కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/304వ మజిలీ

వికీసోర్స్ నుండి

నంది మూర్చబడియుండెననియును, వానికి స్వస్థత గలిగిన పిదప వాని వృత్తాంతము వినవచ్చుననియు, గుతూహలపడుచు, శేష వాసుకులతో మరియు నిట్లనియె.

మిత్రులారా ! వీడు సౌధాగ్రమునఁ బడుటచే నీలోకమునకు మీదుగా నున్న భూతలమునుండియే యిందు పడినట్లు తెల్లమగుచున్నది. పాతాళవాసులు మర్త్య లోకమున కేగ బహిష్కరింపఁబడినప్పుడు వీఁడచ్చటి కేగుట కెద్దియో చెడ్డపనియే మూలమని తోచుచున్నది. వాసుకి తనయను రక్కసుఁడే గదా యపహరించుకొని పోయెను. అయ్యబలను దుష్టబుద్ధియై వీఁడు మనుజలోకమునకుఁ గొనిపోయి యందు పరాభవింపఁబడి యుండిన నుండవచ్చును. వీనికించుక స్పృహగలిగినతోడనే వీనివలన విశేషము లెరుంగవచ్చును. అంతదనుక మీరిందేయుండుడని చెప్పి శేషవాసుకులఁ దన యింట నాపుజేసెను. కుంభుని వర్తమాన మెప్పటికప్పుడు వచ్చి తనకుఁ జెప్పుచుండు టకుఁ దగినవారిని నియోగించి యా దైత్యేంద్రుండు మిత్రులతో నిష్టగోష్టీ వినో దంబులఁ గాలముఁ గడపుచు వారికించుక మనశ్శాంతిని గలుగఁజేయుచుండెను.

304 వ మజిలీ

మణిగ్రీవజలంధరులకథ

అలకాపురంబునఁ గుబేరుని సన్నిహితుఁడైన చిత్రకేతునకు మణిగ్రీవుండను గమారుండును గుణవతియను బుత్రికయును గలరు. మణిగ్రీవుఁడు బిన్ననాటగోలె యవినయాహంకార గర్వభూయిష్టుండై తల్లిదండ్రులమాట వినక విలాసంబుగాఁ గాలంబు గడుపుచుండెను. వానికి జల౦ధరుండను నాంతరంగిక సచివుండుగలఁడు. వారిరువురు నాహార శయ్యా విహారములయందు నేకదేహ మెట్లట్ల వర్తించుచు నత్యంత మైత్రితో జెలంగియుండిరి. ఇర్వురకు హేమావతియను నొక్కయచ్చరలేమ భోగ భామి‌నియై యుండెను. ఆసచివద్వయం బాయచ్చర మచ్చకంటితో ముచ్చటగా సంతత క్రీడావినోదంబుల బ్రొద్దుపుచ్చుచు దరుచు విమానయానంబున లోకాంతరంబుల కరిగి యందందుగల సుందరశైల శిఖరంబుల విలాసవిహారంబు లొనరించుచుందురు.

వారొకనాఁడు దివోదాసుని శాసనమును మన్నింపక భూలోకంబునకరిగి యందు శీతశైలశిఖరంబునఁ గ్రీడింపసాగిరి.


సీ. ఒక కేలు నొకఁడు మరొక్కఁడింకొక కేలు
           బట్టి ప్రేయసిదోడఁ బరిఢవించి


    పూగుత్తులం దెచ్చి పొలతిఁతికిచ్చి యొకండు
           గై సేసి యొకఁడు రాగంబు దెలిపి
    ఒకఁడు కపోలంబు లొకఁడు నెమ్మోమును
           సవరించి యతివ కిష్టంబు సూపి
    తమినొక్కఁడతివఁబెద్దగఁ గౌగలించి యుం
           కొకఁడుముద్దుంగొని యుబ్బుజెంది.

గీ. మిత్రులిర్వురు ప్రియసఖిమీఁది ప్రేమ
    నిముసనిముసంబునకు గాఢతమముగాగ
    స్వేచ్చ నాహేమ భూధరసీమలందు
    బహువిలాస విహారముల్‌ బరపిరొకట.

మ. ఫలపుష్పంబులఁ గోసియిచ్చు నొకఁడప్పాటన్‌ బ్రకాశించు వృ
     క్ష లతాదుల్‌ వివరించు నొక్కఁడట సుశ్రావ్యంబుగాఁబాడు ప
     క్షుల సాధుధ్వనులెల్ల నెన్ను నొకఁడస్తోకంబుగాఁ దెల్పు ని
     ర్మలకాసార విశేషముల్ సతకి ప్రేమంబొప్ప నొక్కండటన్‌.

