కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/199వ మజిలీ

వికీసోర్స్ నుండి

వేయేండ్లు రాజ్యము చేసినను నెప్పటికైన నవసానమున్నదియా లేదా? సకలలోకనాయికవగు నీవు ప్రత్యక్షమై నన్నభినందించితి వింతకన్న మిన్న యేమున్నది. అయినను గోరుకొను మంటివి కావున నిన్నొకండు ప్రార్థించుచుంటి వినుము.

తల్లీ! నీవాదిశక్తివి. ఈ భూతకాలంబులన్నియు నీవు గన్ను మూసిన నశించును. కన్ను దెరచిన వసించును. ఇట్టి నీవు పెద్దపులివలె మృగబలి నాసించుట నాకు సిగ్గగుచున్నది. నేఁటి దుదనుండి యట్టి బలు లంగీకరింపనని నాకు వరంబిత్తువేని మహాసామ్రాజ్యప్రవాసముకన్న నెక్కుడుగా సంతోషించెద నిదియే నా యభీష్టమని పలికిన విని యాలోకజనని చిఱునగవుతో నన్ను మఱియు ముద్దుబెట్టుకొనుచు బాలకా? నీకీ మేలు బద్దులెక్కడ కలిగినవి. ఆహా నీ సుగుణంబులు గణనీయంబులని పొగడుచు నిట్లనియె.

కుమారా! నీకు నిజము చెప్పుచున్నాను వినుము. గతానుగతికోలోకః? అను నార్యోక్తి వినియుంటివా? పశబలియిండు మీయభీష్టములఁ దీర్తునని నేనెవ్వరితో నైనఁజెప్పితినా? ప్రజలందరు నిజము దెలిసికొనలేక ఫలాపేక్షంజేసి యొకరు చేసిన పనియే రెండవవారు చేయుచుందురు. అంతియకాని యది మదాదేశము కాదు. అయినను నీవడిగితివి కావున నింతటినుండి యిందట్టిపని జరుగకుండ శాసించెదనని పలికి యద్దేవి యంతర్హితురాలైనది.

ఇంతలో మీరు నాచేరువకు వచ్చిరని యెరింగించుటయు విని భట్టి హర్షపులకితగాత్రుండయి యతనిం గౌఁగలించుకొని రాజపుత్రా! నీయట్టి యుత్తములకు మిత్రుల మని చెప్పికొనిన మాకు విఖ్యాతిగలుగు. నీ వఖండసామ్రాజ్యధురంధరుఁడ వయ్యెదవని పెద్దగా వినుతించెను.

అని యెఱింగించి పైకథ పైమజిలీయందుఁ జెప్పందొడఁగెను.

199 వ మజిలీ.

విక్రమార్కుని రాజ్యప్రాప్తి

శ్లో॥ ఉత్సాహసంపన్న మదీర్ఘసూత్రం
     క్రియావిధిజ్ఞం విపయేష్వసక్తం
     శూరం కృతజ్ఞం దృఢనిశ్చయంచ
     లక్ష్మీ స్వయం వాంఛతివాసహేతోః.

మహేంద్రాదిత్యుఁ డొకనాఁడు భార్యతో దేవీ! చిరంజీవి ప్రాయంబునఁ జిన్నవాఁడైనను సద్గుణగణంబులచే లోకుల నాకర్షించుచున్నవాఁడు. మనపట్టిని యౌవనరాజ్యపట్టభద్రుని జేయుమని ప్రజలు నన్నూరక నిర్బంధించుచున్నారు. దేశదేశములనుండి పిల్లల నిత్తుమని చక్రవర్తుల వార్తల నంపుచున్నారు. స్వయంవరవిధిమూలముగా గాని వివాహమాడనని భట్టిముఖముగాఁ దెలియఁజేసియున్నాడు. మఱియు దిగ్విజయము సేయుటకై దండయాత్ర కనుజ్ఞ యిమ్మని కోరుచున్నాఁడు. తదీయ సాహసవితరణాదిగుణంబుల నగ్గింపుచు భూపాలురనేకులు నాకుఁ బత్రికలు వ్రాయుచున్నారు. మనము పెద్దవార మైతిమి. వాని రాజ్యపట్టభద్రుంజేసి వారణాశీపురంబున కరుగదమని పలికిన నామెయుఁ జాల సంతోషించినది. ప్రజలావార్త విని వృద్ధరాజు నభినందింపుచు దమయుత్సాహమును వెల్లడించిరి. శత్రువులు దల్లడించిరి. మిత్రు లుప్పొంగిరి. నాస్తికులు పొరటిల్లిరి.

మహేంద్రాదిద్యుం డొకశుభముహూర్తమునఁ జతుస్సముద్రోదకములఁ దెప్పించి మహావైభవముతో విక్రమార్కునిఁ బట్టాభిషిక్తుం గావించి దీవించుచు నిట్లనియె. వత్సా! దేవతలుగూడ నీయందుఁ బ్రీతులై యున్నారని వినుచున్నారము. దేవరక్షితుండవగు నీకేకొఱంతయు నుండదు. కాని నీయందుఁగల ప్రేముడి నన్నిట్లు వాచాలునిఁ జేయుచున్నది వినుము. లక్ష్మీమదము, నూత్నయౌవనగర్వము, అమానుషశక్తి, ప్రతిభ, ప్రభుత్వాతిశయము ఇవి యొక్కటియే సర్వానర్థములకు మూలమైనవి. అన్నియుఁ గలసినఁ జెప్పవలసినది లేదు. రాజ్యమదావిష్టులగు రాజులు కన్నులు మూసికొని పోయి తమ్ము దా మెఱుంగక పూజ్యులఁ బూజింపక గురువుల మన్నింపక మిత్రుల నాదరింపక చూచుటయే మహోపకారము, పలుకుటయే సామ్రాజ్యార్పణముగాఁ దలంచుచు గర్వాభిభూతులై పెద్దల మాట వినక తామే సర్వజ్ఞులమని తలంచుచుందురు.

అతికుటిలకష్టచేష్టాదారుణంబగు నిట్టి రాజ్యతంత్రంబున సక్తుండవు కాక మహామోహాంధకారంబు ప్రజ్ఞాదీపంబున నణంగఁ ద్రొక్కుచు జనులచేఁ బరిహసింపఁబడకుండ సాధువులచే నిందింపఁబడక, గురువులచేఁ దిరస్కరింపఁబడక, విద్వాంసులచే శోచింపఁబడక, విటులచే నవ్వఁబడక సేవకవృకంబులచే వంచింపఁబడక స్త్రీలచే విడంబనఁజేయఁబడక లక్ష్మిమదంబున నున్మత్తుండవుగాక మన్మథునిచే లాగఁబడక విషయములచే నాకర్షింపబడక కాగములచే నపహరింపఁబడక ధీరుండవై యుండవలయును.

మఱియుఁ బండితునైనను నబిజాతునైనను ధీరునైనను పురుషుని దుర్వినీత యగు నీ రాజ్యలక్ష్మి ఖలునిగాఁ జేయును. కావునఁ బలుమా రీమాటలఁ జెప్పుచుంటిని. నీవిఁక నవయౌవనరాజ్యాభిషేక మంగళం బనుభవింపుము. దిగ్విజయముఁ జేయుము.శత్రునృపతుల తలలు వంగజేయుము. బంధువుల నాదరింపుము. కులక్రమాగతులగు బంధుమిత్రభృత్యదాసదాసీజనంబుల విడువకుము. కలలోనైనను దుర్జనుల సమీపమునకు రానీయకుము. సర్వదా సాధుసంగమము గలిగి వర్తింపుము. పూర్వాచారముల నాక్షేపింపకుము. అని దండనీతి యంతయు నుపదేశించి రాజ్యమంతయు మంత్రులతోఁ గూడ నతనియధీనముఁ గావించి మహామతియగు భట్టిని ప్రధానమంత్రిఁగాఁ జేసికొని యతనితోఁగూడ రాజ్యము పాలింపుమని పలుమారు చెప్పిచెప్పి భార్యతో గూడ నావృద్ధరాజు కాశీపురంబున కరిగెను.

