కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/35వ మజిలీ
ముచ్చటగా నున్నది. మీ సుముఖత్వము మనోహరమై యున్నది. అని పొగిడిన నతనిమాటలకు సందియమందుచు నయ్యిందువదన యంతటితోఁ బ్రసంగము విరమించి చేతులు జోడించి అందుండియే విశ్వేశ్వరు నిట్లు వినుతించినది.
జయ శంకర పంకజనాభ విధి
ప్రముఖామరసేవిత పాదయుగ
స్థిరముక్తిద భక్తినిదాన భరా
బ్దిజలే పతితా మవమాం కృపయా ॥1॥
ధరణీధరమందిర! బాలనిశా
కరశేఖర! భూతిమనోహర! హే
హర! పాప భయంకర! ఘోరభవా
బ్దిజలే పతితా మవమాం కృపయా ॥2॥
గిరిచాప! మహీధర! వారిధితూ
ణ! రమాధవబాణ! మహారథిక!
త్రిపురాసురభంజన! ఘోరభవా
బ్దిజలే పతితా మవమాం కృపయా ॥3॥
అని యవ్వనితారత్నము విశ్వేశ్వరమహాదేవుని నినుతించిన విని యవ్వీరుండు సంశయాకులహృదయుండై (అహో కిమేతర్ పతితా మిత్యంగనావిశేషణస్తౌషి) అయ్యో యిదియేమి? నీవు వనితాం అని స్త్రీవిశేషణము వైచికొని స్తోత్రము చేయుచున్నా వని యడుగఁగా (వనితారచితస్తుతివృత్తరత్నా నియమా ఫణితాని) స్త్రీచేత రచియింపబడిన వృత్తములు నాచే నిప్పుడు చదువబడిన వని యుత్తరముఁజెప్పి యమ్మ త్తకాశిని తత్తరముఁ జెందుచుఁ జెలికత్తియలతోఁగూడ నచ్చోటు కదలి సత్వరముగా వచ్చినదారి ననుసరించి తన యంతఃపురమునకుం జనినది. అని యెఱింగించు వఱకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డంతటితో నావృత్తాంతముఁ చెప్పుటఁ జాలించి పైమజిలీయందుఁ దదనంతర వృత్తాంతమిట్లని చెప్పఁదొడంగెను.
ముప్పదియైదవ మజిలీ.
గోపా! విను మట్లు లవంగి సఖులతో నంతఃపురంబునం బ్రవేశించి భుజించిన వెనుక నొక రహస్యప్రదేశంబునం గూర్చుండి వారితో నిట్లు సంభాషించినది.
లవంగి - కుందలతిలకా! నేడు మీదయావిశేషంబునం గదా విశ్వేశ్వరునిం జూడగంటిని. కాకున్న నందఱ మరిగి యా యాలయంబున బ్రవేశింపశక్యమా?
కుంద - నీచే విశ్వేశ్వరలింగమున కభిషేకముఁ జేయంచలేక పోయితిమని లజ్జించుచున్నాము. ఆ గుమ్మముఁగాచియున్న బ్రాహ్మణకుమారుం డసాధ్యుండుగదా? ఏమి చేయుదుము.
లవంగి - అసాధ్యుండని మెల్లగాఁజెప్పెదవేమి? అమ్మయ్యో? అతఁడు నాచేయి పట్టుకొనినప్పుడు వణకువచ్చినది. చూచితిరా? మన మాఁడువాండ్రుమైనట్టు అనుమానము జెందినాఁడు సుఁడీ?
కుంద - అవును. నీసుముఖత్వము మనోహరముగా నున్నదన్నమాట యూరక పలికినదికాదు.
లవంగి – అదియునుంగాక నేను మఱచిపోయి స్తుతిశ్లోకములలో పతితాం అని స్త్రీలింగవిశేషణము వైచితిని. దానికేగదా యతండు శంకించెను.
సంగీతచంద్రిక – నీవాయనతోఁ బ్రసంగించితివిగదా. విద్యలలో నేపాటి వాఁడు!
లవంగి - విద్యలలో బృహస్పతియే యని చెప్పవలయు. నేనన్నిటిలో నూపి చూచితిని. నిర్లక్ష్యముగాఁ జెప్పివిడిచెను.
కుంద - వాని రూపము మిక్కిలి మనోహరముగా నున్నది సుమీ. వాని రంగు నీరంగు నొక్కసమముగా నున్నవి.
లవంగి - రంగుమాట యటుండనిమ్ము. నుదురు సౌరుఁజెక్కుల తళ్కు గన్నులయందము నెట్లున్నవో చూచితివా ?
సంగీత - అతండు నవ్వుచుండ మొగ మూరక చూడముచ్చటయైనదిగదా. ఆహా! పలువరుస యాణిముత్తియములు గ్రుచ్చినట్లే యున్నది
లవంగి - పెక్కేల యావిప్రకుమారుండు యువతీమన్మథుండని జెప్పఁ దగినదియే.
సంగీత - అట్టి మనోహరుండు నీకు లభించిన మేము సంతసింతుము.
లవంగి - అతని కాతఁడే సాటి. అట్టివాఁడు మఱియొకఁడుండి నప్పుడు గదా.
కుంద — ఆతఁడే విశ్వేశ్వరసాక్షిగా నీపాణిగ్రహణము గావించెనే!
లవంగి – దాన నేమి యయ్యెను?
కుంద - ఏమికావలయునో యదియే కాఁగలదు.
లవంగి - అది పరిహాసజల్పితమా యేమి?
కుంద -- పరిహాసమేమి? నీయభీష్ట మెట్లో యట్లే కావింతము మాయొద్ద మోమోట మందెదవేల?
లవంగి - సఖీ! అది యేమియోకాని వానింజూచినది మొదలు నా హృదయమున నేదియో వికారముగలిగి బాధించుచున్న దేమి?
సంగీత - మేమదియే యనుకొనుచుంటిమి యుక్తమే.
లవంగి - అన్నా! వాని కులశీలనామంబు లేమియుం దెలియవు. అట్టి యపరిచితు నొక్కసారి చూచినంతనే యింతకుమున్ను కంతువిలాసముల నేవంగించు మదీయస్వాంతమున వింతసంకల్పములు బొడముచున్నవి. ఆహా! స్త్రీహృదయముకన్నఁ దరళమైనది మఱియొకటి లేదుగదా.
కుంద - మాధవీలత సహకారమును విడిచి దుత్తూరముపైఁ బ్రాకినప్పుడు గదా నిందించుట.
లవంగి - దుత్తూరమో సహకారమో నాకుఁ దెలియదు. కాని యీకార్యము కొనసాగునదియా?
కుంద - మనపయత్న మక్కరలేకుండ దైవమే కొనసాగింపఁగలఁడు. లక్షణము లట్లు గనంబడుచున్నవి.
లవంగి - ఊరడింపుమాటలు మాని కార్యసాఫల్యమగు తెరువరయుఁడు.
కుంద - సిరి రా వలదనువా రుందురా యేమి?
లవంగి — ఇప్పు డెంతకాలమైనది? నేఁటి యుదయముననే మనమతనిం జూచినది.
లవంగి – అబ్బా! యుగాంతరము లై నట్లు తోచుచున్నది.
సంగీత - ఆలాగే యుండును. ప్రొద్దుపోయినది. నిద్రపొమ్ము . ఱేపు విచారింతము.
అని సంభాషించుకొని యాచేడియలు నిద్రపోయిరి. కాళీపట్టణములోని మసీదుఫకీరులు వీరునియందు మక్కువగలవా రగుటచే యవన సేనలోనికిం జని యచ్చటివిశేషములు ప్రతిదినమువచ్చి సాయంకాలమునఁ జెప్పుచుందురు. దానంచేసిన వారికీ రాకపోకలవిషయమై యాటంక మేమియు జరిగింపఁ బడలేదు. యవన సేనాపతులు ఫకీరులను తలంపుతోఁ దమరహస్యములం జెప్పుచుందురు. శివరాత్రినాఁడు సాయంకాలమున లవంగి యీదినమున గుడికి రాదనియుఁ దిరుగ సేనలకు వ్రాసిరనియు రెండు మూడు దినములలో సేన వచ్చిన తరుకాత మీయూరిమీదఁ బడుదురనియు ఫకీరులు వీరునకుఁ దెలియఁ జేసిరి. ఆ వార్తవిని వీరుఁడందు మరియొకని గాపుంచి తాను సేనాముఖములన్నియుం జూచికొని యింటికింజని నిత్యక్రియాకలాపంబులం దీర్చుకొని తల్పంబుపై శయనించి యిట్లు ధ్యానించెను.
అయ్యో? నేను లవంగి రాకుండఁ గాపాడితి ననుకొంటిని గాని దానిపని యది చేసికొని పోయినది. నేనే మోసపోయితిని. పురుషుని కరమంత మృదువుగా నుండునా? స్వరమువలన స్పష్టముగాఁ దెలియఁబడుచున్నది. చూపులు లేడిచూపులవలె నున్నయవి. కన్నులఁ గాటుక గుఱుతు లున్నను నూహింపనైతిని. అది యంతయు నట్లున్నను స్తుతిశ్లోకము లది రచించినవే. అందు స్త్రీలింగవిశేషణము వైచుకొని నాతో మరియొకరీతిఁ బలికినది. అయ్యారే! ఎన్ని విద్యలలో బరిశ్రమచేసినది! వక్తృ మెంత కొనియాడదగినది: దానంజేసియే హిందూమతాభిమాత్వనినియైనది. అట్టి చిన్నది గుడిలో బ్రవేశించినను దోషములేదు. స్వామి కభిషేకముఁ జేసినను జేయ వచ్చును. దాని చూపులు తలంచుకొనిన నా హృదయము వివశమగుచున్నది. మంచి సమయము మించఁబెట్టితినిగదా. అయ్యో? మఱికొంతసేపు దానితో ముచ్చటింపక పొమ్మంటి నావంటి వెంగలి యెందైనంగలడా? అమ్మహారాజపుత్రిక మాటకు వెయి దీనారము లిచ్చినను సంభాషించునా? వెఱ్ఱిపట్టునఁ బోగొట్టుకొంటి వెండియు దర్శనము సేయుదునంటగాని నివాసదేశం బడుగనైతి. అడిగినను నిజము జెప్పునా? తదీయ శృంగారవిలోకనములు నాయం దనురాగముఁ గలిగినట్లు తెలియఁజేయు చున్నవి. కానిమ్ము. అదియే సత్యమైనచోఁ గాముం డపకారముఁ జేయక మానఁడని తలంచి యంతలో నవ్వుకొనుచు మఱియు నిట్లు తలంచెను.
ఇప్పుడు నేనుచేసిన శపథముమాని కామకుండనైతినేల? కమను లిట్లే దలంచుచుందురు. మగవానింజూచి స్త్రీయని తలంచి తద్విలాసములు తనయం దారోపించుకొనినవాఁడు నేనుదక్క మఱియొకఁడు గలఁడా? సీ? యీ సంకల్పము నా కేమిటికిఁ గలుగవలయు? యవనపుత్రిక యట్లేలవచ్చును? నేనే భ్రమపడితినని క్రమ్మఱజిత్తమును మరలించుకొని మఱునాఁడు చేయవలసిన కృత్యము లాలోచించు కొనుచు నిదురపోయెను.
మఱునాఁడు వీరుండు కాశీరాజుగారికి పాదుషాగారి సైన్యం కొంతతిరుగ రానై యున్నది. కనుక మిగిలియున్న మీ సైన్యముఁ బంపుఁడని వ్రాసి తెప్పించుకొని యాయాయోగవనులం గాపుపెట్టి తాన్నని చోటులంజూచుచు నప్పురం గాపాడుచుండెను. కుందలతిలక యమ్మరునాఁడు మాఱువేషముతోఁ గాశీపట్టణమున కరిగి వీరుని వృత్తాంత మంతయుఁ దెలిసికొనివచ్చి యచ్చిగురాకుఁబోణి కిట్లనియె 'సఖీ! నిన్నటి దినము విశ్వనాథుని పడమర ద్వారమునఁవున్నవాఁడు వీరుఁడను బ్రాహ్మణకుమారుఁడు. వాని తండ్రిపేరు పండితభట్టఁట. ఆ విద్వాంసుఁ డీపట్టణమున మిగులఁ జాలినవాడఁట. ఏడ్గురు పుత్రులు పుట్టి చచ్చినవెనుక నీతండు పుట్టి తురకదేవతల యారాధనావిశేషమునఁ బ్రతికియున్నాడఁట. దానంజేసియే యతని వేషము తురక వేషముగా నున్నది అమ్మహావీరుండు విద్యచేఁ గాక పరాక్రమముచేఁ గూడ ననన్యసామాన్యుఁడై యున్నాడఁట. ఈ సన్నాహం బంతయు నతనిదే యని తదీయవృత్తాంత మంతయుం జెప్పినది. ఆ మాటలు విని యయ్యోషారత్నంబు సంతోషవిషాదంబులు మనంబునం బెనఁగొన గుందలతిలకతో బోటీ! మనవారి యుద్యమ మెట్లున్నది? సేనాని వ్రాసిన జాబున కేమని యుత్తరము వచ్చినది తెలిసికొనిరమ్మని చెప్పిన నవ్వెలఁది సేనాపతి నడిగివచ్చి లవంగితో నిట్లనియె.
యువతీ! మన వజీరు మఱికొంతసైన్యముతో రేపురాత్రి కిచటికి వచ్చునఁట. ఎల్లుండి వీటిపైఁబడి పోరాటము సేయుదురట. ఇదియే మనవారు చేయఁదలచుకొనిన కృత్యమని చెప్పినది. ఆ మాట విని యప్పాటలగంధి వీరున కేమి యపాయము గలుగునోయని వెఱచుచు నిష్టదైవమును బ్రార్దింపఁ దొడంగినది.
