కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/203వ మజిలీ

వికీసోర్స్ నుండి

పనియే దేనిఁ గలిగిన వక్కాణింపుము చేసి కృతజ్ఞుండనయ్యెదనని యడిగిన మదనమంజరి యిట్లనియె.

మహాత్మా! నీవు నాకుఁ గావింపవలసిన యుపకార మిదివఱకే చేసి యుంటివి. అందులకు నీకు నేను బ్రతిక్రియ యేమియుఁ జేయజాలను. అది యట్లుండె నా మనసున వేఱొక కోరిక యున్నది. వరమిచ్చితి కావున నడుగుచుంటి. నాయక్క కూఁతురు త్రిపురసుందరి యను సుందరి యున్నది. దానిఁ ద్రిభువ సుందరి యనియే చెప్పఁదగినది దాని మీకుఁ ద్వితీయ సేవకురాలిగాఁ జేయదలంచుకొంటి నంగీకరింప వలయునని గోరినఁ జిరునగవుతో నతండు మలయవతి మొగముజూచెను. మలయవతి కేలుమోడ్చి మహాత్మా! అట్లు చేయుట నా కెంతయు నభిమతము. తన కూఁతును విడిచి నాకు మహిషిపదం బొనఁమార్చిన యామె కోరికఁ దీర్చుటకంటె యుత్తమకార్య మేమియున్నది? దేవతాబంధుత్వప్రాప్తిఁ జేసి నూత్నవిశేషంబుల దెలిసికొను భాగ్యము గూడఁ బట్టును. అన్ని విధముల నిప్పని సమంజసమై యున్నదని చెప్పి యతనికి సంతోషము గలుగఁజేసినది.

మదనమంజరియు పుష్పమంజరుల వారిపై జల్లి నే నిప్పుడు బోయివచ్చెద . వెండియు నుజ్జయినీపురంబునం గలిసికొనియెద. ననుజ్ఞయిండని చెప్పి యలకాపురంబున కరిగినది.

విక్రమాదిత్యుడును మలయవతితో ననంగల్పోక్తప్రకారంబున శృంగారకేళీవ్రతానుష్ఠానతత్పరుండై కొన్నిదినంబు లందుండి పిమ్మట నా పొన్ని కొమ్మను వెంటబెట్టుకొని నిజపరిజనము సేవింపఁ గ్రమ్మర నుజ్జయినీ పురంబున కరుదెంచెను.

అని యెఱింగించుట వఱకుఁ గాలాతీతమైనది. తరువాత నగు వృత్తాంత మవ్వలి మజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

203 వ మజిలీ

బంగారుస్థంభముకథ

శ్లో॥ అరుణ శిఖరిగంగాస్థంభమార్గేణగత్వా
     ప్రతిదిన మతి మాత్రస్వర్ణదాంకర్ణం భూషాం
     భరకిరణ సకాశాత్ ప్రాప్యతాం బ్రాహ్మణాయ
     వ్యతరదతిదరిద్రాయేతి సైపాప్యసక్తి

క. పుడమి నెటనైన గానీ
   కడుచిత్రంబైన వార్త గలదని విన్నం
   దడయక నటకేగుచు న
   ----------- డది చూచి వచ్చు నుత్సాహముతోడన్.

విక్రమాదిత్యుండు నిత్యము వివిధ చిత్రవార్త శ్రవణమునకై మహాకాళినాథుని యాలయమునకుఁ బోయి రెండు గంటల కాలము వసించియుండును. అప్పుడు దేశాటనము జేయుచు నందు వచ్చియున్న యతులఁ బరివ్రాజకుల సిద్ధుల నెందైనను వింతలం జూచి వచ్చితిరా యని యడుగుచుండును.

ఒకనాఁ డమ్మహాకాళేశ్వరుని సేవింప వచ్చిన యొక పరివ్రాజకుం గాంచి నమస్కరింపుచు నొకగేస్తు మహాత్మా! నాకుఁ దత్వోపదేశము గావించి కృతార్థులం గావింపుమని ప్రార్థించుటయు నా పరివ్రాజకుం డిట్లనియె.

ఓయీ? నీవు గృహస్థుండవు. గృహస్థధర్మములఁ జక్కగా నెరవేర్చుకొనినఁ దత్వగ్రహణాధికఫలంబు కాఁగలదు. వినుము దుర్జనసహవాస మెన్నఁడును జేయకుము. ఎవ్వరితో విరోధము వలదు.

శ్లో. అనుభవత దత్త విత్తం మాన్యం మానయ సజ్జలం భణథ
    అతిపరుషపవనలులితా దీప శిఖేరాతిచంచలా లక్ష్మీ.

నీకున్న ధనము లెస్సగా ననుభవింపుము. ఒరులకుఁ బెట్టుము. మాన్యుల సన్మానింపుము. సజ్జనుల సేవింపుము. సంపదలు గాలిలోఁ బెట్టిన దీపమువలె నతి చంచలములని తెలిసికొనుము. పరులకు సంతాపము గలుగఁ జేయకుము, అపరాధము లేక భృత్యుల దండింపకుము. రాఁబోవు దానికిఁ జింతింపకుము. శత్రువులకైన హితము గోరుము. ధ్యానాధ్యయనాదులతోఁగాక దివసము వృథాగడుపకుము. స్త్రీలకు రహస్యము జెప్పకుము తల్లిదండ్రుల సేవింపుము. దొంగలతో మాట్లాడవలదు. కొంచెము కొఱకు నెక్కుడు వ్యయము చేయకుము. ఆర్యులకు దానము లిమ్ము. ధర్మస్థానముల నసత్య మాడకుము. త్రికరణములఁ బరోపకారము తలంపుచుండుము. ఈగుణంబులు గలుగు గృహస్థుండు సర్వజనపూజనీయుండై తత్వవేత్తకన్న నుత్తమలోకము బొందగలఁడని యుపదేశించెను.

విక్రమార్కుండు ప్రచ్ఛనముగా నందుండి యమృతోపమానంబులగు నా పలుకులు విని యుబ్బుచు గొబ్బున నజ్జటి నికటంబున కరిగి సాష్టాంగనమస్కారము గావించి యి ట్లనియె.

మహాత్మా ! మీ యాకారము సర్వసంగపరిత్యాగత సూచింపుచున్నది. మీ పలుకులు వేదశాస్త్ర సమ్మతములు. సర్వతీర్థంబులు మీదక్షిణపాదంబున నొప్పుచున్నవి. మీ పాదసేవకన్న గృహస్థున నుత్తమ వ్రతంబు లేదు. మీ దర్శనము జేసి కృతార్థుల మైతిమని వినుతింపుచు మఱియు నిట్లనియె.

క. ఏ యే దేశము లరిగితి
   రేయే తీర్థములఁ గంటి రేయేనదులం
   దేయే గిరులం జూచితి
   రాయాదేశముల అలక

మహాత్మా ! మీరు జూచినవానిలో నేదియేని యాశ్చర్యకరమైన విశేషమున్న . వక్కాణింపుఁడని ప్రార్థించిన విని యతండు విక్రమార్కుండని యెఱిఁగి యాశీర్వచనపూర్వకముగా నిట్లనియె.

