Jump to content

కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/183వ మజిలీ

వికీసోర్స్ నుండి

రాజ - అశోకవతి మీతో నేమని చెప్పినది ?

కల్ప - అది వచ్చిన తరువాత నే మన్నదో మీ యెదుటనే యడిగెదను గదా?

రాజ - అంతవఱకు నన్నాగమనియెదవా యేమి?

కల్ప – ఆగకున్న మీ చెల్లెలి నేర్పరితన మెట్లు తెలియగలదు. అది తప్పక ఱేపు వచ్చును.

అని పరిహాసవచనము లాడుచు వారచూపుల నతని రూపవిలాసము లరయుచు నప్పు డాపతంగమును దెప్పించి యిదిగో! మీ శకుంతపత్ని ఉబుసుబోకున్న దీనితో ముచ్చటింపుచుండుడు. అని పలికెను.

అప్పు డతం డాపతంగమును జేతిఁబట్టుకొని దువ్వుచు ముద్దు పెట్టుకొనుచుఁ బతంగమా! నీ పతి మాయొద్ద నున్నవాడు. నిన్నక్కడకు దీసికొని పోవుటకుఁ గల్పలత యాజ్ఞ వచ్చినది వత్తువా? అని యడిగిన నది యేమియు మాటాడినది కాదు. అప్పు డతండు నీడజమా? మీ జోడు విడఁదీసితిమని కోపమా? పశ్చాత్తాపముఁ జెందుచుంటిమిగా? మీ జోడులు గలుపుటకే ప్రయత్నించుచుంటిమి. నీ భర్త విజయపాలుని కథ సగముఁ జెప్పి తక్కినది నీకుఁగాని తనకు రాదని చెప్పెను. తత్కథావిశేషము వినుటకు మా కుత్సుకముగా నున్నది. ఎఱింగింపుమని కోరుటయుఁ గల్పలత మీరు విన్న విజయపాలుని గథ ముందు నా కెఱింగింపుడు. తరువాతి కథ మా పత్రకథ మెఱింగించునని పలికినది. రాజవాహనుఁ డాకథ సంక్షేపముగా రాజపుత్రిక కెఱింగించెను.

అయ్యుదంతము విని కల్పలత లజ్జాసంభ్రమాశ్చర్యములతోఁ గూడికొని నవ్వుచు ముద్దులమూటా! నా మాట మన్నించి యా కథావిశేష మెఱింగింపుము. నాకును విన వేడుక యగుచున్నదని యడిగిన నావికరవరం బిట్లనియె. దేవీ ! ఈ వీరుఁ డుండ నా కథ విశేష మెఱింగింప. నీ వొక్కరితవు గూర్చుండుము. చెప్పెద ననవుఁడు రాజవాహనుండు రాజపుత్రీ! మా పతత్రము నీ చెవులో నేదియో చెప్పుచున్నది. మేము వినరాని మాటయా? అని యడిగిన నప్పడతి మావరాలపేటి మీ ముందర నా కథ జెప్పుటకు మోమోటపడుచున్నది. దాని వలన నే విని మీకెఱింగింతు నా తోఁటలో విశ్రమింపుఁడన పలుకుటయు నతం డట్లు కావించెను. అవ్విహంగమం బాయంగనామణి కాకథావిశేష మిట్లు చెప్పం దొడంగెను.

183 వ మజిలీ

పుళిందుని కథ

శ్లో. సారమ్యా నగరి మహా నృనృతితి స్సామంత చక్రంచతత
    పార్శ్వే తస్యచ సా విదగ్ధ పరిషత్ తా శ్చంద్రసంబాధనాః

    ఉద్వృత్త స్సచ రాజపుత్ర నినహస్తే నందిన స్తాః కథా
    సర్వం యస్య వశా దగాత్ స్మృతిపథంకాలాయ స్మైనమః.

దేవీ! విను మా విజయపాలుండు కటారిచే భార్యం బొడిచి యాత్మహత్యఁ జేసికొనవలయునని తానుగూడఁ బొడిచికొనెను. కాని యావ్రేటు తప్పుటచే నంతలో నతనికి జీవితాశ జనించినది. తటాలునలేచి ప్రచ్ఛన్నమార్గంబున ? గోటఁ దాటి యవ్వలఁబడియొక యరణ్యమార్గంబునం బోవుచు సుమతిం దలంచికొని ఆహా! సర్వసుగుణసాగరుండవు. ప్రాణదాతవగు నిన్ను నాఁడుదానిమాట నమ్మి యవమానపఱచిన మహాపాపాత్మునకు గృతఘ్నునకు రాజ్యసుఖంబులేల దక్కెడిని? నేను మహా నరకంబులఁబడి ఘోరయాతన లనుభవింపవలసినవాఁడ నే నప్పుడు చావక యేమిటికి బ్రతికితిని? ఎందు బోవుచుంటిని? నాకు గమ్య స్థానమేది? అని యనేకప్రకారములఁ దలపోయుచుఁ బరితపించుచుండెను.

