కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/180వ మజిలీ
మార్పఁగలవని పలుకుచు నతనిఁ బెక్కుస్తోత్రములు చేసినది. దాని రాక కతం డంగీకరించెను. ఇరువురుం గలిసి పుళిందపురమున కరిగిరి.
అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. తరువాయి కథ పైమజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.
180 వ మజిలీ
శ్రమణి కథ
ఆహా! దైవము జనుల నప్రయత్నమున నాపత్పరంపరలపాలు జేయుచుండును. శకుంతలోభంబునం జేసి తలిదండ్రులకుఁ దెలియకుండ మాయన్నను అశోకవతి వెనుక మహేంద్రపురంబున కనిపితిని. దారిలో జయపురంబున మధువర్మచే వాఁడు చెరసాలం బెట్టఁబడెనని యశోకవతి వార్త నంపినది. ఇప్పుడు నేనేమి చేయుదును? మాతండ్రి మృగములనిమిత్తము దూరారణ్యములకుఁ బోయెను ఈవార్త మాతల్లి కెఱింగించితినా నిత్యము వానికొఱకుఁ బరితపించుచుండుటం బట్టి డెందము పగిలి మృతినొందఁగలదు. వాఁడు నేఁడు వచ్చునో రేపు వచ్చునో యని గడియలు లెక్క పెట్టుకొనుచుండఁ బిడుగువంటి యీవార్త వచ్చినది. వాఁ డేమి యపరాధము జేసెనో, మధువర్మ యెందులకు జెఱసాలఁ బెట్టించెనో తెలియలేదు. మాతండ్రి యెప్పుడు వచ్చునో తెలియదు. అంతదనుక జాగు చేయుటకు నాడెందము తాళకున్నది. నేను స్త్రీచాపల్యంబున వాని సుఖముగా నింటికడఁ నుండనీయక యాపత్సముద్రములోఁ ద్రోచివైచితిని. అక్కటా! నామాట మిక్కిలి గారాముగా మన్నించు నాయనుఁగు సోదరుఁ డెట్టి చిక్కులం బడుచున్నాఁడోగదా? అని కంటఁ దడి వెట్టుచు నంతలో సీ! ఈ యమంగళకార్యమేల చేయవలయును? ఇది పౌరుషహీనుల విధానము. మహావీరపురుషవేషము ధరించి నే నానగరముఁ బోయి శత్రువుల నెట్లో వంచించి వాని విడిపించి తీసికొని వచ్చెదనని నిశ్చయించి పురుషవేషము వైచికొని యెవ్వరికిం దెలియకుండ నశ్వారూఢయై వేకువజామున బయలుదేరి యంతకుమున్ను బరులవలన దక్షణదేశమార్గము లన్నియు వినియున్నది కావున నొకదారిం బోవుచుండెను.
ఆ పుళిందపుత్రిక త్రిభువనాశ్చర్యకరసౌందర్యవిరాజమాన తెల్లతామరలఁ బోలు సోగకన్నులతోఁ దళ్కులీను చెక్కులతో నక్కలికిమొగంబు పురుషవేషమున మఱియు ముద్దును మూటగట్టుచుండెను. దానింజూచి జయంతుఁడో, కంతుడో, వసంతుఁడో యని జను లద్బుతపడక మానరు.
ఆ చిన్నది దేశవిశేషములు వినుటయేకాని చూచి యెఱుంగదు. క్రమంబున నడవి దాటి తెరపిదేశములనడుమ జనుచుఁ గనంబడినవారి నాయాదేశ గ్రామ విశేషాదుల నడుగుచు వింతలం దెలిసికొనుచుఁ బోవుచుండెను. ఒకనాఁడు దారిప్రక్క ననతిదూరములో సమున్నతశిఖరగోపురప్రాసాదసౌధప్రకాశమానమగు శ్యామలానగరమును జూచి యప్పటికి జాము ప్రొద్దెక్కుటచే నాపూట కందు వసింపఁదలఁచి తన ఘోటకము నావీటిమార్గమున నడిపించెను.