అంత నమ్మరునాఁడు సాయంకాలమునకు విశేషబలముతో వజీరువచ్చి హుస్సేనుబాదులోఁ బ్రవేశించెను. వజీరు రాకవిని కాశీపురములోని మసీదుఫకీరు లాతనిం జూడబోయిరి. మంత్రిగారిని గౌరవించి కుశలప్రశ్నానంతరమున నిచ్చటి హిందువు లింత కావరించియున్నా రేమి? పాదుషా శాసనమంత నవ్వులాటగా నున్నదా? కాశీపురముం ద్రవించి గంగలోఁ గలిపింతు జూడుఁడు. వీ రెవ్వరియూత నిట్టిపని కుద్యోగించిరి. వీరిబలము లెట్టివని యడిగిన ఫకీరు లిట్లనిరి కాశీరాజు మీకు వెఱచి సహాయము రానని చెప్పెను. ఈ దేశమున కెల్ల నాలింగము ప్రాణమువంటిది కావున హిందువులందఱు నేకమైరి.
కాశీరాజు సమ్మతిలేకయే తదీయసైన్యమంతయు వచ్చి యప్పురిఁ గాచుచున్నది. హిందువులు స్త్రీబాలవృధ్ధముగాఁ బోరుటకుఁ సిద్ధముగా నున్నవారు. ప్రాణములఁ దృణముగాఁ జూచుచున్నారు. ఒకరి ప్రోత్సాహము వీరికిలేదు. అందఱు వీరులుగానేయున్నారని యతండు వెఱచునట్లు వీరునందుగల యభిమానమునం జేసి చెప్పిరి. ఆమాటలువిని మీసములు దువ్వుచు నాహా? మేకపిల్లల కెంతక్రొవ్వు వచ్చినది. కానిండు. గొఱ్రె బలిసిన గొల్లకు లాభమేకదా? అక్కాఫరుల పచ్చినెత్తురులు త్రావి తురకలు మత్తులై నాట్యములు సేయగలరు మీరేచూతురుగాక యని పలుకుచు నప్పుడు యుద్ధమున కుత్తురువీయక యీదినంబునఁ గొన్నిసన్నాహములు గావించుకొనిపోయెను.
ఫకీరులు కొంతసే పందుండి యచ్చటిరహస్యము లన్నియుం దెలిసికొని ప్రోలికింజని వీరునితో రహస్యముగా నిట్లనిరి. అప్పా! మా చెప్పిని మాటల వింటివి కావు. ఇప్పుడు పాదుషాగారి మంత్రి మితిలేని బలముతో వచ్చి యున్నాఁడు. ఎల్లుండి యుదయమున నువ్వెత్తుగా మీపురిపైఁబడుదురట. రేపు ప్రొద్దున పాదుషాగారి పుత్రికను ఢిల్లీకి బంపివేయును. అచిన్నది యిక్కడనే యుండెదనని చెప్పి పెద్దతడవు పోవుటకు సమ్మతించినదికాదు. పెద్దయుద్ధము జరుగును. గావున స్త్రీ లిందుండరాదని చెప్పి యెట్టకేలకు బయనమునకు సమ్మతింపఁజేసెను. సామాన్యసైన్యమును సహాయముగా నిచ్చి పల్లకీమీఁదఁ బంపుదురఁట. ఇవియే యచ్చటి విశేషములు. తరువాత కృత్యములు నీవే యోజించుకొనుమని చెప్పి వారు మసీదునకుం బోయిరి. వీరుం డాత్మగతంబున నూహించుకొని యమ్మఱునాడు కొందఱు రాజభటులు సహాయముగాఁ గొని రహస్యముగాఁ జని లవంగి యరుగు తెరువుఁ గాచుకొనియుండెను.
అంతలో నాకాంతారత్నము పల్లకీబోయెల కంఠధ్వనులు వినంబడినవి. అప్పుడు వీరుండు సారంగములఁ దోలు బెబ్బులివలె గుఱ్ఱముతో నెగసి యవనులబలములం బాఱఁజిమ్మి యిరుగడ దండులఁ బట్టికొని పరుగిడు చెలికత్తెలతోఁ గూడి యప్పల్లకి మరలించి మాఱుత్రోవం గాశీపురంబునకుం దీసికొనిపోయి యంతకుమున్న సిద్దపఱచి యుంచిన శుద్ధాంతములో నయ్యింతులఁ బ్రవేశ పెట్టి వలయునట్టి సామాగ్రి యంతయు నిచ్చి యితరులం బోనీయక కాపుపెట్టి యతిగుప్తముగాఁ గాపాడుచుండెను. లవంగియు నత్తెఱంగంతయు వీరునివలనం గలిగినదని చెలికత్తియిలచేఁ దెలిసికొన యబ్బంధనంబు సైత మొక బంధుకృత్యముగాఁ దలఁచుచు తనగౌరవమున కించు కేనియు హాని రాకుండఁ గాపాడు వీరునయందు మిగుల ననురాగము జనింపఁ దండ్రి వలన నతనికేమిముప్పు వచ్చునోయని వెఱచుచుండెను. అట్లు తురక రాపట్టిని బంధీ గృహంబునబెట్టి నాఁటిసాయంకాలమున గవనులకుంజని వీరభటులకాయోధన ప్రకారం బెఱింగించి రణభేరి నినాదంబులు భూనభోంతరాళంబులు నిండ భండనంబునకు నాయితము చేసి నిలువంబెట్టెను.
ఆధ్వనివిని యవనభటులు చటులగతినుబ్బుచు బవరమునకు వేగ నాజ్ఞ యిమ్మని వజీరుం గోరుకొనిరి. అతండును రణభేరిని వాయింప నియమించి సేనల బారులు నిలువఁబెట్టి యుద్ధమునకు వెడలుసమయమున రాజపుత్రికతో నరిగినభటులు వచ్చి శత్రువులు లవంగిం జెరఁదీసికొని పోయిన వృత్తాంతమంతయు జెప్పిరి. ఆవార్త విని మంత్రి ఱెక్కలు విరిగిన పక్షివలె నేలగూలి యొక్కింతతడ వొడలెఱుంగక యెట్టకేలకుఁ దెప్పరిల్లి రణఘోషంబు లుడిగించి చింతించుచు సేనాధిపతిని రప్పించి యిట్లనియె.
అయ్యయ్యో? ఎంతమోసము వచ్చినదో సూచితిరా? నేను బ్రమాదవశంబున మనరాజపుత్రికను యుద్ధసమయముల నిందుండవలదని బలత్కారముగా నిన్న నింటికి బంపితిని. దారిలో వైరులువచ్చి యచ్చెలువ సంచలములతోఁగూడాఁ దీసికొనిపోయిఁరట. ఏమి చేయుదురోకదా? బలత్కారముగాఁ జంపక విడుతురా? శత్రువులకు జాలి కలుగునా? నేను పాదుషాగారి సెలవులేనిదే యావాల్గంటి నింటికిం బంపితిని. పంపినను దగుసేస నిచ్చిన నింత ముప్పు వచ్చునా? ఇప్పుడేమిచేయుదును. ఈమాటలువినిన పాదుషా నన్ను శిరచ్ఛేదము చేయక విడుచునా? ఆచిన్నది యాయనకుఁ బంచప్రాణములలో నొక ప్రాణమైయున్నది. ఆమెకోరిక నెట్టిపనియయినఁ జేయించుచున్నాడు. మదీయవంశాంతమునకే నాకిట్టి బుద్దిపుట్టినది. అని దుఃఖించుచున్న మంత్రిని నూరడించుచు దళవాయి యిట్లనియె.
స్వామీ? మీరుపకరించకమే యప్పనిఁ జేసితిరి. మనలఁదట ఘటించి పగతురు రాజపుత్రిక నెత్తుకొని పోయిరి కానిండు. ఇప్పుడు మాకాజ్ఞయిండు. వీఱిపైబడి శత్రువుల మర్దించి స్వామి పుత్రికను వెదకి తీసికొనివత్తుము. మేము మాత్రము శూరులముగామా యని పలికినవిని మంత్రి "అయ్యా! అంతవరకు నన్నెలంతను బ్రతుకనిత్తురా పగ సాధించువారు ప్రియములు సేయుదురా? --------------------. సామముననే కార్యముం జక్కఁ జేసికొనవలయును తొందర వలదు. ప్రస్తుతము సంగరము నిలుపుసేయుడు. రహస్యముగా నరిగి యప్పురిలో తెఱఁగరయ నియమింపుడు. తెలిసికొని వచ్చినవారికిఁ గానుకలను నిప్పింతుమని చెప్పి యప్పుడే యతండా రహస్యసదనమునకుం జని మంత్రులతో నాలోచించుచుండెను.
అచ్చట వీరుండు గూఢచారులవలన లవంగికతంబున యవను లాదివసంబున సంగరము మానుకొనిరను వార్తవిని సంతసముతో గవనుల రక్షించుకొనుచు నుండుఁడని భటుల రణసన్నాహము మానిపించి యమ్మఱునాఁడు సాయంకాలమునఁ దాను బ్రచ్ఛన్నముగా స్త్రీవేషము వైచికొని ద్వారపాలకురకు వీరుని యానతి నరుగుచున్నదాననని యయ్యుత్తరవుఁ జూపి లవంగి యున్న యంతఃపురమునకుం జనియెను. ఆ మేడకు దూరముననెయుండి యందున్న కుందలతిలకను హస్తసంజ్ఞచేఁ జీరి యొకజాబిచ్చి యచ్చెలువ యొద్ద కనిపెను.
అక్కనకగాత్రి యప్పత్రికం జదువుకొని తలయూచుచుఁ గుందలతికతో సఖీ! వీరుని చెల్లెలఁట. మల్లిక యను చిన్నది మనతో ముచ్చటింప వచ్చినదఁట. రమ్మనుట కేమి యాక్షేపణమున్నది? వారు మన గౌరవము నిలిపిరికాని యవమానపఱచినచో నేమి చేయుదుము? ప్రవేశపెట్టుమని పలికిన నప్పనికత్తియ సత్వరంబునం జని యక్కపటవనితం దీసికొనివచ్చినది. రాజపుత్రిక పదియడుగు లెదురు చని యతనిచేయిఁ బట్టుకొని ముద్దువెట్టుకొనుచుఁ దీసికొనివచ్చి యుచితపీఠంబున గూర్చుండబెట్టి యెక్కుడు సత్కారములం గావించినది. పిమ్మట వారిరువురకు నిట్టి సంభాషణములు జరిగినవి.
లవంగి -- మల్లికా! నీ తలిదండ్రులు నీ రూపమునకుఁ దగినపేరు పెట్టిరి. సంతసించితిని. నీ వేకులముఁ బవిత్రముఁ జేసితివి? నీ తండ్రి పేరెయ్యది? ఆ పన్నిమగ్నురాల నగు నన్నుఁజూడ నీ కేమిటికి వేడుకపుట్టినది.
మల్లిక -- నేను బండితభట్టను బ్రాహ్మణుని కూతుఁరను. వీరుఁడు నాకు సోదరుండు. మా గ్రామ మంతటను నిన్నబ్బురముగాఁ జెప్పుకొనుచుండుటచే జూడ వచ్చితిని.
లవంగి - నన్ను మీ యూరిలో నేమని చెప్పుకొనుచున్నారు?
మల్లిక -- విద్యారూపగుణశీలంబుల ననవద్యవని.
లవంగి — కాదు కాదు. హిందువుల పాలిఁటి మారినని చెప్పుకొనియెదరు. కానిమ్ము కుందలతిలకా! వీరుండన ...
కుం - సందియమేల ? మనలఁ చెఱతెచ్చిన యాతండే.
లవంగి - ఓహో? ఆయన సోదరివా నీవు అట్లయిన మాకు మిత్రకోటిలోనే జేరితివి.
మల్లిక - సందేహమేల అందులకేకాదా చూడవచ్చుట.
లవంగి - (నవ్వుచు) మీ యన్నగా ఠెక్కుడు పండితుఁడుగదా? నీవేమేనం జదివితివా? మీలో నాఁడువారు చదువుదురా?
మల్లిక - మాలోఁ బ్రాయము వచ్చువరకే స్త్రీలు విద్యాభ్యాసము చేయుదురు. నేను నంతవఱకు కొంతకొంత చదివితిని.
లవంగి — ఏ విద్యయందుఁ బరిశ్రమచేసితివి ?
మల్లిక - ఇదియదియని చెప్పలేను.
లవంగి - వ్యాకరణ మేమైనం జూచితివా ?
మల్లిక - అదియుం దెలియకపోవలయునా ?
లవంగి - తర్కమో ?
మల్లిక - తర్కము జదివినంతనే యయ్యెనా యేమి ?
లవంగి - వేదమో ?
మల్లిక - బ్రాహ్మణులకు వేదముఁ జదువుటయు నొక యబ్బురమే ?
లవంగి — వేదార్ధ మెఱింగితివా ?
మల్లిక – అర్థము తెలియనిదే వేదము వచ్చునని మాలోఁ జెపుకొనరుగదా. అంగసహితముగాఁ జదివినప్పుడే వేదము తెలియునని చెప్పుకొనవలయును.
లవంగి -- ఈ విద్య లన్నియు నీవు ప్రాయము వచ్చులోపలనే చదివితివా?
మల్లిక - పదఁతీ! ఇట్లడుగుచుంటివేమి? ఈ విద్యలు ప్రాయము వచ్చువఱకుఁ జదువవలయునా? నా బుద్ధిమాంద్యతకుఁ బరిహాసమాడుచుంటివికాబోలు. వినుము. నే నివి ప్రత్యేకముగాఁ జదువలేదు. మా యన్నగారు చదువుచుండ నేనప్పుడప్పుడు విని గ్రహించితిని.
లవంగి - మీ యన్నగా రెన్ని సంవత్సరములు జదివిరి?
