కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/202వ మజిలీ
విక్ర -- తరుణీ! నీ పుణ్యము బిగ్గరగా మాట్లాడకుము. మెలకువ రాఁగలదు.
మల - మనోహరా! స్వప్నమో నిజమో యేదైన నేమి? నేను దలిదండ్రుల చాటు దానంగదా? ఇప్పుడు వేగిరింపనేల శాస్త్రోక్తవిధినే నన్ను బరిగ్రహింపవలయు. నేను మలయధ్వజుఁడను నృపాలుని కూతుఁర. నా పేరు మలయవతి యండ్రు. కొలదిదినములలో నాకు స్వయంవరమహోత్సవము జరుపుదురు. అందు దేవర విచ్చేసి నన్నుఁ పరిగ్రహింపవలయు నిదియే నా యభిలాష అని పలుకుచు నతని చేయి వదలించుకొని యవ్వలికిం దొలగినది. అంతలో నతనికి మదనమంజరి వ్యామోహము గలుగఁజేసి తీసికొనిపోయి యుజ్జయినీపురంబునఁ దదీయతల్పంబునం బండుకొనఁ బెట్టినది.
అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది తదనంతర కథా విధానంబు మఱల నిట్లు చెప్పఁబూనెను.
202 వ మజిలీ
మలయవతి వివాహము
నాఁడు విక్రమార్కునకు వెంటనే మెలుకువ వచ్చినది. తాను జూచిన విషయములన్నియు స్వప్నదృష్టములనియే నిశ్చయించి యా విశేషములే ధ్యానించుచు దిరుగా నిద్రఁ బోడయ్యెను. మహారాజు లేచువఱకు నెవ్వరును లేపవలదని పరిజనుల శాసించుచు శ్రీధరుఁడు వాకిలిఁ గాచికొని యుండెను. అతని యలుకుఁడు విని విక్రమార్కుండు శ్రీధరా! శ్రీధరా! ఇటురా. అని కేక వైచెను. దాపునకుఁ పోయి నేఁడు నిద్రబోలేదా యేమి? పెందలకడ లేచితిరేమని యడిగిన శ్రీధరునితో వయస్యా! ఇది యొక యింద్రజాలమువలె నున్నది. ఈసారి యా స్వప్నము మఱింత వింతగాఁ బొడగట్టినది. వింటివా ? మలయవతీనగరము మలయధ్వజుండు, మలయవతి ఈ పేరులు నీ వెన్నఁడైన వింటివా ? తుంటవిల్కానిబారిం బడవైచినది యా మలయవతియె. అని తాను జూచిన విశేషము లన్నియు నెఱింగించెను.
శ్రీధరుఁడు విని మహారాజా! మలయవతి స్వయంవర మిదివఱకు రెండు మూఁడుసారులు జరిగినది. ఆ తరుణీలలామము ఎవ్వరిని వరించినదికాదు. అప్పుడు మనకుఁగూడ బత్రికలు వచ్చినవి. దేవర మరచితిరి. ఆ పేరులున్నవి యేమని చెప్పుటయు నృపతి యిట్లనియె.
ఇది కడు వింతగా నున్నది. కలయని కలయుం గాదు. నిజమని నిజము గాదు ఆ చిన్నది నా వృత్తాంత మడిగి తన కులశీలనామంబులు దెలియఁ జేయుచు స్వయంవరమున వరింపుచున్నది. మఱియొక చిత్రము వింటివా? నేనది కల యనియు మెలుకువ వచ్చునేమో యనియు వెఱచుచు నా చిన్నదానితో ముచ్చటించితిని. కల కాదు నిజమే యని యక్కలికి పలికినది. ఇది యేమి చోద్యమో నాకుఁ దెలియకున్నది. మలయవతి యను యువతి యున్నదని నీవు వింటివా? ఇంకను బెండ్లి కాకున్నచో దానిం బరిగ్రహింప వలసినదే? అందలి నిజానిజంబులం జారులం బంపి తెలిసికొన వలయునని యాజ్ఞాపించెను. అంతలోఁ దెల్లవారినది. విక్రమార్కుఁడు ఆస్థానము కరుదెంచి పీఠ మలంకరించెను. అప్పుడు పెక్కండ్రు భూపతుల వెంటబెట్టుకొని వచ్చి భట్టి వారి నుచితాసనాసీనులం గావించి వేఱు వేఱ వారి వారి యభిధానంబుల నా నృపాలున కెఱింగించుచు వారు దెచ్చిన కానుకల నందు రాశిగాఁ బోయించెను.
