కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/185వ మజిలీ

వికీసోర్స్ నుండి

అందులకు నేఁడు మంచిదైనదికాదు. రేపు సుముహూర్తముంచితిమి ఆ శుభము జూచిపోవుదురుగాక. మీరరుగకున్న నున్నవారు వైరులఁ బరిమార్పఁజాలరా? మీ తండ్రిగారి పరాక్రమము సామాన్యముగాదు, మీరిందువచ్చినందులకు సత్కారమైనఁ జేయలేదు. ఈ రెండుదినంబులు వసించిపోవుదురుగాక అని శృంగారలీలావిలాసములు ప్రకటించుచుఁ బ్రార్థించుటయు నతం డేమాటయు బలుకనేరక యూరకుండెను.

అని యెఱింగించి యవ్వలికథ దరువాతి మజిలీయందుఁ జెప్పందొడంగెను .

185 వ మజిలీ

రాగవతి - అమ్మా! నీవింత యాలసించితివేల? యెక్కడికిఁ బోయితివి.

అశోకవతి - పుత్రీ! నే నెప్పుడు బయలు వెడలితినో కాని యేకార్యము కొనసాగినది కాదు. వినుము. ఆదిత్య వర్మయను పండితవీరుని సహాయమున దొలుత దుందుభియొద్దకుఁ బోయితిని. అందెవ్వరుఁ గనంబడలేదు. వాని చెల్లెలు శ్రమణి దారిలో రామచిలుక యొద్ద శకునము లడుగుచుండఁ గనంబడినది మే మందరము గలసి జయపురంబున కరిగితిమి. అంతకు ముందే రాజువాహనుడు కారాగారమునుండి పారిపోయెనఁట. శ్రమణి పురుషవేషము వైచికొని నప్పుడు అచ్చముగా రాజవాహనునివలె నుండెను. గుఱ్ఱమెక్కి వీథి నరుగుచుండ నామె రాజవాహనుఁడని రాజభటు లాటంకపరచి పట్టుకొనఁబోయిరి. వారితో బెద్దయద్దము జేసినది. ఆదిత్యవర్మయు, శ్రమణిని వరించి వెనువెంట వచ్చిన సునందుఁడను రాజపుత్రుఁడును ఆమెకుఁ దోడుపడి రాజభటుల నెల్లఁగాందిశీకుల గావించిరి.

అప్పుడు పట్టణ మంతయు నల్లకల్లోలమై శత్రువులు ముట్టడించిరని భయపడుచు నలుదెసలకుఁ బారఁ దొడంగెను. మధువర్మయు మందపాలుఁడు అసంఖ్యాకములైన తమ సైన్యముల నానగరము జేర్చియుంచిన కతంబున నేల యీనినట్లురాజభటులు నగరమంతయు వ్యాపించి మనవారితో ఘోరముగఁ బోరు గావింపుచుండిరి.కోటానకోటలుగానుండు రాజభటులనెల్ల సాగరమును మంధరమువలె నీ మువ్వురుసంక్షోభము నొంద జేసిరి. ఆదిత్యవర్మకును సునందునకును వాహనములులేవు తగిన యాయుధములు లేవు. శ్రమణి మాత్రమే యశ్వారూఢయై పోరుచుండెను. మూడుదినము లేకరీతి సాంపరాయము జరిగినది. శత్రుణరాధిక్యము వలన నిలువఁజాలక యాదిత్యవర్మ యెట్లో తప్పించుకొని దాటిపోయెను. శ్రమణియు నలసి యే మూలకో పారిపోయినదని విన్నాను. సునందుఁడు శత్రువులచేఁ బట్టువడియె. ఇంతవట్టు చూచి యందుండిన నన్నుఁగూడఁ పట్టికొందురని భయపడి పులిందునకు మఱియొక వర్తమానము బంపి నేనిందు వచ్చితిని. శత్రువుల బలాబలములఁ దెలిసికొనకుండ నా యూరుపోవుట తప్పు ఇప్పుడు పోవవలదని యాదిత్యవర్మ జెప్పుచునే యున్నవాఁడు రాజవాహనుఁ డెందు బోయెనో తెలియదు. ఇప్పుడు మన రాజుగారితోఁ జెప్పి కొన్ని సేనల నందుఁ బంప వలయునని తలంచి వచ్చితిని. రాజపుత్రిక యెట్లున్నది? నన్ను గుఱించి యేమను చున్నది. చెప్పుమని యడిగిన నవ్వుచు రాగవతి యిట్లనియె.

