Jump to content

కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/184వ మజిలీ

వికీసోర్స్ నుండి

కాదు. అమ్మహారాజున కొక కుమారుఁడును కూఁతురుం బుట్టిరి. సుఖంబుననున్న వారు. కథ కంచికిబోయె నేనింటికి వచ్చితిని.

అని యా పతంగ మాకథాశేష మెఱిగించినది. కల్పలత ఆ వృత్తాంత మంతయును విని యద్భుతావిష్టమతియై యోహోహో! ఈ విహంగమంబులు చరిత్ర విషయంబులఁ గథలఁగా జెప్పుచున్నవి. రామచిలుక యెంత దెలిసినదో! కిరాతకుల మన్న చోట నెటు పెట్టినది. దుందుభియే విజయపాలుఁడట. ఎంత వింత, ఎంత చోద్యము! రాజవాహనుఁడు రాజబిడ్డఁడు. కానిచో నీ సౌందర్యము, యీ చాతుర్యము, ఈ పరాక్రమ మెట్లు కలిగెడిని ఇప్పటికి నామదింగల కళంకము వాసినది. పత్యక్షముగా మా తండ్రితోఁ జెప్పి వీనిం బెండ్లియాడవచ్చును. నా నోము లిప్పటికి ఫలించినవి నా పూనిక నెరవేరగలదు. అని తలంచుచు సంతోషాతిశయమునం జేసి యొక్కింతసేపు వివశయై పండుకొన్నది.

184 వ మజిలీ.

జయంతుని కథ

అమ్మా! పండుకొంటివేల? భిల్లపల్లెనుండి కిరాతశ్రీ యొక్కతె పంజరముతో నొక విహంగమును దీసికొనివచ్చి ద్వారమున వేచియున్నది. ఆ పక్షి మన శారదవలె నున్నది లోపలికిఁ దీసికొని రానా? అని రాగవతి యడుగుటయు నులికిపడి లేచి యా కలికి పక్షులం దెచ్చువారి నాకంట పెట్టవలదని యిదివరకుఁ జెప్పియుండ లేదా! వేగముపోయి తీసుకొనిరమ్మని యాజ్ఞాపించినది. రాగవతిపోయి దానితోనున్న వృద్ధకిరాతు నందుండమని పంజరముతోఁగూడ నా చేడియను లోపలికిం దీసికొని పోయినది

కల్పలత యా కిరాతవధూటిం జూచి యచ్చెరువందుచు సుందరీ! నీవెందలి దానవు? ఈ శకుంతము నెక్కడ పట్టితివి? ఎంతవెల కిచ్చెదవు ? అని యడుగుటయు నది తల్లీ! దీని నే నమ్ముటకుఁ దెచ్చినదాననుగాను, మా యేలిక దుందుభి పంపఁగా వచ్చితిని. దీని జోడుపక్షి, మీ యొద్దనున్నదఁట. ఆ జోడు విడదీయుటచే నా పాతకంబునఁ దనకొడుకుతోఁ గూఁతురితో వియోగము కలిగినదనియు నాపదలు తటస్థించినవనియుఁ దలపోసి దీని మీ కిచ్చి యా పక్షితో గలుపుమని నన్నంపెను. ఇది ముట్టినట్లు పత్రికవ్రాసి యిప్పింపుఁడు. అని చెప్పినంత ముప్పిరిగొను సంతసముతో నేమేమీ! ఈ ఖగము మా శారద భర్తయా? యోహో? నేడెంత సుదినము. ఆడఁబోయిన తీర్థ మెదురువచ్చినట్లు దీనికొఱకు నేను బ్రయత్నించుచుండ నిందే తెచ్చితివా? సంతోషము. అని దాని నభినయించుచు నా పంజరముతో నా పత్రరథమును తీసుకొని ముచ్చటించుచు నిట్లనియె.

