కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/200వ మజిలీ

వికీసోర్స్ నుండి

సానంబున, ఖడ్గహస్తుండై ప్రాంతంబున నిలువంబడియున్న విక్రమార్కుం గాంచి మహారాజా! నే నర్చించిన యీ మహాదేవతకు నీవును సాష్టాంగనమస్కారము గావింపుము. శుభంబులు సేకూరునని యుపదేశించిన విని యతండు భేతాళునిచే నంతకుమున్ను తదీయదుశ్చేష్టితం బెఱింగి యున్నకతంబునఁ గపటంబుగా నిట్లనియె.

పరివ్రాజకా! సాష్టాంగనమస్కారము నెట్లు చేయవలయునో నే నెఱుంగను. నీవు గావించి చూపిన నట్లు చేయువాఁడనని పలికిన విని యాదుష్టుండు సాష్టాంగముగా నేలం బండుకొని యిట్లు చేయుమని పలుకుచుండఁగనే యామండలాధిపతి తన చేతనున్న మండలాగ్రంబున వాని శిరంబు ఖండించి తదీయ హృదయపిండములతో తద్రక్తంబు భేతాళునకు నైవేద్యము గావించెను అప్పుడు సాధు! మహారాజా! సాధు, అని భూతభేతాళాదు లతని వినుతించినవి.

నరకళేబరమున వసించిన భేతాళుండు తుష్టుండై దివ్యరూపంబున నెదుర నిలువంబడి మహారాజా! సకలసద్గుణసంపన్నుండవు సాహసధైర్యస్థయిర్యాదుల నిన్నుఁ బోలిన వాఁడెందును లేఁడు. క్షపణక బలిప్రదానపుణ్యంబున నేన కాక నీకు భూతభేతాళశాకినీఢాకినీపిశాచాదులు వశ్యంబులై యుండగలవు నీపేరు దలంచినంత భయాక్రాంతస్వాంతములై పారిపోవును. నీవు తలంచినప్పుడెల్ల వచ్చి నీకు దాసుండనై చెప్పిన పనుల సాధించుచుండెదను. అని మఱియు ననేకవరంబు లిచ్చి యా భేతాళుండు నిజవాసంబునకుఁ బోయెను.

విక్రమార్కుండును క్షపణకుండు కావించిన దుశ్చేష్టితమును గురించి వితర్కింపుచు ఖడ్గహస్తుండై తెల్లవారక పూర్వము స్వసదనంబు బ్రవేశించి జరిగిన వృత్తాంతమంతయు భట్టికిం జెప్పి శాంతికపౌష్టికాదిహోమంబుల గావించి క్షపణకవధ మహాపాతకము వాయఁ జేసికొనియెను.

200 వ మజిలీ

మదనమంజరి కథ

మ. చేసిన యుపకారము మది
     భాసిల్లగ నోపినంత ప్రత్యుపకారం
     బాసక్తి జేయకుండిన
     సీ, సీ, యాజీవ మొక్క జీవమె యెందున్.

ఆహా ! మహానుభావుఁడు విక్రమార్కచక్రవర్తి నాకుఁ గావించిన యుపకారము నీకు నేనేమి చేయఁగలదానను ధనకనకవస్తువాహనాదు లిచ్చి సంతసపరుతమన్న మే మీయగలన్యామాజ్య బతండు గవ్వఁగానైన లెక్కఁగొనఁడు. తదీయసాహసయుతరణాలు గలగుణగణంబులు త్రిభువనాశ్చర్యకరంబులుగా నున్నవి. ప్రాణము తృణ ప్రాయముగా నెంచి సంచరించు నా పుణ్యపురుషుని వస్తుప్రదానంబున సంతసపఱుపఁ జాలను అతం డింత దనుక నవివాహితుండై యున్నట్టు విన్నదాన నప్రతిమానసౌందర్యప్రతిభాసమానుండగు నాదివ్యమంగళ విగ్రహునకు సరిపడిన పొన్నికొమ్మ యెందున్నదో? మూడులోకంబుల సరసి యాసరసునకుఁ బెండ్లిచేసి కృతకృత్యురాల నగుదును. నిందులకు నా కనుజ్ఞ యిండని కుబేరుని తమ్ముఁడు మాణిభద్రునిభార్య మదనమంజరి యను యక్షకాంత యొకనాఁడు భర్తం బ్రార్ధించినది.

అతండు సంతసించుచుఁ బ్రేయసీ! అట్టి చేడియకై మూఁడులోకములు దిరుగనేల? నీయక్క కూఁతురు త్రిపురసుందరి చక్కనిది కాదా? దానిం బెండ్లిఁ జేయరాదా ? అతండు మనుష్యుండని యమ్ముదిత నిరసించునేమో యనియా నీ సందియ మనుటయు నా మదనమంజరి యిట్లనియె.

ప్రాణేశ్వరా! మనుష్యలలోనే కాక సురగరుడోరగసిద్ధవిద్యాధరయక్షకిన్నరకింపురుషాదులలో స్వర్గమర్త్యపాతాళములలో భూతాభవిష్యద్వర్తమానకాలములయందు నమ్మహామహుం బోలిన సాహసుఁడు పరాక్రమశాలి వదాన్యుఁడు విద్వాంసుఁడు సౌందర్యవంతుఁడు తేజోమూర్తి లేఁడు కలుగఁడు. అని శపథముజేసి చెప్పఁగలను. అబ్బా! అమ్మహాత్ముని సుగుణంబులం దలంచికొనిన మేను ఝల్లుమను చున్నది. త్రిపురసుందరి యంగీకరింపదని కాదు. ఆ సుభగునకుఁ దగదని యాలోచింపుచుంటి ననుటయు మాణిభద్రుం డిట్లనియె.

త్రిపురసుందరి త్రిలోసుందరి యని వాడుకఁ బడసియున్నది కదా? వేల్పులుగూడ దానిం బరిగ్రహింపఁ బ్రయత్నించుచున్నారే. ఆఱేని కది యేమిటికి జోడుకాదు? అని యడుగుటయు నక్కలకంఠి జోడగుం గాక యమ్మహారాజు తొలుత స్వజాతి యువతిం బెండ్లియాడి కాని యితరులఁ బరిగ్రహింపఁడని వింటిని. ఈ వాల్గంటి నతనికి రెండవభార్యగాఁ జేయఁదలంచుకొంటి. కావున నిప్పుడు పుడమిఁగల దేశములఁ దిరిగి సుందరీలలామం బరిశీలించెదంగాక యని పలుకుచు నయ్యక్షకాంత యక్షీణజవంబున భూలోకంబునకుఁ బోయినది.

సీ. అంగదేశాధీశు నవరోధనము జూచి
             కుంతలేశ్వరు శుద్ధాంత మరసి
    సౌరాష్ట్రనాథు ప్రాసాదము ల్పరికించి
            కాశ్మీరవరువధూగణము గాంచి
    చోళ కాంభోజ నేపాళ భూపాలుర
           యంతఃపురస్థకన్యకల నెరిఁగి
    కరరవంగాంధ్రదేశ ప్రభూత్తంసుల
           రాణివాసముల దర్శనముఁ జేసి

గీ. మఱియుఁ గర్నాట పాంచాల మగధ లాట
    కోసలాది ధరానాయకుల కుమారి
    కలఁ గనుంగొని యాధరాతలవరేణ్యు
    సాటిగారని విడిచి యక్షకుల వనిత.

మఱియు ద్వీపాంతరంబుల కరిగి యందందు సంచరించుచు నొకనాఁడు మలయవతీ నగర ప్రాంతోద్యానవనంబునకుం బోయి యందలి వింతలు సూచుచు నందుఁ బుష్పములు గోయుచున్న యొక జవరాలిం గాంచి మించుబోఁడీ! నీ వెవ్వతెవె? ఈ యుద్యానవన మెవ్వరిది? ఈదేశము పేరేమి? అని అడిగిన నప్పడఁతి విస్మయముతో నామెం జూచుచు నిట్లనియె.

ఇంతీ? నీవడిగిన వృత్తాంతము తరువాత జెప్పెదంగాని ద్వారస్థులకుఁ దెలియకుండ నీ వనములోనికి నీవెట్లు వచ్చితివి? నీ వెక్కడిదానవు? నీ చక్కదన మక్కజము గొలుపుచున్నది. ముందు నీయుదంత మెఱింగింపుమని యడిగిన యక్షకాంత యిట్లనియె.

పద్మాక్షీ! నేనొక యక్షకాంతను. కుబేరుని తమ్మునిభార్యను నాపేరు మదనమంజరి యంద్రు. మేము గగనసంచారంబున నెల్ల లోకములు దిరుగుచుందుము. ఆకాశమార్గంబునఁ బోవుచుండ నిందలి కుసుమసౌరభ్యములు నన్నిందు లాగికొని వచ్చినవి. నభోమార్గంబున లోపలికి వచ్చితినని జెప్పిన విని యావనిత యామెకు నమస్కరింపుచు దేవీ! మీరు దేవతలు. మీ దర్శనము జేయుటచే నేఁడు నేను గృతార్థురాలనైతిని. వినుండు. ఇది మలయవతి యను నగరము. మలయధ్వజుఁడను రాజీ ద్వీపమును బాలించుచున్నాఁడు. ఆ నృపతికి మలయవతి యను కూఁతురు గలదు. త్రిలోకసుందరి యగు నా మగువకు నేను సఖురాలను పరిచారికను. ఈ యుద్యానవన మావనజగంధి విహరించునది. నిత్య మీపాటి కాపాటలగంధి యీ తోఁటకు వచ్చునదియే నేఁడొడలిలో నస్వస్థతగానుండి పెందలకడ లేచినది కాదు. ఈ పూవు లా వెలది నిమిత్తమే కోసికొని పోపుచున్నదాన నని యందలి వృత్తాంతమంతయుం జెప్పినది.

