కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/36వ మజిలీ

వికీసోర్స్ నుండి

స్వామీ! మీకటాక్షలేశము నాపయిం బ్రసరించుచుండ నేను గృతర్థుండఁగా కేమయ్యెదను. అదియట్లుండె నాలవంగి తండ్రితో నరిగినదా? ఆమెను బండితరాయలు భార్యగా స్వీకరించెనా? బ్రాహ్మణులు సమ్మతించిరా? తరువాతి వృత్తాంతము కొఱంతగానే చెప్పితిరి. దయతప్పినదాయేమి? ప్రశ్నకుత్తరంబైనను సగము కథఁచెప్పి యూరకొనుట యుచితమా? కాక మదీయగ్రహణధోరణి యెట్లున్నదోయని పరీక్షించుటకా? కటాక్షించి తదనంతరవృత్తాంత మెరింగింపుడని వేడుకొనినవిని యతిచంద్రుఁడు దరహాసచంద్రికలఁ దెసలఁ బ్రకాశింపజేయుచు నిట్లనియె. వత్సా! నీ వీప్రశ్నము చేయుదువని యనుకొనుచునే యుంటిని. అంతటితో విడుతువా? నీయభిలాష నేనెఱుంగనిదా? కానిమ్ము ఇప్పుడు ప్రొద్దుపోయినది. తరువాయికథ పెద్దదిగా నున్నది. ముందరియవసధంబున వక్కాణించెదనని యొప్పించి క్రమంబున నాపైమజిలీచేరి యందు భోజనాదికృత్యములు నిర్వర్తించు కొనిన పిమ్మట దరువాతకథ యిట్లని చెప్పందొడఁగెను.

ముప్పదియాఱవ మజిలీకథ

గోపా ! వినుమట్లు విశ్వేశ్వర మహాలింగమునకు మహాదీక్షఁ గావించి పండితరాయలకు మహావీరుండని బిరుదమిచ్చినతరువాతఁ పండితభట్టుపుత్రునకు వివాహముఁజేయ నెక్కుడుప్రయత్నముఁగావించెను గాని పండితరాయలు లవంగి యందు బద్ధాదరుండై యున్నకతంబున నప్పనికి సమ్మతించినవాఁడు కాఁడు. ఒకనాడతండు లవంగి శృంగారక్రీడావిశేషంబులం దలంచుకొని విరహాతురుండై చింతంచుచున్న సమయంబున లవంగి సఖురాలు కుందలితిలక యచ్చోటికివచ్చి వెదకి కనుంగొని పండితరాయలకు నమస్కరించినది. అప్పుడతండు ముప్పిరిగొను సంతసముతోఁ దదాగమనము గుఱించి యభినందించుచు మించుబోణీ! నీసఖురాలు సుఖియై యున్నదియా? నిన్నేమని చెప్పుమన్నది. విశేషము లేమని యడిగిన నప్పడఁతి యిట్లనియె. ఆర్యా! మీరు రాజకార్యములు చక్కఁబెట్టుకొని వెంటనే వత్తుననిచెప్పి యింతదాక రాక యుపేక్షించితిరిగదా. ఇఁక నాసఖురాలి సేమమేమని వక్కాణింతును. ప్రతిదినము మీరువత్తురని మీదేశవంక చూచువఱకుఁ గన్నులు కాయలుకాచినవి. ఇప్పుడేమి చెప్పుదును. వచ్చినపిమ్మట మీకే తెల్లమగుంగదా. అదియట్లున్నను మరియొక యుపద్రవము కానైయున్నది వినుండు. చక్రవర్తి యచ్చటినుండి వచ్చినది మొదలు లవంగియం దిష్టములేక యుపేక్షగా నుండెను. పూర్వము సంతతము నానెలంతువనే పరామరిక చేయుచుండవాఁడు. ఇప్పు డొకమారైనను దలపెట్టడు. మనగుప్తమార్గప్రచారమంతయు మాశత్రువు లెవ్వరో తెలియజేసిరి. ఇప్పుడామార్గము విమర్శించి రండని రహస్యముగ గొందరుగూఢచారులఁ బంపినట్లు వినవచ్చినది అదియునుంగాక లవంగికి నెలదప్పినది. నాలుగుమాసములు గతించినవి. ఈయాపద యెట్లుదాటునో తెలియదు. అంగజాలలమగు మాలో మాకుఁ గలతలు పుట్టినవి. ఇంక . నంతఃపురరహస్యములు దాఁగవు? నీవువేగవచ్చి యచ్చిగురుబోఁణిని రక్షించుకొమ్ము. మంచికొమరుం డుదయించు నని భోధించిన విని యతండు శిరఃకంపముఁ జేయుచు నిట్లనియె.

మచ్చెకంటీ! నేను వచ్చి మీనెచ్చెలియావడి యుడిగింతును. మీరు చింతింపకుఁడు. మద్భుజపంజరవర్తిని యగు నవ్వరవర్ణిని నవమానింపఁ జక్రవర్తితరమా? అతం డాయండజాన నాయండనుండు టెరుంగఁడుకాఁబోలు కానిమ్ము. నీవుముందు పోయి యాయిందువదన కీతెఱం గెఱింగింపుము. ఎల్లి నేడిల్లీపురంబునకు వత్తునని యెన్నియో బోధించి యాకన్నియ నన్నగరమున కనిపెను. అమ్మఱునాఁడు పండితరాయలు తల్లిదండ్రు లెఱుంగకుండ ఢిల్లీపురంబున కరుగఁదలంచెను. ఆదివసమునఁ గాశీపట్టణంబున దశాశ్వమేధఘట్టంబున నొక విద్వత్సభ జరిగినది. అందుఁ బండితరాయలసు బరీక్షకునిగాఁ గోరికొనిరి. దానంజేసి యతని కప్పనిఁ దప్పించుకొని పోవుటకు వీలుపడినదికాదు. ఆసభ యవిచ్ఛిన్నముగాఁ బదిదినములు జరిగినది. పిమ్మట నాలుగుదినములు వేఱొక యంతరాయములు తటస్థించినవి. ఈరీతిఁ బదియేనుదినములవఱకు నతనిపయనము సాగినదికాదు. పండితరాయలచిత్త మెల్లప్పుడు లవంగియందే వ్యాపించియున్నది. గావున మఱియొకనాఁడెవ్వరికిం జెప్పక యొక్కరుండు సామాన్యవేషముతోఁ గాశీపురి బయలువెడలి కతిపయప్రయాణంబుల ఢిల్లీపురంబునఁ కరిగి కుందలతిలక యెఱింగించిన యుద్యానవనమునకు గురుతుగాఁ జేరెను. అప్పటికి గొంచెము చీఁకటిపడినది. ఎవ్వరినడిగిన నేమి వచ్చునోయని జడియుచు నతండాచీకటిలో నిటునటు తిరుగుచు నెవ్వరేని గనంబడిన వారితోఁ గొంతదూరము పోయి మఱల వెనుకకు పోవుచు నేమి చేయుటకుం దోచక హృదయంబున నెద్దియోబీతు గదుర వెదురుతనంబునఁ గ్రుమ్మరుచుండెను.

అట్లు జాముప్రొద్దుపోవువరకుఁ దిరిగిదిరిగి కాళ్ళు నొప్పి పెట్టినంత నా ప్రాంతమందలి యొకగృహస్తు నరుంగుపై గూర్చుండి లవంగి జాడ యెట్లుతెలియనగుననిఁ పరిపరిగతులఁ జింతించుచుండెను. అప్పుడాయింటిలో వృద్ధులగు భార్యాభర్తలు సంభాషించుకొను మాట లిట్లువిననయ్యెను.

భా - ప్రాణేశ్వరా! పెద్దబిబ్బీ మిమ్మాదివసంబునఁ బిలిపించినదిగదా? ఏమిటికో చెప్పుఁడు నేనప్పుడే యూరికిఁ బోవుటచే నాకుఁ దెలిసినదికాదు. పుత్రికి వివాహప్రయత్నమునకా యేమి ?

భ - (నిట్టూర్పుతో) అయ్యో: కర్ణకఠోరమైన యాకథ నీకేమని వక్కాణింతును. వినినచో నాహృదయము భేదిల్లక మానదు. రాజులు కడు కఠినహృదయులు కదా.

భా — ఏమి యేమి? లవంగి క్షేమముగానున్నదా?

భ - అంతా క్షేమమే (అని డగ్గుత్తికచేఁ గన్నులఁ నీరు గ్రమ్మ నొక్కింత తద వూరకొని) హా! పెంపుడు మోహమే మనల నిట్లు బాధించుచున్నదే రాజపత్ని కెట్లుండునో కదా?

భా -- అయ్యో? మేమడిగినచో నిజము చెప్పరేమి? అప్పడఁతి కాలధర్మము నొందినదా.

భ -- అట్లయిన లోకపరిపాటిగానే యుండునుగదా.

భా - (దుఃఖముతో) మఱేమి యైనది?

భ - నీకు నేఁ జెప్పఁజాలను. జెప్పజాలను.

భా - ఇది నన్ను మిక్కిలి దుఃఖింపఁజేయునుకాదా? పర్యవసానము నామనసు రాయికాఁగలదు.

భ - దయావిహీనులడై చక్రవర్తి యా యొప్పులకుప్పను బలవంతముగాఁ జంపించెను. దానికే నా హృదయము తల్లిడిల్లు చున్నది.

భా - హా పుత్రీ? హా పుత్రీ? (అని గుండెలు బాదుకొనుచు మూర్ఛపోయినది.)

భ - (లేవనెత్తి) సాధ్వీ ? ఊరడిల్లు మూరడిల్లుము. నీవు మిగుల వృద్ధురాలవు. శోకము సహింపవనియే చెప్పుటకు శంశయించితిని. వగపు నిరర్ధకము దాని యోగమంత యున్నది.

భా -- (దీనస్వరముతో) చక్రవర్తి ప్రాణతుల్యయగునాజవరాలి నేమిఁటికి జంపించెను? ఆప్రేముడియంతయు నెందుపోయినది. ఆమె కోరికఁ దీపనేకదారు కాశీపురి కరిగి పెక్కుచిక్కులు పడివచ్చెను.

భ — ఆపయనమే యీపద్మనయన కీముప్పుఁ దెచ్చినది.

భా - ఎందువలన? నేమిజరిగినది? ఆ తెఱఁగు సవిస్తరముగాఁ జెప్పుడు.

భ - చక్రవర్తి కాశీపురమునుండి వచ్చినతరువాత మర్మజ్ఞులెవరో యచ్చటం జరిగిన రహస్యకృత్యము లన్నియు వ్రాసి యొక యుత్తరము పాదుషాగారి కందఁజేసిరి.

భా - ఏమిరహస్యము లున్నయవి. అక్కడనేమి జరిగినది.

భ - వినుము. లవంగి కాశీపురంబన వీరునెవ్వరినో వరించె యక్కడఁ గొన్ని పనులంగావించినదఁట. ఆ పనులనెవ్వరో పేరులేని యుత్తరమువ్రాసి ఫాదుషాకుఁదెలియజేసిరి. పిమ్మట నతండు గూఢచారుల హసన్‌బాదుకోటలోనికంపెను.

భా - తరువాత.

భ - గూడచారు లాపత్రిలో వ్రాసినప్రకారము పాతాళమార్గము వెదకి కనుంగొని యచ్చటి యచ్చటి రహస్యవిశేషములన్నియు దెలిసికొని యందు దొరికిన యొక యుత్తరము తీసికొనివచ్చి చక్రవర్తి కాతెఱుగు గలదని చెప్పి తమపత్రిక నిచ్చిరి.