మఱియుఁ గనంబడిన చెట్టుపండ్ల భుజింపుచు వనఝరీజలంబులం గ్రోలుచు క్షుత్పిపాసల నడంచుకొని యొకవనమునుండి మఱియొక వనంబునకుం బోయి పోయి క్రమంబున నుత్తరదేశారణ్యంబులం బ్రవేశించెను. మఱియు,

సీ. ఒకమాటు బాహుబలోద్దతి వైరులఁ
               జెండాడి రాజ్యంబు సేయఁదలఁదు
    నొకసారి మునివృత్తి బూని కానలలోన
              నకలంకతపము సేయంగఁ దలఁచు
    నొకతేప భక్తిసంయుక్తిధాత్రిఁ దనర్చు
              తీర్థంబు లెల్లను దిరుగఁ దలఁచు
    నొకపరి ప్రబలసమున్మత్తవృత్తియై
              మృగములవలెఁ గాన మెలఁగఁ దలఁచు
గీ. సుమతి కడకేగి యతని పాదముల వ్రాలి
    తప్పు సైరింపుమనుచుఁ బ్రార్ధన మొనర్ప
    నెంచు నొకసారి మఱియిన్ని యేల యకట!
    చచ్చుటయే మే లటం నొకసారి యెంచు.

గీ. భూరిసామ్రాజ్యవైభవస్ఫూర్తు లెల్లఁ
    బోయె బంధువు లాప్తులు బోయి రకట!
    యిట్టు లేకాకినై పోవు టెటకొ యహహ!
    బ్రతుకఁ దలచుట తలఁప నద్భుతముగాదె.

ఛీ! నా జీవితము కన్నఁ దుచ్చిమైనది పుడమి మఱియొకటిలేదు. కృతఘ్నత్వకల్మషము వాయ భృగుపాతంబున శరీరంబు విడిచెదనని నిశ్చయించి యొకనాఁ డొకపర్వతకూటంబున నిలువంబడి భగవంతుని ధ్యానించుచు విశాలశిలాతలంబు గుఱి చూచుచున్న సమయంబున నందుఁ దపంబుసేసికొనుచున్న యొకసిద్ధుం డతనియుద్యమంబు గ్రహించి.

క. వలదు వల దుడుగుమీ నృప
    బలవన్మరణంబు మిగుల పాతక మని పె
    ద్దలు సెప్పఁగ వినవో య
    వ్వలి పుట్టుక బ్రహ్మ దానవత్వము గలుగున్.

గీ. ఏమి వచ్చె నీకు నిట్టు లూరక మేను
    విడువ నిన్నుఁజూడక విభుఁడవట్లు
    కానుపింతు కొంత కాలంబునకు నైన
    బ్రతికి యున్న సుఖము బడయరాదో.

అట్టి మాటలు విని యా నృపాలుండు నలుమూలలు చూచియెవ్వరింగానక యది యాకాశోక్తిగాఁ దలఁచి యా యుద్యమంబు మాని పర్వతము దిగినడుచువాఁడు. ముందట.

క. గురుతర కంటకవల్లీ
    పరివృతమై సింహ శరభ భల్లుక హరి సూ
    కర శార్దూలాది భయం
    కర మృగతతి వితరమైన కానన మెదుటన్ .

కనుంగొని యించుకయైన మనంబున వెఱవక యొక తెరవునం బడి నడచుచుఁ గ్రూరసత్వంబుల యార్పులు విని భయపడక యెదురైన శార్దూలాది క్రూరసత్వంబుల నదలించుచుఁ బోయి మధ్యాహ్నం బగుడు తీవ్రాతపసంతాసక్లేశంబు సహింపనేరక మేనఁ జెమ్మటలు గ్రమ్మ నలయికదీర నొకచెట్టుక్రిందఁ బండుకొని గాఢముగా నిద్రఁబోయెను.

సీ. పలురంగు లమరు పిట్టల పక్షపింఛము
                ల వతంస కుసుమంబులందుఁ జేర్చి
    కరి కుంభ లబ్ధ ముక్తామధ్యఘటితోరు
                కురువిందముల్ మెరయఁబూని
    లలిత పల్లవకోమలములైన వల్కలాం
               శుకములంగీలు దుస్తులు ధరించి
    నవరత్నమయ కంకణలలాటికాంగది
               రళనోర్మికాద్యాభరణములూని
గీ. యుత్తమతురంగమం బెక్కి యొక నిషాద
    కన్య యాదారి శరకార్ముకములఁ దాల్చి

    వచ్చె మృగయావినోద లంపట మనీష
    శబరకులవీరు లుభయపార్శ్వమ్ముల నడువ.