మల్లిక - అస్త్రవిద్యాపరిశ్రమయం దెక్కుడు వేడుక కలుగుటచే నతండీ విద్యలఁ బూర్తిచేయుటకు నాలుగైదు సంవత్సరములు పట్టినది. రాత్రులందుమాత్రమే చదువువాడు.
లవంగి -- (కుందలతిలకవంకఁ జూచుచు) సఖీ! ఈమె మాటలు వింటివా? అబ్బురముగాఁ జెప్పుచున్నది.
కుం - నీకీ సందియ మేమిటికి? ప్రశంసించిచూడుము.
మల్లిక – తప్పక ప్రశంసింపవలసినదే. నాకును ముచ్చటగానే యున్నది.
లవంగి - (పదునాలుగు విద్యలలో స్థాలీపులాకన్యాయముగా నడిగి తగు నుత్తరములు వడసి యచ్చెరువందుచు) కుందలతిలకా ? ఈ సుందరి పలుకువెలందియని చెప్పఁదగినదిసుమీ. ఓహో ! మోహనాంగీ! నీవే యింత ప్రోడవై యుంటివి. మీ యన్నగారెంతవాఁడోగదా.
మల్లిక - సుందరీ! నిందా గర్భస్తుతివచనములనే మమ్ము నేమిటి కెత్తి పొడిచెదవు? తురకబిడ్డవై పదునాలుగు విద్యలలోఁ బ్రశంసించిన నిన్ను మెచ్చుకొనవలయునుగాని బ్రాహ్మణులమగు మాకిది స్తుతిహేతువుగాదు సుమీ!
లవంగి - సఖీ! ఆప్తభావంబునం జెప్పుచుంటి; నాకు మొదటినుండియు బాండిత్యమునం దభిలాష మెండుగనుక నిన్నుఁజూచి వేడుకపడితి నింతియకాని నిందయని తలంచుకొనరాదుసుమీ.
మల్లిక - మాటవరుస కట్లంటినిగాన నీ పలుకుల నింద యేమున్నది. మఱియొకటి యడిగెదఁ దప్పుగాదేనిఁ జెప్పుము - యవనకుల సంజాతవగు నీకు హిందూవిద్యయం దభిలాష యేమిటికిఁ గలిగినది. హిందూదేవతల నారాధింప నేమిటికి వచ్చితివి? నీవృత్తాంత మించుక చెప్పుము.
లవంగి – మా తల్లికి నేడ్గురు పుత్రికలు పుట్టి యేడేఁడులు పెరిగి యెనిమిదవయేఁడు చొరబడినతోడనే మృతినొందిరి. ఎనిమిదవమారు నేను గర్భమునఁ బడితిని. అప్పుడు మా తల్లి మిగులఁబరితపించుచు గర్భం జెడఁగొట్టుకొను తలంపుతో నొక పరిచారికను రహస్యముగా నట్టియోషధి యెవరినేని నడిగితెమ్మని పంపినది. ఆ దాదివోయి తా నెఱింగిన యొకబ్రాహ్మణుని దా మందడిగినది.
ఆ విప్రుం దట్టిపని సేయనొల్లక తత్కారణము దెలిసికొని మంత్రాక్షత లిచ్చి సంతానము నిలుచునట్లు చేయగఁలనని శపథముఁజేసెను. ఆ విప్రుని రహస్యముగా నాయంగజాన యంతఃపురమునకుఁ దీసికొనిపోయి మా తల్లి తో నతనిమాటలం జెప్పినది. అప్పుడు మా తల్లి కాసజనించి చేయఁదగినకృత్యములేమని యాపారు నడిగినది. ఆయన మంత్రాక్షతలిచ్చి హిందూమతానుసారము గాఁ బిల్లపుట్టినదిమొదలు దేవాలయములలో నుత్సవములు చేయించుచు జపములు మంత్రములు బ్రాహ్మణుల చేతఁ జేయించుచుండవలయును. హిందూవిద్యయే చెప్పించుచుండవలయు నట్లయిన నీ పుత్రిక బ్రతుకునని చెప్పెను.
ఆ మాటలన్నియు మా తండ్రి కెఱిఁగించి యట్లు చేయుటకు సమ్మతించినది. పిమ్మట నేను జనించితిని. పుట్టిన పదిదినములలో జాతకర్మాద్యుత్సవములుజేసి బ్రాహ్మణ గృహమందే నన్నుఁ బెనుప నియోగించెను. ఏడేండ్లు వెళ్ళువఱకు నన్ను మా తల్లిదండ్రులు కన్నెత్తిచూడలేదు. హిందూవిద్యలే చదువుకొనుచుంటిని. గండము గడచిన పిమ్మట బ్రాహ్మణుల కనేకదానధర్మములు గావించి వేదశాస్త్రములే నాకుఁ జెప్పించిరి. దానంజేసి నేనావిద్యల జదివితిని. ఆ విద్యలే ప్రియమైనవి. కాశీమహిమ నీ నడుమఁ జదివితిని. తత్ప్రభావము భావమున కామోదము గలుగఁజేయు నీ ప్రయాణ సన్నాహంబుఁ గావించితినని తన వృత్తాంతమంతయు జెప్పినది.
ఆ మాటలు విని యతండు వెఱఁగుపడుచుఁ తరుణీ! నీ చరిత్రము మా యన్న చరిత్రమును బోలియున్నది. అతనికిని నీకును బూర్వజన్మ సంబంధ మెద్దియేనిఁ గలిగియున్నదేమోకదా? యని యా వృత్తాంత మంతయుం జెప్పెను.
అప్పుడు లవంగి “మల్లికా! దానంజేసియే కాబోలు మీ యన్న పేరు వినినంత నాకు మనంబున నెద్దియో యానందము గలుగుచుండును. ప్రీతికి నుపాధువులు కావుసుమీ. ఇప్పుడు మీ యన్న యెక్కుడువానితోఁ దగనిపగఁ దెచ్చి పెట్టుకొనియెను. అదియునుంగాక నన్నుఁ జెఱబట్టినవార్త వినినంత మా తండ్రి వుడమి నిలువనిచ్చునా? ఆయనకుఁ బాండిత్యము చాలదా? పాఱలకుఁ బౌరుష మేమిటికి? ఇప్పటికైనం దప్పించుకొనిపోయిన నొప్పిదముగా నుండును. నీ కంఠధ్వని మీ యన్న కంఠధ్వని యొక్కటేసుమీ" యని పలికిస విని యక్కలికి యిట్లనియె. 'బోటీ యీ మాటయే పలుమారు మా తండ్రి వీరునితోఁ జెప్పుచుండును. వాఁడువినక సంగరాభిలాషియై యున్నవాడు. ఏమిచేయుదుము. నీవనిన వాని కిష్టమే సుమీ! మొన్న మాటల ధోరణిని గహించితి' ననుటయు నయ్యువతి మఱల నిట్లనియె.
“వనితా! నామాట యతం డేమిటికిఁ దెచ్చెను? నాయందిష్టమని యెట్లు గ్రహించితివి? నిజముగా నప్పు డేమిప్రశంస వచ్చినదో చెప్పు" మని యడిగిన నవ్వుచు నతం డవ్వనిత కిట్లనియె. కాంతా అంతగా నడుగుచుంటివేల? మఱియేమియును లేదు. ఈముప్పునకు హేతుభూతురాలవని నిన్నెవరో నిందించిరి. అందుల కతండు సమ్మతింపక నీపాండిత్యమును గుఱించి భూషించుచు నీతండ్రిని దూషించెను. నీరూప మా సేచనకమని యెద్దియో ప్రశంసలమీఁదఁ గొనియాడెను. ప్రొద్దుపోయినది. ఇఁక నేను బోయివత్తు ననుజ్ఞ యిత్తువా' యని యడిగిన నచ్చేడియ యిట్లనియె.
'బోటీ! నీమాటలచే నాదుఃఖము మఱచిపోయితిని. చెఱదెచ్చియు నవమానపఱుపక గౌరవముగాఁ గాపాడుచుండెడు మీయన్న కనేక నమస్కారములని చెప్పుము. ఈపగ విడచి మైత్రిగలిగి వర్తింపుమనియు నీయాపద దాటించుకొను తెరు వరసియుండుమనియు నుడువుము. దయజూచుచుండుమని పెక్కుమాటలు సెప్పి యరుగునప్పుడు మల్లికయే వీరుడను సందియము గలిగి యది కులాచారమని తెలుపుచు నచ్చెలువ యతని చెక్కుల ముద్దుపెట్టుకొనినది. అతండు తత్స్పర్శసుఖంబున మేను పరవశముజెంద నాసుందరి వా తెరుపుడికి వగలాడి తనంబున జిట్టకంబులు గావించిన నదరుచు నమ్మందగమున యతని నట్టెచూచుచు 'నిట్టి చిట్టకము లాఁడువాం డ్రాఁడువాండ్రయెడఁ గనఁబఱతురా? పండితుని చెల్లెలవు కాబట్టియా నీవలన వింతలం గంటినని యుల్లసమాడుటయు నది తమ కులాచారమగుటఁ జేయనయ్యె నీచేతలుమాత్రము విపరీతములు కావా' యని యుత్తరము జెప్పెను. పిమ్మటనతం డతివా! ప్రొద్దుపోయినది. నేను వచ్చి పెద్దతడవైనది. నీ మాటలతీపునకుఁ జొక్కి యొడలెఱుంగ నైతిని. పోయివత్తు నాజ్ఞయిమ్మని పలికిన నక్కలికి మేమనవలసినమాట నీవనుచుంటివి. కానిమ్ము. వెండియుఁ దర్శనమియ్యఁ గోరుచున్నదాన. మీ యన్నగారితోఁ దగని పగ పెట్టుకొనవలదని పలుమఱు బోధింపుము. బంధనంబునకు వెఱచి చెప్పిన మాటగాఁ దలంపవలదు తమ మేలుకొఱకే చెప్పితిని. ఈ ముప్పు దాటినచొ మా తండ్రితోఁ జెప్పి యాయనను నాయొద్ద బండితునిగా నుంచుకొనగలను. నిన్నుఁ జూచినదిమొదలు నాకట్టితలంపు గలుగుచున్నదని యనేక ప్రియాలాపములు పలికి యంపినది
అతం డరిగినవెనుక లవంగి కొంతతడ నాదెసం జూచుచు మిన్ను వంక మొగంబై యెద్దియో యాలోచించుచుండెను అప్పుడు కుందలతిలక 'సఖీ! మాటాడక యూరక యెద్దియో ధ్యానించుచుంటిని. ఆ విషయము మా కెరింగింపరాదా' యని యడిగిన నప్పఁడతి నిట్టూర్పు నిగుడించుచు, 'ఎందుబోయితివి? మల్లిక యెవరో యెఱుందువ? ఏమిచేసినదో చూచితివా' యని పలికిన నది యిట్లనియె. 'అట్లడిగెదవేల? మల్లిక వీరునిచెల్లెలని చెప్పినదికాదా! ఏమిచేసిపోయినది? మీరెద్దియో రహస్యములు మాటాడుదురని దూరముగాఁ బోయితిమి. ఏమిజరిగినదో చెప్పు' మని యడిగిన నవ్వనిత వీరుండే యీవేషము వైచుకొని వచ్చెను. నేను మొదట గ్రహింపలేక పోయితిని. చెల్లెలు గనుక పోలిక వచ్చినదనుకొంటిని. వెళ్ళబోవు సమయమున తెలిసినది. అతండప్పుడు పురుషచర్యలం గావించెనని చెప్పినది. కుందలతిలక అయ్యో! ఇంచుక నాకు శూచింతివేని గుట్టు బయల్పెట్టక పోవుదునా? ఎంతపని చేసితివి? దూరముగానుండి యెన్నియో చెప్పితివే? మఱి యప్పు డేమిచేసితివని యడిగిన లవంగి నాకు వణఁకు వచ్చినది. దానంజేసి యేమాటయు వచ్చినదికాదు. ఏమాట పలుకుటకును దోచినది కాదు. ఒకటిచెప్పఁబోయి యొకటి చెప్పితిని సీ! యీ సిగ్గు నన్నగపఱచుకొనినది. ఎఱుంగనట్లే మాటాడితిని కాని చేయిపట్టుకొని నీవిట్టిరూపమున వచ్చి మమ్ము వంచింతువా యని యడిగిననేమి చెప్పునో, తెలిసిన పిమ్మటి నేమి చేయునో వానికి నామనసు తెలియకపోవుటచే నన్నిపోకలం బోయెను.
అప్పుడైన స్పష్టపఱచితినా? వెఱ్రిమాటలం జెప్పితినని పాశ్చాత్తాపముఁ జెందుచున్న యారాజపుత్రిక నూరడించుచు సఖురాండ్రిట్లనిరి. 'బోటీ! యిప్పుడు మించినదేమియును లేదు. తిరుగా దెల్లవారదా? అతండు నీయందు బద్ధానురాగుండైనట్లు తెల్లమైనదికదా? ఇఁకముందు మదను డే యదను జెప్పెను. విచారింపకు "మని పలికిరి. ఆరాత్రి యంతయు నక్కాంత యతని మాటలు చూపులు చేతలు తలంచుకొనుచు నిద్రబోయినదికాదు.