భద్రాయుధుండు ద్వారపాలుఁడై శ్రీధరుండు మిత్రుడై భట్టి మంత్రియై సంతతము విడువక తన్ను సేవింప విక్రమార్క మహారాజు భూభారంబు భరించి ప్రజలం బాలింపుచుండెను. ఒకనాడు విక్రమార్కుండు పేరోలగంబున సమయంబున నొకపరివ్రాజకుం డరుదెంచి యాశీర్వదించి యొక ఫలం బర్పించి తదానతి నాసన్నపీఠంబునం గూర్చుండెను. అప్పు డానృపతి యాఫలంబు భట్టిచేతి కిచ్చుటయు నతండు దానిం బరీక్షించి చూచి యోహా! ఇది యపూర్వము. కృత్రిమమువలె గనంబడుచున్నది, పరీక్షించెదం గాక యని పలుకుచు దాని నేలపై వైచికొట్టెను. చితికినది. అందొకరత్నము దివ్యప్రభాధగద్ధగితమై యొప్పుచుండుటం జూచి రాజు వెఱగుపడుచు సన్యాసి కిట్లనియె.

ఆర్యా! మీరు సర్వసంగవర్జితులు. సమలోష్టకాంచనులు. ఇట్టి మీకీ కృత్రిమఫలం బెక్కడ లభించినది; లభించుగాక మా కీయనేల? మాతో మీకేదేని పని గలిగిన గోరినంతం జేతులు గట్టుకొని కావింపమా? అని పలికిన విని యా పరివ్రాజకుండు నారాయణస్మరణ గావించుచు నరేంద్రా! ఇట్లనుట నీకే తగును. మేము తపస్సిద్దులమగుట సంకల్పమాత్రముననే యిట్టివింత లుత్పన్నంబు లగుచుండును. వీనితో మా కేమియు బ్రయోజనము లేదు. మీతో నొకప్రయోజనము గలిగి 'రిక్త హస్తేన నో పేయా ద్రాజాసం దైవతం గురుం' వట్టిచేతులతో రాజును, దేవుని, గురువును జూడరాగూడ దను నార్యో క్తి ననుసరించి దీని దెచ్చితిని. కాని మఱియొకటి కాదు. నా యభీప్సితము వినుము.

రేపు రాబోవు కృష్ణచతుర్దశియందు నిక్కడకు దక్షణముగా మూడుయోజనముల దూరములోనున్న స్మశానవాటికలో వటవృక్షముక్రింద నొకమంత్రసిద్ధి సాధింపదలచుకొంటి. భూతభేతాళము లాసిద్ధి కంతరాయము సేయదలంచుచుండును. నీవు వచ్చి నిర్విఘ్నముగా నాకార్యము నెరవేరునట్లు సహాయము చేయవలసి యున్నది. అని రహస్యముగా బరివ్రాజకుడు విక్రమార్కు బ్రార్థించెను.

అమ్మహారాజు చిఱునగవుతో నోహో! ఇంతమాత్రమునకే ఈస్తోత్రము. చాలు చాలు. మీరు వోయి హోమసంభారంబుల సమకూర్చుకొని యుండుడు. నేను నాటిసాయంకాలమున కచ్చటికివచ్చి మీకు సహాయము గావింతునని యభయహస్త మిచ్చి యంపివేసెను.

తరువాత భట్టి విక్రమార్కునివలన బరివ్రాజకుని కామ్యము దెలిసికొని సిద్ధాదులు స్వాభావిత దేవతలకు రాజపుత్రుల బలి యిచ్చు వాడుక యున్నది. నీతండు కాపాలికుడువలె గనంబడుచున్నాడు. శ్మశానవాటికకు రమ్మని చెప్పుటవలన సందియముగా నున్నది. వానియెడ జాగరూకుడవై యుండవలయుం జుమీ! అని చెప్పిన నవ్వుచు నృపతి యిట్లనియె.

క. కానిది కాదెన్నటికిని
   గానున్నది మానదెపుడు కాకది దైవా
   ధీనం బీవిధి నెఱిగిన
   ధీనిధి చింతింప డెపుడు దేనికినైనన్.

భట్టీ! భవితవ్యత యెట్లుండునో యట్లు జరుగక మానదు. అందుల కెప్పుడును విచారింపవలసినది కాదు. కపటంబు జేసి నన్ను దీసికొనిపోవదలంచెనా వాని దోషము వానికే ఘటించు నిందులకు వగవవలదని యుపదేశించి వసుమతీపతి యా చతుర్దశినాడు ఖడ్గహస్తుండై యొక్కరుండ నీలపటోత్తరీయముతో బయలుదేరి సాయంకాలమున కాపరివ్రాజకు డెఱింగించిన శ్మశానభూమికిం బోయెను.

సీ. చట చటారావ విస్ఫుటచితానల సము
                  ద్భూత ధూమము గన్నుదోయి ముడుప
    కడలేక మనుజ కంకాళ కపాలాస్తి
                  చయము లెల్లెడ నిండి భయముతో గొలుప
    భూతభేతాళ ప్రభూత ఘోషముఁలతో
                  గలసి పేరు ధ్వనుల్గన మంట
    బాలవృద్ధస్త్రీశవ ప్రతీకములు భీ
                 భత్సరూపమునఁ జూపట్టుచుండ
గీ. బైరవుని దారుణంపు టాకారమనఁగ
   వెలయునట్టి స్మశానభూతలముఁ జేరి
   వెఱపొకింతయు లేక పృథ్వీధవుండు
   వటవిటపిక్రింద నున్న యజ్జటిని గాంచె.

కనుంగొని నమస్కరింపుచు భిక్షకుండా! నేనిదెవచ్చితి. కర్తవ్యమేమి యని ఖడ్గహస్తుండై యడిగిన నతండు స్తుతిపూర్వకముగాఁ జేయవలసిన కృత్యమంతయును దెలియఁజేయుటయు నా సాహసాంకుండు అంధకారబంధురంబైన యాయర్థరాత్రంబునఁ జితాధూమాకులంబగు స్మశానమధ్యభాగముమీఁదుగా దక్షిణముగా రెండుక్రోశముల దూరములో శింశుపాతరువు నరసి పట్టుకొని యాచెట్టు మొదట బొలసుకంపు గొట్టుచు వ్రేలం గట్టఁబడియున్న పురుషశవమును దెంచి సన్యాసి యెఱింగించిన కుణపం బదియే యని నిశ్చయించి యించుకయును వెఱువక చొరవతో నా తరువెక్కి యక్కుణపంబునకు గట్టఁబడియున్న త్రాళ్ళం దెగఁగోయుటయు నాశవము గభాలునఁ గ్రిందఁ గూలినది. పతనవ్యధబేకంబోలె బాబో! యనిపెద్దయఱు పఱచినది.అప్పు డానృపాలుండు జాలింబడి అయ్యో! దీనిని శవ మనుకొని నేలం బడ ద్రొబ్బితిని. జీవమున్నది కాఁబోలు? సన్యాసి చెప్పినతరువిదియే యగునా? అని యాలోచించుచు నల్లన చెట్టు దిగివచ్చి పతనవ్యధ వాయ నిమురుటకై దానిమేనఁ గేలు మోపినంతఁ బ్రళయభైరవాట్టహాసముఁ గావించినది.

ఓహో! తెలిసినది. దీనికొఱకు నేను జాలినొందఁ బనిలేదు. ఇది భేతాళాధిష్ఠితమగు శవంబు. దీనిగురుతు లన్నియు నతండు చెప్పినట్లే యున్నవి. అని తలంచుచు నోభూతరాజమా? నిన్ను నే విడుచువాఁడను గాను. నన్నేల చిక్కులు బెట్టెదవు? నావెంట రమ్మని పలుకుచుండగనె నాశవం బంతర్థానము నొందినది.

అయ్యో! మరచిపోయి మాట్లాడితిని, మాట్లాడిన నది యదృశ్య మగునని సన్యాసి చెప్పియేయున్న వాఁడు. అయినఁ గానిమ్ము , అది యెక్కడికిఁ బోఁగలదు. అని నలుమూలలు పరికించుచుండ నాతరుమూలమున వెనుకటివలె వ్రేలాడుచుండెను. అన్న! ముచ్చా! నీశాంబరీడాంబికములకు నేను లొంగువాఁడను కాను నిన్నుఁ గొంపోక విడువను రమ్ము. రమ్ము. అని పలుకుచు వెనుకటివలెనే యాశవమును నేలం బడవైచి తదట్టహాసఘోషములకు జడియక యప్పీనుఁగు కాలుచేతులు గట్టి భుజముపై నెక్కించుకొని యుత్తరాభిముఖుండై యరుగుచుండెను.