శృంగారవీరరసంబులు మూర్తీభవించినట్లు మెఱయుచు నప్పుళిందకన్య యాదారిం బోవుచు నా చెట్టు నీడ గాఢనిద్రావశంవదుండై యున్న యన్నరేంద్రపుంగవుం గనుంగొని వెఱఁగుపాటుతోఁ దన గుఱ్ఱమును నిలిపి తదీయరూపరేఖావిలాసము లాసక్తిం బరీక్షించి యతండొక చక్రవర్తియని నిశ్చయించి యట్టె నిలువంబడి చూచుచుఁ దన పరిజనులచే నతని మేని చెమ్మటలు వాయఁ గొంతసేపు విసరించినది. చల్లనినీరు మోముపైఁ జల్లించినది.

అప్పు డతండు మేను జల్లఁబడ హాయి హాయి యని పలుకుచు మెల్లన లేచి నలుమూలలు చూచి తన కుపచారము సేయుచున్న కిరాతభటుల పరికించి మీ రెవ్వరు ? ఇందేల వచ్చితిరని యడుగుటయు వాండ్రు సామీ! మీ మాయమ్మ పరిజనులము. ఆమెతో వేటకై యీ యడవికి వచ్చితిమని చెప్పుచుండ నొకదెస నసదృశరూపయౌవనవిలాసములచేఁ బ్రకాశింపుచుఁ దురగారూఢయై యున్న యాయన్నుమిన్న గనంబడుటయు నతం డాశ్చర్యవిస్ఫారితేక్షణుండై యట్టెలేచి యా చకోరాక్షి సమక్షమునకుం బోయి,

క. పరనాథకన్యకవొ కి
   న్నర విద్యాధర సుపర్వ నాగాది వియ
   చ్చర కన్యకవో నీవో
   తరుణీ వివరింపు మది ముదంబు వహింతున్.

నీరూపంబు త్రిభువనమోహజనకంబై యున్నది. నీవేషంబు అటవికంబు నాగరకంబు సూచించుచున్నది నీ నివాసదేశం బేది? నీ తలిదండ్రు లెవ్వరు? నీ వృత్తాంత మెఱింగింపుమని యడిగిన నగ్గరిత దిగ్గున గుఱ్ఱంబు డిగ్గ నురికి వారువమును జేరఁబడియె. లజ్జావనతవదనయై తత్ఖలీనముజేతం బట్టికొని కదుపుచుఁ బురుషోత్తమా! నన్ను బెద్దగాఁ బొగడుచుంటివి. నేనొక వనచరకుమారికను, నన్ను ధేనుక యండ్రు. మాతండ్రికి మన్యప్రదేశమునఁ గొన్నిగ్రామములు గలవు. ఆ ఖేటనమే మాకు జీవనము. మా గ్రామ మిక్కడికిఁ బదియోజనముల దూరములో నున్నది. చిన్నతనమునుండియు నాకీ వేట యలవాటుఁ జేసియున్నారు. దానంజేసి యడవులం దిరుగుచుందును. నేఁటి రాకవలన మీ దర్శనమైనది. కన్నులకలిమి సార్థకమైనది. మీయాకారము ప్రభుత్వచిహ్నముల సూచించుచున్నది. ఈ మహారణ్యమధ్యంబునకుం బాదచారులై యేమిటికి వచ్చితిరి? మీ కులశీలనామంబు లెట్టివో వివరించి నాకు శ్రోత్రానందము గావింపుఁడని యడిగిన నమ్మహారాజు నానందముగా నిట్లనియె.

తరుణీ! అరణ్యకత్వము నీమాటలయం దెక్కడను గాన్పింపదు. నీ వాగ్నైపుణ్యము నీ విద్యాపాటవమును తెలుపుచున్నది. నిన్నుఁ జూచి భవదీయమధుర వచన సుధారసధారలు శ్రుతులం గ్రోలుటచే మదీయహృదయసంతాపము కొంతసేపు మరచితిని. నా వృత్తాంతము వినిన నీకునుం జింత గలుగక మానదు. అయిననుం జెప్పెద వినుము.

నేను విజయపుర నగరాధీశ్వరుఁడ. నా పేరు విజయపాలుడందురు. నేను న్యాయంబుగనే ప్రజలం బాలింపుచుంటిని. సుమతి యను మంత్రిపుంగవు నన్యాయముగఁ బరాభవించితిని. ఆ దోషంబున రాజ్యభ్రష్టుండనై యడవులంబడి తిరుగుచుంటి. నేను మహాపాపాత్ముండ. నాకు మరణమే శరణమని తనయుదంత మంతయుం జెప్పి పరితపించెను.

