Jump to content

కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/305వ మజిలీ

వికీసోర్స్ నుండి

దన్మయుఁడై కార్యమూఢుఁడై కొండొకతడవు మైమరచియుండెను. తద్విరహవేదనాదో ధూయమాన మానసుండై యా పురుషపుంగవుండు స్వయంప్రబోధింతుండై యిట్లని వితర్కించుకొనెను. ఔరా ! చేతికబ్బిన లిబ్బెను జారవిడుచు వానివలె నేనైతినిగదా‌ ? అనాధయై శరణంబు వేడిన యబ్బాలరత్నమును వెంగలినై కాపాడజాలక యాపద పాలు సేసితిని. నాకన్న కఠినహృదయుం డెందై ననుండునా ? దుర్మార్గులచేఁజిక్కి యా చక్కెరబొమ్మ చేసిన యాక్రందనము వినిన ఱాయియైనను వజ్రమైనను కఱం గును గాని నా హృదయము చలింపలేదు. ఇది యెంత దారుణమైనదో గ్రహింపఁజాల కున్నాను.


మ. అకటా ! నన్ను వరించినట్టి యబలన్‌ ప్రాంచచ్చుభాంగిన్‌ విభీ
     త కురంగాక్షిఁ ద్రిలోక సుందరిని నిర్దాక్షిణ్యతన్‌ దుచ్చు లి
     ట్లొకటన్‌ బల్మిహరింపఁగా నెఱిఁగి నే నుద్రేకమున్‌‌మాని యూ
     రక యెట్లుండఁగలాఁడ నాప్రియసతిన్‌ రక్షింప నేనోవనే?

ఆ నారీమణిని యంతరిక్షచరు లెవ్వరో మ్రుచ్చులించుకొనిపోయి యుందురు. చతుర్దశ భువనముల యందెందు దాచినను నెవ్వరడ్డంబైనను నా ప్రాణే శ్వరిని నేవిడిపించుకొని రాఁగలను. అట్లు చేయలేనినాఁడు నాకు మరణమే శరణ్యము. ఆ మోహనాంగి నెడఁబాసి నేనొక నిముసమైన సుఖంబున నుండఁగలనా ? బ్రహ్మదత్త వరప్రభావ సంపన్నుండనగు నే నీమాత్రపుపని సాధించుకొని రాఁజాలనా? అయ్యో! కిరాతబాలకుని గతియేమి ? వానిని బ్రతికించి యిచ్చెదనని యవ్వనాటులతోఁ బ్రతినఁ జేసి వచ్చితినిగదా ? వాని మాట పిమ్మటఁ జూచెదంగాక. ముందీసుందరీమణి యాపదఁ దప్పింపవలయునని యోగమార్గంబున నంబరంబున కెగసి యుత్తరదిక్కుగాఁ బోయెను.

