కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/204వ మజిలీ

వికీసోర్స్ నుండి

శిక్షింపఁబడిన బేహారిని విడిపించి వాని కీయవలసిన సొమ్మిప్పించి తనకు రాజిచ్చిన సొమ్మంతయు బ్రాహ్మణార్పణము గావించి నృపతి యనుమతి వడసి బ్రాహ్మణులతో గూడ వారాకాంత యింటి కరుదెంచెను.

అతని రాక కెదురు చూచుచున్న యయ్యుతివయు, దచ్చరణంబుల వ్రాలి మహాత్మా! నేను నీ పాదసేవకురాలనైతిని. పనులకు నియోగింపుమని పలికినఁ జిరునగవుతో నతం డిట్లనియె.

సుందరీ నీ వీ ధరణీబృందారకులం జూచితివా? వీరు పౌండరీకమను మహాక్రతువు సేయఁ దలపెట్టిరి. అందు మహావ్రతమగు సవనాంతర్భాగమున వేశ్యాసంభోగజనితంబగు బ్రాహ్మణశుక్లం బగ్నిహోత్రున కాహుతి సేయవలసిన విధి యున్నది కావునఁ దత్సవనంబు గణికాజన ప్రధానికంబని చెప్పుదురు.

నీవు వీరి వెంటఁ జని యయ్యజ్ఞంబునకుఁ గావలసిన సహాయంబు గావింపవలయు ననియే నా యాదేశము నీకునుఁ బుణ్యము రాఁగలదనిచెప్పి యొప్పించి యా యొప్పులకుప్పను వారి యధీనం గావించి యతం డాయూరు విడిచి యవ్వలఁ జనెను.

అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. యవ్వలి కథ మఱల నిట్లు చెప్పఁ దొడంగెను.

204 వ మజిలీ

మన్మధసంజీవినికథ

విక్రమార్క మహారాజు బ్రాహ్మణుల నట్లు సంతుష్టిపఱచి సువర్ణస్థంభదర్శనవ్యగ్రచిత్తుండై యా నగరము విడిచి యుత్తరాభిముఖముగా నరుగుచు నొకనాఁడు సాయంకాలమునకు నొక యగ్రహారము జేరెను. అప్పటికిఁ గొంచెము చీకఁటి పడుచుండెను. నడివీధిలోనున్న రావిచెట్టు మొదటఁ గట్టబడిన రచ్చబల్లపైఁ గూర్చున్న యొక బ్రాహ్మణకుమారుం డెటు పోవుటకుఁ దోచక నిలఁబడి యున్న విక్రమార్కుని జూచి వచ్చి అయ్యా ! తమ రెందుఁ బోవుచున్నారు? అని యడిగిన నతఁడిట్లనియె .

నే నొక బాటసారి నుత్తరదేశమున కరుగుచున్నాను. ముందరి గ్రామ మెంతదూర మున్నది? అని యడిగిన నా విప్రకుమారుండు ముందు దాపులో నే గ్రామము లేదు. నేఁటి కిందుండి పోవుదువుగాక మా ఇంటికిరండు ఆతిథ్యము పుచ్చుకొని పోవుదురుగాక అని పలుకుచు గుర్రపు కళ్ళెము బట్టుకొని మెల్లగా దనఇంటికిఁ దీసికొనిపోయెను.

గుఱ్ఱమును గట్టఁదగిన తావునఁ గట్టించి లోపలికిఁ దీసికొనిపోయి గౌరవించుచు నారాత్రి తానే వంటఁజేసి యా మహాత్మునికిఁ భోజనము పెట్టెను. భోజనానంతరమున విక్రమార్కుం డతఁడు జేసిన సత్కారమునకు మిక్కిలి సంతోషించుచు నందులకుఁ బ్రత్యుపకారమేమి జేయుదునని యాలోచించుచు నార్యా! మీయింట నాఁడువా రెవ్వరుఁ గనంబడరేమి? వివాహ మాడితివా? తలిదండ్రు లేమైరి? అని యడిగిన నతం డిట్లనియె.

