Jump to content

కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/181వ మజిలీ

వికీసోర్స్ నుండి

కానిండు. మా యన్న పొందవలసిన సత్కారముల నే నందితిని. మీ కెల్లరకు నింత గౌరవము గలుగుట మా పూర్వపుణ్యసుకృతముగాక మఱియొండు గాదు.

ఇప్పుడు నే నతనికడకుఁ బోయి తద్భంధనప్రకార మెఱింగి శక్యమైనచో విడిపించెద లేనిచో మీ కొకజాబు వ్రాసెదఁ దగిన సైన్యముల సహాయ మీయుఁడు. ఇదియే మీరు వానికిఁ జేయు ప్రత్యుపకారమని పలికిన విని యమ్మహారా జిట్లనియె.

ఒహోహో! ఎంతమాట వింటిమి. మాకుపకారముఁ జేసినవాఁడు మీ యన్నయా? అతని పేరు రాజవాహనుఁడా? ఎట్లయిన మీ కుటుంబమున మాకు విశ్వాస ముంచక తీరదు. అయ్యసహాయశూరు నెట్లు పట్టికొనిరో యది యసంభవము. కానిండు. ఎప్పుడో యననేల? వలసిన దళములఁ దీసికొనిపోయి వాని విడిపింపుడు. అవసరమైన నేను గూడ వత్తునని పలికిన శ్రమణి యిట్లనియె.

దేవా| ఇప్పు డెవ్వరు రానక్కరలేదు. నే నొక్కరుండఁబోయి కార్యము సాధించెద. కానినాఁడు సేనం బంపుదురుగాక. మీ సహాయ మెప్పుడుం గావలసినదే యని పొగిడినది ఆ దివసంబెల్ల నొండొరుల చరిత్రములు చెప్పికొనుచుఁ దృటిగా వళ్ళించిరి. కోటలో నా రాత్రి యతనికి గొప్ప విందుఁ గావించిరి. అని యెరింగించి తరువాయికథ పై మజిలీయందు జెప్పఁ దొడంగెను.

181 వ మజిలీ

సునందుని కథ

శ్రమణి మరునాఁ డరుణోదయమునకు లేచి రాజు ననుమతి వడసి యెవ్వరిని వెంటఁ బెట్టుకొనక యస్వారూఢయై జయపురంబున కరుగుచుండెను. మఱి యొకనాఁ డొకచోట నీ ప్రాంతమందలి పల్లెలోఁ జిలుక శకునము చెప్పునని యెవ్వరో జెప్పినంత విని యా పల్లెకుంబోయి యొకచోట బసఁజేసి యందలి నిబంధన లన్నియుం దెలిసికొని మా యన్న రాజవాహనుఁడు వెంటనే విడువఁబడునా? అని ప్రశ్న మడిగి కులశీలనామాదులు వ్రాసి సొమ్ముతో గూడ నం దర్పించినది. ఆ ప్రశ్నమున కుత్తరము జెప్పుటకు నాలుగుదినములు గడవుఁజెప్పిరి.

శ్రమణి యన్నయుంబోలెఁ దానుగూడ నేమియుం దోచక యశ్వ మెక్కి సాయంకాలమున నుద్యానవన ప్రాంత భాగముల విహరింపుచుండెను. అప్పు డొక రాజకుమారుఁ డొకతోటలో గుర్రమెక్కి వచ్చుచు నెదురుపడియెను, ఒండొరులఁ జూచుకొనినప్పుడు రాజకుమారుఁడు శ్రమణి నెరింగినట్లుగా నవ్వుచు నా గుర్రమును నడిపించెను. రెండు గుర్రముల నొకచోట నాపి దిగినప్పుడు రాజపుత్రుఁ డోహోహో! నా మిత్రుఁడు రాజవాహనుఁడా! ఎవ్వరో యనుకొనుచున్నా నని పలుకుచు దాపునకు వచ్చి బిగ్గరగా గౌఁగలించుకొనియెను.

