కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/186వ మజిలీ

వికీసోర్స్ నుండి

186 వ మజిలీ

శ్రమణికథ

వత్సా! వినుము శ్రమణి పురుషవేషముతో జయపురంబున శత్రువులతోఁ బోరుచు రిపుబరాధిక్యంబునకుఁ గొంకి యొకవంక దన గుఱ్ఱము నొకయింటి ప్రహరి దాటించి యా పెరటిలోనికిం బోయినది. ఆ యింటిలోనుండి యొక వాల్గంటి వచ్చి యెవ్వరెవ్వరని కేకలుపెట్టుచు నిదానించి చూచి లోపలకుబోయి అమ్మా! మనము చెఱసాలనుండి దాటించిన వీరుడువోలె నున్నాడు. చూడుమనుటయు నొక యువతి యీవలకువచ్చి పెరటిలో గుఱ్ఱమునుదిగి యేమిచేయుటకుం దోచక యిటునటు చూచుచున్న శ్రమణిం గాంచి దాపునకుఁ బోయి యోహోహో? కుమారశేఖరా? యెప్పుడు వచ్చితివి? నీ కతంబున మా రాజపుత్రికచే నేను జాల జీవాట్లుతినుచుంటిని. నిన్ను బంధవిముక్తుం జేసినందులకు ఫలమేమి చూపితివా? రాజపుత్రిక నీకొఱకుఁ బరితపించుచున్నది. లోపలికిరమ్ము, నే నామె పరిచారికను. వసుమతియనుదాన. మీ వార్త దెలియఁజేసి యామె నీరాత్రి నిందు రప్పించెద. నీవుచేసిన వాగ్దత్తము చెల్లించుకొను మని పలికినది.

శ్రమణి యా మాటలన్నియు విని యవి తన యన్నగారి చర్యలనియు నతండు విముక్తుఁడయ్యెననియు నిశ్చయించి తల దాచుకొనుటకు మంచితెరవు దొరికినందులకు సంతసించుచు దానివెంట లోపలికిఁ బోయి తన్నిర్దిష్టమగు విష్టరంబునఁ గూర్చుండి మెల్లన దాని కిట్లనియె.

కాంతా! మీ నగరాంతమున జరుగుచున్న యుద్ధవృత్తాంతము నీవు వినియే యుందువు. నాకు వెనుక సహాయము లేకపోవుటచే శత్రుబలప్రాబల్యంబునకు నొదిగి యుండవలసి వచ్చినది. కొన్ని దినములు మీ యింట నుండెద. రహస్యభేదము సేయక నగరవిశేషంబులఁ దెలుపుచుండవలయును. మీ రాజపుత్రిక నీ యాజ్ఞకు బద్దుండనై చెప్పినట్లు నడచువాఁడనని పలికిన విని పరిచారిక మిగుల సంతసించుచుఁ గుమారా! మేమెల్ల నీ యాజ్ఞాబద్ధులమై యుండెదము. మా యింటనుండ నిన్నుఁ బరమేశ్వరుఁడు దెలిసికొనఁజాలడు. శత్రురహస్యములఁ దెలిసికొనివచ్చి చెప్పుచుండెద. రాజపుత్రిక నీరాత్రి యిందుఁ దీసికొనివచ్చెదని ముచ్చటింపుచు సకలోపచారమును గావించినది.

చీకటి పడినతోడనే రాజపుత్రికయొద్ద కరిగినది. దాని జూచి కనకలతిక యేమే? పురవిశేషము లేమైనం దెలిసినవియా? మొన్న మనచే విముక్తుండైన చిన్నవాడు దాగికొనక మఱల గుఱ్ఱమెక్కివచ్చి మనవారితోఁ బోర నారంభించెనఁట వింటివా? అనిచెప్పిన ముసి ముసి నగవుతో నౌను. వినుటయేకాక చూచితిని, మాట్లా డితిని. అతండు దైవికముగా మనయింటికే వచ్చెనని యా కథనంతయు నెఱింగించినది.

అప్పు డుబ్బుచు నబ్బిబ్బోకవతి పొలఁతీ! బండిలో నీవెంట నేనందువచ్చెద నన్నందుఁ దీసికొనిపొమ్ము. నాఁడు వాని సోయగము తొందరగాఁ జూచితిని. ఇప్పుడు సావకాశముగా మాట్లాడుకొనవచ్చునని చెప్పుటయు నది యందులకే నేనిందు వచ్చితినని పలుకుచు మారువేషము వైచి బండిలోఁ దన యింటికిఁ తీసుకొనిపోయినది.