భా - ఆపత్రిక యెవ్వరు వ్రాసినదో?

భ - లవంగి యావీరునికి స్వయముగా వ్రాసినది.

భా - ఏమనివ్రాసినదో అయ్యో? ఎంతమోసము?

భ - పెద్దబిబ్బీ యాయుత్తరము నాకుఁ జూపినది. వినుము "ప్రాణేశ్వరా! నీసంస్పర్శసుఖమించుక చవిచూపి యరిగితివి. భవదీయ విరహతాపం బెట్లు భరింపఁగలదానను. నాకది కలలో వార్తవలె నున్నది. తండ్రిని జెఱబెట్టినందుల కించుకయును విచారములేదు. పౌరుషమే చేసితిరి. దానికి నేనేమియు నలుగను. మఱల నొకసారి దర్శనమిమ్ము . నీయథరామృతముగ్రోలి ప్రాణంబుల నిలువ బెట్టి కొనియెదను. నేను నిన్నే త్రికరణములచే బతిగా వరించితిని. నీయుపేక్ష మదీయజీవితాంతము నకుఁ గారణమగును. ఇట్లు భవత్పాదసేవకురాలు, లవంగి" అని యున్నది. ఆ యుత్తరము చూచినంతఁ జక్రవర్తికి గోపమురాదా?

భా - కోప మేమిటికి రావలయును. అందు లవంగి తప్పేమి యున్నది. గాంధర్వవివాహవిధి నది యతని వరించినది. శకుంతల దుష్యంతునినెట్లు వరించినది. కణ్వమహర్షి ధర్మజ్ఞుఁడు కాడాయేమి ?

భ - తురకలకంత శాంతముండునా ? అదియునుం గాక తండ్రిని మత్తుమందుజల్లి చెఱఁబెట్టించి యది దేవతామహిమ యనియు స్వప్నమనియు మోసము చేసిన దఁట. ఆ వృత్తాంతమంతయు నాకు బెద్దబిబ్బీ చెప్పినది.

భా - అయ్యో? ఆ వీరుఁడెవడు ? దాని నందేయుంచుకొనక యిచ్చటి కేమిటికిఁ బంపవలయును. తల్లి మీతో నేమి చెప్పినది.

భ - నేనామె యొద్దకుం బోవువఱకు మహాశోకసాగరములో మునిగిఁ యున్నది. పాదుషా పుత్రికచేసిన చర్యలన్నియు భార్యకుంజెప్పి గర్భవతియగు నా నీచురాలిం జంపి యపకీర్తిఁ బాపుకొందునని నుడివెనట.

భా - అయ్యో? ఆ యర్భకురాలు గర్భవతి యయ్యెనా ? తరువాత.

భ - అదియేకదా మొదటిముప్పు. ఆ మాటవిని బిబ్బీ మగనిఁ బెక్కుగతులఁ బ్రార్దించినది కాని యతనికి దయవచ్చినదికాదు.

భా - క్రూరుల హృదయములు మృదువులుకావు. తరువాత ?

భ - ఫాదషా యీ రహస్య మొరులకుఁ దెలియకుండఁ జేయవలయునని గూడముగా నుద్యానవనములో నుండగాఁ బుత్రికం జంపింతునని భార్యకుం జెప్పెను. కావున నా పట్టమహిషి నన్నుఁ బిలిపించి యా వార్త లవంగికిం జెప్పి యెక్కడికేనిం బాఱిపోవునట్లు చేయుమన్నది. కన్నమోహ మట్లుండునుకదా?

భా -- -బాధ నాదికాని యామెదికాదు. మంచి యుపాయమే యోచించినది. అట్లేల చేయకపోతిరి ? భ - ఏమిచేయుటకు మనము స్వతంత్రులమా? నే నతిత్వరగా వచ్చి యా వార్త లవంగికిం జెప్పితిని. కాని యాబోఁటి నా మాట పాటించినదికాదు.

భా -- ఏమిటికో బ్రతుకఁదలచుకొనలేదు కాఁబోలు?

భ - భర్తకు వార్తనంపినదఁట. అతనిజాడ యేమియుం దెలియలేదని విచారించుచున్నది. అట్టి సమయమున నేనుబోయి చెప్పితిని. నా మాటయే వినఁబడలేదు.

భా - అయ్యో? తెలియునట్లు చెప్పలేకపోయితిరా?

భ - ఎంతచెప్పినను దెలియనిదే యేమిచేయుదును. దాని బుద్ధియంతయు వానియందే యున్నది. వలపు వివేకము నశింపఁజేయునుగదా.

భా - తరువాత నేమిజేసితిరి ?

భ - దానిదగ్గరనున్న చిన్నదానితోఁ జెప్పివచ్చితిని.

భా - అది యేమన్నది?

భ - ఆబోఁటి నా మాటలువిని యురముపైఁ జేయిడికొని యట్టె నిలువంబడి యేదియో ధ్యానించెను.

భా - తరువాత?

భ - రహస్య ప్రభేదమువలన రాజువలన నేమిమోసమువచ్చునో యని నే నందుండ వెఱచి యింటికి వచ్చితిని.

భా - తరువాత నేమిజరిగినది?

భ - ఆ మూఁడవనాఁడు మఱల నచ్చటికిఁ బోయితిని. లవంగి కనంబడ లేదు. విమర్శింపఁ బూర్వదివసం బర్ధరాత్రంబున గూఢచారులు వచ్చి నిద్రించుచుండ లవంగిం జంపి కందకములో నఁడగఁ ద్రొక్కిరని యొకదాది చెప్పినది.

భా - హరిహరీ! హరిహరీ! ఎంతమాట వింటిని. (అని పెద్ద యెలుంగున నేడువఁ దొడంగినది.)

భ - అయ్యో మూర్ఖురాల వగుచుంటివేమి చెప్పినం దెలియదా. అదియునుం గాక యిది పరమ రహస్యము నేనుగాక యితరు లెఱుఁగరు. కాలగతినతిక్రమింప నెవ్వరిశక్యము. (అని యూరడించెను.)

భా - (కన్నీరు దుడిచికొని గద్గదస్వరముతో) నాథా ! మన మా లవంగికిఁ దిలోదకము లీయవలయునుసుఁడీ.

భ - పెంచినందులకా ?

భా - కాదు. కన్నందులకే.

భ - ఎట్లు ?

భా – ఇందొక రహస్యమున్నది. వినుఁడు. మీ యుపదేశంబునంగదా పెద్దబ్బీబికి సంతానము నిలిచినది. ఆ శిశువు జనించినతోడనే మనయొద్ద నుంచుటకు నుంచిరి. మన పట్టియు నా బాలికయు రూపంబునఁ బ్రాయంబున నొక్క తెఱంగున నుండుట జ్ఞాపకమున్నదియా?

భ - జ్ఞాపకమున్నది. ఆ కథయంతయు నేనెఱుంగనని చెప్పుచుంటివా యేమి? మన పట్టి కూపంబునంబడి సమయముబట్టియే మన మిట్లనపత్యులమై యుండవలసి వచ్చినది. లేకున్న నదియు లవంగియంత యుండును. ఆ కధఁ చెప్పుకొని యిప్పుడు దుఃఖింపనేల?

భా - వినుండు. అప్పుడు కూపంబునంబడి సమసినది మన పుత్రికకాదు. రాజపుత్రికయే. మనపుత్రిక యని నేనట్లు చెప్పితిని.

భ - ఏమిటి? ఈ లవంగి మనపుత్రికయే! ఏమిటి కట్లు చెప్పితివి.

భా - అమ్ముద్దియ నశ్రద్ధగా జూచితిమని రాజు కోపించునని యొకటి. ఎటులైన మనపుత్రిక సామ్రాజ్యపదవి ననుభవించినం జాలునని యొకటి. ఈ రెండు కారణములచే నట్లుబొంకతిని. ఇద్దఱి బాలికల రూప మొక్కటిగా నుండుటచే నా భేదము నేనుగాక మఱియెవ్వరును గనుంగొనలేక బోయిరి.

భ - ఓసి నిర్భాగ్యురాలా? ఎట్టిపనిజేసితివే. అన్నన్నా! సిరికాసించి వంశచ్ఛేదము చేయుదురా. అయ్యో? ఈ పాటికి మనకు దౌహిత్రలాభము గలుగ పోయినదా? స్త్రీ స్వభావము కపటమైనదికదా. అని పలుకుచు నతండు విచారింప దొడంగెను.

పండితరాయ లాసంవాదమంతయు విని పెద్దతడవు నిశ్చేతనుండై పడి యుండి యెట్టకేఁ దెప్పరిల్లి యుల్లంబు తల్లడిల్ల హా లవంగీ? హా కోమలాంగీ? హా సుగుణ తరంగిణీ? నా కతంబున నీవు బలవన్మరణము నొందింపఁబడితివి. అయ్యో? నే నెంత కఠినుండనో కదా? నీ వార్తవిని వెంటనేవచ్చి రక్షించుకొనలేక పోయితిని. ఆ పాడుసభ లానాఁడు నా కేల మూడవలయును. అన్నన్నా? నీ ప్రేమ, నీ యనురాగముఁ వలఁపు నీ చాతుర్యము, నీ యౌదార్యము, నీ సోయగము, నీ మాధుర్యము, నీ మృదువు వేయిజన్మములకైన మఱపువచ్చునా? నీ వైదుష్యము సరస్వతికైనం గలదా? అబ్బా? నాకొఱ కెన్ని యిడుమలం బడితివి. ఎన్ని యుక్తులం బన్నితివి. అక్కటా? అన్నిగతులం గొనియాడంబడెడు నీదుజాతిగుఱించి నా చిత్త మించుక యేవగించుచుండునది. వీరి మాటలచే నీ కట్టి కళంకముగూడ లేనట్లు తేలినది. నీ వంటి భార్య నా వంటి పాపాత్మునకుఁ దక్కునా? ఏమనుకొనుచుంటిని? నే నిప్పు డెక్కడ నుంటిని? ఇది కలయా? నిక్కువమా? ఈ బ్రాహ్మణుని మాటలు బొంకులు కాకూడదా? అట్లేయగును సందియములేదు. అయ్యో: నాకుఁ బిచ్చియెత్తినది. కాదిది యున్మాదము. కాదు మరణ వికారము. అటులైన లెస్సయేకదా. పరలోకంబున నాకోకస్తనిం గలసికొందును. ఇసిలో? నా యసువు లెంతకృపణములైనవో యా సతీమణి మరణవార్త వినియును గదలగున్నవి. సీ! నాకీజన్మముతోఁ బనిలేదు. మృతి నొందుటయొండె విరక్తి నొందుటయొండె గర్తవ్యమని పెక్కు తెఱంగులఁ బలవరించుచు నతండు నిద్రబోఁవక యా రాత్రియే యా వీడువిడిచి యొక యరణ్యమార్గంబునంబడి పోవఁదొడంగెను. పండితరాయలు విరక్తుండై కొన్ని దినంబు లరణ్యసంచారము గావించెను. అప్పుడు కనంబడిన పక్షులను మృగములను గుఱించి యనేక శ్లోకముల రచించెను. వానినే పండితరాయ శకములని చెప్పుచుందురు. ఆ శ్లోకములు తఱచు ప్రస్తానోచితముగా నుండును. వానిలోఁ గొన్నిటిం జదివెద నాకర్ణింపుము.

శ్లో॥ యేవర్దితాః కరికపోలమదేన భృంగాః
     ప్రోత్ఫుల్ల పంకజరజస్సురభీకృతాంగాః
     డే సాంప్రతం ప్రతిదినం గమయంతి కాలం
     నింబేషు చార్కకుసుమేషుచ దైవయోగాత్.

