కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/198వ మజిలీ

వికీసోర్స్ నుండి

ద్రిజాలాగ్రమగు నుక్కుకంబమొకటి గన్పట్టుచున్నది. ఆ ప్రదేశమున నింక ననేకవిచిత్రము లున్నవని చెప్పుదురు. నన్నాదెసకు బోనిచ్చిరికారు. అని శ్రీధరుఁ డాకాళికాలయములో నున్న వింతలన్నియు నెఱింగించెను.

విక్రమార్కుండు విని యోహా! యిన్ని విశేషములు మన యూరనుండ నెన్నడుం జెప్పితిరి కారే? కానిండు నేఁడందుబోయి చూతము రండు. లెండు లెండని పలికిన విని భట్టి యిట్లనియె. మీ తండ్రిగా రేకారణము చేతనో మనల నందు రానీయవలదని యాజ్ఞాపించినారఁట. ఱేని యానతి లేనిదే మనమెంత వారమైనఁగావలి వారందుఁ బోనిత్తురా? కావున ఱేపు ప్రొద్దున్న నర్చకుల నాశ్రయించి వారివెంట లోనికిఁ బోవుదము గాక. ఇప్పుడు పోవలదని యుపాయము జెప్పిన నామాట కందఱు సమ్మతించిరి. అర్చకుల నే నెఱుంగుదు. మా యింటి ప్రక్కనే వారి లోగిలి. ఈ రాత్రియే మాటాడి యుదయంబున లోపలికిఁ దీసికొని పొమ్మని యడిగెద ననుటయు విక్రమార్కుండు తన వ్రేలియుంగర మొకటిఁ దీసి యిది యా యర్చకునికిఁ గానుక యిచ్చి యభీష్టము దెలుపుము. అంతయు నతండే చేయఁగలఁడని చెప్పి యా యంగుళీయక మతని కర్పించెను అందఱు లేచి నిష్క్రమించిరి.

అని చెప్పి యచ్చటికిఁ గాలతీతమగుట మణిసిద్ధుండు అవ్వలి కథ పైమజిలీయందుఁ జెప్పఁ దొడంగెను.

198 వ మజిలీ

ఉట్టికోసినకథ

విక్రమాదిత్యుని సౌందర్యము త్రిభువనాశ్చర్యకరమైయున్నది. కంతు వసంత జయంతాదు లతనితోఁ బోల్చఁదగరు. అతని సుగుణంబులు వర్ణింప సహస్రముఖునికైనఁ బెద్దకాలము పట్టును. పండ్రెండేఁడుల వయసునాఁటికే సకలవిద్యలు గ్రహించెను. చెక్కుటద్దముల వంటి బుగ్గలు గిల్లిన పాలు గారుచుండెను. మీసము లైన రాలేదు. కొరమ తుమ్మెదలం దెగడు నిగ నిగని కురు లరుదుగ వెనుక జీరాడ మొలగుపై కెగసివచ్చిన చంద్రబింబంబు డంబున నతని మొగంబు మెరయుచుండెను. నవ్విన రదనద్యుతు లెల్లెడ వ్యాపింప ముద్దులు మూఁటగట్టుచుండును. పలికినఁ దేనె లొలుకు చుండును. ఆకర్ణాంతవిశాలములగు నేత్రములు విప్పి చూచినఁ గరుణారసము దొప్పఁదోగుచుండును. అతండు వీరపురుషవేషముతో నశ్వారూఢుండై రాజమార్గంబున నఱుగుచుండ నిత్యము క్రొత్తవానివలె మత్తకాశినులు చిత్తజాయత్తచిత్తులై వింతగాఁ జూచుచుందురు.

