Jump to content

కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/182వ మజిలీ

వికీసోర్స్ నుండి

మంతయు మాకు మా పతంగము జెప్పినది మధువర్మ జయపురమన నేదియో యనుకొనుచుంటిమి. ఆహా! ఈ సుమతి మహానుభావుండు. జితేంద్రియుండు. ఈ కథ సగముఁ జెప్పి మాగువ్వ యవ్వల తనకు రాదన్నది. తరువాయి చరిత్రము చాల భాగము నీవు చెప్పితివి. ఈ సుమతియే శత్రువులంగూడి విజయపాలుని మట్టుపరచెనని నే నంటిని. అతండు మహాగుణవంతుఁ డట్లు చేయఁడని మాయన్న వాదించెను. మా యన్న మాటయే గెలిచినది. ఇట్టి యుత్తముఁడు మన కాశ్రయుఁడై యుండ మన కార్యము నెరవేరుట కేమియు సందియము లేదని చెప్పుచు దిన్నఁగబోయి యతని పాదములకు నమస్కరించినది.

అభీష్టవరలాభసిద్ధిరస్తు అని యాశీర్వదించెను. ముసి ముసి నగవుతో శ్రమణి మహాత్మా ! నీ చరిత్ర మంతయు విని యుంటిమి. నీవు సర్వజ్ఞుఁడవు. హృదయాశయముల గ్రహింపఁ జాలుదువు. నీ యాశీర్వచన మమోఘమగు వరంబగు గాఁక. ఈ చిలుక మా యన్న విముక్తుఁ డయ్యెనని చెప్పినది. తద్విము క్తికి మీ రభయహస్త మిచ్చితిరఁట. ఇప్పుడు మన మందుఁ బోవుదుమా ? అని యడుగుటయు నతండు చిలుకపలుకుల కన్యధాత్వ ముండదు. ఈ సునందుఁ డందలి తత్వము దెలిసికొంటినని చెప్పెను. మీ యన్నకు నీకుఁ గూడ గులముమీఁద గీటుపెట్టినదట. ఆ విషయము ముందు విచారింతముగాక. ఇప్పుడు మనమందరముగలసి జయపురంబున కరుగుటయే యుచితమని పలుకుచు నాదివసం బం దుండి తానుగూడ జిలుక నొక పశ్న మడిగెను. అప్పుడు పృచ్ఛకు లంతవిశేషముగా లేమింజేసి యతని ప్రశ్నమున కాదివసమే యుత్తరము చెప్పినది

నీవడిగిన పురుషుఁడు సజీవుఁడై కుటుంబవృద్ధి గలిగియున్న వాఁడు.

ఆదిత్యవర్మ యా యుత్తరము విని సంతోషాయత్తచిత్తుఁడై యేదో తన డెందమున వింతకథఁ గల్పించుకొని యిట్లు జరుగునని యాలోచించుకొనియెను.

మీ ప్రశ్నమునకుఁ దగిన యుత్తరము వచ్చినదాయని యడిగిన శ్రమణితో నీ శుకము దైవమువంటిది. దీనిమాటలయం దొక్కటియు నసత్యముండదు. మీయన్న యీ పాటికి విముక్తుఁడై యుండు నందుఁ బోవుదమని పలుకుచు వారితోఁగూడ బయలుదేరి జయపురంబున కరిగెను.

182 వ మజిలీ

కనకలతిక కథ

దేవీ! కనకలతికా! పుడమిలో సౌందర్యవంతులగు పురుషులు లేరని నిరసించుచుందువు. మన చెఱసాలలోనున్న యువకునిం జూచిన భూలోకమును నిందింపవుగదా? కన – వసుమతీ! అట్టిసుందరుఁడు మన బందీగృహంబున కెట్లువచ్చెను? నీ వెట్లు చూచితివి?

వసు – నా చెల్లెలి మగనికిఁ జెఱసాలలో బని. మా మఱది నిత్యము భార్యయొద్ద నతని చక్కదనముఁ బొగడుచుండ నది నాతో జెప్పినది. మే మిద్దరము నిన్నఁబోయి చూచితిమి. ఆహా! అట్టి మోహనాంగుఁడు పుడమియందేకాక నాకసము నందుఁ గూడ మరియొకడు లేడని చెప్పగలను.