జను లతనియాకారము జూచి వెఱఁగుపాటుతో మూగి వెంటరాఁదొడంగిరి. రాజవాహనుఁడువలె విల్లమ్ములుదాల్చి మహావీరపురుషవేషముతో నొప్పుచుండెను. పట్టణంబునఁ గొన్ని వీథులు మాత్రము చుట్టుతిరిగి పరదేశులు వసించు సత్రమునకుం బోయి యందు గుఱ్ఱమునుదిగి వాకిటఁ గట్టి కొంచెముసే పందొక చావడిలో విశ్రమించినది.
అంతలో సత్రాధికారి వచ్చి తదాకారవిశేషమున కచ్చెరువందుచు నెవ్వఁడో మహారాజకుమారుండని నిశ్చయించి వినయముతో జెంతకు వచ్చి దేవా! మీ రీవాకిట వసింప నేల! లోపలకు రండు. చిత్రశాలలో విశ్రమింపుఁడు. మీ గుఱ్ఱమునకు మేత వేయించెద. వంటయైనది. భుజింపవచ్చునని పలికిన విని సంతసించుచు నమ్మించుబోఁడి యాఁకలిఁ గొని యున్నది. కావున నతనివెంటఁ బోయి స్నానాదికముఁజేయక యాదస్తులతోనే భుజించినది.
భోజనానంతరము వెండియుఁ జావడిలోఁ గూర్చుండి తాంబూలము వేచుకొనుచు యందలివింతలం జూచుచుండెను. సత్రాధికారి దాపున వసించి పరిజనులచే విసరింపుచు నామె యడిగినమాటలకు సమాధానముఁ జెప్పుచుండెను.
ఆ చావడిలో నెదురుగాఁ బెద్దయుద్ధములో ననర్ఘకనకమణిపటలఘటితముగా నొకప్రతిమ చేర్పఁబడి యున్నది. దానిం జూచి శ్రమణి వెఱఁగందుచు నయ్యా? ఈ చిత్రఫలక మెవ్వరు వ్రాసిరి? ఎవ్వరిది? అని యడిగిన విని యతం డిట్లనియె.
సౌమ్యా! ఈ మహానుభావుని కులశీలనామము లేమియుఁ దెలియవు. ఇతండు మాదేశమునకు, మా పట్టణమునకు, మా ప్రజలకు, మా రాజునకుఁ గావించిన యుపకార మిట్టిదని చెప్పఁజాలను. ఈతం డడ్డపడకున్న మానగర మీపాటికి శూన్యమై యుండును. వినుండు. మా రాజునకు శ్యామల యను కూఁతు రొక్కతియే కలదు. భూమండలమంతయు వెదకి యొక రాజకుమారుం దెచ్చి వివాహము గావించి మహావైభవముతో నాలుగవనాఁ డూఱేగింపుటుత్సవము సేయుచుండెను. కొంతదూరము పోవునప్పటికి యా వధూవరు లెక్కిన యేనుగునకు మద మెక్కి దొరికినవారి నెల్లఁ బట్టికొని చంపఁదొడంగినది. పెక్కేల గడియఁలో బదివేలమందిని మడియఁ జేసినది. దానిమీఁద నున్న పెండ్లికొడుకు పెండ్లికూఁతుల గౌఁగలించుకొని యంత్యకాలభగవన్నామస్మరణ జేయుచుండెను. ఆ మతంగము నిరాటంకముగా వీధులఁదిరుగుచుఁ ప్రజావధ జేయుచుండ నే వీరుఁడు నిలుపలేకపోయెను.
మఱిరెండుగడియ లామతంగ మట్లు సంచరించినచోఁ బట్టణమునం శూన్యము జేసిపోవును. అంతలో దైవ మీస్వరూపమున నరుగుదెంచి యా దంతావళము దంతములు పట్టుకొని నిలువంబడి మచ్చికఁజేసి పండుకొనఁ బెట్టెను. ఆ వివాహదంపతులు దిగి యా పురుషునకు నమస్కరించి మరల నది లేచునను వెఱుపుతో నొకయింటిలోనికిం బోయిరి. చచ్చినపాముం జంపుట కందరు శూరులేకదా? అది పండుకొనియుండ తుపాకులు కాల్చి రాజభటులు దానిం జంపిరి.