మహారాజా! నేను చతుస్సముద్రముద్రితమైన భూలోకమంతయుఁ బరిభ్రమించితిని. నా చూడని దేశంబులు, నా చూడని విశేషములు లేవు. నా చూచినంత మేర భవదీయయశోవిసరంబులు వ్యాపించుచునే యున్నవి. అది యట్లుండె. ఇక్కడికి నుత్తరముగా లక్షయోజనముల దూరములో నల్కగిరియను నొక పర్వతము గలదు. దాని ప్రక్క సూర్యగంగయను పెద్దతటాక మొప్పుచున్నది. తత్కాసారమధ్యంబున స్ఫటికశిలాఘటితంబై దేవయాతన మొండు విరాజిల్లుచున్నది. అందుఁ బూజింపఁబడు స్ఫటికలింగంబు సూర్యప్రతిష్ఠితంబని చెప్పుదురు. తదాలయపురోభాగంబు నందలి తటాకజలంబు నుండి సూర్యోదయ సమయమున నొక బంగారుస్థంభంబు బయలు వెడలి తాళవృక్షము వలెఁ గ్రమంబున నెదుగుచు మధ్యాహ్నమైనంత సూర్యునంటి క్రమంబున మరలి సూర్యు డస్తమించువరకు నదిగూడఁ దజ్జలంబున నడంగుచుండును.

ఆ వింత నేను బదిదినములం దుండి కన్నులారఁ జూచితిని. ఆ స్థంభాగ్రపీఠంబున దారుశిలాలోహము లేచి యుంచినను సాయంకాలమునకు భస్మావశేషములై కనుపట్టుచుండును. అది సూర్యాకర్షితయంత్రమో జాలతంత్రమో యెవ్వరికిం దెలియదు. ఆ స్థంభం బెంతకాలమునుండి యట్లుత్పన్న మగుచున్నదో యెఱింగిన వారు లేరు నేఁ జూచిన దానిలో నిదియే విచిత్రమైన వార్తయని తెలిపిన వినివిక్రమార్కుండు మూపు లెగరవై చుచు మంచి వింత వార్తఁ దెలిపితిరి. సంతసించితినని ముఱియుచు నయ్యతివలన నప్పర్వతమునకు మార్గము దెలిసికొని యక్కడికి వెళ్ళువఱకే సంవత్సరము పట్టునని విని యా పరివ్రాజకు ననుమతి వడసి యింటికి వచ్చి యిట్లు ధ్యానించెను.

ఆ సూర్యగిరి యిక్కడికిఁ జాలదూరములో నున్నది. గుఱ్ఱమెక్కి రాత్రిం బగలు పోయినను సంవత్సరము పట్టును. ఈ వార్త భట్టి వినిన నడ్డు పెట్టును. శ్రీధరుఁడు విఘ్నము సేయును. భద్రుం డంగీకరింపఁడు. ఎవ్వరికిం దెలియకుండ బోవుటయే యుచితమని నిశ్చయించి నేను వచ్చువఱకు రాజ్యము భట్టి పాలించుచుండ వలయునను పత్రిక వ్రాసి పరుపుక్రింద నిడి మలయపతిని బుట్టినింటి కనిపి యయ్యసహాయశూరుండు చంద్రహాసమాత్రసహాయుండై యొకనాఁడు వేకువజాము నేకాంతముగా గుఱ్ఱ మెక్కి యుత్తరాభిముఖుండై

శో. నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశ హేతవే
    త్రయీమయాయత్రిగుణాత్మధారిణే విరించినారాయణశంకరాత్మనె.

కాని ద్వాదస్తసు వాత్మ సన్నిధానము గల్పించుకొని ధ్యానించుచు బయలుదేరి పోవుచుఁ దెల్ల వారు వఱకుఁ బెద్దాదూరము పోయెను. చేతఁ జంద్రహాసము, ఎక్కినగుఱ్ఱము, కట్టిన వస్త్రంబులు గాక యతని చేతఁ గాసైననులేదు. కోరినఁ బంచ భూతములు గాంచన మర్పింపవా? అని యతని ధైర్యము.

అతం డట్లు హుటాహుటి పయనంబులు సాగించుచు నొకనాఁడు మిట్టమధ్యాహ్న మొక యెడారింబడి పోవుచు ఖరకిరణ సంప్తశరీరుండై పెదవులెండ నీరుండు తా వెందునుం గానక పరితపించుచు నరిగి యెట్టకే నొకచెట్టునీడం జేరి వారువము దిగి చెమ్మట లార్చుకొనుచున్నంతలోని

సీ. ఈ దేహభారమింకేనోప నని తెల్పు
                కరణి దారుణ శిరఃకంప మొప్ప
    నక్షత్రమాలిక వ్రేళులందుఁ ద్రిప్పకయె కం
                పమునఁద్రిప్పెటునట్లు బ్రాంతిఁగొలుప
    పొరలడ్డుపటి కన్నులరచూపు లమరంగ
                నొసలు ద్రిప్పుచు బొక్కి నోరుగదల
    నొడలి చర్మకబెల్ల మడతలు వారంగఁ
               బలపల వెలిబట్టతల దలిర్ప
గీ. వీధ్రకృష్ణాజినము చుట్ట వెనుకవ్రేల
    దండ మొకజేత రాగిపాత్ర యొకచేతఁ
    బూని యచ్చోటి కొక వృద్ధభూసురుండు
    వచ్సె నిట్టూర్పు లడర జీవచ్ఛవముగ.

ఇస్సురని నిట్టూర్పులు నిగిడింపుచుఁ గృష్ణాజినము దింపి యతి ప్రయత్నమున నాచెట్టునీడం గూర్చుండి రాగిజారీలోని చిన్నపాత్రలో గొంచెము నీరువోసుకొని త్రాగి వార్చి యిటు నటు చూచుచు నా ప్రాంతమందున్న విక్రమార్కుంగాంచి, ఆ కూర్చున్నవా రెవ్వరుబాబూ! అని అడుగుటయు.

విక్రమార్కుఁడు - భూసురోత్తమా! నమస్కారము. నేనొక బాటసారిని. మీవలనే వచ్చి యిందుఁ గూర్చుంటిని.

బ్రాహ్మణుఁడు - (ఆశీర్వదించి) ఎందుఁబోవుచున్నావు బాబూ?

విక్ర - ఉత్తరదేశ మేగుచుంటి స్వామీ! మీకు సరిపడఁగా నందేమైన యుదక ముండునా.

బ్రాహ్మ - అయ్యో మిగులకేమి ? తృప్తిగా గ్రోలుఁడు అని పంచ పాత్రలో పోసి యిచ్చెను.

విక్ర - నాలుగు పాత్రల యుదకము ద్రావి మేను చల్లఁబడ అమ్మయ్య ఇప్పటికి నేను బ్రతికితిని. బ్రాహ్మణుఁడా! నీకు మంచి పుణ్యమురాఁగలదు. స్వామీ! మీ రెందుఁబోవుచున్నారు ? ఎందుండి వచ్చుచున్నారు ?

బ్రాహ్మ - బాబూ! మాది మణిపురమను నగ్రహారము. ఉత్తరదేశ మందున్నది. ఏండ్లుగడిచిన తరువాతఁ బెండ్లి యాడితిని. సంతానము గలిగినది. దరిద్రబాధ పడలేక యుజ్జయినీ పురంబున విక్రమార్కుండను మహారాజు, అర్ధికల్పవృక్షంబై యాచకుల భూపతులం జేయుచున్నాఁడని విని యా ధర్మాత్మునిం జూడఁ బోవుచున్నాఁడ నా నగర మిక్కడి కెంతదూరమున్నది బాబూ ?

విక్ర --- పదిదినముల పయనములో నున్నదికాని ఆతం డిప్పు డూర లేఁడు గదా పాపము. చాల శ్రమపడి పోవుచున్నారు. సంవత్సరము వరకు రాఁడని విన్నాను.