యక్షకాంత - సరోజముఖీ? మీ రాజపుత్రిక త్రిలోకసుందరి యని జెప్పితివి. చక్కఁదన మొక్కటియేనా విద్యలేమైనం జదివినదా ?

పరిచారిక - ఆమె విద్యావతి యగుటయే యింతవఱకు వివాహము జఱుగ నాటంకము గలిగినది.

యక్ష -- వివాహమునకు విద్యయేమి యాటంకముఁ జేయును ?

పరి - మూడుఁసారులు స్వయంవరములు జరిగినవి. భూమండలంబునందలి రాజు లందరు వచ్చిరి. ఆమె కెవ్వడు నచ్చలేదు.

యక్ష - ఆమె వరింపఁ దగిన వరుం డెట్లుండవలయును ?

పరి – అబ్బా? నేఁ జెప్పజాలను. ఒక్క చక్కదనము ఒక్క విద్య ఒక్క శౌర్యము ఒక్క ధైర్యము ఒక్క సాహసము పనికిరాదు. అన్ని గుణములు గలిగిన వాఁడెక్కఁడ దొరకును ? విరించి యామెకొఱకుఁ గ్రొత్తగా సృష్టించ వలయును.

యక్ష. - ఆమె కోరెడు గుణము లన్నియుం గలవానిఁ దీసికొనివత్తు నా కేమి పారితోషిక మిప్పింతువు.

పరి - ఏమో! అబ్బా? నే జెప్పఁజాలను. మన్మధుఁడు విద్యాశూన్యుఁడనియు జయంతుఁడు వితరణవిముఖుఁడనియు నలకూబరుఁడు పరాక్రమరహితుఁ డనియు నామె వారినే యాక్షేపించుచుండు నితరు లామెకు నచ్చుదురా ?

యక్ష - ఆమె కేమియు వంకలు లేవా?

పరి - ఆమె కేలోపములేదని నేను శపథము జేసి చెప్పఁగలను.

యక్ష -- నీ వామె చక్కదన మెక్కుడుఁగా మెగడుచుంటివి. నన్నొకసారి యామె యొద్దకుఁ దీసికొని పోయెదవా?

పరి - అమ్మా ! నీ విందే యుండుము. నేను పోయి నీ వృత్తాంతము సెప్పి యామె సెలవుఁ బొంది దీసికొనిపోయెద నెట్లయిన వారు రాజపుత్రికలు గదా?

యక్ష -- అదియే లెస్స. నీవు పోయిరమ్ము, నేనిందే యుండెదననుటయు సంతసించుచు నక్కాంత మలయవతి శుద్ధాంతమున కరిగినది. మదనమంజరియు దాని వెనుకనే తిలోహితయై రాజపుత్రికయున్న గదియొద్ద కరిగినది. అట్టి సమయమున మలయవతి పర్యంకము మీఁదనే కూర్చుండి. మఱియొక సఖురాలితో నిట్లు ముచ్చటింపు చుండెను.

మలయవతి - సఖీ! నా స్వప్నవృత్తాంతము నీతో నేమని వక్కాణింతును సిగ్గు సిగ్గు దాపున నెవ్వరు లేరుగదా.

సఖీ - నిన్నింత ప్రొద్దెక్కువరకు లేవకుండఁగ జేసిన యాకలతెఱ గెఱుంగ నా యంతరంగ మూరక వేగిరపడుచున్నది. ఇందొరులు లేరు. సత్వరముగాఁ జెప్పుము.

మల - వాల్గంటి! నా కిటువంటి స్వప్న మెన్నఁడును రాలేదు. వినుము. ద్వీపాంతరవాసి యెవ్వడో యొక చక్కని పురుషుండు. అని కన్నులు మూసికొని ధ్యానించుచు నెంతవఱకుఁ జెప్పితిని?

సఖి -- చక్కని వాఁడని చెప్పి మోహవివశవైతివి? వాని చక్కఁదనము నీకు నచ్చినట్లున్నది. కానిమ్ము తరువాత నేమి జరిగినది? మల - చక్కనివాఁడా యని యడుగుచుంటివా? నా హృదయంబున నెట్టి సౌందర్య ముండవలయునని చిత్రించుకొని యుంటినో యట్లే యున్నవాఁడు.

సఖి - ఊ, తరువాత వాఁడేమి జేసెను?

మల – వాఁడేమి జేసెనో సిగ్గువిడిచి చెప్పవలయునా? వినుము.

చ. పొలుపుఁగఁ జెంతఁ చేరి వలపు ల్మొలపించు పచోవిజృంభణల్
    వెలయఁగ నక్కుఁ జేర్చి ననువేనలి దువ్వుచు మోము మోమునన్
    గలిపి కపోలచుంబల మొనర్చుచు వాతెఱ తేనెగ్రోలె నిం
    పలవడ నామానోహరుఁ డహా? వెసమై వివశత్వ మందగన్.

సఖి -- మేలు మేలు, స్వప్నమందైన నీ మనోరథకుసుమంబు ఫలించినది. మంచిదియే తరువాత.

మరి - అంతలో శాతోదరి వచ్చి సఖీ ? తెల్లవారుచున్నది. యుద్యానవనంబునకుఁ బోవుదము లెమ్మని లేపి నాకల కంతరాయము గలుగఁ జేసినది.

సఖి - అయ్యయ్యో! మంచి యంతరమున నంతరాయము గలిగినది కదా ? శాతోదరిని శిక్షింపవలసినదే.

మల - నీ వనినట్లే పాపము కోపముతో దానిం దన్ని నేను రాను నీవు పొమ్మని పలికి క్రమ్మరఁ గన్నుల మూసికొంటిని.

సఖి - మఱల నాకల దోచినదా ?

మల - ఏల తోచెడిని ? దానిం ధ్యానించుచుండ నిద్రయే పట్టినదికాదు. వాని యాకారము కన్నులకుఁ గట్టినట్లే యున్నది. తూలికయు వర్ణికపాత్రికయు నిటు దెమ్ము. చిత్రపటంబున లిఖించెదంగాక యని తత్సామగ్రిఁ దెప్పించుకొని యప్పుడే యప్పురుషుని యాకారము వ్రాసి చెలికత్తియకుఁ జూపినది. అయ్యంబుజాక్షి వక్షస్యస్తహస్తయై వింతగా నా చిత్రఫలక ముపలక్షించుచుండెను. శాతోదరి వారి సంవాదము పొంచియుండి యాలించుచు నంతలో నెదురకు వచ్చి మచ్చెకంటికి ఇదిగో నీ మనోహరు నర్చించుటకై పూవులం దెచ్చితిని. పూజింపుమని పలుకుచుఁ బుష్ప బాజనం బెదురఁ బెట్టనది. మలయవతి తలయెత్తిచూచి చాటుననుండి మా మాటల నాలకించితివా యేమి? పూజింపుమనుచుంటివి. మంచిసమయమున లేపితివిగదా? చూడు మీతఁ డెవడో చెప్పుకొనుము అని యా చిత్రపటము చూపినది.

చూచి తలయూచుచు నా పరిచారిక రానిమ్ము. తొందరపడకుము ఈ రాత్రి మఱల నాచతురుఁడు కలలోవచ్చి తరువాయిపని నెరవేర్చునులే. అని పరిహాస మాడినది. మలయవతి నవ్వుచుఁ బూతోటనుండి యప్పుడే వచ్చితివేల? నే నందు రావలయు నకొనుచుంటినే యనవుఁ డా మగువ యిట్లనియె.

గజగమనా! నా యాగమన కారణంబు వినుము. యక్షకుల సార్వభౌముఁ డగు కుబేరుని తమ్ముఁడు మాణిభద్రుని యిల్లాలఁట. మదనమంజరి యను మదనవతి గగనమార్గంబున నెందేనిం బోవుచు మన యుద్యానవనమునందలి ప్రసూనముల సౌరభ్యము నాసాపర్వము గావింప నా తోటలోనికి దిగివచ్చి వింతగాఁ జూచుచుండ నే గనుఁగొంటిని. ఆమె చక్కదనము నీవు జూచిన మిగుల మెచ్చుకొందువు. మా యిరువురకు మాటలు గలిసినవి. ప్రస్తావములో నీ రూపము నీ విద్య నీ గుణములు నీ యభిలాషల తెఱం గెఱింగించితిని. నీకుఁ దగిన వరుండెందో యున్నవాఁడని చెప్పుచు నిన్నుఁజూడ నిందు వత్తునన్నది. కాని సెలవులేక తీసికొని వచ్చిన నేమందువో యని యందే యుంచి వచ్చితినని చెప్పినంత నా కాంత కంటకంబడి యిట్లనియె.

గీ. సకల జగదీశుఁడగు మహేశ్వరుని సఖుఁడు
   ధనదుఁ డుత్తముఁ డతని సోదరునిపత్ని
   నన్నుఁ జూడగవచ్చెనన్న వలద
   టందువే ఆజ్ఞకొఱకు మర్యాద యగునె?

కుబేరుఁడన సామాన్యు డనుకొంటివా? మన యైశ్వర్యమంతయు వారి గోటి కొనతోఁ బోలఁజాలదు. వారు వేల్పులు. పూజనీయులు. తదాగమనం బనుగ్రహంబుగాఁ దలంపక యాడపెట్టి వచ్చితివా ? చాలు చాలు. వేగఁబోయి యపరాధము జెప్పికొని ప్రార్థించి తీసికొనిరమ్మని యప్పనికత్తె ననిపినది.