అయ్యా! నాకథ విందురా? తలిదండ్రులు చిన్నతనమందే గతించిరి. ఇందు నాధారములేని విద్యార్ధినై దేశములు తిరిగితిని. శాస్త్రాభ్యాసము చేయుచున్నను నాకు శృంగారప్రబంధములయం దభినివేశ మెక్కువయైనది కామశాస్త్రములన్నియుం జదివితిని. కావ్యములు, నాటకములు దరుచుఁ బరిశీలించుచుందును. నేను జదివినవాఁడనని యూహించి యెవ్వరైనఁ బిల్ల నిత్తుమని వచ్చిన దత్కన్యకల బరీక్షించి చక్కనివారు కారని యంగీకరింపనైతిని.

శ్లో॥ ఏకా నారీ సుందరీవా దరీవా॥

అనునట్లుండిన రంభవంటి భార్య యుండవలయు. లేకున్న నడవులకుఁ బోయి తపము జేసికొనవలసినదే అని నిశ్చయించుకొంటి. నేను జదివికొను నప్పు డిరువురు రాజకన్యకలు గ్రహణస్నానమునకై నర్మదానది కరుదెంచిరి. వారికి సంకల్పముఁ జెప్పుటకై మా గురువువా రరుగగ వారితోఁగూడ నేను బోయి యా యెలనాగలం జూచితిని. ఆ మచ్చెకంటు లచ్చరలవలె నొప్పుచుండిరి. వారి శరీరచ్ఛాయ పదార్వన్నె బంగారమే! ఆహా! ఆ మోహనాంగులం జూచినది మొదలు నాకు మఱియుఁబిచ్చి యెక్కువయైనది.

అట్టి భార్యఁగలవాఁడెట్టి తపంబు గావించెనో యని ధ్యానించుచుందును. మఱియును,

ఉ. తలపయి మాలతీకుసుమదామము నెమ్మయిఁ గుంకుమంబుతోఁ
     గలపిన కమ్మతావి విరగందపుపూత లెడందరొమ్మునం
     దలికులనీలకుంతల మదాలస నీలసరోరుహాక్షియుం
     గలుగుట నింద్రభోగమనఁగాఁ దగదే మఱివేఱ యున్నదే?

మ. ఇంచుక ముద్దు లే నగవు లింపగునవ్యవిలాససూక్తు ల
     భ్యంచితలోలదృష్టియు నవారుణపల్లవమండలంబు ని
     ర్మించు సబీలయానములు మేలుగ యౌవనలక్ష్మితోడ వ
     ర్తించుమృగాదిచందములని ప్రమదంబు నటింపఁ జాలవే.

అని సుందరీసౌందర్యచాతుర్యాది విశేషములఁ దలఁచుచు బ్రాహ్మణకన్యకలయం దట్టిశృంగారలీలా వైదర్ధ్యములేమింజేసి యపరిగృహీతదారుండనై బ్రహ్మచారిగ నుండి తిరుగుచు నొకనాఁడు ప్రయాగలో మాధవమఠంబునకు మహాయోగి యొకండు గలండని విని యక్కడికిఁ బోయి మూఁడునెలలు వానికి శుశ్రూషఁ గావించితినిఁ నయ్యెగి నాదగు నకారణ శుశ్రూషకు మెచ్చికొని యొకనాఁడు నన్నుఁ జీరి నీ వెవ్వఁ దవు? నిత్యము వచ్చి యుపచారములు సేయుచుంటివి. నీ వేమి కోరి యిట్లు చేయుచున్నావని యడిగిన నమస్కరింపుచు నే నిట్లంటి.

మహాత్మా! నా పేరు మిత్రగుప్తుఁ డందురు. నేను బ్రాహ్మణకులుఁడను. నాకుఁ త్రిలోకసుందరి యగు భార్యతోఁ గాపురముఁ జేయవలయునని యభిలాష యున్నది. మా కులములో నందకత్తెలుండుటయే యరుదు. ఉండినను ధనహీనుఁడనగు నాకట్టి కన్యకల నెవ్వరిత్తురు? ఏమి తపంబు జేసినచో నట్టి భాగ్యము గలుగునో యెఱింగింపుఁడు. అట్టిదాని జపించి యుత్తరజన్మమునందైన నాకోరికఁ దీర్చుకొందు నిందులకే మి మ్మాశ్రయించు చుంటినని ప్రార్థించుటయు నాయోగి పకాలున నవ్వి యిట్లనియె

శ్లో. గగన నగరకల్ప స్సంగమో పల్లభావాం
    జలద పటలతుల్యం యౌవనం వా ధనం వా
    స్వజన సుతశరీరాదీని విద్యుచ్ఛలాని
    క్షణికమితి సమస్తం విద్ధి సంసారవృత్తం.