వికసించిన పద్మములయందును కరికపోలమదముల యందును సంతుష్టి నొందెడు తుమ్మెద లిప్పుడు దైవయోగంబున వేఁపచెట్ల యందును జిల్లేడుచెట్ల యందును సంచరించుచున్నవి. ఇది తన స్థితిననుసరించి చెప్పినది. మఱియు -

శ్లో॥ రాత్రిర్గమిష్యతి చప్రభాతం భాస్వాన దేష్య
     తిహసిష్యతి పంకజంచ ఇత్దం విచింతయతి కోశిగతె
     ద్విరేపే హా హంతి నళినీం గజ ఉజ్జహార॥

రాత్రి దమ్మి మొగ్గ జిక్కువడిన తుమ్మెద "తెల్ల వారును, సూర్యకిరణములచే నీ పద్మము వికసించును. నాకు బంధవిముక్తి కాఁగల" దని తలంచుచుండ నింతలో నొకయేనుగువచ్చి యా తామరను ద్రెంపి నలిపినది. అయ్యో! యెంతకష్టము ఇదియుఁ దన్ను గుఱించి రచించినదే. మఱియు -

శ్లో॥ పురాసరసిమానసే వికచసారసాళిస్ఖల
     త్పరాగసురభీకృతేపయసియస్య యాతంవయః
     సపల్వలజలేధునామిళదనేక భేకాకులే
     మరాళకులనాయకఃకధయ రేకదం వర్తతాం॥

పూర్వము మానససరస్సునందు సంచరించు హంసము ఇప్పుడు కప్పలచే వ్యాప్తమగు నల్పసరస్సులోఁ దిరుగుచున్నది. అక్కటా తన యవస్థ యలతిఁగా నున్నదని దీనను సూచించెను. మఱియొకచోట నొకలేడింజూచి శ్లోకము.

శ్లో॥ యద్రక్త్వం ముహురీక్షసే నధనినాం బ్రూషే నచాటున్మృషా
     నైషాం గర్వవచః శృణోషి నచతాన్ ప్రత్యాళయో ధావసి
     కాలే బాలతృణాని భాదసి సదా నిద్రాసి నిద్రాగమె
     తన్మే బ్రూహి కురంగ కుత్ర భవతా కిన్నామ తప్తంతపః॥

ఓ కురంగమా ! నీవు ధనమునందలి యాశచే ధనికుల మొగములు పలు మారు చూడవుగదా. మఱియు వారిని లేనిపోని స్తోత్రములు చేయవు వారియొక్క గర్వాలాపములు లాలింపవు. వారివెంటఁ బరుగిడపు. ఆకలియైనప్పుడు లేతతృణములను దిందువు. నిద్రవచ్చినప్పుడు నిద్రపోవుదువు. ఇట్టిసౌఖ్యము కలుగుటకు నీ వెచ్చోట నెట్టి తపముఁ గావించితివో నాకుఁజెప్పుము. నేను సైత మట్టి ప్రయత్నము జేయుదునుగదా. గోపా! యా పండిత శిఖామణి యిట్టి శ్లోకములు వేనవేలు రచియించెను. దానికే పండితరాయ శతకమనిపేరు. మృదుమధురశైలితో నొప్పుచుండెడి యతని కవిత్వము మిక్కిలి గొనియాడఁదగియున్నది. దద్విశేషముల జెప్పుటకిప్పు డవకాశము చాలదు. తదనంతర వృత్తాంత మాలింపుము.

భల్లూకదత్తునికథ

ఒకనాఁడతం డొకయరణ్య మార్గంబునం బడిపోవుచుండ నొక దండఁగొండ యొకటి కనంబడినది. వాఁడు మెండుగా నెండతగిలి యలసటఁజెంది యుండుటచే నతం డా కొండకోనలోఁ జల్లగానుండునని తలంచి మార్గమువిడిచి యగ్గిరిపడి నడిభాగమున కరిగెను. అందుగల ఫలములచే నాఁకలియడంచుకొని సెలయేటిలో నీరు ద్రావి విశ్రమింప నటునిటు తిరుగుచుండ నొకమూల గుహయొకటి కనంబడినది. సంతసములో నా బిలములోనికిఁ గొంచెము దూరముపోయి యించుక చీకటిగా నున్నంత నందొకశిలపై శయనించి గహాముఖమువంకఁ జూచుచునెద్దియో ధ్యానించుచుండెను. అంతలో నొకభల్లూకము చేతులతోఁ దేనెపట్టు పట్టుకొని యాపట్టుంగల యీఁగల నోటితోఁ దొలగించుచు గాశులతో నడచి యాగుహలోకి వచ్చినది. పరాక్రమశాలియు నసహాయాశూరుండునగు పండితరాయలు దానింజూచి జడియక యిది తన చెంతకు వచ్చినప్పుడు తన ప్రక్కనునిచికొనిన బడియతో మోదఁ దలంచుకొని సవరించుకొనియుండెను. ఆ భల్లూకము చీఁకటిలో నతనియునికి యెఱుంగక యల్లన యగ్గుహలో నొకవంక గోడదాపునకుఁ బోయినది. అందుగఁల గూటిలో లేజిగుళ్ళచే నమరింపఁబడిన సెజ్జపై నొక శిశువు నిద్రబోవుచుండెను. ఆ భల్లూక మాగూటి యొద్దకుఁ పోయి యందుఁగల పాపని ముట్టితో ముట్టిన నాపట్టి కేరున నేడువఁ దొడంగెను. పిమ్మట నా మృగమా శిశువునోట దాఁదెచ్చిన తేనెయట్టను తేనెపడునట్లుపిండెను. ఆ మధుబిందువులనుఁ గ్రోలి యాశిశువాకలి యుడిగినంత సంతోషముతో నవ్వుచుండెను.

అప్పు డాయెలుఁగుబంటి యాడింభకుని మెల్లఁగ నెత్తుకొని యిటునటు కొంతసేపు త్రిప్పి ముద్దాడి తాదెచ్చిన చిగురుటాకులఁ బఱచి మఱల నా గూటిలో నా యర్భకుని బరుండబెట్టిఁ జోకొట్టి యెక్కడికోపోయెను. ఆ వింత యంతయు గన్నులారఁజూచి పండితరాయలు మిగుల విస్మయము నొందుచు నాహా! భగవంతుని సృష్టి వైచిత్యము దెలిసికొన శక్యమైనది కాదుగదా? మనుష్యులువోలె మృగములును శిశువులం బెనుచుచుండును. వానిలో వానరములు మిక్కిలి తెలివిగలవి. ఈ భల్లూక శిశువు మనుజశిశువువోలె రొదజేసినది. ఈ చిత్రము చూడవలయునని తలంచి మఱి కొంతసేపున కాగూటి యొద్దకుఁబోయి యబ్బురపాటులో నందుండి యాపాపని నెత్తుకొని యిట్లు తలంచెను. ఆహా ! ఈ పట్టి మనుష్య శిశువు వీనికారు మాసముల ప్రాయమున్నది. దీని రూపము లక్షణములు చూడఁ జక్రవర్తి కుమారుండువలె నున్నవాఁడు ఇట్టి పసికూన యిచ్చటికెట్లు వచ్చెనోకదా? యీ యెలుఁగుబంటి వీనిఁబెంచుటమఱియు విచిత్రముగానున్న యది లేక భల్లూకమే వీనింగనినదా ఇట్టి చోద్యములెప్పుడు వినికని యెఱుంగమని యనేక ప్రకారముల దలంచుచు మఱియు మఱియు నా శిశువుం బరీక్షించుచు నేడ్పించి మనుష్య శిశువగుట నిశ్చయించెను.

అయ్యారే ? ఇట్టి ముద్దుబాలు నేముద్దియగనినదో ? యెవ్వఁడు కొమారుండని మురిసెనో ? వారిప్పు డెట్టివిచారము జెందుచుందురో ? పాపమీ పాపడీ యెలుఁగు బారింబడియుండిన మోసముఁ జెందకుండునా? ఇది యెప్పుడో వీనిం గడతేర్పక మానదు. క్రూరమృగము మనుజశిశువున కిట్టియుపచారములు చేయుట దై వకారణము కాని మఱియొకటికాదు. ఏదియెటులయినను నేను వీని నిప్పు డిచ్చటనుండి తీసికొని పోవుటయే యుచితము. భల్లూక మడ్డము వచ్చినచో నా బడియతో మోదిసమయించెదనని నిశ్చయించి యాబాలుని భుజముపై నిడుకొని రెండవచేత దండముదాల్చి నలు దెసలం బరికించి యెలుఁగుజాడ నరయుచు నతివేగముగా నా కొండదిగి వెనుకటిదారింబడినడుచుచు గ్రమంబున నయ్యరణ్యంబుదాటి నాఁటిసాయంకాలమున కొకపల్లెం జేరెను.

ఆ రాత్రి పాలుయాచించి తెచ్చి యబాలునకుఁ బోసి ముద్దుబెట్టుకొనుచుఁ గట్టా?: దైవము నాకిట్టి పుత్రుందయసేయక సన్యాసింజేసెంగదా ? లవంగి గర్భవతియైనదనివింటిని. ఆ యించుబోణి జీవించియుండి పుత్రుంగనినచో నా శిశు వింతప్రాయములో నుండునుగదా. అట్టి యదృష్టము నా కేలపట్టును. పరమనిర్భాగ్యుండ నని విచారించుచు నా బాలుని బక్కలో నిడుకొని యా రాత్రి నిద్రబోవక వేగించెను. క్రమ క్రమముగాఁ బండితరాయలు కాబాలునియం దనురాగమెక్కు డైనది. సంతతము వానినే ముద్దువెట్టుకొనుచు నవ్వించుచు లాలించుచు బలికించుచుఁ బ్రాణములకన్న నెక్కుడు తీపిగాఁ బెనుచుచుండెను. పూర్వమడవుల వెంబడి తిరిగెడునతం డాబాలుని సంరక్షణ నిమిత్త మప్పటినుండియు గ్రామముల ననుసరించి తిరుగుచుండెను.

ఒకనాఁడతం డాడింభకు నెత్తుకొని యొక గ్రామముఁజేరి యందుగల మసీదునకుం జనియెను. అందుఁ బెక్కండ్రు ఫకీరులు వసియించి యుండిరి. ఒకరి నొకరు పలుకరించుకొనిన వెనుక నందొక ముసలి ఫకీరు పండితరాయల కిట్లనియె. అయ్యా ! నీయాకారము జూడ గడువిరక్తుఁడ వైనట్లుతోచుచున్నది. ఉత్తమమైన యాశ్రమము స్వీకరించియు నీ పిల్లవానిం దీసికొని వచ్చితివేల ? నీ కేమికావ లయు? నీ వృత్తాంత మెట్టిదని యడిగిన నతండు నిట్టూర్పు నిగుడించుచు నిట్లనియెను. అయ్యా! నా వృత్తాంతము కడునసహ్యమైనది. దానితో మీకేమిపని. ఈ బాలుండడవిలో వచ్చుచుండ నొక కొండబిలములో దొరకెను వీఁడెవ్వఁడో తెలియదు. ఎలుగుబంటి వీని మోసము చేయునేమోయని తీసికొని వచ్చితిని. దిక్కుమాలిన వీనిం జూచి నెవ్వనికిఁ దయగలుగకుండెడిని. జడభరతునకు లేఁడిపిల్ల దొరికినట్లు వీఁడు నాకు దొరకెను. ఏమి జరుగునో తెలియదు. వీని భల్లూకదత్తుఁడని పిలుచుచుంటి నిదియే వీని వృత్తాంతమని చెప్పెను.