అప్పు డాశవసంసిస్థితుండగు భేతాళుండు మహారాజా! ఈయర్థరాత్రంబున నీస్మశానములో నీచెట్టుచెంతకు వచ్చి నన్నుఁ బట్టుకొని నాయరపులు విని బ్రతికియున్నవాఁడవు. నీవంటి సాహసాంకుని మూఁడులోకంబులయందును జూడనేరను. మనుష్యమాత్రున కిపనిఁ జేయశక్యమా? నీదైర్యము నీసాహసము నాకు మిగులసంతోషము గలుగఁ జేసినవి. నిన్ను మెచ్చుకొంటి. వినోదముగా నీకొక కథఁ జెప్పెద నాలింపుము.

పద్మావతి కథ

ధారుణీకైలాసంబగు వారణాశీపురంబునఁ బ్రతాపమకుటుండను రాజు రాజ్యము సేయుచుండెను. అతనికి వజ్రమకుటుండను కుమారుడుఁగలఁడు. వాని సౌందర్యము త్రిభువనస్తోత్రపాత్రమై యున్నది. మహామతియను మంత్రిపుత్రుఁ డారాజపుత్రునకుఁ బ్రాణమిత్రుఁడై యనుసరించి తిరుగుచుండును.

వారిరువురు నొకనాఁడు సముచితపరివారముతోఁ గూడికొని వేటకై దూరదేశకాంతారముల కేగి యాథేటనపాటవంబులఁ బెక్కుమృగంబులఁ బరిగొని నరిజనులకు దూరమై యలసి పిపాసాలాలసులై జలాశయముండుచో టరయుచు గుఱ్ఱములెక్కి పోయిపోయి యొకచోట -

చ. పరిమళ బంధురప్రసవ పత్ర విచిత్రఫల ప్రసూన భా
    సుర వివిధద్రుమోపల విశోభిత తీరము నారసౌరభాం
    బురహ చరన్మధువ్రత మభోగవిరాన మనోజ్జ మబ్ధిభా
    స్వరము సరోవరం బొకటి ప్రాంతమునం గనిపించె వారికిన్.

అం దొకతీరమున సఖీపరివృతయై తీర్థంబు లాడుచున్న మించుబోఁడి యోర్తు రాజపుత్రిని హృదయ మాకర్షించినది. స్వశరీరలావణ్యప్రవాహంబున నాతటాకంబుఁ బూరించుదానివలె దృష్టిపాతంబుల నూత్నోత్పలవనం బందు సృష్టించువానివలెఁ జతేందువగు మొగంబునందుఁగల యరవిందంబుల డిందుపఱచుదానివలె నొప్పుచు దివ్యాకృతిఁగల యాకలకంఠం జూచి యత్తరుణుండు చిత్తజాయత్తచిత్తుఁడై యుత్తల మందుచుండ నయ్యిందువదనయుఁ గందర్పసుందరుండగు నారాజనందనుం గాంచి పంచశరశరవిద్ధహృదయమై సహజాలంకారంబగు లజ్జచేఁ దల వాల్చుకొని యోరచూపుల నతనిం జూచుచు నతండు సూడఁ దనదృష్టుల మరలించుకొనుచు వివిధవిలాసతరంగితాంతరంగియై యొప్పుచు నతండు సూచుచుండ సాకూతంబుగా శిఖావతంసముగా నిడిన యుత్పలముఁ దీసి కర్ణంబునం బెట్టినది. మఱియొక పద్మంబు శిరంబున నుంచినది. హృదయంబునఁ గరంబు నిలిపినది. కాని రాజపుత్రుఁ డా సంజ్ఞల నేమియు గ్రహింపలేక యూరక యున్మత్తుఁడువోలెఁ జూచుచుండెను. అంతలో నా కాంతారత్నము బరిజనులతోఁగూడ నాందోలక మెక్కి తనదేశమునకుం బోయినది.

రాజపుత్రుండును భ్రష్టవిద్యుండగు విద్యాధరు చందంబున మతిచెడి యుస్సురని నిట్టూర్పు నిగిడింపుచుండ మంత్రిపుత్రుండు వయస్యా! జలంబుల గ్రోలి యవ్వలికిఁ బోవుదము రమ్ము. అమృతోపమానంబగు తోయంబు సమీపంబుననుండ నూరక చూచుచుంటివేమి? కాసార విలసంబులా? పిపాసాలనుండ నింతసే పెట్లు తాళితివని యడిగిన రాజపుత్రుం డిట్లనియె.

మిత్రమా? నాయాత్రము నీతో నేమని వక్కాణింతును? మన మిక్కడికి రాకున్నను జక్కగా నుండెడిది. జగన్మోహనవిలాసాకారభాసుర యగునాతరుణీలలామము నా కన్నులం బడకున్నను బ్రతికిపోవుదుము, కనంబడియు నాదిసఁజూడకున్న నీపరితాపము లేకపోవుంగదా? చూచినను శృంగారలీలల నేల ప్రకటింపవలయును? ప్రకటించి కొంతసే పిందుండక మెఱుపువలె నంతలో లేచిపోవవలయునా? తదీయ కులశీలనామదేశంబు లెట్టివో తెలియవు. నా మనోవ్యథ దుర్భరముగా నున్నది. ఇట్టి బాధ నే నెప్పుడు పడి యెఱుంగ నిందుల కేదియేని ప్రతీకారము గావించి నీమిత్రు బ్రతికించు కొమ్మని పలికిన విని మంత్రిపుత్రుండు నవ్వుచు నిట్లనియె.

వయస్యా! రహస్యముగా మీచేష్టలన్నియు నేను బరీక్షించుచునే యుంటిని. నీవు విచారింపవలదు. ఆ చిన్నది సాకూతముగాఁ దనకులశీలనామంబులు దెలియఁ జేసియున్నది. నీవు గ్రహింపలేక పోయితివి. వినుము కర్ణంబున నుత్ఫలం బిడుటచే కర్ణోత్పలుఁడను రాజు రాష్ట్రంబున జన్మించిననియు దంతములు రాయుటచేఁ దంతఘాటకుని కూతుర ననియుఁ బద్మధారణంబునంజేసి పద్మావతి యను పేర గలదిగా నిరూపించినది. మఱియు హృదయంబున హస్తముండుటచే నా ప్రాణములు నీయందే యున్నవని సూచింపఁ బడుచున్నవి. మఱియు నాకర్ణోత్పలుఁడు కళింగరాష్ట్రంబున నున్నవాఁడని ప్రసిద్ధి. దంతఘాటకుఁ డతని ప్రసాదవిత్తుఁడు, సంద్రామవర్దనుఁడను నామాంతరము గల యతనికిఁ ద్రిలోకసుందరియగు పద్మావతి యను కూతురు గలదని అదివఱకే నేను వినియుంటిని. ఆ కన్యకయం దతనికి ప్రాణములకన్న నధికమగు ప్రీతిఁ గలదని చెప్పుకొందురు. ఈవృత్తాంత మింతకుమున్నె వినియున్నవాఁడఁ గావున నా సంజ్ఞలన్నియు గ్రహించితిని. అని యెఱింగించినంత నత్యంతసంతోషముతో నతనిం గౌగలించుకొని యిట్లనియె.

వయస్యా! నే నాసుందరీమణి సౌందర్యలోకాన వివశుండనై యేమియు గ్రహింపలేకపోయితిని. నీవు మిక్కిలి బుద్ధిమంతుఁడవు. ఎట్లైన నా కన్యకారత్నము స్వాధీన మగునట్లు చేయుమని ప్రార్థించెను. అప్పుడే వారిరువురు బయలుదేరి క్రమంబునఁ గళింగదేశంబున కరిగి యందుఁ గర్ణోత్పలుని నగరము ప్రవేశించి దంతఘాటకుని గృహమును వెదకికొనుచుఁ బోయి తత్ప్రాంతమందున్న యొకవృద్ధాంగన గృహంబు బ్రవేశించి అంబా! యీ యూర సంగ్రామవర్దనుండను దంతఘాటకుని నెఱుంగుదువా? అని యడిగిన నా జరఠ యిట్లనియె. అయ్యో అతని నెఱుఁగ కేమి? నే నతని కూతురు పద్మావతికి ధాత్రిని నన్నామెచెంత నుండునట్లు నియమించెను. అదియే వారియిల్లు. నాకుదగిన పుట్టంబులు గట్టలేమిం జేసి యిప్పుడామె యొద్దకుఁ బోవుట మానివేసితిని. నా కొడుకు దుర్మార్గుఁడు. నా వసనంబుల జూదమాడి యోడిపోయెనని చెప్పిన విని సంతసించుచు మంత్రిపుత్రుండు ధాత్రీ నీవు విచారింపకుము. నీకుఁ గావలసిన వస్త్రంబులు దెచ్చికొనుము, సొమ్మి చ్చెద నని రెండు మాడల చేతం బెట్టెను.

