కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/197వ మజిలీ

వికీసోర్స్ నుండి

డించు ముద్దుగుమ్మల నిద్దరం బెండ్లిఁ జేసి దేవకాంతాసంభోగోత్సుకవిముఖునిఁ కావించెను. మఱియు మోహనుండు చంద్రిక తండ్రియగు భీమవర్మను రప్పించి తమ వృత్తాంత మంతయుం జెప్పి యతనికిం గూఁతునం దనురాగాంకురము గల్గునట్లు జేసెను. విద్యావతి ప్రాగ్జన్మసంబంధబాంధవ్యంబునం జేసి తల్లిదండ్రుల నాదరించుచు వారి మన్ననలం బడయుచుండెను. ఇష్టము వచ్చినప్పుడు నిరృతి లోకములోనికి బోయి వచ్చుచుండును. మోహనుం డట్లిరువురు భార్యలతో మిత్రునితోఁ బంధువులతో నాకభోగంబు లనుభవింపుచు బెద్దకాల మారాజ్యము పాలించెను.

అని యెఱిగించి మణిసిద్ధుండు గోపా! ఈ కథవలన గాశీమహాత్మ్యంబు దెల్లమైనదా? యని యడిగిన వాడురమున జేయివైచికొని స్వామీ! కాశీమహిమం బెంత వింతగా నున్నది? ఆహా? ఎక్కడి కపిల? యెక్కడి చంద్రిక? యెక్కడి దేవత్వము? విచారింప నిందు మోహనుని ప్రజ్ఞ యేమియు గనంబడదు. వారిద్దరు గంగలోబడి మృతినొందుచు వానినే పతి గావలెనని కోరుటచే మోహనుని కాభోగము పట్టినది. లేనిచో సిద్ధార్థునికైన పరాభవమే యైతీరును.

అయ్యగారూ! మన మింక గాశీపురం బెన్నినాళ్ళకు బోవుదుము. ఎప్పుడు గంగలో మునుంగుదుము? మనముగూడ నోడదాటునప్పుడు నావ మునిగిన బాగుండును. చెరియొక పుణ్యలోకము బాలింతుమని పలికిన నవ్వుచు నాజడదారి యిట్లనియె.

వత్సా? మనకట్టి తుచ్చభోగము లేటికి? ఆ వృత్తిరహితమైన కైవల్య మందుదుముగాక. కాశీపురము కల్పవృక్షము కాదా? ఎవరి కోరిక యెట్లుండునో యట్టి సంతోషంబు గూర్చును. ఇక కొలదిదినములలో నాయూరు జేరగలము. అందు జేరి మోక్షలక్ష్మి బడయగలమని పలుకుచు శిష్యు సంతోషపరచెను.

తదనంతరంబ.

ఉ. కావడి యెత్తి వాడు వెనుకం జనుదెంచుచు మున్ను విన్న నా
    నావిధసత్కథల్ మనమునం దలపోయుచు దచ్చమత్క్రియా
    భావము లెన్నుచుండ బ్రణవంబు జపించుచు దీక్షమోక్షల
    క్ష్మీవిభవప్రమోది మణిసిద్ధుడు ముందరుగున్ పథంబునన్.

197 వ మజిలీ

విక్రమార్కుని కథ

క. చంద్రాననార్ధగాత్రా । చంద్రాంశుశ్వేతభూతిచర్చితగాత్రా
   చంద్రార్కానలనేత్రా । చంద్రార్థజటావిచిత్ర సాధుచరిత్రా॥

దేవా! అవధరింపుము. మణిసిద్ధుం డమ్మజిలీయందు గాల్యకరణీయంబులం దీర్చుకొని భోజనానంతరంబున దనచెంత వినయమితోత్తమాంగుడై నిలువంబడియున్న గోపకుమారుం గాంచి చిఱునగవుతో నిట్లనియె.

క. నగరవిశేషంబుల జూ
   డగబోయినజాడ గనబడదు నేడిట నీ
   నగుమొగము గనగ నన్నడు
   గగ వచ్చినయట్లు తోచెగద యదియేమో ?