అమ్మా! ఆమె పని యామెకైనది. నిత్యము నిన్నుస్మరించుచునే యున్నది. వినుము రాజువాహనుఁ డా చెఱసాలనుండి తప్పించుకొని వెదకికొనుచుఁ దిన్నఁగా మన యింటికి వచ్చి నిన్నుఁ బిలిచెను. నేను బోయి లేదని చెప్పి యతని కథ విని యంతఃపురమునకుఁ దీసికొనిపోయితిని. రాజపుత్రిక వానిం జూచి మోహవివశయై సిగ్గు వదలినది. గౌరవము మరచినది. కులపరిపాటి విడిచినది. సఖులనెల్ల దూరముగా బోఁ బనిచినది. నన్ను మాత్రమే చెంతచెంతలకు రానిచ్చుచు బనులఁ దెలుపుచున్నది. ఆపులిందుడు రెండవ పిట్టనుగూడ నిక్కడికి బంపివేసెను. దాని వలన గొన్ని కథల వినినది. దానికి లోపలి యుద్యానవనము నందలి కేళీసౌధంబున బస యిచ్చినది. తండ్రి శరబసేనలతో జయపురము మీదికి దండెత్తి పోయెనని తానందు బోవుటకు నా ముఖముగా నడిగిన నంగీకరింపక మొన్నరాత్రి వాని దనవశము జేసికొన్నది. నన్ను మొగసాల గాచియుండుమని నియమించినది. అమ్మా! నీతో నేమని చెప్పుదును. ఈ మూడు దినములు వారికొక గడియవలెనైన వెళ్ళలేదు.

చ. ఒకతరి వల్లకీనినద మొక్కతరి న్మృుదువేణునాద మిం
    కొకపరి కిన్నరస్వరము లొప్పగ బాడుచు వేడ్కురాగదీ
    పకముగ రాత్రియుం బగలు బాయక నీ సఖురాలు పుష్పసా
    యకవిహితక్రియానిరతయై యతనిం గరగించె బాణయై.

తత్కేళీలాలసుండై రాజవాహనుండు తనదేశము తనవారి దన్నుగూడ మరచియున్నవాడు. అమ్మా! నీవు లేకున్నను నీవు తలంచిన కార్యము నెరవేరినది. నే నిప్పుడే యందుండి వచ్చితినని చెప్పిన విని యశోకవతి నెఱుగుపాటుతో నెట్టెట్టూ? రాజవాహను డిందు వచ్చి రాజపుత్రికం గలిసికొనియెనా? అతండు కిరాతకులజుండని సంశయింపక యా చేడియ వానిం గూడినదా? మేలు మేలు. భేషు భేషు. వినదగిన మాట వింటినని సంతసించుచు నప్పుడే యామె శుద్దాంతమునకు బోవలయునని తలంచినదికాని రాగవతి వారించుచు నమ్మా! ఈ రేయిగూడ వారు వేడుకలం గూడుచు మనతో మాటాడరు నేటితో ద్రిరాత్రదీక్ష పూర్తియగును. ఉదయమునం బోవుదమని యడ్డు చెప్పి యప్పటి కాపినది.

నాటి వేకువ జాముననే లేచి యశోకవతి రాగవతితో గూడ గల్పలత మేడకుం బోయినది. ద్వారదేశంబున నిలువఁబడి యాకర్ణింప గల్పలత భర్తతోఁ బరిహాస మాడుచు

క. వనచరులై తగు మీకీ
   మనసిజ మహానీయ శాస్త్రమర్మక్రియ లె
   ట్లనువడియె ననుచు సఖి దం
   తనఖాంకంబులను బ్రకటితము జేసి నగన్.

శా. సూనాస్త్రక్రియ లెట్టివో యెఱుగనేచోద్యంబునుంగాన మిం
    తీ! నీ చెంతకు రాకమున్ను భవదంతేవాసినై సత్కళా
    స్థానాస్థానవివేకకౌశలమనీషాప్రౌఢిమ న్నేర్చితి
    న్గానం గారణ మీవె యిందులకు గాంతారస్థు లింపొందగన్.

అని యతండు సమాధానము జైప్పుచుండెను.

క. తెల తెల వారె బళాబళ!
   కిల కిల మీరిటుల నర్మకేళీలోల
   స్థలదుక్తుల నాడుకొనం
   జెలు లితరులు వినిన గేలిసేయరె తరుణీ!