అప్పు డాసుందరి యశ్రుబిందువులు కన్నులు రాల విచారించుచు మహారాజా! గొప్పవారలకే యాపదలు. నల హరిశ్చంద్రాదులు పడిన యిడుములు వినియుండలేదా? ఆపదలు కాపురములు సేయవని యాకాశవాణియే మి మ్మోదార్చినది గదా! మీరు మా గ్రామంబునకు రండు. మా తలిదండ్రులు వృద్ధులై యున్నారు. వారికి నేనొక్కరిత కూఁతురను మీరందుండి సుఖముగాఁ గాలక్షేపము సేయవచ్చును. అని యేమేమో చెప్పినది.

ఆ చిన్నది మాట్లాడుచుండ దనవృత్తాంతమంతము మరచి యతండు ప్రహర్షముతో నాలించెను. మోహాంకురము హృదయంబునం నొడసూప నా చపలనేత్రను సవిలాసముగా జూచుచుండెను. మఱియు బాలా! నీవు కిరాతకులసంజాతనని చెప్పుచుంటివి. నా కేమియు నమ్మకము తోచదు. చిలుకయుం గోకిలయుంగాక కాకి సరసముగా బలుకఁగలదా! నీ మాటలు విన విద్వాంసురాలివలెఁ గనంబడుచుంటివి. ఈ యడవిలో నీకు విద్యలెవ్వరు నేర్పిరి? ఏమి జదివితివి? అని యడిగిన నయ్యువతి మహారాజా! మీరు మిగుల బడలికఁ జెందియుంటిరి. మాయింటికి వచ్చినతరువాత నన్నియుం జెప్పెద. మీ కొఱకొక తురగమును దెప్పించెద రండు అని పలుకుచుఁ బరిచారకు నొకనిఁ బంపి యొకగిరి కూటమునుండి ఘోటమును తెప్పించినది. ఇరువురు తురగము లెక్కి శబరులు పరివేష్టించి రా నుత్తరాభిముఖులై యరిగిరి. నడచునప్పుడు ధేనుక తన గుఱ్ఱము నతనిగుఱ్ఱమున కెడమప్రక్క నడిపించుచుండుటజూచి యారాజు తదాశ్రయము గ్రహించి పంచశరవిద్దహృదయుండై సరససల్లాపము లాడుచుండెను.

అతండు గుఱ్ఱ మెట్లు నడిపింప నాయువతియు నట్లు నడిపించును. విచిత్ర గమనంబులఁ దమతమ తురంగారోహణపాటవ మొండొరుల కెఱింగించుచుఁ గ్రమంబునం బోయి నాఁటిసాయంకాలమున కా పుళిందపురిఁ జేరిరి.

పుత్రికచే విజయపాలుని చారిత్రము విని కిరాతపతి యతిసంతోషముతో నతని కతిథిసత్కారములు గావించి యెక్కుడుగా గౌరవించెను. మఱియు గజదంత వినిర్మిత ద్వార కవాటకుడ్యంబై, విచిత్రమృదుమృగచర్మ నిర్మిత సమచ్చాదనంబై, మృగమదామోదమేదురంబై యొప్పు నొకమందిరం బతనికి విడిదిగా నిచ్చి యందుఁ బ్రవేశపెట్టెను. అతం డందుఁ బ్రవేశించి తదీయ రామణీయకమున కచ్చెరువందుచు నోహో! యీ కిరాతపతి యైశ్వర్యము మహారాజు మించియున్నది. వీని మాటలయందు వనేచరత్వ మేమియు గనంబడదు. శుద్ద శ్రోత్రియుండువలె, మహా విద్వాంసుఁడువలె సంభాషించుచున్నాఁడు. వీని చరిత్ర మెట్టిదో తెలిసికొనవలసియున్నదని యాలోచింపుచుండ నాభిల్లపతి యతని నికటమున కరుదెంచుటయు సముచిత సత్కారములు గావించి విజయపాలుం డిట్లనియె.