వేగ వివరింపుమని యడిగిన వాడు ముసిముసి నగవులతో స్వామీ! మీరెఱుగనిదిలేదు. నిన్న బెద్దదూరము నడచివచ్చుటచే నొడలు బడలియున్నది. నే డెందునుం బోలేకపోయితిని. అట్లయినను నేఁడు మీరు నాకీయవలసిన భృతియందక విడుచువాడనుగాను వినుడు.

గీ. విక్రమార్క మహారాజ చక్రవర్తి
    సాహసాశ్చర్య వితరశౌర్యధైర్య
    ముఖ్యసుగుణంబు లెన్నంగమూఢునకును
    మేను గరుపొంద గలుగనే మానసంబు.

గీ. అక్కడక్కడవచ్చు కధాంతరముల
    జెప్పితిరి తచ్చరిత్ర సంక్షేపముగను
    మున్ను నాకిప్డు మది తృప్తి బొందనమ్మ
    హాత్ముకథలెల్ల దెలుపు డాద్యంతముగను.

అని వేడుకొనుటయు నమ్మహాత్ముండు పరమానందబంధురహృదయుండై మణివిశేషంబున దద్కథారహస్యములెల్లం దెలిసికొని యిట్లుం చెప్పదొడంగెను.

సీ. కాలకంఠుడు మహాకాలాభిధాసుడై
               యెందుభక్తులకోర్కె లిచ్చుచుండు
    శైలకన్యక మహాకాశినాపేర్పొంది
               వసియించునే పురప్రాంగణమున
    చంద్రాన్వయావనీ చక్రవర్తులుమున్ను
              పాలించిరే మహాపట్టణంబు
    మాళవదేశభూమండనంభై యొప్పు
              బేర్మిమై నేవుట ఖేదనంబు

గీ. పుడమి మోక్షప్రదంబులౌ పురములేడు
    వానిలో విశ్వకర్మచే బూని సకల
    సంపదల కాస్పదముగా నిర్మింపబడియె
    నేపురం బట్టి యుజ్జయినీపురంబు.

మహేంద్రాదిత్యుండను మహారాజు విపక్షబలసూదమనుండై మహేంద్రుండువోలె నాప్రోలు పాలించుచుండెను. పార్వతిలక్ష్మీసరస్వతులకు దులయగు శీలముగల సౌమ్మదర్శనయను భార్యతో బెద్దకాలము రాజ్యము జేసియు సంతానము బడయక నా యొడయడు పరితపించుచు మహేశ్వరు నారాధించుటయు నమ్మహాత్ముండు స్వప్నంబున సాక్షాత్కరించి నరేంద్రా! నీయంతశ్శుద్ధికి సంతసించితిని. ప్రమథగణ ప్రముఖుండగు మాల్యవంతుని యంశంబున ద్రిలోకవిఖ్యాతుండగు సుతుడు నీ కుదయింప గలడు. రాక్షసాంశమువలన బుడమి జనించిన తుచ్చమ్లేచ్చులనెల్ల వధియింపగలడు. మఱియు యక్షరక్షః పిశాచాదులు భూతభేతాళాదులు వానివశంబున నుండగలవని యానతిచ్చి యా మృత్యుంజయుం డంతర్హి తుడయ్యెను.

మేల్కలగని మేల్కొని యజ్జనపతి యపరిమిత సంతోషముతో మనీషులకు నూత్నరత్నభూషాంబరాది పారితోషికములిచ్చి పుత్త్రోదయమునుగురించి ముచ్చటింపుచుండ దత్వన్ని యంతర్వత్నియై శుభలగ్నంబున బుత్రరత్నమును గనినది. జన్మకాలలగ్నద్రేక్కాణహోరాదులం బరీక్షించి వీడు త్రిలోకవిఖ్యాతయశుం డగునని తెలియపరచిరి.

మహేంద్రాదిత్యుండును బుధజనస్తుత్యపురుషాపత్యసంప్రాప్తిం జేసి యుల్లాసము జెందుచు భూసురులకు షోడశమహాదానములం గావింపుచు జాతకర్మానంతరమున,

క. శోధించి విక్రమంబున
    నాదిత్యుం బోలుకతన నన్వర్థముగా
    భూధవుడు పెట్టె బట్టికి
    నాదరమున బేరు విక్రమాదిత్యుడనన్.