బ్రహ్మచారీ ? నీవుత్తమబ్రహ్మకులంబునం బుట్టియుఁ దపోధ్యయనాది విశేషములం దెలిసికొనక స్త్రీసంభోగవాంధం బొందితి వేల? స్త్రీసంగమము గగననగరము వంటిది. యౌవనము మేఘపటలములవలెనే చంచలమైనది. పుత్రమిత్రకళాత్రాదులు మెరపులవంటివారు సంసారము క్షణికమని యెఱింగి యీవెర్రి మానుము. చాలు చాలు, నీబుద్ధిని మరలించుకొనుమని నన్నుఁ బెద్దగా మందలించెను.

అప్పుడు నేనతని పాదంబులం బట్టికొని యోగీంద్రా! నీవు నాకోరికఁ దీర్పక తప్పదు. ఎన్ని జెప్పినసు నామనసు తిరుగదు. ఒక్క దినమందైన నట్టి భోగ మనుభవింపవలయును. లేకున్న బలవంతమున నీ పాదమూలమున మేనుబాసెదనని నిర్భంధించి యడిగిన నతం డాలోచించి యిట్లనియె.

విప్రకుమరా? మధ్యదేశములో విక్రమార్కుండను వదాన్యచక్రవర్తి యర్థికల్పవృక్షంబై యొప్పుచున్నాఁడని వాడుక మ్రోసియున్నది వింటివా? అతని నాశ్రయించిన నీ యభీష్టము దీరఁగలదు. అంతద వ్వరుగ లేనందువా? మఱియొక యుపాయము సెప్పెద నాలింపుము. ఇక్కడి కేబదియోజనముల దూరములో మహేంద్రగిరి యనుపర్వతము గలదు. తచ్చిఖరంబున దుర్గాలయమున్నది. ఆ దేవళము మ్రోల నినుప కటాహములో స్వయంప్రభూతంబగు నగ్నిచేఁ దైలం బెప్పుడును కుతకుత నుడుకుచుండును. ఆ దేవిం బూజించి యందుఁ బడితివేని నీ శరీరమంతయు నుడికి ముద్దగా నగును. అప్పుడు మన్మధసంజీవియను దేవకాంత వచ్చి యమృతము జల్లి బ్రతికించును. మిక్కిలి చక్కదనము గల యాదేవకాంత నీకు వశవర్తినియై యభీష్టకామంబులం దీర్పఁగలదు. అట్టి సుందరి భూలోకమం దెందును లేదు. అందున్న శిలాశాసనమం దవ్విధానమంతయు వ్రాయఁబడియున్నది. అట్టి సాహసము జేయ నోపుదువేని యీ జన్మమునందే నీ యభీష్టము దీరఁగలదు.

అతిక్లేశభూయిష్టంబగు తపం బెక్కడ? నీవెక్కడ? యుత్తరజన్మ మెక్కడ పొమ్మని పలుకుచు నయ్యోగి మౌనముద్ర వహించెను. నే నతనిమాట వడుపున నప్పుడే బయలుదేరి కొన్ని దినంబులకు మహేంద్రగిరి చేరితిని. శిఖరమెక్కి దుర్గము దర్శించితిని. గుడి మ్రోలనున్న శిలాశాసనలిపిం జదివితిని. తైలకుండముల బరికించితిని. మేనగంపము జనించినది. అమ్మయ్యో! ఆ తైల మెంతకాలమునుండి యట్లు క్రాగుచున్నదియో? - తొంగిచూచుటకే శక్యమైనది కాదు. దానిగాలి సోకినంతఁ జర్మము మాడి పుండు బడినది. అందులో దుముకుట యెట్లు? చక్కని భార్యమాట దేవు డెఱుంగు నిప్పు డీ దేహపీడ యెవ్వడు భరింపగలఁడని తలంచి యా కుండమున కొక నమస్కారముజేసి దేవికి మ్రొక్కి యింటికిం జనుదెంచితిని.