బ్రాహ్మ - హా! పరమేశ్వరా! అని నేలంబడి మూర్చిల్లెను.

విక్ర - లేవనెత్తి? విప్రోత్తమా! ఇట్లు దుఃఖించెద వేమిటికి? భూలోకమున నాఁతడే వదాన్యుఁగా యేమి ? మఱియొకని నాశ్రయింపరాదా ?

బ్రాహ్మ -- ( లేచి ) అయ్యో ! నా దరిద్రదేవత నాకంటె ముందుగా వచ్చినదే? అడుగామడగా నడచుచు గంపెడాసతో మార్గఖేదము గణింపక వచ్చుచుంటి. ఇల్లు బయలుదేరి మూఁడునెలలైనది కాళు లెట్లు పొక్కు లెక్కినవియో చూడుడు అక్కటా! విక్రమార్క? నీ దర్శనమగును నా యిక్కట్టులెల్ల బాయునను సంతసముతోఁ గష్టములు లెక్క సేయక వచ్చుచుంటిఁ దండ్రీ నే నిప్పుడేమి జేయుదును? నెందుఁ జొత్తు నాకిఁక మరణమే శరణము తిరుగా వట్టిచేతులతో నింటికిం బోఁగలనా ? అని దుఃఖించుచుండ వారించుచు విక్రమార్కుం డాత్మగతంబున నిట్లు తలంచెను.

అయ్యో ! ఈ బ్రాహ్మణుని పరిదేవనము వినలేకున్నాను. ఇచ్చుటకుఁ జేతఁ గాసైన లేదు. తిరుగా నింటికిం బోయితినేని నా మిత్రులు గదలనీయరు. వీరి దరిద్ర మెట్లు పోఁగొట్టగలనని యాలోచించుచు నయ్యా! ఊరక యేల దుఃఖించెదరు? మీ కానృపతి యేమిచ్చునని తలంచి యరుగుచున్నారో చెప్పుఁడు. మీ దుఃఖము జూడ లేకున్నాఁడ. నీ గుఱ్ఱమమ్మి వచ్చిన సొమ్మిచ్చువాఁడ. మీ యాశయ మెఱింగింపుడని యడిగిన నించుక ధైర్యముతో నిట్లనియె.

పుణ్యాత్మా? విక్రమార్కుండు చూచిన వేయి మాట్లాడినఁ బదివేల నిచ్చునని చెప్పుకొనుచున్నారు. నేను వేదము తలక్రిందులుగాఁ జెప్పగలను. ఇట్టి నాతో సంభాషింపకుండునా? పదివేలైన దొరకకపోవునా ? అని యాసతో వచ్చితిని. బాబూ ! ధర్మాత్ములు దేశమంతట నున్నారు. ఈ గుఱ్ఱము నా నిమిత్తమై యమ్మి వచ్చిన సొమ్మిత్తునని చెప్పి నా దుఃఖము కొంత పోగొట్టితివి. నీవా విక్రమార్కుని కన్న నెక్కుడ వదాన్యుండవువలె నున్నావు. తండ్రీ ఈ గుఱ్ఱమునకేమి వెలయిత్తురు. చెప్పుమని యడిగిన నమ్మహారా జిట్లనియె.

పారుఁడా ! ఈ వారువమునకు నీ కోరిన విత్తము రావచ్చును. ఇది యుత్తమజాతి వీతి. దీనిం గొనఁ దగినవాఁడు దొరకవలయుంగదా. వెనుకకురండు పోవుదమని పలికిన సంతసించుచు నా భూసురుం డయ్యా ! నీవు గుఱ్ఱమెక్కి ముందుగా నడువుము. నేను మెల్లగా వత్తునని చెప్పిన నొప్పుకొనక యీ గుఱ్ఱము మీ సొమ్మైనది బ్రాహ్మణాధీనమైన వస్తువుల ననుభవింపఁ గూడదు. మీరు దీనిపై నెక్కి జూలు పట్టుకొనుఁడు కళ్ళెము పట్టుకొని మెల్లఁగా నడిపింతునని చెప్పిన నయ్యో! నేను గుఱ్ఱమెక్కఁ గలనా? యూరకయే వణకుచుందును. మీరె యెక్కుఁడని నిర్బంధించెను.

విక్రమార్కుఁడు నిర్బంధించి నా విప్రుని బలవంతమున నా గుఱ్ఱముపై కెక్కించి జూలు పట్టించి తాను కళ్ళెము పట్టికొని మెల్లగా నడిపించుచుండెను. అట్లు రెండు మూఁడు పయనములు జరిగించిన పిమ్మట దారిలో మఱి నలువురు బ్రాహ్మణులు దారసిల్లి గుఱ్ఱముపై యవధానిం జూచి నవ్వుచు నిట్లనిరి.

బ్రాహ్మణులు - ఇదేమిటోయి పేరావధానీ ! యీ వైభవ మెక్కడినుండి వచ్చినది ?

పేరావధాని - నన్ను మీతోఁ గలిపికొని రానిచ్చితిరి కారుగదా. కానిండు భగవంతుఁ డేదియేని దారిఁ జూపకుండునా యేమి. వేగఁ బొండు. విక్రమార్కుండు మీ యజ్ఞమును శీఘ్రముగాఁ జేయింపఁగలడు.

బ్రాహ్మ - అట్లనుచుంటివేల ? అచ్చటి వర్తమానములు నీకేమైనం దేలిసినవియా యేమి ?

పేరా - తెలిసినవి పొండు. మీతోఁ జెప్పనవసరములేదు.

విక్ర - మీ రెందుఁ బోవుచున్నారు ?

బ్రాహ్మ - ఉజ్జయినీ నగరమునకు.

విక్ర - అందేమిపని యున్నది ?

బ్రాహ్మ – మేము పౌండరీకమను సవనము దలపెట్టితిమి. ఆ యజ్ఞము విక్రమార్కుని జేయించుమని యడుగుటకై పోవుచుంటిమి. అది నలుబది దినముల క్రతువు దినమున కొక వేయి రూప్యములు కావలయు నమ్మహారాజు దీనిఁ జేయించు నందురా ?

విక్ర - (విచారముతో) ఆ రాజిప్పుడు దేశాటనము జేయుచుండెనని విన్నాను. సంవత్సరమువఱకు రాఁడని తెలిసినది.

పేరా - వీరిం బోనీయుఁడు ఇక్కడ జెప్పనేల ? అక్కడికిఁ బోయినఁ దెలియదా యేమి ? మనము పోవుదము నడువుఁడు.

బ్రాహ్మ - అయ్యసూయాపరుని మాటలకేమిగాని బాబూ మీరు నిజము చెప్పుడు. విక్రమార్కుం డూర లేఁడా ?

విక్ర - లేని మాట వాస్తవమే.

బ్రాహ్మ -- అయ్యయ్యో ! మా యాశ యంతయు భగ్నమై పోయినది గదా. విక్రమార్కా! మార్గమధ్యమంబున ననేక కష్టములుపడి నీ చెంత కరుదెంచు చుంటిమి. నీవు మిగుల దాతవని విని యీ యజ్ఞము జేయింపక బోవుదురా అని తల పెట్టితిమి. ఏదియుఁ గాకపోయినది. అని విచారించిరి.

పేరా - అయ్యా! నిలఁబడియెద రేమిటికి? గుర్రమును నడిపింపుఁడు. వీరి యజ్ఞమునకై దేవతలు వాచియున్నారు కాఁబోలు. విధాయకకృత్యము చేయలేకున్నాము. యజ్ఞయాగము లెట్లుసాగును?