305 వ మజిలీ

కుంభ నికుంభుల కథ

పాతాళంబున బలిచక్రవర్తి కుంభదానవుని యారోగ్యమును పరిచారకుల ముఖంబునఁ బ్రతిదినంబును దెలిసికొనుచుండెను. వాఁడు నానాటికి న్వస్థతంబొందుచుఁ గ్రమముగా నెలదినంబులకు లేచి యిటునటుఁ దిరుగుటకు శక్తి గలిగియుండెను. ఒక నాఁడు వాఁడు అనంగమోహినినిఁ దలంచుకొని యిట్లు విలపింపఁదొడంగెను. హా! మన్మనోపహారిణీ ! అనంగమోహినీ ! నీకొరకు నేనెన్నెన్ని యిడుమలం బడితినే ! చివర కవి యన్నియును వ్యర్దములయ్యె. ఆ పాపపు దివోదాసుండు నాకొరకచ్చటి కేలదాపురించవలయును వానిచేఁ బరాభూతుండ నగుట కేనింతయుఁ జింతింపను. నీ యథర సుధారసము తనివిఁదీర నొకసారియైనను గ్రోలఁజాలనైతినిగదా యని మిగుల వగలం బొగులుచుంటిని. నీనిద్దంపుచెక్కుటద్ధంబుల నెన్నఁడును ముద్దాడనైతినని పల వింపుచుంటిని. నీ గాఢాశ్లేషసుఖంబున కొకనాఁడైనను నోచుకొనకుంటీనని విలపించు చుంటిని అన్నా ! నావంటి మందభాగ్యుఁడెందైనఁగలడా ? అన్ని దినంబులు వివిక్త ప్రదేశంబుల నొంటిగాఁ జిక్కిన చక్కెరబొమ్మను మక్కువమీర ననుభవింపఁ జాలని నన్ను బోలు మూఢుండు ముల్లోకముల నెందేని యుండునా ? ఏమనిన నేమి కోపమువచ్చునో యేమిచేసిన నేమివిరక్తిగలుగునోయను భయంబున ఖిన్నుఁడనై నిన్నూరక కన్నుల కరవుదీరఁ జూచుచుండుటయేగాని యేసాహసమును జేఁయజాల నైతిని. అయ్యయ్యో ! ఇఁక నా జన్మ మధ్యంబున నిన్నుఁ జూచుభాగ్యంబు నాకబ్బఁ గలదా ? నీతో ముచ్చటించు పుణ్యంబు నాకు తటస్థింపఁగలదా ? నీతోఁ గలసి మెలసి సుఖించు వైభవంబు నాకు పట్టగలదా ? అన్నియును నీటిమీది వ్రాతలైనవిగదా ?

నన్ను పరిభవించిన‌ యా రాజు భాగ్యంబు పండెనా ? వాని కొరకేనా నేను నిన్నక్కడకుఁ జేర్చినది. అబ్బా ! ఈ విరహంబునకు నేనోపఁజాలను కత్తిపోటులతో ప్రాణంబులు పోయినను బాగుండును గదా ! నేను వెండియు జీవించి యేమి సౌఖ్యము బడయుదును. ఎవరిని సంతోష పెట్టుదునని యీ రీతిని బహుప్రకా రంబుల విలపించుచున్న వాని మాటలన్నియును విని యచటనున్న పరిచారకుఁడు దగ్గిరకుఁ జేరి యిట్లనియె.

కుంభా - నీ దేహమున కెట్లున్నది. పలవరించుచుంటివాయేమి ? తినుట కేమైన పదార్థముల దెమ్మందువా ? అని యడుగుచున్న వానింజూచి యారక్కసుం డిట్లనియె. అయ్యా ! నా కేమియు నక్కరలేదు. మీరెవ్వరు ? ఈ గృహమెవ్వరది ? నన్నిందేమిటికి కుంచితిరి ? ఇది యే లోకము ? మీరెవ్వని యానతి నా కిందుపచార ములఁ జేయుచుంటిరని యడిగిన నప్పరిచారకుం డిట్లనియె.

కుంభా ! ఇది ఏ లోకమా యెరుంగవా ? పాపము ! అంతపాటుబడి బ్రతికినవానికి నీకేమిదెలియఁగలదు, జెప్పెదవినుము. ఇది పాతాళలోకము. నేను బలి చక్రవర్తిగారి పరిచారకుఁడను. ఆ చక్రవర్తి యాజ్ఞానుసారము నీకీ చికిత్సాలయంబున నేను పరిచర్యల జేయుచుంటిని. నీ యారోగ్యమునకే యావైరోచని యనుదినము నెదురు చూచుచుండెను. అని చెప్పినతోడనే కుంభుఁడు నివ్వెఱం బడుచు నే మేమీ ! నేనెట్టకేలకు పుట్టగడికేవచ్చి చేరితినా ? బలిదైత్యేంద్రునకు నా యందిట్టియకారణ వాత్సల్య మేల కలిగినది. అని పలుకుచుండగనే మరియొక పరిచారకుఁడు పరుగు పరుగునవచ్చి దైత్యేంద్రుని యానతియైనది. వీనిని కొల్వుకూటమునకు వేగమ తీసి కొని రమ్మనుచున్నారు. శేషవాసుకి ప్రముఖులందరు బరివేష్టించియుండఁ బ్రభువు వారిప్పుడు కొల్వుదీ‌ర్చి యున్నవారని చెప్పుచు కుంభుని వెంటఁదీసికొని వైరోచసుని సన్నిధికిం బోయెను.