ఎప్పుడు తెల్లవారు నెప్పు డాకాళికాలయము జూతునని తలంచుచు విక్రమార్కుడు నిద్రగన్నుల నారాత్రి నిద్రయేపోలేదు. తెల్లవారినతోడనే యతండు నిత్యకృత్యములం దీర్చుకొని వాడుకప్రకారము స్నానముఁ జేసి జపముఁ జేసికొనుచున్న సమయంబున మువ్వురు మిత్రులు నతని యొద్దకుఁ వచ్చిరి. శ్రీధరా! రాత్రి యర్చకునితోమాట్లాడితివా? ఏమనియెనని యడిగిన నతండు రాజపుత్ ! అర్చకుఁడు మొదట నేమో చెప్పఁబోయెంగాని నీ యుంగర మందిన వెనుక మోము వికసింప మనరాక కంగీకరించి యుదయభోగసమయమునకే రమ్మని చెప్పెను.

వేళయైనది పోవుదము లెండని పలికిన విని సంతసించుచు రాజపుత్రుండు లోపలఁ బట్టుపుట్టంబులం గట్టికొని పైనంగీలు దొడగి యుపహారములఁదెమ్మని నియోగించి పూజారి యెఱింగించినతఱి నమ్మవాఱి యుత్తరగోపురము దరికిఁ బోయి నిలువంబడియెను. వారి రాకకై యెదురుచూచుచున్న యర్చకుడు రాజపుత్రు నమస్కారము లందికొని చేయి పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు ద్వారపాలునితో నీ బాలుని దేవతాదర్శనమునకై తీసికొని పోవుచున్న వాఁడ నితండు భర్తృదారకుం డెఱుఁగుదువా? అని పలికిన విని వాఁడు లేచి నమస్కరింపుచు స్వామీ! రాజశాసనము మీరు వినలేదా? సెలవు లేనిదే రాజపుత్రాదుల నీ యాలయములోనికిఁ బోనీయవలదని ప్రభు డాజ్ఞా పత్రిక పంపియున్నాఁడు. పోనిచ్చిన మాకు మాటరాదా? అనుటయు నర్చకుండు సరిసరి మాటలకు నేమిటికి? వెంటబెట్టుకొని తీసికొనిపోయి యమ్మవారి దర్శనముఁ జేయించి యిప్పుడే తీసికొని వచ్చెద నింతలో నేమి యుపద్రవ మున్నది. ఇఁక కొలది కాలములో నీతండే మనకు ప్రభువు. ముందు వెనుక విచారించి యదలించిన వాఁడు జడియుచు స్వామీ! యొరులకుం దెలియకుండ వేగము తీసికొని రావలయుం జుఁడీ యని పలుకుచు సలాము జేసి వారిని లోపలికిం బోనిచ్చెను.

అప్పు డాయర్చకుండు వారివెంటఁ బెట్టుకొని తీసికొనిపోయి లోపలి విశేషములన్నియుం జూపుచు వేఱువేఱ నాయాదేవతావిశేషముల తెఱగెఱిగింపుచు గోపురప్రాకారమంటపాదుల గట్టింటినవారి పేరులు శిలాశాసనంబుల జదివి వినిపించుచుఁ బ్రదక్షిణపూర్వకముగా గర్భాలయంబునకుఁ దీసికొనిపోయి కర్పూరము వెల్గించి దేవీవిగ్రహవిశేషంబులన్నియుఁ జూపుటయు నా నృపనందనుం డమందానంద తుందిల హృదయారవిందుఁడై సాష్టాంగనమస్కారము గావింపుచుఁ జేతులు జోడించి నిలువఁబడి యమ్మహాదేవి నిట్లు వినుతించెను.