ఆ ముసలి ఫకీరు బాలుని చరిత్రము విని మిగుల విస్మయముఁ జెందుచుఁ గానిమ్ము. ఈ యర్బకుని వృత్తాంతము వింతయైనదే ? నీ చరిత్రము వినవేడుక యగుచున్నది. నీవు ఫకీరువైకూడ హిందూమత విషయము చర్చించు చుంటివి. భల్లూకదత్తుఁడిను నామము సంస్కృత భాషలోనిది. జడభరతుని కథ హిందూమతములోనిదే నీ వృత్తాంత మెట్టిదో వినవేడుక యగుచున్నది. నీ కాపురం బెచ్చట! తలిదండ్రు లెవ్వరని యడిగిన విని యతండల్లన నిట్లనియె.

నీవు మిగుల వృద్ధుండువు. నీలో నెద్దియో మహిమ యుండక పోవదు. నీతో నసత్యము లాడరాదు. వినుము. నాది కాశీపురము బ్రాహ్మణుఁడను మా తండ్రి పేరు పండితభట్టు. మా తండ్రికి నేడ్గురు పుత్రులు పుట్టి చచ్చిరి. వారి వెనుకఁ గుల ముద్దరించుకొఱకు నేనుదయించితిని. ఎవ్వరో మీవంటి ఫకీరు వచ్చి మా తల్లికి రక్షరే కిచ్చిన నేనుజావక బ్రతికితిని. హిందూమతవిద్య లన్నియుం జదివితిని యవనవిద్యలం దెలిసికొంటి. పాదుషాగారితోఁ గలహించి గెలుపుఁగొంటిని. ఆయన కూఁతుం బెండ్లి యాడితిని. అయింతి నా మూలమున గర్భవతియై తండ్రిచే బలాత్కారముగాఁ జంపబడినది. ఆ యింతికై నేను బ్రాణములు విడువలేక ఫకీరునై తిరుగుచుంటి నిదియే నాయథార్దమైన వృత్తాంతమని చెప్పెను. అప్పుడా నృద్ధుండు వానింగౌగలించుకొని అప్పా! నీవా తెలిసికొంటిని. నేనే మీ తల్లికి మంత్రోపదేశముఁ జేసితిని. అయ్యో! తిరిగి నే నామె జూడలేకపోయితిని. పాప మాదంపతులు సంతతినిమిత్తమై పెక్కుచిక్కులం బడిరి. బ్రతికినను నీవును దుఃఖప్రదుండవే యైతివి కానిమ్ము. గతమునకు వగవరాదు చక్రచార్తి గర్భవతియైన పుత్రికను జంపించినది నీవు చూచితివాఁ ఇతరులచే వింటివా? నీ మొగముజూడ మంచిలక్షణములు గసంబడుచున్నవి. నీకు శుభమయ్యెడు విచారింపకుమని యోదార్చును.

అతని మాటలు విని పండితరాయలు వెఱుఁగుపడుచు పెక్కు సలాములు చేసి స్వామీ! నేను మీ కాప్తుండనేకదా? లవంగిని జంపించెనని వింటిని గాని చూడలేదు. బ్రతికియున్నదా యేమి? అట్టి యదృష్టము నాకుఁ బట్టునా? మీరెట్లు గ్రహించితిరి? ఎక్కడనున్నది. ఆ చిన్నది నా కన్నులం బడినచో బ్రహ్మానందసాగరం బున మునుంగ కుందునా? దయతో నీ దీనుని మొర నాలించి రక్షించి యా వృత్తాంత మెఱింగింపుఁడని యాతురముతో వేఁడికొనియెను.

వాని వలవంతకుఁ జింతపడుచు నా విరాగి అయ్యా! నేనా తొయ్యలి వార్త యెఱుంగను. నీ ముఖచిహ్నములం జూచి యట్లంటి దొందరపడకుము తరువుల గుసుమాదికములు ప్రాప్తించినట్ల ప్రయత్నముననే శుభములు చేకూరును సర్వవిద్యాపారంగతుండవు నీ వెరుంగవా? యని పలికి యంతటితో నా ప్రసంగము విరమించెను. పండితరాయలు ముసలి ఫకీరుతో ముచ్చటించుచు నా బాలునితోఁ గూడఁ గొన్ని దినంబులందుండి యతని యనుమతివడసి యచ్చటనుండి బయలుదేరి యనేకదేశములు తిరుగుచు హరిద్వారమునకు వచ్చెను. అప్పటి కాబాలుండు సంవత్సరము ప్రాయము గలవాఁడయ్యెను. వానిముద్దు మాటలు నాటలు నవ్వులు విలాసములై పండితరాయలకుఁ గాలక్షేపముగా నుండెను. ఒకనాఁ డతం డాబాలునితో నాడుకొనుచుండఁగా గుందలతిలక యచ్చటికి వచ్చి యబ్బురపాటుతో నబ్బాలుని నెత్తుకొని ముద్దాడఁదొడంగినది. అప్పండితుం డాచిగురుబోఁణిఁ జూచి గుఱుతుపట్టి డగ్గుత్తికతో బోఁటీ? నన్ను గురుతుపట్టితివా? నీ సఖురా లేమైనది? నేనువోలె నీవుసైతము నానాతినిమిత్తము తిరుగుచుంటివి కాఁబోలు. నీ మాటవిని వెంటనే రాకపోవుటచే నింతవచ్చినది. ఏమి చేయుదుమని కన్నీరుకార్చిన, నవ్వుచుఁ గుందలతిలక యిట్లనియె. ఆర్యా! నీవు విచారింపకుము. మా సఖురాలు సేమముగా నున్నది. పుత్రుంగనినది. ఈ ముద్దుపట్టి మా ముద్దియ పట్టయని చెప్పిన విని కన్నులు నిటల మతిక్రమింప నేనేమీ లవంగి సుఖియైయున్నదా? సత్యమే, ఎక్కడనున్నది? నీ విక్కడి కెట్లువచ్చితివి? ఆ కథయంతయు సవిస్తరముగాఁ జెప్పుమని యడిగిన నయ్యువతి యిట్లని చెప్పందొడంగినది.

కుందలతిలకకథ

నేను మీ యొద్ధ సెలవు పుచ్చుకొని ఢిల్లీకిఁబోయి యందు లవంగియున్న యుద్యానవనమునకుం జనితిని. లవంగియు సంగీతచంద్రికయు నాకుఁ గనంబడలేదు. అక్కడివారల నడిగినఁ దండ్రి లవంగి చేసిన దుర్నయము తెలిసికొని గర్భవతియని సంశయింపక చంపించెనని యొకరు నాతో రహస్యముగాఁ జెప్పిరి. ఆమాట విని నేనడలుచుఁ దిరుగ మీ యూరు వచ్చి మిమ్ము విమర్శించితిని మీ జాడ తెలియక మీ తల్లిదండ్రులు విచారించుచున్నారు. అప్పుడు తిరుగ నేను ఢిల్లీకిఁబోయితిని. అందు మీ వృత్తాంత మేమియుఁ తెలిసినదికాదు. ఏమి చేయుటకుం దోచక • 11 - 10. కొన్నిమాసములుతిరిగినంత నొకనాఁడొక గ్రామము ... . . . . . . " సం . . . ........ d iv. . న న యా చేడియ యచ్చటికెట్లు- ... తలంచుచు నిలువంబడి చూచి చూచి దానివెంట నరిగితిని. అదియు నొకబ్రాహ్మణగృహమున కరిగినది. ఆవాకిట నిలువంబడి యొకరితో నీచిన్నది యెవ్వతెయని యడిగితిని. ఆమె యొకబాటసారి కాశికిఁ బోవుచు నిన్న నీ యూరిలో బసచేసినది. ఆమెతో మఱియొక చిన్నది యున్నది వారి మగవారు ముందుబోయినారట. రెండవ చిన్నదానికి మగశిశువు గలిగి రెండునెలలక్రిందట జారిపోయినాఁడఁట. అందులకే కాఁబోలు నా చిన్నది సంతతము విచారించుచుండును. ఇంతకన్న వారికథ మాకు దెలియవని యచ్చటివారు చెప్పిరి. ఆ మాటవిని నేను నెఱంగుపడుచు మెల్లగా నా లోపలకుం బోయితిని. నన్నుజూచి లవంగి గోలున నేడ్చినది. అప్పుడు నేనది లవంగి యని గుఱుతు పట్టితిని. వారిఁజూచి నేనును విచారించుచు నయ్యో? మీరు చచ్చినారని విరక్తితోఁ దిరుగుచుంటిని. యిచ్చటికెట్లు వచ్చితిరి. మీ వృత్తాంతమేమో చెప్పుమని యడిగిన సంగీతచంద్రిక యిట్లనియె.

సఖీ! నీ వుండగనే తోటలో గుజగుజలు పుట్టినవికద? మఱిరెండు దినములకు గూఢచారులు హాసన్‌బాదుకోటలోని కరిగి గుప్తమార్గము దెలిసికొనిరి. అందు లవంగి వీరునకు వ్రాసిన యుత్తరమొకటి నా చేతి నుండి జారిపడినది చీఁకటిలోనాకు దొరికినది కాదు. అది వారలకు దొరికినది. విధివిధానము దాటింప నెవ్వరితరము? ఆ యుత్తరము చూచి యంతకుమున్ను విన్న సంగతులు నిశ్చయమని తలంచి చక్రవర్తి మండిపడి మమ్ము నిద్రబోవుచుండఁ జంపిరండని కింకరుల కాజ్ఞ యిచ్చెనంట. ఆరహస్యము పెద్ద బిబ్బీ తెలిసికొని యొక బ్రాహ్మణునిచే మాకావార్తఁ దెలియజేసినది. ప్రొద్దు గ్రుంకక పూర్వమే మాకా రహస్యము బ్రాహ్మణుఁడు చెప్పిపోయెను. మేము వినిపించి కొననట్లుండి లవంగి పరుండెడి హంసతూలికాతల్పంబున ననఁటిబొంద నునిచి వస్త్రమాల్యానులేపనాదులచే స్త్రీయాకారముగా నలంకరించి సన్ననివలువఁ గప్పి నిద్రబోవునట్టు నిలపితిని. ఆ ప్రాంతమునందే నాయాకృతియు నొప్పునట్లుచేసి లవంగి దూరముగా నుంచి నేనా రహస్యము చూచు తలంపుతో దాపున దాఁగి యుంటిని.

అర్ధరాత్రసమయంబున భయంకరవేషములతో రాజభటులు కొందఱువచ్చి లవంగి పరుండియుండు తల్పము వెదకికొనుచుఁ దల్పంబున నున్న కృత్రిమవిగ్రహములఁ దునియదునియలుగా నఱికి యా పఱుపుతోడఁ జుట్టి మోసికొనిపోయి కందకములో నూరద్రొక్కి తమలోనఁ వారు పోయిరి. అప్పుడు నేను గుండెలు తటతటఁ గొట్టుకొనుచుండ లవంగి చేయిపట్టుకొని ఇంతీ? మనమిం దిందుండరాదు. నిజము తెలిసినచో మానహానియుఁ బ్రాణహానియు గాఁగలదు. కుందలతిలకయు వచ్చినదిగాదు. రహస్యముగా నీవీడ వదలి గుట్టుగాఁ గాశీపురి కరిగి నీ మనోహరుం గలసికొనుటయే యుచితమనిచెప్పి నట్లనే బయలుదేఱి ముసుఁగులు వైచికొని యెవ్వరికిం దెలియకుండ నరణ్యమార్గమున నడువసాగితిమి. ఆపదలయం దెట్టి వానికిని మొండిధైర్యము గలుగునుగదా? అడుగునకుఁ బదుగురు తోడువచ్చెడు నప్పడఁతి యా రేయివాఱు మసకం ఆ గర్భముతోఁ జీకటిలో నా చేయిపట్టుకొని వడి వడి నడువఁదొడంగినది. కాలగతి యెట్టిదో చూడుము. తెల్లవాఱువఱకొక పల్లెం జేరితిమి. ఆనారికాళులు పొక్కులెక్కి యాపైన నొక్కడుగు నడువలేక చతికిలఁబడినది అప్పుడు నే నొకచోట బరుండబెట్టి కొంత ద్రవ్యము తీసికొనిపోయితిమిఁ కావున దాన భోజనసామాగ్రి సంపాదించి వంటఁజేసి భోజనముపెట్టి యాయాసము వాయ సాయంకాలమువఱకుఁ బాదముల నొత్తుచుంటిని. ఆ చిన్నది యాదినమునఁ గదలలేకపోయినది.