అంత మఱునాడు ఫకీరులు యవనసేనావిశేషములం దెలిసికొని వచ్చి వీరునితో రహస్యముగా నిట్లనిరి. "అప్పా! నీశౌర్యము మిగులఁ గొనియాడఁదగియున్నది. రాజపుత్రికనే చెఱదెచ్చితివఁట. ఎంతమోసమోకదా? మంత్రి యిప్పుడు మిగుల విచారించుచున్నాఁడు. నీవు మాకుఁ బరిచితుఁడవని యెఱుఁగడు. ఆమెను జంపుదురని వెఱచుచున్నాఁడు. పాదుషాగారి యానతిలేనిదే యింటికిఁ బయనముఁ జేయించెనఁట. ఈవార్తవిని పాదుషా యతనికి శిరచ్ఛేదము చేయించునని యడలుచున్నాడు. సంధి కిదియే సమయము. ఆ రాజపుత్రికను జీవములతోఁ దనకిచ్చెనేని మన మనిన నిబంధ నములకు సమ్మతించుననియె. ఈమాటలు మాతోఁ జెప్పఁగాఁ దెలిసికొనివత్తుమని చెప్పి వచ్చితిమి. ఎట్లయిన మన మురగమును జేతితో ముట్టరాదు. లవంగిని దీసికొనిపోయి యప్పగింపుము. మంత్రితో మాటాడవలసిన మాటలం జెప్పుము అడిగివత్తు" మని పలుకఁగా వీరుఁ డిట్లనియె. “సాములారా? మీరు పలుమాఱిట్లు బొధించుచుండ వినకునికి కృతఘ్నతగానుండును. ఫాదుషాభయము నా కించుకయును లేదు. రానిండు మీయానతి చొప్పుననే కావించెదను. ఎన్నఁడును గాశీపురముమీఁద దండెత్తకుండుటకు హిందూదైవముల నిందింపకుండుటకును బ్రమాణపత్రికవ్రాసి యిమ్మనుఁడు. ఈతప్పుఁ గావుఁడని కోరికొనుమనుడు అట్లైన లవంగి నప్పగింతుఁ గానిచోఁ బైనవిచారింతు" నని పలికెను.
ఆ మాటలు విని ఫకీరులు వజీరునొద్ద కరిగి "సామీ! మేము హిందువుల యొద్ద కరిగి సంధిమాటలం జెప్పితిమి. లవంగిని దుర్దశకు బలియిచ్చుటకు సిద్ధముగా నున్నారు ఎక్కడ దాచిరో తెలియదు. కార్యము మిగిలిన నేమి చేయఁగలము. అం దొకరి యధికారము లేదు. అందరు నధిపతులే. వారినందఱు బ్రతిమాలుకొని యెట్టకేలకు రెండుగడియలు మితిఁగోరికొని వచ్చితిమి. వారు కోరిన నిబంధనలకు సమ్మతించితిమి. శీఘ్రమ వ్రాసి యిమ్ము పోవలయు" నని పలకిన విని యతండెటులయిన లవంగి వచ్చినంజాలునని వారు చెప్పినట్లు వ్రాసి వారిచేతికే యాపత్రిక నిచ్చెను.
ఫకీరు లాపత్రికం దీసికొనిపోయి పౌరులందఱం బిలిచి సభఁజేసి పేరోలగంబున నాపత్రికం జదివిరి. హిందువులందరు వీరునిసామర్ధ్యమును వేనోళ్ళఁబొగడుచుఁ బూవులచే నతనిఁబూజించిరి. ఆపత్రికం గైకొని వీరుఁడు రాజపుత్రిక నప్పుడే యాందోలిక మెక్కించి మేళతాళములతో హుస్సేనుబాదుకోటలోనికి నంపించెను. ఆమెరాకఁజూచి మంత్రి దన్నుఁ బునర్జీవితునిగా దలంచుకొనుచు వీరభటుల యుద్ధవిముఖులఁ గావించి ప్రయాణోన్ముఖుండైయున్న సమయంబున పాదుషాగారియొద్దనుండి మఱియొకజాబు వచ్చినది. ఆ పత్రికవిప్పి చదివిన నిట్లున్నది. వజీరునకు ఫాదుషా చక్రవర్తి నిరూపించిన యాజ్ఞ యేమనఁగా నీవు మాయానతిలేనిదే ప్రాణసమయగు లవంగి నిచ్చటికిఁ బయనముచేయుట యపరాధమైయున్నది. పంపితివిపో, తగిన సేనలసహాయముగా నియ్యక చిడుగుదళముతోఁ బంపుట రెండవతప్పు. హిందువు లామెం దీసికొని పోయినపిమ్మట నేమి చేసినది వ్రాయకపోవుట మూడవతప్పు. ఈ యపరాధత్రయమునకు నిన్నుఁ బ్రస్తుత ముద్యోగము నుండి తప్పించితిమి. నీసమాధానము వినిన పిమ్మట ననుగుణంబగు శిక్ష విధింపఁబడును. మే మెద్దానికోరికఁ దీరుప నెంతసన్నాహముగావింతుము. యట్టిపట్టి జఱపట్టిన శత్రువులపాలుసేయుమే సకలసైన్యముతో మాపటికి వచ్చుచున్నాము. హిందువుల నాబాలవృద్ధముగా జెఱనిడవలెనని చెప్పుము. పెక్కేటికి నప్పట్టణం బంతయు నీటంగలపెదననియున్న యుత్తరవుఁ జదివి కొని యామంత్రి దుఃఖించుచు నా పత్రికను రాజపుత్రిక యొద్ద కనిపి తన కుపకారము చేయుమని వేడుకొనియెను.
దయాహృదయమగు రాజపుత్రిక యా పత్రికను జదివికొని జాలిపడుచు నోపినంతయుపకారముఁ జేయుదుమని ప్రత్యుత్తరమువ్రాసి యూరడించినది. అమ్మరునాఁటి వుదయమునకు ఫాదుషాచక్రవర్తి అరబ్బులు సిద్దులు రోహిలాలు లోనగు యవన సేనావిశేషులు భజియింపఁ బటహభేరీశంఖాదిఘోషంబుల నాకాశంబు బీటలువారఁ బారావారంబులు మేరమీఱి ధారుణీతలం బాక్రమించుచున్నట్లు పటురయంబున బాహువాహినులతో నక్కోటనికటంబున కరుదెంచెను. అప్పుడు వజీరుసేనానాయకుఁడు లోనగువా రెదురేగి లవంగి సురక్షితయై కోటలోనున్నదని చెప్పిరి. ఆ మాటలువిని యతం డించుక యలుకడించి హృదయము సంచలింప సరగ నరిగి పుత్రికం గలసికొని మాటాడెను. యవనులలో జవకాండ్రు తండ్రితో సయితము ప్రత్యక్షముగా మాటాడరు. లవంగి తెరమఱుగున నుండియే తండ్రి కుత్తరము జెప్పినది. వీరునియందుగల మక్కువచే నక్కలికి యతం డడుగమిఁ దనబంధనవృత్తాంత మించుకయుం జెప్పినది కాదు. భూపతుల చిత్తములు పరాయత్తములుగదా? అంతలోనే యతం డాకథ మఱచి వీరభటుల ప్రోత్సాహమున మరునాఁ డుదయకాలంబున యుద్ధము చేయుట కాజ్ఞ యిచ్చెను.
అంతకుఁ బూర్వమే ఫకీరులవలనఁ జక్రవర్తి యుద్యమము దెలిసికొని వీరుఁడు తన బలంబులఁ బోరున కాయితముఁ జేసికొని యుంచెను. మఱునాఁ డుదయకాలంబున యవనభటులు నేల యీనినట్లు భూమియంతయు నిండి కాశీపురాభిముఖముగా నడువఁజొచ్చిరి. యవనుల ప్రయాణ సన్నాహంబు విని వీరుండును రణభేరిం గొట్టించుచుఁ దమ దళంబుల యవనసేన కెదురుగా నడిపించెను. వీరుండు పలువిధములగు నాయుధముల ధరించి తురగమెక్కి తనసేనచుట్టును దిరుగుచు నెక్కడజూచినను తానయై విజృంభించి యవనసేనను గాశీపురము దాపునకు రాకుండఁ గ్రోశదూరము తఱిమెను. యవనసేనాపతి తన సేన వెనుకఁదిరుగుటజూచి యోధులం బురికొలుపుచు దిరుగా హిందూసైన్యముల నెదురుకొనఁజేసెను. అప్పుడా యుభయ సైన్యములకు ఘోరంబుగ యుద్ధము జరిగినది. వీరుడు డందఱి కన్నిరూపులై సాయంకాలమునకు యవనసేనను హుస్సేన్‌బాదుకోట దాపులకు గెంటుకొనిపోయెను.
హిందూసైన్యములో విజయనాదంబులు మేదురంబులై యొప్పినవి. వీరుఁడట్లు తురకదళములం దరిమికొనిబోయి సాయంకాలమైనంత నంతటితోఁ బోరుచాలించి తనబలముల గ్రమ్మఱఁ గాశీపురి దాపునకుం దీసికొనిపోయి వ్యూహములోఁ జేర్చెను. ఆ వార్తవిని ఫాదుషాచక్రవర్తి తన సేనాధిపతుల నాక్షేపించుచు మఱునాఁటి యుద్దములోఁ గ్రొత్తవారి నియమించి నిలిచియున్న సైన్యములన్నియు నొక్కసారి మీఁద బడి పోరునట్లాజ్ఞాపించెను. క్రొత్తగా సేనాధిపత్యము వహించిన యరబ్బీసేనాని బావికం బునఁ దమసేన రెండు తెగలగాఁ జేసికొని కాశీపురి కుత్తరదక్షణభాగంబుల నాక్రమింప నడిపింపఁ జొచ్చిరి అత్తెఱ గరసి వీరుండు రౌద్రావేశముతోఁ దనదళముల నుత్తరముగా వచ్చు బలమున కడ్డముగాఁ బోవనియమించి తాను దక్షిణభాగంబునంగల వాహినులకడ్డమై చిత్రయుద్దంబుఁ గావించి యాబలము నెల్లఁ దృటికాలములోఁ బీనుగుపెంటలు గావించెను.
ఇంతలో నుత్తరదిశ కరిగిన యవనసైన్యము హిందూబలంబుల మీఱి పార దోలి మేరమీఱిన కడలివలె నగరిలోఁ బ్రవేశించి వ్యూహంబులఁ బటాపంచలు గావింపఁ దొడఁగెను. అప్పుడు వీరుండు పౌరుషమే పారం బారిపోవుచున్న తనబలమున కుత్సాహముఁ గలిగించుచు రెండవపెడ కరిగి వ్యూహముల భేదించు యవనసైన్యముల లేళ్ళగముల బెబ్బులిపోలికఁ గోటనికటంబువఱకుఁ దఱిమివచ్చి తన వ్యూహంబుల యథాగతి గవనులు నిలువఁజేసెను.
ఆరాత్రి యవనసేనానాయకు లెల్ల నొక్కచోఁ జేరి వీరుండు తురగమెక్కి సంగరము చేయుచుండఁ బుడమియంతయు నేకమైవచ్చినను వాని గెలువలేదు. వానిఁ గుఱ్ఱమునుండి నేలంబడు నుపాయమరయవలయు. ఇప్పని రోహిలాలు సేయ నోపుదురు. వారు తఱచు నుచ్చుత్రాళ్ళతోఁ బోరుసేయుదును గదా. ఆ త్రాళ్ళు రణభూమి నెడనెడఁ గట్టంచినచోఁ బాదంబులకుం దగిలికొని తురగంబు నేలంగూలఁ గలదు. దానంజేసి యతండు పట్టికొన సాధ్యుండగు నిదియే యుపాయ మంతకన్న వేఱొక సాధనంబునఁ గార్యంబు కొనసాగదని యాలోచించి రోహిలాలకు మఱునాటియుద్ధములో నట్లుచేయ నియమించిరి.
రోహిలా లారాత్రియే యుద్దభూమిలో నందందు శంకులుపాతి వానికుచ్చు త్రాళ్ళంగట్టి కాచుచుండిరి. ఆ దినమున ఫకీరులు యవనసేనలోనికి వచ్చుటకు సమయము దొరికినదికాదు. కావున నా రహస్యము వీరికిం దెలిసినదికాదు. మూడవనాఁడు ప్రాతఃకాలంబున యవన సేనానాయకులు తమసేనల నెల్ల నొక్క గుమిగా నడిపించుచుఁ గాశీపురంబు నడిభాగముపైఁ బడఁదలచుకొనిరి. అంతలో వీరుండు బలములతో వారి నెదిరించెను. ఇరుబలములకు ఘోరయుద్ధము జరిగినది. పురుషకారము దైవమును మీఱలేదుగదా? ఇంతలో వీరుం డతివేగంబున వాఱువమును నడిపించుచుఁ బరబలంబుల మర్దించుచుండ నొకచోట నాఘోటకము పాదమున కొకయురిత్రాడు తగిలికొనినది. దానంజేసి యది నేలవ్రాలినంత నతం దావిసురునఁ బదిబారల దూరమునఁ బుడమిం బడియెను.
అప్పుడా ప్రాంతమందుఁ గాచియున్న యవనసేనులు తటాలున వానింబట్టుకొని యాయుధంబులు లాగికొని గొలుసులతో బంధించి ------------మును హిందూబలంబులపైఁబడి భందనంబుగావించి-------. హిందూబలంబు లప్పుడు నియంతలేని తురంగములభంగిఁ దురకలరాయిడి కోడి చెల్లా చెదరై యరణ్యమార్గంబులంబట్టి పారిపోయెను. అంతలోఁ జీఁకటిపడుటయు యవనులు నాటిదివసంబునఁ గాశీపురంబునం బ్రవేశింపక మఱునాఁ డవ్వీడు దో పెట్టందలంచి యంతటితో మఱలి సేనానివేశమునకుఁ జనిరి. కాశీపురంబునందలి వీరుండు పట్టు పడుటయు బలంబులు పారిపోవుటయుం బరబలంబు మఱుఁనాడు వీడుచొరఁబడి యల్లరి సేయదలంచుటయుం దెలిసికొని పలుదెఱఁగుల జింతించుచు దేవాలయంబులు మూయించి సొమ్ముల దాచికొని గృహంబులకుఁ దాళములువైచి యారాత్రిఁ బెక్కండ్రు గంగానదిందాటి యాసన్నగ్రామం బులకుంజనిరి. పండితభట్టు పుత్రుండు శత్రువులచేఁ బట్టుబడుట విని యడలుచు మరణకృతనిశ్చయుడై యూరుకొనలేక కొందఱ వీరభటుల సహాయులగాఁ దీసికొని యవన సేనానివేశ ప్రాంతమునకుంజని యందందు సంచరించుచు వీరు నేమిచేసిరోయని యరయుచుండెను.