శ్రమణి మేను ఝల్లుమన జేతులతోఁ ద్రోసి యాపట్టు తప్పించుకొని దూరముగాఁ దొలఁగి నేను రాజవాహనుఁడగాను అతని తమ్ముఁడ. నా పేరు మహిళాంగుఁడు. అతని నిమిత్తమే వచ్చితినినని చెప్పుటయు నతం డాహా? మీ యిద్దరికిని నించుకయు భేదములేదు గదా! నేఁడు సుదినము. మీ యన్నకు నాకుఁ బ్రాణస్నేహ మిక్కడనే కలిగినది. ఆతఁ డెం దున్నవాడు. నే నాతనియొద్ద నశ్వగతివిశేషముల నేర్చుకొంటి. నాకు గురువు గూడనని చెప్పుచుండ నా శ్రమణి యిట్లనియె.

మధువర్మయనురాజు జయపురంబున మా యన్నను జెఱసాల బెట్టించెనట. ఆ వార్త తెలిసి యందుఁ బోవుచున్న వాఁడ నవసరమైన మీరుగూడ రావలసినదే. మీ రిం కేమిటికి వసించితిరి? మీ దేశమేమి? మీ చరిత్ర మెట్టిదో చెప్పుడని యడిగిన నతం డిట్లనియె.

వయస్యా! నేను దుర్గనగరాధీశ్వరుని కుమారుఁడ. నా పేరు సునందుఁ డందురు. నేను సమస్తవిద్యలఁ జదివితిని. మా తండ్రి నే నొక్కరుండ గుమారుండ నగుట నన్ను గారాబముగాఁ జూచుచుండెను. చండకేతుఁడను నృపాలుండు నాకు మేనమామ. అతని కూతురు పద్మలతిక యగునది చక్కనిదే కావచ్చును. నాకిష్టములేదు. దాని నాకు బెండ్లిచేయ నిశ్చయించిరి. అది తప్పునా తప్పదా? యని చిలుకను బ్రశ్న మడుగ వచ్చితిని. తప్పునని చెప్పినది. అది తప్పిన మఱి యెక్కడ నగునని యడిగితిని. ఆ మాట చెప్పటకుఁ దిరుగరమ్మన్నది. నిన్ననే వచ్చితిని. రేపు చెప్పగలదు. ఇదియే నా యాగమనకారణము. మీ యన్నను బందెఁ బెట్టిన మధువర్మ నా మేనమామకు జుట్టము. నేను వచ్చి వానిఁ దృటిలో విడిపింపగలను. ఈ కార్యము నా హస్తగతప్రాయమని తలంపుము. రేపు నా బ్రశ్నమునకు బ్రత్యుత్తరము వినిపోవుద మనుటయు సంతసించుచు నా జవరాలు తత్కాలోచితమైన మాటలచే నతనికి సమాధానము చెప్పినది. అంతలోఁ బ్రొద్ధు గ్రుంకుటయు దమ తమ నెలవులకుం బోయిరి

రాత్రి శ్రమణి యాత్మగతంబున నిట్లు వితర్కించెను. ఆహా! సునందుడు నన్ను మాయన్న యనుకొని గాఢాశ్లేషము గావించెను. తదంగసమ్మేళమున నా మేనం బులకలు జనించినవి. నేను వెనుకకు నొదిగినప్పు డతండు నేను స్త్రీ నని గ్రహించినట్లు తెల్లమగుచున్నది. మఱియు ఇతని మేని సంపర్కము నాకు హాయి గావించి మనసు వికారపరచుచున్నది. వీని నంటిన దేహముతో మఱియొకరి నంటుట యుచితము గాదు. వీని భర్తగాఁ గోరుటవలన నా సంకల్పమును నిందించుకొనరాదు కాని యితం డల్పకులసంజాతనగు నన్నంగీకరించనప్పుడు కర్తవ్యమేమి యున్నది? నా కులముతెఱం గిదివరకు మా యన్నవలన వినియే యుండును. రేపు దీని వెనువెంటఁ దిరిగి శృంగారశేష్టలఁ గొన్ని వీనిముందరఁ బ్రకటించెద నెట్టి యభిప్రాయపడునో చూచెదం గాకయని తలంచుచు నా రాత్రి నిద్రబోవదయ్యెను.