కన - చాలు. యువకు లందరు నీకుఁ జక్కనివారుగానే కనంబడు చుందురు. సౌందర్యమన నెట్టిదో నీ వెఱుంగుదువా ?

వసు - తల్లీ! నీకుఁ బరిచారికనై యా మాత్ర మెఱుఁగకుందునా? పెక్కేల? వాని నీవు చూచిన మూర్చనోవుదువు.

కన - (నవ్వుచు) భయపడియా యేమి?

వసు - భయపడియో. మోహపడియో.

కన - వాఁడు చోరుడై బద్దుం డయ్యెనా?

వసు - వాఁడు మానినీహృదయచోరుడు.

కన - మరియేమిటికి వానిం బట్టుకొనిరో ?

వసు - మధువర్మ మీతండ్రియగు మందపాలునివంటివాఁడు కాఁడు. కడు క్రూరుఁడు. పాపము వాఁడు గుఱ్ఱమెక్కి వీథిం బడిపోవుచుండ నది యపరాధమని బట్టించి చెఱసాలం బెట్టించెనఁట.

కన - వాఁడు శూరుం డంటివే? యెట్లు పట్టుపడెను?

వసు — అది దైవికము, వేయిమందినిఁ గడతేర్చి చేతినుండి విల్లుజారి పడుటచే దొరకెనఁట. కానిచోఁ బరమేశ్వరుఁడు వానింబట్టుకొనఁ గలఁడా?

కన - వాఁ డేకులమువాఁడు?

వసు - అద్భుతతేజము వాని మొగంబునఁ బ్రవహింపుచున్నది. క్షత్రియుడే కావచ్చును.

కన - వానిబంధువు లెవ్వరును లేరా?

వసు - ఆ వార్తలేమియు నాకుఁ దెలియవు. మా మఱఁది జెప్పిన నిన్నఁ బోయి చూచితిమి. పాపము వానిచేఁ బని చేయుచుండఁ జాలి పోడమినది.

కన - కడు పొగడుచుంటివి. నేను చూచుటకు వీలగునా?

వసు - మా మఱఁది నడిగి చెప్పెదను.

కన - వీరిదేశవిభజనము మాట యేమైనది ?

వసు – ఈదేశములో నుత్తరదేశము సారవంతమైనదట.. దక్షిణదేశము నిస్సారమఁట. ఇరువురు నుత్తరదేశమే కావలయునని తగవు లాడుచున్నారఁట. ఈ నడుమ మధువర్మకొడుకు దన కేదేశము వచ్చునని రామచిలుకను బ్రశ్న మడిగెనఁట. ఏదియు రాదు. నీవు రాజ్యభ్రష్టుండ వగుదువని చెప్పినదఁట చిత్రము వింటివా ?

కన - మేలు మేలు. లెస్సగాఁ జెప్పినది. అన్యాయముగా నీదేశ మాక్రమించినందుల కట్లు కావలసినదే. అని పలుకుచు నప్పుడే యా పరిచారికను మఱఁది యొద్ద కనిపినది.

అది వోయి వచ్చి దేవీ ! కారాగృహంబు కడు పరీక్షలతో నొప్పునఁట. మిము బోటివారు వచ్చిన శంకింపక మానరు. తదధికారి సెలవు లేనిదే క్రొత్తవారు లోపలకుఁ బోవఁగూడదఁట. మేము కూలివాండ్రవలెఁ బోయితిమి. నీవుగూడ రూపము మార్చి వచ్చిన రావచ్చునని నామఱఁది చెప్పెను. ఇందుల కేమనియెదవని యడిగిన నయ్యెల నాగ యిట్లనియె.

రూపము మార్చుటకు నాకేమియు సందియములేదు. నీదుస్తుల నాకిమ్ము. గట్టుకొని వచ్చెద. నెప్పుడు రమ్మని చెప్పెను? అనుటయు నవ్వసుమతి అమ్మా! బందీగృహాధికారి నాలుగుగంటలు కొట్టువఱకు నందుండును. పిమ్మట నుప్పరిగకుఁ బోవునప్పుడు రమ్మని చెప్పెనని యెఱింగించినాఁడు. కనకలతికకుఁ బరిచారికావేషము వైచి తన వెంటఁబెట్టుకొని యతం డెఱింగించిన వేళకు నబ్బందీగృహాంతరమునకుఁ దీసికొనిపోయినది.