మదనమంజరియు నా ప్రాంతమందుఁ దిరోహితయై నిలువంబడి వారి మాటలన్నియు నాలించుచు నయ్యిందువదన సౌందర్యాతిశయ మాపాదమస్తకముగా విమర్శింపుచు -

ఉ. మేలు! బలే? సెబాసు! పరమేష్టి విశిష్టత విక్రమార్కభూ
    పాలు నిమిత్త మీకిసలపాణి సృజించె నిజంబ కానిచో
    బాలిక సర్వసద్గుణ విభాసురుని న్వరుఁ గోరి యెవ్వనిం
    బోల వరింపకున్నె తలపోయ స్వయంవరకార్యదీక్షలన్.

ఇన్ని దేశములు దిరిగినందులకు నేఁటికి నా పరిశ్రమ సఫలమైనది. ఈ కలువకంటి కలలోఁ గన్న చెల్వుం డాతండే కావచ్చును. చిత్రఫలకముఁ జూచిన నా కిప్పుడే తెలియగలదు. దైవమే నన్నిక్కడికిఁ దీసికొనివచ్చెను. ఉపశ్రుతివలె నాకీ శుభోదర్కము వినంబడినది. గాక వనమోహిని నా పుణ్యమూర్తికిం బెండ్లిజేసి కృతకృత్యనగుదు. ఈ భూతదీయ సౌందర్య చాతుర్య సాహస వితరణాదిగుణంబు లభివర్ణించెద నని తలంచుచు యక్షకాంత క్రమ్మర నుద్యానవనమ్మునకుఁ బోయి పుష్పలతా విశేషంబులం జూచుచుండెను.

అంతలోఁ బరిచారిక వచ్చి నమస్కరింపుచు దేవీ ! మా రాజపుత్రిక మిమ్ము విడిచి వచ్చినందులకు నన్ను నిందించినది. మీ రాకవిని మిగుల నానందించినది పోవుదము రమ్ము అని సానునయముగా బలికిన విని యమ్ముదిత ముదితహృదయయై యమ్మదవతి వెంట నా వాల్గంటికిం బోయినది.

అంతలో మలయవతి జలకమాడి నూత్నమాల్యాంబరానులేపనాదులచే నలంకరించుకొని పీఠములు సవరింపఁజేసి యాసరసిజాననరాక కెదురు సూచుచుండఁ బరిచారికవెంట నా కలువగంటి వచ్చినది. పదియడుగు లెదురువోయినది. పన్నీటఁ బదములఁ గడిగి శిరంబునఁ జల్లుకొన్నది తడి యొత్తి హారతు లిచ్చి రత్నపీఠంబునం గూర్చుండఁబెట్టి సఖులచే వింజామరల విసరింపుచు వినయముతోఁ చేతులు జోడించి యిట్లనియె.

దేవీ! నీ వృత్తాంతము నా పరిచారికవలనం దెలిసికొంటి. నీయకారణవాత్సల్యమునకు మిక్కిలి యానందించితిని. నా నోములు ఫలించినని మానుషదుర్లభమైన మీ దర్శనముఁ జేసి కృతార్థురాలనై తినని పెద్దగా బొగడి అమ్మా! నీవెందుండి యెందుఁ బోవుచు నిందు వచ్చితివి. నీకు మంగళంబేకద? అని యడిగిన మదనమంజరి యాదరించుచు నిట్లనియె.

రాజపుత్రీ! నా చరిత్ర మించుకఁ జెప్పెద నాకర్ణింపుము. మా కాపుర మలకాపురము. నా భర్త కుబేరుని తమ్ముఁడు మాణిభద్రుఁడనువాఁడు. మా తండ్రి దుందుభి. నా పేరు మదనమంజరి యండ్రు. నేను నా భర్తతోఁ గూడికొని మూఁడు లోకములు తిరుగుచుందును. భూలోకములో నుజ్జయిని యను నగరముగలదు. దాని సర్వసంపదలకు నాకరముగా విశ్వకర్మ నిర్మించెను. ఆ నగర ప్రాంతమందు మకరందమను నుద్యానవనము గలదు. అత్తోఁట నందనచైత్ర రథాదుల మించి యున్నది.

ఒకనాఁడు. మే మాయుపవన ప్రాంతమునుండి పోవుచు నందలి వింతలు సంతసముఁజేయ నాయారామమునకుఁబోయి మనోహరునితోగూడఁ గొన్నిదినము లందు విహరించితిని. అందలి ఫలపుష్పలతా విశేషములు మమ్మందుండి కదల నిచ్చినవి కావు. ఒకనాఁడు ప్రాతఃకాలమున నే నందు బాలాతపము సేవింపుచుండ

క. శూల మొకకేలఁ దనరఁ గ
   పాలం బొకకేలఁ గ్రాల భయదాకృతి నా
   మ్రోల న్నిలువంబడెఁ గా
   పాలికుఁ డొకఁ డురుజటావిభసితాంగుడై .

న న్నెగాదిగ చూడచుండ గుండెబెదరి బెదరుదోప నీవెవ్వఁడ విం దేల వచ్చితివని యడిగతిని. వాఁడు చేడియా ! నీ చక్కఁదనము నా హృదయమును వ్రక్కలు చేసినది నీ యధరామృతం బొకసారి ద్రావనిత్తువేని నా సంతాపము చల్లారునని పలికిన నలుకతో నే నోరీ? తులువా? నిలు నిలు. మా మగవా రిప్పుడే వత్తురు. నేనొంటిదాననని యవాచ్యము లాడుచుంటివి. పో. పొమ్ము. పోకున్న నీ మదము నదమము చేయఁగలరని తిట్టితిని.

వాఁడు వేడిచూపుల నన్నుఁ జూచుచు నోసి? నీ జవ్వనము క్రొవ్వున నొవ్వ నాడితివి. నే నెవ్వఁడనో యెఱుంగుదువుగాక. నిన్ను మంత్రబద్ధం జేసి భైరవునిచే నాయున్న నెలవున కీడ్పించి తెప్పించుకొందుఁ జూడుమని పలుకుచు నప్పుడే యావీటి వల్లకాటికిఁబోయి యం దొకచో నగ్ని వ్రేల్చి మదీయ నామంబుచ్చరింపుచు వశ్యమంత్రములచే భైరవునిగుఱించి హోమముఁ జేయుచుండెను.

నే నావిధ మంతయుఁ దెలిసికొని నా భర్త వచ్చిన తరవాత జరిగిన కథ జెప్పి యా కాపాలికుఁడు చేయు క్రియకుఁ బ్రతిక్రియఁ గావింపవలయునని ప్రార్థించితిని. అప్పు డాయన మిక్కిలి పరితపించుచు నన్ను వెంటఁ బెట్టుకొని తన యన్న యగు కుబేరునొద్దకుఁ బోయి యిట్లనియె.

క. అన్నా? మే ముజ్జయినిం
   జెన్నగు పూతోఁటలో వసించి చరింపం
   గన్నాఁ డొక కాపాలికుఁ
   డెన్నిక నీమరదలను సుఖేచ్చఁ దలిర్పన్.

ఈమెచే నిరాకరింపబడి మంత్రబద్దంజేసి రప్పించుకొను తలంపుతో హోమముఁ జేయుచున్నాఁడు. ఈ యుపద్రవముఁ దప్పింపుమని కోరిన విని కుబేరుండు,

సీ. సురలోకములకన్న ధరణీతలంబు సుం
            దరమైనదంచునం దరిగినారొ ?
    మనచైత్రరథముకన్నను శోభనొప్పారు
            మకరంద మనియందు మసలినారొ ?
    కాపాలికులు కడుంగడు నుత్తములటంచు
            వారుండు తావులఁ జేరి నారొ ?
    దుర్మార్గులకు నెప్డు దూరస్తులై యుంట
            మంచిదౌ ననుమాట మరచినారొ ?
గీ. యేమిటికిఁ బోతిరో ? మీర లిలకు నటకు
    అకట? కాపాలికాధముం డొకఁడు యక్ష
    కులవధూమణి నిజమంత్రబలములన
    లాగికొనినపోవ నెంచుట బాగు! బాగు!

అని మమ్ము మదలించుచు నందులకుఁ బ్రతిమంత్రవేత్త యెవ్వడని యాలోచించియు నేమియుం దోచక మమ్ము వెంటఁబెట్టికొని యప్పుడ స్వర్గలోమునకు నిర్గమించి మహేంద్రునికి మమ్ముఁజూపుచు జరిగినకథ యంతయుం జెప్పి వీరి యాపదఁ దప్పింపుమని ప్రార్థించెను .

శచీపతి బృహస్పతిని రప్పించి కార్యమెఱింగించి యందలకుఁ బ్రతిక్రియ యెట్లని యడిగిన నతండు విమర్శించి,

క. కాపాలిక మంత్రస్థుం
   డై పరువడి భైరవుం డహంకారముతో
   నేపనియైనను జేయుఁ త
   దాపాదితఁబట్ట శక్యమా? విధికైనన్.

ఇప్పని మనవలనం దీరునదికాదు. పరమేష్టికడకుఁ బోయి ప్రార్థింపు మనుడని యుపాయముఁ జెప్పుటయు దదామంత్రణంబున రాజరాజు మే మనుసరించి రా బ్రహ్మలోకంబునకుఁ బోయి తద్పాద పద్మములకున మస్కరింపుచు నిట్లు విన్నవించెను.

