Jump to content

కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/187వ మజిలీ

వికీసోర్స్ నుండి

నీవుజూచిన పక్షి యాపారావత శకుంతము జాతిది. అది యేజాతి విహంగమో యెవ్వరు పోల్చలేకపోయిరి. భూలోకములో నాపక్షిజాతి యుదయించుట కదియే మొదలు. ఇది నాకలోక పతగ సంతతి యగుట నీకు దానిరూపము, పలుకు, మిక్కిలి విస్మయము గలుగజేయుట నిట్టివింత యెన్నడును జూడలేదని యడిగితివి. నీవడిగిన ప్రశ్న మూరకపోవదు. మంచికథ పొడచూపినది వింటివా! అని చెప్పిన గోపకుమారుండు అయ్యగారూ! మీయనుగ్రహ మిందులకు గారణము. ఈకథ నాహృదయమున కధికానందము గలుగజేసినదని స్తుతియించెను. వారు మఱునాడు లేచి తదనంతరనివాసమున కరిగిరి.

187 వ మజిలీ

జగన్మోహనుని కథ

మ. సురలోకంబున నాకలోకమున రక్షోలోకమందైన సా
     గర మందైనను భీకరాటవుల దుర్గస్ఫారవిశ్వంభరా
     ధరవర్గంబులనైన దుష్కరదురంతవ్యాప్తి నొప్పారినన్
     స్థిరసంకల్పుల కార్యముల్ జగతి సిద్ధించుం బ్రయత్నంబునన్.

వ. వత్సా! ఆనందకాననంబు, అవిముక్తంబు, మహాశ్మశానంబునను పేరులం బ్రసిద్ధినొందిన శ్రీకాశీనగరంబునకు మన మఱుగుచుంటిమి. నేఁ డీప్రదేశంబున మి మ్మడుగఁ దగిన విశేష మేదియుఁ గనంబడలేదు. వారణాశీపురప్రభావద్యోతకంబగు వింతకథ యేదేని యానతీయుఁడని యడిగితివి. సంతసం బయ్యె. మణిప్రభావంబున నంతఃకరణమునకు నొకపక్కని కథ గోచరముఁ జేసికొంటిని. అది మున్ను నీవు విన్న వానికన్నఁ జాల చమత్కృతిగా నుండు నవహితుండవై యాలింపుము.

క. కావేరీ తటమున శో
   భావిలసితమగుచు నొక్కపట్టణవర మిం
   ద్రావతి యనఁదగు భూసుర
   భూవరవిట్శూద్రలలిత భూశోభితమై.

అప్పట్టణంబున కధినాయకుండై యింద్రమిత్రుండను రాజు మహేంద్రవైభవంబున రాజ్యము చేయుచు రూపజితలతియగు మలయవతి యను సతియందు నుచితకాలమునఁ ద్రిభువనాశ్చర్యకరసౌందర్యంబునం బొలుపొందు నందనుంగని యప్పట్టికి జగన్మోహనుండను పేరుపెట్టి యిట్టట్టనరాని వేడుకలతోఁ బెనుచుచుండ నా బాలుండు శుక్లపక్ష శర్వరీపాలుండు వోలె దినదినాభివృద్ధి వడయుచుండెను. పూర్వము నుండియు క్షత్రియులకు ధాత్రీసురులే మిత్రులయి మంత్రులయి యొప్పుట వాడుక యున్నది. ఉత్తమ మంత్రిపుత్రునికన్న రాజపుత్రునితో సహవాసిఁగను సహాధ్యాయునిగను జేయుటకు గౌరవనీయుఁడగు మరియొక బాలుఁడు దొరకుట దుర్ఘటము శిశుక్రీడల సహవాసము నాఁటినుండియుఁ గలిసినమైత్రియుఁ బ్రేమయు ననురాగము నిర్యాజముగ నవిచ్చిన్నముగ నుండకపోవదు. ఇంద్రమిత్రుని ప్రధానమంత్రి గుణనిధియనుబ్రాహ్మణుడు. అతని పుత్రుడు సిద్ధార్థుఁడు. సిద్ధార్థుఁడు రాజపుత్రు నంతటి చక్కనివాఁడు కాకపోయినను సామాన్య రూపవంతులలో నుత్తముఁడని చెప్పదగినది. ప్రాయము చేతనే కాక బుద్ధివిశేషముచేత నిరువురు సమానులని పేర్పొందిరి. పెక్కేల పాంసుక్రీడలు మొదలు విద్యాభ్యాసాంతము వఱకు వారిద్దరికి నొక్కచోటనే భోజనము, ఒక్కచోటనే శయనము, ఒక్కవిధమే యలంకారము, ఒక్కవిధమే గౌరవము, వారిద్దరికి నొక్కటియే ప్రాణము, విద్యాభ్యాసము సమానముగా జరిగినది. సిద్ధార్థుని బుద్ధిబలము, రాజపుత్రుని భుజబలము విశేషించి జను లద్భుదముగాఁ జెప్పుకొనుచుండిరి. గురువుల నడిగిన శంకలకు వారు సమాధానము సెప్పలేనప్పుడు తమరే వితర్కించి సదుత్తరము లిచ్చి మెప్పించుచుందురు.