శబరేంద్ర! నాకు నిన్నుఁ జూచినది గోలెఁ గడుసంతసము విస్మయము గలుగుచున్నది. మృగప్రాయులగు వనచరులయందుఁ పెద్దపులులకువోలెఁ బౌరుషముండిన నుండవచ్చును. కాని యిట్టి వినయసంపత్తి, విద్యాగౌరవము, సంభాషణచాతుర్యము మొదలగు నుత్తమగుణంబులు మీకెట్లు కలిగినవియో తలంప విచిత్రముగా నున్నది. నేను రాజ్యభ్రష్టుండనై యడవుల పాల్పడి మతిచెడి తిరుగుచుండ భగవంతుఁడు నీ పుత్రికారూపంబున వచ్చి నీయండ జూపించె. నీ వాపద్బంధుండవై నన్ను మన్నింపుచుంటివి. ఇట్టి సుగుణసంపత్తిఁగల నీ చరిత్రము వినఁ బాత్రుండనేని యెఱింగించి శ్రోత్రానంద మాపాదింపుము మీయందు వనచరధర్మములేమియుఁ గనంబడవు.

అని యడిగిన నన్నిషాదాధిపతి సాదరముగా నిట్లనియె. మహారాజాఁ నాయుదంత మింతదనుక గోప్యముగానే యుంచితిని. నిన్నుఁజూడఁ జెప్పవలయునని బుద్ధిపుట్టుచున్నది. యాకర్ణింపుము.

చంద్రవర్మ కథ

నేను దక్షిణదేశమున మధురాపురంబున క్షీరస్వామి యను బ్రాహ్మణునికిఁ బుత్రుఁడనై పుట్టితిని. నాపేరు చంద్రవర్మ యండ్రు. మాతండ్రి నన్ను యుక్తకాలంబున నుపనీతుం జేసి బ్రాహ్మణకులోచితములైన విద్యలం గఱపుచుండెను. నాకుఁ గులవిద్యకన్న విలువిద్యయం దభినివేశ మెక్కుడుగాఁ గలిగినది. మల్లయుద్ధములో నన్ను మించువాఁడు లేకపోయెను. గుఱ్ఱపుపందెములలో నేను మొదటివాఁడనై పతకమును సంపాదించుకొంటి. నా వృత్తాంతము విని పాండ్యమహారాజు నన్నుఁ బిలిపించి నెలకు నూరుమాడలు వేతనమిచ్చి తన కొలువు సేయించుకొనుచుండెను. నేను యౌవనమున మిక్కిలి రూపవంతుడఁనని చెప్పుట స్వాతిశయోక్తిగా నుండును.

మా సంస్థానమున కెక్కడనుండియో భీమునివంటి మల్లుఁ డొకఁడు వచ్చి రాజదర్శనము జేసి తనబిరుదములన్నియుఁ జూపి గండపెండేర మిమ్మని కోరెను. మహారా జందుల కియ్యకొనక నన్ను వానితోఁ బోరుటకు నియమించెను. మామల్లయుద్ధము నగరిలో శుద్ధాంతప్రాంతోద్యానవనంబునం జరిగినది. నేను వాని నవలీల నెత్తివేసి వాని బిరుదములన్నియు లాగికొని యంపివేసితిని అప్పుడు ఱేఁడు నన్నుఁ బెద్దగా గౌరవించి పచ్చల పతక మొకఁటి నాకు గానుక నిచ్చెను.

ఆ రాజునకు వసంతమాలయను కూఁతురు గలఁదు. ఆ చిన్నది యంతఃపురమునుండి మా మల్లయుద్ధ మంతయుం జూచినది. పుష్పనారాచుని బారింబడిన డెందముతో మరునాఁ డొకయుత్తరము వ్రాసి పరిచారిక చేతికిచ్చి యనిపినది. అందు—-

అభినవప్రద్యుమ్నా! కందర్పుండు సౌందర్యంబున నిన్నుఁ బోలునేమో కాని నిర్వక్రవిక్రమంబున నీకు సాటిరాడు. మొన్నటి మల్ల యుద్ధంబున నీరూపము నీపరాక్రమము చూచితిని. అప్పటినుండియు నాడెందము నీయందు లగ్నమయినది . నీవే నాకు భర్తవు. నాకోరిక దెలిపినను నన్ను మా తలిదండ్రులు నీకిచ్చుట కంగీకరింపరు. ఎల్లుండి యర్థరాత్రంబున నీవు నగరాంతమున నున్న కాళికాలయము దాపున నుండవలయు. అశ్వంబెక్కి నేఁనచటికి వచ్చెదను. కలసి విదేశమేగి సుఖింతముగాక! అందులకు నీ వంగీకరింపవేని రజ్జుపాషాణవిషాదులచే మేను విడచుదాన.

ఇట్లు మీ పాదసేవకురాలు.

వసంతమాల.