విక్ర - అయ్యా! మీరు విచారింపకుఁడు. నా వెంట రండు. తోసిన సహాయమేదైన జేయుదుంగాక.

పేరా - ఏమండోయి. మీరు వీరిని రమ్మనుచున్నారు ఈ గుర్రమును నా కిచ్చివేసితిరిగదా? దీనిలో గవ్వయైన వానికీయనీయను. తరువాత మీ యిష్టము. వారిదారిని వారిం బోవుదానిని నెత్తికి రాచుకొందురేల? మీరు మెత్తనివారువలెఁ దోచుచుంటిరిగదా.

బ్రాహ్మ - బాబూ! వాని యసూయపర్వతము దెలిసికొంటిరిగదా ? తనకే కాని యెవ్వరికి నెవ్వరు నేమియు సహాయము జేయగూడదు కాఁబోలు. మీరు పరోపకార పారీణులవలెఁ గనంబడుచుంటిరి. మీరెవ్వరు స్వామీ ?

విక్ర - నేనొక బాటసారిని. మీ పరిదేవనము విని యోపిన సహాయము జేయుదునంటి. నా యొద్ద ధనముండికాదు.

పేరా - పాపము. నిజముగా వీరియొద్ద నేమియును లేదు. జాలిగలవాఁ డగుట నా దరిద్రము విని యీ గుర్రము నా కిచ్చివేసెను. ఇఁక మీకే మీయఁగలడు ? మీ రెందేనిం బొండు.

విక్ర - (నవ్వుచు) అవధానిగారూ ! మీకిచ్చినది మరలఁ బుచ్చుకొనను మీరు విచారింపకుఁడు. వారు మనవెంట వచ్చిన మీ కేమి కొదవ యున్నది ? రానీయుఁడు.

బ్రాహ్మ - అయ్యా ! తమ సాహసము స్తుత్యమై యున్నది. కాని మీ యొద్ద నేమియు లేదనుచున్నారు. మా గోరిక కొలఁది కాదు. ఎట్లు పూర్తిజేయ గలరు?

విక్ర - అది నే నిప్పుడు చెప్పజాల, వచ్చిన రండు. అని చెప్పుటయు వారు కప్పు డింకొక తెఱవు లేమింజేసి మఱలి యాతనివెంటఁ బోవుచుండిరి విక్రమార్కుండు తన యంగసౌష్టవము తెల్లముగాకుండు నట్లేదియో మైపూతఁ బూసికొని కారణంబున సామాన్యుఁడువలె గనంబడుచుండెను. వారందరుంగలసి నడచుచు నాలుగు దినంబులకుఁ జంద్రగిరి యను పట్టణంబుజేరి సత్రంబున బసఁజేసిరి.

విక్రమార్కుం డా నాఁడు సాయంకాల మంగడికిఁ దీసికొనిపోయి యా వారువము నమ్మఁజూపెను. దాని లక్షణములు పరీక్షించి యుత్తమజాతి యశ్వంబని తెలిసికొని పెక్కండ్రు మూఁగి బేరములు సేయదొడంగిరి. విక్రమార్కుం డిట్లు బేరము సెప్పెను. ఈ గుర్రము వెల పదివేలు. సొమ్మంతయు నిప్పు డిచ్చివేయవలయును. నెల దినముల లోపల వడ్డీతోఁ బదొకండు వేలిచ్చినేని నా గుర్రము నా నా కిచ్చివేయవలయును. ఈ నియమముల కొప్పుకొనియే దీనిం గొనవలయునని ప్రకటించెను.

తల్లక్షణంబుల నెఱింగిన బేహారి యొకండా విధుల కొడంబడి యప్పుడే యా సొమ్మిచ్చి యా యశ్వరత్నమును గైకొనియెను. పిమ్మట నా నృపాలుం డా విత్తమంతయు నా భూసురోత్తమున కర్పించి నమస్కరింపుచు మహాత్మా ! మీరు నన్నపుడు దాహమిచ్చి బ్రతికించితిరి. మీకుఁ దగిన యుపకారము జేయలేకపోయితిని. ఇప్పటికి దీనందృప్తిఁబొంది యింటికి దయచేయుఁడు. సంవత్సరము దాటిన పిమ్మట నెప్పుడైన నుజ్జయినీ పురంబునకు రండు. నా కాపుర మా పురమే. విక్రమార్కునితో జెప్పి తగిన పారితోషిక మిప్పింతునని పలుకుచు నా విప్రుని సంతోషపెట్టి యంపివేసెను.

తన యశ్వరత్నము వారి వెంటఁ బోవక చిక్కులు పెట్టుచుండఁ జూచి దాపునకుఁ బోయి దువ్వుచు దురంగ సార్వభౌమా! నీ మూలమున నేనా బ్రాహ్మణుని ఋణము దీర్చుకొంటి. నీవు జేసిన మేలు నా కెవ్వరుం జేసియుండలేదు. నా యావజ్జీవనము నీ మేలు మఱచువాఁడను కాను. నీకును దీనఁగొంత సుకృతముగలుగఁ గలదు. పరోపకృతికన్నఁ బురుషునకు సార్థకమైన పని వేఱొకటి లేదు. పదివంతులు గడుపు లోపల వీరి సొమ్మిచ్చి వేసి నిన్నుఁ దీసికొన గలను. విచారింపకుమని కన్నీరుఁ దుడుచుచు బుద్ధులు చెప్పి వారి కర్పించుటయు నది సంకలింపుచు సంతోషముతో వారి వెంటఁ బోయినది.

పిమ్మట విక్రమార్కుం డానలువురు బ్రాహ్మణుల వెంటఁబెట్టికొని యొక వీధింబడి పోవుచుండ నొక చాటింపు వినంబడినది. అందు ఈ నగర ప్రాగ్భాగముననున్న యెడారిలో రేపు మూఁడు గంటలకు గుఱ్ఱపు పందెములు ప్రారంభింతురు. అందులకు వచ్చువారందఱు నుదయ మారుగంటలకే హజారమునకువచ్చి పేరులువ్రాయించుకొని పోవవలయును. మొదటి పందెము లక్ష, రెండవ పందెముఏబదివేలు. మూఁడవ పన్నిదము ఇరువదివేలు. నాలుగవది పదివేలు అని యున్న పత్రికల బంచిపెట్టుచుఁ జాటింపుచున్నారు.

ఆ పత్రికం జదివికొని విక్రమార్కుండు. మిక్కిలి సంతసించుచు విప్రులారా ! ఇఁక మీ జన్నము పూర్తికావచ్చును. ధనాగమోపాయము దైవము జూపట్టెను. గుఱ్ఱ మెక్కి నేనీ మొదటి పందమే గెలువఁగలను. సందియము లేదు. మీరు వచ్చిన వేళ మంచిదేయని చెప్పిన నుబ్బుచు వారిట్ల నిరి.

వదాన్యమణీ ! నీవు విక్రమార్కుని కన్న నధికుండవని తోచుచున్నది. మా భాగ్యవశంబున నీవు మొదటి పందెము గెలిచినచో నా సొమ్మంతయు మాకిత్తువా? అనుటయు నతండు నవ్వుచు నా కేమియు నక్కరలేదు కాని ముందుగా గుఱ్ఱమును విడిపింపవలయును. దానికి బదొకండు వేలు కావలయు నెందైన నప్పుదేఁగలరా ? ఆసొమ్మంతయు మీ కిత్తునని పలికిన వారిట్లనిరి.