మఱుఁనా డుదయకాలమున నెట్టకే బయనము సాగించితిమి. అడు గామడ లాగున నడువఁదొడగినది. చెట్టునీడలఁ గూర్చుండి యెట్టికేలకు నా నిర్భంధముమీఁద గదలుఁచు గ్రమ్మఱ నవ్వలి చెట్లనీడ నిలిచి సఖి! యీ రీతి నెంతదూరము నడువ వలయును. అయ్యో? కాశీపుర మెంతదూరమున్నది? మునుపు వేగముగా జేరితిమే? యని పలుకఁగా నేను శంకించుచు దాపుగానే యున్నది. రేపు చేరుదుము. అడుగు వేయుము కూర్చుండిన నడవిలోఁ బ్రొద్దుగ్రుంకును. వెనుకనుండి యెవ్వరేని వత్తురేమో యని పెక్కు తెఱంగుల బ్రతిమాలగాఁ గదలి నాలుగడుగులు నడచి యిఁక నన్నుఁ జంపినను నడువఁజాలను. పైఁ బయనము రేపుపోవుదము. మృగములు తినుఁగాక కదలలేనని యీడిగిలం బడినది. అప్పటి నా శ్రమ యేమిచెప్పుదును. రెండు మూఁ డామడలు మాత్రము చుఱుకుగా నడిచినది. పిమ్మట దివసమున కొక క్రోశమైనను నడువలేక పోయినది. బండ్లు మొదలైన యానసాధనములా త్రోవం బోవనేరవు పెక్కులేల? ఆఱుమాసములకుఁ బదియామడ పోయితిమి. గర్భ మెదగిన కొలది నడువలేకపోయినది. ఒక్కొక్కచోటఁ బదేసి దినములు వసించితిమి. ఆగమనశ్రమకన్న మరణమే శ్రేయమని తోఁచినది. ఒకనాఁ డొక యగ్రహారముఁ జేరితిమి లవంగికి నెలలు నిండినవి. కావునం బైననరుగ బయనము జాలించి యందొక యుత్తమబ్రాహ్మణునింజూచి వినయముతో "అయ్యా ! మేము బ్రాహ్మణులము. మా మగవారు కాశీలో నున్నారు. ఈ చిన్నది నాకుఁ దోఁబుట్టువు. మగని యొద్దనుండి దీసికొని పోవుచున్నాను. ఇప్పుడు ప్రసవ సమయమైనది. మీ యింటఁ బురుడు పోసికొనియెనను, మీఱేమియు సహాయము చేయనక్కరలేదు. బసమాత్ర మియ్యవలయునని ప్రార్దించిన సమ్మతించి యా విప్రుండు మమ్ముఁ దన యింటికి దీసికొనిపోయి యాదరించెను. మఱి నాలుగుదినములకే లవంగి ప్రసవమై మంచి ముహూర్తమునఁ జక్కని పుత్రుంగనినది. ఆ బాలుడు బాలసూర్యుండువోలె పుట్టినప్పుడే సూతికాగృహముఁ బ్రకాశింపఁ జేసెను. నేనును సంతోషముతోఁ బురుడు బోసితిని సుఖముగాఁ బది దినములు గడచినవి. రెండు నెలలుమాత్రము సుఖముగా నందుంటిమి. అచ్చట విప్రులు విప్రాంగనలు మమ్ముఁ జాల గౌరవముగాఁ జూచు చుండిరి. లవంగి తన మనోహరునకుఁ గుమారుని జూపు నుత్సుకముతో వెండియుఁ బయనము సాగించి వేగముగాఁ గాశికిఁ బోవలయునని చెప్పినది. కాని నడుచునప్పుడు నాకుఁ బ్రాణముమీదిఁకి వచ్చుననియెంచి మఱి రెండు మాసములు జరుగువఱకుఁ బయనము సాగనిచ్చితినికాను. ప్రతి దినము వేపుచుండ నెన్ని దినములు గడుపుదును? మఱియొకనాఁ డా బ్రాహ్మణులచే ననిపించుకొని శిశువు నొకభుజముపై నిడుకొని లవంగిని రెండవచేతితోఁ బట్టుకొని ఒక నిశావసానమున నా యగ్రహారము విడిచి నడువఁ దొడంగితిమి. ఆబోఁటి మాటలెన్నేనిం జెప్పినది కాని నడుచునప్పుడు మునుపటికంటె నాలస్యముచేయఁ దొడంగినది. ఆ దారినడవులేగాని గ్రామములేవియుఁ దఱచు గనంబడవు.

అట్లు నాలుగు దినములు నడిచితిమి. నాకు నూఱుగజములు దూరములో నుండినది. పిల్లవాని నెత్తుకొని నేను ముందు నడుచుచుండ నొకనాఁడు మధ్యాహ్నమున నాకొక భల్లూకమెదురై బొబ్బలిడుచు నాపైఁ బడవచ్చినది. అప్పుడు జడియుచు నేను వెఱ్రికేకలు వైచి యేమియుం దోఁచక యా ముద్దుపట్టిని జాటున నేలపై బెట్టి నే నొకమూలకు బోయితిని. అప్పుడా యెలుఁగబంటి యా చంటిపిల్ల వాని కడకు పోయి యెత్తుకొని నన్ను వెక్కిరించుచు నా ప్రక్కనున్న యరణ్యములోనికి పోయినది. అప్పుడు నేను వట్టిచేతులతో నిలిచి గోలున నేడ్చుచు నిలువంబడితిని. ఇంతలో లవంగివచ్చి నన్నుఁ గలసికొని జరిగినకథ విని పెద్దయెలుంగున నయ్యరణ్యము ప్రతిద్వని యిచ్చునట్లేడువఁ దొడంగినది. నేను బెద్దతడ వోదార్చితిని. అబ్బా! నాఁటిసంగతిఁ దలచుకొనిన నిప్పుడుగూడ గుండెలు కొట్టుకొనుచున్నయని చూడుము? లవంగి యేడ్చినధ్వని యిప్పటికి నా యడవిలో జెట్లవెంబడి బయలువెడలు చండును. భల్లూకము నన్ను జంపినను జంపుగాక నా ముద్దుబాలుని దానిపాలుసేసి యూరకొనఁజాలను. నేనుగూడ నయ్యడవిలోనికి పోయెదనని లవంగి సాహసము చేయుచుండ బలాత్కారముగాఁ బట్టుకొని విరక్తి మాటలం జెప్పుచు నెట్టకే మఱలించి నడిపించుచు నాఁటిరేయి కొకపల్లెఁజేరితిమి. అందు రెండు దినములుండి వెండియు బయలుదేఱి కొన్నిదినముల కీయూరు చేరితిమి. ఇందీ లవంగికి దేహములో నామయము జేసినది. అందులకై యిందు వసియించి యుంటిమి. ఇప్పుడు కొంచెము నెమ్మదిగా నున్నది. ఇదియే మా వృత్తాంతము కుందలతిలకా! నీవేమేమి చేసితివి ? ఎచ్చటెచ్చటఁ గ్రుమ్మఱితివి ? వీరుండేమనియెను ? మా కథ యాయనకుం దెలిసినదా ? ఇప్పుడు కాశీపురిలోనే యున్నవాఁడా యని యడిగిన నా వృత్తాంతమంతయుం జెప్పితిని. మీ జాడ తెలియక చింతించితిరి.

మేమందఱముఁ గలసి యందు మఱి నాలుగు దినములు వసించి మీ మాటలే చెప్పుకొనఁ దొడంగితిమి. మీరు తనకై యడలుచుందురని లవంగి మిక్కిలి చింతించుచున్నది. అచ్చట బయలుదేఱి మేము మీ జాడఁ జూచికొనుచుఁ బెక్కు గ్రామములు తిరిగితిమి. ఒక యూరిలో మసీదులోనున్న ఫకీరు త్రికాలవృత్తాంతములును ప్రశ్నలడిగినఁ జెప్పునని యా గ్రామస్థులు చెప్పగాఁ నేను పోయి యా మహాత్ము నాశ్రయించి మిమ్ము గుఱించి యెందున్నా రని యడిగితిని. ఆ వృద్దు నన్ను జూచి నీ వడిగిన కార్యమునకు ముఖ్యురాలవు నీవా? నీ కన్న ముఖ్యులుండిరా? యని యడిగిన నున్నారని చెప్పితిని. అట్టివారే యడుగవలయునునని చెప్పఁగా లవంగి నతని యొద్దకుఁ దీసికొనిపోతిని. ఆ చిన్నదానిం జూచి యా సన్యాసి యీ కాంత యిట్లు చింతించుచున్న దేమిటికని ప్రస్తావముగా నడిగెను. కాశీపురి కరుగుచుండ దారిఁలో బ్రసవమగుటయు బుత్రునెత్తుకొని యడవిలో నడచుచుండగా నెలుఁగుబంటి యా శిశువు నెత్తుకొని పోవుటయు లోనగు వృత్తాంత మంతయుం జెప్పి యప్పాపని నిమిత్తము విచారించుచుండెనని చెప్పితిని. అప్పుడతండు విస్మయముతో జూచుచు నేమేమీ? ఆ బాలుండు మీ బాలుండా? విచారింపనక్కరలేదు. ఒక పుణ్యాత్ముం డా బాలుని రక్షించినాఁడు. మొన్ననే యాతం డిచ్చటినుండి యెచ్చటికో పోయెను. ఆ భల్లూకము బారితప్పించి యా బాలునిఁ గైకొని పెంచుచుఁ బుత్రునికన్న నెక్కుడు ప్రేమతో జూచుచున్నాఁడు. మీరు విచారింప నవసరములేదు. నాతో నతం డీ కథఁ జెప్పెను. అతండు బాటసారిగావచ్చి కొన్నిదినము లిందుండెనని చెప్పెను.