మఱియు గులక్రమాగతుడగు సుమతియను ప్రధానమంత్రికి మహామతి యనియు, భట్టియనియు నామంబులు గల పుత్రుండును పురోహితునికి శ్రీధరుండను నందనుండును ద్వారపాలుడు వజ్రాయుధుండను వానికి భద్రాయుధుండను పుత్రుండును జనించిరి. ఆ మువ్వురను రాజపుత్రునితో జతపరచి యా నరేంద్రు డాహారవిహారశయ్యామజ్జనక్రీడావిశేషాదు లొక్కచోటనే జరుగునట్లు నియమించి యుచితకాలంబునం జదువవేసి యుపాధ్యాయులవలన గ్రమంబున సకలవిద్యలు నేర్పించుచుండెను. గురువులు నిమిత్తమాత్రమునకేకాక విక్రమాదిత్యునకు వారివలన నించుకయు బ్రయోజనము లేదు. సమస్తవిద్యలు నోజోబలతేజంబులు అహమకహమికగా వచ్చి యతని నాశ్రయింపుచుండెను. మఱియు,

సీ. వేదశాస్త్రపురాణ వివిధాగమంబులు
                కరతలామలకంబుగా నెఱింగె
    నవరసోజ్వలకావ్యనాటకాలంకార
                సమితి నామూలచూడముగ జూచె
    ధర్మార్థకామశాస్త్రప్రపంచంబులు
               పల్లవిపాటగా బరిచయించె

    వారణస్యందన వాహనారోహణ
                క్రమమున మర్మకర్మముల దెలిసె

గీ. నృత్యగీతవిద్యాప్రౌఢి నిర్వహించె
    సకలదివ్యాస్త్రశస్త్రప్రశస్తి మించె
    దేజమున నొప్పి భట్టి ద్వితీయుడగుచు
    విక్రమాదిత్యు డసమానవిక్రముండు.

క. పూవునకు జన్మతోడనె
   తావుల్ ప్రణవించునట్లు తద్బాలునకుం
   భావమున సుగుణ పుంజము
   లావిర్భావంబు నొందె నద్భుతరీతిన్.

రాజపుత్రుండు మువ్వురమిత్రులతోఁ గూడికొని యొకనాడు కేళీలాలసుండై యుద్యానవనంబునకు బోయి విహరింపుచు గ్రీడాంతరమున నిట్లు సంభాషించెను.

విక్ర — భట్టీ! శ్రద్ధబట్టి గట్టిగా జూచుచుంటి వది యేమి పుస్తకము ?

భట్టి - మహాభారతసారము.

విక్ర - అందేమి యున్నది?

భట్టి — ఇందు బాండవుల పరాక్రమము అద్భుతముగా వర్ణింప బడి యున్నది.

విక్ర - చాలు. చాలు. పాండవులకు బరాక్రమ మున్నదా ?

భట్టి - అట్లనుచుంటివేల? అర్జునుడు మహావీరుడు కాడా? భీముని పరాక్రమ మేతన్మాత్రమే పరిహాసకల్పితమా ఏమి ?

విక్ర — కాదు. సత్యమే. పాండవులు వీరులే యైనచో శత్రువులు లక్కయింట బెట్టి నిప్పంటించినప్పుడు గుహామార్గంబునబడి రాత్రికి రాత్రికి నదులు దాటి యరణ్యము లతిక్రమించి మారువేషములతో బల్లెలజేరి బిచ్చమెత్తుకొని జీవింతురా? అయ్యయ్యో! ఈ పని క్షత్రియకులజులకెల్ల దలవంపులుగాదా?

భట్టి -- అన్నా! అప్పుడు వారు పిరికిపందలై పారిపోయిరందువా? ఏమి?