ఆ మరునాఁ డాపురుషుని నిమిత్త మీపుర మెల్ల వెతకించిరి. ఎందును గనంబడలేదు. భగవంతుఁ డట్లు వచ్చెనని నిశ్చయించిరి. రాజపుత్రిక వానియాకారము కన్నులార జూచియున్నది. కావునఁ జిత్రపటంబున నీరూపము వ్రాసి యిచ్చినది. దానిఁబట్టి యంత్రమున ననేక చిత్రప్రతిమలు తీసి గ్రామమంతయు వ్యాపింపఁజేసిరి. ప్రతి గృహమునందును దాని దేవతఁగా నునిచి ప్రజలు పూజించుచుండిరి.
రాజపుత్రిక సహస్రదళపద్మములచే నిత్య మీపురుషరత్నము ప్రతిమను బూజించుచున్నదఁట. మఱియు సత్రములయందు, దేవాలయములయందు, మఠముల యందుఁ బెద్దరత్నఫలకములలోఁ జేర్చి యిట్లు వ్రేలఁ గట్టించిరి. ఇదియే దీనివృత్తాంత మని యెఱింగించిన విని యవ్వనితారత్నము గనుల నానందబాష్పములు గ్రమ్మ నట్టిపని తనసోదరుఁడే కావించినవాఁ డని నిశ్చయించి కన్నులు మూసికొని యించుక ధ్యానించినది.
అప్పు డాసత్రాధికారి దానిపోలిక పరీక్షించి యొక్కటిగా నుండటఁ దెలిసికొని రహస్యముగా నాఁడు మదరికం బట్టిన జెట్టి వచ్చి యున్నవాఁడని రాజపురుషులకు వర్తమానము పంపెను. ఈ లోపల బ్రజలకు దెలియుటచే నాటిమహాత్ముఁడు సత్రంబునకు వచ్చియున్నవాఁడట. చూతము రండు రండనుచు గుంపులుగా వచ్చి చుట్టుకొని నమస్కరించువారును, మీఁదఁ బూవులు జల్లువారును, ఫలము లర్పించువారును, హారతులిచ్చువారునై సేవింపుచుండఁ జూచి శ్రమణి సత్రాధికారితో నయ్యా! ఇది యేమి? ప్రజ లిట్లు వచ్చుచున్నారని యడిగిన నతం డిట్లనియె.
దేవా? నీవు నిజము గోప్యము చేసినను నా చిత్రఫలక మీతఁడే నీవని చాటి చెప్పుచున్నది. మాణిక్యమును మూఁటకట్టినఁ ధత్ప్రభలు బయలపడకుండునా? మీయందుఁగల విశ్వాసముతోఁ బ్రాణదాత వగు ని న్నిట్లు పూజించుచున్నారని పలుకు చుండఁగనే యతనికై వేచి తిరుగుచున్న రాజపురుషు లావార్త విని కనకాలబోకరముఁ బట్టించుకొని మేళతాళములతో నచ్చటికి వచ్చి ప్రజలం దప్పించుకొనుచు లోపలఁ బ్రవేశించి నమస్కరింపుచు మహాత్మా! నేటికి మాయం దనుగ్రహం గలిగినదియా? నీనిమిత్త మెన్నిదేశములు దిరిగుచుంటిమి. కానిండు, రండు. రండు. పల్లకీ యెక్కుఁడు. మామహారాజు మీనిమిత్తము యెదురుచూచుచున్నాఁడని పలుకుచు నతఁడు చెప్పుమాట లేమియు వినిపించుకొనక చేతులు పట్టుకొనఁ బోవుటయు వలదు వలదు అని వారించుచుఁ దానే లేచి తిన్నఁగాఁ బోయి యాపల్లకీలోఁ గూర్చుండెను. తూర్యనాదములు భూనభోంతరాళము నిండ శ్రమణి నా పట్టణపురవీథుల నూరేగింపుచుండిరి. క్రమంబున నయ్యూరేగింపు నాఁటిరాత్రి యుత్సవముకన్నఁ బెద్దదైనది. వీథులన్నియు జనులచే నిండింపఁబడినవి. దేవునికివలె హారతు లిచ్చుచు, పుష్పములం జల్లుచు ఫలము లర్పించుచు నానావిధోపచారములచేఁ బ్రతిగృహస్థుఁడు నతని నారాధించుచుండెను.