అప్పుడు విక్రమార్కుండు వారి నెల్లఁ జల్లని చూపులఁ జూచి యాదరించుచు వారి వారి నేస్తంబుల నభినందింపుచు నిట్లనియె. నృపతులారా! మీలో నెవ్వరైన మలయవతీనగర మెం దున్నదో యెఱుంగుదురా? మలయధ్వజుఁడనునృపాలుని పేరు వినియుంటిరా? అని యడిగిన వారిలోఁ గొందరు లేచి యిట్లనిరి.
దేవా! ఆ నగరము ద్వీపాంతరమం దున్నది మలయధ్వజుని కూఁతురు మలయవతి మిక్కిలి చక్కనిది. ఆమె స్వయంవరమునకు మే మాదీవికిఁ బోయితిమి. అం దెవ్వరిని వరించినదికాదు. ఆ చిన్నదాని కోరికలు కడు నసాధ్యములు. ఆమె కోరిన లక్షణములన్నియు దేవరయం దున్నవని చెప్పఁగలము. మలయధ్వఁజుఁడు చాల మంచివాఁడు. మే మెఱుంగుదుము. అని యా స్వయంవరవృత్తాంత మంతయుఁ జెప్పిరి.
అయ్యుదంతము విని యా నృపతి యపరిమితకౌతుకావేశముతో నప్పురంబున కరుగవలసిన తెఱవు దెఱంగంతయు దెలిసికొని యా ధారుణీపతులకుఁ బారితోషికము లిప్పించి వారి వారి దేశముల కనిపి భట్టితో నేకాంతముగా నిట్లు ముచ్చటించెను.
సుమతీ! నా కల తెఱగంతయు నీ కెఱింగించితిని గదా? ఇది స్వప్నమే యందువా? రెండవసారి చూచిన విషయంబులు నాకు స్వప్నములుగాఁ దోచుటలేదు. అది యింద్రజాలమువలె నున్నది. మలయవతి నా వృత్తాంతము తనకు మదనమంజరి యను యక్షకాంత జెప్పినదని నీవే నా భర్త వనియు స్వయంవరమున నన్ను బరిగ్రహింపు మనియు నుపదేశించుచు నది కలకాదు నిజమే యని నాకు నచ్చ చెప్పినది. నిజముగా నా మలయవతి నన్ను వరించునందురా? నీకేమి తోచుచున్నది. అని యడిగిన నవ్వుచు భట్టి యిట్లనియె.
మహారాజా! కొన్ని స్వప్నములు సత్యార్థమును సూచించును. తరుచు తనకుఁ బరిచయము గలవారితో ముచ్చటించినట్లు వచ్చుచుండును. ఎఱుంగనివారిం జూచినట్లు సంభాషించినట్లు కలవచ్చును గాని యథార్థమగుట వింతగానున్నది కానిమ్ము. దీని విషయమై నీ కింత చింతయేల? మలయవతి మిక్కిలి చక్కనిదైన నగుంగాక. దేవకాంతల కన్న నధికరాలాయేమి? వేలుపుల జవరాండ్రని ననుమతింపని నీ వా పొలఁతికై వలవంత గాంతు విది వింతగా నున్నది. నీవభిలషించిన నా యోషామణిం గడియలోఁ దీసికొనివచ్చి పెండ్లి జేయగలఁమని పలికిన విని కునుకుచు నృపతిలకుం డిట్లనియె.
మిత్రమా! నా చిత్త మదియేమియో కాని యా మత్తకాశినియం దాయత్తమై యున్నది. మనకు పోయియో చారుల నంపియో యెట్లో యామలయధ్వజునితో మైత్రిఁ గలిపికొని యారాచపట్టి నా చెట్టఁబట్టునట్లు కావింపవలయును. ఇందులకుఁ దగిన యుపాయ మాలోచించమని కోరిన విని సచివోత్తముఁ డట్ల కావింతునని యతని కుత్సాహము గలుగఁ జేసెను.
మఱియొకనాఁడు భట్టి శ్రీధరునితోఁ గర్తవ్యమును గురించివితిర్కింపుచున్న సమయంబున మలయధ్వజుని దూతలు కొందఱు మలయవతీస్వయంవరాహ్వానపత్రికలు దీసికొనివచ్చి యర్పించిపోయిరి.