సభలో వాసుకిం జూచినతోడనే కుంభుఁడు నిశ్చేతనుఁడయ్యెను. దాన వేంద్రుని యెదుర నిలుచుటకుఁ గంపించుచుండెను. తక్కినవారిని తేరిచూచుటకు మొగము జెల్లకుండెను. అట్లు భయవిహ్వలుండై యున్న కుంభునిఁజూచి దానవేంద్రుం డిట్లనియె. కుంభా ! ఈ మధ్య నీ వెచ్చటి కేగీతివో యేమేమి చేసితివో పూసగ్రుచ్చి నట్లు‌ చెప్పవలయును. నిజమించుకయేని దాచినచో నీ మాన ప్రాణంబులు దక్కవని నమ్ముము. అని గద్దించి యడుగుటయు వానికి భయోద్రేకంబున మాటయే వచ్చినది కాదు. వెండియు చక్రవర్తి వాని నుద్దేశించి మాటాడవేమి ? ఈ నడుమ నెన్నఁడేని వాసుకితనూజాత ననంగమాహినిని జూచితివా ? నీ వట్లు మౌనము వహించిన వదలి పెట్టము. నీ సంగతి యంతయును మాకు తెలిసినది. నిజము జెప్పకున్న తీవ్రశిక్షలం బొందెదవని యలుకమయి నడుగుచున్న రేని యెదుర బొంకుటకు భయంపడి యా రాత్రించరుండు వారికి నమస్కరించుచు నిట్లనియె.

ప్రభువరా ! తప్పు చేసితిని. మూఢుండనై యొనర్చితిని. రక్షించినను శిక్షించినను దేవరయే కర్తలు. సంగతినంతయు నెరింగన ప్రభువుల సమక్షమందు నేను నిజమును దాపరికము సేసినఁ బ్రయోజనమేమి గలదు. అని తనవృత్తాంతమిట్లు చెప్పందొడంగెను.

దేవా ! నేను దేవర యధికారమునకుఁ లోఁబడిన రసాతలవాసుండను. వికటహాసుని తనయుండను కుంభుఁడనువాఁడను. నా సోదరుఁడు నికుంభుఁడను వానితో నేనొకనాఁడు విలాసార్థ మీ వాసుకి ప్రముఖ వాతాశనప్రవరులున్న వైపునకుఁ బోఁతిని. అందుఁ గేళికోద్యానంబున నుచిత సఖీపరివృతయై విహరించు వాసుకి పుత్రికా రత్న మనంగమోహిని రూపలావణ్యాదులం జూచి మోహపరవశుండనైతిని. తదీయ లావణ్యశృంఖలా బద్దుండనై ముందడుగైనఁ బోవఁజాలక‌ యా పూవు తోటలో నొక మంజునికుంజమధ్యంబునఁ బొంచియుండి యధేచ్చా విహార ప్రమోదమానసాంభోజయై చెలంగియున్న యా యంగనామణి సౌందర్యలహరీతరంగ పరంపరాబద్ధ నయన రాజీవద్వయుండనై యన్యమెరుంగకుంటిని.

ఇట్లు తదేక ధ్యానాయత్తచిత్తుండ నైయున్న నాకొక చెడుబుద్ధి పుట్టినది. ఆ విలాసవతిని బలవంతంగా నెత్తుకొనిపోయి యొక్క వివిక్తప్రదేశంబున నిష్టోపభోగంబుల నానందింపవచ్చునను నిశ్చయముతో నేనందు నిరీక్షించియుండియదనెరింగి యువ్వెత్తుగా నామె సన్నిధికేగి చెలియకత్తె లాక్రోశించుచుండ నామదగజగామినిని బలవంతముగా నెత్తుకుని పైకెగసిబోయితిని ఆ లలితాంగి వలలోఁ జిక్కిన శకుంతళాబకము వైఖరి నాసందిటఁ జిక్కి యొక్కుమ్మడి రోదనముసేయుచున్నను విడువక కడురయంబున నేనట్లు పోవుచుండ నా సోదరుం డెక్కడనుండి చూచుచుండెనో, నా పోకఁ గనిపెట్టి వెనువెంట రాఁదొడంగెను.

