి కప్పుడెద్దియో చెప్పి పంపి వేయుచుండెనేగాని దాని నెప్పటికిని మా కిచ్చి యుండలేదు. అయ్యది వాసుకి తనూ జాతకు శిరోభూషణముగా నేర్పరుపఁబడెనని తరువాతఁ దెలిసినది. ప్రభువపహరించిన వస్తువు తిరిగి రాదని యెరింగి దానియందు నిరాశఁజేసికొని మేమూరకొంటిమి.

రత్న మూడఁబెఱికికొనఁబడినది మొదలు నాకనవరతము తలపోటు బాధ యుండునది. వింధ్యారణ్యంబున దివ్యప్రభావ సంపన్నుఁడగు యోగీంద్రుఁ డుండుట తెలిసికొని మాతండ్రి వాని యొద్దకు నన్నుఁ దోడ్కనిపోయి వాని పాదమూలంబునఁ బడవైచి రక్షింపుమని ప్రార్థించెను. ఆ యోగీంద్రుండు నాబాధ నెఱింగి తన సవ్య హస్తము సాచి నామస్తకమునఁ బెట్టి యెద్దియో మంత్రించి యిప్పుడెట్లున్నదని యడి గెను. వానిహస్తప్రభావమో మంత్రశక్తియో నే నెరుంగఁ గాని నాబాధయంతయు మాయమైపోయినది. వానిప్రభావమును స్తుతించుచు మాతండ్రి వీనిని దమశిష్యునిగా స్వీకరించి కొఱంతలగు విద్యలఁజెప్పుడని ప్రార్థించి వాని యనుమతి నన్నందుంచి నిజ నివాసమునకుఁ బోయెను.

అమ్మహానుభావుని యుపదేశ విశేషంబున నాకు సమస్తవిద్యలు గ్రమం బునఁ గరతలామలకము లయ్యెను. పెక్కు యోగ విశేషంబు లాయన నాకెరింగించెను. ఒకనాఁడా ఋషిపుంగవుని సపర్యల యందించుక యేమరుపాటు జూపితినని నాపై నలుగుచు మూర్ఖుఁడా విద్యాగర్వంబున గురుతిరస్కార మొనరించుచున్న నీవొక్క మానవునిచేతఁ బరభూతుండవు గాఁగలవని శపించిన నేను కటకటం బడి వాని ననేక విధంబుల శాపము గ్రమ్మరింపఁ బ్రార్దించితిని. అతం డెట్టకేల కించుక శాంతించి యాశాపము నీవు వృద్ధుండవైయున్న తరి దివోదాసుండను మానవేంద్రుని కతంబున సంభవింపఁ గలదు. అట్లు సంభవించినను వెంటనే వానికి నీవు పరమాప్తుడ వగుదు వని యానతిచ్చెను.

పిదపఁ గొన్ని దినంబుల కాయోగీంద్రుండు సిద్దిబొందెను. నా తలి దండ్రులు గతించిరని యంతకుముందుగనే తెలిసినది. నాకు భోగములయందు విర క్తి బుట్టినది. జన్మభూమికి తిరిగి పోవుటకు మనం బొప్పినది కాదు. ఆ మునీంద్రు నాశ్ర మంబుననే తపోవృత్తి నుంటిని. ఇట్లు పెక్కు వేలేండ్లు గతించిన పిమ్మట నీవు భూరాజ్య పట్టభద్రుండవై నాగకులంబు వారెల్లరు పాతాళంబున కేగవలయునని శాస నము చేసితివి.; ధర్మబద్దుండనై నేనును వల్మీక వివరంబులోని కేగి జన్మస్థలమందలి యనురాగంబు కతంబునను రసాతలంబున నాకు గలిగిన యవమానంబు హృద యంబున వేధించుచుండుటచే నే నచ్చటకుఁ బోఁజాలక యావల్మీక గర్భమందే తల దాచుకొనియుంటిని.

ఇట్లున్న నన్నా కిరాత బాలకుం డెట్లు కనిపెట్టెనో తెలియదు. ఆ పుట్ట నంతయుం దెగఁద్రవ్వి యందు యోగనిద్రనున్న నన్ను జావగొట్టెను. అంతటితో నూరుకొనక తోకఁబట్టి యాడింప సాగెను\. ఎంత విరక్తుడైనను‌ సహజగుణం బొక్కొక్కప్పుడు గనిపించుచుండును. నాజాతి స్వభావమునుబట్టి యించుక యలుక బట్టి యాబాలకుని మదీయ విషజ్వాలల పాలుజేసి యాప్రాంతమందలి వేరొక పుట్ట లోనికిఁబోయి యందు విశ్రమించి యుంటిని. ఆ శబరులు నాకై వెదకుచున్నప్పుడే యోగవిద్యా ప్రభావంబున వారి కదృశ్యుండనైతిని. దేవరయేతెంచి యాపుట్ట త్రవ్వించు నప్పుడు యోగీంద్రునివలె నున్న నేమియుం దెలిసికొనఁ జాలరని యట్లు గనంబడితిని. సర్వవిద్యా ప్రపూర్ణుండవగు నీయొద్ద నాచదువులు పనికివచ్చునా? నామాయ గ్రహించి మీరు నిగ్రహించినప్పుడు తేజోరూపుండనై పైకెగసి పక్షిరూపంబున పారిపోవఁజొచ్చి తిని. మీరు నన్ను వెంటాడించుచుండుట దెలిసికొనినప్పుడు నాకు మాగురువుగారి శాపము దలంపునకు వచ్చినది. మీరే యాదివోదాస మహారాజుగారని నిశ్చయించు కొంటిని. కాకున్న నన్నుఁ బరాభవింప శక్యంబుగాదు. మిమ్మింతవఱకుఁ దీసికొనివచ్చి శ్రమయిచ్చినందులకు చింతించుచున్నాను. ఇదియే నా కథ. మదీయ విషజ్వాలల మడ సిన శబరబాలక కశేబర మేమైనదో నేనెరుంగను. నా గురుదేవుని పాదంబుల సాక్షిగా నీ వించుకయు నెరుంగను. నా మాటలను నమ్మినను నమ్మకున్నను దేవరయే కర్తలు నన్ను మీమిత్రునిగా నాశ్రితునిగా సేవకునిగా నిఁకమీదభావించి రక్షింపఁగోరుచున్నాను. మీ శాసనము నాకు వర్తింపకుండుటకు సమ్మతింపఁ బ్రార్దించుచున్నాను. భూలోకంబున నుండుటకు నా కనుజ్జ యొసంగ వేడుకొనుచున్నాను. సర్వదా మీకు హితమునే తలం చుచు తపోవృత్తిమై యావింధ్యారణ్యము నాశ్రయించి యుండగలవాడఁనని యతి దీనుఁడై పలుకుచున్న వానిమాటల కాపుడమియొడ యండలరి యభయహస్తమిచ్చి యప్పుడే పంపివేసెను.

అని యెరిగించువఱకు వేళ యతిక్రమించుటయు నబ్బలి దానవేంద్రుం డప్పటికి కొల్వుచాలించి తరువాత వృత్తాంతము మరునాఁడు కుంభునివలన నిట్లు తెలిసికొన సాగెను.