అని పలుకుచు నశోకవతి తలుపు గొట్టుటయు దత్కంఠ ధ్వని తెలిసికొని కల్పలత యత్యంతోత్కంఠతో -

సీ. తాంబూలరాగారుణం బోష్టమున బొల్చు
              రదనాంకములు రతిప్రౌఢి దెలుప
    ఫాలకంఠకపోలభాగస్త మణివిందు
              మాలలు పతికళామహిమ బొగడ
    తెలసోగకన్నుల వెలయుకెంపు త్రిరాత్ర
              జాగరణత్వ దీక్షను వచింప
    నలిగిన మేని భూషల విలాసములంగ
             పరివర్తనక్రియాపటిమజాట
గీ. విడిన నెఱికుఱు లొకచేత ముడిచికొనుచు
    జిక్కువడినట్టి పేరుల జేర్చికొనుచు
    బ్రిదురు కుచ్చెళులను సవరించుకొనుచు
    దలుపుతీసె లతాంగి యీవలకు వచ్చి.

ఎదుర నశోకవతింగాంచి కల్పలత బిగ్గర గౌగలించుకొని సఖీ! ఎన్నిదినంబులకు గనంబడితివి? ఎందెందు దిరిగితివి? ఎప్పుడు వచ్చితివి? రాజవాహనుని నేమిజేసితివని యడిగిన నవ్వుచు నా జవరాలు చాలు చాలు. నీ టక్కులు నే నెఱుంగ ననుకొంటివా! రాజవాహను డెందుండెనో నీ కపోలంబునం గల గంటుల నడుగుము. వాల్గంటీ? నిషాదకుల సంజాతుడని పరిహసించితివిగదా? ఎట్లంగీకరించితివి? అని పరిహాస మాడుచుండ రెండుచేతులు జోడించి యిట్లనియె. ప్రియసఖి! నీ వేమి యాక్షేపించినను నేను బ్రత్యుత్తర మీయను. నీ సంకల్పము భగవత్సంకల్పమైనది. అతని చరిత్రము వినిన నీవు మిక్కిలి వెఱగుపడుదువు. పక్షులు రెండును గలసికొనినవి. వానియుదంత మంతయు నెరింగిచినవి. అని దానిచేయి పట్టుకొని యుద్యానవనములోనున్న గున్నమామిడిక్రిందనున్న రత్నవేదికయొద్దకు దీసికొనిపోయి యందు గూర్చుండబెట్టి పక్షులవలన దాను వినిన వృత్తాంతమంతయు నెఱుంగజెప్పినది.

ఆ కథ విని యశోకవతి యోహోహో! ఏమి నీ యదృష్టము? భూలోకవనితాదుర్లభుండైన మనోహరుం బడసితివి. సాథు! సాథు! ఇక భూధవున కెరింగింపవచ్చునని మెచ్చుకొనుచు మఱియు నిట్లనియె తరుణీ! మఱియొక్కటి వినుము. వీనివార లక్కడ జిక్కుపడి యున్నారు. జననీముఖంబుగా నీ సంబంధము మీ తండ్రి కెఱింగించి తగుబలంబుల సహాయ మిచ్చి వీని నిప్పు డా జయపురంబున కనుపవలయును. ఇతం డశ్రమంబున శత్రువుల బరాభవింపగలడని యక్కడి కథ లెల్ల దెల్పినది.

నీవే పోయి మా తల్లితో జెప్పి యా సంఘటనమంతయు గావింపుమని కల్పలత అశోకవతినే నియమించినది. అశోకవతి యప్పుడే రాజపత్ని యొద్ద కరుగుటయు నామె అశోకవతితో నీవుగూడ బొత్తుగ నిందు వచ్చుట మానివేసితివేమి? నీ సఖురా లట్లు పిట్టలం బెట్టుకొని ముచ్చటించుచు నెంత కాలము బెండ్లియాడకుండ గాలక్షేపము జేయును? పెండ్లిమాట యెప్పుడైన దలపెట్టునా? అని యడిగిన నశోకవతి అమ్మా! తగిన వరుని నిమిత్త మింతకాల ముపేక్ష జేసినది. పెండ్లియాడ కేమిచేయును? గారణము నీ యుపదేశమే కాబోలు తగినవరుడన నెట్టివాడు. స్వర్గము నుండి మహేంద్రుని కుమారుడు జయంతుడు దీనికొరకు వచ్చునాయేమి? ఉన్న వారిలో మంచివాని నేరుకొనవలయునని పలికిన విని యక్కలికి అమ్మా! నీవు సత్యవచనవు. అకారణముగా నీ నోటినుండి నిజము బయలువెడలినది. నీ వనినట్లు జయంతుడే యామె వరింపవచ్చెను. అతనినే యామెను వరించినది ఇక నిక్కము దాప నేల? గాంధర్వ విధానంబున వారు గలసికొనిరి.

అని యెఱింగించినంత నక్కాంతారత్నంబు ఏమంటివి ? మఱలజెప్పుము. నీవన్న మాట పరిహాస కల్పితమా? సత్యమా? అని వెఱగుపాటుతో నడిగిన నిజమే యని యది సమాధానము జెప్పినది.