వానింజూచి నేనులికిపడి, నికుంభా ! నీవేమిటికి నా వెంటవచ్చెదవు. నిలు నిలుమని పలుకుచున్న నన్నుపలక్షించివాఁడిట్లనియె. సోదరా ! ఈ దర్వీకర సరో జానన నీక్షించి నప్పటినుండియు నా చిత్తంబంగజాయత్తమై యుత్తలం బడుచుండెను. నీకుఁ దెలియకుండ నిమ్మత్తకాశిని నెత్తుకొని పోఁదలంచుచు నవ్వనంబున నొకచోఁ గన్మొరంగియుండ నేనెరుంగకుండ ముందుగ నీవే యాపనిఁ జేసితివి. సంతసం బయ్యెను. నీవీ రాకేందువదన మేనంగల యాభరణము లన్నియుం దీసికొని యమ్ము డితను నాకిమ్ము. మన్మనోభిలాషం దీర్చికొనియెదనని చెప్పుచున్నవాని నాక్షేపించుచు నేనిట్లంటిని.

ఔరా ! నీవే నవరస రసికుండగు పురుషుండవు కాఁబోలును. నేనీ బాలా మణిని మణిమండలముల కాసించి తెచ్చితి ననుకొంటివేమి? కావలసిన నా నగలన్నియు నీకే యిచ్చివేసెదను. వానింబుచ్చుకొని పొమ్ము. మచ్చికమీరఁ నిచ్చిగురాకుఁ బోడితో ఐచ్చవిల్తుని కేళిఁగూడి నే సుఖించెదంగాక యని నా యభిమతంబు వాని కెరింగించి తిని. వాఁడంతంబోక యనునయ వచనంబుల వెండియు నా కిట్లనియె. అన్నా ! మనమిరువురము సహోదరులముగదా ? అందును నవిభక్తులము. ఒకరు సంపాదించిన దానియందు రెండవ వానికిఁగూడ సమాన భాగముండును. కావున నీవు తెచ్చిన యి చ్చిగురుబోణిం ననుభవించుటకు నాకును దాయ భాగపు హక్కు. గలదు. న్యాయరీతిని మన మిరువుర మీనాతి నాకతప్రేమఁ గామోపభోగంబుల సమానముగా నుపయో గించు కొంద మిందుల కొడంబడు మని కోరిన వాని వదలించి యోరి మూర్ఖా? అవిభక్త సోదరులకు సంపాద్య వస్తువులందు సమానమైన హక్కుగలదని యన్నభార్య ననుభవింపఁ దలంతువఁటరా! జ్యేష్ఠసోదరుని యాలి తల్లితో సమానమని చెప్పుట యెరుంగవా! ఓరోరి! మాతృద్రోహి! కులపాంసనా! యుక్తాయుక్తంబు లెరుంగక నోటికి వచ్చినట్లెల్లఁ బ్రేలుట మాని యవలంబొమ్మని తీక్షణముగాఁ బలికి వాని నెదురు దిరిగి యొక్కతన్నుఁ దన్నితిని. దానితో వాఁడు కొంతదూరము. తిరిగిపడి మగిడి మావెంట వచ్చుటకుఁ ప్రయత్నించుచుండెను.