సీ. మెడలఁ గాడి వహించి గడుభార మిడిన బల్
               రాతిబండ్లను బట్టి లాగువారు
    పెనురాతి తిరుగళ్ళ కొన గూర్చునినుప గు
               రుసుఁ బట్టికొని పిండి విసరువారు
    నునుమ్రానఁబూన్పు గానుగఁ లాగుచును గిర
               గిర నూనిగ్రక్కంగఁ దిరుగువారు
    ఇనుపసుత్తులఁ బూని పెనురాలు పగుల గం
               కర గొట్టి గుట్టలఁ గట్టువారు
గీ. తరులఁ గేదారములకు నేతాము లెత్తి
    తోయమును గాలువలు వారఁ దోడువారు
    నేర్పుమీరంగఁ బట్టలనేయువారు
    కార బంధింపఁబడినట్టివార లెల్ల.

అట్టి వారినెల్ల నాలోకించుచు నాలోలలోచనఁ గ్రమంబునఁబోయి పోయి యొక వసారాగదిలోఁ గూర్చుండి యేదియో ధ్యానించుచున్న రాజువాహనునింజూచి –

క. చూచి తలయూచి మే లా
    హా! చతురాననుని సృష్టిచాతుర్యం బా

    లోచింపఁగ నిర్మాణపు
    వైచిత్ర్యంబునగు నిదియె పారంబౌరా.

శా. ఔరా! చొక్కపుచెక్కుటద్దముల తళ్కాహా! లలాటంబు సిం
    గారం బద్దిర! లోచనాంచలత్కాంతుల్ బలే! వక్ష మ
    య్యారె! బాహువిలాసనటల్ బళిర! దేహచ్చాయమేల్‌కొనహో
    తారుణ్యంబు సెబాసు! పాదయుగనాంతర్యంబు మజ్జారె! హా!

అని పొగడుచు వసుమతీ! నీ వనిన నేమో యనుకొంటిని. ఇట్టి త్రిలోకాభిరాము మనోహరుఁగాఁ బడయురా మది గదా భాగ్యము! వీని విడిపింతుము మనకేమి పారితోషిక మిచ్చునో మెల్లగా నడుగుము. అని పలుకుచు వానిచెంతకుఁ బోయి వసుమతి మాటుగాఁ జేసికొని యోరచూపుల నతని సోయగముఁ జూచుచుండెను. అప్పుడు వసుమతి సౌమ్యా! మీ దేదేశము? తలిదండ్రు లెవ్వరు? దగ్గిరచుట్టము లెవ్వరున్నారు? ఈమె మా రాజపుత్రిక మీ బంధనవృత్తాంతము విని జాలిపడి చూడవచ్చినది. ఈమె తలఁచిన మిమ్ము విడిపింపఁగలదు. మీ వృత్తాంత మెఱిగింపుఁడని యడిగిన నతండు కనులెత్తి చూచి యిట్లనియె.

నేను పుళిందచక్రవర్తి కుమారుఁడ. నాపేరు రాజవాహనుఁ డందురు. కల్పలతయొద్దనున్న శారద పతంగనిమిత్తము మహేంద్రనగరంబున కరుగుచు దారి తప్పి యీ యూరు వచ్చితిని. గుఱ్ఱ మెక్కితినని యపరాధము నిరూపించి వీరు నన్నుఁ బట్టికొనిరి. నాచేతి విల్లుజారకున్న వీరిబల మెట్టిదో చూచి యుందును. మీ రాఁడువారు జాలిపడిన లాభమేమి? న న్నెట్లు విడిపింపగలరు? మీవాక్సహాయమునకే సంతసించితిని. నాకుఁ జాలమంది బంధువులు గలరు. ఈవార్త తెలిసిన వచ్చి యీ రాజు పీచమడంతురు. కాలమున కెదురుచూచున్నానని పలికిన విని వసుమతి యిట్లనియె.