సునందుడును రాత్రి పండుకొని యోహో! మహిళాంగుని నేను గౌగలించుకొనినప్పుడు తద్వక్షము మృదువుగను, గఠినముగను సోకినది. మహిళాంగమువలెఁ బురుషాంగ ముండుట వింతగదా? వాని చెల్లె లిట్టివేషము వైచికొని వచ్చినదేమో? నా గౌఁగిలింతకు జంకి వెనుక కొదిగినది. పురుషుఁ డట్లు చేయునా? ఆహా! ఇది ముదితయే యైనచో ముదితహృదయుండ నగుదుం గాక యని తలంచుచు ననేకసంకల్పములతో నిద్రఁబొంద డయ్యెను.

తెల్లవారినతోడనే యిరువురును లేచి యుద్యానవనమునకుఁ బోయిరి. సునందుఁడు సాహసముతో శ్రమణి హస్తంబు గ్రహించి వయస్యా! నేఁడే నా ప్రశ్నమున కుత్తరము వచ్చు, నేమని చెప్పునో? నా కనుగుణయగు రమణి యెందున్నదో యని పలుకుచుఁ జిటికెన విరిచెను.

శ్రమ - (చిరునగవుతో) అనుగుణయన నెట్లుండవలయును?

సునం - నా సంకల్పానుగుణ్యముగా నుండవలయును.

శ్రమ -- సంకల్పమన ?

సునం - సంకల్పమే.

శ్రమ - సరి సరి. మీసంకల్ప మెవ్వరికిఁ దెలియును? కన్యక నాయంత పొడ వుండినం జాలునా?

సునం — ఏదీ నీవెంత పొడవుంటివో, అని కుడిచేతిలో గౌఁగిట జేర్చుకొని, చాలు నింతియే యుండవలయును.

శ్రమ - (గగుర్పాటుతో) నీ సంకల్పము రీతిగఁ బెండ్లికూతురుండు ననుకొనుము. కులము వెలితిదైన నంగీకరింతురా ?

సునం - అన్నిటికిఁదగిన కన్యక యల్పకులంబునఁ బుట్టనే పుట్టదు. పుట్టినచో నాకంగీకారమే. క్షత్రియు లుత్తమకులకన్యం బెండ్లియాడఁగూడదు కాని యవరిజకులం బెండ్లి యాడవచ్చును.

శ్రమ - ఈ మాట సంతోషమయినది.

సునం - అట్టి కన్నె నీ యెరుకలో నెందైన నున్నదా యేమి?

శ్రమ - ఉండఁబట్టియే యిన్ని ప్రశ్నలు.

సునం — వేగఁ జెప్పితివేని నీ బుగ్గలు మరియొకసారి ముద్దుపెట్టు కొనియెదను.

శ్రమ - చిలుక మీ ప్రశ్నమున కుత్తర మిచ్చిన తరువాత జెప్పెదను.

సునం — కానిమ్ము. అది నేఁటి మధ్యాహ్నమే కదా? వినిన తరువాతనే చెప్పుము.

అని వారు వినోదముగా మాటలాడుకొనుచు నొండొరుల బుజములుమీఁదం గైదండం లిడికొని యిటునటు తిరుగుచుఁ గొంతసే పందు విహరించి బసకుఁ బోయిరి. నాఁటి మధ్యాహ్నమే చిలుక సునందన కుత్తరము వ్రాయించినది. నీ భార్య యిక్కడనే యున్నది.