విక్ర - సందియమేలా! కానిచో నప్పుడే పోయి దుర్యోధనుం బట్టికొని కట్టి ధృతరాష్ట్రు నెదుటబెట్టి నీపట్టి యెట్టిపని చేయబూనెనో చూచితివా? అని యడిగిన తగినశాస్తి చేయనే చేయుదురు.

భట్టి - పోనీ పరాక్రమశాలి కాకున్నను సుగుణశీలియని యొప్పుకొందువా?

విక్ర - అతండు ప్రాకృతుడు వోలె విత్తసక్తుడుగాని విరక్తుడుకాడు.

క్షణభంగురములగు దేహభోగంబులకై పితామహుని గురువుల గురుపుత్రుల భ్రాతల మామల బంధువుల నందరను జంపించె నింతకన్న నవివేక మున్నదా? తాను బట్టభద్రుండై యెల్లకాల ముట్టికట్టుకొని యుయ్యెల నూగెనా యేమి?

భట్టి - పోనీ భీష్మద్రోణులు గొప్పవారని యొప్పుకొందువా?

విక్ర - పెద్దల నాక్షేపించుటకాదు గాని వారియందున్న దోష మెవ్వరి యందును లేదు. వినుము. ఏ లోకములోనో నే రాజ్యమం దేకాలమందైన నెట్టి యపరాధము జేసినను రజస్వలయైన యాడుదాని సభ కీడ్చుకొనివచ్చి కట్టిన పుట్టంబులు విప్పి యవమానపఱచిన వారెవ్వరైనం గలరా? మహాసభలో నట్టి దుష్టచర్య సేయుచుండ సీ. సీ. యని వారివంక పెద్దగ్రుడ్లతో మిడుతు మిడుతు చూచుచుండెడి భీష్మద్రోణు లొక పెద్దమనుష్యులే ? వేతనభుక్కు ద్రోణుని మాట యటుండనిమ్ము భీష్ముని కేమివచ్చినది. అతండు రెండుకన్ను లెత్తిచూచిన దుర్యోధనుండు నిలువఁగలడా? వాఁడు చేయు దుష్టకార్యములకుఁ దోడు పోవుచుండలేదా. ఉత్తరగోగ్రహణమునకుఁ దానుగూడఁ నేమిటికిఁ బోవలయున ? కాననిన శిరచ్ఛేదముఁ జేయునా యేమి? దుర్యోధను డాడిన మాటకుఁ బాడిన పాటకు దాళము వైచుచు భీష్ముఁడు ధర్మాత్ముం డనిన నెట్టు సమ్మతింతును? తానొక్కటియుఁ జేయలేదు. కాని శాంతిపర్వమంతయు ధర్మములతోఁ గుప్పివైచెను.

భట్టి — కర్ణుఁడు వితరణశాలి యనిన ననుమోదింతువా ?

విక్ర - సరి సరి తమ్ముడా! నన్నుఁ బరగుణాసహిష్టునిఁగా దలంచు చుంటివా ఏమి? వారు మహానుభావులు వారి గుణదోషతారతమ్యంబు లెన్న నేనెంతవాఁడను. సాధ్వీశిరోమణియగు ద్రౌపది నవమానపఱచుచుండఁ జూచి యూరకొనిరని కోపముతో నట్లంటి నా పాపము శమించుఁగాక.

భట్టి - అన్నా ! నీ వనినట్లు వారియందుఁ గొన్ని లోపము లగుపడుచున్నవి. కాని వాని నెన్నుటకు మనకధికారములేదు.

శ్రీధరుడు - అన్నా! విక్రమార్కా! నేఁడు శుక్రవారము రాత్రి మహాకాళి యాలయములోఁ బూజామహోత్సవములు పెక్కులు జరుగును. పోయి చూతమా?

విక్ర - ఆ యాలయ మేమూల నున్నది?

భద్రాయుధుడు - శ్రీధరా! నీ వనవసరము మాటలాడకుము. చీఁకటి పడుచున్నది. ఇంటికి బోఁకున్న నుపాధ్యాయులు గోపింతురు.

విక్ర - శ్రీధరా! వీఁడు నీకు గనుసన్నఁజేసి మాట్లాడుచున్నాడేమి? అందుఁ బోకూడదా యేమి?