ఇఁక బెండ్లియందు నాస మానితిని. కలిగినదానితో నతిథ్యభ్యాగతుల బూజించుచుఁ గాలము గడుపఁ దలంచుకొంటి. నా నడుమ విక్రమార్కు మహారాజు గారినిఁ జూడవలయునని తలంపు గలిగినది. కాని యేమిటికో మానివేసితిని. ఇదియే నా వృత్తాంతము. మీ పోలికఁజూడ గౌరవనీయులని తోచుచున్నది. మీ రాకవలన ధన్యుఁడనైతిని. రెండు దినము లిందు విశ్రమించి పోవుదురుగాక అని సబహుమానముగాఁ బలికిన సంతసించుచు నా నృపాలుం డిట్లనియె.

మిత్రగుప్తా ! నీ చరితము వినుటచే నాకుఁ గ్రొత్తవింత యొకటి వినంబడినది. నూత్నవిశేషములఁ జూచుటకే నేను దేశాటనము జేయుచుంటిని. నన్నా మహేంద్రగిరికిఁ దీసికొనిపొమ్ము. ఆ వింత నేనుగూడఁ జూచి యానందించెదనని పలికిన నతం డయ్యా? ఇందులకు నన్నింత బ్రతిమాలవలసిన పనిలేదు. పోదము రండు. నా కింటికడ జంఝాట మేమియును లేదుగదా, అని చెప్పెను.

విక్రమార్కుండు నాఁటి వేకువజామున లేచి యా బ్రాహ్మణకుమారుని తన గుర్రముపై నెక్కించుకొని యతం డెఱింగించిన మార్గంబునఁ బది దినముల కా మహేంద్రగిరి జేరెను.

అతం డా విప్రునితోఁ గూడ నా గిరి శిఖరమెక్కి యందలి శిలాశాసనము జదివి లక్ష్మినారాయణ సరస్సులో స్నానముజేసి దుర్గను సేవించి తప్తతైలకటాహము కడ కరుదెంచి యిదే యిదే చూడుమని బ్రాహ్మచారి పలుకుచుండి ముమ్మారు వలఁగొని కుండుగట్టెక్కి జయపరమేశ్వరా యని పలుకుచు విక్రమార్కుండు గభాలున కుత కుత నుడుకుచున్న యా చమురులో దుమికెను.

అప్పు డందున్న వారెల్ల హాహాకారములు గావింపుచుండ మిత్రగుప్తుండు ----------------- గోలున నేడ్చుచు నెట్టకేల కా గంగాళములోఁ దొంగిచూచెను. విక్రమార్కుని శరీర మంతయుఁ బిండమై యుడుకుచుండెను.

క. ఓ గుణనిధామా! నే
   నీగుణము గ్రహింప లేక నిన్నిక్కడికిన్
   లాగికొని వచ్చి చంపితి
   నీగురుపాతకము నెటుల నీగుదు నయయో!

అయ్యో! పుణ్యాత్మా! నీవా వింతఁ జూపుమని యడిగిన రాననక నీతో వచ్చి యిందు బలవంతమునఁ జంపితివి. ఇంత సాహసము గలవాఁడని యెఱుఁగక పోయితినే. ఇంచుకయు నా వేడికి వెఱువక గుభాలున దుమికితివిగదాఁ తండ్రి! నీ చల్లనిమాట లెట్లు మరచువాఁడ. అక్కటా! ఈ దుష్టుని సహవాస మేమిటికిఁ జేసితివి బాబూ! అట్లు బడిన మన్మథసంజీవని ప్రత్యక్షమగునని వ్రాయబడియున్నది గదా ఆ దేవత రాలేదేమి? ఇది వట్టిదని పలుకుచున్న సమయంబున,

సీ. పూర్ణేందు బింబవోలు నమ్మోముతో
                 తొలఁకులేనగవు వెన్నెలలతోడ
    నిందీవరములఁ గవ్వించు కన్నులతోడఁ
                 దళుకారు చెక్కుటద్దములతోడ
    కంధరంబు హసించి కబరికాభారముతో
                దరము సుందరము కంధరముతోడఁ
    గులుకు గబ్బి మిటారి గుబ్బ పాలిండ్లతోఁ
               గలదు లేదనుఁబొల్చు కౌనుతోడ
గీ. సరిపదార్వన్నె పసిఁడిమైచాయతోడు
   నమృతకలశంబు నొకచేతఁ గమలదామ
   మొక్కచేఁబూని వచ్చి యీచక్కి నిలచె
   ఠీవిమన్మథసంజీవినీ వధూటి.