ఆ యుత్తరముఁ జూచుకొని వడివడి పరుగునఁ బోయి యతండు శ్రమణి కావ్రాత చూపించెను. అత్తరుణి చిఱునగవుతో బరికించి ఇఁకనేమి? మీ యదృష్టము ఫలించినదిగాక! ఇక్కడనే యున్నదఁట ఎవ్వరు జెప్పనక్కరలేదు. నే నేదియో చెప్పవలయునని తలంచుచుంటిఁ జిలుకయే చెప్పినదని పరిహాసగర్భితముగా బలికిన నతం డిట్లనియె.

ఈ రామచిలుక యథార్ధవేత్తయని భ్రమసి రెండుసారులు దీనికడ కరుదెంచితిని. దీని మాట నాకుఁ దార్కాణముగాఁ గనంబడలేదు. ఇక్కడనే యున్నదని చెప్పినమాట యెంత సత్యమో విచారింపుము. ఇం దెవ్వరున్నారు రేపు మీ మాటకు వచ్చిన ప్రత్యుత్తరముఁ జూచుకొని మనము పోవుదముగాక. ఇక నెన్నెఁడు నిక్కడకు రాఁగూడదని పలికిన విని యా కలికి చూపు లతనిపై వ్యాపింపఁ జేయుచు నిట్లనియె.

సునందా! దాని నిప్పుడే నిందింపరాదు. అఘటితఘటనాలంపటుడగు భగవంతుని సంకల్పము లెవ్వరికిఁ దెలియును? మీ నిమిత్తమయి యేమచ్చకంటియైన నిచ్చటికి వచ్చియున్నదేమో యెవ్వడెఱుంగునని పలుకుటయు సరే చూతముగా? అని యతండు తలయూచెను. కవఁగూడి తిరుగుచు వారు నాఁ డెల్ల బరిహాసగర్భితములైన మాటలచే గడిపిరి.

మఱునాఁడు శ్రమణి యడిగిన ప్రశ్నమున కిట్లుత్తరము వచ్చినది. కిరాతకులము పురుషుఁడు. అను దానిమీఁద గీటులు గీయబడి యున్నవి. నీ వడిగిన పురుషుఁడు చెరసాలనుండి నిన్ననే విముక్తు డయ్యెను.

అని యున్న యుత్తరముఁ జూచుకొని శ్రమణి ఆహా! ఈ చిలుక నిజము గ్రహించు ననుమాట కొంతసత్య మున్నది. నేను బురుషుఁడగానని గీటు గీచినది లెస్సయే. కులముగూడ గీటుపెట్టుచున్న దేమి? మొన్న మా యన్నకు నిట్లే వ్రాసినదఁట. ఇం దేదియేని రహస్య మున్నదేమో విచారింపవలసియున్నది. బుద్ధిః కర్మానుసారిణీ అను నార్యోక్తి ననుసరించి నాడెందము సునందునందుఁ దగులమైనది. చిలుక చెప్పిన మాటలంబట్టి చూడ నిది దైవసంకల్పితమనియే తోచుచున్నది. కానిచో సోదరుఁ డందు జిక్కుపడి యున్నవాఁడని వినియు నా కీ శృంగారలీల లేమిటికి రుచింపవలయును? కానిమ్ము. ఇతం డొకదేశమున కధికారి. సమధికవిద్యారూపశీలసంపన్నుఁడు. అల్పకులసంజాతనగు నా కిట్టిభూపతిపట్టి పతిగా లభించుట కల గాదే! అని యాలోచించుచున్న సమయంబున సునందుఁడు వాకిటకు వచ్చి మహిళాంగీ! మహిళాంగీ! అని కేక పెట్టి అయ్యో! పొరపాటున నట్లు పిలిచితిని. మహిళాంగా! యేమి చేయుచున్నావు? చిలుక నీప్రశ్నమున కుత్తర మిచ్చినదఁట. యేమి చెప్పినది? అని పలుకుటయు శ్రమణి సంతసముతో వాకిటకు వచ్చి యిట్లనియె.