ఆ పరిచారిక బండిదిగి ముందుగాఁ దాను లోపలికిఁ బోయినది. శ్రమణి దానింజూచి యువతీ! వీథిలోని విశేషములు దెలిసికొంటివా? అని యడిగినది. తెలిసికొంటి ఆ నృపతులలో మందపాలుని కూఁతురు మీ దర్శనమునకై వచ్చినది. మీకు సంధిఁ జేయునట. అని పలికిన శ్రమణి ఏమియు మాటాడక యూరకుండెను.

అప్పుడు రాజపుత్రిక వచ్చి శ్రమణికి నమస్కరింపుచు దాను దెచ్చిన పుష్పమాలిక యాకలికి మెడలో వైచినది. జ్ఞాపకముంటినా? నేనెవ్వరో చెప్పుకొనుడు. అనుటయు, జిరునగవుతో నేను మీయుపకారము మరచిపోవుదునా? నన్నుఁ గృతఘ్నునిగా దలంపకుడు. నాకార్యము దీరిన వెనుక మీ యిష్టము వచ్చినట్లు నడిచెదనంత దనుక తొందర పెట్టవలదని తత్సమయోచితముగా మాట్లాడెను.

రాజపుత్రిక శ్రమణితో ముచ్చటించుటయె గ్రీడించినట్లు సంతోషించుచు నెపము పన్ని పల్కరించుచు శత్రుమర్మముల నెఱింగించు కారణంబున సంభాషించుచు శంకించి యుత్తరములు వడయుచు మూఁడు దినము లందేయుండి యానందించుచుండెను.

పరిచారిక యెప్పటికప్పుడు వీథిలోనికిఁబోయి శత్రురహస్యములఁ దెలిసికొని వచ్చి చెప్పుచుండునది. ఒకనాఁడు సాయంకాలమున వసుమతి గుండెలు బాదుకొనుచు వచ్చి కనకలతికతో రాజపుత్రీ! అమ్మయ్యో! కిరాతసైన్యములు కోటానకోటులువచ్చి మనపట్టణ ముత్తరదెస ముట్టడించినవి. దక్షిణదెస మఱియొకరాజెవ్వడో వచ్చి యావరించెనట. మనరాజు లిద్దరు తమ సేనలచే బోరించుచు బారిపోవుటకు బ్రయత్నించుచున్నారట. ఏ వీథిజూచినను భిల్లవీరులే కనంబడుచున్నారు. పౌరులు తలుపులు మూసికొని వీథిలోనికి వచ్చుటకు వెరచుచున్నారు. నీవిక మీయింటికి బోవలయు నేమియుపద్రవము జరుగునో తెలియదని రహస్యముగా కనకలతికతో జెప్పు చుండగ విని శ్రమణి పరమసంతోషముతో నిట్లనియె.

మీకు వెఱువవలసిన బనిలేదు. మీరాజుల కెట్లును రాజ్యము దక్కదు. మిమ్ము నేను గాపాడెదను. మీరు నాకు గావించిన మేలు మరచిపోవుదునా? అని పలికిన వసుమతి యిట్లనియె.

రాజవాహనా! నీమాటలు వేరొకరీతి సూచించుచున్నవేమి? మా రాజపుత్రిక నిన్ను బ్రాణబంధువునిగా నిశ్చయించుకొని తండ్రి పరాభవమునకు గూడా ననుమతించినది. ఈమె యభిలాషదీర్పక దప్పదని పలికిన విని శ్రమణి నవ్వుచు నేమియు మాటాడినదికాదు. ఆ రాత్రియెల్ల సరససల్లాపములతో గాలక్షేపము జేసిరి.

మఱునా డుదయము గాకమున్న శ్రమణి యశ్వరూఢయై పోవుటకు బ్రయత్నించుచుండ గనకలతిక పుష్పదామంబు మెడలోవైచి లాగుచు మనోహరా! నిన్ను నేను బోవనీయను నాకిచ్చినవరము చెల్లింపుడు మిమ్మే భర్తగానెంచి తలిదండ్రుల విడిచి మీకడ కరుదెంచితిని. ఇక దాచనేల? నా యభీష్టము తీర్చకున్న గదల నీయనని నిర్బంధింపగా శ్రమణి తిరుగావచ్చి నీయభీష్టము తీర్తునని చేతిలో జేయివైచి యుద్ధరంగమునకు బోయెను. అందు గొప్పయుద్ధము జరుగుచుండెను.