ఆ మాటవిని లవంగి యుప్పొంగుచు స్వామీ! యా పుణ్యాత్ముండెవ్వండు? ఎందుఁ బోయెను? వాని పేరేమి? చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

బోఁటీ! యా పురుషుండు బ్రాహ్మణుఁడు అతని నివాసము కాశీపురము. గొప్ప విద్వాంసుఁడు, సామాన్యుఁడుకాడు. కాని దైవయోగమున నన్యకులకాంతం బత్నిగాఁ జేసికొనియెనఁట. దానివారలు తెలిసికొని గర్భవతియని సంకోచింపక చంపిరఁట. ఆ మాటవిని విరక్తుండై ఫకీరులలోఁగలసి తిరుగుచున్న వాఁడు. అతని బెడద మీకేల? మీ బాలుని రక్షించెను అతండు తఱచుగాఁ దీర్థముల కరుగుచుండును కావున వెదకి పట్టుకొనుఁడు. మీ కొమరుం జూడగల్గునని యా కథ యంతయుం జెప్పెను. ఆ మాటలువిని మే మొండొరుల మొగములు చూచుకొనుచు సంతోషపారావారావీచికలం దేలియాడుచు మా రహస్య మాయనకుం జెప్పక కర్తవ్యాంశములు మేము మువ్వురము విచారించుకొంటిమి. పిమ్మట నేనాయనతో స్వామీ! నేనుపోయి వెదకి యా బ్రాహ్మణునిం గలిసికొని యా బాలునిం దీసికొనివచ్చెద నంతదనుక వీరిద్దఱు మీ యొద్దనుందురు పరోపకారపారీణుల కెల్ల వారును బంధువులేకదా. విశేషించి దిక్కుమాలినవారియం దెక్కుడు కనికరముఁ జూపుదరు. మీ రించుక కృపారసంబు వీరిపై ప్రసరింపజేయుచుండిన శుభములు చేకూరక మానవు సత్వరముగాఁ పోయి వత్తుననియా యవనఋషిని స్తోత్రములు చేయుచు నతం డొడంబడిన పిమ్మట నేను బయలుదేఱి యనేక తీర్థంబులు తిరిగితిని. పెక్కు శైలములకుం జనితిని. బహుపట్ట ణంబులు పరికించితిని. ఏమి చెప్పను నెచ్చటను మీ దర్శనమైనదికాదు. ఈ హరిద్వారమునకు రెండుసారులు వచ్చితిని.

కేదార మాఱుసారులు పోయితిని. సన్యాసులను ఫకీరులను బైరాగులను వేనవేలను బరీక్షించితిని. ఎప్పటి కే కార్యము సఫలము కావలయునో యప్పుడుకాక వేయి ప్రయత్నములు చేసినను లాభములేదు. కొందరు ఫకీరులవలన మీ జాడలు తెలిసికొని యిక్కడికి వచ్చితిని. దైవానుగ్రహముచే నిందు మిమ్ముఁ బొడగంటి. ఈ బాలుండు నీ పుత్రుండు ముసలి ఫకీరుచే నంతయుం తెలిసికొంటిని. మీకు శుభోదర్కము సూచనలయగుచున్నది. వేగమవచ్చి లవంగిని జూడుడు. మీ విరహమున నా తరుణీరత్నమునకుఁ గలుగు పరితాపమింతింతయని చెప్ప నా తరముకాదు. ఇంక ముందరి కార్యమునకు దేవరయే ప్రయాణ మని యూరకొనినది.

ఆ మాటలువిని పండితరాయ లమృతహ్రదంబున మునింగిన యట్లొకింత తడవు మాటాడనేరక హర్షపులకితగాంత్రుండై సంతోష గద్గదస్వరముతో కుందలతిలకా! ఇట్టి సంతోషవార్త జెప్పిన నీకిచ్చుటకు నా యొద్ద నేమియునులేదు. జీవితకాలమువఱకుఁ గృతజ్ఞుడనై యుండుటయే దీనికిఁ బ్రతిఫలము మా నిమిత్తము మీ యిరువురు మొదటినుండియుఁ గష్టములఁ బడుచున్నవారు దైవమును మీఱినవాఁ డెవ్వడునులేడు. ఆహా! విధి విచిత్రసంఘటనలఁ గావించుచుండును గదా! అయ్యరే! మనుష్యమాంసఖాదియైన భల్లూకము బాలునెత్తుకొనిపోయి తనపిల్లవలెఁ బెంచుట యెన్నడైన వింటిమా! కంటిమా! నేనాగుహకే పోవలయునా ? ఓహో! భగవంతుని యద్భుత ప్రభావ మెవ్వఁడు తెలిసికొనఁగలడు ? అని పెక్కుగతుల విస్మయముఁ జెందుచు లవంగిం జూచు నుత్సాహము డెందమ్మున ముమ్మరమగుచుండ నతం డప్పుడే పయనంబై యా బాలునెత్తుకొని కుందల తిలకవెంట నడుచుచుండఁ గతిపయప్రయాణంబుల ఫకీరులున్న గ్రామము జేరెను.

కుందలతిలక పండితరాయలను బుత్రికలతోఁగూడ నొకచోట గూర్చుండఁ బెట్టి లవంగిని బరిహాస మాడదలంచి ముందుగా మసీదునకుఁపోయి చూచినదికాని యందెవ్వరును గనంబడలేదు. ఇంతలో నెవ్వఁడో యొకం డచ్చటికి వచ్చినం జూచి వానితో అయ్యా! ఇందొక ముసలిఫకీరును నాయనతో నిద్దరుముద్దియలు నుండవలయును. వారెందుబోయిరో యెఱుంగుదురా యని యడిగిన నతఁ డెరుంగుదును. నీ వెవ్వతెవు? లవంగి సఖురాలవా యేమి? అని యడిగిన వెఱగుపడుచు నాపడుచు నోహో! ఈతండు లవంగిపేరు చెప్పుచున్నాఁడే? గుట్టుబయలయ్యెనాయేమి? రాజభటులు తెలిసికొని యా పొన్ని కొమ్మం బరిమార్పలేదుగద. అయ్యో? ఏమని చెప్పుదును. ఏమిముప్పు మూడినదో యని యాలోచించుచుండ వెండియు నతం డిట్లనియే.

నీవు సంశయింపనక్కఱలేదు. నీవృత్తాంత మంతయుఁ దెలిసినది. ఆవిప్రకుమారుండు కుమారునితో నీకు గనంబడియెనా? ఇచ్చటికిఁ దీసికొనివచ్చితివా? నేనా ముసలిఫకీరు శిష్యుండను. ఆయన మీ నిమిత్తమే నన్నిం దుంచినాఁడు మీకు శుభము గలుగఁగలదు. నిజము జెప్పుమని యడిగెను. అప్పుడప్పడఁతి అయ్యో? నీమాట యేల రిత్తవోవును. నేను లవంగి సఖురాలినే. ఆ బ్రాహ్మణకుమారుఁడు కుమారు నెత్తుకొని యరుగుమీఁద గూర్చుండియున్నవాఁడు. ఆయనతో నా వృత్తాంతము చెప్పవచ్చును. వత్తురేయను పలికిన సంతసించుచు నాపురుషఁ డప్పుడే యక్కడికి పోయి పండితరాయలం గాంచి కాయముతో సలాముచేయుచు మసీదునకుఁ దీసికొనిపోయి కుశల మడిగి యుత్తీర్ణుఁడైనతరువాత నల్లన నిట్లనియె.

ముసలి ఫకీరు కథ

అయ్యా ! యీచిన్నది యిద్దఱిముద్దుగుమ్మలను మాగురువుగారి యొద్ద నునిచి యరగినవెనుక మాగురువుగారు లవంగి యాకారవిద్యాదివిశేషములు దెలిసికొని వెఱఁగుపడుచు నొకనాఁ డాయింతిం జూచి సాధ్వీమణీ! నీవు మిగుల గౌరవ కుటుంబములో జనించినట్లు కనఁబడుచుంటివి. పురుషసహాయములేక యిట్లూళ్ళ వెంబడి సంచరించుచుంటివేల? నీవృత్తాంత మేదియో గోప్యముచేసితివి. మాచేతనై నంత యుపకారము గావింతుము. నిక్కముఁ జెప్పుమని పలుమాఱుగ్రుచ్చి గ్రుచ్చి యడిగిరి. ఆయన మహానుభావుండని యెఱింగి లవంగియుఁ దనవృత్తాంత మంతయు నొకనాఁ డాయనకు జెప్పి స్వామీ! నేను శాస్త్రదూష్యమైనపని యేమియుం జేయలేదు. మా తండ్రికి నిష్కారణము నాపైఁ గోపమువచ్చి యట్లుకావించెను. దైవోపహతకురాల నే నేమిచేయుదునని యేడువఁ దొడంగినది.

ఆమాటలువిని యతి దయాళుండగు మాగురువుగారు జాలిపడుచుఁ దరుణీ! నీవు వెఱవకుము. నీకష్టము వాయఁజేసెదను. నీమనోహరుఁడు నాకత్యంతాప్తుండు అతం డీభూలోకమేగాక మూఁడు లోకములు నేల సమర్థుడు. నీపని యెఱుంగనుకాని యీకథ నేనువానివలన వింటి నీవలన లేశము దోషములేదు. చక్రవర్తి తెలియక యట్లు నియమించెను. నీమగండు నీవు మృతినొందితివని విరక్తినొందెనుగాని నిన్నుఁ గలిసికొనిన పాదుషాను సంగరంబున నోడించి ఢిల్లీరాజ్యముఁ గైకొనఁడా ? అయినను సామమునఁ గార్యము సాధింతును. నేనువచ్చు వఱకు నీవిందుండుము. మాశిష్యులే నిన్ను రక్షించుచుందురని యెన్నియో చెప్పి యాయన నన్నుఁ దనవెంటఁ బెట్టుకొని డిల్లీకిఁ బోయెను. ఆరాజధానిలో మేము మసీదులో బసజేసి ఫాదుషాగారి వృత్తాంత మందుఁగల ఫకీరుల నడిగితిమి. వారిట్లనిరి “ఇప్పుడు ఫాదుషా చక్రవర్తి దుఃఖ సముద్రములో మునిఁగియున్నాఁడు. ఎవ్వరికిని దర్శన మిచ్చుటలేదు. పకీరులకు దర్శనమిచ్చునుగాని తిన్నఁగా మాటాడఁడు రాజ్యము ప్రధానులే చేయుచున్నారు కాని యెవ్వరికిం జెప్పడు. ముందుఁ గూఁతుఁనిం జంపించి పశ్చాత్తాపతప్తుడై యట్లు మాడుచున్నాఁడని యొక ప్రతీతికలదు. అదిరహస్య ప్రసక్తి కావున వెల్లడింపరాదు. చక్రవర్తికి సంతోషముఁ గలుగజేసిన ఫకీరునకు మిక్కిలి గౌరవము జరుగునని యొక వజీరు చెప్పియున్నాఁడు. అది యెవ్వరితరము కాకున్నది. అతనికూఁతుం బ్రతికించిన జరుగునట్టి పని నిదియే కోటలోనివృత్తాంతమని చెప్పిరి. ఆమాటవిని మాగురువుగారు మిగుల సంతసించుచు నమ్మఱునాఁడు నాఁతోగూడ ఖిల్లాలోనికి జనుదెంచి రాజదర్శనముఁగావించెను. మమ్ముఁ జూచి చక్రవర్తి సలాము మాత్రము చేసెను. అప్పుడు మాగురువుగా రొక్కింతతడ వూరకొని రాజా! నీవు దైవాంశసంభూతుండవయ్యు నన్యాయకార్యములఁ జేయబూనినచో దుఃఖముల పాలుగాక మానుదువా? ఇఁక నీవు విచారింప నవసరములేదు. నీశోక ముడిగించుటకే నేనువచ్చితిని నీ హృద్గత మెద్దియో చెప్పుము. నన్నే చెప్పుమంటివేనిం జెప్పఁగలను. చెప్పుటయేకాక నీకు సంతోషము గలుగఁజేయఁ గలనని పలికిన విని యతండు వెఱఁగుపడుచు మాదిక్కు మొగంబై స్వామీ! మీరు మహాత్ములుగదా? అది మీరే యెఱింగింపుఁడని పలికెను.