ఇట్లు స్వచ్ఛందగతిని విహరించుచున్న సమయంబున వారికి దూరంబున వీరాలాపంబుల సందడి కొంతవినంబడెను. దానికి వారు వెరగందుచుఁ దక్షణమె విమానమెక్కి యా చక్కికింబోయిరి. అందొక చక్కని చక్కెరబోణి భయవిహ్వల శోకరసంబులు మొగంబునందోప దూరంబుననుండి యిరువురు పురుషుల కయ్య మీక్షించుచున్నది. ఆ యన్నుమిన్నం జూచిన తోడనే మణిగ్రీవుండు పంచశర శరా విద్ధహృదయుండై యన్యమెరుంగ కుండెను జలంధరుండును మోహ మూర్చితుం డయ్యెను‌. అయ్యచ్చర మచ్చరముతో నాయబల యంగసౌష్టవ మీక్షించుచుండెను.

ఇంతలో ద్వంద్వయుద్దమొనరించు పురుషులిర్వురిలో నొకనికి దీవ్రమగు గాయ ములు దగులుటంజేసి సొమ్మవోయి నేల కొరగెను. జయశీలుండగు పురుషసింహుఁడు క్రిందఁబడినవానిని రెండుచేతులతో బై కెత్తి యందున్న గుహాముఖంబున విసరివైచెను. తద్బిలము పాతాళమువరకు వ్యాపించియున్నది. అతిజవంబున విసరఁబడుటచే వాని కళేబరంబు బిలముత్రోవను దిన్నగా రసాతలంబున బలిచక్రవర్తి కేళీ సౌధంబునఁ బడినది.

ఇచ్చట యుద్ధమీక్షించుచున్న లోలాక్షిసత్వరమె యజ్జయశీలునిపాదంబులం బడి పురుషప్రవరా ! యుష్మద్బలప్రతాప శౌర్య సాహసంబులు వర్ణనాతీతంబులు. ఆమ్రుక్కడిరక్కసు నవలీలనిర్జించి నన్ను రక్షించిన మీయవ్యాజకరుణాకటాక్షంబులకు నిరంతరము కృతజ్ఞురాలను. భవదీయ సుందర ముఖారవిందసందర్శన మాత్రంబుననే మదీయ మనోగత దుఃఖోపతాపంబు పటాపంచలయ్యెను. మీ రూపంబు కంతువసంత జయంతాదుల నధికరించి త్రిలోక మోహజనకంబై యున్నది. అనురూప వర సమా గమాకాంక్షితురాలనై యున్న నన్నీ నక్తంచరుం డిచ్చటికి తెచ్చి నాకెంతేని యుప కార మొనర్చెను. త్రికర్ణణంబుల మిమ్మె ప్రాణేశ్వరునిఁగాఁ గోరుచున్నాను. నన్ను మీపాదసేవకురాలిగా స్వీకరించి కృతార్దురాలిఁజేయుఁడని ప్రార్థించుచున్న యా యన్నుమిన్న కాపురుషపుంగవుండు మందహాస భాసురముఖారవిందుఁడై యిట్లనియె.

మదవతీ ! నీ సౌందర్యమెంత జూచినను తనివి తీరనిదిగా నుండెను. నీ లావ ణ్యము హృదయాకర్షంబుగా నొప్పెను. నీవచోవైఖరి సుధా మధురమై చెలంగెను. నీ వాలుచూపులు మారునిచేత తూపులై మనోహరము లయ్యెను. ఇట్టి త్రిలోకైకసుందరి తనకు దాపరించుచుండ నంగీకరింపని మందమతి యెందై ననుండు‌నా ? కాని నేనిపు డొక కార్యదీక్షయం దున్నవాఁడను. అయ్యది నెరవేర్చి నీ యభీష్టంబు దీర్చఁగల వాఁడను. అంతదనుక నిన్ను నీయాప్తులసన్నిధిఁ జేర్చెదను. వారెందున్నవారో యెరిఁ గింపుమని యనుచుండఁగనే యొక భయంకర వ్యాఘ్రంబు బొబ్బలిడుచు వారున్న వైపునకు దుముకుచు వచ్చుచుండెను. దానింజూచి యా పురుషవరేణ్యుండు నే నిదే యీ ఘాతుకమృగంబును సంహరించి క్షణములో వచ్చెద నిందే యుండుమని పలు కుచు చంద్రహాసమును ఝళిపించుచు యా వ్యాఘ్రమున కెదురుగా నరిగి దానిం దరుముకొనిపోయెను.