సీ. విశ్వేశ ! వినవయ్య విన్నపంబొక్కటి
              వీఁడు నాతమ్ముఁడు వీనిభార్య
    యిది వీరు క్రొవ్వినెమ్మది నింటనుండ లే
              క సని నుజ్జయినీపురాంతికమున
    వెలయు పూఁదోఁటలో విహరింపఁ గాపాలి
              కాధముండొక్కఁ డియ్యతివ వలచి
    మంత్రబద్ధగఁ జేసి మగువఁ గొంపోవంగ
             హోమంబుఁ గావింపుచున్న వాఁడు
గీ. నరుల కమరులు భయపడు తఱులు వచ్చె
    నొక్కొ! దానికిఁ బ్రతిహతం బొకఁడు లేదె ?
    సృష్టికర్తవు నీవేమి చేయలేవు
    తాత? తప్పింపు మీయార్తి తలఁచి మాకు.

అని ప్రార్థించుటయుఁ జతుర్ముఁడు ముఖంబులఁ ద్రిప్పుచుఁ గుబేరా ! గరుండనినట్లు కాపాలికుల మంత్రబలం బట్టిదేసుమీ ! తన్మంత్రాదిష్టాతయగు భైరవుని పాప నెవ్వఁ డోపగలఁడు. ఇందులకొక యుపాయంబు సెప్పెద నాలింపుము. ఆ యుజ్జనీపురం నప్పుడు విక్రమార్క మహారాజు పాలించుచున్నాడు. ఆ నృపతిపేరు దలంచినంత భూతభేతాళ భైరవాదులు పలాయనము లగుచుండును. వాఁడీ చేడియను మంత్రబద్ధంజేసి లాగికొని పోవునప్పుడు విక్రమార్కునిగుఱించి యాక్రోశింపుము. నీ యాపద దాటఁగలదని యెఱింగించిన విని విరించి నభినందింపుచు మే మందసము మఱల నలకాపురంబున కరుదెంచితిమి.

నాలుగుదినంబులు సుఖం బుంటినో లేదో యొకనాడు కపాలహస్తుండు భూతసేవితుండు భయంకరాకారుండునగు భైరవుండు నాకడకువచ్చి పదపద కాపాలి సెలవైనది. అని నాచేయి పట్టుకొని లాగికొని పోవుచుండెను. నేను మొఱపెట్ట నా యలకాపురంబులోన వారెల్ల వచ్చి యడ్డుపడిరి. కాని వాని నాపలేక పోయిరి. ఆ భైరవుడు బలాత్కారముగా నున్న భూలోకమున కీడ్చుకొని పోవుచుండెను. అప్పుడు నాభర్త బ్రహ్మవాక్యముఁ దలంచి యుజ్జయినీపురంబున కరిగి విక్రమార్కుని హజారమున నిలువంబడి పెద్దయెలుంగున నోమహారాజా విక్రమాదిత్యా? ఆదిత్యసమతేజా! మీ రాజ్యములో నొక కాపాలికాధముఁడు మహాపతివ్రత యక్షకాంతం జెరఁబట్టు చున్నాఁడు. వేగవచ్చి రక్షింపవే? దీనశరణ్యా? అని వేడికొనియెను.

ఆపరిదేవనము చారులవలన విని యమ్మహాత్ముఁడు ఖడ్గహస్తుఁడై వెఱవకుఁడు వెఱవకుఁడు నేనిదే వచ్చుచున్నాఁడనని పలుకుచు నాభర్తయొద్దకు వచ్చి యయ్యుపద్రవము విని యతివేగముగా నా స్మశానభూమికిఁ బరుగెత్తుకొని వచ్చెను.

అట్లు నన్నాభైరవుండు లాగికొనిపోయి యా పితృవనములో మండుచున్న చితిపై నొప్పు శవముపై గూర్చుండి హోమము జేయుచున్న కాపాలికుని నతం డంతర్హితుం డయ్యెను. వాఁడు నన్నుఁ జూచి కొమ్మా? రమ్ము, రమ్ము. నిన్నిట్టా రప్పించితినని కోపింపకుము. ఇప్పుడైన నాశక్తి తెలిసినదియా? నీ యథరామృత మిచ్చి కాపాడుమని పలుకుచు జితి దిగి నాచెంతకు వచ్చుచుండెను. అప్పుడు నేను భయాక్రాంతస్వాంతనై హా! విక్రమార్క మహారాజా! హా! దయానిధీ! ఆర్తరక్షకా! అని మొఱ పెట్టునంతలో -

ఉ. ఎవఁడవురా దురాత్ముఁడ ? మదీయపురాంతికమందె యిట్లు మం
    త్రనిధి మహాపతివ్రత నధర్మరతిం జెరపం దలంచు చుం
    టివి? భవదీయ మస్తము పఠేళ్ళున వ్రక్కలుజేసి నీదు భై
    రవునకె భోజనం బిడుదురా నిలు మిప్పుడె చూడు దుర్మతీ ?

అని పలుకుచు నలుదెసలం బరికించి యోరీ? అగ్నిశిఖా? ఇటురా అని పిలుచునంతఁ గన్నులు నిప్పులు గ్రక్కుచు నరుణజటాకలాపము వ్రేలాడ హుంకారము గావింపుచు నోరుఁ దెఱచికొని యా భేతాళుం డరుదెంచి చేతులు జోడించి మహాత్మా? సెలవేమి? అని యడుగుటయు నమ్మహారాజు పరదారాపహర్తయగు నీ కాపాలికాముని శీఘ్రము వధింపుమని యాజ్ఞాపించెను.

అప్పు డయ్యగ్నిముఖుండు హుమ్మని మొగంబు దెఱచికొని కాపాలికుని మీఁది కురికినంత వాఁడు వెఱచి చితియురికి వెనుకముందు జూడక కాలికొలఁది పారఁ దొడంగెను. అగ్నిశిఖుండు వానివెంటఁబడి తరిమి వాని రెండు కాళ్లునుం బట్టికొని గిర గిర ద్రిప్పి నేలంగొట్టుటయు ముఖనాసావివరములనుండి రక్తంబుగార నాపాపాత్ముండు గిలగిలఁ దన్నికొనుచుఁ బ్రాణములు విడచెను.

ఆ స్మశానములోఁ దిరుగుచున్న యమశిఖుండను మఱి యొక్క భేతాళుం డాకాపాలికుని శరీరములో దూరి గంతులు వైచుచు నగ్నిశిఖునిపై నెదుర్కొని పోట్లాడుటకు డీకొనియెను. ఇరువురకుఁ గొంత సేపు ముష్టియుద్ధము జరిగినది. అగ్నిశిఖుండు యమశిఖునితోఁ బోరుచు ఓరీ? దుష్టుఁడ తొలఁగుము. నేను మహానుభావుండను విక్రమార్కచక్రవర్తిగారి యాజ్ఞానుసారమున నీకాపాలికుఁ బరిమార్చితిని. నీవెవ్వఁడవు ? నాకాహారము గానున్న యీ శవములో దూరి గంతులు వైచుచున్నావు ? నీయుదంత మెఱింగిన నదిగో! ఖడ్గహస్తుండై యమహారాజందు నిలువంబడియున్నవాఁడు. నీపీచ మడంచఁగలఁడు. వారిసామర్థ్య మెఱుఁగక నీవిట్లు వచ్చితివని పలికిన విని వాఁడు వెక్కిరించుచు విక్రమార్కుఁడన నెవ్వఁడు ? ఢాకినీవల్లభుఁడా? భూతచక్రవర్తియా? భేతాళసార్వభౌముఁడా? అతనిపేరు సెప్పి నన్ను బెదరింపుచుంటివి? నీ మాటలకు నేను వెఱచువాఁడనుగాను. పోరరమ్ము. రాకున్న నీయాహారము నాకిచ్చి పొమ్ము అని బెదరించిన నవ్వుచు నగ్నశిఖుం డిట్లనియె.

ఓరీ? దుర్మతీ? నేను నీకు వెఱచి యట్లంటి నసుకొంటివిరా? స్వజాతిప్రీతిచే హితము జెప్పిన వెక్కిరించుచుంటివి? ఆతఁ డెవ్వఁడొ చెప్పవలయునా? తదీయ ప్రభావద్యోతకమగు నొక్కకథఁ జెప్పెద నాలింపుము. నీకుఁ దెలియఁగలదు.

డాకినేయుని కథ

ఈ నగరంబున డాకినేయుండను జూదరి గలఁడు. జూదరులలో నట్టి మొండివాఁడు లేడు. వాఁడు జూదమాడి పెక్కురొక్కము సంపాదించెను. తాను గెలుచునా సొమ్మిమ్మని యప్పుడే వేధించును. ఓడెనా? గద్దించి యెగవేయును కితవు లందరు గుమిగూడి జూదమాడి వాని నోడించిరి. ఓడిన సొమ్మిమ్మని యడిగిననేమియు మాటాడక రాతివిగ్రహమువలెఁ గదలక కూర్చుండెను. జూదరులు త్రాళ్ళతోఁ గట్టి వానిని జెట్టునకు వ్రేలాడఁగట్టి కశలతోఁ గొట్టిరి ఎట్లు నిర్బంధపెట్టినను చట్టురాయివలెఁ గదలక కిక్కురుమనక యట్టె నిలువంబడి యుండెను. అట్టి మొండెకట్టె భూలోకములో లేఁడు. ఆ ధూర్తులు వానిం గొట్టుటకు విసుపుఁజెంది. వానిం బట్టి మోసికొనిపోయి యూరిబయట నున్న యగాధమగు పాడునూతిలోఁ బారవైచి తమ నెలవులకుఁ బోయిరి.