అప్పుడు మాగురువుగారు రాజా నీవు నిరపరాధినియైన కూతుం జంపించితినని విచారించుచుంటివి. ఆమాట సత్యము. ఆ సతీమణియం దించుకయు సపరాధము లేదు. సర్వోత్తముండైన పురుషుని బతిగా వరించినది. కాని స్వైరిణీవృత్తిఁ నాచరించ లేదు. కానిమ్ము ఆచిన్నది ధర్మాభిరక్షితయై బ్రతికియేయున్నది. నీవు విచారింపకుము. సెలవిచ్చితి వేనిఁ దీసికొనిరాగలనని పలికిన నతండు లేచి యతని పాదంబులఁబడి మహాత్మా! రక్షింపుము. రక్షింపుము. నీవు భగవంతుఁడవు. నాపుత్రికం దయచేయుము. క్రుద్ధుండనై ప్రాణమువంటి పుత్రికం జంపించితి నతిక్రూరుండఁ బాపాత్ముండనని యనేక ప్రకారముల వేడుకొనియెను. అప్పుడు మాగురువుగారు లవంగిం దీసికొని వచ్చుటకు సేనలతో నన్నుఁ బంపిరి. నేను వచ్చియా వృత్తాంత మంతయుం జెప్పి వారి నందలం బెక్కించి దీసికొని పోయి కోటలో నప్పగించితిని. మఱల నన్ను మీరిచ్చటికి వచ్చినఁ దీసికొని రమ్మనియు నంతదనుక నిందువేచి యుండమనియు నియమించిరి. దానంజేసి మీ రాక వేచియుంటి. మిమ్ముఁ బొడఁకంటి. నిఁక మనము ఢిల్లీకిఁ బోవలసినదని పలికెను. ఆ కథ విని పండితరాయలు 'అయ్యా! లవంగి సుఖియైనందులకు నే నెంతయు సంతసించితిని. నేను మాత్ర మచ్చటికి రాను. చూడ వలయునని యున్న లవంగి నెప్పటికై నం జూచెదను. ఫాదుషా చక్రవర్తికి వెఱచి నేనిట్టి వేశము వైచికొనలేదు. లవంగి నా నిమిత్తము బరిమార్పఁబడినదని విరాగినైతి. నిఁక మాయొక్క సామర్ధ్యమును జూతురుగాక యని యత్యాగ్రహముతోఁ బలుకుచున్న యతని యాకారము జూచి యాపురుషుండును గుందలతిలకయు భయపడుచు నేమియుం బలుకలేకపోయిరి. మఱి కొంతసేపటికి నలుకయుడిగి యప్పాఱుండు కుందలతిలకతో బోఁటీ? నీ విక నేమిటికి నాతోఁ దిరిగెదవు. నీసఖురాలిం గలసికొని సుఖింపుము మా దారి మాదని పలికిన నక్కలికి యిట్లనియెను.

పండితరాయల కథ

ఆర్యా ! నేను మీ పాదసేవకురాలనై మీతోఁ గ్రుమ్మఱుచుందును. మా సఖురాలు జేసిన తప్పు మన్నింప వేఁడుచున్నదానను అక్కలికి పిలిచినంతనే యాత్మాపరాధియగు తండ్రియింటి కరిగినదని మీకుఁ గోపము వచ్చినది. ఎటులయినను స్త్రీ చాపల్యము పోవదుగదా? నేను బోయి తీసికొని వచ్చెద ననుజ్ఞ యిండని వేఁడుకొనిన నతండు కానిమ్ము ప్రస్తుతము పోవలదు. అట్టికాలము రాఁగలదు. చూచుచుండుమని పలికెను. ఆ మాటలన్నియు నొకయుత్తరము వ్రాసి యా పురుషుండు గురువునొద్ద కనిపెను. ఆఫకీ రాసందేశము తెలిసికొని లవంగియొద్దకుం బోయి "తల్లి! నీ భర్తకు మనపైఁ గోపము వచ్చినదఁట. నీవు పుట్టినింటికి వచ్చితివని యాక్షేపించుచుఁ జక్రవర్తిపై గత్తిగట్ట సిద్దపడుచున్నవాఁడని జాబు వచ్చినది. అతం డలిగిన నెంతపనియైనం జేయఁగలడు. అతని కోపమెట్లు శాంతించునో యట్లు చేయవలయును. చక్రవర్తి యతని యొద్ధకు బోయి యపరాధము చేసితిని. రక్షింపుమని ప్రార్దించినచోఁ గార్యము సమకూరును లేనిచోఁ దగనిచిక్కులు పడవలసి వచ్చును. అతని చరిత్ర మంతయు విని యుంటిని కావున నింత చెప్పుచున్నాఁడఁ దరువాత నీవే యాలోచించుకొనుమని" చెప్పెను. పుత్రికపైఁ జక్రవర్తి మునుపటికంటె నెక్కుడు ప్రేమ గలిగి యున్నవాఁడు కావున లవంగి తండ్రి యొద్ద కరిగి నాయనా ! నీ యల్లుడు త్రిలోకపూజ్యుఁడు పరాక్రమమున నింద్రునికన్న నెక్కువవాఁడు రూపమున మన్మథుని దిరస్కరించును. బుద్దిని బృహస్పతి యనియే చెప్పఁదగిన సాధుశీలుండు సత్యసంధుండు. ఉత్తమ వంశసంజాతుండు అట్టివాఁడు నీ కల్లుఁ డగుటయే చాలును. పాత్రలాభము కలిగినది. నీవు ద్రోహము చేసినను బుత్రికను గనుక యీసు బూనక పిలిచినంతనే వచ్చితినికాని యాయన యంతమాత్రమున సంతసించునా? న న్నాక్షేపించుచు నీపైఁ గత్తిగట్టుటకు సిద్ధముగ నున్నారట. ఎటు ప్రమాదము వచ్చినను నాకే గదా కొదవ ఇది వఱకు పడినయిడుములు చాలవా? నీ వాయన యున్నచోటికిఁ బోయి బ్రతిమాలుకొని తీసికొని రావలయు. నిప్పు డిదియే కర్జము. అల్లుఁ డలుగుటయు మామ తీర్చుటయు లోకాచారమై యున్నదని యుక్తియుక్తముగాఁ జెప్పి యతని నొప్పించినది.

పిమ్మట ఫాదుషా చక్రవర్తి చతురంగబలపరివృతుండై మంత్రిసామంతాదిపరిజనము సేవింప ముసలిఫకీరుతోడ తాఁ బండితరాయలున్న గ్రామమున కనతిదూరమున నందలము దిగి పాదచారియై యతనియొద్దకుం జని పాదములమీఁద దల యిడి మహాత్మా! నేను మీ సామర్ధ్యము తెలియక -------------ఈ బాలుండు నాకు దౌహిత్రుడు. ---------- నా యింటికి విచ్చేయుము. నాతప్పులన్ని-------అని అనేకప్రకారములం బార్ధించిన మృదుహృదయుండగు పండితరాయ లేమియుఁ బలుక లేక యూరకొనియెను.

అప్పుడే చక్రవర్తి దౌహిత్రు నెత్తుకొని ముద్దాడుచు నందలముల నందఱ నెక్కించి యధికవైభవముతో ఢిల్లీ పురమునకుఁ దీసికొని యాపూర్వ సత్కార్యములం గావించెను. పండితరాయలు లవంగిం గలసికొని పుత్రు నందిచ్చి యధికసంతోషముతో జరిగిన వృత్తాంత మంతయు జెప్పుచుఁ బడినయిడుముల, నుడువుచు నామెచేసిన పనుల నడుగుచుఁ గుందలతిలకయు సంగీతచంద్రికయు జేసిన సహాయములఁ బొగడుచుఁ పదిదినము లొక్కగడియలాగున వెళ్ళించెను.

అప్పుడు కాశీపురవాస్తవ్యుండైన పండితభట్టుగారి కుమారుఁడు పండితరాయలు పాదుషాగారి కూఁతురు లవంగిం బెండ్లి యాడి యామెవలన సంతానమునుగని కులము చెఱుపుకొనియెను. అను వార్త దేశమంతము వ్యాపించినది. ముఖాముఖిగా నా సంగతిఁ గాశీలోనున్న పండితభట్టు విని భార్యతో గూఁడ మిక్కిలి పరితపించుచు నతనిఁ జూడ డిల్లీ రాజధానికి బయనంబయ్యెను. అప్పుడందుఁగల పండితు లతని నాక్షేపించుచు సీ? వాఁడు నీకెక్కడి కొమరుండు. మంచి వంశముఁ బాడుచేసి కామాతురుండై తురక నెలంతుకను బెండ్లియాడెను. అట్టివాని నీ వెట్లు చూడఁబోయెదవు నీకున్న ఖ్యాతికిఁ గళంకము కాదా? యెందరు నీకు బుద్ది చెప్పగానే వచ్చినది. ఆ యుద్దములో నితనిఁ జక్రవర్తి కూతురు మోహించినది. ఆ మాయలోఁ బడిపోయెను. చదివిన చదువంతయు నీటిపాలు చేసెను. వీనిని జచ్చినవారితో నెన్నుకొనుమని యెన్నియో నీతులు చెప్పి పోవనిచ్చిరుకారు. పండితభట్టు చిత్తముఁ ద్రిప్పుకొనియెను. కాని యతని భార్య మాత్రముఁ గుందుచు నెట్లయిన గొమరునిఁ జూడవలయునని యతనికి నుత్తరము వ్రాసి పంపినది ఆ యుత్తరము జూచుకొని పండితరాయలు మిక్కిలి పరితపించుచు నప్పుడే కాశీపురికిఁ బయనంబయ్యెను. అతనితో లవంగియు బయలు వెడలినది. పుత్రుని మాత్రము చక్రవర్తి యొద్ద నునిచిరి.

పండితరాయలు సకలపరివారములతోఁ జతురంగబలము సేవింపఁ గాశీపురంబున కరిగి హసన్‌బాదు కోటలో బసచేసి యావీటంగల మేటి పండితులకెల్ల నాహ్వానపత్రికలు పంపెను ఆ పత్రికలం జూచుకొని పండితులు నిరసించుచు నీవు విద్వాంసుఁడవయ్యే గులభ్రష్టుండ వైతివి. ఇట్టి నిన్నుఁ జూచుటకు మేము రాము. నీ దర్శనము కలుషప్రదము. నీవు సంభాషణార్హుండవు కాదని ప్రత్యుత్తరము వ్రాసిరి. పండితభట్టు భార్య పుత్రునిరాక విని మగనికిఁ జెప్పకుండ నతని యొద్దకుఁ బోయినది. ఆమె రాక విని యతండు భార్యతో గూడ గొంతదూర మెదురు వచ్చి పాదంబులఁబడి నమస్కరించెను. కన్నీరుఁ గార్చుచు దీవించి కోడలిని మన్నించి నాయనా ! నిన్నుఁ గన్నందులకు నాకు సుఖమే గాని మఱేమియును లేదు. నీవు విద్యాగుణ సంపన్నుఁడవై కులమునకు ఖ్యాతి దెత్తువనుకొంటి నీ మూలమున మాకుఁ దలయెత్తుకొన వీలు లేకున్నది. నీ వీతురకపడఁతి నేమిటికిఁ మొదట బెండ్లి యాడితివి. బ్రాహ్మణులలోఁ గన్యలు లేకపోయిరా? అయ్యో! యువతి దేవాలయములోఁ బ్రవేసించునని యెంత సన్నాహముఁ గావించితివి. ఆ నియమ మంతయు నేమయ్యెను. అన్నన్నా? మీ తండ్రి కేమిగతిఁ జూపితివని యనేక ప్రకారములఁ బలవరించుచున్న తల్లిని మెల్లఁగ నంతఃపురమునకుఁ దీసికొనిపోయి గద్దియం గూర్చుండబెట్టి యోదార్చుచు నిట్లనియె.