అది మిగుల సంతసించుచు మంచివస్త్రంబులు దెచ్చికొని బాబూ ? నీకు నా వలనఁ గాఁదగినపని యేదైనఁగలదేని వక్కాణింపుఁడు. కావించి కృతకృత్య నయ్యెదనని పలికిన విని మంత్రుఁడు అమ్మా! నీవు మంచిదానవు. మా రహస్య మెవ్వరికిం దెలియనీయకుము. పద్మావతి యొద్దకుఁబోయి మా మాటగా నిట్లు చెప్పుము. నీవల్ల నాఁడు తటాక ప్రాంతమునఁ జూచిన రాజకుమారుఁడు నీ నిమిత్తమై వచ్చియున్నాడు. పరిచయముచేత నే నీరహస్యము నీ కెఱింగించితినని చెప్పుము.

అని యుపదేశించి పంపుటయు నా వృద్ధ యతివేగముగాఁ పోయి మఱి రెండు గడియల కరుదెంచి కన్నుల నీరుగ్రమ్మ వారి కిట్లనియె అయ్యా! నేను రహస్యముగాఁబోయి మీ రన్నమాటలఁ బద్మావతికిం జెప్పితిని. అప్పుడు ముప్పిరి గొను కోపముతో నా యొప్పులకుప్ప దెప్పునఁ దనచేతుల కప్పురంబు నద్ది నా రెండు దవడలమీఁద జెంపకాయలు గొట్టినది. వ్రెళ్ళంటుకొని యా చిహ్నములు గనంబడుచున్నవి. చూడుడు అని దుఃఖించుచుఁ జెప్పికొన్నది. అప్పుడు రాజపుత్రుఁడు వయస్యా నీవా పూవుఁబోఁడి చేసిన చేష్టలు వేఱొకలాగున భావించి నాయందే లగ్నమైన చిత్తముతో నేమేమో సంజ్ఞలం గావించినదని జెప్పితివి. అది కాముకాశయము. ఆ చిన్నది సక్తయే యైనచో మనవార్తవిని యీమె నిట్లేలఁ గొట్టును. ఇఁక నిరాశఁ జేసికొని మనము పోవచ్చునా? అని యడిగిన మంత్రి పుత్రుం డిట్లనియె.

మిత్రమా! ఇంతమాత్రమునకే కార్య నైరాశ్యముఁ బొందెదవేల? ఆ చిన్నది కడుజాణ. అదియు భావసూచకమే? వినుము ఇవి వెన్నెలరాత్రులు పది మిగిలియున్నవి. అది దాటినఁగాని సంగమావకాశము గలఁగదని తెలియజేయుచుఁ గర్పూరములోఁ బదివ్రేళ్ళంటించినది. తొందరపడకుమని బోధించెను.

వెన్నెలరాత్రులు గతించిన తరువాత మఱి రెండుమాడలా వృద్ధచేతిలోఁబెట్టి మంత్రిపుత్రుండు తల్లీ! నీవొకసారి యా నారీమణి యొద్దకుఁబోయి కూర్చుండుము. ఏమియు మాటాలాడవలదని బోధించి యంపుటయు నది వోయి వచ్చి యచ్చతురుల కిట్లనియె.

అయ్యా! మీ మాటవడుపునఁబోయి నే నేమాటయు నాడక నాకడదాపునఁ గూర్చుంటిని. ఆ పద్మావతి వెనుక నేనుజేసిన యపరాధ ముగ్గడింపుచుఁ బారాణిలో మూఁడు వ్రేళ్ళు జొనిపి నా యురంబున గొట్టినది చూడుఁడు. గురుతు లెట్లంటు కొన్నవో అని చెప్పినది.

ఆ మాట విని రాజపుత్రుఁడు మొగంబు నధైర్యము దోప వయస్యా! నన్నూరక వెఱ్ఱియాశ పెట్టుచుంటివి. మనయం దిష్టమున్న నిట్లు సందేశహరిణిం గొట్టునా? అని పలికిన విని మంత్రిపుత్రుఁడు వయస్యా! నిదానింపుము. ఇదియు నభిప్రాయసూచకమే. తాను రజస్వల యైనట్లును మూఁడు దినములు తాళుఁడని సూచించుచున్నది. అని యెఱింగించిన యతనికి సంతోషము గలుగఁజేసెను.

మూఁడు దినములు గడచినవెనుక మంత్రిపుత్రుఁడు వెండియు నా వృద్ధురాలి చేతిలో నాలుగుమాడలు పెట్టి యెట్లో కష్టపడి మఱియొకసారి యా నారీరత్నము నొద్దకుఁ బోయిరమ్ము. ఏ మాటయుఁ జెప్పవద్దని పలికి యామె నంపెను. ఆ జరఠ వెనుకటివలెనే పోయి పద్మావతిం జూచినది. ఆ చిన్నది యేమియుం మాటాడక చాల గౌరవించి వినోదములు పెక్కులు గావింపఁజేసి సాయంకాలము దనుక నందుండ నియమించినది.

ఆ వృద్ధ అమ్మా! పోయివత్తు ననుజ్ఞ యిమ్మని పలుకుచు ద్వారదేశము చేరునంత వీథిలో గోలాహలధ్వని వినంబడినది. పెద్ద యేనుఁగునకు మదముదిగినది. గొలుసు త్రెంచుకొని బారిపోవుచుఁ గనంబడిన వారినెల్లఁ గొట్టుచున్నదని జనులు నలుమూలలకుఁ బరుగిడుచున్నారు.

అప్పుడు పద్మావతి వృద్ధను నీవు రాజమార్గంబునం బోవలదు. ఈపీటకుఁ ద్రాళ్ళు కట్టెదము. దీనిపైఁ గూర్చుండుము. పెద్ద గవాక్షముదారిని దొడ్డిలోనున్న తోఁటలోనికి దింపెదము. ప్రక్కనున్న చెట్టెక్కి ప్రహరిదాటి యవ్వలికిఁ బొమ్మని యుపాయము చెప్పి యట్లు చేయించినది.

వృద్ధ ప్రహరి దిగి యింటికివచ్చి జరిగినచర్య యంతయుం జెప్పినది. రాజపుత్రున కేమియుఁ దెలిసినదికాదు. మంత్రిపుత్రుఁడు రాజపుత్రుని భుజముపైఁ గొట్టుచు వయస్యా! నీ యభీప్సితము ఫలించినది. నిన్నంటియున్న తుంటవిల్కానిఁ గృతార్థుం గావింపుమని పలికిన నతండు వయస్యా! ఎట్లు గ్రహించితివి? అది వృద్ధతో నేకాంతముగా నేమాటయైనం చెప్పినదాయేమి? చెప్పుము, చెప్పుమని యడిగిన నవ్వుచు మంత్రిపుత్రుఁడు మిత్రమా! నీ కింకనుఁ దెలియలేదు. అది చేయించినచర్య యంతయు వృద్ధయందుఁగల ప్రేమచేతఁగాదు. నిన్నట్లు రమ్మని మార్గము దెలిపినది. నీవీరాత్రి యందుఁ బోవచ్చును. కార్యసిద్ధి యగునని చెప్పి వాని సంతోషపారావారవీచికలలో ముంచివైచెను.

పెందలకడ భోజనముచేసి రాజపుత్రుండు చక్కఁగా నలంకరించుకొని యుండ వృద్ధచెప్పిన మార్గంబున మంత్రిపుత్రుఁ డతని నా యింటిప్రహరియొద్దకుఁ దీసికొనిపోయి దాపుననున్న వృక్షశాఖామూలకముగా నతని బ్రహరి యెక్కించెను. తరువాత నతండు లోపలనున్న చెట్టుకొమ్మమీఁదుగా నుద్యానవనములోనికిఁ దిగి యందొక గోడప్రక్కను వ్రేలాడుచున్న పీఁటపైఁ గూర్చుండి త్రాళ్ళు కదిపెను. లోపల నొక చిన్న గంట మ్రోగినది. ఆ వెంటనే త్రాళ్ళు పైకిలాగఁబడినవి. గవాక్షవివరమునుండి యా రాజపుత్రుఁడు పద్మావతి యున్న మేడమీదికిఁ బోయెను.