రాజవాహనా! ఈమె నిన్నెట్లో కష్టపడి విడిపించును. ప్రత్యుపకార మేమి గావింతువు? నప్పు డతండు నా యావజ్జీవము కృతజ్ఞుండనై యుండెదఁ జాలునా?

వసుమతి - అట్లు కాదు. ఆమె ప్రాణమును నీవు పాలింపవలయునఁట. ఇందుల కేమందువు.

రాజ - సరిసరి. ఆమె పాలకుండ నగదును?

వసుమతి – తొల్లి రుక్మిణీదేవి తండ్రితో విరోధపడి శ్రీకృష్ణుని భజింప లేదా? అట్లేయని యామె యభిలాషపడుచున్నది.

రాజ - అట్లయిన లెస్సయే. అంగీకారము కాకేమి ?

అనుటయు సంతోషింపుచుఁ గనకలతిక తన మేని యాభరణములన్నియం దీసి సుమతికిచ్చి వీని నీమఱఁదికిమ్ము. ఎట్లయిన వీని నీరాత్రి విడిపించునట్లు చేయుమని పలుకుచుఁ దానింటికిఁ బోయినది ద్రవ్యమునకు సాధ్యముగాని పని యుండదు గదా! లక్షదీనారముల వెలఁగలయా నగ లన్నియు నందలి యధికారు లందరు పంచికొని యారాత్రి వాని విడిచివైచి వానిపేరున మఱియొక పురుషు నాగదిలోఁ గూర్చుండఁజేసి యాలోపముఁ దెలియకుండఁ జేసిరి.

రాజవాహనుఁడు వసుమతివెంట మెల్లగా నా చెఱసాలనుండి యీవలకు వచ్చెను. అప్పుడే కనకలతిక యంతఃపురమునకు రమ్మని కోరికొనినదికాని యతం డంగీకరింపక మఱియొకప్పుడు వత్తుననిచెప్పి యారాత్రియే యాపట్టణము దాఁటి మఱి కొన్ని దినంబులకు మహేంద్రనగరంబున కరిగెను.

రాజవాహనుఁడు జాముప్రొద్దువేళకు మహేంద్రనగరము జేరెను. ఒక వీథిం బడిపోవుచు రాజపుత్రిక సఖురాలు అశోకవతి యిల్లెక్కడ నున్నదియో నీవెఱుంగుదువా? అని వీథి బోవుచున్న యొక దాది నడిగెను. ఆదాది దాని నెఱిఁగిన దగుటఁ గోటకు బశ్చిమముగానున్న వీథిలో నూటపదకొండవ నెంబరుగల మేడ దాని యిల్లని గురుతు లెఱింగించి యాదాది యేగినది.

ఆతం డది చెప్పిన గురుతులు చూచుకొనుచు నడుగుచు బోయి పోయి ప్రొద్దు గ్రుంకునప్పటికి దానియిల్లు పట్టుకొనియెను. వీథి నిలువంబడి ఆశోకవతీ! అశోకవతీ! యని పెద్దయెలుంగునఁ బిలుచుటయు దానికూఁతు రీవలకు వచ్చి అశోకవతి యూరికేగినది. వీరెవ్వరు? దానితో మీకేమి పనియున్నది యని యడిగినఁబనియే యున్నది. ఆమె నీ కేమగును?

ఆమె మాతల్లి ! ఏమి పనియో చెప్పరాదా ?

రాజ - ఎందు బోయినదియో నీవేల చెప్పవు?

చెప్పకేమి ? రాజవాహనుఁడను వానిఁ దీసికొని వచ్చుటకై పోయినది.

రాజ - అతఁ డెందున్న వాఁడు?

ఓహో ! నాకు పనియున్నది. మాశంకల కుత్తరము జెప్పఁ దీరికలేదు. కల్పలత వేచియుండు నంతఃపురమునకుఁ బోవలయును. మీరెవ్వరో చెప్పినం జెప్పుడు?

రాజు- నీ విప్పుడు కల్పలత యంతఃపురమున కరుగుచున్నావా?