శ్రీధ - (నవ్వుచు) బోఁగూడదని రాజుగారు శాసనముజేసి యున్నవారట నే నెఱుగను.

విక్ర - భద్రా! నిజము చెప్పుము, లేకున్న నిన్ను మా మిత్రులనుండి తొలగింతుము.

భద్రా - దేవా! మఱి యేమియును లేదు. ఆ దేవి కోవెల మ్రోల నగాధమగు తటాక మున్నది దుడుకుతనంబున నందుఁ బడుదుమనియు నాయమ్మరూపము భయంకరముగా నుండుటఁ జూచి వెఱతుమనియు మనల నెప్పుడు నందుఁ బోనీయఁ గూడదని తద్వారరక్షకుల కాజ్ఞాపించిరి. అందుఁ బోయి వారిచే నాటంక పెట్టఁబడ నేల? యని యట్లంటిని. మీకడ రహస్యములుండునా?

విక్ర - అమ్మవారి యాకారము చూచి వెఱచుటకు మనమంత చంటిపిల్లలమా? మన మీదగలము తటాకము లోతుగానున్న నేమి? దీనికి వే రెద్దియో కారణ ముండునేమో భట్టీ విచారింపుము, శ్రీధరా! నీ వెప్పుడైన నాలయము లోపలికి బోయి చూచితివా?

శ్రీధ — పలుమారు మా తండ్రితోఁబోయి చూచితిని.

విక్ర - లోపల నేమి వింత లున్నవి?

శ్రీధ - అమ్మకచెల్లా! కన్నులు పండువుగా నుండును. మన కోటవలె జుట్టుఁ బ్రహరి యెత్తుగా నున్నది. తూరుపున నుత్తరమున ద్వారములున్నవి. లోపల గోడ నంటి చండికాలయములు కాంచనమణిశిఖర శోభాదగద్ధగితములై వేయికి మించి యున్నవి. శాంతకుంభస్తంభవిభ్రాజమానంబులగు కళ్యాణమంటపములు నూఱునకుఁ దక్కువ యుండవు. కాంచనధ్వజస్తంభములు కింకిణీచయాంకితములై తాళవృక్షముల వలె నందందు స్థాపింపబడియున్నవి. మఱియు నమ్మవారి ముఖమంటపశిఖరంబులు నవరత్నశిలావినిర్మితంబులై కన్నులకు మిరిమిట్లు గొల్పుచుండును. అందు రాత్రుల నొకదీపమే సహస్రదీపములవలె మణులఁ బ్రతిఫలించి కనంబడుచుండును.

ఏఁడు ముఖమంటపములు దాటి లోపలికిఁ బోయిన మహాకాళి విగ్రహము భయంకరాకారముతో నోరు దెఱచుకొని, అగ్నిజ్వాలవలె వ్రేలాడు నాలుకతో ధవళశూరాభమ్ములగు దంష్ట్రలతోఁ గనంబడును. భద్రుఁడనినట్లు హటాత్తుగాఁ జూచిన వెఱపుగలుగక మానదు. కపాలమాలికలు వ్రేల నవరత్నోజ్వల భూషణములచే నలంకరింపబఁడి కాలిక్రింద దేనినో త్రొక్కిపెట్టి సింహముపైఁ గూర్చుండునట్లాశక్తి విగ్రహ మొప్పుచున్నది. ఆ గుడికి దక్షిణ దెస నానాకుసుమ ప్రసవతరులతావిజనములచే నొప్పు పుష్పవనము నాటఁబడి యున్నది. ముఖమండపమున కల్లంతదవ్వులో విశాలరమణీయమగు తటాకము విరాజిల్లుచున్నది. నాలుగుదెసల స్పటికశిలాసోపానములు గలిగి కువలయుకమలకల్హారవాసనలు నాసాపర్వము గావింప మధుఝంకారముఖలితంబైన యొక్క కొలను తూరుపుతీరమున సమున్నతశాఖాసమాచ్ఛాదితతటాకార్ధభాగంబై మఱ్ఱివృక్షం బొండు ప్రకాశించుచున్నది. ఆ సరసిలోఁ ద్రిజాలాగ్రమగు నుక్కుకంబమొకటి గన్పట్టుచున్నది. ఆ ప్రదేశమున నింక ననేకవిచిత్రము లున్నవని చెప్పుదురు. నన్నాదెసకు బోనిచ్చిరికారు. అని శ్రీధరుఁ డాకాళికాలయములో నున్న వింతలన్నియు నెఱింగించెను.