 
శ్లో॥ జయమహిషాసుర మారిణి దారిణి రురుదానవస్య శూలకరే
     జయ విభుభోత్సవ కారిణి ధారిణి భువనత్త్రయస్య మాతృవతే
     జయజగదభినుతచరణే శరణే నిశ్రేయసస్య భక్తానాం
    జయథృత భాస్కర కిరణే హరణే దురితాంధ కారబృందానాం॥

క. దేవీ! నీపదయుగరా
   జీవంబుల భక్తివెలయ సేవింతు సదా
   భావంబున నీభక్తునం
   గావుము నన్నె పుడు భద్రకాళీ! కాళీ

అని స్తుతియింపుచుఁ బ్రసాద మందుకొని దుర్గగుడి నిర్గమించి యందొకమూల రుధిరమేదోమాంసకర్దమ దుర్గంధబంధురమై యున్న విశాలవధ్యశిలాఫలకముం గాంచి రాజుకుమారుం డేవగించుకొనుచు నిదియేమని యడిగిన నర్చకుండు రాజపుత్రా! జనులిందుఁ దాము మ్రొక్కిన మ్రొక్కులు మహిష కుక్కుట మేష ప్రముఖ జంతుసంతతులఁ దెచ్చి యమ్మవారికి బలి యిచ్చుచుందు రిది వధ్యశిలయని యెఱింగించి నంత స్వాంతమున వేకిజనింప నిట్లనియె.

అక్కటా! అమ్మవారు నోరులేని జంతువుల బలవంతమునఁ దెచ్చి జంపినంగాని కామ్యము లీయదా? అయ్యయ్యా! సరలనిరాచర ప్రపంచక రక్షకురాలగు కాత్యాయనియే, పెద్దపులివలె మాంసాశన మపేక్షించినచో రక్షించువా రెవ్వరు? ప్రభావప్రకటనమున కిదియా నిదర్శనము. తానపర్ణయై తపంబు గావించి యీశ్వరు నర్ధదేహ మెక్కిన దుర్గ యిట్టి తుచ్ఛపుకోరికల గోరుట విపరీతము కాదా? అని యాక్షేపించిన విని యర్చకుం డిట్లనియె.

రాజపుత్రా! అట్ల నవలదు. ఈ భక్తి ప్రభావ మత్యద్భుతము. ఎంతెంతయో దూరము నుండి వచ్చి బ్రాహ్మణులు గూడ బలి యిచ్చి పోవుచుందురు. అపరాధము చెప్పికొనుమని బోధించిన రాజనందనుఁడు నిజమాడిన నామెకు నిష్టరమేల రావలయు. నామె చేయుచున్న పని తప్పని ముమ్మాటికిం బలుకుచున్న వాఁడ. ఆకలంబులం దిని పొట్టనిండించు కొనరాదా? ఖడ్గపాతవ్యధ సైరింపక యా మృగంబు లెంత పరితపించునో జాలి యుండవలదా? అని యనేక ప్రకారంబుల జంతుహింసాప్రతికూలములగు మాట లాడుచు నటంగదలి సుమనోహరంబై నందనవనంబునుం బోలియున్న పుష్పవనంబున కరిగి యందలి ప్రసూనవాసనల కానందింపుచుఁ దూరుపుదెసకు వచ్చి హంసకారండవాది జలవికరకూజిత మనోహరమైయొప్పు కాసారంబు సోయగం బభివర్ణించుచుఁ బ్రాక్తీరంబు జేరి యందలివిశేషంబులఁ బరికింపుచు వటశాఖాపినద్ధమగు నుట్టియు దానిక్రిందులుగాఁ ద్రిశూలాగ్రమగు నినుపకంబంబునుం గాంచి యిదియేమని యడిగిన నర్చకుం డిట్లనియె.

భర్తృదారక ! తద్వృత్తాంత మంతయు నా శిలాస్థంభకిలతమందు తామ్రశాసనంబు జదివినఁ దెల్లము గాఁగలదు. ఱేపు మరల వత్తురుగాక నేఁటికిఁ బ్రొద్దు పోయినది పోవుదము రండని పలుకగా వినిపించుకొనక విక్రమాదిత్యుండు సత్వరంబున నా స్థంభంబు దాపునకుఁ బోయి యా శాసనం బిట్లు చదివెను.