లవంగి ప్రతిదినము యుద్ధవిశేషములఁ దెలిసికొనుచున్నది. కావున వీరుండు బందీగృహమునఁ బెట్టబడుటవిని పరితపించుచుఁ గుందలతిలకతో నిట్లనియె. 'పొలఁతీ? అతండు మనము చెఱసాల నున్నప్పు డెట్టియుపచారములఁ గావించెనో జ్ఞాపకమున్నదా? దానికిఁ బ్రతిచేయ సమయమువచ్చినది. కారాగృహం బెచ్చట నున్నదో యరసి రాత్రి యెట్లయిన వాని బంధవిముక్తుం జేయవలయును. ద్వారపాలుర వంచించి దాటింపుము. అతం డెందుండునో చూచిరమ్ము తరువాత కృత్యముల నాలోచింత' మని పలికిన నవ్వనిత యిట్లనియెను. 'సఖీ! నేనదియంతయు నింతకు ముందే చూచివచ్చితిని. మనమేడ క్రిందిగదిలోనే యతని నునిచిరి. ఆ గుమ్మములో నెవ్వరును లేరు తాళము వైచిరి. సింహద్వారమందే వీరభటులు కావలియుండిరి. కోటచుట్టును సైన్యములున్నవి. ఇప్పుడు మన మా తాళము విడగొట్టి వానిందీసికొని రావలయు నీ సెలవుకొరకే యపేక్షించియుంటి' మనుటయు నక్కుటిలాలక కటకటం బడి "అయ్యో ? ఆలస్యముఁ జేసెదరేల వడిగాఁబోయి తీసుకొనిరండు పాప మాపుణ్యాత్ముండు చీఁకటిగదిలో నెంత చింతించుచుండునో గదా" యని పలికి వారి నంపినది.
అయ్యంగజాన లిరువురును నినుపగుదియలగొని మెల్లన నచ్చటి కరిగి బీగము బడఁగొట్టి దీపము చేతఁబూని యల్లన నాగదిలో'నికిఁ జనిరి. అందుఁ గన్నుల మూసికొని విశ్వేశ్వరు హృదయ సన్నిహితుం జేసికొని “స్వామీ! నేను మీ నిమిత్త మీ తురకలతో బోరాడితిని. నా విషయమై యించుకయుఁ గనికరములేక యీ బందీగృహంబునం పెట్టింతు ఇంత కృతఘ్నుడవని యెరుంగకపోయితినే? జనులందరు నన్నుఁ దురకలకు లొంగుటకు సమ్మతింప నేనొక్కడుంగాదే వలదని యింతగొడవ దెచ్చుకొంటిని. నీవు నాకు సహాయముఁ జేయకపోదువా? యని యంత్వర్యముగాఁ బులిమీసముల నుయ్యలలూగఁ బ్రయత్నించితిని. నీ దయాళుత్వము తెల్లమైనది. ఇఁక మరియొకదారి జూచుకొనవచ్చును' నని యనేక ప్రకారముం దలపోయుచుఁ దలుపులు తీసినచప్పుడు విని తెప్పున గన్నులఁ దెఱచిచూచెను. అప్పుడు లవంగి చెలికత్తియలు వచ్చుచుండుట దీపము వెలుఁగునఁ దెలిసికొని యట్టె నిలువంబడెను. ఆ యువతులతనికి నమస్కరించుచు నార్యా ! మేము లవంగి చెలికత్తెలము. ఆ చిన్నది మీ యాపద విని మిక్కిలి పరితపించుచు మమ్ము మీ యొద్దకుఁ బుత్తెంచినది. తదీయాంతఃపురంబునకుఁ బోదమురండు అని సవినయముగాఁ బ్రార్దించిన సంతసించుచు నవ్వి ప్రకుమారుండు వారివెంట లవంగియున్న మేడకుం జనియెను.
అట్లాకాంత లిరువురు నేకాంతముగా నతని నంతపురమునకుఁ దీసికొని పోయి యందుఁ దత్సమయోచితమైన యాహారమున సంతృప్తునిం గావించి యొక సుందరమందిరాంతమున నమరించియుంచిన తల్పంబునం గూర్చుండఁబెట్టి తగు నుపచారములం గావించుచుండిరి.
అప్పుడు వీరుఁడు తన యునికికి విస్మయము జెందుచు “నాహా! భక్తపరవశుండగు పరమేశ్వరుని యనుగ్రహమునకు మేఱలేదుగదా? ఇంతదనుక దయావిహీనుండని యా మహాత్ము నిందించితిని. అయ్యారే ఎట్లు సంఘటించెనోకదా? బాపురే! చీమకైన దూరశక్యముగాని యీ యవనాంతఃపుర మెక్కడ? బందీగృహంబున నుండిన నేనెక్కడ? భళి భళి? చోద్యముగానున్నదని యీశ్వరవిలాసముల వేతెఱంగులఁ దలంచుచు నాచేడియల కిట్లనియె. సుందరులారా? నాయందు మీ రాజపుత్రిక కింతయక్కటిక మేలకలిగినది? నిష్కారణవాత్సల్యురాలగు నప్పుణ్యాత్మురాలిం జూడ వేడుకయగుచున్నది. ఎందున్న" దని యడిగిన నాప్రోడలు "ఆర్యా! ఇదిగో నమ్ముదిత నామరుంగున నిలువంబడినది. సిగ్గున మీ యెదుటకు రాకున్నది. ఆమెకు మీరు చేసిన యుపచారములకిది యొక సరియా అదిమొదలు సంతతము మీ మాటయే చెప్పుచుండును. మిమ్మే పొగడుచుండును. మీ గోష్ఠియే చేయుచుండును. మిమ్ము జూడవలయునని యెంతో కోరికతో నున్నది. దైవ మీ కారణమున సమకూర్చెనని సంతసించుచున్నది" అని పలుకుచు 'సఖీ! ఇటురా దాగెదవేల? నీ తలచిన కార్యముఁ జేసి కృతజ్ఞతఁ జూపించుకొను' మని పలికిరి అప్పుడు పుష్పమాలికను హస్తంబునం బూని యించుక తలవాల్చి యల్లన గదిలోనికివచ్చి తల్పముదాపున నిలువంబడినది. తదీయ రూపాతిశయమునకు వీరుండు ధైర్యము చలింప మోహపరవశుండై యదియొక యింద్రజాలముగాఁ దలచుచుండెను. అప్పుడు కుందలతిలక "ఆర్యా! మా రాజపుత్రిక యీ పుష్పమాలికఁ దమ కంఠమునవైచి కృతజ్ఞతఁ దెలుప వలయునని యభిలాషఁ గలిగియున్నది వేఱొకలాగునఁ దలంపకుడు." యని పలికిన నతండు గద్గదస్వరముతో “నోహో! తఱచు మీ రామాటయే చెప్పుచున్నారు. మీ సఖురాలికి నేనేమియుం జేయలేదు. ఇప్పుడు నాకామె చేసిన యుపకృతి వేయిజన్మంబు లెత్తియైనఁ బ్రతిఁజేయలేను. నేననవలసినమాట మీరనుచున్నా" రని పలికెను.
ఆ మాటవిని కుందలతిలక "ఆర్యా ! మీ యిరువురకుఁ గృతజ్ఞతాగుణము సమముగానే యున్నది. కావున నామెయభిలాషఁ దీర్చుకొనిన తరువాత మీ కేది ప్రియమో యది కావింపుడు అదియు మాకుఁ బ్రయమే" యని పలికి యక్కలికిని బట్టుకొని బలాత్కారంబునంబోలె నక్కుసుదామం బతనిగళంబున వైపించినది. ఇంతలో సంగీత చంద్రిక వేఱొకమాలిక తీసికొనివచ్చి యతనికందిచ్చుచు ఆర్యా! మీ యభిలాష మాత్రమేల తీరకపోవలమును. దీనికిఁబ్రతి మీరును చేయవలసినదే" యని పలికి యక్కలికి మెడవంచి యతనిచేత నా మాలిక వైపించినది. అన్నన్నా! దాని నియమ మెందుబోయెనో పాండిత్య మేడదాగెనో? దైర్యమెందు మడిసెనో? తన వృత్తాంత మంతయును మఱచి యతండు బాలురచేతి లేడిపిల్లవలె నయ్యంగజాన లెట్లుచెప్పిన నట్లుచేయుచు నంగజాస్త్రభగ్నహృదయుఁడై యితర మెరుఁగక తన్మయత్వమునొందెను. అట్లు వారిరువురంగలిపి యా పరిచారిక లెద్దియో నెపంబు వెట్టికొని యవ్వలికింజనిరి. పిమ్మట వీరుం దపార మోహావేశముతో దదీయపురుషార్థమున గృతార్థుడయ్యెను.
అప్పుడామె వివశయై సొమ్మసిల్లి యప్పల్లవపాణి యా బ్రాహ్మణకుమారుని యురంబున శిరంబిడుకొని గాఢనిద్రావశంవదయయ్యె. నప్పుడు నిద్రబోవక యా వీరుఁడు మోహంబుబాసి యాత్మీయప్రమాదంబుఁ దెలిసికొని యిట్లని తలంచెను. కట్టా! నేనెట్టి పనిఁజేసితి. తురకపట్టి గట్టువిల్తులింగమును ముట్టునని పారులనెల్లఁ గట్టడిచేసి సేనలసమకట్టి బెట్టితనంబుఁజూపి పట్టుపడి తుట్టతుదకుఁ గులము జెడఁగొట్టు కొంటిని. సీ! నా వంటికట్టడి యెందైనం గలదా? అయ్యో! నా పౌరుషమునమ్మి పోరు లెల్లరు వలదని వైరము దెచ్చికొని యిప్పుడెట్టి యిడుమలంబడుచుండిరో. అట్టివారల మఱచి నేనిక్కడఁ బెండ్లి కొడుకనై సుఖియింపఁబూనితిని. ఇస్పిరో! నేను పరమ ద్రోహినైతి. అన్నన్నా? నా వివేకమంతయు దృటిలో బటాపంచలై పోయినదే? అని యనేక ప్రకారములఁ బశ్చాత్తాపము జెందుచు గానిమ్ము. కర్మసూత్ర మెవ్వడు నతిక్రమింపలేడుగదా? దీనిమాట తరువాత విచారించుకొనియెద ఇప్పు డంతఃపురరహస్యములన్నియు నీ చిన్నది నాకు చెప్పినదిగదా? దీనికి తెలియకుండ లేచి పాదుషాగారి మేడకుఁ బోయి యా యింతి చెప్పిన యాద్రావకవిశేషము నతని నాసావివరముననుంచినచో వివశుండగు. నప్పడతని నెత్తికొని గుప్తమార్గంబున నరిగి చెఱబెట్టితినేని నాబంధనము సఫలమగునని నిశ్చయించి మెల్లన నప్పల్లవాధరిశిరము తల్పంబుననిడి సడిగాకుండ జక్రవర్తియొద్ద కరిగి యోషధీవిశేషమున మత్తుగలుగఁజేసి యతని నెత్తుకొని యధికసత్వమున సత్వరముగ గుప్తమార్గంబునంబడి హిడింబారియుం బోలె నవలీలఁ గాశీపురంబునకుం బోయెను. లవంగియు మరునాఁ డరుణోదయంబున మేల్కొని సెజ్జ నజ్జగన్మోహనుంగానక నలుమూలలుజూచి వెఱగుపడుచు నది యొకకలగాఁ దలఁచి మఱియు నదివచ్చునిచ్చనుఁ గన్నులు మూసికొనినది.
ఇంతలో నా చెలికత్తెయ లచ్చటికివచ్చి తొంగిచూచుచు నా వాల్గంటి నొంటి యైనుంట బరికించి లోనికింజని “యింతీ! ఇదియేమి వింత. ప్రొద్దెక్కినది యెరుంగవా? లెమ్ము లెమ్ము. మనోహరుండేమయ్యె " ననియడిగిన నత్తెఱవ కన్నులు దెరువకయే “ఇంచుఁబోణులారా! ఇంచుక సేపు తాళుఁడు. నాకు మంచి స్వప్నసము వచ్చినది మఱల దానికొరకే నిరీక్షించుచుంటి" నని పలికిన నా జవ్వనులు నవ్వుచు నిట్లనిరి. "అయ్యో! పట్టపగలు వచ్చిన స్వప్నములు పూర్ణఫలము నీయఁజాలవు. మరల నాకల రాత్రి వచ్చునులే ఆ తెరం గెద్దియో మా కెఱింగింపు విని సంతసింతు" మనుటయు నక్కుటిలాలక యరగనుమోడ్పుతో వారిట్లనియె. సఖులారా! మదీయమానసచోరుం డావీరుం డాయువతీమన్మథుండు విద్యాసాగరుం డాకుసుమకుమారుం డావిప్రకుమారుండు మనవారలచే సంగరరంగంబునఁ బట్టువడి కారాగారంబునఁ బెట్టఁబడెను. అప్పుడు మీ యిరువురుంబోయి తాళము విడఁగొట్టి యచ్చతురు నిశ్చటికిం దీసికొనివచ్చి యీ తల్పంబునం గూర్చుండఁ బెట్టిరఁట.