విక్రమార్కుండు విని యోహా! యిన్ని విశేషములు మన యూరనుండ నెన్నడుం జెప్పితిరి కారే? కానిండు నేఁడందుబోయి చూతము రండు. లెండు లెండని పలికిన విని భట్టి యిట్లనియె. మీ తండ్రిగా రేకారణము చేతనో మనల నందు రానీయవలదని యాజ్ఞాపించినారఁట. ఱేని యానతి లేనిదే మనమెంత వారమైనఁగావలి వారందుఁ బోనిత్తురా? కావున ఱేపు ప్రొద్దున్న నర్చకుల నాశ్రయించి వారివెంట లోనికిఁ బోవుదము గాక. ఇప్పుడు పోవలదని యుపాయము జెప్పిన నామాట కందఱు సమ్మతించిరి. అర్చకుల నే నెఱుంగుదు. మా యింటి ప్రక్కనే వారి లోగిలి. ఈ రాత్రియే మాటాడి యుదయంబున లోపలికిఁ దీసికొని పొమ్మని యడిగెద ననుటయు విక్రమార్కుండు తన వ్రేలియుంగర మొకటిఁ దీసి యిది యా యర్చకునికిఁ గానుక యిచ్చి యభీష్టము దెలుపుము. అంతయు నతండే చేయఁగలఁడని చెప్పి యా యంగుళీయక మతని కర్పించెను అందఱు లేచి నిష్క్రమించిరి.

అని చెప్పి యచ్చటికిఁ గాలతీతమగుట మణిసిద్ధుండు అవ్వలి కథ పైమజిలీయందుఁ జెప్పఁ దొడంగెను.

198 వ మజిలీ

ఉట్టికోసినకథ

విక్రమాదిత్యుని సౌందర్యము త్రిభువనాశ్చర్యకరమైయున్నది. కంతు వసంత జయంతాదు లతనితోఁ బోల్చఁదగరు. అతని సుగుణంబులు వర్ణింప సహస్రముఖునికైనఁ బెద్దకాలము పట్టును. పండ్రెండేఁడుల వయసునాఁటికే సకలవిద్యలు గ్రహించెను. చెక్కుటద్దముల వంటి బుగ్గలు గిల్లిన పాలు గారుచుండెను. మీసము లైన రాలేదు. కొరమ తుమ్మెదలం దెగడు నిగ నిగని కురు లరుదుగ వెనుక జీరాడ మొలగుపై కెగసివచ్చిన చంద్రబింబంబు డంబున నతని మొగంబు మెరయుచుండెను. నవ్విన రదనద్యుతు లెల్లెడ వ్యాపింప ముద్దులు మూఁటగట్టుచుండును. పలికినఁ దేనె లొలుకు చుండును. ఆకర్ణాంతవిశాలములగు నేత్రములు విప్పి చూచినఁ గరుణారసము దొప్పఁదోగుచుండును. అతండు వీరపురుషవేషముతో నశ్వారూఢుండై రాజమార్గంబున నఱుగుచుండ నిత్యము క్రొత్తవానివలె మత్తకాశినులు చిత్తజాయత్తచిత్తులై వింతగాఁ జూచుచుందురు.

ఎప్పుడు తెల్లవారు నెప్పు డాకాళికాలయము జూతునని తలంచుచు విక్రమార్కుడు నిద్రగన్నుల నారాత్రి నిద్రయేపోలేదు. తెల్లవారినతోడనే యతండు నిత్యకృత్యములం దీర్చుకొని వాడుకప్రకారము స్నానముఁ జేసి జపముఁ జేసికొనుచున్న సమయంబున