ఆ పత్రికంజదువికొని నేనొక్కింతసేపు స్త్రీ సాహసమును గుఱించి వితర్కించుచు యౌవనమదావేశంబున నది నిషేధమని తలంపక యంగీకారసూచనముగాఁ బ్రత్యుత్తరము వ్రాసి యంపితిని. ఇంతకును భవితవ్యత యిట్లుండ నెవ్వరు దప్పింపగలరు? నేనును దలిదండ్రులకుఁ దెలియకుండ వస్తువాహనముల సవరించుకొని నాఁటి యర్థరాత్రమున కాయమ్మవారి గుడియొద్ద గుఱ్ఱమెక్కి పోయి యాయింతిరాక నరయు చుంటిని. అంతలో నాకాంతారత్నంబు నీలపటావ కుంఠనముతో నశ్వారూఢయై నేనున్న తావునకు వచ్చినది. గుఱ్ఱముడెక్కల చప్పుడు విని నేనామె దాపునకు నాగుఱ్ఱమును బోనిచ్చితిని.

ఆమె యేదియో గీచినంత నొక ప్రభ తళుక్కున మెరసినది. ఆవెలుఁగున నా మొగము జూచి యాచకోరనయన సంతస మభినయించుచు బదఁడు మీగుఱ్ఱమును ముందు నడిపించుఁడని పలికింది. అప్పుడు నేనొక మార్గంబునఁ దురగమును బోనిచ్చుటయు నాప్రక్క నక్కలికియు దనగుఱ్ఱమును జేర్చి నడిపించుచుండెను. దాని నే నెరిగిన దగట ఘోటకముల వేగముగా నడిపించితిమి. నేనెంత వేగముగా దోలిన నాలలనయు నంతవేగముగా నడిపించుచుండెను.

తెల్లవారువరకుఁ చాలదూరము పోయితిమి. ఒక తటాకము కడ గుఱ్ఱముల దిగితిమి. కాలక్రమనేమంబులం దీర్చుకొనివేళల అవనతవదనయై యాచంద్రవదవ మఱేమియి మాటాడక మారని వేచుచుండెను. వెండియు మేము గుఱ్ఱము లెక్కఁబోవునంతలో నాప్రాంతమందుండి యొకకోఁతి నాముందు నిలువంబడి యెక్కడికో రమ్మనమని సూచించినది. దానిసంజ్ఞ గ్రహించి నేను దానివెంటఁ గొంచెము దూరము పోయితిని.

అందొక లతాకుడుంగములో ప్రతతివిలాసములచేఁ జుట్టుకొనబడియున్న యాఁడుకోఁతిని నాకు జూపినది. నే నాసన్న గ్రహించి తటాలున బోయి కటారికొని నా లతాపాశంబులం గోసి యావానరిని విడిపించితిని. అప్పుడు మగకోఁతి యాఁడుకోఁతిని నాపాదములఁ బడవేసి నన్నుఁ గదలనీయక యాప్రాంతమున కెక్కడికోపోయి గడియలో నొక ఫలముఁ దీసికొని వచ్చి నాకర్పించినది.

దాని కృతజ్ఞత్యమునకు మేము మిక్కిలి యక్కజమందుచు నాఫల మిరువురము భుజించితిమి. క్షుత్పిపాసలు నశించినవి. ఆదివ్యాధులబాధ దొలఁగినవి. ప్రహర్షముతో వెండియు గుఱ్ఱము లెక్కి యుత్తరాభిముఖముగా నరిగితిమి. తెఱపిదేశముల కరిగిన నా భూపాలుఁడు వెదకి పట్టికొని శిక్షించునని భయముతో నరణ్యమార్గమునే పోయి పోయి కొంతకాలంబున కీకాంతారము జేరితిమి.

అందొక వరాహం బొక భిల్లపతి వింటిబారి తప్పించుకొని పారిపోవుచుండ నే నడ్డమై యొక్క వాడిశరంబున దానిం బడవేసితిని. అక్కిరాతపతి మదీయకరలాఘవమున కచ్చెరువందుచు సగౌరవముగా నన్నుఁ దన పల్లెకుం దీసికొనిపోయి సేనాధిపతిగాఁ జేసికొని తనయొద్ద నుంచుకొనియెను. నే నయ్యిందువదనతో గందర్పక్రీడల నానందించుచు భిల్లపతి చెప్పిన పనులు నిర్వర్తించుచు నధికవిశ్వాసముతోఁ బెద్దకాల మతనియొద్దఁ గొలువు సేసితిని. అతండు మృగవశ్యౌషధితంత్రములు మంత్రములు ననేకములు నాకుఁ దెలియజేసెను. ఆ నిషాధాధిపతి యపుత్రకు డగుటఁ జివరకు మరణకాలమున నన్నీ భిల్లరాజ్యమునకుఁ బట్టభద్రుంజేసి స్వర్గమునకు నిర్గమించెను.