ఓసి! మీ యేలిక దుందుభి క్షేమముగా నుండిరా? కొడుకు, కూఁతురు నెందుఁబోయిరి! ఇప్పుడాయన యేమిచేయుచున్నారు. అని యడిగిన నబ్బోయెపైదలి యిట్లనియె. తల్లీ! ఆయన అడవినుండి మొన్ననే వచ్చిరి. కొడుకు నెవ్వరో కట్టిపెట్టిరఁట. వానిపైఁ గత్తికట్టి మూఁకలతో బోవుచున్నారు. కూఁతురుజాడ తెలియలేదు. గుఱ్ఱములెక్కి పోవుచునొక పెద్దబిల్లుని సహాయమిచ్చినన్నిందుఁ బంపితిరని చెప్పినది. దానికి నూత్నాంబరమాల్యను లేపనాదు లొసంగి సత్కరించుచు నీ వీదిన మిందుండుము. మీ దుందుభి కుమారుఁ డిందేయున్నవాఁడు నీకు జూపింతుమని పలుకుచు భోజనాది సత్క్రియలు దీర్పఁ బరిచారికల నియమించి తానాబక్షిని పంజరమునుండి పైకిందీసి చేతిపై నెక్కించుకొని ముద్దాడుచు విహంగమ లలామా! నీ యంగనం జూడవచ్చితివా? పాపమిన్ని నాళ్ళీ వియోగమెట్లు సహించితివో కదా! నేడు మంచిలగ్నము గాదు. రేపే నీ పత్నితోఁ గూర్చెద నీలోపల నాకు వింతకథఁ జెప్పుము నీభార్య కొంతకథఁ జెప్పి తరువాయికథ తనకు రాకున్నది తద్కథావిశేషము వినుటకుఁ జాల నుత్సాహముగా నున్నది. మంచి గానముపాడి వేడుక గలుగఁ జేయుమని యడిగిన నన్నీడజంబు మధురస్వరంబున కల్పలతా! మాకు వేనవేలు కథలువచ్చును. నా భార్య నీకే కథచెప్పినదో తెలుపుము. ఎఱింగిన వినరింతు ననుటయు రాజపుత్రిక యిట్లనియె.

దేవలోకములో నచ్చర లొకప్పుడు శృంగారకళారహస్య నేతృత్వంబున నలకూబరుఁ డధికుండని కొందఱు జయంతుఁ డధికుండని కొందఱు వాదించి తగవులాడి కల్పవృక్షకోటరమున వసించు పారావత శకుంతముల మధ్యవర్తులుఁగా గోరి కొనిరి. వాని నడిగిన మూఁడు మాసములు గడువుకోరినది ఇంతవఱకు వింటిమి. తదనంతర రోదంత మెఱింగింపుమని యడుగుటయు నవ్విహంగమం బోహో! ఆ కథయా? వినుము.

శ్లో. పరిమళభృతో గతా శాఖావనాంకుర కోటయః
   మధురనిరుతోత్కంఠాభాజప్రియా పికపక్షీణాం
   విరళ విరళస్వేతోద్గారా వధూవదనేందవః
   ప్రసరతి మథౌ ద్రాత్యాం జాతో నకస్య గులోదయః.

మలయమారుతంబులు పరిమళమిళితంబులై శాఖోపశాఖలు నూత్నపల్లవాంకురశోభితములై వధూవదనంబులు విరళశ్రమజలబిందుసుందరంబులై పికవధూకంఠంబులు మధురస్వరోపేతములై యొప్పుచుండ సకలజగదానందకందళంబగు నొక వసంతకాలంబున నలకూబరుండు రంభాసహితుండై నందనవనంబున కరుదెంచి యందందు విహారించుచు నొకలతాకుడుంగమున ననంగక్రీడాపరతంత్రుండై నర్మలాపంబు లాడుచు శృంగారలీలావైదగ్ధ్యంబు దెల్లముగాఁగ —

సీ. కలికి! నీదగు నామగండమం దలరారె
             లలితారుణప్రవాళమణిరుచులు
    తరుణి నీదగుపయోధర మందుఁ గడువింత
             గనుపించె ఖండాభ్రకములుకొన్ని
    బలరార నీదగు గళములం బొలుపొందు
             మణిమాల యెక్కడి మండనంబు
    ఫాలంబునం నిందుమాల గ్రాలెడు దీని
             తెరవ! యెక్కడినుండి తెచ్చికొంటి.
గీ. మగువ నీకుచ ముఖమునఁదగు మయూర
    పదక మేరీతివచ్చెఁ జెప్పఁగదెనాకుఁ
    బెనవిలొదలెడు గూఢ కంబిది నిగూడ
    మా! వధూమణి! యంచు నర్మంబులాడి.

మన్మధశాస్త్రపాండిత్యంబు తేటపడఁ దత్తత్క్రియాకలాపానుపూర్వకముగా నారంభంగలయుటయు నప్పారాతవశకుంతము లావిశేషంబులన్నియుఁ బరీక్షించి యందించుకయు స్ఖాలిత్యంబుగానక యతని నభినందించినవి.

మఱియొకప్పుడు జయంతుఁ డాయారామముననే ఘృతాచియను నచ్చరతోఁ గ్రీడించుటయు నాపక్షులందలి విశేషములన్నియు గ్రహించి స్ఖాలిత్యములఁ దెలిసికొనినవి.