పుణ్యపురుషా! మేమా మాత్రము సమర్థులమైనచో నింతదూర మేల వత్తుము మమ్ము నమ్మి సొమ్మెవ్వరిత్తురు. మీరే యాలోచింపవలయునని పలికిరి. అప్పుడు విక్రమార్కుండు ఆలోచించి వెంటనే యా వర్తకునియొద్దకుఁ బోయి సార్థవాహా! ఈ యూర గుఱ్ఱపు పందెములు జరుగుచున్నవి. రే పీ గుఱ్ఱము నా కొకసారి యెరువిత్తువా? గెలిచిన సొమ్ములో నాలుగవవంతు నీ కిత్తునని యడిగిన నతం డందుల కియ్యకొనఁ డయ్యెను.

ప్రభావతికథ

ఆ ధన మప్పుడుగుటకై యా విప్రుల వెంటనిడుకొని విక్రమార్కుం డా యూర ధనవంతుల నరయుతలంపుతో వీధులందిరుగుచుండ నొకచో బెద్దమేడ గనంబడినది. అది భాగ్యవంతులదని తలంచి సింహద్వారము దాపునకుఁ బోయి లోపలి వారిం బిలువఁదలంచుచు నలుమూలలు పరికింప నందొక ప్రకటనపట్టము వేలఁగట్టబడి యున్నది.

ఇది ప్రభావతి యను వేశ్యయిల్లు. ఈ వారకాంత తన ప్రక్కకు కరుదెంచిన యుత్తమవంశస్థుడగు సరసున కొకరాత్రిఁ బదివేలు రొక్కమీయఁ గలదుఅని యా బల్ల యందు సువర్ణాక్షరములతో వ్రాయఁబడి యున్నది. దానిం జదివికొని విక్రమార్కుం డోహో ! ఇది మిక్కిలి వింతగానున్నదె గణిక యెప్పుడును సరసుని వలన వస్తువాకర్షించును గాని విటున కిచ్చుట నెందునుం జూడలేదు. ఇందుల కెద్దియేని కారణముండక పోవదు. ఉండుఁగాక నేనీ రాత్రి దీనియింటఁ బండుకొని యాసొమ్ము బుచ్చుకొని రేపు గుఱ్ఱమును విడిపించెద మంచి యాధారమే దొరికినదని సంతోషముతో ముచ్చటింపుచున్న సమయంబున నా దారిం గొందఱు పౌరులు పోవుచు వారిగుజగుజములు విని నవ్వుచు నిట్లనిరి.

అయ్యలారా! మీరు పరదేశులు కాఁబోలు. అందలి ప్రకటన జదివికొని మరియుచున్నారాయేమి? చాలు చాలు ఇటు రండు. అది వారకాంత కాదు. మృత్యు ముఖము. ధనాశాగ్రశిత మానసులై పెక్కండ్రు దానింటికిం బోయి యమలోకంబున కరిగిరి. ఆ వేశ్య జగన్మోహనాకారము గలదియే కాని దాని నొక బ్రహ్మరాక్షసుఁ డావేశించియున్నవాఁడట. రాత్రి విటుఁడు వోయి దాని నంటినతోడనే యా రక్కసుం డామెను వదలి వానికుత్తుక నొక్కి చంపి రక్తము పీల్చునఁట. పదిదినముల కొకసారి యైన నరరుధిరము దానవున కబ్బనిచో నా వేశ్యనే బాధించునఁట. అందుల కీలంజ యిట్టి ప్రకటన పత్రికఁ గట్టించినది తెలియని వారు పెక్కండ్రు వోయి యా బ్రహ్మరాక్షసున కాహార మగుచున్నారు. మీ రిందు నిలువక మీ దారిం బొండు. ఎఱుఁగని వారి కీవార్తఁ దెలుపుటకే యీ యూరివారి చేత మేమిందు నియమింపఁబడితిమి అని యా వృత్తాంత మంతయు వా రెఱింగించిరి.

ఆ వార్తఁ విని ధాత్రీసురు లాత్రము జెందుచు బాబో! ఇందుండరాదు. తెలియక వచ్చితిమి. అని పలుకుచు వెఱపుతో నా యరుగు దిగి వీథి నిలువంబడి వేఱొక చోటికిఁ బోవుదము రండని విక్రమార్కునిం జీరిరి. అతండు నవ్వుచు విప్రులారా? మీరిట్లు వెఱచెదరేల? మీ మంత్రబలంబున నా బ్రహ్మరాక్షసుని హతము గావింపలేరా? కానిండు మీరింటికిం బోవుఁడు నేనీ రాత్రి యిందుండి ప్రొద్దుట సొమ్ము తీసికొనివచ్చెద. బ్రహ్మరాక్షసునకు నేను వెఱవనని పలికి యా యరుగు దిగకున్నంత నా పౌరులు బాబూ! నీ పుణ్యము మాకు సొమ్మక్కరలేదు. జన్నమిప్పుడు కాకున్న వేఱొకప్పుడు సేయఁగలము మా దారిని మేము పోయెదము. నీ వూరక చావకుము. రమ్ము రమ్ము అని పలుకుచు నాతని బలవంతమునఁ గ్రిందకు లాగికొని వచ్చి యిట్లనిరి.

సీ. బ్రహ్మరాక్షసునిచేఁ బడకుండ బ్రతికి యి
               క్కడకు వచ్చుట మొక్కగండ మదియ
    దాటిన వేశ్య విత్తము నిత్తు నన్నది
               యీయంగఁదగుగదా? యిచ్చెనేని
    యాధనంబంది బేది బేహారి మున్నట్లు
               వారువం బీయంగ వలయుఁ గాదె
    యిచ్చిన యంతనే వచ్చెనో విత్తంబు
               గెలువంగఁ దగుఁగదా తొలిపణంబు
గీ. ఇన్ని గండంబులును గతియించినపుడు
    కాదె మా కోర్కె తీరుట? కదలిరమ్ము
    వలదు పుణ్యాత్మా! యిందుఁ బోవంగ వలదు
    సొమ్మునందలి యాసఁ జచ్చుట గుణంబె.

అని పలికిన విని నవ్వుచు నవ్వసుధాపతి నా కేమియు వెఱపులేదు. సులభంబున వానిం గడతేర్చి సొమ్ము తెచ్చెద. మీరు బసకుఁ బొండని యెంత జెప్పినను వినక యతని వెంటఁ బెట్టికొని యాజన్నిగట్టులు సత్రంబునకుం బోయిరి.

ఉన్నట్లే యుండి చీఁకటి పడినతోడనే విక్రమార్కుండువారికి దెలియకుండ వేఱొక మార్గంబున భోగము దాని యింటికిం జని వీథి తలుపుగొట్టెను. దాని పరిచారిక వచ్చి తలుపు తీసి మీరెవ్వరని యడిగినది. నేనొక విటుండ. మీ గోడకుఁ గట్టిన ప్రకటన పట్టము జదివికొని ప్రభావతిఁ జూడ కరుదెంచితిని. అందు వ్రాయఁ బడినరీతి తెల్లవారగనే పదివేలరూప్యములు మీ సానియిచ్చునా? అని యడిగిన నా పరిచారిక తల యూచుచు మెల్లగా నిట్లనియె.

భుజంగా! తెల్ల వారినపిమ్మట నీవు బ్రతికియుండినగదా పదివేలు నందుకొనుట. వెఱ్ఱి యాసపడి వచ్చితివి. మఱియొకచోటికిఁ బొమ్ము. ఇందు వచ్చినఁ జచ్చి పోవుదువు. నీయందుఁగల మచ్చికచే నిట్లు చెప్పుచున్నాను. మా సాని నీరాక యెఱుంగదు. వేగబొమ్మని పలికినది.