వా డాచీఁకటి నూతిలోఁబడి కొట్టుకొనుచున్న సమయంబున నందున్న యిరువురు పురుషులు వానిం బట్టికొని యోరీ? నీవెవ్వఁడవు? ఇందేల పడితివి? నీ వృత్తాంతము జెప్పుమని యడిగిన వాఁ డిట్లనియె. మహాత్ములారా? నేనొక జూదరిని. ఢాకినేయుఁడనువాఁడఁ గితవులు నన్నుఁ జావఁగొట్టి యీ నూతిలోఁ బడవేసి పోయిరి. మీరెవ్వరు? ఇందేల యుంటిరి? నాయాపద దాటింపవచ్చిన భగవంతులని తోఁచు చున్నది. నన్నీనూతినుండి దాటించి రక్షింపుఁడని వేడుకొనుటయు వాండ్రిట్లనిరి.

ఢాకినేయా? మేమిద్దరము బ్రహ్మరాక్షసులము. వెనుకటి జన్మమునందు మేము గావించిన దురంతచర్య లనేకములు గలవు వినుము.

ఉ. దారులు గాచి పాంథసముదాయము డాయఁగ నడ్డమేగి కాం
    తారములందు దోచికొని తద్ధనమెల్ల దయావిహీనతన్
    వాగదినించినన్ దలలు వ్రయ్యలు సేయుచు ఘోరతస్కర
    క్రూరకఠారచర్యల నరుల్ బెదరం జరియించు చాదటన్.

మ. ఒకనా డిర్వురు తాపసోత్తములు మంత్రోపాసనాసక్తిఁ గా
     శికి బోవంగని మార్గమధ్యమున నా సిద్ధార్థుల న్మీఁదు గా
     నక నిభ్యాధికులంచు భూరిలగుడన్యాసంబుల న్భిన్నమ
     స్తికులంజేసి వహించినార మొడలంతన్బాసి యీరూపముల్ .

భూతభేతాళ శాకినీ ఢాకినీ ప్రభృతులు మారు వెఱచుచుండు. మేము భూమండలంబెల్ల నిరాటంకముగా సంచరింపుచు మాంత్రికులకు లొంగక తాంత్రికుల లక్ష్య పెట్టక --

సీ. నెలఁదప్పి బాహ్యసీమలఁబండుకొనెడు రా
                  కాసుధాకిరణ సంకాశముఖులఁ
    బ్రసవమె జాతకర్మ సమయంబున బిడ్డ
                 తోఁ బీటఁ గూర్చున్న తొయ్యలులను
    ప్రథమార్తవమునఁ దీర్థంబాడు నాఁడు వెం
                డ్రుక లార్చుకొను సరోరుహ వదనలఁ
    బట్టాభిషిక్తయై పట్టపేనుఁగ నెక్కి
               భర్తతో నూరేగు పడఁతుకలను
గీ. పట్టికొని రక్తమాంసముల్ దొట్టి పీల్చి
   పిప్పిచేయుచుఁ గడదేర్చి విడుతు మహహ!
   మాంత్రికులు తాంత్రికులు పెక్కుమంది వచ్చి
   దెచ్చి రొక్కట మాదుతర్జనల కడలి.

గీ. పురుగుపట్టిన పెనుమొక్కవోలె మేము
   చేరిపట్టిన సఖి కడతేరు వఱకు
   విడుచువారము గామెట్టి విధులనైన
   బ్రహ్మరాక్షసులనఁగ దుర్భరులుగారె ?

అట్లు పెక్కండ్ర జవరాండ్ర రక్తమాంసములఁ బొట్టలం బెట్టుకొనియుఁ దృప్తివహింపక భూమండలంబెల్లఁ బరిభ్రమించుచు గ్రహచారము సాలక యొకనాఁ డీయుజ్జయినీపురంబు జేరి యిందు మంత్రిపుత్రికయు షరాబుకూఁతురును నుద్యానవనములో విహరింపుచుండఁ జూచి యోర్వఁజాలక వారిం జెరియొకరము నావేశించితిమి.

క. తల విరియఁ బోసికొని వలు
   వలు వారఁగ దండఁ జఱచి వనితలు తమ్ముల
   కలవఁగ వచ్చిన చుట్టం
   బుల బాదిరి మీఁదఁ బడి సముద్రేకమునన్.

అప్పుడు వారిని భూతావిషులగాఁ దలంచి దధిష్టు లతిజవంబునంబోయి వారి తలిదండ్రుల కెఱింగించుటయు నత్యంత దుఃఖ పరిభూత చేతస్కులై వా రఱుదెంచి,

శా. అమ్మా ! రమ్మిది యేమి పాపమిటు లుగ్రాకారవైయుంటి మీ !
    యమ్మ న్నన్ను నెఱుంవోయని యమాత్యాభాస్య చేరింజనన్!
    హుమ్మంచు న్వెఱపించె మంత్రిసుత రౌద్రో ద్రేక మేపారఁ గ
    న్బొమ్మల్ ద్రిప్పుచుఁ బారిరాప్తజను లమ్మోయంచు నార్తధ్వనిన్.

మఱియు నాతలోదరు లస్మదావేశంబునం జేసి యనేక వికార చేష్టలఁ బ్రకటింపుచుఁ జూడవచ్చిన వారినెల్ల జావమోదుచుండఁ దజ్జనకు లతిరయంబునం బఱచి విక్రమార్క మహారాజున కంతయు నివేదించిరి.

అన్నరేంద్రుండు కృపాణపాణియై మాయన్న నెలవుల కరుదెంచుటయు దుర్నిరీక్ష్యంబగు తేజంబున నొప్పు నతనిం గాంచినంత మాస్వాంతంబు లత్యంత భయాక్రాంతమ్ములైనవి. సింగంబునుంగన్న మాతంగమ్ములువలె వెఱచుచుమే మాపడుచుల విడిచి కాలికొలఁది పరిగిడఁ దొడంగితిమి.

తదీయ ప్రతాపానలజ్వాలలు నలుమూలలు వ్యాపింప మా చూపులకు మిఱిమిట్లు గొలుపుచు మమ్మేదెసకుఁ బారిపోనీయక వేడి గలుగఁ జేసినవి. ఎందుఁబోవుటకుఁ గనులు గానక తొట్రుపడుచున్న మాకడ కమ్మహాత్ముం డరుదెంచి హుంకారముతో మమ్ము బరిభవింపఁ బూనుటయుఁ బాదంబులం బడి నిన్ను శరణుఁ జొచ్చితిమి. రక్షింపుమని ప్రార్థించితిమి. అక్కరుణాకరుండు మమ్ము జంపక పాపాత్ములారా ? ఇక నెన్నఁడేని యిట్టి పని చేసితిరేని మిమ్ము భస్మము జేసెద నిందుకుఁ బ్రాయశ్చిత్తముగా మీకొక సంవత్సరము శిక్ష విధించితి నెక్కడికిం బోకుండ మా యూరి బయటనున్న పాడు నూతిలో బడి యుండుఁడు. అని పలుకుచు మమ్ముఁ గట్టించి యీ నూతిలో బడవేయించెను.

సంవత్సరమునకు నిఁక నెనిమిది దినములు కొఱఁతగా నున్నవి తరువాతఁ బైటికి వత్తుము. డాకినేయా ? నీవు మాకొక యుపకారము సేయుదువేని నిన్నీ కూపము నుండి పై కెక్కింతుము. క్షుద్బాధ మాకెక్కువగా నున్నది. ఈ యెనిమిదిదినములు నిత్యము సరిపడిన యాహారముదెచ్చి మాకర్పించుచుండవలయును. ఇది మాకోరిక. యేమందువు ? ఇప్పు డొప్పుకొని పిమ్మట మఱియొకరీతిఁ గావింతువేని పైకివచ్చినతరువాత ముందుగనే నీపని పట్టెదము సుమీ. బ్రహ్మరాక్షస ప్రభావం బెఱుంగుదువా ? అని పలికిన విని యా జూదరి వారిమాటల కనుమోదించెను.

బ్రహ్మరాక్షసులు మెల్లఁగా వాని నూతిపై కెక్కించి విడిచివేసిరి. ఆ జూదరి కొంతమాంసము సంపాదించి నాటిరాత్రి శ్మశానవాటికలోఁ దిరుగుచు మాంసమో యయ్య మాంసము, కావలసిన భూతభేతాళములు వేగముగా రండు, కడు మంచి మాంసమని కేకలు పెట్టెను. ఆ ధ్వని విని నేను మెల్లఁగా వాని దాపునకుఁ బోయి యా మాంసమేమి వెలకిత్తువని యడిగితిని. వాఁడు నన్నుఁ బరీక్షించి చూచి మీ రూపబల ప్రభావముల నా కొకసారి యెఱువిత్తురేని యీ మాంసము మీ కిత్తునని చెప్పితిని.

నా రూప ప్రభావములతో నీకేమి ప్రయోజనము. వానిం బుచ్చుకొనియేమి చేయుదువు ? తిరుగా నెన్నిదినముల కిత్తువని యడిగితిని. అతండు తన కథ యంతయుం జెప్పి నన్ను వంచించిన జూదరులం బట్టికొని బలవంతముగ నా నూతిలోఁబడవేసి యా బ్రహ్మరాక్షసుల కాహారము గావించెద నెనిమిదవనాఁడు మీ రూప ప్రభావములు మీ కిచ్చి వేసెదనని చెప్పి నన్ను నమ్మించెను.