అవును. కల్పలత పేరు నీకెవ్వరు సెప్పిరి?

రాజ - మీయమ్మయే చెప్పినది. నేనే యా రాజవాహనుఁడ. కల్పలత యొద్దనున్న శారదపతంగంబు నిప్పింతునని నన్నుఁ దీసికొని వచ్చినది.

ఓహో! నీవు రాజవాహనుఁడవా? బద్దుండవైతివఁట ఎట్లు విడిపించుకొని వచ్చితివి?

రాజ -- ఒక పుణ్యాత్మురాలి మూలమునఁ దప్పించుకొని వచ్చితిని. పరోపకారకారణంబు లంతటను గలిగియున్నాను. నీవు గూడ నాకొక యువకారముఁ జేయగలవా?

నావలనఁ గాదగిన పనియేదియో చెప్పుఁడు. తప్పక గావింతుగాక లోప లకు దయచేయుఁడు. అని పలికి సవినయముగాఁ దీసికొని నాతిధ్యమిచ్చి యుచితసభాసీనుం గావించినది. అతండు దాని నభినందించుచు మఱేమియును లేదు. నారాక మీ రాజపుత్రిక కెఱింగించి యాపని నిప్పింపుమని నిన్నుఁ గోరుచుంటిని ఇయ్యనని చెప్పినచో వెంటనే మాయింటికిఁ బోయెద. నిదియే నీవు నాకుఁ గావింపదగిన యుపకారమని పలికిన విని యక్కలికి యిట్లనియె.

మాతల్లి ఱేపో నేఁడో రాఁగలదు. వచ్చుదనుక మీ రిందుండుఁడు. ఆమె సవరణలు చేయఁగలదు. అయినను మీరు గోరితిరి కావున నీరాత్రి రాజపుత్రికతో మీ మాట ప్రస్తావించి చూచెదను. కార్యసాఫల్యమగునని తోచినచో రేపు మిమ్ముఁ దీసికొని పోయెద లేనిచో నశోకవతి వచ్చువఱకు నుండవలసినదే యని చెప్పినది అతడంగీకరించి మఱునాఁడు సాయంకాలమునకుఁ దిరుగ వత్తునని చెప్పి యెం దేనిం బోయెను

రాగవతియు వెంటనే కల్పలత యంతఃపురమున కరిగినది. దానిం జూచి కల్పలత రాగవతీ! మీ యమ్మవర్తమాన మేమైనందెలిసినదియా యెందున్నదియో? వ్రాసినదియా? అని యడిగిన నది అమ్మా! ఆమె వార్త లేమియుం దెలియలేదు. ఎందున్నదో జాబులేదు. మఱియు రాజవాహనుఁడు చెఱసాలనుండి తప్పించుకొని సాయంకాలమున మాయింటికి వచ్చి మాయమ్మను జీరెను. నే నామె యూరలేదని చెప్పినంతఁ దనరాక మీకుఁ దెలుపుమనియుఁ బతంగము నిత్తురేమో యడుగు మనియు నన్ను వినయముతో వేడుకొనియెను. నే నంగీకరించి వచ్చితిని. అని యెఱింగించెను

ఆ! ఏమీ! రాజవాహనుఁడు చెఱసాలనుండి తప్పించుకొని వచ్చెనా? వాని నీవు జూచితివా? ఎట్లున్నవాఁడు! అని యడిగిన నది అమ్మా! చీఁకటిలో నేనతని రూపమును జూడలేదు. తాను రాజవాహనుఁడని చెప్పెను. ఱేపుసాయంకాలమున మరల మాయింటికి రాఁగలఁడు. సెలవైనఁ దీసికొని వత్తుననుటయు నామె అయ్యయ్యో! వాని మీ యింటియొద్ద నుండు మనక యెందులకుఁ బో నిచ్చితివి? తిరుగా వచ్చునో రాఁడో కానిమ్ము. నీ విప్పుడే యింటికిఁ బొమ్ము. మీ యింటిదాపుల నెచ్చటైన నుండునేమో! వెదకింపుము. స్త్రీ వేషము వైచి తీసికొని రమ్ము. అని మఱికొన్ని మాటలం జెప్పి నప్పడతి నంపినది. కల్పలత కారాత్రి గడియ యుగమువలె దోచినది. తెల్లవారి జలక మాడి యేఁడుమాదిరుల దుస్తుల నలంకారముల ధరించి మార్చి మార్చి కడకొకదినుసువేష మంగీకరించి నిలువుటద్దమునఁ జూచుకొనుచు లోపముల సవరించుకొనుచు నిష్కుటమునందలి విలాసభవనం బలంకరింపఁజేసి యంతరంగికసఖులతో నందుఁ బ్రవేశించి యందందుఁ సఖులఁ గావలి యుంచి ప్రొద్దువంకఁ జూచుచుఁ దదాగమనమున కెదురు చూచుచుండెను.