అతండు నవ్వుచుఁ జేటీ? నేను మీబోటిం గూడక పోవువాఁడంగాను. బ్రతికియున్న బ్రొద్దున్న సొమ్మిచ్చునా? అని యడిగిన నీ కర్మము నేనేమి జేయుదును. రమ్ము సొమ్మియ్యక పోవదని పలుకుచు నతని లోపలికిఁ దీసికొనిపోయి కాళ్ళు కడిగి హారతులిచ్చి బలిపురుషునకుఁ జేయు నుపచారము లన్నియుం గావించినది. అవ్వారకాంత సౌధాంతరము జయంతము కన్న వింతగా నున్నది. లోపల గంట మ్రోగినతోడనే పరిచారిక నృపాలునిఁ దదభ్యంతరమునకుఁ దీసికొనిపోయినది. అప్పుడు ప్రభావతి వింతగా నలంకరించుకొని జగన్మోహనాకారముతో నొప్పుచుఁ దదంతికమున కరుదెంచి నమస్కరించి మెడలో బుష్పదామంబు వైచి తీసికొనిపోయి తల్పంబునం గూర్చుండబెట్టిఁ విడెమిచ్చి పూసురటిచే విసరుచు నిట్లనియె.

మనోహరా! మీరెందలివార లీయూరెప్పుడు వచ్చితిరి? ఎందు బోవుచుంటిరి? మీ కులశీలనామంబు లెట్టివని యడిగిన విక్రమార్కుం డిట్లనియె. భామినీ మాది పడమరదేశము. మేము ద్విరాశ్రితులము. ఉత్తరకురుభూములకుం బోవుచు నేఁటియుదయమున నీయూరు వచ్చితిమి. సాయంకాలమున మీ యింటిగోడకుఁ గట్టిన ప్రకటన పట్టముజూచి సొమ్మవసరము వచ్చినందున నిందు వచ్చితిమి. అందుఁ బదివేలే యని వ్రాసితివి. నాకు మఱియొక వేయి యవసరమున్నది. బదులిత్తువేని యెల్లుండి తీర్పఁగలనని పలికిన నక్కిలికి లోపల నవ్వుకొనుచు నయ్యో ? పాపముఁ వీఁడు తనకు మూడనున్న విపత్తెఱుంగక సొమ్మడుగుచున్నాఁడు. కానిమ్ము. ఈ నడుమ నెవ్వరు రాకపోవుటచేత నాయసుర నన్నే పీల్చుచున్నాఁడు. వీనిం దిని కొన్ని దినములు నాజోలికి రాకుండునుగదా అని యాలోచించుచు స్వామీ? మీరెంతమాత్రము సందియ మందకుఁడు. తెల్ల వారినతోడనే మీరు కోరిన ధన మిత్తునని శపథము జేసినది. పిమ్మట నాకొమ్మ యమ్మనుజపతికి గంధము బూసి తా నతనిచేఁ బూయించుకొనుచున్న సమయంబున సంవర్తిసమయవరాహకగర్జారావమువలె భయంకరమగు కంఠస్వరముతో నోరీ! దురాత్మా! నీ వెవ్వఁడవు? మధిష్టితయగు బింబోష్టింగూడ వేడుకపడుచున్నావు. నిలునిలు మని పలుకుచు నొక బ్రహ్మరాక్షసుండు తత్ప్రతీకములనుండి యావిర్భవించి విక్రమార్కుని మెడఁ బట్టికొనఁబోవు నంతలో నతం డట్టె

క. ఓరీ? క్రూర నిశాచర!
   నారీమణిఁ బట్టి వచ్చు నరుల న్భుజ వి
   స్ఫారబలంబునఁ జంపు దెఁ
   రా రమ్మిఁక నీకు మూడెరా మృతి నాచేన్.

అని పలుకుచుఁ దాటాకువలె మడతవెట్టి యిమిడ్చి దాచి యుంచిన చంద్రహాసంబు దీసి చేతితో సాపుగ దుడినంత వజ్రాయుధమువలె నిలఁబడినది. దక్షిణహస్తంబున నాఖడ్గంబు ధరించి గిరగిరం ద్రిప్పుచు రౌద్రావేశముతో వానిపయిం బడి తన్ముష్టిఘాతంబులు గణింపక వానిం జిక్కఁబట్టి యిట్టట్టు కొట్టుకొనుచుండఁ దత్కంఠం బుత్తరించి పారవైచెను.

అప్పు డప్పడతి యొడ లెఱింగి లేచి యా రాక్షసకళేబరంబు జూచి యడలుచు నయ్యొడ యని యడుగుఁదమ్ములంబడి మహాత్మా! యీజెడుగు నామేన యౌవనము పొడసూపినది మొదలు నన్నావేశించి కష్టపెట్టుచున్నాఁడు. ఎందరినో పురుషసింహులఁ బొట్టం బెట్టుకున్నాడు ఇట్టి దుష్టుని గడియలో మడియఁజేసితివి. నీవు నన్గావ వచ్చిన భగవంతుఁడవు గాని మనుష్యు మాత్రుండవుగావు. నాకున్న సొత్తుతోఁ గూడ నీ యధీన నైతిని. నీయిష్టము వచ్చినట్లు చేసికొనుమని ప్రార్థించినది.

అయ్యతివమాటల కతండు సంతసించుచుఁ గానిమ్ము. నీవు నా యధీన వైతివిగదా. నేను జెప్పినట్లు నడుచుకొనవలయు. పిమ్మట విమర్శింతు నిప్పుడు నా కిత్తునన్న ధనం బిమ్ము. పనియున్నదని పలికిన నక్కలికి ముఱియుచు నతండుకోరిన ధన మిచ్చినది. దానిం బుచ్చుకొని యారాజు సూర్యోదయము కాకమున్ను సత్రంబునకు బోయి యావిప్రుల లేపెను.

వా రతనిఁ బునర్జీవితునిగాఁ దలంచి కౌగలించుకొనుచుఁ బుణ్యాత్ముడా? నీ వెవ్వఁడవో మే మెఱుఁగము. రాత్రి నీ నిమిత్తమై మేము పడిన సంతాప మేమని చెప్పుదుము. బ్రతికి వచ్చితి వింతియ చాలునని పలికిన నతండు నవ్వుచుఁ దాను దెచ్చిన ధనము జూపి వీని బేహారికిచ్చి నా గుర్రమును విడిపించుకొనిరండు. నే నీ లోపల హజారమునకుఁబోయి పేరు వ్రాయించుకొని వచ్చెదనని చెప్పి వారిని వర్తకునియొద్ద కనిపి తాను రాజపురుషులకడకుఁ పోయి యిట్లనియె.

నే నుత్తరదేశస్థుఁడ. మీ గుర్రపు పందెముల వార్తవిని యిందు వచ్చితిని. నాపేరు బలహారి యందురు. వ్రాసికొనుఁడని చెప్పినంత వారాపేరు వ్రాసికొని మూఁడు గంటలకు రమ్మని చీఁటి వ్రాసియిచ్చిరి. అతండు వెంటనే సత్రమునకు వచ్చెను. బ్రాహ్మణులు తెల్ల బోయి చూచుచు మా కా వర్తకుడు గుర్ర మియ్యనన్నాఁడు. మీరె రావలయునట. వానికి గుర్రము తిరుగా నిచ్చుట కిష్టములేదు, ఏమి చిక్కులుపెట్టునో యని పలికిన నంతతో నమ్మహారాజు వారిని వెంటఁబెట్టికొని బేహారి యింటికిం బోయి వడ్డీతో సొమ్ము తీసికొని గుర్రము నిమ్మని యడిగెను.