అది యంతయుం జూచుచు మంత్రిపుత్రుఁడు తిన్నఁగా నింటికిం బోయెను.

రాజపుత్రుఁ డా యింటిలోఁ బ్రవేశించి యందు -

సీ. తతహంసతూలికా తల్పంబునను దల
              గడ నోరఁగా జేరబఁడి యొయూర
    మమర సన్నని వలిపెము జరీమెఱుఁగు చె
             రఁగుపైటలోని తోరంపుగబ్బి
    గుబ్బలుబ్బగమై గగుర్పొడువంగఁదా
             వ్రాసిన రాజపుత్రకుని చిత్ర
    ఫలకమీక్షింపుచు లలితాంగరుచు లలం
             కారదీప్తులఁ దిరస్కారపరుపఁ
గీ. బూర్ణచంద్రాననంబు ప్రఫుల్లపద్మ
   పత్రసమనేత్రములు మృదుపదయుగంబుఁ
   గలిగి త్రిభువననుతరూపకలితయగుచు
   కాంతి నొప్పారు పద్మావతీవధూటి.

కనుంగొని యారాజనందనుం డందెవ్వరులేమికి మిగుల సంతసించుచుఁ జేరంబోవునంతలో నత్తలోదరి యదిరిపడి యట్టెలేచి యెదుర నభినవమన్మధుండువోలె నొప్పుచున్న యా రాజకుమారుం గాంచి హర్షపులకితగాత్రయై కంఠాశ్లేషంబు గావింపుచుఁ గపోలముల ముద్దువెట్టుకొనుచుఁ దల్పంబునం గూర్చుండిఁబెట్టి పూసురటి వీచుచు -

క. మముఁ గడుశ్రమపెట్టితి నను
   క్షమియింపుఁడు మీదు బుద్దికౌశలమునకుం
   బ్రమదంబుగలిగె మన్మతి
   సమయంబు గ్రహించితిరి విశాలమనీషన్.

అని పొగడుచు శృంగారలీలాతరంగితాంతరంగియై తనకుగల యనంగశాస్త్రపాండిత్యము తేటపడ ననేక రతివిశేషంబుల నా రాజకుమారు నపారసంతోషపారావారతరంగముల నోలలాడించినది. అట్లా రాజపుత్రుండు గుప్తముగా నా వాల్గంటి యింటనుండి తుంటవిల్కాని వేడుకలతోఁ బది యహోరాత్రము లొకగడియ వలె వెళ్ళించి యొకనాఁ డాచేడియతోఁ నిట్లనియె.

మానవతీ! నీ వలపు తీపులకుం జిక్కి నీప్రక్కవిడువక పెక్కుదినములు గడిపితిని. నా ప్రాణమిత్రుఁ డొక్క డీయూర నా వృద్ధయింట నున్నాఁడు. వాని నొక్కసారి చూచివచ్చెద ననుజ్ఞయిమ్మని పలికిన నక్కలికి యులికిపడి యేమి? నీ కొక మిత్రుఁ డున్నాడా? నా సంజ్ఞలన్నియు గ్రహించినవాఁ డాతడా నీవా? అని యడిగిన నతఁ డిట్లనియె.

అతివా! అతండు చాల బుద్ధిమంతుఁడు. నీవు గావించిన చర్య యొక్కటియు నా కూహకు రాలేదు. అన్నియు నతండే గ్రహించి నన్నిందుఁ దీసికొని వచ్చెనని యా వృత్తాంత మంతయుం జెప్పెను. ఆ మాట విని యా ధూర్త అయ్యో? నీ మిత్రునిమాట యెప్పుడుం జెప్పితిరి కారేమి? ఇన్నినాళ్ళు బూజింపక యపరాధి నైతి. మీకు మిత్రుడు. నాకుఁ బూజ్యుఁడు. తాంబూలాదివస్త్రప్రదానంబున నతనిని ముందుగనే సంతసపరవలసినది. చెప్పనితప్పు మీయందే యున్నది అని పలుకుచు నా రాజపుత్రుని వెనుక వచ్చినదారినే గోడదాటించి యతని నివాసమున కనిపినది. రాజపుత్రుండు వృద్ధయింటికింబోయి. తన రాక కెదురుచూచుచున్న మంత్రిపుత్రుం గౌఁగలించుకొని వయస్యా! నీ బుద్ధిబలమువలన నాకననుభూతపూర్వమగు సంతోషము గలుగఁజేసితివి. పద్మావతి మిక్కిలి రూపవతి. తేజోవతి. అట్టిజాన నెందును జూచి యెఱుంగ నాహా! తత్క్రీడాసల్లాపవినోదంబు లేమని చెప్పుదును? అని పొగడుచుఁ దాని నాయింటిలోఁ బ్రవేశించినది మొదలు నా క్షణమువఱకు జరిగిన రహస్యచర్యలన్నియుఁ బూసగ్రుచ్చినట్లు తెలియపరచెను.

అప్పుడు మంత్రిపుత్రుఁడు అయ్యో అన్నియుం జక్కగాఁ జేసితివికాని యా సంజ్ఞలన్నియు నా మిత్రుఁ డెఱింగి చెప్పెనని చెప్పుట పొరపాటు. దానివలన గొన్ని ముప్పులు రాఁగలవు. నేనే తెలిసికొంటినని పలికిన లోపమేమి వచ్చును. అని యాక్షేపించిన విని రాజపుత్రుండు యథార్థకధథవలనఁ బ్రమాదమున్నదని నాకుఁ దెలిసినదికాదు. నేనే చేసితినంటినేని మఱియొకటి యడిగిన నేమి జేయుదును. ఆమెకు నీయందు గౌరవము గలుగునిమిత్త మట్లు చెప్పితిని. నిన్నెంతయో పొగడినది. నీకు సపర్య చేయనందులకు మిక్కిలి పశ్చాత్తాపము జెందుచున్నదని సమాధానము చెప్పెను.

వారట్లు మాట్లాడుకొనుచుండఁగనే తెల్లవారినది. ప్రాతఃకృత్యంబులు దీర్చుకొని యా మాటలే ముచ్చటించుకొనుచున్న సమయంబునఁ బద్మావతిసఖురా లొకతె యరుదెంచి తాను దెచ్చిన పంచభక్ష్యాన్న తాంబూలాదులు వారి యెదురనుంచి వారికి నమస్కరింపుచు మంత్రిపుత్రునితో నార్యా! నేను పద్మావతి సఖురాలను, ఆమె మీ సేమము దెలిసికొని యర్చించి రమ్మన్నది. ఈ భక్ష్యభోజ్యాదులు మీ నిమిత్తము స్వయముగా వండి యిందుఁ బంపినది. మీ మిత్రు నాహారమున కందుఁ బంపనున్నది. అని యతినిపుణముగాఁ బలుకుచు విని మీరు భుజింపుఁడని మంత్రిపుత్రునకుఁ గొన్ని పిండివంటలు నిరూపించి చూపుచు నవి యందుంచి యాపైదలి పద్మావతి యొద్దకుఁ బోయినది.

పిమ్మట రాజపుత్రుఁడు వయస్యా! నీ వే మేమో పలికితివి. పద్మావతికి నీయం దెంతప్రీతియో తెల్లమైనదియా? స్వయముగా వండి పిండివంటకములఁ బంపినది. నిన్న నాతో నెంతఁగా బొగడిన దనుకొంటివి? నీవు వేఱొక్కరీతి శంకింప నడ్డము చెప్పలేకపోయితిని. ఇఁక వీనిని భక్షింతము లెమ్మని పలికిన విని చిఱునగవుతో మంత్రిపుత్రుండు మిత్రమా? నీకొక చిత్రము చూపించెదఁ జూడుము. దాన నా చేడియకుఁ నాయం దెట్టిప్రీతియో తెల్లము కాఁగలదని పలుకుచు నా భక్ష్యములలో నొకదాని నేరి యందున్న సారమేయము ముందర వైచుటయు నా కుక్క దానిం దిని గడియలోఁ బ్రాణము వదలినది.

రాజపుత్రుఁ డావింతఁ జూచి మిత్రుం గౌగలించుకొని అయ్యో? పెద్ద గండము దాటినది. ఇది నీ వెట్లు గ్రహించితివో తెలియదు. నీ మతి కౌశలమునకు బృహస్పతిగూడ నెనగాఁడు. నేను దాని కపటము గ్రహింపలేకపోయితిని. అన్నన్నా అది నిన్నుం బెద్దగా స్తుతింపుచుండ సత్యమని నమ్మితిని. నిన్ను జంపుటవలన దాని కేమిలాభమో తెలియకున్నది. దీని నెట్లు తెలిసికొంటివని యడిగిన సచివసూనుం డిట్లనియె.