ఇంతలో నేనతిరయంబున నాయంబుజానన నెత్తుకొని పోవుచుంటిని. ఆబాలా శిరోమణి వివశయై యున్న కతంబున నీ గొడవ యేమియు నెరుంగదు. అట్లు నేను పోయిపోయి సప్తాధోలోకంబులం దిరిగి తిరిగి యెందును ననుకూలమగు తావు గనంబడనందునఁ దిన్నఁగా భూలోకంబున కేగితిని. అందు దివోదాసుని శాసన భయంబున నురగలోక వాసులు జేరరారని నిర్భయముగా హిమశైల శిఖరంబు జేరితిని. అందొక సుందర దరీముఖంబున నాకంబుఁ గ్రేవను మెల్లగా దింపి యుచితరీతిని ప్రాంత లతావితానంబులం దెచ్చి శయ్యఁ గల్పించి దానిపై నామెను పరుండబెట్టి యా మోహనాంగి లావణ్యామృతమునఁ కన్నులారఁ గ్రోలుచు సన్నిధిం గూర్చుండి పుష్ప గుచ్చములతో నామెకు విశ్రాంతి కలుగునట్లు విసరుచుంటిని. ఇంతలో నికుంభుఁ డచ్చటికి వచ్చి చేరెను. వానిం జూచినతోడనే నాకరికాలి మంట నెత్తి కెక్కినది. కన్నుల నిప్పుకణంబు లురుల వాని నీక్షించుచు పండ్లు పటపటగీటుచు మహాక్రోధం బున నొడుగఱచి హుమ్మని లేచి వానిపైఁబడి జుట్టుపట్టుకొని బిరబిర దూరముగా నీడ్చుకొనిపోతిని.

వాఁడును నాపట్టుతప్పించుకొని చేరువనున్న దారుణ పాషాణం బెత్తి నాపై విసరెను. అది తప్పించుకొని యొక వృక్షశాఖం బూని వానింగొట్టితిని. కొండొక దీర్ఘ శాఖను బెరికికొనివచ్చి వాఁడు నాపై గవిసెను ఇట్లు మేమిరువురము బెద్దతడవు శిలా వృక్షాది సాధనంబులతో సమముగాఁ బోరితిమి. పిదప బాహాబాహి కచాకచి ముష్టా ముష్టి గెలుపోటములు లేఖ సంబంధ బాంధవ్యంబులం దలంపక యా చంపకగంధి కొఱకు నేకపలాపేక్షా నిరూఢి మూఁడహో రాత్రంబులు ద్వంద్వయుద్ధ మొనరించి తిమి. అప్పటికి నికుంభుని సత్వంబు గొంత తఱుగుట నెఱింగి నేను విజృంభించి దంభోళి సదృక్షంబగు పిడికిటితో వాని వెన్ను పై గట్టిగా గుద్దితిని, దానితో వాఁడు మొగంబున రక్తంబు గ్రక్కుచు వెన్నిచ్చి పారిపోయెను. కొంతదూరము వఱకు వానిని తరుముకొనిపోయి మూఢుఁడా ! యిప్పుడైన బుద్ధిఁగలిగి యుండుము. పో పొమ్మని పలుకుచు వెనుకకుఁ దిరిగి యనంగ మోహినినుంచిన గుహా ముఖంబున కతిరయంబున నేతెంచితిని.

కాని యావేదండగమన యచ్చటలేదు. మూఁడు నాళ్ళ నుండియుఁ జేయు చున్న సమరము వలనఁ గలిగిన యాయాసంబంతయు నొక్కసారి నన్నప్పు డావే శించినది. సన్నిధిం బడసిన నిక్షేపమును గాళ్ళతోఁ దన్నుకొన్నట్లయ్యెను. అంత శ్రమ పడి గంపెడాసతోఁ గొండంత కోరికతో చేసిన నా ప్రయత్నమంతయు విఫలమైనదని నా హృదయము సహస్రశకలములైనది ఏమిచేయుటకు నెందుఁబోవుటకుఁ దోచక యా బాలామణిని పరుండఁబెట్టిన సెజ్జపై మేనుఁ బడవైచి తద్విరహ వేదనా బోధూయ మాన మానసుండనై కొంతతడవొడలెరుంగకుంటిని. అంతవరకు చెప్పి భావోద్రేకంబు వలనఁ గలిగిన పరితాపంబు కతంబున నొడలు వివశయై క్రిందపడెను. తోడనే బలి చక్రవర్తి పరిచారకులచే వానికి శైత్యోపచారంబులు చేయించుచు తరువాత వృత్తాంతము వాఁడు స్వస్థతంబొందిన వెనుక వినవచ్చునని నాటికాసభ జాలించెను.