ఉ. ఈ వటవృక్షశాఖలపయిం దగిలించిన యుట్టియెక్కి యి
     చ్ఛావిధిఁ జేరులైదును వెసంగదెగఁగోసి యసింద్రిశూలధా
     రావినిపాతితాంగుడయి ప్రాణముల న్విడనాఁడ వానికే
     దేవి ప్రసన్న యై యభిరతం బొనఁగూర్చు నభీష్టకామ్యముల్ .

అని యున్న పద్యము ముమ్మారు పఠించి యీ శాసనము లిఖించి యెంత కాలమైనదని యర్చకు నడుగుటయు నతండు రాజపుత్రా ! ఇది వ్రాయఁబడి యెంతకాల మైనదో యెవ్వరికిం దెలియదు. నేను గాక మా తాతగాక యతని ముత్తాతయు నెఱుఁగడని చెప్పిన విని విక్రమార్కుండు మీ రెఱిఁగిన తరువాత నిందువ్రాయఁబడిన రీతి నెవ్వరుం జేయలేదా? అనుటయు నా పూజారియు నట్లు చేసినచో నీ యుట్టి యిట్లేల యుండెటిని? తెగి పడి యుండదా? అని యతం డుత్తరము చెప్పెను. అప్పు డారాచపట్టి దరహసితవదనారవిందుఁడై యోహో? జనులకుఁ గామ్యసిద్ధి యింత చేరువనుండ బలు లిచ్చి యన్యజీవనముల హింసింప నేమిటికోయని పలుకుచు భట్టీ నీవాయుట్టి యెక్కి చేరులు తెగఁగోయలేవా?

భట్టి - అమ్మయ్యో? అట్లు కోసిన నా త్రిశూలాగ్రమునఁ బడి సమయనా?

విక్ర - సమసిననేమి? అమ్మవారు ప్రత్యక్షమై యభీష్టముల, నిచ్చునఁట కాదా?

భట్టి - ఏమో. అది యెంత సత్యమో అట్టి సాహసము నేను జేయఁజాలను. అప్రత్యక్షఫలంబున కాసపడి ప్రత్యక్షశరీరమును నొవ్వఁజేయనేల ?

విక్ర - సత్యమని నమ్మియే చేయవలయును. మోక్షము మాత్ర మప్రత్యక్షముగాదా? అందులకై యోగులు దేహమునెంత క్లేశపరచుచుందురో చూడలేదా?

భట్టి - ఏమో బాబు? ఆ త్రిశూలము జూడ నా మేనఁ గంపము జనించుచున్నది. వేగ మింటికిఁ బోవుదము రండు.

విత్ర - శ్రీధరా? నీవాయుట్టి యెక్కలేవా?

శ్రీధ - ఉట్టిమాట యటుండనిండు. చెట్టే యెక్కలేను.

విక్ర - భద్రా! నీవో?

భద్ర - నా కట్టిసాహసము లేదు. మహారాజా?

విక్ర - అర్చకుఁడా! నీవైన నట్లు చేయరాదా? యభీష్టములఁ బడయుదువు గాక.

అర్చ – తండ్రీ! నా కట్టి సాహసమే యున్నచో నీ పూజారితన మేల చేసికొందును.

విక్ర - ఆహా! ఈ శాసనము లిఖించి యెంతోకాలమైనను నొక్కరుండు నిందలి నిజానిజంబులు పరీక్షించినవాఁడు లేకపోయె. లోకమెంత వ్యక్తిశూన్యమైనది . దీని యథార్ధము తృటిలో నేను గనుంగొనియెదఁ జూడుఁడని పలుకుచు.

మ. కటిచేలంబు బిగించి కేశములు చక్కంజుట్టి చేతుల్ సము
     త్కట భంగిన్మహి రాచిలేచివెస నుత్సాహంబు దీపింప నా

    వటభూజాతము నెక్కి విక్రముఁడు దుర్వారంబుగానుట్టి చెం
    గటకుం బోయెఁ దదాప్తు లొక్కట మహాక్రందంబుగావింపగన్.