తరువాత నేను జక్కఁగా నలంకరించుకొని మించినవేడుకతోఁ గుసుమ దామముగైకొని యల్లనల్లన వానిదరికరిగి యామాలికహృదయమర్పించుపోలిక వాని మెడలోవైచితిని. పిమ్మట నీసంగీతచంద్రిక వచ్చి మరియొక దండతెచ్చి వానికందిచ్చినది. అతండు చిరునవ్వుతో దాని నామెడలో వైచెను. పిమ్మట మీరరిగిరి అతండాపైనఁగావించిన చర్యను అబ్బా! నేను వక్కాణించలేను. మేనెట్లు గగుర్పొడుచుచున్నదో చూడుఁడు. అయ్యారే! అట్టిసుఖము నాకెప్పుడైనఁ బ్రత్యక్షముగా ననుభవించుట తటస్థించునా? అమ్మయ్యో! నాకే! కలలోనైనను లభ్యము కాదనుట. భళాభళి! ఇది యేమివింత వాతెర నిజముగా మండుచున్నదేమి? అదియేమి? మీరట్లూరకనవ్వెదరు. నావెఱ్ఱిమాటలుకావు? ఏమిచేయుదును. చపలచిత్తనగుటచే నిట్లు పరిహాస్పదురాలనైతి" నని పలికి మఱల నాకల తెఱంగే తలంచుకొనఁ దొడంగినది. అప్పుడు చెలికత్తెలు “పద్మనేత్రా? ఎట్టిచిత్రములు పలుకుచుంటివి. ఒకరాత్రినే మనోహరు మఱగి మాతోఁ గపటము లాడుచుంటివేఁ మఱినాలుగురాత్రులు గడచిన మమ్ము మఱతువు గాఁబోలు చాలుఁ జాలు ప్రత్యక్షముగాఁ జరిగిన చర్యలకు గలఁగంటివని చెప్పుచుంటివా. మనోహరు నెందుదాచితివి. మంచిప్రోడవైతివిలే" యని పలికినవిని యవ్వనిత శయ్యనుండి నగసులేచి యబ్బురపాటుతో నిట్లనియె. “యేమంటిరి? అది నిక్కువమా? ఆఁ ! నానోములు ఫలించినవియా యేమి? అగనగు జ్ఞాపకమువచ్చుచున్నది. మీతోడు సుడీ? నేను నిజముగా స్వప్నమే యని భ్రమయుచుంటిని. అయ్యారే ? అటులయిన నాచెలువుడేడీ? ఆపైగదిలో నుండెనేమో చూడుఁడు. అయ్యో? నావెఱ్ఱిమాటలన్నియు వినియంగాఁబోలు. లఘుచిత్తనని పరిహసించునుగదా" యని నుడువుటయు నాబోటు లిరువురు వడివడిలేచి యందుగల గదులన్నియు వెదకిరి. ఎందునుం గనఁబడిమి నాకోట యంతయు వెదకి మొగసాలకరిగి తిరిగివచ్చి యచ్చంచలాక్షి కిట్లనిరి.
తరళాక్షి! ఈకోటనడుమనున్న గృహములన్నియు వెదకితిమి నీమనోహరుఁ డెందును గనంబడలేదు. గుప్తమార్గవృత్తాంత మాయన కెఱిగించితినాయేమి? ఆ దారింబడి కాశీపురంబున కరిగెనేమో? అది యట్లుండె. పాదుషాగా రంతఃపురములో లేరు. వీథికిం బోవలేదంట. పరిచారకులు లేచువఱకే తల్పమున లేఁడనిచెప్పిరి. మన మేడకు వచ్చెనని సంశయమందుచున్నారు. ఇది యేమిచిత్ర” మని యడిగినవిని యదరిపడుచు నప్పడఁతి యిట్లనియె. "యువతులారా? ప్రమాదమే చేసితిని. ప్రియునితో నర్మోక్తులాడుచుఁ బ్రసంగవశంబున శివరాత్రినాఁడు గుప్తమార్గమునవచ్చి విశ్వనాథుని దర్శించితినని చెప్పితిని. తరువాత నచ్చతురుండు మెత్తనిమాటలాడుచు నీకోటలోనున్న గృహముల దారులన్నియు నడిగి తెలిసికొనియెను. అదియునుంగాక మజ్జనకుఁడు శయనించు మందిరవృత్తాంతము వితర్క పూర్వకముగా నడిగిన మోసము తెలిసికొనలేక మాటలకే మురియుచు నంతయుం జెప్పితిని. అయ్యో? చక్రవర్తి నెత్తుకొన పోవలేదుగదా" యని పలికినది. ఆ మాటలువిని యాబోటులు 'నీ తెలివితేట లేమైనవి మర్మములు చెప్పుకొందురా. మాటలకే యుబ్బిపోయితివి కాఁబోలు భళీ భళీ! చక్రవర్తి నెత్తుకొనిపోగలఁడా? అతం డెంతబలవంతుఁడైనను రాజును మేల్కొనకుండఁ దీసికొనపోఁగలఁడా? మిక్కిలి విపరీతముగానున్నదే" అని పలికిన నాకలికి కాదు. మఱియొక దారిఁగూడఁ జూపితిని. తప్పక యతండతని నెత్తుకొనిపోవుటయే నిశ్చయము. తెల్లమైనది. మత్తుగలిగించు ద్రావకకరండ మీబల్లమీదఁ జూచి యిది యేమియని యడిగిన నతనికి దాని తెఱం గెరింగించితిని. ఇప్పు డది యిందుఁ గనబడదు. దానిమూలమునఁ జక్రవర్తికి మత్తుఁ గలగించి యతని గ్రహించిపోయెను. అతండు మిగులబలవంతుఁడుగదా ఇప్పుడేమి చేయుదుము. సేనలన్నియు రాజదర్శనమునుఁ గోరుచుండెను నేఁటియుదయమునఁ గాశీపురము దోపెట్టఁ దలంచిరికాబోలు అన్నా! ఎట్లుజరిగినదో చూచితిరా అతండు దైవబలముగలవాఁడు. మనవారేమియుఁజేయలేరు. తరువాయి కృత్యము మీరే యోజింపుడు. ఈచిత్రముల దలంచుకొన నాకూరక నవ్వు వచ్చుచున్నది. తురకలకు మంచి ప్రాయశ్చిత్తము జరిగిన' దని పలికిన నాజవరాండ్రిట్లనిరి.
“అమ్మా! నీకుఁ గలుకుగాక యేమి? మగడన నంతమక్కువ కాఁబోలు. తండ్రిని అయ్యో? జైఱకొనిపోయెనని యించుకయునీకుఁ జింతలేదేమి? ఎంతకఠినాత్మురాలవి గద !" యని యుల్లసమాడుచు మఱలనిట్లనిరి. “కాశీపురంబుఁ గొల్ల పెట్టుటకు సెలవిమ్మన వీరభటులు సందేశము పంపుచున్నారు. ఈరహస్యము తెలిసిన నన్నితెఱంగులఁ బ్రమాదమే. కావున మఱుంగుపెట్టి చెప్పవలయును. ఇప్పుడు చక్రవర్తిగారు దేహమున స్వస్థతలేక పుత్రికయొక్క మేడయందు వసించిరి. ఆసంకటము హిందూదేవతలఁ బరాభవించుచేఁ గలిగినదని తలంచుచున్నారు. కావున దిరుగ మాయాజ్ఞయగునంతవఱకు సంగరము చేయవలదు. హిందువులను వారిదైవములను ముట్టరాదు. . చక్రవర్తిగారిప్పుడొరులకు నవసరమీయరట భర్తృదారిక సెలవిచ్చినదని రాజపురుషులతో మేముచెప్పెదము తరువాత కృత్యముల విచారింతమని యుపాయముచెప్పిన వారి బుద్దిబలమున కాముద్దియ సంతసించి యట్లుచేయుటకు వినియోగించినది. పిమ్మట నాకొమ్మలు మొగసాలకుఁబోయి సేనాపతి కాతెఱగెఱింగించి రహస్యముగా పాదుషాగారి వృత్తాంత మరయు తలంపుతోఁ గాశీపురికరిగిరి. అచ్చట చక్రవర్తి నెత్తుకొనిపోయి తెల్లవారకముందు కాశీపురంబునం బ్రవేశించి శత్రుదుర్గమంబగు నొకగుహ యందుఁ బ్రవేశపెట్టెను. వందేకాశీం గుహాం గంగా అని నిత్యయాత్రలోఁ జెప్పబడిన గుహ యదియేసుమీ! ఆ గుహామార్గము నిత్యము చూచువారలకే యగమ్యముగా నుండును. అట్టిగుహయం దా యవనదేశాశ్వరుని బండెబెట్టి యాజగజెట్టి చుట్టును బెక్కండ్ర వీరభటుల గావలియుంచి భోజనాదికృత్యములు సగౌరవముగా జరుగునట్లు నియోగించి పిమ్మటఁ జెల్లాచెదరైన తనబలంబుల మఱలరప్పించి యుత్సాహంబు గలుగఁజేసి యథాపుర్వకముగా వీటిగవనులం గాపువెట్టెను. వీరునిరాక విని పాఱిపోయిన పౌరులందరు సంతోషముతో వెండియు, బట్టణముఁ జేరిరి. పురుషకార్యము దైవకార్యమును ద్రోయఁ గలదా?
ఢిల్లీ పాదుషాగారి కథ
అచ్చట గుహయందుఁ జక్రవర్తికి జాముప్రొద్దెక్కునంత మందుపట్టు వదలుటచే మెలఁకువ వచ్చినదికాని మైకమంతగా బాసినదికాదు. వీరుని నియోగంబునఁ బరిచారకు లాయనకు రాజోపచారములు చేయదొడంగిరి. ఆ విపరీతము గ్రహింపలేక యతండది స్వస్థానమే యనుకొని వారియుపచారములం గైకొనుచు నాకిప్పుడు మిక్కిలి యాఁకలిగానున్నది వేగము నాహారముఁ గూర్చుఁడని చెప్పెను. వారును మృష్టాన్నములువండి పైడిపాత్రలలో వడ్డించిరి. అతండు తృప్తిగా భుజించి యాకలిదీరినంతఁ దెలివివచ్చి నలుమూలలు చూచుచు వారికిట్లనియె. 'అయ్యో? నేనీ చీకటియింటిలో నుంటినేమి? మీరెవ్వరు? మా సౌధమునుండి నేనిచ్చటికెట్లు వచ్చితిని? మావార లేమైరి? పోరు జరుగుచున్నదా?' యని యడిగిన వారేమియు మాటాడిరికారు. అప్పు డాఁఱేడు కన్నులెఱ్ఱజేయుచు 'అన్నా! మీ కింతకావర మేల? నామాటలు వినంబడలేదాయేమి. ప్రత్యుత్తర మీయక నిర్లక్ష్యముగాఁజూచిన మిమ్ము దండింపఁజేయుదుఁ జూడు' డని కోపము జేసిన నవ్వుచు వీరభటు లిట్లనిరి. 'రాజా! మే మెవ్వర మనుకొంటివి. నీ పరిచారకులము కాము స్వామిభక్తులము. పరమకృపాళుండగు విశ్వనాథునకు భక్తులగు హిందువులనెల్ల నీవుకావరించి పీడింపఁ దొడంగితివి కావున నమ్మహాత్ముండే నిన్నీ చెఱసాలం బెట్టించెను. ఇఁక నీకు రాజ్యమెక్కడిది బద్దుండవైతివి చచ్చినపామువలెఁ బడియుండుము. లేనిచోఁ బెడఱెక్కలఁ గట్టింతుము కనికరించి భోజనము పెట్టితిమి. హిందూదైవములు యవనదైవములవంటివారుకారు అడఁకువగలిగియుండు' మని పలికిరి. ఆమాటలు విని యాఱేఁడు భయపడుచు నాత్మగతంబున నిట్లు విపత్కరించెను. అక్కటా? భూమండలమంతయుఁ బాలించు నధికారము గలిగి న్యాయాన్యాయము విమర్శించి ప్రజల బాలించి నేను నిరపరాధులైన హిందువులను వారిదేవాలయమును భగ్నము జేయఁ బ్రయత్నించితిని. దీనికి మూలము నాకూఁతురుగదా? నిర్భాగ్యురా లిట్టి యనవసరము మాలి కోరికఁ గోరనేల? కోరినంతనే యొడంబడి నేనింతప్రయత్నము సేయ నేల? ఆడువాండ్ర విచ్చలవిడిఁ దిరుగనిచ్చిన ముప్పురాకుండనా? సీ? సీ? నాఁకూతురే చెడుగురాలు. మతాంతరదైవముల నారాధింపఁ బూనిన దానినే దండింపవలసినది. తప్పు చేసితిని. ఇప్పుడేమిచేయుదును? నాయైశ్వర్య మంతయు నాశముచేసికొంటిని. ఇది యేదేశమో తెలియదు. ఆహా! విధిగతి యెంతచిత్రమైనది. అని పెక్కుతెఱంగుల దలపోయుచు మఱల వారి కిట్లనియె.