మీకు సంతతము మహిళాంగిమీఁద బుద్ధి యుండుటచే నా మాటయే వచ్చినది. రండు రండు. ఇదిగో చిలుక యిచ్చిన యుత్తరము. మీ రనినట్లు జ్ఞానహీనమగు పక్షికి సత్యమేమి తెలియును? అని పలుకుచుఁ దన పత్రిక చూపినది.

అతం డది చదివికొని యోహో! అన్నింటికంటె నిన్నుఁ బురుషుఁడు కాఁడనుచున్నది. ఇంతకన్న నవివేక మేమియున్నది? మీ యన్నకు వ్రాసినట్లే కులముపై గీటు పెట్టినది. దాని కేమి? కలలోనైన దీనిమాటను నమ్మగూడదు. మగవారి నాఁడువారిగా చెప్పిన నెవ్వరు నమ్ముదురు? నీవు కోపము సేయవేని యొక్క మాట సెప్పెద వినియెదవా?

శ్రమ - అడుగవలసినమాట యేదియో అడుగుడు. నాకేల కోపము?

సునం - నిన్నుఁ బరీక్షించినచోఁ జిలుకమాటలయందుఁ గల నిజానిజంబు లిప్పుడే తేలగలవు.

శ్రమ - నన్నేమి పరీక్షింతురు ?

సునం - చిలుక నిన్నుఁ గలికి యన్నదిగదా? ఆ విషయమై.

శ్రమ - అదియా? గడుసువారలే? స్త్రీనైన నేమిచేయుదురు ?

సునం - చిలుక యేమన్న దో, అదియే.

శ్రమ - ఏమన్నది నన్నుఁ బురుషుఁడు కాదన్నది యేనా?

సునం - అదికాదు. నన్ను గఱించి యిచ్చిన ప్రశ్నములలో.

శ్రమ - నీ భార్య యిక్కడనే యున్నదన్నది. అదియేనాఁ

సునం - అగు నగు.

శ్రమ - నేను స్త్రీనైనచో నన్ను భార్యగా జేసికొందువా?

సుసం--ఆ మాటయు నీమాటయు దెఱుకయే చెప్పినదిగదా ?

అని పలుకుచు అతను మదనత్వమంద నీవు పురుషుండవో, మగువవో నీ మొగమే చెప్పుచున్నది. నేనంత యెఱుంగనివాడ ననుకొంటివా?చూడుమని యామె యంగీలఁ బట్టుకొని మరుగు పడుచుండఁ దిగిచి పారవైచె. నప్పుడు—

చ. కులుకు మిటారి గబ్బిచనుగుత్తులపొత్తు బయల్పడన్ బళా
      బళ! యనుచు దటాలున నెపంబిడి చేతులఁ గప్పినప్పు డ
      క్కలికి సునందుఁడు బిగియఁ గౌఁగిటఁ జేర్చి వధూటి తళ్కు చె
      క్కుల వెస ముద్దు పెట్టుకొనె గోమలి గొంకక సిగ్గు పెంపునన్.

అప్పు డప్పడఁతి వాని రెండుచేతులుం బట్టి మోము ముద్దలాడుచు మనోహరా! నీవే నాభర్తవు నీకు నేను భార్యను. ఇది దైవఘటితంబు. ఇప్పుడు తొందర పడరాదు. పెద్దలున్నారు. యథావిధి వివాహ హోత్సవము జరుగవలసి యున్నది. మా యన్న బంధవిముక్తుఁ డయ్యెనని చిలుక చెప్పినమాట సత్యము కావచ్చును. ముందుగా మన మక్కడకుఁ బోవుదము. అచ్చటి స్థితిగతులు విచారించి కర్తవ్యముల నాలోచింతమని పలికిన విని యతం డంగీకరించెను.