వాఁ డేవియో వంకలుపెట్టి యా నియమములు చెల్లవనియు న్యాయస్థానమునకుఁ బోయి చెప్పికొనినఁగాని గుర్రము నియ్యననియుం జెప్పి గద్దించెను.

వాని కపటము గ్రహించి విక్రమార్కుఁడు మెల్లిగా వాని గుర్రపుసాల యొద్దకుఁ బోయి యశ్వరత్నమా! రమ్ము రమ్ము. అని పిలుచుచు సంజ్ఞగా నీల పట్టెను. అప్పుడా కత్తలాసి కాళ్ళకుఁ గట్టిన లాతపు త్రాళ్ళం దెంచుకొని యడ్డము వచ్చిన వానిం దన్నుచు నతిరయంబున విక్రమార్కుం డున్నచోటికి వచ్చి నిలఁబడినది.

దానిం దువ్వుచు నెవ్వరికిం జెప్పక రివ్వునఁ బైకెక్కి జీనును గళ్ళెము లేకుండఁగనే సత్వరముగా నడిపించుచు నరనిమిషములో పణప్రదేశమునకుఁ బోయి నిలఁబెట్టెను. ఆ ప్రదేశమున నశ్వారోహకు లందఱువచ్చి తమ గుర్రముల శ్రేణిగా నిలఁబెట్టి యున్నారు. పదినిమిషములు మాత్రమే వ్యవధి యున్నది. జీనులేదు. కళ్ళెము లేదు. అలంకారములేదు. బికారివేషము. అట్లున్న విక్రమార్కునిం జూచి యందున్న సాదులందరు పకపక నవ్వ మొదలుపెట్టిరి.

అతం డెవ్వరివంకం జూడక సమయము ప్రతీక్షింపుచుండ నింతలో గంట మ్రోగినది. రౌఁతులు తమ తమ గుర్రములను వదలిరి. గమ్యస్థానము మూడు యోజనముల దూరములో నున్నది. అందొక యున్నత ప్రదేశమున వ్రేలంగట్టఁబడియున్న రత్నమాలికం దీసికొని ముం దిం దెవ్వరు చేరుదురో వారికి మొదటి కానుక లభించును.

విక్రమార్కుం డా మాలిక నందుకొని వచ్చుచు వారి కెదురుపడెను. ఆ వస్తువుం దెచ్చి దిరుగ రెండవమారు పోయి వారిం గలసికొని యందలి వస్తువులందక కొందల మందుచున్న వారి నతిక్రమించి చంద్రహాసాగ్రంబున బంధనరజ్జువు గోసి రత్నవలయం బందుకొని వారికన్న ముందు సభ్యులం జేరెను. తదశ్వారోహణపాటవము జూచి యందున్న సభ్యులందఱు వెఱఁగందుచు నోహో! ఈతండు దివ్యుండుగాని మనుష్యుండు గాఁడు. వీని గుర్రమునకు ఱెక్కలున్నవి కాఁబోలు. గరుత్మంతుఁడు గూడ నంతవేగము పోయిరాలేఁడే? ఆహాహా! యని యాశ్చర్యమందఁ జొచ్చిరి. రెండుపణముల నతండు గెలిచెనని సభ్యులు వ్రాసి యిచ్చిరి. అందున్న వారందఱు నతని పుష్పములచేఁ బూజించిరి. కిన్నరుఁడో సిద్ధుఁడో సాధ్యుఁడో కావలయు మనుష్యుడు కాఁడని స్తుతియింపుచుండిరి.

అంతలో నా బేహారి యతిరయంబునఁ బరుగిడుకొని వచ్చి అయ్యా! నిజము గీ గుర్రము నితండు నా కమ్మివేసెను. నా యనుమతి లేనిదే దొంగతనముగా దీసికొనివచ్చి పందెము గెలిచెను. దానంజేసి వీనిలోఁ గొంత పాలీయవలయు నని తగవుపెట్టెను. విక్రమార్కుండు వానితో నేమియు మాట్లాడలేదు. నలువురు పాఱులు నపారసంతోషముతో వచ్చి విక్రమార్కుని శక్తి కచ్చెరువందుచు వినుతింప దొడంగిరి.

అంతలో నా నగరాధీశ్వరుండు సుశీలుండను రాజు విక్రమార్కుని యమానుషతురంగారోహణసామర్థ్యము విని వెఱఁగందుచు పణద్రవ్య మర్పింప నవ్వీరు నిచ్చటికిఁ దీసికొనిరండని కింకరులం బం పెను. వా రాహయముతోఁ గూడ విక్రమార్కుని నూరేగింపుచుఁ బౌరకాంతలు సౌధంబులనుండి పుష్పవర్షము గురిపింప నన్నృపాలుని యోలగంబునకుఁ దీసికొనిపోయిరి.

నలువురు బ్రాహ్మణులు బేహారియు నతనివెంటఁ గొల్వున కేగిరి. మఱియు బౌరసామంతజానపదాదులు వేనవేలు సభనలంకరించిరి. అప్పుడా నృపాలుండు విక్రమార్కునిఁ బెద్దగా గౌరవించి వినుతింపుచు మహావీరా? మీదే దేశము? పేరేమి? ఎందు బోవుచు వచ్చితివని యడిగిన వెనుక యధికారులతోఁ జెప్పినట్లె చెప్పెను. అంతలో నా బేహారి నిలువంబడి మహారాజా! ఈతం డీ గుర్రము నా కమ్మివేసి సొమ్ము తీసికొనియెను. నా యనుమతి లేనిదే బలవంతమునఁ దీసికొనిపోయి పందెము గెలిచెను. పణము గెలిచినది నా గుర్రము. ఆసామ్ములో నాకుఁ గొంతలాభము రావలసియున్నది. ఇప్పింపుఁడని కోరిన నరేంద్రుం డిట్లనియె.

బలహారీ నీ గుర్ర మమ్మికొన నవసర మేల వచ్చినది? అమ్మి బలవంతముగాఁ దీసికొని రానేల? ఇందలి నిజమేమని యడిగిన నయ్యొడయండు వీరికంతయు దెలియును. వీరి నడుగుమని యా బ్రాహ్మణులం జూపుటయు రాజు మీరెఱింగినది చెప్పుఁడని పలుకగా నందొక వాచాలుండగు భూసురుం డిట్లనియె.

మహారాజా ! ఈతండు శిబిదధీచికర్ణాదుల మించిన వదాన్యుఁడు. ఈతని చరిత్రము వినిన మీరు మిక్కిలి వెఱఁగుపడుదురు. వినుండు -

సీ. ఎలమి గ్రుక్కెడు దాహమిచ్చిన పాఱున
                కయంతబొసంగె దా హయమునమ్మి
    యజ్ఞదక్షిణ నిత్తునని మాకు వరమిచ్చి
               విటతఁ గైకొని చొచ్చె వేశ్యయిల్లు
    బ్రహ్మరాక్షసుని వారవధూసమాశ్రితుఁ
               బరిమార్చి దాని యాపద నడంచెఁ
    దన వారువమునుఁ జేకొని వేళకట కేగి
              ధృతిమీర రెండు పందెములు గెలిచె.
గీ. తద్ధనంబెల్ల మాకర్పితంబు సేసె
    నిట్టి వితరణగుణశాలి యిట్టి సుమతి
    యిట్టిసాహసశూరుఁ డెందేనిఁ గలడెఁ
    గుణసముద్రుండు విక్రమార్కుండుగాక.