వయస్యా! పద్మావతి సఖురాలు భక్ష్యముల నీకును నాకును విభజించుటతో గ్రహించితిని. ప్రతిభక్ష్యము గురుతుఁ జూచుచు నా ముందర నిడినది. నన్ను గడతేర్చుటకు నీ వింటికి బోక సతతము దాని విడువక యందే యుండెదవని తలంచి యిట్టు చేసినది. కానిమ్ము దీనికిఁ బ్రతీకారము గావించములే. అని పలికిన విని రాజ పుత్రుఁడు చాలు చాలు. ఇఁక నేను దానియొద్దకుఁ బోఁజాల నది యెంతపనియైనం జేయగలదు. మన మింటికి బోవుద మనుటయు మంత్రిపుత్రుఁ డిట్లనియె.

వయస్యా! అట్లనరాదు. దానికి నీయందుఁ బ్రీతి గలిగియున్నది. తగిన ప్రతిక్రియఁజేసి పిమ్మటఁ బోవుదము గాక. అని వారు మాటాడుకొనుచుండఁగ వీథిలో శోకాకులమగు జనకలకలధ్వని యొండు వినంబడినది. అయ్యో? అయ్యో? రాజకుమారుండు బాలుఁడు విపన్నుఁడయ్యె నక్కటా? ఒక్కఁడే కొడుకు. రాజున కెట్టి యాపద వచ్చినది? అని ప్రజలు గుంపులుగాఁగూడి చెప్పుకొనుచుండిరి.

ఆ వార్తవిని మంత్రిపుత్రుఁడు రాజపుత్రునితో నీకొక యుపాయము జెప్పెద నట్లు కావింపుము. ఈ రాత్రి శూలము ప్రచ్ఛన్నముగాఁ దీసికొని పొమ్ము. వెనుకటిదారినే దానియింటికిం బోయి రాత్రి మత్తుపదార్థములు దానికి మస్తుగా ద్రావించి క్రీడాంతరమున నది యొడలు తెలియకుండఁ బడియున్న సమయంబున నా త్రిశూలము నిప్పులోఁ గాల్చి దాని పిఱ్ఱమీఁద నంటించుము. అప్పుడును నది లేవదు. తరువాత దాని మేనియాభరణము లన్నియు మూటగట్టుకొని ప్రచ్ఛన్న మార్గమున నిందురముశి. తరువాత జేయదగిన యుపాయ మెఱింగింతునని చెప్పుటయు రాజపుత్రుండు సమ్మతింపుచు నతం డిచ్చిన త్రిశూము దీసికొని చీఁకటిలోఁ బ్రహరి దాటి త్రాళ్ళమూలమున దాని యంతఃపురమున కరిగి కొంతసే పనంగక్రీడారంగమున నంత్యముగావించి యతం డాలలన యలసియున్న సమయంబునఁ దాఁదెచ్చిన మత్తుపదార్థ మానాతి తినుచుండెడి వంటకములోఁ గలిపి మత్తుగలుగ జేసెను. అప్పడతి యొడ లెఱుంగక గాఢముగా నిద్రఁబోయినది. త్రిశూలముం గాల్చి పిరుదుపై నంటించి చిహ్నము గలుగఁ జేసి దాని మేని యాభరణములన్నియు దీసి మూటఁ గట్టుకొని రివ్వున గోడదుమికి ప్రహరి యెక్కి యిక్కకుం జని మంత్రిపుత్రున కా నగ లన్నియుం జూపెను.

మంత్రిపుత్రుఁడు మిత్రుని మెచ్చుకొనుచు మఱి నాలుగుదినములు గడిపి కాషాయాంబరములు ధరించి తానొక యవధూతవేషము వైచికొని రాజపుత్రుని శిష్యునిగా నిరూపించి శ్మశానవాటికలో గూర్చుండి పద్మావతి యాభరణములలో ముత్యాల హార మొకటి రాజపుత్రుని కిచ్చి యిది యంగడికిఁ దీసికొని పోయి యమ్మకము జూపుము. రాజభటులు వచ్చి నిన్ను బట్టుకొనిన నిట్లు చెప్పుము. అని యేమేమో బోధించి యంపెను. అతం డాముక్తాహారం బంగడికిఁ దీసికొని యమ్మఁజూపుచుండెను. ఏ వెలకు నియ్యక యటు నిటు తిరుగుచుండెను. దంతఘాటకుఁడు మిక్కిలి భాగ్యవంతుఁడు. ప్రాణము లన్నియుఁ బుత్రికపై బెట్టుకొని యున్నవాఁడు. పుత్రిక వస్తువులన్నియు దొంగలెత్తుకొని పోయిరని దాదులవలన విని యా వార్త గ్రామాధికారికిఁ దెలియఁ జేసియున్నవాఁడు. అయ్యధికారి రక్షకభటులతోఁ జెప్పియున్న కతంబునఁ బద్మావతి విలాసచిహ్నితమగు ముక్తాదామంబు రాజపుత్రుని చేతంజూచి రాజభటు లతనిం బట్టుకొని యిది నీకెక్కడిది? నీవు సన్యాసివయ్యు భూషణముల నెట్లు సంపా దించితివని యడిగిన నతండు కింకరులారా? దీని వృత్తాంతము నా కేమియుం దెలియదు. నా గురు వీవీటి శ్మశానవాటికలో జపము చేసికొనుచున్నవాఁడు. అతండు దీని నమ్మి సొమ్ము దెమ్మనుటచేఁ దెచ్చితినని వాక్రుచ్చుటయు నా రాజభటు లతని నా వస్తువుతో గ్రామాధికారి యొద్దకుఁ దీసికొనిపోయి చౌర్యవస్తువును జాపుచు నతండన్న తెఱంగెఱింగించిరి.

అప్పుడు గ్రామాధికారి దంతఘాటకునిని బిలిపించి యా హారము నీ పుత్రిక దేనా? అని యడిగిన నతం డౌను. ఇది నా కూఁతురు ధరించునది. మిక్కిలి వెలఁ గలదని యెఱింగించెను. అప్పుడు నగరాధ్యక్షుఁడు రక్షకపురుషులతో రాజపుత్రుని వెంటబెట్టుకొని శ్మశానవాటికకుఁ బోయి యందు మహాతపస్వివలె జపము జేసికొనుచున్న మంత్రిపుత్రుం గాంచి యయ్యధికారి నమస్కరింపుచు మహాత్మా! నీవు సర్వసంగపరిత్యాగ యోగ్యంబగు నాశ్రయంబున వసించియు నీ ముక్తాదామంబెట్లు సంగ్రహించితివి? దీని మీ శిష్యున కిచ్చి యమ్మమని చెప్పితివఁట సత్యమేనా? అని యడిగిన మంత్రిపుత్రుండు మెల్లనఁ గన్నులం దెరచి వారినెల్లఁ గూర్చుండుడని సంజ్ఞ చేయుచు నిట్లనియె.

నేను బరివ్రాజకుండ నొకచోట నుండువాఁడను గాను మహారణ్యముల సంచారము చేయుచుందును. నేను దైవికముగా నాలుగుదినముల క్రిందట నీ యూరు వచ్చి రాత్రి స్మశానములో బసఁజేసితిని. అప్పుడు నేనిందర్దరాత్రంబున యోగినీసమూహ మొకటి తిరుగుచుండఁ జూచితిని. వారిలో నొక యోగిని రాజపుత్రుని శవమును దీసికొని వచ్చి యతని గుండెకాయఁ బైకి పెకలించి భైరవునికి నివేదనఁ గావించినది పిమ్మటఁ బానమత్తయై నృత్యము గావించుచు నా యొద్దకు వచ్చి యనేకవికారములు జూపుచు నా జపమాలికను హరింపఁ బ్రయత్నించినది.