వారు మరునాఁడు ప్రయాణ మగుచున్న సమయంబున నాదిత్యవర్మయు నశోకవతియు నచ్చటికి వచ్చిరి. అశోకవతి శ్రమణిం జూచి యోహో! రాజువాహనుఁ డిందే యుండెనే. బద్ధుండయ్యెనని చెప్పినమాట యసత్యమా యేమి? విడిపించుకొని వచ్చెనా? అని యాలోచించుచుఁ దాపునకుఁ బోయి రాజవాహనా! అని పిలిచినది. శ్రమణి తెల్లపోయి పురుషవేషంబుతో నుండుటంబట్టి యశోకవతిం గురుతుపట్టక చూచుచుండెను.

అప్పుడు సునందుఁ డితఁడు రాజవాహనుఁడు కాఁడు. అతని తమ్ముఁడని చెప్పెను. ఓహో? వానికిఁ దమ్ముఁ డెక్కడ నున్నాఁడు? నే నెరుఁగనా? నిజము చెప్పు డనుటయు శ్రమణి మీ రెవ్వరు? వారి నెట్లెరుఁగుదురు? అని యడుగుటయు నాదిత్యవర్మ వారి సంవాదమంతయు నాలించి మీరిరువురు వేషంబుల మార్చుకొనుటఁ జేసి యొండొరుల గురుతెరుఁగ కుంటిరి అవ్వలికిఁ బోయి రహస్యముగా సంభాషించు కొనుఁడు. అంతయుం దెల్లము గాఁగలవని పలికెను. ఆ మాట గ్రహించి యశోకవతి శ్రమణి చేయిపట్టుకొని చాటునకుం దీసికొనిపోయి నే నశోకవతిని, నీవు శ్రమణివని తలంచితిని. నా వలెనే నీవు పురుషవేషము వైచితివి. రాజవాహనునివలె నుంటివి. నేను జ్ఞాపకముంటినా? యని యడిగిన శ్రమణి వెఱఁగుపాటుతో నిట్లనియె.

ఆహా! ఏమి ఈ చిత్రము? నీ వశోకవతివా! తల్లీ! పురుషవేషము వైచితి వేమిటికి? మాయన్నం దీసికొనిపోయి చెరసాలం బెట్టించితివా? చాలు చాలు మంచి యుపకారమే చేసితివి. అని యాక్షేపించుచుండ నశోకవతి సిగ్గుపడుచు నిట్లనియె.

అమ్మాణీ! నా చెప్పినమాటలు విని పిమ్మట నాక్షేపింపుము మీ యన్నగా రీచిలుకను బ్రశ్నముల నడిగి యుత్తరము వడయుటకై బదిదినము లిందుండవలసి వచ్చినది . నేను వెనుక రమ్మని పరిజనుల నియమించి యరిగితిని. మా రాజపుత్రిక యీతనిం జూచుటకై యాతురతతో వేచియుండి నితండు రాడయ్యె. నన్ను మరలఁ బంపినది. అతండు దారి తప్పి జయపురంబున కరిగి గుఱ్ఱము దిగని కారణంబునఁ జెఱసాలం బెట్టఁబడియెనఁట. అందులకే విశ్వప్రయత్నముఁ జేయుచున్నాను. ఆదిత్యవర్మయను నీ బ్రాహ్మణుఁడు మహాబలశాలి. వాని విడిపించుటకై యితని నాశ్రయించు చుంటిని. ఇతండు మహారాష్ట్ర దేశాధిపతి పంపున మృగంబులకై మీ యింటికి వచ్చుచుండఁ గలిసికొంటిని. మేము మీ యింటికిం బోయితిమి. మీ యింట నెవ్వరునులేరు. పరిజనుల నడుగ నిట్లు జెప్పిరి. దుందుభికుమారుంజజు తండ్రికిఁ జెప్పకుండ నడివికి వేటకుఁ బోయెను. అతనిజాడఁ తెలిసికొన దుందుభి యరణ్యమున కరిగెను. అతఁ డెన్నిదినములకు రాకున్నఁ గూఁతురు శ్రమణి యడిగినది. తద్వియోగదుఃఖంబు భరింపఁ జాలక తల్లి పరిజనులం దీసికొని మొన్ననే యీ ప్రాంతరాంతారములకుఁ జనినది. వారు వచ్చువరకు మృగముల నమ్మువారు లేరు.