మొదట వసుపాలుని సేనల శత్రుబలమనుకొని భిల్లవరులు వారితో బోరిరి. కొంతసేపటికి రాజవాహనుడు వారు తమవారని తెలిసికొని యుభయసైనికులకు మైత్రి గలిపి శత్రువీరుల మర్దింపజేసెను.

రాజవాహనుడు సర్వసేనాధిపత్యము వహించి తురగారూడుండై యెక్కడ జూచిన తానయై శత్రుబలసంహారము గావింపుచుండెను. ఇంతలో శ్రమణి యన్నగారిం గలిసికొని సంజ్ఞాపూర్వకముగా దనరాక దెలిపి సంతోషము గలుగజేసినది. ఇరువురు రెండుయామములలో శత్రుబలముల బీనుగుపెంటల గావించిరి. ఇంతలో దుందుభి బిడ్డలగలిసికొని సంక్షేపముగా వారి వృత్తాంతమువిని యానందించుచు సమరోత్సాహముతో శత్రువీరులపైబడి మారిమసంగినట్లు నాశనము జేయుచుండెను. వారి సమాగమము దెలిసికొని ప్రచ్ఛన్నుడైయున్న యాదిత్యవర్మయు వారిం గలిసికొనియెను.

ఆ నలువురు వీరులు అసంఖ్యాకములైన మూలకముతోగూడికొని శత్రుబలంబుల దరిమికొనిపోయి కోటముట్టడించిరి. జయ, విజయపాలా! అను కేకలు నింగిముట్ట గోటలో బ్రవేశించి శత్రునృపతుల నిరువుర బారిపోవ బ్రయత్నించుచుండ బట్టుకొని బంధించిరి. ఆహా! కాల మేకరీతిగా నెవ్వరికిం జరుగదు. సుఖదుఃఖములు చక్రములవంటివి. వెనుక విజయపాలునికి బట్టినయవస్థ శత్రురాజుల కిప్పుడు పట్టినది.

ఆకోట స్వాధీనమైన తరువాత నందొకసభ జేసి పౌరులనెల్ల రప్పించి శత్రురాజుల నిరువుల ఱెక్కలు విరిచికట్టించి యెదుర నిలువబెట్టించి దుందుభిని సింహాసనంబున గూర్చుండబెట్టి యాదిత్యవర్మ యిట్లుపన్యసించెను.

సీ. వినుడీ మహారాజు విజయభూపాలు డి
                    తనబిడ్డ లీ ధనుర్థరు లిరువురు

    సచివుండ సుమతినా జనులాడ నేను నీ
                  మధువర్మ కపట దుర్మంత్రరతుడు
    మందపాలుడు చాల మంచివాడేకాని
                  జెడియె నీతనిమైత్రిజేసి వీరు
    కడు నధర్మంబున గైకొని రితని రా
                 జ్యంబు కుటుంబ నాశనముజేసి
గీ. దైవకృప నీతడు కిరాత ప్రభుత్వ
    పదవి వర్థిల్లి యట గుటుంబస్థు డగుచు
    నొప్పు నాతని సుతు వీర లూరకిందు
    బద్దుజేసిరి నిప్పొడి బడినట్లు.

దానంజేసి యీ సంగరంబు ప్రవర్తిల్లినది. ఈ నృపతు లిద్దరు తాము గావించిన పాపమునకు ఫలం బనుభవింపగలరు.

క. ఒరుల సిరికాస పడి యె
   వ్వరు పాపపు భీతిలేక పరహింసా త
   త్పరు లగుదరొ చెడుదురు త
   న్నరు లిందులకిల నిదర్శనము వీరెకదా?

అని యుపన్యసించిన విని పౌరులు జయవిజయపాల మహీపాలా! అని కేకలువైచుచు నతండు తిరుగా సింహాసన మలంకరించినందులకు దమసంతోషము వెల్లడించిరి. క్రమంబున నావార్త విని యదివరకెందుండిరో కానిపించని రాజబంధువు లందరు రా దొడంగిరి. విజయపాలుం డాదిత్యవర్మను వెండియు మంత్రిగా జేసికొని శత్రురాజుల రాజ్యములు రెండును వశముజేసికొని పాలించుచుండెను.

శ్రమణి రాజవాహనునితో గనకలతిక తనకు గావించిన యుపకారము లోనగు వృత్తాంత మెఱింగించుటయు నతండు సంతసించుచు నాదిత్యవర్మకుం జెప్పి తండ్రిగారి యనుమతిపై దొలుత గల్పలతం బెండ్లియాడి తరువాత గనకలతికం బరిణయమై యిరువురు భార్యలతో నానందసాగర కల్లోలముల దేలియాడుచుండెను.