తరువాతఁ జెప్పిన గడువుదాటిన పిమ్మట నియమితవాసరంబునకు నుభయపక్షముల యప్సరసలు నందనవనమునకువచ్చి విహంగపుంగవులారా? మేము మీ చెప్పిన చొప్పున నరుదెంచితిమి. పక్షపాత ముడిగి వారిద్దరకుంగల హెచ్చుకుంగుల వాక్రువ్వుఁడని యడిగిన నాపక్షు లి ట్లుపన్యసించినవి.

కాంతలారా! మాకుఁ బక్షపాతము సహజమేకాని యిందుఁ బక్షపాతము వహింపము. వినుండు. మే ముభయుల రతిచాతుర్యంబులు

శ్లో. రాగైకలింగ మధకేకిల గూఢకం స్యా
    దుచ్చూనకం దశన వాససి నామగండే
    స్యాత్పిడనా త్తదధరోష్ట విశేషయోగ
    త్తత్రప్రవాళమణిరభ్యసనేన సాధ్యః.

దంతాంకములలోఁ గొన్నిటి శాస్త్రపాఠంబునఁ దెలిసికొన వచ్చుంగాని ప్రవాళమణియనునది యభ్యాససాధ్యంబు. దాని జయంతుండు వినియమముగా నుపయోగించెను మఱియు,

శ్లో. అంతర్ముఖోత్తర రథచ్ఛద నేత్రవర్ణం
    స్థానేషేచుంబనవిధిః కధితేషు యోజ్యాః.

ముఖమధ్యమున నుత్తరోష్టమున నేత్రములందు దంతాంకము లుంపఁగూడదని నిషేధమునఁ గనంబడుచుండ నతం డాచోటులఁ గూడ రదనాంకములుంచెను. ఇంతియకాక యొకచోటనుంచు నంకములు వేరొకచోటఁ జూపుచు శాస్త్రము విడిచి యథేష్టముగాఁ గ్రీడావిన్యాసములఁ గావించెను. జయంతునికన్న నలకూబరుఁడే శృంగారకళావిదగ్ధుండని మాకుఁ దోచినదని తీరుపు చెప్పినవి.

అప్పుడు రంభాపక్షమువారు జయ్ నలకూబరా! యని పెద్ద యెలుంగున నుచ్చరింపుచు నృత్యములు సేసిరి.

అప్పుడు జయంతపక్షమువారు తెల్లఁబోయి విచారములతో నా పక్షుల నిందింపుచు దాము వారి కీయవలసిన పణద్రవ్య మిచ్చివేసి మొగంబుల దైన్యంబుదోప నౌత్నపరాభవంబునకు వగచుచు జయంతునొద్దకుఁ బోయి నమస్కరింపుచు నిట్లు విన్నవించిరి.

మహేంద్రనందనా! మే మీనడుమ నొక చిన్నతనముపనిఁజేసి యోడిపోయితిమి. మాకేకాక యయ్యవమానము మీకుఁగూడ సంక్రమించుచున్నది. పదుగురాఁడువారం డొకచోటఁ జేరినఁ దగవులాడక మానరుగదా? మన నందనవనములో నచ్చరలు గుమిగూడి ముచ్చటింపుచు శృంగారలీలాచాతుర్యంబున మీకంటె నలకూబరుం డధికుండని పొగడిన మేమా మాటకు సమ్మతింపక మీరే యధికులని వాదించి పణము వైచితిమి. నారదవాక్యంబునఁజేసి నందనవనంబున నుండెడి పారావతశకుంతముల మధ్యవర్తులుగాఁ గోరుకొంటిమి. అవి మీ యుభయక్రీడావిశేషములఁ బరీక్షించినవఁట. మీరు బాహ్యక్రీడలలో శాస్త్రమును వదలి అధేష్టముగా నడిచిరట. అందు మూలమున మీకుఁ గళావైదగ్ధ్యములేదని యా మూఢపక్షులు తీరుపుఁ జెప్పినవి. వింటిరా? మేమోడినందులకు విచారములేదుగాని త్రిభువనప్రభువగు మహేంద్రుని కుమారుండవు. నీవు కళామూఢుఁడవని చెప్పినందులకుఁ జింతగా నున్నది. నలకూబరపక్షమువారు గంతులువైచుచున్నారు. మన నందనవనంబునఁ జిరకాలమునుండి వసించిన పక్షులు విశ్వాస మించుకంతయుఁ బూనక ప్రతిపక్షులఁ గెలిపించినవి. వాని కావర మడంపలేరా? యని యావృత్తాంతమంతయు నెఱింగించిరి.