నే నప్పుడు నా రూప ప్రభావములు వానికిచ్చి యా మాంసము పుచ్చుకొంటిని. వాఁడు మిగుల సంతసించుచు నప్పు డాగ్రామము లోనికిఁ బోయి తన్ను మున్ను వంచించిన జూదరుల నేడ్వురం బట్టికొని కట్టిపెట్టి దినమున కొక్కొక్కని వంతున నా నూతిలోఁ బడవేసి యా భూతముల కాహారము సమర్పించెను.

ఎనిమిదవనాఁ డందు బడవేయుట కేమియు నాహార వస్తువానికి దొరకనది కాదు. వాడు విచారించుచు మఱల నా శ్మశాన భూమి కరుదెంచెను నేను వానింజూచి ఢాకినియా ? నీ పని తీనదియా ? నా స్వరూప ప్రభావములు నాకిఁక నిత్తువా ? అని యడిగితిని. వాఁడు దీనవదనుండై మహాత్మా ! నీ యనుగ్రహమున నేఁడుదివసములు గడిపితిని. నేఁ డేమియుఁ గనంబడకున్నది. నేఁ డేమియు లేకున్న రేపు వాండ్రుపైకి వచ్చి ముందుగా నా పని పట్టుదురు. ఏమి చేయుటకుం దోచకున్నది. అని విచారింపు చుండ నేమేయీ? | ఆ నూయి యెంతదూర మున్నది ? నాకుఁ జూపెదవా ? ఆబ్రహ్మ రాక్షసులం జూచెద ననవుఁడు రమ్ము రమ్ము. దాపుగనే యున్నదని పలుకుచు నన్నా కూపసమీపమునకుఁ దీసికొనిపోయెను.

బహుతృణకంటక లతావృతమై భూసమకుడ్యమై యంధకార బంధురంబై యగాథమై సర్పభేకకచ్ఛపాజగర భయంకరమై యొప్పు నప్పాడు నూతికడకుఁ బోయి లోపలకు వంగి తొంగి చూచుచుంటిని.

అప్పు డాకృతఘ్నుఁడు నారెండు కాళ్ళుపట్టుకొని యెత్తి గుభాలున నన్నా కూపములోఁ బడవేసెను. అందున్న బ్రహ్మరాక్షసులు నన్ను భక్ష్యమనుకొని పట్టికొని నా యొడల ముక్కలుగా నిరువఁబోయిరి.

నేను వారికి లొంగక కరపద ప్రహారంబులఁ బీడ గలుగఁ జేసితిని. అందు నాకును వారికినిఁ బెద్ద ముష్టియుద్ధము జరిగినది. అందు నాకే జయము గలిగినది. మదీయ పరాక్రమమునకు లొంగి వాండ్రు బాబూ ? నీ వెవ్వడవు? ఆ డాకినేయుఁడు మా పని పట్టుటకు నిన్నిందుఁ బడవేసెనా యేమి ? నీవు మనుష్యుఁడవు కావు. నీ పరాక్రమము స్తోత్రపాత్రయై యున్నది. నీతో మైత్రిం జేయఁ దలంచితిమి. నీ వృత్తాంతము జెప్పుమని యడిగిన నేనిట్లంటిని.

బ్రహ్మరాక్షసులారా! నేను మీ కథ నెరుంగుదును. నే నగ్నిశిఖుం డను భేతాళుండ. డాకినేయుఁడు మీ నిమిత్తమై నా బలప్రభావము లెరవు దీసికొనిపోయి మీ కేడుదినము లాహారము నర్పించెను. నేఁడేమియు నాహార పదార్ధము దొరకలేదని పరితపించుచు నన్నీ నూతి యొద్దకుఁ దీసికొని వచ్చి తొంగి చూచుచుండ గాళ్లెత్తి నన్నిందులోఁ బడవేసెఁ గృతఘ్నుఁ డెట్టిపనిజేసెనో చూచితిరా? బలవంతుఁడఁగావున సరిపోయినది. లేకున్న మీకాహారము కావలసినదేనా? అని నా వృత్తాంతమంతయుం జెప్పితిని.

బ్రహ్మరాక్షసులు అమ్మ డాకినియా? యెంత పని జేసితివిరా? అనివెఱఁ గందుచు నౌను జూదరులకుఁ గల యూహపోహ లెవ్వరికిం గలుగవు. కితవుల నెన్నఁడును నమ్మఁగూడదు. టింటాకరాళుండను జూదరి యింతకన్నను టక్కిరి. వానిచరిత్ర వినిన నీవు మఱియు వెఱఁగందఁ గలవు వినుమని యక్కథ నిట్లుచెప్పఁ దొడంగిరి

టింటాకరాళుని కథ

తొలి టింటాకరాళుం డను జూదరి యీ యుజ్జయినీపురంబున వసించెను. ద్యూతక్రీడలలో నా కాలమున వాని నోడించినవాఁడు పుడమిలో లేకపోయెను. అభినవశకుని యని వానికి బిరుద మొసంగిరి. ఒకనాఁ డీవీటి జూదరు లందఱు గుమిగూడి జూదములో వాఁడెవ్వరి పక్షము జేరక తటస్థుఁడుగా నుండుటకును నిత్యము వానికి నా యూరనున్న కితవులు నూరుపర్దిక లిచ్చుకొనునటుల నియమము జేసి వాని నొప్పించి యట్లర్పించుచుండిరి. వాఁడు ప్రాయమునఁ బిన్నవాఁడు రూపమునఁ జెప్పదగినవాఁడు యుక్తిప్రయుక్తులలో మిగుల నేర్పరి అట్టివాఁడైనను వాఁడు జూదరి యగుట నెవ్వరుఁ బిల్ల నిచ్చిరికారు. భార్యాపుత్రబంధు శూన్యుండగు టింటాకరాళుండు నిత్యము తనకు జూదరు లిచ్చు నూఱుగవ్వలు పెట్టి గోధుమచూర్ణము కొని తడిపి ముద్దగాఁ జేసి మర్దించి యప్పములుగా జేసి సాయంకాలమున శ్మశానమునకు నడచు చితాం గారముల నా యప్పముల గాచి రాత్రి మహాకాలునియాలయమునకు వచ్చి దీపము చమురులో ముంచి యాయపూపముల భక్షించి యాకలి యడంచుకొనుచుండును. మఱియు నక్కోవెల ముఖమండపము నందె పండుకొని నిద్రఁబోవును.

ఇట్లు కొంతకాలము జరిగినది. ఒకనాఁడు రాత్రి యాదేవళములోఁ బండికొని వాఁడిట్లు ధ్యానించెను. అయ్యో? నాకు జూదములో నెంత నైపుణ్యమున్న నేమి? నా కర్మము నాతో నెవ్వరు జూదమాడరు. దాపునకైన రానీయరు. నూరు గవ్వలు నా మొగానఁ బారవేయుదురు. దాన వచ్చు పిండివలన నాకుఁ గడుపు నిండదు. ఏమి జేయుదును. నా కెన్నేని యూహలు గలవు. నా కడుపుననే జీర్ణమగుచున్నవి. కానిమ్ము ఈ యాలయకుడ్య భాగముల దేవతాస్త్రీవిగ్రహములు సుందరముగా నమరింపఁబడియున్నవి. ఈ మాతృదేవతల జూదమునకు బిలిచి యాడి యోడించెద. వీ రెక్కడనైన నోడిన విత్తము దెచ్చి యియ్యగలరు నేనే యోడితినా నా యొద్ద వీ రేమి దీసికొనఁగలరు. కావలసిన నా కిచ్చు నూఱుగవ్వలు మీఁదఁ బారవైచెదనని యాలోచించి యా జూదరి వారి కిట్లనియె.

ఓ మాతృగణములారా? మిమ్ము నేఁడు నాతో జూదమాడఁబిలుచుచున్నాఁడను. ఓడినవారు గెలిచినవారికి నూరు బంగారుమాడ లిచ్చుకొనవలయును. ఇదియే ఫణము. సమ్మతించితిరా. ఇద్దరియాట నేనే యాడెదను. చూడుఁ డిదిగొ పాచికలు వేయుచున్నాను. ఇది నా యాట. ఇది మీ యాట. నా యాట గెలచినది. చూడుఁడు మీ రోడిపోయితిరి. నా కీయవలసినమాడ లీయుఁడు. అమ్మలారా! తీసుకొని రండు. ఈయకున్న నేను విడుచువాఁడనుకాను. జూదరులకు దయా దాక్షిణ్యము లుండవు. అని పెద్దకడవు విగ్రహముల కడకుఁబోయి యడిగెను.

రాతి విగ్రహములు మాటాడునా? ఎంత సేపఱచినను బ్రతివచనము వినంబడలేదు. అప్పుడు వాఁడు లేచి కోపముతో మాతృగణములారా? మీరు నా ప్రజ్ఞ యెఱుంగరు మౌనము వహించియున్న విడుతునని తలంచుచుండిరికాఁబోలు సొమ్ము తీసికొనువఱకు వదలను. ఇదిగో మీరిఁక మాటాడకున్న రంపములతో మీ యవయవంబులం గోసి పారవేసెద. హాయిగా నిందుండి సుఖింపుచున్నారు. ఆ సుఖమేల పాడుచేసికొందురు అని పలుకుచు రంపము దెచ్చుటకు వెళ్ళఁబోవు నంతలో ఆ! నిలు. నిలు. గడియతాళుము. నీ సొమ్మిచ్చి వేయుదుము అని యాకాశవచనముగాఁ బలికి యెక్కడికో పోయి వాని కీయవలసిన బంగారము దెచ్చి యిచ్చివేసిరి.