అంతలో రాగవతి ఆ రాజవాహనునికి బురకా వైచి తీసుకొని వచ్చి సఖినిర్దిష్టమార్గంబునఁ విలాసభవనంబునఁ బ్రవేశపెట్టినది. రాజపుత్రిక సఖులచే వాని కర్ఘ్య పాద్యాదులతో నివాళి యిప్పించి యుచితాసనాసీనుం గాపింపఁ జేసినది. రాజవాహనుఁడు కల్పలతకు నమస్కారముఁ గావించెను.

ఆమె తదీయ రూపరేఖావిలాసముల విలోకనములఁ గ్రోలుదానివలె నాలోకింపుచుఁ దారుణ్యము నభినందించుచు లావణ్యమును గొనియాడుచు నవయవసౌష్టవమును బ్రస్తుతింపుచుఁ దేజోవిశేషమును బొగడుచు విస్మయావేశహృదయముతో నొడ లెఱుంగక నిలువంబడి చూచుచుండెను.

అప్పు డతండు లేచి దేవీ! నీ యాదరమునకు మోదము వహించితిని. నీ యౌదార్యమును గుఱించి అశోకవతి చెప్పినదానికన్న నిబ్బడిగా గనంబడుచున్నది? నా కిం దుండరాదు. వేగ మింటికిఁ బోవలయును. నీ యొద్దనున్న పక్షి నిప్పింతునని యశోకవతి నన్నుఁ దీసికొనివచ్చినది. ఆమెతో రాలేకపోయితిని. దారిలోఁబెక్కు చిక్కులంబడితిని దైవకృపచే విముక్తుండ నైతిని. మధువర్మపైఁ గసి తీర్చుకొనవలసి యున్నది. వేగబంపుదువేయని పలికిన విని యక్కలికి చూపు లతనిపై వ్యాపింపఁ జేయుచు నెఱింగినదైనను నతని నోటిమాటలు విను తలంపుతో నిట్లనియె.

సుకుమారా! అశోకవతి నీతో నేమి చెప్పినది? ఎప్పుడు బయిలుదేరితిరి? ఎం దెందుఁ దిరిగితిరి? ఎట్లు బద్దుండవైతివి? ఎట్లు విముక్తుండ వైతివి? సవిస్తరముగాఁ జెప్పుమని యడిగిన నతండు పూసగ్రుచ్చినట్లు తాను బయలుదేరినది మొదలప్పటివఱకు జరిగిన కథ యంతయుం జెప్పెను. కల్పలత శ్యామలాపురంబున మదపుటేనుఁగను హుంకారము సేసి యాపితిరఁట. ఆ వార్త దేశము లెల్లెడ నక్కజముగాఁ జెప్పుకొనుచున్నారు. మీరేల చెప్పితిరి గారు?

రాజవాహనుడు - అదియొక ప్రజ్ఞయా యేమిటి? ఒరులచే బద్దుండనగు నాపరాక్రమము సిగ్గు. సిగ్గు.

కల్పలత - రామచిలక మీ కులముపై నేమిటికి గీటు పెట్టినది.

రాజ - దానికిం దెలియక.

కల్ప - పోనిండు. కనకలతిక మంచి యుపకారము గావించినది గదా? దానింటికి బోయి యభినందింపజేయకుండ నిక్కడకు వచ్చుట కృతజ్ఞతాధర్మమా.

రాజ - తల యూచుచు నేమియు మాటాడఁ డయ్యెను.