అప్పు డతం డొహోహో! మదీయకళావైదగ్ధ్య మెఱింగించుట కాపక్షులా కలాసమర్ధములు! పులుగుల మధ్యవర్తులుగాఁ గోరుట మీకు బుద్ధిలేదా? బృహస్పతి యుండె శుక్రుండుండె మద్విద్యపాటవము దెలిసికొన సమర్థుం డొరుఁడెవండు? యుక్తాయుక్తవివేకశూన్యములగు పక్షులమాట లెక్క సేయనేల? పో పొండు. అని కసరిన విని యబ్బిసరుహాక్షులు స్వామీ? వాని పక్షులని నిరసింపరాదు. నారద వాక్యంబునం జేసి మేము వాని నడిగితిమి. ఇప్పుడు మీరు మీపక్షము నిలువఁబెట్టక యుపేక్షించితినని నా యపఖ్యాతి స్థిరంబై యుండఁగలదు. ఈవార్త దేవలోకము లన్నియు వ్యాపించియున్నది. ఇప్పుడు మీరా పక్షులకడకువచ్చి ముచ్చటించి యెట్లో యాతీరుపు మాపుజేయించుకొనవలయునని గట్టి పట్టుపట్టిరి.

జయంతు డొకింత విచారించి కానిండు ఆయండజము లేపాటి పాండిత్యము గలవియో చూచెదంగాక. నన్నుఁ దప్పుపట్టుట కెట్టి సామర్థ్యమున్నదియో పరీక్షించెదంగాక పదుఁడు పదుఁడు. దారిఁ జూపుఁడని కోపోద్దీపితమానసుఁడై యింద్రసూనుండు వారివెంట నాపిట్టలున్న చెట్టుకడకుం బోయి నిలువంబడుటయు నచ్చర లుచ్చస్వరంబునఁ బారావతశకుంతములారా! యిటురండు మహారాజకుమారుం డిందు వచ్చియున్నవాఁడని కేకబెట్టిరి.

అప్పులుగు లప్పులుకులు విని బెదరుగదురఁ గల్పతరుకోటరము నుండి చెచ్చెర నచ్చటికింజని జయంతునికి నమస్కరింపుచు దేవా? సెలవేమి? మీ దాసులము. కబురంపిన మే మేలిక పాదమూలమునకు రామా? మీ రిందేల రావలయునని యడిగిన నతండు కన్ను లెఱ్ఱఁజేయుచు మీరిందుఁబెద్దలై మాకుఁ దప్పులు దిద్దుచుండ మా యాజ్ఞకు బద్ధులై వత్తురా? కానిండు కుంకలు మీతగవరితన మేమియో చూచెదం గాక. నన్నుఁ గళామూఢుండని చెప్పితిరఁట యెట్లు? నాతప్పెందుఁ బరీక్షించితిరి? చెప్పుఁడని యడిగిన గడగడలాడుచు నా నీడజములు స్వామీ! రక్షింపవలయును.

గీ. తన్నుఁ దగవరిగాఁ గోరి ధర్మమడుగ
    నొదిగి మోమాటము వహించియున్న నిక్క
    మెఱుఁగఁజెప్పక యొకపక్షి మెఱిఁగి పలుకు
    నతండు నరకంబు జెందెడు నండ్రు బుధులు.

దేవా! పాపంబునకు వెఱచి మాకుఁ దోచిన ధర్మంబు చెప్పితిమి మాతప్పు మన్నింపుడు.

జయంతుడు - కుంకలారా! మీరెఱింగిన ధర్మమేదియో చెప్పుఁడని యడుగుచుండ నక్కవినయములు చూపెదరేల ?

పక్షులు -- మహారాజకుమారా ! మీకును నలకూబరునకు శృంగారకళావైదగ్ధ్యమందుఁ దారతమ్యం బెఱింగింపుమని యచ్చరలు మమ్ముఁగోరిరి.

జయం - మీరు మహావిద్వాంసులని మిమ్ముగోరినారు! సరే మీరు నాయందుఁ జూచిన లోపమేది?

పక్షు - దేవా! మీ రట్లలుకఁ జూపిన మాకేపలుకును రాకున్నది. శాంతము వహింపవలయును.