దూతలారా? నన్ను మీ రిప్పు డేమి చేయుదురు? మీయభిప్రాయ మేమి ? ఇది యేదేశము? నాయందు దయయుంచి వక్కాణింపుండని యడిగిన వాండ్రు ఇది నరకము నీవంటి పాపాత్ముల నిట్టి నరకములఁ బడవైచి మాభగవంతుఁడు కొంతకాలము వేధించును. ఆయనకుఁ దిరుగ దయవచ్చినచో వెనుకటి యధికారము లిప్పించును. లేనిచో ఫకీరును చేసి విడుచును. భగవంతుని యభిప్రాయ మెవ్వరికిఁ దెలియఁగలదు. నీవు ప్రతిదివసము మాదేవుని బ్రార్థించుచుండుము. నీయిడుమలం బాపఁగలడు. ఆయన సెలవుప్రకారము నీయొద్ద మేము వసియించి యుంటిమని చెప్పిరి. అదిమొద లాచక్రవర్తి హృదయంబున విశ్వనాథు నారాధించుచుఁ దన్ను విడిచిపెట్టవలయునని యా దూతలఁ బ్రార్థించుచు సాదరముగా వారియుపచారములఁ గొనుచు శోకసాగరంబున నీదులాడుచు నెట్టకే నొకనెలఁ గడిపెను. వీరుఁడు చక్రవర్తిని జెఱఁదెచ్చిన దివసంబున సాయంకాలము మశీదుఫకీరులు వచ్చి వీరునితోఁగలసి ముచ్చటించిరి. అప్పుడు వీరుఁడు యవనసేనలలోని విశేషము లేమనియడిగిన మీదేవతలు నోరుగలవారౌదురు. ఫాదుషాగారికి శరీరములో సంకటము గలిగినదఁట అది మీదేవతల మహాత్మ్యమే యని సంగరము మానవలసినదనియు హిందువులజోలికిఁ పోవలదనియు రాజపుత్రిక యాజ్ఞాపించినదఁట. ఆకారణంబునంజేసి యవనులు యుద్ధవిముఖులై యున్నవారు. చక్రవర్తిగా రీవలకు రాలేదట. ఎటులైన నీపరాక్రమము గొనియాడఁదగియున్నది. నీవు బద్దుండవై యెట్లు తప్పించుకొనివచ్చితివో తెలియక యవనసేనానాయకులు పెక్కురీతిఁ దలంచుచున్నవారు. మాకును విస్మయముగానే యున్నది. నిన్న నీవు లేకపోవుటచేత నీపట్టణమంతయుఁ జెల్లాచెదరై పోయినదని యావృత్తాంత మంతయుం జెప్పిరి.
అప్పుడు వీరుండు వారితో నొకతెఱంగున జెప్పి నమ్మించి సంతోషము గలుగఁజేసెను. లవంగి చెలికత్తియలు కుందలతిలకయు సంగతచంద్రికయు నవ్వీడంతయు వెదకి వీరునిం బట్టుకొనిరి. కాని యతండు పలువురతో నుండుటచే డుట కవకాశము చిక్కినదికాదు. వారిని గురుతుపట్టియు నతం డెఱుంగనివాడువలె మాటాడక యవసరమీయక తప్పించుకొని పోవుచుండెను. అట్లు కొన్నిదినములు గడచినంత మరియొకనాడు కుందలతిలక పురుషవేషముతోవచ్చి యతండెక్కి,డికో పోవుచుండ గుఱ్ఱము కడ్డంబై కళ్ళెముఁబట్టుకొని స్వామీ! మాయాప్తునొకనిమాయచేసి యొకఁడు చెరగొని తీసిగొనిపోయెను. ఆయాపద మీరు తీర్చవలయు. మీరుమిగుల దయాళురనియు నిందునమ్మదగినవారయు మిమ్మాశ్రయింప నాలుగుదివసములనుండి తిరుగుచుంటిమి మేముపడుబాధలు దైవమునకెరుక. మీరు నా మొరవినక యుపేక్షించితిరేని మీకు జీవహత్య రాఁగలదు. అని నిర్బంధించి యడిగిన నతండు నవ్వుచు నిట్లనియె.
నీయాప్తు నేమిటికిఁ జెరంబెట్టెను. అతఁడెవ్వడు. ఎందున్నవాడని యడిగిన నమ్మగువ స్వామీ ! యేమియు నేరములేకయే చెఱబట్టెను మాకథ రహస్యముగాఁ జెప్పవలసియున్నది. అవసరమీయవలయునని యడిగిననతండు గుఱ్ఱముదిగి దరినున్న గృహంబునకుంజని యారహస్య మేమనియడిగెను. అప్పుడాజవ్వని నవ్వచు ఆర్యా ! మమ్ము మరచిపోయితిరా. నేను లవంగి సఖురాలను. మారాచపట్టిని విరహాగ్ని పాలుచేసి యస్మరణయే మానివేసిరి. ఆ చిన్నది సంతతము మీచర్యలే తలంచుకొనుచున్నది. తండ్రి చెఱమాట యించకయుఁ దలపందు మీ రొకసారి వచ్చి చూడనిచో నసువులు బాయఁగలదు. మా చక్రవర్తి నేమి చేసితిరి ? ఎప్పటికేని విడుతురా ? ఈ రహస్య మెన్నినాళ్ళు కప్పిపుచ్చము. మాకెద్దియేని నుపాయము చెప్పవలయు. నిదుగో మీకేదియో శ్లోకము వ్రాసి మా రాజపుత్రిక యంపినది. చూచికొనుఁడని యొక యుత్తరమిచ్చినది. దానివిప్పి చదువుకొనఁగా-
శ్లో॥ పీతమత్రమధుయాపిక్షపా
భృంగ ! సర్వమచిరేణవిస్మృతం
హియమానసుషమాం హిమాగమె
పద్మినీంయదిహనావలోక సే॥
భృంగమా : రాత్రియెల్ల నాకడ వసించి మకరందమంతయుఁ గ్రోలితివి. ఇపుడది మఱచిపోయితివి. ఇతర పుష్పముల మఱఁగి యొక మాటును నన్ను స్మరింపవుగదా ? యన పద్మిని చెప్పినట్లుగా వ్యాజ్యముగా వ్రాసినది. ఆ యర్ధము గ్రహించి యతండు మఱల నీక్రింది శ్లోకము వ్రాసియిచ్చెను.
శ్లో॥ నిషీదతుశిరీషకే చరతువా కరంటే చిరం
సముత్పతతు పంకజే కురవకే కరోతు స్తితిం
దినం సయంతు కుందకే నవరసాల కాల్యనమా
న్న విస్మరతి కేవలం తవగుణా నసాష్పదం.
బ్రాహ్మణకులంబునంబుట్టి సకల విద్యలం జదివి పదుగురలో మిగుల ప్రఖ్యాతివడిసిన నాకీ నీచజాతినాతి సాంగత్యంబు తటస్థించుచున్న దేమి? మొదట బ్రమాదవసంబున గలిగినను బశ్చాత్తాపమును జెంది మఱల నిప్పుడప్పని కుద్యోగించు చున్నవాఁడ. అన్నన్నా? ఎంత విచిత్రము? ఇంద్రియములకన్నఁ జంచలమైనది మరియొకటిలేదు గదా. ఎంత బోధించినను వినక నామది యమ్ముదితమీఁదికిఁ బరుగిడు చున్నది. ఏమి చేయుదును. కులభ్రష్టత్వంబు నాకువిధి విధించెఁగాఁబోలు. కాకున్న నా చిన్నది తెలియకమున్న నన్నువరింపనేమిటికి? విద్యాగుణ రూపచాతుర్యాది విశేషంబుల ననన్య సామాన్యయైయొప్పు నాయొప్పులకుప్ప తనంతవచ్చి వరింప మదిచలింపకుండుట కేను భీష్ముండనో శుకుండనో హనుమంతుడనో? ఏనెక్కడ? శుద్దాంతసంచారిణియగు యవనరాజపుత్రి యెక్కడ? ఇది దైవకృత్యంబుకా కెట్లుసంఘటిల్లెడిన పాపభీతి యొకమూలయు దాపభీతి యొకమూలయుఁ బాధించుచున్న యవి ఒకసారి పోయి యత్తన్వకిఁ జెప్పవలసినంత జెప్పి దాని చిత్తముఁ ద్రిప్పివేయుదును. నేనిప్పుడు పోకున్న నాపఁడతి ప్రాణములు విడువఁగలదు. తదీయానురాగ మట్టిదేయని తలచి యాతండానాఁటి ఱేయి గుప్తమార్గంబున నారాజనందన మందరిమునకుం బోయెను. అంతకుమున్న ద్వారమున వేచియున్న కుందలతిలక యతనిం జూచి సంతసించుచు వేగముగా లవంగి యొద్దకుఁదీసికొనిపోయి యాముద్దియ కెఱింగించిన నుప్పొంగుచు నక్కురంగనయన వినయముతో ననేక సత్కారములు స్వయముగా నతనికిఁగావించుచు దల్పంబున సుఖాసీనుఁజేసి యంతికమున నిలువంబడి వీచుచుండెను. అప్పుడు వారికిట్టి సంవాదము జరిగినది.
వీరు - తరుణీ! నీయుపచారములు నన్ను మోమాటము పెట్టుచున్నవి. మొన్న విమర్శింపక మోసపోయితిని. అంతటితో విడచిపెట్టుము. విద్వాంసుడనయ్యు లోకనింద్యములగు కార్యములు చేయవచ్చునా?
లవంగి - ఇది లోకనింద్యమను తలంపు గలిగినచో విడువఁదగినదే.
వీరు - ఏమిటికిఁగాదు?
లవంగి - ఎట్లయ్యెను?
వీరు - పరస్త్రీగమనము పాతకము.
లవంగి - పరస్త్రీగమనము పాతకమౌను.
వీరు - ఆపాతకము నన్నంటలేదా ?
లవంగి - ఎట్లు ?
వీరు - నీ వలన.
లవంగి - నేను పరస్త్రీనా ?
వీరు - కాక.
లవంగి - ఓహో! ఇదియా మీ యభిప్రాయము. నేను వెలయాలి ననుకొంటిరాయేమి? బాగు! బాగు! భళి! భళి! లెస్సగా నున్నది. స్వైరిణీవృత్తి నా యందులేదు.
వీరు - నీ వనుకొనుచుంటివి కాఁబోలు.
లవంగి - మీరే యాలోచించి చెప్పుడు. మీరు విశ్వేశ్వరసాక్షి నాపాణిగ్రహణము చేయలేదా? అప్పుడే త్రికరణముల చేతను మిమ్ము భర్తగాఁ దలంచితిని. దానంజేసియే మీకొఱ కిన్ని పాటులు పడుచుంటినిగాని మీపాటి విటపురుషుఁడు దొరకక కాదు.
వీరు — బ్రాహ్మణులు తురక నెలఁతుకలఁ బెండ్లి యాడినట్లే పురాణములో నైనఁ జెప్పంబడియున్నదా ?
లవంగి - పంచముల దక్కఁ దక్కిన సర్వవర్ణముల వారిం బ్రాహ్మణులు పెండ్లియాడవచ్చునని ధర్మశాస్త్రములో నున్నది.
వీరు — సర్వశబ్దములో యవనులు సేరరు.
లవంగి - చేరకమానరు. బలవంతమునైనం జేరుదురని పలుకుచు సిగ్గు విడిచి దిగ్గున నగ్గరిత యతని గౌగలించుకొనబోవ. అప్పుడతం డాత్మగతంబున -
గీ. కులముపోయినఁ బోఁగాక వెలిపడంగ
బుధులు నవ్వినఁ దెలిసి నవ్వుదురుగాక
యశము చెడినను జెడుఁగాక యాప్తవితతి
విడుచుఁగాక నెలంత నేవిడువనేర.
చ. సకల కళారహస్యములఁ జక్క నెఱింగినప్రోడ మేల్ నెలం
తుక సుగుణాలవాల సుమనోహరరూప వినూత్న యౌవన
ప్రకట కలాకలాపయగు భామిని కోరి తనంతవచ్చి కౌ
తుకమునఁ బై కొనంగ మఱి త్రోయవశంబె పినాకపాణికిన్.
అని తలంచుచు నవ్విరించికులవతంసుండు నయ్యండజనేత్రతోఁ గ్రీడాసుఖపారవశ్యంబున గడిపి యుదయంబుకాకమున్న యథాగతముగాఁ గాశీపురంబున కరిగెను. అంతకుమున్న యతనిరాక వేచియందున్న కొందఱుపచారకులం జూచి యతండిట్లనియె. యోధులారా చక్రవర్తి సుఖుండై యున్నవాడా? రాజోపచారములు చేయుచున్నారా ఏమనుచున్నాఁడు? ఇప్పటికైన హిందువుల దైవములు నోరు కల వారని యొప్పుకొనునా? పశ్చాత్తాపముఁ జెందుచున్నాఁడా? ఏమరక సంతతముగాఁచుచుండిరిగద్. అచ్చటి విశేషములెట్టివి? ఇచ్చట కేమిటికి వచ్చినా రనియడిగిన వాండ్రు నమస్కరించుచు నిట్లనిరి.
స్వామీ! బోనునంబెట్టిన సింగంబు చెప్పిన తెఱంగున వినక యేమి జేసెడిని? మొదటఁదన రాక గుఱించి పెక్కు తెఱంగులఁ దలపోసి మమ్మడిగెను. మేమిది నరకమనియు నీవు దేవతాద్రోహముఁ గావించితివి గావున నిందు బడవై చితి మనియు మేము స్వామికి భక్తులమనియుం జెప్పితిమి. అప్పటినుండి మాయెడ వినయము జూపుచు మాయుపచారములఁ గైకొనుచుండెను. ప్రతిదినముఁ దన్నుఁ దన దేశమునకుఁ బంపమని మమ్ముఁబ్రార్ధించుచుండును. ఇంకెన్నడును హిందూదేవతలజోలికి రాఁడఁట. విశ్వనాథస్వామికి గొన్నిగ్రామములు కానుకగా నిత్తునని చెప్పుచున్నాడు. అట్లొడంబడిక వ్రాసి యిచ్చెను. పెక్కేల మేమెట్లు చెప్పిన నట్లునడుచుటకు సమ్మతించునఁట అని క్షణక్షణములను సలాములు చేయుచుఁ జెప్పుచుండును. మేమును మఱికొన్ని దినములు పోనిమ్మని చెప్పితిమి. ఇప్పటికి నెలకా వచ్చినది. మీ యాజ్ఞానుసారము చేయుచున్నాను. తరువాత దేవరయే ప్రమాణమని చెప్పిరి.