కల్ప- ఇప్పుడు మీ యభిలాష యేమి?

రాజ - పతంగప్రదానము చేయుమని.

కల్ప – వీరపురుషులు బ్రాహ్మణులవలె దానము లడుగుదురా?

రాజ - దానము గాదు. ప్రతిఫలం బేదేని యిచ్చికొనవచ్చును.

కల్ప - దీనికి నాకేమి ప్రతిఫల మిత్తురు?

రాజ - ఏది గోరిన నది.

కల్ప - ఆ మాట నిశ్చయమేనా? జ్ఞాపక ముంచుకొనుడు.

రాజ - అశోకవతి మీతో నేమని చెప్పినది ?

కల్ప - అది వచ్చిన తరువాత నే మన్నదో మీ యెదుటనే యడిగెదను గదా?

రాజ - అంతవఱకు నన్నాగమనియెదవా యేమి?

కల్ప – ఆగకున్న మీ చెల్లెలి నేర్పరితన మెట్లు తెలియగలదు. అది తప్పక ఱేపు వచ్చును.

అని పరిహాసవచనము లాడుచు వారచూపుల నతని రూపవిలాసము లరయుచు నప్పు డాపతంగమును దెప్పించి యిదిగో! మీ శకుంతపత్ని ఉబుసుబోకున్న దీనితో ముచ్చటింపుచుండుడు. అని పలికెను.

అప్పు డతం డాపతంగమును జేతిఁబట్టుకొని దువ్వుచు ముద్దు పెట్టుకొనుచుఁ బతంగమా! నీ పతి మాయొద్ద నున్నవాడు. నిన్నక్కడకు దీసికొని పోవుటకుఁ గల్పలత యాజ్ఞ వచ్చినది వత్తువా? అని యడిగిన నది యేమియు మాటాడినది కాదు. అప్పు డతండు నీడజమా? మీ జోడు విడఁదీసితిమని కోపమా? పశ్చాత్తాపముఁ జెందుచుంటిమిగా? మీ జోడులు గలుపుటకే ప్రయత్నించుచుంటిమి. నీ భర్త విజయపాలుని కథ సగముఁ జెప్పి తక్కినది నీకుఁగాని తనకు రాదని చెప్పెను. తత్కథావిశేషము వినుటకు మా కుత్సుకముగా నున్నది. ఎఱింగింపుమని కోరుటయుఁ గల్పలత మీరు విన్న విజయపాలుని గథ ముందు నా కెఱింగింపుడు. తరువాతి కథ మా పత్రకథ మెఱింగించునని పలికినది. రాజవాహనుఁ డాకథ సంక్షేపముగా రాజపుత్రిక కెఱింగించెను.

అయ్యుదంతము విని కల్పలత లజ్జాసంభ్రమాశ్చర్యములతోఁ గూడికొని నవ్వుచు ముద్దులమూటా! నా మాట మన్నించి యా కథావిశేష మెఱింగింపుము. నాకును విన వేడుక యగుచున్నదని యడిగిన నావికరవరం బిట్లనియె. దేవీ ! ఈ వీరుఁ డుండ నా కథ విశేష మెఱింగింప. నీ వొక్కరితవు గూర్చుండుము. చెప్పెద ననవుఁడు రాజవాహనుండు రాజపుత్రీ! మా పతత్రము నీ చెవులో నేదియో చెప్పుచున్నది. మేము వినరాని మాటయా? అని యడిగిన నప్పడతి మావరాలపేటి మీ ముందర నా కథ జెప్పుటకు మోమోటపడుచున్నది. దాని వలన నే విని మీకెఱింగింతు నా తోఁటలో విశ్రమింపుఁడన పలుకుటయు నతం డట్లు కావించెను. అవ్విహంగమం బాయంగనామణి కాకథావిశేష మిట్లు చెప్పం దొడంగెను.

183 వ మజిలీ

పుళిందుని కథ

శ్లో. సారమ్యా నగరి మహా నృనృతితి స్సామంత చక్రంచతత
    పార్శ్వే తస్యచ సా విదగ్ధ పరిషత్ తా శ్చంద్రసంబాధనాః