అచ్చరలు - తగవుచెప్పినట్లే యగుననుకొనిరా? ఈతండెవ్వడో యెఱుగుదురా? త్రిలోకాధిపతియైన మహేంద్రునిబట్టి ముందువెనుక వినురింపవలదా? ఇప్పు డాయన యడిగెను. నుడువులకు సమాధానము జెప్పుఁడు

పక్షు - మాకు నిజమనితోచిన ధర్మము చెప్పితిమి. తప్పేమి యున్నది?

జయంతుఁడు - ఓహో! మీ కడ నెంతతడవు నిలువవలయును? నా మాట కుత్తరమిండు. లేకున్న మిమ్మిప్పుడే యిందుండి గెంటింతు.

పక్షు - దేవా! మేము మీ యిద్దరి శృంగారకేళీవిలాసములును జూచితిమి.

జయం - ఏమి? దేవతామిథునములు గావించు క్రీడలు పొంచి చూచుచుందురా? మీరిం దెవ్వరి యాజ్ఞానుసారము వసించితిరి? మీరు చేసిన పని ధర్మమని యే శాస్త్రములోఁ జెప్పఁబడియున్నది? తొల్లి రతిరహస్యదర్శకుందగు బార్వతి శపించినది యెఱుఁగుదురా?

పక్షు - దేవా ! మేము కామ్యవృత్తిఁ దత్ప్రచారమునఁ జూచి యుండ లేదు. తత్వనేతృత్వమునకై యరసితిమి. అదియునుంగాక మేము విజాతులము.

జయం - ఇప్పుడు మేము విజాతుల వలననే నీతులు వినవలసి వచ్చినది. కానిండు. ఆ తప్పు పిమ్మట విచారింతము గాక! నా యందేమి లోపము జూచితిరి?

పక్షు - దేవా ! వినుండు.

సూ. సంప్రయోగపరాధీనత్వాత స్త్రీపుంసయో రూపాయమపేక్షతే యని వాత్స్యాయన మహర్షియు.

శ్లో॥ రతిశాస్త్ర పరిజ్ఞాన విహినాయే నరాథమాః
     తేషాంరతి శ్వానవత్స్యాల్ నరతే స్సుఖమన్ను తే
     రతెః సుఖస్య జ్ఞానార్ధం కామశాస్త్రం సమభ్యసేత్
     జ్ఞాత్యాకర్మాణికుర్వీత తత్రానందోభవె ద్ద్రువం
     తన్న కుర్వంతియే మూఢాః వానరాః పశవః స్మృతాః

శ్లో॥ జాతిస్వభావ గుణదేశజ దర్మచేష్టా
     భావేంగి తేష వికలొ రతితంత్రమూఢః
     లబ్దాపిహిస్ఖలతి యౌవన మంగనానాం
     కిం నారికేళ ఫలమాప్య కపిం కరోతి

అని యితర పండితులు రసమునకుఁ గూడ శాస్త్ర మావశ్యకముగాఁ దెలిసికొనవలసినదని జెప్పియున్నారుకదా?

జయం - అట్లు కాదని యెవ్వరన్నారు ?

పక్షు - దేవా! మీరట్టి శాస్త్రము నతిక్రమించి యభీష్టక్రీడావృత్తులచే నొప్పితిరి. నలకూబరుండు తచ్ఛాస్త్రము ననుసరించి యరిగె నందుల కట్లు మాకుఁ జెప్పవలసి వచ్చినది.

జయం - నే నెందుఁ దప్పితినో చెప్పమని యడుగుచుండ నేమేమో ప్రేలెదవేల?

పక్షు -- దేవా వినుండు

శ్లో॥సతీ మనసి తన్వింగి సఖి ప్రాగపివర్తతే
     స్తనవక్త్రం విశాలాక్షి యత్తే శిఖిపదాంకితం

దంతనఖాంకాదుల కాయాస్థానంబులు శాస్త్రంబున నిరూపింపబడి యున్నవిగదా! దాని నతిక్రమించి మీరు వర్తించితి రింతకన్న నేమి జెప్పఁగలము గన్నులారఁ జూచితిమి.

జయం కుంకలారా! ఇదియా మీరు పెట్టినవంక చాలు చాలు. మీరెన్ని శాస్త్రములు జూపితిరి.