అప్పుడు నేను దానిని మంత్రబద్ధం గావించి యీ త్రిశూలము గాల్చి దాని కుడిపిరుదుపై వాతపెట్టి దాని మెడలోనున్న యీ ముక్తాదామంబు లాగికొని వదలి వేసితిని. ఈ హారము తాపసులకడ నుండఁ దగదని మా శిష్యునికిచ్చి యమ్ముకొని రమ్మని చెప్పితిని. ఇదియే దీని వృత్తాంతమని పలికిన విని గ్రామాధ్యక్షుండు విస్మయకులహృదయుండై యేమి చేయుటకుం దోచక యప్పుడే రాజునొద్దకుఁ బోయి యా హారమును జూపుచు శ్మశానవాసి చెప్పిన కథ యంతయుం జెప్పి యిప్పుడు గర్తవ్వ మేమియో మీరే యోచింపుడని చెప్పిన విని యా నృపాలుం డాలోచించి యప్పుడే యొక వృద్ధురాలిని రాజభటుల వెంట బద్మావతి యింటి కనిపి పరీక్షించి రమ్మని నియోగించెను.

ఆమె వచ్చి పద్మావతి కుడిజఘనంబుపై త్రిశూలాంకమున్నదని చెప్పినది. మఱి యిరువుర వలన నా మాట ధ్రువపఱచుకొని నరేంద్రుండు అక్కటా? నాముద్దు పట్టిం గడతేర్చిన ఢాకిని యిదియే. పగలిట్లుండి రాత్రుల విహరించి జంతువున హింసించుచున్నది. కాఁబోలు దీని నిగ్రహించుట యెట్లో యని యాలోచించుచునప్పుడే యా శ్మశాన భూమికిం బోయి మంత్రిపుత్రుం గాంచి నమస్కరింపుచు మహాత్మా! మీ ప్రభావ మగమ్యము. మీయునికిఁ దెలిసినచో మొన్న నా పుత్రుండు చావకపోవుంగదా? ఢాకినీదేవతలు బాలఘాతుకలని విని యుంటిమి. పద్మావతి ఢాకినియే కాఁబోలు. మా యూరిలోనుండి నా పుత్రుం బరిమార్చినది. గతమునకు వగచినఁ బ్రయోజనము లేదు. ఇటు పైన దీని నెట్లు నిగ్రహింపవలయునో మీరే సెలవీయవలయును. లేనిచో నున్నవారిఁగూడఁ జంపఁగలదని ప్రార్థించిన విని నవ్వుచు నా కపటవ్రాజకుఁడు రాజా! ఆ చిన్నది ఢాకినియే కావచ్చును. నా మహిమ యెఱుంగక నాపైకిఁ గూడ నురకవచ్చినది. ఇది యన నెంత భూతభేతాళములే నా చెంతకు రా వెఱచుచుండును. కానిండు మీకు మంత్రభస్మ మిచ్చెదను. ఆ మచ్చెకంటి నీ యూరునుండి లేవఁగొట్టుటయే శ్రేయస్కరము. అది యిందుండిన మున్ముందు చాల ప్రమాదములు రాఁగలవు. మహారణ్యములో విడిచి గ్రామము చుట్టు నీభస్మము జల్లుడు. ఇఁక నెప్పుడు నీ పట్టణము జేరలేదని సంచిలో నుండి విభూతి దీసి మంత్రించి యిచ్చెను.

రాజు దానిం దీసికొనిపోయి రక్షకపురుషులఁ గొందఱఁ బల్లకితో నాఁటి యర్థరాత్రమున దంతఘాతకునింటి కనిపి తల్లిదండ్రులు మొఱ వెట్టుచుండఁ బద్మావతిని బలవంతమున పల్లకీలోఁ గూర్చుండ బెట్టి మహారణ్యమధ్యంబున విడిచిరమ్మని నియోగించుటయు వా రట్లు కావించిరి.

పద్మావతి మహారణ్యమధ్యంబున విడువఁబడి యోహా! ఈ కపట మంతయు బుద్ధిమంతుఁడగు మంత్రిపుత్రునిచేఁ గల్పింపబడినది. నే నిప్పు డేమి చేయుదును? ఎవ్వరితోఁ జెప్పుకొందును? నా చేసిన కృత్రిమము నన్నే కొట్టినదని దుఃఖింపుచుండ నింతలోఁ దెల్ల వారినది. తాపసవేషములు దీసి పారవైచి వారిరువురు వారువము లెక్కి యక్కలికి యున్న యడవికిం జని వెదకికొనుచు నొకచెట్టుక్రింద జింతించుచున్న యా కాంతారత్నమును జూచి కపటవిస్మయ మభినయించుచు బాలా? నీ వెవ్వని కూఁతురవు? ఇవ్విపినంబున నొంటిగా నుంటివేల? నీ వృతాంత మెఱింగింపు మని యడిగిన నప్పడఁతి వారికి నమస్కరింపుచు మంత్రిపుత్రు నుద్దేశించి యిట్లనియె.

మహామతీ? భూమండలమున నిన్నుబోలు బుద్ధిమంతులు లేరు. బుద్ధిలేక నిన్నవమానపఱచిన నా తప్పు మన్నింపుము నాకుఁ దగిన ప్రాయశ్చిత్తము గావించితివి. ఇంతటితో విడిచి నన్ను స్వీకరింపుఁడు. బుద్ధి వచ్చినది. తప్పుపను లెన్నడును జేయను. దైవముతోడిన ప్రమాణికము జేయుటయు మంత్రిపుత్రుఁడు రమణీ! మా రాజపుత్రుండు నీ సౌందర్యచాతుర్యాదివిశేషంబుల కానందించి నిన్ను వలచుటచే దేశములు దిరిగి తిరిగి నీనికటమున కరుదెంచితిమి. దైవానుకూలంబున మీ యిరువురుం గలసికొని యానందించితిరి. స్త్రీచాపల్యంబునం జేసి నీవు గావించిన ద్రోహమునకు ఫలము జూపితిమి. ఇఁక వెఱవకుము. మారాజపుత్రుఁడు నిన్ను ధర్మపత్నిగాఁ స్వీకరించును. మా వెంట రమ్మని పలుకుచు గుఱ్ఱమెక్కించుకొని తమ నగరంబునకుఁ దీసికొని పోయిరి.

రాజపుత్రుఁ డాపద్మనేత్రిం బెండ్లియాడి వేడుకలం గుడుచుచుండెను. పద్మావతి తలిదండ్రులు పుత్రికావియోగశోకంబునఁ బరితపించుచు నా యడవికిఁబోయి వెదకి వెదకి పద్మావతిం గానక యాకనకగాత్రిని మృగములు భక్షించినవని నిశ్చయించి మోహాతిశయంబునఁ బ్రాణములు విడిచిరి.

అని భేతాళుం డాకథ జెప్పి మహారాజా? ఇందు నాకొక్క సందియము గలుగుచున్నది. దాని నీవు విడఁగొట్ట వలయును. ఆ దంపతులు శోకవేగంబున బలవంతముగా మృతినొందిరిగదా? ఆ పాపము మంత్రిపుత్రునిదా? రాజపుత్రునిదా? నీవు మిగుల బుద్ధిమంతుఁడవు. నిరూపించి చెప్పుము. తెలిసియుండియుఁ జెప్పకుంటివేని నీ తల నూరువ్రక్కలై పోగలదు సుమీ? అని యడిగిన విని శాపభీతిచే నూరుకొనక యిట్లు చెప్పెను.

భూతపతీ? ఆ పాతకము ఆ మువ్వురలో నొకనికిం జెందదు. ఆ దేశ మేలెడు కర్ణోత్పలునికిఁ జెందునని పలికెను. అయ్యో? అందులకుఁ గారకులగు నా ముగ్గురిలో నొకని కంటవలెఁ గాని రాజేమి యెఱుంగును? అతని నెట్లు చెందఁగలదు? హంసలు శాలుల భక్షించిన కాకుల శిక్షింపవచ్చునా? అని యడిగిన విక్రమార్కుం డిట్లనియె.

భూతేంద్రా! వారు ముగ్గురు దోసకారులు కారు వినుము. మంత్రిపుత్రునకు ప్రభుకార్యము దీర్చుట విధి. పద్మావతీరాజపుత్రులు కామశరాగ్ని తప్తులగుట స్వార్థమును సంపాదించుటలో దోషములేని వారలే. కర్ణోత్పలుఁడు నీతిశాస్త్రముల శిక్షింపఁబడనివాఁడు చారులచే లోకుల నిజానిజంబులఁ బరీక్షించుచుండవలెను. ఎవ్వఁడో వచ్చి యేదో చెప్పినంత మాత్రమున నిజము విమర్శింపక ప్రజల దండింపవచ్చునా? అదండ్యుల దండించిన రాజు మహాపాతకముఁ బొందఁగలఁడు. నిర్దోషిణియైన పద్మావతిని దండించుటచే దాని తలిదండ్రులు దేహత్యాగము గావించిరి. అందులకుఁ గారకుఁడు రాజుగాక వారా? అని చెప్పినంత సంతసించుచు నా భేతాళుఁడు అతని భుజమున నదృశ్యుండై శింశుపాతరుమూలము జేరెను.