ఆ సొమ్మందుకొని వాఁడు తాను వైచిన పాచిక పడినదిగదా యని సంతసించుచు మఱునాఁడుగూడ వారిం జూదమునకుఁ బిలిచి యాడి యోడించి సొమ్మిమ్మని నిర్భంధించుటయు నా దేవత లేమియుం జేయలేక యెక్కడికో పోయి బంగారము దెచ్చి యిచ్చుచుండిరి. ఇట్లు ప్రతిదినము వాఁడు జూదమాడి యోడించుచు మాతృగణమువలనఁ జాల బంగారము సంపాదించెను.

ఇట్లు కొన్నిదినములు జరిగినంత నొకనాఁడు చాముండ యను శక్తి యా మాతృగణమును బరామర్శింప నచ్చటికి వచ్చినది. అందున్న మాతృశక్తులన్నియు విచారముతో నుండుటం జూచి అక్కలారా? మీరిట్లు దుఃఖభాజనులై యుంటిరేల? మహాకాళినాథుని యాలయములో వసించియుఁ జింతించుటకు హేతువేమి వచ్చినది? అని యడిగిన నా దేవత లిట్లనిరి.

అక్కా! మా యిక్కట్టు నీతో నేమని వక్కాణింతుము. ఒక్క జూదరి మా పని పట్టుచున్నాఁడు. పిలువని బేరంటకముగా మీతో జూదమాడితి. మీ రోడితిరని చెప్పి యోడిన మాడల నిమ్మని నిర్బంధించుచున్నాఁడు అలకాపురంబున మా కొక పరిచితురా లున్నది. నిత్యము నామె యొద్దకుఁ బోయి వేడికొని వీని కీయవలసిన బంగారము దెచ్చి యిచ్చుచుంటిమి. ఎంత పరిచయమున్నను నిత్య మడుగుటకు మొగమాటముగాదా? వీఁడు నిత్యము మ మ్మదేపనిగా వేపుచున్నాఁడు. ఈ యాపదఁ దప్పునట్లు కాన్పించదు. ఇందుండి లేచిపోవుదుమా అని యాలోచించుచున్నాము. కాని చిరకాల వాససుఖంబు విడువ నంగీకరింపకున్నది. సొమ్మియ్యకున్న వీఁడు మొండిగరాసు. ఎట్టిపనియైనం జేయఁగలఁడు. ఈ చిక్కులోఁబడి నిద్రాహారములు లేక విచారించుచున్నా మని మాతృదేవత లెఱింగించిరి. ఆ చాముండ నవ్వుచు నో హో! ఇదియా మీ వంత? యుక్తిఁ దెలిసిన యా వంతయు మీకుఁ జింత యుండకపోవుంగదా? జూదరుల పరిపాటి మీరెఱుంగరు కావున నిట్లడలుచున్నారు వినుండు. నేఁటిరాత్రి వాఁడు మిమ్ము జూదమాడఁ బిలిచినప్పుడు మేమాడఁజాలమని ప్రతివచన మీయుఁడు. అప్పుడు మీ జోలికి రాఁడు. వాఁడు నిత్యము పిలుచుండ మీ రూరకొనుటం జేసి యదియే యంగీకారమని తలంచి మీ పని పట్టుచున్నాఁడు. ఆటకు రా మనిన మిమ్మేమియుం జేయఁజాలడని యుపాయముఁ జెప్పి యా శక్తి యరిగినది.

మాతృగణము ఆనాఁడు మిగుల సంతసించుచు రాత్రి వాఁడు జూదమునకుఁ బిలిచినంత -

గీ. ఓయి టింటాకరాళ ? వోవోయి నేఁడు
   జూద మాఁడగ రాము నీ మీద మేము
   జాల యోడితి మింక మా జోలిరాకు
   మొరులతో నాడుమని పల్కి రూహదెలిసి.

ఆ మాటలు విని వాఁ డేమియు మాటాడక అయ్యో? వీరీ యాట పరిపాటి యెట్లో తెలిసికొనిరి నిత్యము బంగార మబ్బుచున్నదని యుబ్బుచుంటి నేఁ డేమి జేయుదునని యాలోచించుచు నాయావరణములో వేఱొక్క దెసనున్న భైరవాలయము కడకుఁబోయి -

గీ. కాలభైరవ ! నీకక్ష కేలియందుఁ
   బ్రీతియుండకపోవ దీ రేయి నీవు
   జూదమాడుము నాతోడఁ జూతునీదు
   పటిమ దీనికిఁ దగినట్టి పణము పెట్టి.

అని యాటకుం జీరిన భైరవుండు మాతృగణములు నిత్యము పడియెడు నిడుము లెఱింగియున్న వాఁడగుట మౌనము వహింపక వెంటనే యిట్లుత్తర మిచ్చెను.

గీ. ఓయి! టింటాకరాళ! పోవోయి నేఁడు
   జూదమాడఁగరాను నీమీఁద నేను
   జాలనోడితి నింక నా జోలిరాకు
   మొరులతో నాడుకొనుమని యుక్తిఁబలికె.

ఆ పలుకులు విని వాఁ కులుకుచు ఓహో ? వీ రెట్లో ద్యూతక్రీడామర్మములు గ్రహించిరి. ఏమి చేయుదునని యాలోచించుచు నందున్న దేవతావిగ్రహముల నెల్ల జూదమునకుఁ బిలుచుచుండ నవి యంత్రములవలె వెంటనే టింటాకరాళా! మేము మీతోఁ జూదమాడఁ జాలము. ఓడితిమని ప్రత్యుత్తర మిచ్చుచుండునవి. దానం జేసి వాఁడు వారి నేమియుం జేయలేకపోయెను.

మఱియొకనాఁడు రాత్రి వా డేమియుం దోచక విచారించుచుఁ గోవెల కవాట వివరములనుండి మహాకాళనాథుని దర్శనము జేసి -

క. కాళీ ప్రాణేశ! మహా
   కాళా! నీనేర్పు జాతుఁగద నాతో నీ
   వేశ నిఁట జూద మాడఁగ
   రా? లే లెమ్ముడుమీ ? వరాలెన్నైనన్ .

అని పిలుచుటయు -

సీ. టింటాకరాళ నీవంటి జూదరివాఁడు
               మూఁడులోకంబుల లేఁడు చూడ
    నీతోడ నాడంగ నేర్పు నాకును లేదు
               నే నోడిపోయితి నీకు నేఁడు
    పలుమారు నీవిట్లు పిలువనోడితిమన్న
               జనులచే మాకుఁ బూజ్యత నశించు
    బ్రతిమాలికొంటి నీపై వేలుపుల జోలి
               కిని రాకు నీకుఁజాలిన కితపుని
గీ. తోడనాడుమటంచు మృత్యుంజయుండు
    బలికె నసమర్థులట్ల వేల్పులును పాప
    భయవిసర్జితులైన దుష్పధుల కెపుడు
    వెఱచుచుందు రుపేక్షభావించి మదుల.

టింటాకరుళుం డట్లు దేవతలచే వంచింపబడి యాత్మగతంబున నిట్లు తలంచె నాహా? కందమూలాదుల భక్షింపుచు దారుణారణ్యమధ్యంబులఁ దపంబుజేయు మహర్షులతో నైన సంభాషించుకొని యీ దేవతలు దురోదరవ్యాపారరతుండనగు నాకు వెఱచి నీతో జూదమాడలేమని పలికిరి. ఇంతకన్న వింత యేమున్నది? భక్తకల్పద్రుమంజగు మహాకాళనాథుండు నీతో నాడలేను నాజోలికిరాకు. అని నన్నుఁ బ్రతిమాలికొనుట మత్పురాకృతసుకృతముగాక వేఱొకటి కలదా ? అమ్మహాత్మునే శరణంబు నొందెద నెట్లు రక్షింపఁడో చూచెదంగాక యని తలంచి స్వామికి సాష్టాంగనమస్కారములు గావించుచు నిట్లు వినుతించెను.

గీ. మేదినీధరకన్యతో జూదమాడి
    యుడపవృషభేభ చర్మము లోడిపోయి
    జానువిన్యస్త గండుండవైన నీదు
    విమల నగ్నాంగకంబాత్మ వినుతిఁజేతు.

సీ. ఎవని యిచ్ఛామాత్ర నింద్రాదిదేవతల్
             శాశ్వతైశ్వర్య విస్పారులైరి
    యెవఁడు నిరీహుండై భువనరక్షకుఁదాల్చుఁ
             గరళకపాలాదికములనెల్ల
    నెవ్వాఁడు కినుకఁ గన్నెఱ్ఱఁజేసినయంత
            సకలలోకములు భస్మంబులగును
    ఏ వానికరుణ రాజీవసంభవహతి
            ప్రముఖామరాశికి ప్రాసరంబు
గీ. అట్టి నీవల్ప హేతువు బట్టి యిట్టు
   లోడఁదగునయ్య కడులోభివై మహాత్మ!
   యాశ్రితామరవృక్షంబ వండ్రునిన్ను
   నట్టి వాడుకయేలఁ బోఁగొట్టుకొందు.

ఉ. బాలశశాంకశేఖర! కపాలమున న్భుజియింతు నీవు మైఁ
    జాల విభూతిఁ బూయుడు స్మశానమున న్వసియింతు వేను నే
    వేళ విభూతిఁ బూసికొని వేడఁగపాలమున న్భుజింతునా
    భీల తరస్మశానమున వృత్తిసమానమె నీకు నాకజా !