. మహారాజా! ఈ మహానుభావుఁ డెవ్వఁడో మే మెఱుంగము. మే ముజ్జయినికిఁ బోవుచుండ దారిలో నెదురుపడి మే మడిగిన విక్రమార్కుం డూరలేఁడని చెప్పెను. మే మందులకు వగచుచుండ మమ్మోదార్చి యోపిన సహాయము జేయుదునని తీసికొనివచ్చెను. దాహమిచ్చిన వృద్ధ భూసురునకు దా నెక్కివచ్చిన గుర్రమునిచ్చి యందు పై నెక్కించి కళ్ళెము పట్టుకొని నడిపించుచు నీ యూరు దీసికుని వచ్చెను. గుర్రమును బదివేలకీ బేహారి కమ్మిన మాట వాస్తవము నెలలోపున సహస్రపరిమితంబగు కుశీదముతో నా సొమ్మినచోఁ దిరుగా గుర్రమిచ్చున ట్లొడంబడిక వ్రాయించి పుచ్చుకొంటిమి. ఇదిగో చూడుఁడు. గుర్రపుపందెముల వార్తవిని యుబ్బుచు బేహారి కీయవలసిన సొమ్మునకై మృత్యుముఖంబని యెల్లరు చెప్పుచుండ లక్ష్యము సేయక బోగముదాని యింటికిం బోయి దాని నంటియున్న బ్రహ్మరాక్షసునిం గడతేర్చి యా సొమ్ము దెచ్చి యిచ్చి గుర్రమీమన్న నీ దుర్మార్గుఁ డీయక తగవు పెట్టెను.

క్షణము దాటిన పందెములవేళ మిగిలిపోవును. అప్పుడు బుద్ధిమంతుఁ డిత డాలోచించి వాని కపటము దెలిసికొని యా గుర్రపుసాలకుఁ బోయి పిల్చినంతఁ గట్టులఁ ద్రెంపుకొని యా హయం బతిరయంబున వచ్చి యతనిచెంత నిలిచినది. దాని నెక్కి రెండు పందెములును గెలిచెను. బేహారి కీయవలసిన రొక్కము తక్క తక్కిన సొమ్మంతయు మా యజ్ఞమున కర్పించి చీటినిచ్చెను. గవ్వయైన దానందు ముట్టఁ డయ్యె. నిట్టి వదాన్యచక్రవర్తి యెందున్న వాఁడని చెప్పి మరియు -

సీ. కవచకుండలము లొక్కటి మాత్రమే యిచ్చి
              కర్ణుండులోక విఖ్యాతిఁగాంచె
    మృతికిఁ గాల్సాపిన యతివృద్ధుఁడు దధీచి
              యెముక నిచ్చి సుకీర్తి నెసఁక మెసఁగెఁ
    గడిగి మూఁడడుగుల పుడమి శ్రీపతికిచ్చి
              పేర్మిమై బలి పెద్దపేరు వడసె
    వెలగపండంత క్రొవ్విన మేని మాంస మీ
              బూని యాశిబి యశఃపూర్ణుండయ్యె
గీ. కలదె వారల కీ వివేక ప్రశాంత
    మీయుదారత యీశౌర్య మీప్రభావ
    మిట్టి సాహస మీధైర్య మీరక్తి
    వసుధఁ దొలిపుణ్యమున పేరు వచ్చెఁగాని.

అని స్తుతియింపుచు నా వృత్తాంత మెఱింగించుటయు నా నృపాలుండు దదీయౌదార్యమున కాశ్చర్యమందుచుఁ బరాక్రమము నభినందిచుచుఁ బెద్దగా గౌరవించెను కాని యతండు విక్రమార్కుండని తెలిసికొనలేకపోయెను.

విక్రమార్కుండు వారి స్తుతివచనంబుల కుబ్బక యపరాధియని రాజుచే శిక్షింపఁబడిన బేహారిని విడిపించి వాని కీయవలసిన సొమ్మిప్పించి తనకు రాజిచ్చిన సొమ్మంతయు బ్రాహ్మణార్పణము గావించి నృపతి యనుమతి వడసి బ్రాహ్మణులతో గూడ వారాకాంత యింటి కరుదెంచెను.

అతని రాక కెదురు చూచుచున్న యయ్యుతివయు, దచ్చరణంబుల వ్రాలి మహాత్మా! నేను నీ పాదసేవకురాలనైతిని. పనులకు నియోగింపుమని పలికినఁ జిరునగవుతో నతం డిట్లనియె.

సుందరీ నీ వీ ధరణీబృందారకులం జూచితివా? వీరు పౌండరీకమను మహాక్రతువు సేయఁ దలపెట్టిరి. అందు మహావ్రతమగు సవనాంతర్భాగమున వేశ్యాసంభోగజనితంబగు బ్రాహ్మణశుక్లం బగ్నిహోత్రున కాహుతి సేయవలసిన విధి యున్నది కావునఁ దత్సవనంబు గణికాజన ప్రధానికంబని చెప్పుదురు.

నీవు వీరి వెంటఁ జని యయ్యజ్ఞంబునకుఁ గావలసిన సహాయంబు గావింపవలయు ననియే నా యాదేశము నీకునుఁ బుణ్యము రాఁగలదనిచెప్పి యొప్పించి యా యొప్పులకుప్పను వారి యధీనం గావించి యతం డాయూరు విడిచి యవ్వలఁ జనెను.

అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. యవ్వలి కథ మఱల నిట్లు చెప్పఁ దొడంగెను.

204 వ మజిలీ

మన్మధసంజీవినికథ

విక్రమార్క మహారాజు బ్రాహ్మణుల నట్లు సంతుష్టిపఱచి సువర్ణస్థంభదర్శనవ్యగ్రచిత్తుండై యా నగరము విడిచి యుత్తరాభిముఖముగా నరుగుచు నొకనాఁడు సాయంకాలమునకు నొక యగ్రహారము జేరెను. అప్పటికిఁ గొంచెము చీకఁటి పడుచుండెను. నడివీధిలోనున్న రావిచెట్టు మొదటఁ గట్టబడిన రచ్చబల్లపైఁ గూర్చున్న యొక బ్రాహ్మణకుమారుం డెటు పోవుటకుఁ దోచక నిలఁబడి యున్న విక్రమార్కుని జూచి వచ్చి అయ్యా ! తమ రెందుఁ బోవుచున్నారు? అని యడిగిన నతఁడిట్లనియె .

నే నొక బాటసారి నుత్తరదేశమున కరుగుచున్నాను. ముందరి గ్రామ మెంతదూర మున్నది? అని యడిగిన నా విప్రకుమారుండు ముందు దాపులో నే గ్రామము లేదు. నేఁటి కిందుండి పోవుదువుగాక మా ఇంటికిరండు ఆతిథ్యము పుచ్చుకొని పోవుదురుగాక అని పలుకుచు గుర్రపు కళ్ళెము బట్టుకొని మెల్లగా దనఇంటికిఁ దీసికొనిపోయెను.

గుఱ్ఱమును గట్టఁదగిన తావునఁ గట్టించి లోపలికిఁ దీసికొనిపోయి గౌరవించుచు నారాత్రి తానే వంటఁజేసి యా మహాత్మునికిఁ భోజనము పెట్టెను. భోజనానంతరమున విక్రమార్కుం డతఁడు జేసిన సత్కారమునకు మిక్కిలి సంతోషించుచు