అమ్మా! ఈసంసార మతిగహనమైనది. జంతువు కర్మసూత్రమునఁ గ్రుచ్చఁబడుననే దాని వెంబడిని పోవుచుండును. జనుండు స్వతంత్రుఁడు కాఁడు అని శాస్త్రములు ఘోషించుచున్నవి గదా! ఈ రమణి బ్రాహ్మణయువతి కాని యవనాని కాదు. కారణాంతరమున నట్టిప్రతీతిఁ బొందినది. అదియునుంగాక సుకృతదుష్కృతములకు మనసే ప్రధానము నామన సన్నిటిని రోసి నిస్సంగమైయున్నది. వినుము

శో॥ తదయం కరోతు హయమేధ శతాస్య మితాని విప్రహననాస్యధనా॥
     పరమార్థవిన్న సుకృతైరపి దుష్కృతైరపి లిప్యతేస్తమిత కర్తృతయా॥

పరమార్ధమును దెలిసినవాఁ డశ్వమేధము లనేకములు చేయుఁ గాక యనేక విప్రహత్యలు చేయుఁగాక ఆ పుణ్యము నీ పాపమును గూడ నంటదు కర్తృత్వ మతనికి లేకపోవుటయే దీనికి హేతువు. తల్లీ! ఏను నట్టివాఁడనే. ఇందు గుఱించి మీరు చింతింపవలసిన పని లేదని పలుకు చుండఁగనే యచ్చోటికిఁ బండితభట్టు వచ్చెను.

తండ్రిని జూచి కుమారుండు భార్యతో లేచి యతనికిసాష్టాంగ నమస్కారములుగావించి యుచితాసనాసీనుంగావించి యేమియుం బలుకక యోరగాఁ గూర్చుండెను. అప్పుడు తండ్రి వాని వైభమంతయుం జూచి తలపంకించుచు నిట్లనియె "వత్సా! నీ వనార్యుండవై సంపదల కాసించి యుభయలోకములకుం జెడితివి నీకతంబున మేమునుం జెడితిమి. నీ విద్యాలాభ మీరీతిం బరిణమించినది కదా ఇప్పుడు కాశీపండితులు నీతో మాటాడినంతనే నాకు వెలియవేయుదుమని చెప్పిరి. కన్నకడుపు కావున నూరకొన లేక రహస్యముగాఁ జూడవచ్చితిమి. మా కిట్టిగతిఁ గల్పన చేసితివి మంచిపుత్రుండ వౌదు" వని కన్నీరుఁ గార్చుచున్న తండ్రి కతండు తగురీతి సమాధానముఁ జెప్పి వెండియు నిట్లనియె. తండ్రీ ! పెక్కు లేమిటికి. రేపు ప్రాతఃకాలంబున నీయూరి పండితులనెల్ల మణికర్ణికాఘట్టంబునకు రప్పింపుము నే నక్కడికి వచ్చి నే నపవిత్రుండనో పవిత్రుండనో గంగామహాదేవిని సాక్షిణిగాఁ గోరికొనియెదను. ఆమె న న్నపవిత్రుంగా జెప్పెనేని మీరనిన ప్రాయశ్చిత్తమునకు బాధ్యుండను. ఇప్పు డిదియే కర్జమని బలికిన సంతసించుచుఁ బండితభట్టు భార్యతోఁగూడ నింటికి జని మఱునాడు గాశీలో నున్న పండితులకెల్ల నా తెఱంగెఱింగించి యచ్చోటికిఁ దీసికొని వచ్చెను. అందరిలోఁ బండితరాయలు లవంగితోఁ గూడఁ జుట్టును బెక్కండ్రు సేవకులు సేవింప విశ్వేశ్వరుం దర్శనము సేసికొని యమ్మహాత్ము ననేకస్తోత్రములు గావిం చుచు గంగాతీరమున మణికర్ణికాఘట్టమునకుం జని గంగ కభిముఖముగా నిలువంబడి యంజలిపట్టి, కన్ను లర మూసి యమ్మహాదేవి నిట్లు ధ్యానించెను.

శ్లో॥ సమృద్ధ సౌభాగ్యం సకలవసుధాయాః కిమపిత
     న్మహైశ్వర్యంలీలా జనిత జగతః ఖండపరశోః
     శ్రుతీనాం సర్వస్వం సుకృత మథమూర్తం సుమనసాం
     సుధాసౌందర్యంతే సలిలమశివం నశ్శమయతు.

శ్లో॥ ప్రభాతే స్నాతీనాం నృపతి రమణీనాం కుచతటీ
     గతో యావన్మాత ర్మిలతి తవతోయైర్మృగమదః
     మృగాస్తావద్వైమానిక శతసహస్రైః పరివృతా
     విశంతి స్వచ్ఛందం విమలవపుష్ణో నందనవనమ్.

శ్లో॥ తవాలంబాదంబ స్పురదలఘు గర్వేణ సహసా
     మయాసర్వేవజ్ఞా సరణి మధనీ తాన్సురగణా
     ఇదానీ మౌదాస్యం భజసియది భాగీరధితదా
     నిరాధారోహా రోదిమికధయ కేషామిహపురః

ఓ తల్లీ ! భూమండలమునకెల్ల సమృద్ధమగు సౌభాగ్యమై జగత్తుల నిర్మించు నీశునకు మహైశ్వర్యమై శత్రులుయొక్క ధనమై వేల్పుల సుకృతస్వరూపమై సుధాధవళమై యొప్పు నీతోయము నీ పాపము నశింపఁజేయుఁగాత.

రాజస్త్రీలు కుచతటంబులఁ గస్తూరి రాచికొని నీ జలంబుల మునుంగునంత వారినేకాక కస్తూరీమృగ సంతతులఁగూడ విమాన మెక్కించి స్వర్గవాసులఁ జేయుచుందువు. తల్లీ! నీ మహిమ యేమని కొనియాడుదును.

అంబా! నేను నీయాలంబనము జూచికొని దేహమున భూదేవతలఁగూడ నతిగర్వముతోఁ దిరస్కరించితి. ఇప్పుడు పరీక్ష సమయము వచ్చినది. ఇప్పుడు నీవు నా విషయమై యుదాసీనభావము వహించితివివేని భాగీరథీ! నిరాధారుఁడనై యెవ్వరి కడకుఁ బోయి మొరబెట్టికొందును. నీవు నన్నిప్పుడు రక్షింపక తప్పదు.

ఈ రీతి నరువది శ్లోకములు రచించెను. ఆ శ్లోకములకే గంగాలహరియని పేరు. పండితరాయలు భక్తివివశుఁడై యొక్కొక్కశ్లోకము రచించుచుండ గంగానది యుప్పొంగుచు నొక్కొక్కసోపాన మాక్రమింపఁజొచ్చినది. అరువది శ్లోకములు పూర్తియైన తోడనే యామెట్లన్నియుఁ గ్రమంబున ముంచికొనివచ్చి భాగీరథి యా దంపతులు నిలింపులు కుసుమవర్షంబులు గురియింప నాత్మాయత్తముఁ జేసికొని యెప్పటియట్ల ప్రవహింపఁ దొడఁగినది. అందున్న వారెల్ల నావింతఁ గన్నులారఁ జూచి యాశ్చర్యసాగరనిమగ్నులై పండితరాయల ప్రభావముఁ బలు తెఱంగుల స్తుతియింపఁజొచ్చిరి. అతని తలిదండ్రులు పెద్దతడవు చింతించుచు నతండు కారణ జన్ముండని నిశ్చయించి విరక్తులై యద్వైతతత్వబోధామృతంబుఁ గ్రోలుచు దపోవనంబున కరిగిరి. గంగానదిని మునింగి పండితరాయలు భార్యతోఁగూడ మనుష్యశరీరమును విడిచి యథాపూర్వకముగా దివ్యదేహము ధరించి పరమానందము నొందెను. గోపా! ఇదియే వారి వృత్తాంతము. మనకుఁ బయనపు సమయమగుచున్నది. లెమ్మనిపలికిన వాఁడు చేతులు జోడించి మహాత్మా! మీ కటాక్షమున మంచికథ వింటిఁ గృతార్దుండనైతి. చివర వారు యథాపూర్వకముగా దివ్యదేహములు ధరించిరని చెప్పితిని. దీనం బ్రశ్నావకాశము గలుగుచున్నది. వారు పూర్వ మెవ్వరు? అట్లు జనింప నేమిటికి? ఆవృత్తాంతముఁ జెప్పుడని వేఁడికొనిన నయ్యతి నవ్వుచు నిట్లనియె "ఓరీ! నేను మఱచిపోయి యిట్లంటి దీని కొకకారణము లే దని పలికెను. కాని యంతమాత్రమున వాఁడు విడువక యా సిద్ధుని యడుగులం బట్టుకొని వేఁడుకొనిన నతం డిప్పుడు చెప్పుటకు వీలులేదు. ముందు శివాలయము కనంబడినచోట జ్ఞాపకము చేయుము దాని కట్టి కారణమున్నదని చెప్పి వాని నొప్పించి పిమ్మట బయనంబై శిష్యునితోఁ గూడఁ దరువాత మజిలీ చేరెను.

ముప్పదియేడవ మజిలీ.

ఱాతిమందసము కథ

ముప్పదియేడవ యవసధము సాధారణమైనగ్రామము. అందు వాడుక ప్రకారము గురుండు నియమచిత్తుండై జపమునకుఁ గూర్చున్న సమయమున శిష్యుఁడు వింతలంజూడ గ్రామములోనికిం బోయి నలుమూలలఁ దిరిగితిరిగి యేదియుం గనంబడమి విసిగికొనుచుఁ బ్రాంతారణ్యభాగమునకుం జని యరయనరయ నొకచో నొకవింత గనంబడుటయుఁ గడురయంబున నయ్యవారియొద్ద కరిగెను. అయ్యతియు భోజనాదికృత్యములు నిర్వర్తించి వానిరాక నిరీక్షించియుంటంజేసి వానిం గాంచి రమ్ము రమ్ము. నీమొగమ్ముఁ జూడ వేడుకపడుచున్నట్లున్నది. ప్రొద్దుపోయినది. కుడిచిన పిమ్మట నడిగెదుగాని యని పలికిన విని స్వామీ! యాలస్యమైనచోఁ జెప్ప మఱచెదను. వినుండు. ఇదియు వెనుకటి మజలీవంటిదే ఇందేవింతయుఁ గనంబడలేదు. ఊరువిడిచి యడవికిం పోయితిని. అందొక యద్భుతమైన ఱాతిమందసము గనంబడినది అది తెల్లని పాలశిలతోఁ జేయబడినది. నూఱుగజముల పొడవును నలవది గజముల యెత్తును నేబది గజముల వెడల్పును గలిగి చతురస్రమై యొప్పుచున్న యాశిలాపేటికపై కెక్కుటకు యాసోపానము లెవ్వరో వింతగా నేర్పఱచిరి. పైకెక్కి చూచితిని మూఁత వేయఁబడి యున్నది. ఒకచోట రంధ్రము పడినది. కావున దానివెంబడిఁ జూచిన బాతాళబిలమువలెఁ గనంబడును. వేగురైనను దానిమూఁతఁ గదల్పఁజాలరు. పోలికంబట్టి యది మందసమని యూహింపబడుచున్నది. ఆపెట్టె వాడెడువా రెవ్వరో? ఎంతబలముగలవారో? ఎంతదేహము గలవారోగదా? దాని వృత్తాంత మడిగిన నచ్చటివారు పెద్దకాలమునుండి యిట్లేయున్నది.