ఛీ, ఛీ, అపాత్రురాలవు. నీ సహవాసంబున నది చెడిబోవుచున్నది. వారెవ్వరో నిజము చెప్పుము. స్త్రీలకు బుద్ధిస్థైర్యముండదు. ఉండియుండి చివరకు యపాత్రులను స్వీకరింతురు. వాడు నాయెలనాగ పాత్రుడో యపాత్రుడో నీవు వచ్చి చూడుము. నీకే తెలియగలదు. అని యామెతో బెద్దగా వాదించినది.

రాజపత్ని పెద్దవారలకు దెలియకుండ మీ రిట్టి యపఖ్యాతి పనులం గావిం తురా? పద పద వా డెక్కడ నున్నవాఁడో చూపుమని కసరుచు నశోకవతితోఁ గూడ కూఁతు నంతఃపురమున కరిగినది.

అంతకుమున్ను రాజవాహనుఁడు కల్పలత వలన జయపురవృత్తాంత మంతయు వినియున్న కతంబునఁ నందుఁబోవుటకై తొందరపడుచు వీరవేషము ధరించి పయనమున కెదురుచూచుచుండ మీరొక్కరుఁ బోవలదు. చతురంగబలంబులు సహాయ మిప్పింతు. సేనాధిపతులై యరుఁగుడని బ్రతిమాలుకొనుచుఁ గల్పలత నిలువఁ పెట్టినది.

అంతలో రాజపత్ని యక్కడకుఁ బోయి వానిం జూచినది. రెప్పపాటులేక వాని సోయగము విమర్శించినది. తదీయ తేజో విశేషమున కాశ్చర్యమందుచు నశోకవతీ! ఈతఁడే రాజకుమారుండు? వీని నెక్కడ తెచ్చితివి? అని యడిగిన నది అమ్మా! యీతఁడు నిజముగా జయంతుడే అని యతని వృత్తాంతము సంక్షేపముగాఁ గొంత కొంత వివరించి యిప్పు డితఁ డొంటిగాఁ శత్రువులతోఁ బోర జయపురంబున కరుగుచుండ సహాయ మిప్పింతు నాగుమని నీ కూఁతురు పట్టుపట్టుచున్నది తరువాయి కృత్యము నీవే యాలోచింపుమని చెప్పినది.

ఆమె వెనుకటిమాటలన్నియు మఱచినది. సరి సరి. అతండొక్కడు బోవ నేల? ఱేనితోఁ జెప్పి చతురంగబలముల సహాయ మిప్పించెద. సంబంధము గలియనే కలసినది. ఉండు మనుము అని పలుకుచు నప్పుడే పతియొద్దకుఁబోయి యాయనతో రెండుగడియలు మచ్చటించి యప్పుడే యతనిచేతఁ జతురంగబలముల ముహూర్తకాలములోఁ గోట ముంగిటకు రప్పించునట్టు సైన్యాధిపతి కాజ్ఞాపత్రిక యంపించినది.

ఆ వార్తఁ దెలుపుటకై యామె పుత్రిక యంతఃపురమునకు వచ్చునప్పటికి మొగసాల రణభేరి మ్రోగుచుండెను. అల్లుని మామగారికి గనంబడి యరుగునట్లు రాజపత్ని పుత్రికాముఖంబున రాజవాహనునికిఁ దెలియఁజేసినది. అప్పుడు సైతము తనకుల మెట్టిదో యతం డెఱుంగఁడు. పత్నీప్రబోధింతుండై వీరపురుషవేషముతో రాజవాహనుండు పరిజనులు మార్గమెఱింగింప వసుపాలునొద్ద కరిగెను.

రాజు అల్లునికిఁ బదియడుగు లెదురువచ్చి తదీయతేజోవిశేషమున కచ్చెరువందుచు నమస్కరింపుచున్న యతనితో మఱేమియు ముచ్చటింపక దీవించుచు జాగరూకుండవై సంగరము గావింపుము. విజయ మందుదువుగాక. కోటవాకిటఁ జతురంగబలంబులు నిలిచియున్నవి. సర్వసేనాధిపత్యము వహించిపొమ్ము. అని పలుకుచు మొగసాలవరకుఁ దానుగూడ వచ్చి సమూహమునెల్ల అతని యధీనము గావించెను. భేరీభాంకారాదిమహారావంబులు భూనభోంతరాళంబులనిండ రాజవాహనుం డొకయాజానేయమైన హయంబెక్కి పెక్కండ్రు వీరభటులు చుట్టును తురఁగారూఢులై సేవింప జయపురంబు మీఁదికి దండును నడిపించెను.

అని యెఱింగించువఱకు గాలాతీతమైనది. తరువాయికథ పై మజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.