గీ. ఈ శిలాశాసనము వ్రాసి యెంతకాల
   మయ్యెనోకద! భువి నొక్కఁడైన యిట్టి
   సాహసం బైచరించెనె? సాధుసాధు
   ఇప్పటికిఁ పూర్ణమయ్యె మదీయవ్రతము.

అని పలుకుచు మెఱుపు మెఱిసినట్లు మన్మథసంజీవినీ దేవత యా కుండంబునుండి యట్లా ర్భవించి నెల్లరు చూచి విస్మయపడుచుండఁ దనచేతనున్న కలశంబునందలి యమృతం బావిక్రమార్కుని మాంసపు ముద్దపైఁ జల్లుటయు దివ్య మంగళ విగ్రహముతో వెనుకటికన్నను మిక్కిలి యక్కజమగు తేజము కలిగి యమ్మహానుభావుండెదుర నిలువంబడియెను అప్పుడు మన్మథసంజీవినియు చేతులు జోడించి,

క. నీవొనరించిన సాహస
   మేవారుం జేయరైరి యిదివఱ కిపుడో
   దేవా! నేను భవత్పద
   సేవకురాలై తి నిను భజింతుఁ బ్రియమునన్ .

నీ కేది యభీష్టమో యట్లు కానింతు నీవే నా భర్తవని పలుకుచు నక్కమలదామం బతని మెడలో వేయఁబోయిన బాలించుచు,

గీ. నిలు నిలు నా యిష్టము గతి
   సలుపుదుపుగదా వధూటి సంతస మిదిగో
   నిలుచున్న వాఁడె నీపతి
   చెలువుగ నాతని భజించి చెందుము సుఖముల్.

అతని నిమిత్తమే నేనీసాహసకృత్యము గావించితి నతని భజించుటయే నా యభీష్టమని పలికిన విని యా దేవత మారుమాట పలుకలేక తన్నియమమునకు బద్ధురాలై యీ దామం బందుఁ దెల్లబోయి చూచుచున్న మిత్రగుప్తుని మెడలో వైచి వరించినది.

విక్రమార్కుండు ఆ దంపతుల నత్యంత సంపదలతోఁ దులదూగునట్లు వేల్పులం బ్రార్ధించి తదామంత్రణంబు వడసి కొండదిగి గుర్రమెక్కి యుత్తరాభిముఖుండై యరిగెను.

అని యెఱింగించి మణిసిద్ధుండవ్వల కథ పై మజిలీ యందు జెప్పం దొడంగెను.

205 వ మజిలీ.

బలిచక్రవర్తి కథ

విక్రమార్కుండట్లు మిత్రగుప్తుండను బ్రహ్మచారి యభిలాషదీర్చి యటఁ గదలి యుత్తరాభిముఖుండై పోవుచుఁ గొన్ని పయనంబులు గడచినంత నొకనాఁడొక యరణ్యములో నేనుఁగకన్నను బెద్దదియగు వరాహ మొదటి యెదురఁ బడి జడియక ఘుర్ఘారా రావముతో నతని గుర్రముమీఁది కుఱుకుటకుఁ బ్రయత్నించినది. అప్పు డతండు తన వాఱువమును విచిత్రగమనంబుల నడిపించుచు జంద్రహాసము గేలనమర్చి గుర్రమును దానిపైకిఁ దోలెను.

తత్ఖురాఖాతములు పీడగలుగఁజేయ నా యడవిపంది కొందల మందుచు వెన్నిచ్చి పఱవఁ దొడంగినది. తత్తురంగము దానిం దరుముకొనిపోయెను. వాయువేగమున నది పారిపోవుచు నృపతి కత్తివేటునకందు సమయంబున నందున్న యొక బిలంబునం దూరి పారిపోయినది.

అప్పు డతం డా గుర్రముతో నందుఁ బోవుటకు వీలులేక గుర్రమును దిగి