విజయపాలుడు ఆదిత్యవర్మవలన శ్రమణి యాశయము దెలిసిగొని దుర్గానగరాధీశ్వరుని కుమారుడు సునందునకు శ్రమణినిచ్చి వివాహము గావించెను. కనకలతిక చుట్టరికంబునుంబట్టి మందపాలుని చెఱ దప్పించి యతని రాజ్యమిచ్చివేసిరి. మిక్కిలి దుర్మార్గుడగు మధువర్మను యావజ్జీవము చెఱసాల నుండజేసి యతనిరాజ్యము లాగికొని పాలించుచుండిరి.

గోపా ! జయంతుడే రాజవాహనుడు. శాపాంతముదనుక దివిజసుందరులం గేలిసేయు నిరువురు భార్యలతో గూడికొని పారావత శకుంతముల నుపలాలించుచు స్వర్గసౌఖ్యంబుల నపహసించు భూలోక రాజ్యసుఖంబుల ననుభవించుచుండెను.

నీవుజూచిన పక్షి యాపారావత శకుంతము జాతిది. అది యేజాతి విహంగమో యెవ్వరు పోల్చలేకపోయిరి. భూలోకములో నాపక్షిజాతి యుదయించుట కదియే మొదలు. ఇది నాకలోక పతగ సంతతి యగుట నీకు దానిరూపము, పలుకు, మిక్కిలి విస్మయము గలుగజేయుట నిట్టివింత యెన్నడును జూడలేదని యడిగితివి. నీవడిగిన ప్రశ్న మూరకపోవదు. మంచికథ పొడచూపినది వింటివా! అని చెప్పిన గోపకుమారుండు అయ్యగారూ! మీయనుగ్రహ మిందులకు గారణము. ఈకథ నాహృదయమున కధికానందము గలుగజేసినదని స్తుతియించెను. వారు మఱునాడు లేచి తదనంతరనివాసమున కరిగిరి.

187 వ మజిలీ

జగన్మోహనుని కథ

మ. సురలోకంబున నాకలోకమున రక్షోలోకమందైన సా
     గర మందైనను భీకరాటవుల దుర్గస్ఫారవిశ్వంభరా
     ధరవర్గంబులనైన దుష్కరదురంతవ్యాప్తి నొప్పారినన్
     స్థిరసంకల్పుల కార్యముల్ జగతి సిద్ధించుం బ్రయత్నంబునన్.

వ. వత్సా! ఆనందకాననంబు, అవిముక్తంబు, మహాశ్మశానంబునను పేరులం బ్రసిద్ధినొందిన శ్రీకాశీనగరంబునకు మన మఱుగుచుంటిమి. నేఁ డీప్రదేశంబున మి మ్మడుగఁ దగిన విశేష మేదియుఁ గనంబడలేదు. వారణాశీపురప్రభావద్యోతకంబగు వింతకథ యేదేని యానతీయుఁడని యడిగితివి. సంతసం బయ్యె. మణిప్రభావంబున నంతఃకరణమునకు నొకపక్కని కథ గోచరముఁ జేసికొంటిని. అది మున్ను నీవు విన్న వానికన్నఁ జాల చమత్కృతిగా నుండు నవహితుండవై యాలింపుము.

క. కావేరీ తటమున శో
   భావిలసితమగుచు నొక్కపట్టణవర మిం
   ద్రావతి యనఁదగు భూసుర
   భూవరవిట్శూద్రలలిత భూశోభితమై.

అప్పట్టణంబున కధినాయకుండై యింద్రమిత్రుండను రాజు మహేంద్రవైభవంబున రాజ్యము చేయుచు రూపజితలతియగు మలయవతి యను సతియందు నుచితకాలమునఁ ద్రిభువనాశ్చర్యకరసౌందర్యంబునం బొలుపొందు నందనుంగని యప్పట్టికి జగన్మోహనుండను పేరుపెట్టి యిట్టట్టనరాని వేడుకలతోఁ బెనుచుచుండ నా బాలుండు శుక్లపక్ష శర్వరీపాలుండు వోలె దినదినాభివృద్ధి వడయుచుండెను. పూర్వము నుండియు క్షత్రియులకు ధాత్రీసురులే మిత్రులయి మంత్రులయి యొప్పుట వాడుక