అని స్తుతియించుటయు భక్తజన వత్సలుండగు మృత్యుంజయుండు వానియం దనుగ్రహము జనింప నోరీ నీవీ కోవెల నాశ్రయుంచుకొని యుండుము. శుభంబులు జేకూరునని వచనముగాఁ బలికెను.

అప్పలుకులు విని కులుకుచు వాఁ డాగుడి విడువక తిరుగుచుండ నొకనాఁడు రాత్రి మహాకాళీ తీర్థంబునఁ గొందరు దేవకన్యకలువచ్చి జలక్రీడ లాడుచుండిరి. ఆ రహస్య మెఱిఁగి టింటాకరాళుం డలంబున కూఁతురు కళావతియను నచ్చర గట్టునం బెట్టిన పుట్టం బెత్తికొనిపోయి దాచెను.

దానంజేసి యా మచ్చెకంటి వానికి భార్యగ నుండక తప్పినది కాదు. ఆ కళావతి పగలెల్ల నాకమున నింద్రునకుఁ బరిచర్యలు సేయుచు రాత్రులువచ్చి యీ జూదరిని మదనక్రీడలచే ముఱియఁజేయుచుండునది. నాఁడు వేఁడుకొన నా చేడియ యొకనాఁడు వాని నాకసమునకుఁ దీసికొనిపోయి యందలి వింతలం జూపించి వెండియుం దీసికొని వచ్చినది.

ఆ వార్త యింద్రుండెఱింగి యక్కురంగనయనను గజపురంబున నున్న దేవళములోని శిలాస్థంభంబున సాలభంజికగా నుండుమని శపించుచు నాయాలయము నేలమట్టమైనప్పుడు శాపాంతమగునని యానతిచ్చెను.

ఈ రహస్య మాయజ్ఞాస్మ వానిచెవిం బడవైచి శాపం బనుభవింపఁ బోయినది. ఆతాపసియు దద్వియోగంబునకుఁ బరితపించుచుఁ దాపసవేషంబు ధరించి నాగపురంబున కరిగి తన బుద్ధిబలంబున నన్నగరాధీశ్వరునిఁ దనకు శిష్యునిగాఁ జేసికొని యా దేవాలయమును నేలమట్టము గావింపఁజేసెను. వెంటనే కళావతి పూర్వరూపము వహించి వానిం జేరినది. టింటాకరాళుండును బుడమిఁ బెద్దకాల మా ముద్దుగుమ్మతో సుఖించెను.

అగ్నిశిఖా? టింటాకరాళుం డెటువంటి యుక్తిలంపటుండో వింటివా ? ఢాకినేయుఁడు నిన్నీనూతఁ ద్రోయుట యేమిచిత్రము. అని బ్రహ్మరాక్షసులు నాతో ముచ్చటించిరి. కానిండు. నేటిఁతో నయ్యెనా ? నేను రేపు బోయి వానిపని పట్ట కుందునా? అని పలుకుచు మరునాఁ డానూయి బయలువెడలి నే నీ యూరంతయు వెదకి యొకపొలిమేరలో వానిం బట్టుకొని నాబలప్రభావములు లాగెకొని వానిం గడ తేర్చుటకుఁ బ్రయత్నించుచుండ నీ మహారాజు దైవికముగా గుఱ్ఱమెక్కి యా దారిం బోవుచుండెను.

వాఁ డాభూపతిం జూచి మొఱ్ఱోయని యరచుచు మహాప్రభూ! నన్నీ భేతాళుఁడు జంపుచున్నాఁడు. రక్షింపుమని ప్రార్థించెను. ఎవఁడవురా నీవని యాఱేఁ డొక్క కేక పెట్టినంత నేను వానిని విడిచి కాలికొలఁది. పారఁదొడగితిని. అప్పుడు తన గుఱ్ఱమును నా వెంటఁ బరుగెత్తించి యరనిమిషములో నామడములుద్రొక్కి కరవాలాగ్రంబు నా శిరంబున గ్రుచ్చినిలఁబెట్టి తర్జించుటయు నేను గదలలేక యమ్మహారాజు పాదంబుల బట్టకొని దేవా? ఇది మొదలు నీకు నేను దాసుండనై నీవు తలంచినప్పుడు వచ్చి నీవు చెప్పిన పనులఁ గావింపుచుండెద నన్ను విడువుమని ప్రార్థించితిని.

ఆ దయాళుండు కానిమ్ము . నీ విటుపైన మనుష్యుల జోలికి రాఁగూడదు. వచ్చితివేని నన్నెఱుంగుదువా ? జాగ్రత్త. పొమ్మని వదలివేసెను. యమశిఖా? విక్రమార్కుండన నెవ్వఁడో యిప్పుడైన దెలిసినదా? మన చక్రవర్తియగు మహాభేతాళుం డతనికి దాసుండని యెఱుంగుదువా? నా యాహారమును విడిచి పొమ్ము. అమ్మనుజపతి యెఱింగిన నీపీచ మడంచునని పలికిన పండ్లికిలించుచు యమశిఖుం డిట్లనియె.

అగ్నిశిఖా? మనమిద్దరము నొక్క బడిలోనే చదివికొంటిమి. నీబిభీషికలకు నేను వెఱచువాఁడనా పో. పొమ్ము. నావశమైన యీ భక్ష్యము నీకీయనని గద్దించి పలికెను. అప్పుడా శవమునకై యా భేతాళు లిద్దరు మఱల గ్రుద్దులాడఁ దొడంగిరి.

అప్పుడు విక్రమార్కుఁ డవ్విధ మెఱింగి తన చేతనున్న కత్తికొనచే నేల నా యమశిఖుని విగ్రహము గీసి తదవయవములు ఖండించెను. యమశీఖుఁ డా శవమును విడిచి కాలుచేతులు దెగి నేలంబడి యేడ్చుచుండ నగ్నిశిఖుండు వాని సందిటం బట్టికొని యెత్తి దూరముగా బారవైచి యా ఖండపాలికుని శవమును భక్షించి తదామంత్రణంబు వడసి యదృశ్యుండై పోయెను.

రాజపుత్రీ! ఆ చిత్ర మంతయు నేను గన్నులారఁ జూచితిని. చెవులార . వింటిని. పరమానందముతో నే నమ్మహానుభావుని పాదంబులంబడి మహారాజా ! నీవు బ్రహ్మాదులచేఁ జేయశక్యముగాని యుపకారము నాకుఁ గావించితివి. ఇందులకుఁ గృతార్థురాలనైనా యావజ్జీవము మీ నామము స్మరించుకొనుచు మీ భక్తులమైయుండుట తప్ప ప్రతిక్రియ యేమియుం జేయఁజాలనని పెద్దతడవు వేడికొంటిని.

అమ్మహాత్ముఁడు మందహాస సుందరవదనారవిందుడై సుందరీ? మీరు వేల్పులు. మేము మనుష్యులము. మీరు సంతసించుట మాకు మహా ప్రసాదముగాదా? ఇంతకన్నఁ బ్రతికియు యేమి యున్నది? నీ పలుకుల కానందించితి. పదిలముగా నింటికిఁ జనుమని యానతిచ్చుటయు నేను పలుమా రాపురుషసింహుని పాదములకు మ్రొక్కి మ్రొక్కి యొక్క భర్తం గలసికొని యత్యంత సంతోషముతో నింటికిం బోయి పునర్జన్మ మెత్తినట్లుగా జుట్టాలం గలసికొని యానందించితిని. మలయవతీ వినుము -

క. చేసిన యుపకారము మది
   భాసిల్లఁగ నోపినంత ప్రత్యుపకారం
   బాస క్తిఁ జేయకుండిన
   సీ. సీ. యాజీవిదొక్క జీవమె చెపుమా ?

అని తలంచి భూమండలసామ్రాజ్య బంతయు నొక్క గవ్వఁగానైన గణింపక యర్థిసాత్కృతము గావించెడు నావితరణశాలికి నే నేమిచ్చి సంతోషపరచగలను. చతుస్సముద్రముద్రితమైన భూచక్రబంతయు బరిభ్రమించి యా తేజోమూర్తికి సరిపడిన లావణ్యవతి నేరితెచ్చి పాణిగ్రహణవిధి నెఱవేర్పించెదనని యుడుత భక్తిగాఁ దలంచి బయలుదేరి యేబదియారు దేశంబులుం దిరిగితిని. ఎందున దగిన యిల్లాలు గనంబడదయ్యె. ద్వీపాంతరధరాకాంత సంతానముల నరయు తలంపుతో నీ దెస కరుదెంచితి నిదియే నావృత్తాంతమని మదనమంజరి మలయవతికిఁ దనవృత్తాంత మంతయు నెఱింగించినది.

అని చెప్పువఱకు వేళ యతిక్రమించినది. పై కథ తరువాత నివాస దేశంబునం జెప్పఁబూనెను.

201 వ మజిలీ.

మలయవతి కథ

అట్లు మదనమంజరి తం యాగమనకారణరూపముగా విక్రమార్కుని యుదంత మక్కాంతామణి కెఱింగించి యంతలో పార్వతీపూజాసమయ మగుటయు దత్సఖీనివేదితమగు గదియందు వసించి దేవతార్చన గావింపుచుండెను.

అప్పుడు మలయవతి తలోదరితో సఖీ ! యిప్పుడీమె జెప్పినయుపన్యాసము వింటివిగద. ఆ విక్రమార్కుఁడే నీకు దగిన వరుండని సూచించినది. అతని చరి