సూ. ప్రవృత్త రతిచక్రాణాం నస్థాన మస్థా
      సంవా విద్యత ఇది సువర్ణనాభః

అని యున్న సూత్రమును జదివిన నిట్లాక్షేపింపక పోపుదురే? బుద్ధిమాలిన యచ్చరలు వచ్చి మిమ్మడిగినంతనే మా కేమియుం దెలియదనక మహాపండితులవలె న్యూనాధిక్యవివక్ష దెలియం జేయుట మీది తప్పు నందనవనవాసము వలన నాలుగు శ్లోకము లెట్లో చదువఁ గలిగిరి. అంత మాత్రముననే సర్వజ్ఞత్వము ప్రకటించుకొన వలయునా? మీ యందు రెండు తప్పులు గనంబడుచున్నవి. పొంచి యుండి బరులక్రీడలఁ జూచుట యొకటి లెస్సగాఁ దెలియక తగవు జెప్పుట యొకటి యీ యపరాధద్వయమునకై మిమ్ము శపించుచుంటి మీరీ కల్పకోటరవాసమున కర్హులుకాదు. పో. పొండు. పరకామప్రేక్షణంబునఁ జేసి చిరకాలవియోగము వహింతురుగాక. అధర్మకథనంబున భూలోకకాంతారముల భ్రష్ట్రులై సంచరింపుదురు గాక.

అని శపించిన విని యా పక్షులు రక్షింపుమ రక్షింపుము మేము ఎఱింగి పక్షపాతము చెప్పలేదు. నారదమహర్షి మాటదలంచి యీ తగవరి తనములకుఁ బూనికొంటిమని యెంత బ్రతిమాలుకొనినను జయంతుని యలుగు దీరినదికాదు. ఆ ప్రాంతపాదపము క్రిందఁ దపము జేయుచు నా సంవాదమంతయు నాలించుచున్న యొక సిద్దుండు క్రుద్ధుండై యోరీ! యింద్రపుత్రా! మహైశ్వర్యగర్వంబునం జేసి నిరవద్యవిద్యాక్షేత్రములగు పారావతపతత్రముల నిష్కారణము దారుణశాపపాత్రములఁ జేసితివే? అప్పులుగుల పలుకులయం దేమి లోపమున్నది? నీ వింద్రసూనుడవని పక్షపాతము జెప్పవలసినదియా! మీ యిద్దరి కళావైదగ్యములకుఁ దారతమ్య మెఱిగింపుమని యడిగినప్పుడు క్రీడారహస్యములు నరయుట తప్పా? తప్పంతయు నీయందే కనుపించుచున్నది. వ్యాధుండవలె దయమాలి పక్షి హింసకుండ వైతివి కావున నీవు పుడమిఁ గిరాతకుండవై యుదయింపఁగలవని జయంతుని శపించెను.

ఆ శాపాక్షరములు విని యచ్చెరలెల్ల హా హా కారములు కావింపుచు నక్కటా! ప్రణయకలహములు ప్రళయకలహములై ప్రభుపట్టి నాపద పాలుసేసినవే? అయ్యయ్యో! ఇప్పుడేమి సేయఁదగినదని పరితపించుచుఁ గొందఱు సిద్ధునిఁ బ్రార్థించుచుండిరి కొందఱు మహేంద్రునొద్దకుఁ బోయి యార్తనాదములతో నా వృత్తాంత మెఱింగించిరి.

అప్పు డాఖండలుండు గుండెలు బాదుకొనుచుఁ బాదచారియై నందనవనంబున కరిగి తలవాల్చికొని చింతాక్రాంతస్వాంతుండైయున్న జయంతకుమారుం గాంచి పట్టీ! ఆ పిట్టలజోలి కేమిటికి పోయితివి? ఆఁడువాండ్ర తగవునకుఁ బూచికాని రానేల? శృంగారలీలలలోఁ బాండిత్యము లేకున్న వచ్చిన కొదువయేమి! ధైర్యమా సాహసమా! వితరణమా! ఏదో బుద్ధిమాలిన పక్షు లాక్షేపించినవనిం వానిం దిట్టనేల? తప్పు చేసితివని పుత్రు నిందింపుచుఁ జేయిపట్టుకొని లాగికొనిపోయి యాసిద్ధు నడుగులం బడవైచి యిట్లనియె.

సీ. మూఁడులోకములకు ఱేఁడనైతగు నాకు
               ఘనతపంబునఁ గలిగిన సుతుండు
    శచికన్నబిడ్డ యాసక్తి దిక్పాలుర
               చేతులఁ బెరిగిన చిన్న కుర్ర
    బహురత్న కిరణ భాస్వత్సౌథవీధుల
               విహరించు సుకుమార విగ్రహుండు
    పారిజాతాది కల్పద్రుమోజ్వల నంద
               నారామమునఁ గ్రీడలాడు పట్టి
గీ. పుడమి నెట్లు కిరాతుఁడై పుట్టి ఘోర
    కాననములందు మృగ ఘాతురత్వకలన
    జీవనము సేయువాఁడొకో చెప్పుమయ్య
    యనఘ? పూవులరాశిపై నగ్ని నిడుదె?