ఇంతలో దాపుననుండి వారి సంభాషణ మాలింపుచున్న యా యక్ష కుమారు లిరువురు నిదియె యదనని విమానము దిగివచ్చి యచ్చపలాక్షిని బలిమిమై బట్టి తమవ్యోమయానంబునం బెట్టికొని యంతరిక్షంబున కెగసిపోయిరి. వ్యాఘ్రమును సంహరింపఁబోయిన పురుషునకుఁ హా! మనోహరా! రక్షింపుము. రక్షింపుము. వీండ్రెవ్వరో బలవంతమున నన్ను విమానమెక్కించి ఫైకిఁదీసికొని పోవుచున్నారు. అను నబలారోదనధ్వని వినంబడినదేకాని యాదివ్యయానం బేవంకకుఁ బోయినదో వానికి గోచరము కాలేదు. వ్యాఘ్ర సంహార మొనర్ప నతఁడెంత ప్రయత్నించినను నది కొనసాగినదికాదు. చంద్రహాసమున దాని దేహమును దుత్తునియలుగా నరికినను నది చావదయ్యెను చివురకతండు విసుగుఁజెంది మహోద్రేకంబున దానిం గవిసి తచ్చిరంబూడిపడునట్లు నిజకుఠారధారచే గట్టిగాఁ గొట్టెను. ఆ వ్యాఘ్రశిరంబు బంతి వలె పైకెగిరి తిరుగ నిముసములోవచ్చి యా కళేబరంబున కతుకుకొనుటయును పులి యొక్క. యురుకున నదృశ్యమగుటయు నొక్కసారి జరిగెను. ఆ పురుష పుంగవుండా యద్భుత దృశ్యమునకు వెఱగందుచు శార్దూలము శరవేగంబున దూరముగా బారి పోయిన కతంబున దాని వెంటాడించుట యనవసరమని తలంచి యతండు తిరుగ నా భామినీరత్నమున్న చోటి కతిరయంబున నేతెంచెను. కాని వాని కాప్రదేశమంతయును శూన్యమై గనంబడెను. అక్కాంతాలలామ నంతలో నెడఁయాయటకుఁ జింతించుచుఁ దన్మృదు మధుర వాక్యంబుల నెన్నుచుఁ దదీయరూపలావణ్యాదుల దలపోయుచు దన్మయుఁడై కార్యమూఢుఁడై కొండొకతడవు మైమరచియుండెను. తద్విరహవేదనాదో ధూయమాన మానసుండై యా పురుషపుంగవుండు స్వయంప్రబోధింతుండై యిట్లని వితర్కించుకొనెను. ఔరా ! చేతికబ్బిన లిబ్బెను జారవిడుచు వానివలె నేనైతినిగదా‌ ? అనాధయై శరణంబు వేడిన యబ్బాలరత్నమును వెంగలినై కాపాడజాలక యాపద పాలు సేసితిని. నాకన్న కఠినహృదయుం డెందై ననుండునా ? దుర్మార్గులచేఁజిక్కి యా చక్కెరబొమ్మ చేసిన యాక్రందనము వినిన ఱాయియైనను వజ్రమైనను కఱం గును గాని నా హృదయము చలింపలేదు. ఇది యెంత దారుణమైనదో గ్రహింపఁజాల కున్నాను.


మ. అకటా ! నన్ను వరించినట్టి యబలన్‌ ప్రాంచచ్చుభాంగిన్‌ విభీ
     త కురంగాక్షిఁ ద్రిలోక సుందరిని నిర్దాక్షిణ్యతన్‌ దుచ్చు లి
     ట్లొకటన్‌ బల్మిహరింపఁగా నెఱిఁగి నే నుద్రేకమున్‌‌మాని యూ
     రక యెట్లుండఁగలాఁడ నాప్రియసతిన్‌ రక్షింప నేనోవనే?

ఆ నారీమణిని యంతరిక్షచరు లెవ్వరో మ్రుచ్చులించుకొనిపోయి యుందురు. చతుర్దశ భువనముల యందెందు దాచినను నెవ్వరడ్డంబైనను నా ప్రాణే శ్వరిని నేవిడిపించుకొని రాఁగలను. అట్లు చేయలేనినాఁడు నాకు మరణమే శరణ్యము. ఆ మోహనాంగి నెడఁబాసి నేనొక నిముసమైన సుఖంబున నుండఁగలనా ? బ్రహ్మదత్త వరప్రభావ సంపన్నుండనగు నే నీమాత్రపుపని సాధించుకొని రాఁజాలనా? అయ్యో! కిరాతబాలకుని గతియేమి ? వానిని బ్రతికించి యిచ్చెదనని యవ్వనాటులతోఁ బ్రతినఁ జేసి వచ్చితినిగదా ? వాని మాట పిమ్మటఁ జూచెదంగాక. ముందీసుందరీమణి యాపదఁ దప్పింపవలయునని యోగమార్గంబున నంబరంబున కెగసి యుత్తరదిక్కుగాఁ బోయెను.

305 వ మజిలీ

కుంభ నికుంభుల కథ

పాతాళంబున బలిచక్రవర్తి కుంభదానవుని యారోగ్యమును పరిచారకుల ముఖంబునఁ బ్రతిదినంబును దెలిసికొనుచుండెను. వాఁడు నానాటికి న్వస్థతంబొందుచుఁ గ్రమముగా నెలదినంబులకు లేచి యిటునటుఁ దిరుగుటకు శక్తి గలిగియుండెను. ఒక నాఁడు వాఁడు అనంగమోహినినిఁ దలంచుకొని యిట్లు విలపింపఁదొడంగెను. హా! మన్మనోపహారిణీ ! అనంగమోహినీ ! నీకొరకు నేనెన్నెన్ని యిడుమలం బడితినే !