మరియొకనాఁడు రాత్రి వీరుండు మంచి సమయమును విదారించి మునుపటి ద్రావక విశేషమున నిద్రించుచున్న యతనికి మత్తుగలుగఁజేసి పూర్వము వలనే యెత్తుకొని యాతెరు వితరులకులం జెప్పక యెక్కఁడ యాగుప్తమార్గంబున లవంగి యంతఃపురమునకుంజని యందొక తల్పంబునఁ జక్రవర్తిని బరుండబెట్టి కొంతసేపానెలంతతో ముచ్చటించి తెల్లవారకమున్న యెప్పటియట్ల కాశీపురంబునకుఁ జనియెను.
పాదుషా చక్రవర్తి మఱునాఁడుదయంబునలేచి కన్నులందెఱచి నలుదెసలం బరికించుచు నోహో! ఇది మునుపటి గుహ కానియట్లున్నది. స్వామిభక్తులకు నిన్న దానపత్రిక వ్రాసియిచ్చితిని గద.
నేఁడు బంధవిముక్తుండనైతి. ఇది మదియాంతఃపురము కావచ్చుననితలంచుచు నెవ్వరెక్కడ యని వడిగాబిల్చెను. ఆధ్వనివిని యంతకుమున్న బోధింపఁబడియున్న చెలికత్తియు లిరువురు నిదిగో మేము వచ్చుచున్నామని పలుకుచు నా గదిలోనికింబోయిరి. వారింజూచి చక్రవర్తి యీ యిల్లెవరిది? మీ రెవ్వనివారలు? నేనిక్కడి కెట్లు వచ్చితిని? ఇంతకు బూర్వ మెందుంటినో మీరెఱుంగుదురా యని యడిగిన నా చేడియలు చేతులజోడించి యిట్లనిరి. స్వామీ! మీరు నెలక్రిందట మీ యంతఃపురములో శయనించియుండి యొకనాఁడు రాత్రి పలవరించిరి. అప్పుడు మిమ్ముఁ బరిచారకు లెంతలేపినను లేచితిరికారు. దానికిం జడియుచు రాజపుత్రిక యచ్చిటినుండి తన మేడమీఁదికి దీసికొని రమ్మని చెప్పిన మేమిచ్చటికిఁ దీసికొనివచ్చి యీ గదిలో నీ తల్పముమీఁదఁ బరుండబెట్టితిమి. అప్పటినుండి మీరూరక నిద్రపోవ దొడంగితిరి. ఎన్ని పిల్చినను ఊఁ అనుటయైన లేదు. ఊపిరి మాత్రము విడుచుచుండిరి. పైయుపచారము లనేకములు గావించితిమి. ఏమియుఁ బ్రయోజనము లేక పోయినది. నాఁడుతుద నేఁటివఱకు నట్లేయుంటిరి. ఇప్పుడే మీ కంఠధ్వని వినంబడిన సంతోషముఁ జెందివచ్చితిమి. మేము లవంగి సఖురాండ్రము. ఇదిగో రాజపుత్రిక యీ ప్రక్కను నిలువంబడియున్నది. ఇన్ని దినములు నిద్రాహారములు మాని మీ నిమిత్తమే చింతించుచున్నదని తత్సమయోచితముగా వక్కాణించిరి.
అప్పుడాచక్రవర్తి మిగుల విస్మయముఁ జెందుచు ఆ-ఏమి యీ చిత్రము? నా శరీర మిక్కడనే యున్నదని మీరు చెప్పుచున్నారే. జరిగిన దంతయు స్వప్నము గాబోలు. అయ్యో? అప్పుడు సైతము నేనది స్వప్నమనుకొని కాదని నిశ్చయించుకొంటినే. మేలుమేలు. అట్టి విపరీతస్వప్నము లెప్పుడును జూచియెరుంగను. స్వప్నములో స్వప్నములు వచ్చిన సత్యమనుకొనుచుంటిని. ఇప్పుడిది నాకు స్వప్నమేమో ఏది నిశ్చయించుటకు వీలులేకున్నది. ఏమిచేయుదును. ఎట్లు సత్యమును తెలుసు కొందుని పెక్కు తెఱంగుల ధ్యానించి మఱల వారి కిట్లనియె.
పాదుషా - యువతులారా! మీ మాటలచే నే నిక్కడనే యున్నట్లు స్పష్టమగుచున్నది గదా!
సఖురాండ్రు — దేవరా! సందియమేల ఇక్కడనే యుంటిరి.
పాదుషా — నే నిన్నిదినంబు లొక్కగుహలోఁ గొందఱు పురుషులచే నాక చేయఁబడియుంటి నది స్వప్నమో నిజమో తెలియదు.
సఖు — దేవరా ! అది స్వప్నమే నిజముకాదు.
ఫాదుషా - ఏమో! అదియే నిజమై యిదియే స్వప్నము కారాదా? ఎట్లు నిశ్చయింపనగును.
సఖు – అయ్యో! మీరట్లునుచున్నా రేమి! ఇదిగో మీ లవంగి. చూడుఁడు. ఇది మీ యంతఃపురమే మీరు కన్నులు తెఱచియుండి యిది స్వప్నమని భ్రమపడుచున్నారుగదా.
ఫాదుషా - ఈ మాటలు సత్యములని నేనునమ్మను. వెనుక నీలాగుననే యనుకొని మోసబోయితిని. అప్పుడు కన్నులు ముట్టి చూచితిని తెఱవఁబడియున్నవి. ఒడలు గిల్లుకొంటిని నొప్పిగలిగినది. అట్టి చర్యలన్నియు స్వప్నములు కాలేదా? స్వప్నములో మీరందఱు నాకుఁ గనంబడి యిట్లు చెప్పఁగూడదా?
సఖు - మఱేమి దృష్టాంతము చెప్పిన మీరు నమ్ముదురు?
ఫాదుషా - ఏమో నాకుంతెలియదు. నాకుఁ జిత్తవిభ్రాంతి కలుగుచున్నది. ఇదిగో చూడుఁడు మొన్న గుహలో నా నెత్తి కొకరాయి తగిలి బొప్పికట్టినది. అదియుం గనంబడుచున్నదే? అది స్వప్నమనిన నెట్లు నమ్ముదును.
సఖు - స్వామీ ! స్వప్నములో జరిగిన చర్యలు కొన్ని ప్రత్యక్షముగాఁ గనబడుచుండును.
ఫాదు - (ఇంచుకవిమర్శించి దుస్తులదెసఁజూచుచు) ఇదిగో నిన్నఁ బరిచారకుఁడీ యంగీ నందిచ్చుచుండ గ్రిందఁజారిపడిన ధూళి యైనది. ఆమచ్చ సైతముఁ గనంబడుచున్నది. చూడుఁడు ఇవన్నియు స్వప్నములనిన నెట్లు నమ్ముదును.
సఖు — దేవరా! అవియన్నియు స్వప్నములే. వాకిటికివచ్చి చూడుఁడు ఎండ గాయుచున్నది.
ఫాదు - చాలుఁజాలు. ఈయెండ లన్నియుఁ బూటకములే. అదివఱకును జూచితిని.
సఖు - పోనిండు. మొగసాల, వీరభటుల, ప్రధానులు, సేనాధి పతులు, నాయోధనంబుస కాజ్ఞయిమ్మని కోరుచు దేవరదర్శనం బభిలషించి యున్న వారు వారింజూచియైన నిది జాగ్రదవస్థయని తెలిసికొనరాదా ?
ఫాదు - బుద్దివచ్చినది. ఇంకనెన్నఁడు నక్కఱమాలిన పనుల జోలికిఁ బోవను. ఇప్పుడు పోరుమానిపించి సేనలతో మనమింటికిఁపోవలసినదే. స్వామిభక్తులకు నేనట్లు దానపట్ట వ్రాసియిచ్చితిని.
సఖు - అదిమాకును సమ్మతమే నిదర్శనమునకుఁ జెప్పితిమి.
ఫాదు - అయ్యో? మఱల విభ్రాంతిపడుచుంటిని. ఈప్రసంగ మంతయుఁ గలలోనిదే యని నాయభిప్రాయము ఇదియే స్వప్నములో స్వప్నమని చెప్పఁదగినది.
సఖు - కాదు. దేవరా! కాదు ఓలగంబున కరిగి విచారింపుడు యందున్న సభాభవనమున కరిగి కొలువుదీర్చి తనరహస్యవిశేషంబు లెవ్వరికిం జెప్పక యోధుల కాయోధనము వలదని నియమించి యా రాత్రియే ప్రయాణసన్నాహము గావించి సకలపరివారములతో ఢిల్లీ పురంబునకరిగెను. పిమ్మటఁ గాశీపట్టణప్రజలెల్లఁ గాశీరాజు నగ్రాసనాధిపతిగాఁజేసి యొకసభఁజేసిరి. ఆమహాసభలోఁ బండితరాయలకు మహావీరుండని బిరుదిచ్చి యతండు ఫాదుషాచక్రవర్తిని జెఱబెట్టి బుచ్చికొనిన పత్రికఁ జదివి పెక్కు తెఱంగుల నతనియశము స్తోత్రములు గావించిరి. మఱియు విశ్వేశ్వర మహాలింగమును బంచములు తక్క తదితరు లెవ్వరు ముట్టినను దోషములేనట్లుగా నప్పుడే యాలింగమునకు మహాదీక్షాతంత్రము జరిగించి యాగమముఁ గావించిరి. నాటంగోలె నమ్మహాలింగమున కన్నిజాతులవారును గర్భాలయములోనికిం జని యభిషేకాద్యర్చనలు గావించుచుందురు. ఇదియే దీనివృత్తాంతము. గోపా! వింటివికద. ఈకథ చక్కగానున్నదియా? నీవును బోయి యామహాలింగమున కభిషేకముఁ గావించి కృతార్థుడ వయ్యదవులే యని పలికిన విని పరమానందభరితహృదయుండై యా గోపనందనుం డిట్లనెయె.
స్వామీ! మీకటాక్షలేశము నాపయిం బ్రసరించుచుండ నేను గృతర్థుండఁగా కేమయ్యెదను. అదియట్లుండె నాలవంగి తండ్రితో నరిగినదా? ఆమెను బండితరాయలు భార్యగా స్వీకరించెనా? బ్రాహ్మణులు సమ్మతించిరా? తరువాతి వృత్తాంతము కొఱంతగానే చెప్పితిరి. దయతప్పినదాయేమి? ప్రశ్నకుత్తరంబైనను సగము కథఁచెప్పి యూరకొనుట యుచితమా? కాక మదీయగ్రహణధోరణి యెట్లున్నదోయని పరీక్షించుటకా? కటాక్షించి తదనంతరవృత్తాంత మెరింగింపుడని వేడుకొనినవిని యతిచంద్రుఁడు దరహాసచంద్రికలఁ దెసలఁ బ్రకాశింపజేయుచు నిట్లనియె. వత్సా! నీ వీప్రశ్నము చేయుదువని యనుకొనుచునే యుంటిని. అంతటితో విడుతువా? నీయభిలాష నేనెఱుంగనిదా? కానిమ్ము ఇప్పుడు ప్రొద్దుపోయినది. తరువాయికథ పెద్దదిగా నున్నది. ముందరియవసధంబున వక్కాణించెదనని యొప్పించి క్రమంబున నాపైమజిలీచేరి యందు భోజనాదికృత్యములు నిర్వర్తించు కొనిన పిమ్మట దరువాతకథ యిట్లని చెప్పందొడఁగెను.
ముప్పదియాఱవ మజిలీకథ
గోపా ! వినుమట్లు విశ్వేశ్వర మహాలింగమునకు మహాదీక్షఁ గావించి పండితరాయలకు మహావీరుండని బిరుదమిచ్చినతరువాతఁ పండితభట్టుపుత్రునకు వివాహముఁజేయ నెక్కుడుప్రయత్నముఁగావించెను గాని పండితరాయలు లవంగి యందు బద్ధాదరుండై యున్నకతంబున నప్పనికి సమ్మతించినవాఁడు కాఁడు. ఒకనాడతండు లవంగి శృంగారక్రీడావిశేషంబులం దలంచుకొని విరహాతురుండై చింతంచుచున్న సమయంబున లవంగి సఖురాలు కుందలితిలక యచ్చోటికివచ్చి వెదకి కనుంగొని పండితరాయలకు నమస్కరించినది. అప్పుడతండు ముప్పిరిగొను సంతసముతోఁ దదాగమనము గుఱించి యభినందించుచు మించుబోణీ! నీసఖురాలు సుఖియై యున్నదియా? నిన్నేమని చెప్పుమన్నది. విశేషము లేమని యడిగిన నప్పడఁతి యిట్లనియె. ఆర్యా! మీరు రాజకార్యములు చక్కఁబెట్టుకొని వెంటనే వత్తుననిచెప్పి యింతదాక రాక యుపేక్షించితిరిగదా. ఇఁక నాసఖురాలి సేమమేమని వక్కాణింతును. ప్రతిదినము మీరువత్తురని మీదేశవంక చూచువఱకుఁ గన్నులు కాయలుకాచినవి. ఇప్పుడేమి చెప్పుదును. వచ్చినపిమ్మట మీకే తెల్లమగుంగదా. అదియట్లున్నను మరియొక యుపద్రవము కానైయున్నది వినుండు. చక్రవర్తి యచ్చటినుండి వచ్చినది మొదలు లవంగియం దిష్టములేక యుపేక్షగా నుండెను. పూర్వము సంతతము నానెలంతువనే పరామరిక చేయుచుండవాఁడు. ఇప్పు డొకమారైనను దలపెట్టడు. మనగుప్తమార్గప్రచారమంతయు మాశత్రువు లెవ్వరో తెలియజేసిరి. ఇప్పుడామార్గము విమర్శించి రండని రహస్యముగ గొందరుగూఢచారులఁ బంపినట్లు వినవచ్చినది అదియునుంగాక లవంగికి నెలదప్పినది. నాలుగుమాసములు గతించినవి. ఈయాపద యెట్లుదాటునో తెలియదు. అంగజాలలమగు మాలో మాకుఁ గలతలు పుట్టినవి. ఇంక .