అ ట్లూరేగింపుచుఁ గ్రమంబునఁ గోటలోనికిఁ జేరినంత రాజుగారు, నల్లుఁడు గొంతదూర మెదురువచ్చి చెరియొకప్రక్కను నిలిచి పల్లకీదండ పట్టికొని వింజామరల వీచుచు సభాంతరాళమునకుఁ దీసికొనిపోయిరి.
పల్లకి దింపినతోడనే నృపతి యతనికిఁ కైదండ నందిచ్చి లేవదీయఁబోవుటయు వారించుచు శ్రమణి తానే తటాలున లేచి వారివెంటఁబోయి తన్నిర్దిష్టమగు రత్నపీఠంబునం గూర్చుండెను. అప్పుడు నృపతియు నల్లుడును బ్రక్కల నిలువంబడి వీటోపులు విసరుచుండ వారించుచు బలవంతమున గారిని గూర్చుండఁ బెట్టినది.
ప్రజలసమ్మర్ధ ముడిగినపిమ్మట శ్యామల సఖీశతపరివృతయై వచ్చి తత్పాదంబులంబడి నమస్కరింపుచు మహాత్మా? నీవు భగవంతుఁడవై వచ్చి మాయాపద దాటించితివి. నాఁడే నీకొరకు వెదకించితిమి అదృశ్యుండ వైతివి. నేఁడు మద్భాగ్యవశంబున దర్శనన మిచ్చితివి. నీ కులశీలనామంబు లెట్టివో యెఱింగించి శ్రోత్రానందము గావింపుఁడు. ప్రాణదాతవైన మీవృత్తాంత మెఱుంగుటకు మిగులఁ గుతుకముగా నున్నది. అని యనేకప్రకారముల స్తుతియింపుచుఁ బూసురటితో విసరుచున్న యబ్బిసరుహానన కృతజ్ఞత్వమునకు మెచ్చుకొనుచు శ్రమణి వారినెల్లఁ గూర్చుండ నియమించి యిట్లనియె.
మహారాజా! సత్పురుషులు కొంచెముపాటి యుపకృతియుఁ గొప్పగాఁ జెప్పికొందురు? మీయం దట్టిధర్మము గనంబడుచున్నది. ఈమె రాణివాసము విడిచి ప్రాణదాత నను తలంపుతోఁ బరుండ నని శంకింపక నాకడకు వచ్చి తన కృతజ్ఞత్వమును వెల్లడించుచున్నది. మీరు గూడ నన్ను గొప్పఁ జేసి యతీతములగు నుపచారములు చేయుచున్నారు. ఇది యంతయు మీ సాధుశీలత్వము కాక వేరొకటికాదు వినుండు.
నేను దుందుభియను పుళిందచక్రవర్తి కుమారుండ నన్ను మహిళాంగుం డండ్రు. మాయన్న రాజవాహనుఁ డనువాఁడు. మా యిరువురపోలికయు నొక్కటిగా నుండుటచే నేనే యాతండని మీరు భ్రమపడి యీ యుపచారములఁ జేయుచున్నారు. అతండు కొలఁది కాలము క్రిందట మహేంద్రనగర మరుగుచు నీయూరు వచ్చి మీయాపదఁ దప్పించియుండును. అతనిని జయపురంబున నన్యాయముగా మధువర్మ యనురాజు చెఱసాలం బెట్టించెనని విని నే నందరుగుచు మార్గవశంబున నీవీఁడు చేరితిని. నా మాట వినిపించుకొనక మీ రందఱు నా కపూర్వగౌరవము గావించితిరి. కానిండు. మా యన్న పొందవలసిన సత్కారముల నే నందితిని. మీ కెల్లరకు నింత గౌరవము గలుగుట మా పూర్వపుణ్యసుకృతముగాక మఱియొండు గాదు.