నాకు మూఁడువేల సంవత్సరముల వయస్సున్నది. తత్ఫలభక్షణంబునం జేసి యింతకాలము బ్రతుకఁ గంటిమి. మాకు నేగురుకొమాళ్ళు పుట్టిరి. కాని విశ్వాసఘాతుకపాతకంబునం జేసి వంశము నిలిచినదికాదు. చివరకు మేమిద్దరమే మిగిలితిమి. ఈ వసంతమాల మా కౌరస పుత్రికకాదు. విను మే మొకనాఁ డటవికి వేటకుఁబోయి గ్రామములనుండి మదమెక్కి యొక యేనుఁగు యడవులలో సంచరించుచున్నదని విని దాని నిమిత్తము కొండలోయలన్నియు వెదకించితిని.

చివరకొక కోనలోఁ దిరుగుచున్న యమ్మతంగగజమును గనుఁగొంటిమి వీపుమీఁద నంబారీ యున్నది. అందొక తొట్టిలోఁ బండుకొని యీ బల తిత్తిలోని పాలు గ్రోలుచుండెను. వశ్యతంత్రంబున నేనా యేనుఁగను బట్టుకొని కట్టించి యంబారీలోని శిశువుం దింపి ముద్దుపెట్టుకొనుచు నింటికిం గొనిపోయి నా భార్య కిచ్చితిని అప్పటికి పట్టికి రెండేడుల యాయుష్య ముండునేమో? నాభార్యవద్ద బాలికను అమితమగు గారాముగాఁ బెరుగుచుండెను. క్రమంబున నా బాలికకు సంగీతము సాహిత్యము ధనుర్విద్య అశ్వగజారోహణ నైపుణ్యములోనగు విద్యలన్నియు మేమే నేర్పుచుంటిమి.

దానినిఁ దల్లి పుళిందిని యనియు నేను కలభ యనియు బిలుచుచుంటిమి. ఆ బాల తలిదండ్రులము మేమే యని తలంచుచు కాని యెక్కడనుండియో వచ్చితినని యెఱుఁగదు. ఎవ్వరును దానికీకథఁ జెప్పలేదు. మేము పుట్టిన బిడ్డకంటె నెక్కువ ప్రేమతో బెంచుచున్నారము. మఱియొక రహస్యము. వినుము ఈ శిశువును మా యింటికిఁ దెచ్చిన కొన్ని నెలలకు మహారాష్ట్రాధిపతియగు శ్రీమంతుని దూతలు కొందఱు మా యడవికి వచ్చి యంవాఠీతోనున్న యేనుఁగ యొకటి పారిపోయి వచ్చినది. ఈకాన నెందైనఁ గనంబడలేదుగదా అని యడిరిగి. వారివలన నా గజవృత్తాంతము దెలిసికొంటిని. ఈ బాల శ్రీమంతుని మనమరాలు. దీని జన్మదినోత్సవమునఁ దల్లితోఁగూడ నీబాల నేనుఁగ నెక్కించి యూరేగింపుచుండిరట.

నడుమ మద మెక్కి యా యేనుఁగు మావటీనింజంపి మీఁదనున్న రాజపుత్రికం బరిమార్చి పెచ్చు పెరిగి యెవ్వరికిం దొరకక కాలికొలఁది పారి పారి క్రమంబున మహారణ్యంబులం బడినది. "ఆయుర్మర్మాణి రక్షతి" అను నార్యోక్తి ననుసరించి యా బాలిక కాయుశ్శేషముండఁబట్టి యెట్లో బ్రతికి మాకు దొరికినది. మా బాల కిరాతపుత్రికకాదు. మహారాజ వంశ ప్రసూత. రాజదూతలకు నిజము జెప్పినఁ దీసికొనిపోవుదురను భయంబున మాకేదియుఁ గనంబడలేదని బొంకి పంపితిని. మహారాజా! ఇంతవరకు నీ రహస్యము లెవ్వరికిం జెప్పక గుట్టుగా నుంచితిని. మిమ్మప్పటికి జరాభారము పీడించుచున్నది. కొలఁదికాలములో దేహములు విడుతము. నీవు సమర్థుండవని నీకుఁ దెలియఁజేసితిని. సత్కుల ప్రసూతయగు మాకలభను నీవు భార్యగా స్వీకరించి యీ రాజ్యము పాలింపుము. భిల్లసేనలం గూర్చుకొని మీ రాజ్య మాక్రమించుకొనుము. ఇదియే మదీయవృత్తాంతమని యెఱింగించిన విని విజయపాలుం డపారవిస్మయపారావారవీచికలఁ దేలియాడుచు నతండు చెప్పినయట్లు చేయుట కంగీకరించాను.