అని చెప్పుటయు మేమా మాటలు విని రాజవాహనుఁడు జయపురంబున శత్రువులచేఁ బట్టుబడియెను. దుందుభి వచ్చి తరువాత నీ వార్తఁ జెప్పుడు. అని చీటి వ్రాసి యిచ్చి మే మిద్దరము బయలుదేరి వచ్చుచుఁ జిలుకనేతృత్వముఁ దెలిసికొనుటకై యీతండు కోరిన నిట్లు వచ్చితిమి. నీవు గనంబడితివి. అతం డెవ్వఁడు? నీవిందేమిటికి వచ్చితివని యడిగిన శ్రమణి యిట్లనియె.

నేను నీ మొదటివార్తవిని మా తల్లికిం జెప్పకుండఁ బురుషవేషము వైచికొని వచ్చుచు దారిలో శ్యామలాపురంబున కరిగితిని. నన్ను రాజవాహనుఁ డనుకొని తత్పట్టణ ప్రజలు, రాజు, రాజపుత్రిక చాలగౌరవించి యూరేగించిరి. వారికి నేను తదనుజుండవని చెప్పితిని. కాని చెఱసాల వృత్తాంతము విని పరితపించుచు నందరుం గలసివచ్చి సహాయముచేయుదు మని చెప్పిరి. ముందు కార్యావసర ముంచి వర్తమానముఁ జేయుదునని యటఁ గదలి యీ చిలుకయొద్దకు వచ్చి శకున మడిగితిని. మీ యన్న నిన్ననే విముక్తుండయ్యెనని వ్రాసినది. అది యెంత సత్యమో తెలియదు. ఈతండు దుర్గానగరాధీశ్వరుని కుమారుఁడు సునందు డనువాఁడు. మా యన్నకు మిత్రుఁడు. ఇందే కలసికొంటిమి. మా యన్న చెఱవిడిపించుటకై నాతో బయలుదేరి వచ్చుచున్నాడు. ఇంతలో మీరు వచ్చితిరి. ఇదియే నా వృత్తాంతము. ఆ బ్రాహ్మణుఁడు మహా బలశాలి యంటివి. ఎట్టి బలముగల వాఁడు చెప్పుమనపుఁడు అశోకవతి యిట్లనియె.

అతం డసహాయశూరుఁడు. దేవతాంశాసంభూతుఁడు. ఇతఁడు పూర్వం జయపుర భర్తయగు విజయపాలుఁడను నృపాలునొద్ద మంత్రిగాఁ బ్రవేశించి యతనిం గాపాడుచుండెను. ఆ రా జితని సుమతియని పిలుచువాఁడట. ఈ మధువర్మ యతం డుండినప్పు డనేకమాయోపాయములు పన్ని విజయపాలుని చంపవలయునని ప్రయత్నము జేసెనఁట. సాగినదికాదు దైవికముగా నితని రూపము చూచి విజయపాలుని భార్య మోహించి కామించినదఁట. ఇతఁ డందు బడలేదు. అప్పుడు భర్తకు లేనిపోని నేరములు చెప్పి యితని లేవగొట్టినదఁట. .....మధువర్మ మందపాలుఁడను నృపాలుని సహాయము దీసికొని యాదుర్గము స్వాధీనము చేసికొని యారాజదంపతులఁ గడతేర్చెనఁట. అని యతని వృత్తాంత మంతయు చెప్పుటయు వేఁగుపాటుతో శ్రమణి యిట్లనియె.