మిత్రులిద్దరు ధాత్రీపని గత్తెఱం గెఱింగించి యానందసాగరమునఁ దీర్ధ మాడించిరి. అప్పుడు స్వయంవర దివసము ముప్పదిదినము లున్నను నృపాలుండు ప్రయాణమునకు వేగిరపడుచు దైవజ్ఞ నిర్దిష్ట శుభముహూర్తంబున మువ్వురు మిత్రులు ననుగమింపఁ జతురంగబలములతో బయలుదేరి కతిప్రయప్రయాణంబుల మలయవతీనగరంబున కరిగి యా నృపాలునిచే సత్కరింపఁబడి నియమితమగు విడిదయందు వసించి స్వయంవరోత్సవదివసంబున కెదురు చూచుచుండెను.
క్రమంబున నానా దేశములనుండి యనేకులు రాజకుమారులు వచ్చి యప్పట్టణ మలంకరించిరి. మఱియు వారు విక్రమార్కుని రాక విని -
చ. వితరణశాలి సర్వపృథివీజయలబ్ధయశుండు విక్రమ
క్షితిపతి వచ్చె నింక సరసీరుహలోచప యాశుభాంగునిం
గుతుకములో వరించు మనకుం దలవంపులు గావంగనేల వ
చ్చితి మకటా? యటంచు మదిఁ జింతిలఁ పాల్పడి రెల్ల భూపతుల్.
మలయవతియు సఖీముఖముగా విక్రమాదిత్యుని రాక విని రాకాగమనంబునకు నుప్పొంగు భంగమాలియుంబోలె హృదయంబు సోత్సుకతంబొరయ సుమూర్తంబు ప్రతీక్షించుచుండెను.
సీ. కడువెన్నెలమరునిగారింపు పట్టుపు
ట్టము కుటీరాంపరాళమున పరుస
శ్రేణిగావైచిన సింహాసనముల నా
త్మీయప్రభుత్వప్రమేయసరణి
సకలదేశావనీశ్వరకుమారులు మార
సన్నిభాకారు లైశ్వర్యగరిమఁ
దెలుపు చిహ్నములతో నెలమి నాసీనులై
యవ్వధూమణిరాక నరయుచుండ
గీ. దివ్యమాణిక్యకిరణదేదీప్యమాన
కాంచనాభరణాలంకృతాంచితాంగి
యగుచు నా రాజుసుత సఖుహస్త మూని
తిరిగెనందు నరేంద్రశేఖరులఁ గనుచు.
అట్లు తిరిగి తిరిగి పరికించి యయ్యంబుజాక్షి నక్షత్రకులంబున నక్షీణప్రభాక్షీణుండగు క్షపాకరుచందంబున నాక్షత్రకులకులంబున సమధికద్యుతివిద్యోతమానుండగు విక్రమాదిత్యుం గాంచి హృదయరాజీవంబు వికసింప నెల్ల రాజలోకంబు సూచుచుండఁ దనచేతనున్న పుష్పదామం బతని కంఠంబున వైచి నమస్కరించినది. అప్పుడు సభ్యు లెల్లరు జయ విక్రమార్కా? అని కరతాళములు వాయించిరి. మిత్ర నృపతు లభినందించిరి. ఆ మిత్రులు వినమితశిరస్కులై తమ నెలవులకుం బోయిరి. అంత మలయధ్వజుఁడును విక్రమార్కుని ప్రఖ్యాతి యంతకు మున్ను విని యున్న వాఁడగుట మిగుల నానందింపుచు నమ్మహారాజును సమిత్రముగా దోడ్కోనిబోయి యభూతపూర్వకములగు మహోత్సవములతో సమంత్రకముగా మలయవతి నతని కిచ్చి పాణిగ్రహణవిధి నిర్వర్తింప జేసెను.
ఆ శుభోత్సవక్రియలయందు మిత్రులు శత్రులు గూడఁ బరిచారకులవలె విపులముగా నుపచారములు గావించిరి మఱియు దీక్షావసానదివసంబు నాఁటిరాత్రి సమధికాలంకారభాసురంబగు శుద్ధాంతనిశాంతాంతరంబున విక్రమార్క సార్వభౌముండు మలయవతీ విలాసవతితోఁ గేళీలాలసములగు వచనములతో ముచ్చటించుచున్న యవసరంబున --
గీ. అరయ నిప్పటికేయ గృతార్థనైతి
తీర్చుకొంటి నొకింత మదీయఋణము
మలయవతితోడ నీఱేనిఁ గలిపి యహహ!
కలిగె ననుకూలదాంపత్య కలన మిపుడు.
అని పలుకుచుఁ జేతులు జోడించి యెదుర నిలఁబడి నంత నమ్మహీ కాంతుండు వింతపడి చూచుచుండ మలయవతి యల్లన నిట్లనియె.