శుభముహూర్తంబునఁ జంద్రవర్మ భిల్లరాజ్యముతో గూడఁ విజయపాలునకు గలభ నిచ్చి వివాహము గావించెను. మఱియు దా నెఱింగిన మంత్రతంత్రములన్ని నల్లునికిం జెప్పెను. మఱికొంతకాలమున కా దంపతులు నాక మలంకరించిరి.

విజయపాలుండు భిల్లపతియై దుందుభియని పేరుపెట్టుకొని భార్యతో గూడ ననంగకేళీలాలసుండై సంసారసుఖం బనుభవింపుచుండెను. నానావిధపశుపక్షి మృగంబులం బట్టితెచ్చి యాటపాటలు నేర్పి మహారాజుల కమ్ముచుఁ జాల ధనము సంపాదించెను. సుమతిం భరిభవించిన కృతఘ్నత్వదోషంబునంజేసి యతని కెన్నఁడును భిల్లసేనలం గూర్చుకొని జయపురరాజ్యంబు సంపాదింపవలయునను బుద్ధిపుట్టినది కాదు. అమ్మహారాజున కొక కుమారుఁడును కూఁతురుం బుట్టిరి. సుఖంబుననున్న వారు. కథ కంచికిబోయె నేనింటికి వచ్చితిని.

అని యా పతంగ మాకథాశేష మెఱిగించినది. కల్పలత ఆ వృత్తాంత మంతయును విని యద్భుతావిష్టమతియై యోహోహో! ఈ విహంగమంబులు చరిత్ర విషయంబులఁ గథలఁగా జెప్పుచున్నవి. రామచిలుక యెంత దెలిసినదో! కిరాతకుల మన్న చోట నెటు పెట్టినది. దుందుభియే విజయపాలుఁడట. ఎంత వింత, ఎంత చోద్యము! రాజవాహనుఁడు రాజబిడ్డఁడు. కానిచో నీ సౌందర్యము, యీ చాతుర్యము, ఈ పరాక్రమ మెట్లు కలిగెడిని ఇప్పటికి నామదింగల కళంకము వాసినది. పత్యక్షముగా మా తండ్రితోఁ జెప్పి వీనిం బెండ్లియాడవచ్చును. నా నోము లిప్పటికి ఫలించినవి నా పూనిక నెరవేరగలదు. అని తలంచుచు సంతోషాతిశయమునం జేసి యొక్కింతసేపు వివశయై పండుకొన్నది.

184 వ మజిలీ.

జయంతుని కథ

అమ్మా! పండుకొంటివేల? భిల్లపల్లెనుండి కిరాతశ్రీ యొక్కతె పంజరముతో నొక విహంగమును దీసికొనివచ్చి ద్వారమున వేచియున్నది. ఆ పక్షి మన శారదవలె నున్నది లోపలికిఁ దీసికొని రానా? అని రాగవతి యడుగుటయు నులికిపడి లేచి యా కలికి పక్షులం దెచ్చువారి నాకంట పెట్టవలదని యిదివరకుఁ జెప్పియుండ లేదా! వేగముపోయి తీసుకొనిరమ్మని యాజ్ఞాపించినది. రాగవతిపోయి దానితోనున్న వృద్ధకిరాతు నందుండమని పంజరముతోఁగూడ నా చేడియను లోపలికిం దీసికొని పోయినది

కల్పలత యా కిరాతవధూటిం జూచి యచ్చెరువందుచు సుందరీ! నీవెందలి దానవు? ఈ శకుంతము నెక్కడ పట్టితివి? ఎంతవెల కిచ్చెదవు ? అని యడుగుటయు నది తల్లీ! దీని నే నమ్ముటకుఁ దెచ్చినదాననుగాను, మా యేలిక దుందుభి పంపఁగా వచ్చితిని. దీని జోడుపక్షి, మీ యొద్దనున్నదఁట. ఆ జోడు విడదీయుటచే నా పాతకంబునఁ దనకొడుకుతోఁ గూఁతురితో వియోగము కలిగినదనియు నాపదలు తటస్థించినవనియుఁ దలపోసి దీని మీ కిచ్చి యా పక్షితో గలుపుమని నన్నంపెను. ఇది ముట్టినట్లు పత్రికవ్రాసి యిప్పింపుఁడు. అని చెప్పినంత ముప్పిరిగొను సంతసముతో నేమేమీ! ఈ ఖగము మా శారద భర్తయా? యోహో? నేడెంత సుదినము. ఆడఁబోయిన తీర్థ మెదురువచ్చినట్లు దీనికొఱకు నేను బ్రయత్నించుచుండ నిందే తెచ్చితివా? సంతోషము. అని దాని నభినయించుచు నా పంజరముతో నా పత్రరథమును తీసుకొని ముచ్చటించుచు నిట్లనియె.