ఏమీ! మాసుమతియా! గంగపట్టణ సుమతియా! అని విస్మయమందుచుండ నశోకవతి ఆసుమతియన నేసుమతి?

నీ వెట్లెఱుంగుదువు? అనవుడు సరిసరి ఇప్పుడు నీవు చెప్పిన చరిత్ర మంతయు మాకు మా పతంగము జెప్పినది మధువర్మ జయపురమన నేదియో యనుకొనుచుంటిమి. ఆహా! ఈ సుమతి మహానుభావుండు. జితేంద్రియుండు. ఈ కథ సగముఁ జెప్పి మాగువ్వ యవ్వల తనకు రాదన్నది. తరువాయి చరిత్రము చాల భాగము నీవు చెప్పితివి. ఈ సుమతియే శత్రువులంగూడి విజయపాలుని మట్టుపరచెనని నే నంటిని. అతండు మహాగుణవంతుఁ డట్లు చేయఁడని మాయన్న వాదించెను. మా యన్న మాటయే గెలిచినది. ఇట్టి యుత్తముఁడు మన కాశ్రయుఁడై యుండ మన కార్యము నెరవేరుట కేమియు సందియము లేదని చెప్పుచు దిన్నఁగబోయి యతని పాదములకు నమస్కరించినది.

అభీష్టవరలాభసిద్ధిరస్తు అని యాశీర్వదించెను. ముసి ముసి నగవుతో శ్రమణి మహాత్మా ! నీ చరిత్ర మంతయు విని యుంటిమి. నీవు సర్వజ్ఞుఁడవు. హృదయాశయముల గ్రహింపఁ జాలుదువు. నీ యాశీర్వచన మమోఘమగు వరంబగు గాఁక. ఈ చిలుక మా యన్న విముక్తుఁ డయ్యెనని చెప్పినది. తద్విము క్తికి మీ రభయహస్త మిచ్చితిరఁట. ఇప్పుడు మన మందుఁ బోవుదుమా ? అని యడుగుటయు నతండు చిలుకపలుకుల కన్యధాత్వ ముండదు. ఈ సునందుఁ డందలి తత్వము దెలిసికొంటినని చెప్పెను. మీ యన్నకు నీకుఁ గూడ గులముమీఁద గీటుపెట్టినదట. ఆ విషయము ముందు విచారింతముగాక. ఇప్పుడు మనమందరముగలసి జయపురంబున కరుగుటయే యుచితమని పలుకుచు నాదివసం బం దుండి తానుగూడ జిలుక నొక పశ్న మడిగెను. అప్పుడు పృచ్ఛకు లంతవిశేషముగా లేమింజేసి యతని ప్రశ్నమున కాదివసమే యుత్తరము చెప్పినది

నీవడిగిన పురుషుఁడు సజీవుఁడై కుటుంబవృద్ధి గలిగియున్న వాఁడు.

ఆదిత్యవర్మ యా యుత్తరము విని సంతోషాయత్తచిత్తుఁడై యేదో తన డెందమున వింతకథఁ గల్పించుకొని యిట్లు జరుగునని యాలోచించుకొనియెను.

మీ ప్రశ్నమునకుఁ దగిన యుత్తరము వచ్చినదాయని యడిగిన శ్రమణితో నీ శుకము దైవమువంటిది. దీనిమాటలయం దొక్కటియు నసత్యముండదు. మీయన్న యీ పాటికి విముక్తుఁడై యుండు నందుఁ బోవుదమని పలుకుచు వారితోఁగూడ బయలుదేరి జయపురంబున కరిగెను.

182 వ మజిలీ

కనకలతిక కథ

దేవీ! కనకలతికా! పుడమిలో సౌందర్యవంతులగు పురుషులు లేరని నిరసించుచుందువు. మన చెఱసాలలోనున్న యువకునిం జూచిన భూలోకమును నిందింపవుగదా?