ఇప్పుడు నే నతనికడకుఁ బోయి తద్భంధనప్రకార మెఱింగి శక్యమైనచో విడిపించెద లేనిచో మీ కొకజాబు వ్రాసెదఁ దగిన సైన్యముల సహాయ మీయుఁడు. ఇదియే మీరు వానికిఁ జేయు ప్రత్యుపకారమని పలికిన విని యమ్మహారా జిట్లనియె.
ఒహోహో! ఎంతమాట వింటిమి. మాకుపకారముఁ జేసినవాఁడు మీ యన్నయా? అతని పేరు రాజవాహనుఁడా? ఎట్లయిన మీ కుటుంబమున మాకు విశ్వాస ముంచక తీరదు. అయ్యసహాయశూరు నెట్లు పట్టికొనిరో యది యసంభవము. కానిండు. ఎప్పుడో యననేల? వలసిన దళములఁ దీసికొనిపోయి వాని విడిపింపుడు. అవసరమైన నేను గూడ వత్తునని పలికిన శ్రమణి యిట్లనియె.
దేవా| ఇప్పు డెవ్వరు రానక్కరలేదు. నే నొక్కరుండఁబోయి కార్యము సాధించెద. కానినాఁడు సేనం బంపుదురుగాక. మీ సహాయ మెప్పుడుం గావలసినదే యని పొగిడినది ఆ దివసంబెల్ల నొండొరుల చరిత్రములు చెప్పికొనుచుఁ దృటిగా వళ్ళించిరి. కోటలో నా రాత్రి యతనికి గొప్ప విందుఁ గావించిరి. అని యెరింగించి తరువాయికథ పై మజిలీయందు జెప్పఁ దొడంగెను.
181 వ మజిలీ
సునందుని కథ
శ్రమణి మరునాఁ డరుణోదయమునకు లేచి రాజు ననుమతి వడసి యెవ్వరిని వెంటఁ బెట్టుకొనక యస్వారూఢయై జయపురంబున కరుగుచుండెను. మఱి యొకనాఁ డొకచోట నీ ప్రాంతమందలి పల్లెలోఁ జిలుక శకునము చెప్పునని యెవ్వరో జెప్పినంత విని యా పల్లెకుంబోయి యొకచోట బసఁజేసి యందలి నిబంధన లన్నియుం దెలిసికొని మా యన్న రాజవాహనుఁడు వెంటనే విడువఁబడునా? అని ప్రశ్న మడిగి కులశీలనామాదులు వ్రాసి సొమ్ముతో గూడ నం దర్పించినది. ఆ ప్రశ్నమున కుత్తరము జెప్పుటకు నాలుగుదినములు గడవుఁజెప్పిరి.
శ్రమణి యన్నయుంబోలెఁ దానుగూడ నేమియుం దోచక యశ్వ మెక్కి సాయంకాలమున నుద్యానవన ప్రాంత భాగముల విహరింపుచుండెను. అప్పు డొక రాజకుమారుఁ డొకతోటలో గుర్రమెక్కి వచ్చుచు నెదురుపడియెను, ఒండొరులఁ జూచుకొనినప్పుడు రాజకుమారుఁడు శ్రమణి నెరింగినట్లుగా నవ్వుచు నా గుర్రమును నడిపించెను. రెండు గుర్రముల నొకచోట నాపి దిగినప్పుడు రాజపుత్రుఁ డోహోహో! నా మిత్రుఁడు రాజవాహనుఁడా! ఎవ్వరో యనుకొనుచున్నా నని పలుకుచు దాపునకు వచ్చి బిగ్గరగా గౌఁగలించుకొనియెను.