అప్పుడు భద్రాయుధుం డవ్విధంబు తండ్రి కెఱింగింప నతిరయంబున రాజమందిరంబునకుం బరుగిడుకొని పోయెను. శ్రీధరుండు అయ్యో! అయ్యో! ఎట్టి సాహసము. ఎంత ముప్పు, త్రిశూలాగ్రమున బడినఁ బ్రతుకుదువా? ప్రాణమిత్రమా? మిత్రుల విడిచిపోయెదవా వలదు. వలదు నిలు నిలు దిగు దిగు మని యేడ్చుచు నఱచుచుండెను.

భట్టియు వయస్యా! శ్రీధరుఁడు నీ నిమిత్త మెట్లు దుఃఖించుచున్నాడో చూడుము. నాదెస జూడవేమి? ఇఁక మాతో మాటాడవా? ఇంత యక్కటికములేని వాఁడ వైతివేమి? అయ్యో? ఈపూజారి తనకు శిరచ్ఛేదమగునని పరితపించుచున్నాడు. జాలిగలవాఁడవు నా కొరకైన నీయుద్యమము మానుము. కత్తితీయకుము తీయకుము చేతులు కోయకుము. ఆ ఆ. నిలు నిలు నాతో మూడుమాటలాడి నీయిష్టమువచ్చినట్లు చేయుము. క్షణములో మనకు వియోగము గలుగుచున్నది. యొక్క మాటయైన నాడి యుట్టి కోయుము. తండ్రీ! నీయట్టియాప్తుండు మాకు దొరకునా? అని దుఃఖింప జిరునగవుతో వెఱ్ఱివారలు మీ కీయాతురతతో బనిలేదు. నేనెందుబోయెద శోకింపకుడని పలుకుచు నుట్టిలో గూర్చుండి త్రాళ్లు సవరించుకొనుచుండెను.

భద్రాయుధుం డతిరయంబున బరుగిడికొనిపోయి మహేంద్రాదిత్యునితో మహారాజా! నీ కుమారుండు కాళికాలయంబునకుం బోయి మఱ్ఱికొమ్మకు వ్రేలంగట్ట యున్న యుట్టి యెక్కి దాని త్రాళ్ళు గోయ యత్నించుచున్నాడు. మే మెంతచెప్పినను వినలేదు. త్రాళ్ళుతెగిన, గ్రింద తటాకములోనున్న శూలాగ్రముపై బడి ప్రాణములు విడుచును. వేగవచ్చి వారింపుడని కేక పెట్టెను.

ఆ మాట విని యా యొడయడు పిడుగుపడిన ట్లడలుచు నేమీ! ఏమీ. విక్రముఁ డాగుడిలోని కెట్లు పోయెను. ద్వారపాలు రెట్లు పోనిచ్చిరి. వీడు దుడుకువాడనియే యట్టిశాసనము గావించితిని. అయ్యో! అయ్యో! అని యరచుచు నొండు విచారింపక వీథింబడి పరుగిడ దొడంగెను. పరివారము గుంపుగా వెంటబడినది. వారువపురౌతులు గుఱ్ఱములెక్కి ముందు పరుగిడిరి. పౌరులందఱు పరితాపముతో నాకోవెలదెసకే పరుగిడుచుండిరి.

యమ్మేదినీపతి పాదచారియై కొంతదూరము పోవువఱకు గుఱ్ఱపురౌతు లెదురువచ్చి జయమహిరాజా? యువరాజు కుశలియైయున్నవాడు అని చెప్పిన విని యతడు వారికి బారితోషిక మిచ్చి మెల్లగా నా యాలయంబునకుం బోయెను.

ఆహా! ఏమి సాహసము. ఏమి ధైర్యము. ఏమి చొరవయని జనులూరక విక్రమార్కుని సుగుణంబులం బొగడుచుండిరి. తత్ప్రదేశమంతయు బౌరులచే నిండింప బడినది. జనుల దప్పించుకొనుచు మహేంద్రాదిత్యుడు అల్లన లోనికింబోయి యేడీ? దుడుకుపట్టి ఎందున్నవాడని యడుగుచుండ నక్కుమారుండు వినయనమితోత్తమాంగుడై యతనిదండ కరుదెంచి నమస్కరించుటయు దీవించుచు గౌగిటం జేర్చీకొని యిట్లనియె.