చ. కరుణవహించి వీని నిటఁ గావుము సిద్ధవరేణ్య! నాదు పె
    ద్దరికము జూచియైనఁ గడుతప్పొనరించె నితండు నందనాం
    తరముల నుండు పక్షులను ధాత్రిజనింపఁగఁ దిట్టెనే కృపన్
    వరములనిత్తు వానికి శుభంబులు గ్రమ్మరఁ జెందునట్లుగాన్.

.

వీనిపాపంబు గ్రమ్మరించి నాకు బుత్రదానంబు గావింపుమని వేడుకొనుటయు నా సిద్ధుండు మహేంద్రా! నా శాపం బమోఘము. నీకొడుకు పుడమిఁబుట్టక తప్పదు. మరియు నిన్నుఁజూచి యా శాపంబునఁ గొన్ని మార్పులు గావింతు వినుము. మహారాజవంశ ప్రసూతుండై కిరాతకులజుండని కొంతకాలము వాడుక పొంది యుండును. మహారణ్యమధ్యంబున వసించియు నీజయంతముకన్న శోభావంతములగు సౌధాంతరముల మెలంగఁగలఁడు. స్వల్పకాలంబునఁ జెఱసాల నుంపఁబడియు బాహుబలంబున ననన్యసామాన్యుఁడని ప్రఖ్యాతి వహింపఁగలడు. స్వర్గభ్రష్టుండయ్యె నను మాటయేకాని యింతకన్న నెక్కువ భోగముల ననుభవింపఁగలడు. దివ్యకాంతావియోగంబు వహించెనను మాటయేకాని యింతకన్న మిక్కిలి చక్కఁదనముగల రాజపుత్రికలంగూడఁగలఁడు. మఱియు నీఖగంబులు వియోగకాలంబున వీనికి వినోదములు గలుగఁజేయుచుండును. వీని సంయోగకాలమే యితని సుఖానుభవకాలము. అని వరంబులొసంగి యా సిద్ధుండు మహేంద్రుని సంతోష పెట్టెను.

కథ కంచికిబోయెను, నే నింటికివచ్చితిని. ఇంతియే నాకు వచ్చునని యా పక్షి యెఱింగించినంత నాలించి యాయించుబోఁడి తత్పూర్వోత్తరసందర్భము లన్నియు హృదయంబున ననువదించుకొని విస్మయసంతోషపరాధీనమానసయై యొహోహో! ఈ శకుంతములు వింతలపై వింతలు దెలిపినవి. యేమి? నా భాగ్యము! తరువాయి కథావృత్తాంతము చెప్పకయే స్పురింపుచున్నది. ఆ పారావతశకుంతములే యీ పక్షులు. ఆ జయంతుఁడే రాజవాహనుఁడు. అని యాలోచించుచు సంతోషాతిశయంబున నాట్యముజేయఁ దొడంగినది.

రాజవాహనుండు కిరాతకుమారుండు కాఁడు. రాజపుత్రుఁడని యెఱింగినప్పుడు వివశయైపోయిన జవరాలు జయంతుని యవతారమని వినినప్పుడెట్టి ప్రహర్షము వహించునో యూహించుకొనవలసినది.

అంతలో రాగవతివచ్చి అమ్మా! అదేమి? వెఱ్ఱిదానివలెనట్లు చిందులు ద్రొక్కుచుంటివేల? రాజవాహనుఁడు ఈపక్షిం దెచ్చిన పుళిందవృద్ధునితో మాట్లాడి తన యింటియొద్ద వార్తలువిని జయపురంబున కరుగఁ దొందరపడుచున్నాఁడు. నీతోఁ జెప్పుమని నన్ను పంపెనని చెప్పినది. అదివోయి యాతని వెంటఁబెట్టుకొని వచ్చినది.

కల్పలత యతని నుచితాసనాసీనుం గావించి మహారాజకుమారా! మీయింటి వార్త లేమి వింటిరి? ఎఱింగింపు డనుటయు నతండు మాతండ్రి మద్వియోగమునకు వగచుచుఁ బులుగుజంట విడఁదీసినందులకై తనకీ యఘ మంటినదని నిశ్చయించి మా విహంగమంబు నీకడ కంపిరటకాదా? మీ యభీష్టమే నెరవేరినదిగదా. అది యట్లుండె నేను మధువర్మచేఁ జెర పెట్టఁబడితినని విని యాగ్రహగ్రస్తచేతస్కుండై శబరసేనలం గూర్చుకొని జయపురంబు ముట్టడింపనరుగుచున్నాఁడట. నేను బోయి వారికి, దోడ్పడ వలయును. అనుజ్ఞ యిమ్ము. మా పతంగ మెందున్నదియో చూపుము. ముద్దుపెట్టుకొని పోయెదనని పలికిన విని రాజపుత్రి యిట్లనియె.