మనోహరా! ఈ తరుణీమణి యెవ్వతియో యెరుంగుదురా! మీరు జేసిన యుపకారము మరువక మీకుఁ దెలియకుండఁ బ్రత్యుపకారము జేయఁదలంచి మీ నిమిత్తమై భూమండలం బంతయుఁ దిరిగిన కృతజ్ఞురాలు, యక్షపత్ని యీమెయే. నన్ను మీ పాదసేవకురాలిగాఁ జేసిన ధన్యాత్మురా లీమెయే. ఈమెయే మదనమంజరి యని యా యువతి గావించిన పనులన్నియు నెఱింగించినది.
ఆ కథ విని యమ్మహారాజు అమ్మనేఁజెల్ల ? నన్ను స్వప్నవిభ్రాంతుం జేసిన యింద్రజాలపింఛికవు నీవా? అన్నన్నా? ఎట్టి మోహము గలుగఁ జేసితివి? మేలు మేలు. నీ ప్రజ్ఞావిశేష శక్తికి మెప్పు వచ్చినది. దేవీ! నా వలన నీకుఁ గాఁదగిన పనియే దేనిఁ గలిగిన వక్కాణింపుము చేసి కృతజ్ఞుండనయ్యెదనని యడిగిన మదనమంజరి యిట్లనియె.
మహాత్మా! నీవు నాకుఁ గావింపవలసిన యుపకార మిదివఱకే చేసి యుంటివి. అందులకు నీకు నేను బ్రతిక్రియ యేమియుఁ జేయజాలను. అది యట్లుండె నా మనసున వేఱొక కోరిక యున్నది. వరమిచ్చితి కావున నడుగుచుంటి. నాయక్క కూఁతురు త్రిపురసుందరి యను సుందరి యున్నది. దానిఁ ద్రిభువ సుందరి యనియే చెప్పఁదగినది దాని మీకుఁ ద్వితీయ సేవకురాలిగాఁ జేయదలంచుకొంటి నంగీకరింప వలయునని గోరినఁ జిరునగవుతో నతండు మలయవతి మొగముజూచెను. మలయవతి కేలుమోడ్చి మహాత్మా! అట్లు చేయుట నా కెంతయు నభిమతము. తన కూఁతును విడిచి నాకు మహిషిపదం బొనఁమార్చిన యామె కోరికఁ దీర్చుటకంటె యుత్తమకార్య మేమియున్నది? దేవతాబంధుత్వప్రాప్తిఁ జేసి నూత్నవిశేషంబుల దెలిసికొను భాగ్యము గూడఁ బట్టును. అన్ని విధముల నిప్పని సమంజసమై యున్నదని చెప్పి యతనికి సంతోషము గలుగఁజేసినది.
మదనమంజరియు పుష్పమంజరుల వారిపై జల్లి నే నిప్పుడు బోయివచ్చెద . వెండియు నుజ్జయినీపురంబునం గలిసికొనియెద. ననుజ్ఞయిండని చెప్పి యలకాపురంబున కరిగినది.
విక్రమాదిత్యుడును మలయవతితో ననంగల్పోక్తప్రకారంబున శృంగారకేళీవ్రతానుష్ఠానతత్పరుండై కొన్నిదినంబు లందుండి పిమ్మట నా పొన్ని కొమ్మను వెంటబెట్టుకొని నిజపరిజనము సేవింపఁ గ్రమ్మర నుజ్జయినీ పురంబున కరుదెంచెను.
అని యెఱింగించుట వఱకుఁ గాలాతీతమైనది. తరువాత నగు వృత్తాంత మవ్వలి మజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.
203 వ మజిలీ
బంగారుస్థంభముకథ
శ్లో॥ అరుణ శిఖరిగంగాస్థంభమార్గేణగత్వా
ప్రతిదిన మతి మాత్రస్వర్ణదాంకర్ణం భూషాం
భరకిరణ సకాశాత్ ప్రాప్యతాం బ్రాహ్మణాయ
వ్యతరదతిదరిద్రాయేతి సైపాప్యసక్తి
క. పుడమి నెటనైన గానీ
కడుచిత్రంబైన వార్త గలదని విన్నం
దడయక నటకేగుచు న
----------- డది చూచి వచ్చు నుత్సాహముతోడన్.
విక్రమాదిత్యుండు నిత్యము వివిధ చిత్రవార్త శ్రవణమునకై మహాకాళినాథుని యాలయమునకుఁ బోయి రెండు గంటల కాలము వసించియుండును. అప్పుడు