అమ్మయ్యా! ఇప్పటికి నా డెందము కుదురుపడినది. అబ్బా! యీక్షణ మెవ్వరిని బాధించితినో నాపరితాప మిట్టిదని చెప్పజాలను. భట్టీ! ఇటురా; ఏమి జరిగినది? ఉట్టికోసెనా; కోయకుండ మరలెనా? అని యడిగిన భట్టి యిట్లనియె.

మహారాజా! అతండు పట్టినపట్టు విడచునా? ఉట్టి కోయకుండ దిగువాడే బాబూ వీనిస్నేహము జేయగూడదు. చెట్టెక్కి యుట్టికోయవలదని యెంత బ్రతిమాలినను వినిపించుకొనక చిరునగవుతో నాయుట్టిలో గూర్చుండి యించుకయు సంశయింపక వెరవక భయపడక యెడమచేత నాయుట్టి త్రాళ్ళన్నియుం గలిపి పట్టుకొని కుడిచేత గటారిం బూని పరపర గోసిపారవైచెను.

అప్పుడు తళుక్కుమని యొకమెఱుపు మెరసినట్లై మాకన్నుల జీకటి గ్రమ్మినను ముహూర్తకాలము మాకేమియు గనంబడలేదు. అందు లట్ల నిలువంబడితిమి అంతలో మా మిత్రుండు శూలము పాలుగాక తటాకతీరంబున గ్రొత్తవన్నెతో నిలువంబడి యుండ బొడగంటిమి. పరుగున బోయి కౌగలించుకొంటిమి. ఇంతియ మే మెఱింగినది తరువాయి కథ యతండే చెప్పవలయునని పలికిన విని యా నృపతి పోనిమ్ము ఆపద దప్పినదికదా. పిమ్మట జెప్పునులే యని పలికి యప్పుడింటికిం దీసికొనిపోయెను.

మహాకాళి రాజకుమారునికిఁ బ్రత్యక్షమై యనేకవరంబు లిచ్చినదని పౌరులెల్ల వింతగాఁ జెప్పుకొనుచుండిరి. ఆ వార్తవిని మరునాఁడు. భట్టివిక్రమార్కునితో వయస్యా! నిన్న నుట్టి కోసినపిమ్మట నేమిజరిగినదియో మాకుఁ దెలియలేదు. అమ్మవారు ప్రత్యక్షమై నీకు వరంబులిచ్చినదని గ్రామములోఁ జెప్పుకొనుచున్నారు. మా కప్పుడు కన్నులు జీకట్లఁ గ్రమ్ముటచే నేమియుం దెలిసినది కాదు. ఇంతలో మీతండ్రి ని న్నంతఃపురమునకుఁ దీసికొని పోయెంగదా! ఏమి జరిగినదియో యథార్థము జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

మిత్రులారా! వినుండు ఉట్టిం గోసి నే నాత్రిశూలాగ్రమునం బడఁబోవు నంతలో నా మహాకాళి దయారస పూరితచిత్తయై మెత్తని తన చేతులు రెండును సాచి నన్నందుఁ బడకుండఁ బట్టికొని పాదపీఠమునకు లాగికొనుచు ముద్దుపెట్టుకొని యుప బాలించుచు వత్సా! నీ సాహసదైర్యస్థర్యములకు సంతసించితిని. నీకు సాహసాంకుఁ డని బిరుద మొసంగితిని. వేయిసంవత్సరము లవిచ్ఛన్నముగా నీరాజధానిఁ బాలింపఁగలవు. నీకీర్తి మూఁడులోకంబులు వ్యాపింపఁగలదని పలుకుచు నీ యభీప్పితంబులం దెలుపు మొనగూర్తునని యడిగిన స్తుతిపూర్వకముగా నేనిట్లంటి.