భేతాళవశ్యము

విక్రమార్కమహారాజు తన భుజంబున భేతాళుం డట్లదృశ్యుఁ డగుటయు వెఱువక మఱల నత్తరువరంబు చెంతకరిగి యందు వ్రేలాడు వళముం బరికించి వెనుకటివలెనే యాకుణపమును నేలం బడనేసి కాలు సేతులుం గట్టి స్కందమునం బెట్టుకొని మౌనంబు వహించి వచ్చుచుండ బేతాళుం డొక కథ జెప్పి యందలి సందియము దీర్చు మని యడుగుటయు నతండు శాపంబునకు వెఱచి యుత్తర మిచ్చెను. మౌనభంగంబునం జేసి యతం డదృశ్యుండై శింశుపాతరువు జేరెను.

ఈరీతి నిరువదినాలుగుసారులు కట్టి తీసికొనివచ్చి భేతాళుఁడు చెప్పినకథకు బ్రత్యుత్తర మిచ్చుచు నతనిం గోలుపోవుచుండెను. బేతాళుండు చివరఁజెప్పిన కథకు విక్రమార్కునకుఁ బ్రత్యుత్తరము దోచినది కాదు. మౌనముద్ర వహించి తీసికొని పోవుచుండ నా భూతరాజు మహారాజా! నీ సాహసమునకుఁ జాల సంతసము గలిగినది. నీకు మేలుజేయు తలంపుతోనే యిట్టికథఁ జెప్పితిని. నీవంటి పరోపకారపారీణునిఁ జిక్కులం బెట్టఁగూడదు. నిన్ను నీయాతా యాతా యాతనలం బెట్టినందులకు క్షమింపుము. ఆక్షపణకుఁడు నిన్ను నాకు బలి యిచ్చు తలంపుతో నీహోమము గావింపుచుండెను. వానినే నీవు నాకు బలినిమ్ము . నీకు వశుండనై యుండెదనని చేయఁదగిన కృత్యముల బోధించెను.

విక్రమార్కుం డామాటల కంగీకరించి యయ్యర్థరాత్రంబున నా శవమును మోసికొనిపోయి యాక్షపణకుని ముంగల నిలువంబడియెను.

కృష్ణపక్ష క్షపారౌద్రమగు నా రుద్రభూమియందు విశాలశాఖాచ్చాదిత గగనభాగమగు వటవృక్షము క్రిందఁ గుణపరక్తంబున నలికి గౌరవర్ణమగు నస్తిచూర్ణంబున మ్రుగ్గుపెట్టి మండలము గల్పించి యందు నాలుగుదెసల నసృక్పూరితములగు పూర్ణకలశముల నిడి తైలదీపములు వెలిగించి, యమ్మండలమధ్యంబున నగ్ని ప్రజ్వరిల్లంజేసి తగిన సంభారములు జేర్చి యం దభీష్టదేవత నెన్నుచు హోమము జేయుచున్న యాభిక్షకుఁ డట్లు వచ్చిన విక్రమార్కునం జూచి యట్టెలేచి యత్యంతసంతోషముతో మహారాజా! నీ యనుగ్రహంబున దుష్కరంబగు మద్వ్రతసిద్ధి పూర్ణము కాఁగలదు. ఓహో? విచారింప మీవంటివారెక్కడ! హేయంబగు నీకార్యం బెక్కడ? నిజము చెప్పుచున్నాను. మీ క్షత్రియకులంబున నిట్టిధైర్యశాలి నెందును జూచి యెఱుంగను.

ఆత్మీయలాభంబించుకయు నపేక్షింపక పదార్థము నతిక్లేశముతో నిట్లు సాధించుట నీకే చెల్లును. మహాత్ముల కిదియె సహజగుణంబని విద్వాంసులు చెప్పుదురు. ప్రాణములు పోయినను ప్రతిజ్ఞను పాలింతురు అని స్తుతిఁ జేయుచు నా భిక్షకుడు భేతాళాధిష్టిత మగు శవము నతని భుజమునుండి దింపి స్నానము జేయించి పుష్పమాలికలచే నలంకరించి యాశవము నామండలమధ్యంబున నునిచెను. పిమ్మట నా క్షపణకుండు చింతాభస్మోద్ధూళితగాత్రుఁడై శవకేశముల యజ్ఞోపవీతముగా జేసికొని ప్రేతవససంబు ధరించి యామండపంబున నిలువంబడి క్షణకాలము ధ్యానించి మంత్రబలంబున నాహూతుంజేసి భేతాళు నాశవంబునఁ బ్రవేశపెట్టి యథావిధి నర్చించెను. అర్గకపాలంబున నిడిన నరకళేబరరక్తంబున నర్ఘ్యం బిచ్చి పుష్పగంధానులేపనము లర్పించి మనుష్యనేత్రంబుల ధూపం బిడి నరమాంసమున బలులు దీర్చి పూజావ సానంబున, ఖడ్గహస్తుండై ప్రాంతంబున నిలువంబడియున్న విక్రమార్కుం గాంచి మహారాజా! నే నర్చించిన యీ మహాదేవతకు నీవును సాష్టాంగనమస్కారము గావింపుము. శుభంబులు సేకూరునని యుపదేశించిన విని యతండు భేతాళునిచే నంతకుమున్ను తదీయదుశ్చేష్టితం బెఱింగి యున్నకతంబునఁ గపటంబుగా నిట్లనియె.

పరివ్రాజకా! సాష్టాంగనమస్కారము నెట్లు చేయవలయునో నే నెఱుంగను. నీవు గావించి చూపిన నట్లు చేయువాఁడనని పలికిన విని యాదుష్టుండు సాష్టాంగముగా నేలం బండుకొని యిట్లు చేయుమని పలుకుచుండఁగనే యామండలాధిపతి తన చేతనున్న మండలాగ్రంబున వాని శిరంబు ఖండించి తదీయ హృదయపిండములతో తద్రక్తంబు భేతాళునకు నైవేద్యము గావించెను అప్పుడు సాధు! మహారాజా! సాధు, అని భూతభేతాళాదు లతని వినుతించినవి.

నరకళేబరమున వసించిన భేతాళుండు తుష్టుండై దివ్యరూపంబున నెదుర నిలువంబడి మహారాజా! సకలసద్గుణసంపన్నుండవు సాహసధైర్యస్థయిర్యాదుల నిన్నుఁ బోలిన వాఁడెందును లేఁడు. క్షపణక బలిప్రదానపుణ్యంబున నేన కాక నీకు భూతభేతాళశాకినీఢాకినీపిశాచాదులు వశ్యంబులై యుండగలవు నీపేరు దలంచినంత భయాక్రాంతస్వాంతములై పారిపోవును. నీవు తలంచినప్పుడెల్ల వచ్చి నీకు దాసుండనై చెప్పిన పనుల సాధించుచుండెదను. అని మఱియు ననేకవరంబు లిచ్చి యా భేతాళుండు నిజవాసంబునకుఁ బోయెను.

విక్రమార్కుండును క్షపణకుండు కావించిన దుశ్చేష్టితమును గురించి వితర్కింపుచు ఖడ్గహస్తుండై తెల్లవారక పూర్వము స్వసదనంబు బ్రవేశించి జరిగిన వృత్తాంతమంతయు భట్టికిం జెప్పి శాంతికపౌష్టికాదిహోమంబుల గావించి క్షపణకవధ మహాపాతకము వాయఁ జేసికొనియెను.

200 వ మజిలీ

మదనమంజరి కథ

మ. చేసిన యుపకారము మది
     భాసిల్లగ నోపినంత ప్రత్యుపకారం
     బాసక్తి జేయకుండిన
     సీ, సీ, యాజీవ మొక్క జీవమె యెందున్.

ఆహా ! మహానుభావుఁడు విక్రమార్కచక్రవర్తి నాకుఁ గావించిన యుపకారము నీకు నేనేమి చేయఁగలదానను ధనకనకవస్తువాహనాదు లిచ్చి సంతసపరుతమన్న మే మీయగలన్యామాజ్య బతండు గవ్వఁగానైన లెక్కఁగొనఁడు. తదీయసాహసయుతరణాలు గలగుణగణంబులు త్రిభువనాశ్చర్యకరంబులుగా నున్నవి. ప్రాణము తృణ