మరునాఁడు యధాకాలంబునకుఁ గుంభునిఁ బిలిపించి యవ్వలికథ జెప్పు మని బలిచక్రవర్తి యాజ్ఞాపించుటయు వాఁఢిట్లు చెప్ప దొడంగెను.

ప్రభువరా! నేనట్లు లతాపర్యంకంబున ననంగ మోహినీ విరహాతురుండనై పడియుండి గొండొక తడవునకు నాకు నేను యుపశమించుకొంటిని. పిమ్మట మందుఁ డనై యంతఃపురంబుల సుఖంబుగాఁ గాలంబు బుచ్చుచున్న యబలందెచ్చి యడవి పాలు జేసితిఁ గదా? యని నిందించుకొనుచు ఘాతుక మృగం బెద్దియైన వచ్చియామెం గబళించిపోయిన దేమో యని భయంపడుచు సేదదేరి యాప్రాంతముల నెందైన నరిగి యుండునేమో యని యాసఁగొనుచు నీరీతి ననేక విధంబుల దలంచుచు నెట్టకే నటఁ గదలి యాప్రాంత భాగంబుల నతిశ్రద్ధతో వెదుక నారంభించితిని.

చూచిన పొదరిండ్లే చూచుచు‌ నడచిన దారినే నడచుచు ననంగ మోహినీ ! యని పిలచుచుఁ గనంబడిన తరు లతాగుల్మాదుల వివిధ శకుంతసంతానంబుల నానా విధ మృగ సందోహంబుల నామనోహారిణింజూచితిరే యని యున్మత్తుండనై యడు గుచు నారీతినాప్రొద్దంతయుఁదిరిగితిరిగి వేసరి యొక విశాల శిలావేదికపై హతాశుండనై చతికిలంబడితిని.

ఇంతలోఁ బ్రాంతమందెద్దియో సందడి వినఁబడినది. దాని నెరుంగఁ గుతూ హం పడుచుఁ జయ్యన లేచి యోవైపునకు మెల్లగా నడచితిని. ముందొకచో నొక పురుషపుంగవుండు వేఱొకనిని చేత జుట్టుపట్టుకొని నిలిపి సవ్య హస్తంబునంగల కటారి నెత్తి వానితల నుత్తరింప నూహించుచుండెను. పట్టుపడ్డవాఁడు చేతులుజోడించు కొని మహారాజా! రక్షింపుము, రక్షింపుము. నీప్రభావం బెరుంగక యిన్ని చిక్కులం బెట్టిన నా తప్పులన్నియును మరచిపొమ్ము. నీ దాసానుదాసుండనని ప్రార్థించుటయు నామహాపురుషుండు వానింగరుణించి యెత్తిన కత్తి దింపి జుట్టువిడచిపెట్టి‌ యిట్లనియెను.

ఓరీ ! నీవెవ్వఁడవు సర్పంబవై వనచర బాలకు నేమిటికి జంపితివి. వాని కళేబర మెందులకు గుప్తపఱచితివి. నిక్కము వక్కాణింపుము లేదేని నిన్ను క్షమించు వాఁడనుగాను. అని గద్దించియడిగిన వానికి రెండవ వాడిట్లు తనకథ చెప్పందొడంగెను.


306 వ మజిలీ

రత్న చూడునికథ

మహారాజా ! నేను నాగవంశము వాఁడను. మాపూర్వులెవ్వరో రసాతలము విడిచి భూలోకమునకు కాపురమువచ్చిరఁట. వారందరును వింధ్యారణ్యము శరణ్యముగాఁ జిరకాలము స్వేచ్చగాఁ గాలముగడపిరి. నాతండ్రిపేరు పింగళాక్షుఁడు. వానికి విరజ యను భార్యయందుఁ బదివేల పుత్రులు, నందరు పుత్రికలును జన్మించిరి. వారిలో జ్యేష్ఠుఁడను నేను. నాపేరు రత్నచూడుఁడందురు. మేము పుడమియందే నివసించి యున్నను నాగలోకమునందుఁగూడ మా బందుగు లెందఱోకలరు. వారింజూడ మే మప్పుడప్పు డాలోకంబున కేగుచుందుము. నేను చిన్ననాఁటనుండియును తల్లి