అంబా! అస్థిరంబులగు భోగంబులయందు నా మనసభిరుచి వహింపదు. వేయేండ్లు రాజ్యము చేసినను నెప్పటికైన నవసానమున్నదియా లేదా? సకలలోకనాయికవగు నీవు ప్రత్యక్షమై నన్నభినందించితి వింతకన్న మిన్న యేమున్నది. అయినను గోరుకొను మంటివి కావున నిన్నొకండు ప్రార్థించుచుంటి వినుము.

తల్లీ! నీవాదిశక్తివి. ఈ భూతకాలంబులన్నియు నీవు గన్ను మూసిన నశించును. కన్ను దెరచిన వసించును. ఇట్టి నీవు పెద్దపులివలె మృగబలి నాసించుట నాకు సిగ్గగుచున్నది. నేఁటి దుదనుండి యట్టి బలు లంగీకరింపనని నాకు వరంబిత్తువేని మహాసామ్రాజ్యప్రవాసముకన్న నెక్కుడుగా సంతోషించెద నిదియే నా యభీష్టమని పలికిన విని యాలోకజనని చిఱునగవుతో నన్ను మఱియు ముద్దుబెట్టుకొనుచు బాలకా? నీకీ మేలు బద్దులెక్కడ కలిగినవి. ఆహా నీ సుగుణంబులు గణనీయంబులని పొగడుచు నిట్లనియె.

కుమారా! నీకు నిజము చెప్పుచున్నాను వినుము. గతానుగతికోలోకః? అను నార్యోక్తి వినియుంటివా? పశబలియిండు మీయభీష్టములఁ దీర్తునని నేనెవ్వరితో నైనఁజెప్పితినా? ప్రజలందరు నిజము దెలిసికొనలేక ఫలాపేక్షంజేసి యొకరు చేసిన పనియే రెండవవారు చేయుచుందురు. అంతియకాని యది మదాదేశము కాదు. అయినను నీవడిగితివి కావున నింతటినుండి యిందట్టిపని జరుగకుండ శాసించెదనని పలికి యద్దేవి యంతర్హితురాలైనది.

ఇంతలో మీరు నాచేరువకు వచ్చిరని యెరింగించుటయు విని భట్టి హర్షపులకితగాత్రుండయి యతనిం గౌఁగలించుకొని రాజపుత్రా! నీయట్టి యుత్తములకు మిత్రుల మని చెప్పికొనిన మాకు విఖ్యాతిగలుగు. నీ వఖండసామ్రాజ్యధురంధరుఁడ వయ్యెదవని పెద్దగా వినుతించెను.

అని యెఱింగించి పైకథ పైమజిలీయందుఁ జెప్పందొడఁగెను.

199 వ మజిలీ.

విక్రమార్కుని రాజ్యప్రాప్తి

శ్లో॥ ఉత్సాహసంపన్న మదీర్ఘసూత్రం
     క్రియావిధిజ్ఞం విపయేష్వసక్తం
     శూరం కృతజ్ఞం దృఢనిశ్చయంచ
     లక్ష్మీ స్వయం వాంఛతివాసహేతోః.

మహేంద్రాదిత్యుఁ డొకనాఁడు భార్యతో దేవీ! చిరంజీవి ప్రాయంబునఁ జిన్నవాఁడైనను సద్గుణగణంబులచే లోకుల నాకర్షించుచున్నవాఁడు. మనపట్టిని యౌవనరాజ్యపట్టభద్రుని జేయుమని ప్రజలు నన్నూరక నిర్బంధించుచున్నారు. దేశదేశములనుండి పిల్లల నిత్తుమని చక్రవర్తుల వార్తల నంపుచున్నారు. స్వయంవరవిధిమూలముగా గాని వివాహమాడనని భట్టిముఖముగాఁ దెలియఁజేసియున్నాడు. మఱియు