మనోహరా! మీ పెంపుడుఖగమును భార్యతోఁగూర్పక యెట్లుపోయెదరు? అందులకు నేఁడు మంచిదైనదికాదు. రేపు సుముహూర్తముంచితిమి ఆ శుభము జూచిపోవుదురుగాక. మీరరుగకున్న నున్నవారు వైరులఁ బరిమార్పఁజాలరా? మీ తండ్రిగారి పరాక్రమము సామాన్యముగాదు, మీరిందువచ్చినందులకు సత్కారమైనఁ జేయలేదు. ఈ రెండుదినంబులు వసించిపోవుదురుగాక అని శృంగారలీలావిలాసములు ప్రకటించుచుఁ బ్రార్థించుటయు నతం డేమాటయు బలుకనేరక యూరకుండెను.

అని యెఱింగించి యవ్వలికథ దరువాతి మజిలీయందుఁ జెప్పందొడంగెను .

185 వ మజిలీ

రాగవతి - అమ్మా! నీవింత యాలసించితివేల? యెక్కడికిఁ బోయితివి.

అశోకవతి - పుత్రీ! నే నెప్పుడు బయలు వెడలితినో కాని యేకార్యము కొనసాగినది కాదు. వినుము. ఆదిత్య వర్మయను పండితవీరుని సహాయమున దొలుత దుందుభియొద్దకుఁ బోయితిని. అందెవ్వరుఁ గనంబడలేదు. వాని చెల్లెలు శ్రమణి దారిలో రామచిలుక యొద్ద శకునము లడుగుచుండఁ గనంబడినది మే మందరము గలసి జయపురంబున కరిగితిమి. అంతకు ముందే రాజువాహనుడు కారాగారమునుండి పారిపోయెనఁట. శ్రమణి పురుషవేషము వైచికొని నప్పుడు అచ్చముగా రాజవాహనునివలె నుండెను. గుఱ్ఱమెక్కి వీథి నరుగుచుండ నామె రాజవాహనుఁడని రాజభటు లాటంకపరచి పట్టుకొనఁబోయిరి. వారితో బెద్దయద్దము జేసినది. ఆదిత్యవర్మయు, శ్రమణిని వరించి వెనువెంట వచ్చిన సునందుఁడను రాజపుత్రుఁడును ఆమెకుఁ దోడుపడి రాజభటుల నెల్లఁగాందిశీకుల గావించిరి.

అప్పుడు పట్టణ మంతయు నల్లకల్లోలమై శత్రువులు ముట్టడించిరని భయపడుచు నలుదెసలకుఁ బారఁ దొడంగెను. మధువర్మయు మందపాలుఁడు అసంఖ్యాకములైన తమ సైన్యముల నానగరము జేర్చియుంచిన కతంబున నేల యీనినట్లురాజభటులు నగరమంతయు వ్యాపించి మనవారితో ఘోరముగఁ బోరు గావింపుచుండిరి.కోటానకోటలుగానుండు రాజభటులనెల్ల సాగరమును మంధరమువలె నీ మువ్వురుసంక్షోభము నొంద జేసిరి. ఆదిత్యవర్మకును సునందునకును వాహనములులేవు తగిన యాయుధములు లేవు. శ్రమణి మాత్రమే యశ్వారూఢయై పోరుచుండెను. మూడుదినము లేకరీతి సాంపరాయము జరిగినది. శత్రుణరాధిక్యము వలన నిలువఁజాలక యాదిత్యవర్మ యెట్లో తప్పించుకొని దాటిపోయెను. శ్రమణియు నలసి యే మూలకో పారిపోయినదని విన్నాను. సునందుఁడు శత్రువులచేఁ బట్టువడియె. ఇంతవట్టు చూచి యందుండిన నన్నుఁగూడఁ పట్టికొందురని భయపడి పులిందునకు మఱియొక వర్తమానము బంపి నేనిందు వచ్చితిని. శత్రువుల బలాబలములఁ దెలిసికొనకుండ నా యూరుపోవుట తప్పు