ఒక వసంతకాలమునఁ బ్రొద్దు గ్రుంకిన రెండు ఘడియలకు వారిద్దరు నొక యుప్పరిగపై వసించి మలయమారుతపోతములు మేనికి హాయిసేయఁ బండువెన్నెల సేవింపుచుండి రందు రాజపుత్రుఁ డాకసము వంకఁ జూచుచు మంత్రిపుత్రున కిట్లనియె.

వయస్యా! నీలంపు పట్టుపుట్టంబునం గట్టఁబడిన వితానంబును బోలె డంబు మీరియున్న మున్నునం గూర్చిన వజ్రంపురవ్వలవలెఁ జుక్క లక్కజమగు తేజంబున ప్రకాశింపుచున్నవి. చూచితివా? ఆహా! సూర్యచంద్రనక్షత్రాదుల ప్రచారములే భగవంతుని ప్రభావమును జాటుచున్నవి. అయ్యారే! సూర్యుఁ డెందు నిలిచి యెందుండి యెందు బోవుచున్నవాఁడో చంద్రునిగతి యెట్టిదో, నక్షత్రప్రచారము లెట్టివో, చూచిన వాఁడెవ్వఁడును లేఁడు. సూర్యకాంతియే చంద్రునియందును నక్షత్రములయందునుఁ ప్రకాశింపఁజేయునని చెప్పుదురు. సిద్దాంతశాస్త్రకర్తలు చిరకాల మాకసమువంక బరీక్షించి గ్రహనక్షత్రాదులగతులు చూచి చూచి గ్రంథములు వ్రాసిరి కాని యక్కడికిఁ బోయి చూచి వ్రాసిన విషయములు కావు. ఔరా! అన్నియు గనంబడుచున్నవి, నడుచుచున్నవి. అవి యేవియో తెలియవు. అవి లేకున్న మనము క్షణము జీవింపజాలము. అని చెప్పుకొనుచుండఁగనే వారికడకు సిద్ధాంతదేశికుం డరుదెంచెను. వారిద్దరు దిగ్గునలేచి నమస్కరింపుచు సుఖాసీనుం గావించి వారును పీఠము లలంకరించిరి. అప్పుడు వారికి గురుఁడు గ్రహనక్షత్రాదులకుఁ గల సంబంధములు గమనములు స్వరూపములు లోనగు విశేషములన్నియు నెఱింగించెను. అప్పుడు రాజకుమారుం డా యాచార్యున కిట్లనియె.

రాజ - ఆర్యా! సూర్యుఁడు చంద్రుఁడు నక్షత్రము లనఁగ నెట్లుండును, తేజోరాసులా! అగ్నిజ్వాలలా? యంత్రములా? అవి యన్నియు నొక్కచోట నున్నవియా? దూరదూరముగా నున్నవియా?

గురు - రాజపుత్రా ! విను మవి యన్నియు గోళములు. పరస్పరసంబంధము గలిగియున్నవి. అన్యోన్యాశ్రయత్వము వలనఁ దిరుగుచున్నవి.

రాజ - ఎక్కడ ! దిరుగుచున్నవి ?

గురు - భూమిచుట్టును, మేరువుచుట్టును.

రాజ -- గోళములన నేమి?

గురు - గుండ్రముగా నుండునని గోళములనంబడును గదా?

రాజ - భూమివలె నవియు గుండ్రముగా నుండునని చెప్పుచున్నారు. సరియే. అందు మనుష్యులుగాని, జంతువులుకాని యుందురా.

గురు – అవి యన్నియుఁ బుణ్యలోకములని పురుణగాథలు సెప్పుచున్నవి.

రాజ - పురాణకథలకును సత్యమునకును జాల దూరమున్నది. సాయంకాలమున సూర్యరథమునకు మందేహాసురు లడ్డము వత్తురనియు నప్పుడు విప్రు లిచ్చు నర్ఘ ప్రదానతోయము వజ్రాయుధమయి వారిని దూరముగాఁ ద్రోసివేయుననియుఁ బురాణములలో గాక వేదమందుఁ గూడఁగలదు. ఆమాట సత్యమా?

గురు - సత్యము కాదందురా, యేమి?

రాజ - వయస్యా! నీవు చెప్పుము.

సిద్ధా - అయ్యా! అస్తమయము, సూర్యున కున్నదా? సర్వదా యుదయించుచు సర్వదా యస్తమించునట్లు మనకుఁ గనంబడునుగాని సూర్యున కుదయాస్తమయము లున్నవియా? మరి మందేహాసురు లెప్పుడువత్తురు. సంతతము వచ్చుచుండవలయు నిది ప్రత్యక్షమునకు విరుద్దముకాదా?

గురు - ఓహో! అదియా? మీరు చేసినశంక. పోనిండు. పురాణములలో గొంత యసత్యముండవచ్చును. దీని విషయమయి మీ రేమందురు?

రాజ - ఆచార్యా! ఈ కుశ్శంకలకేమి కాని నాకానక్షత్రముల కడకు బోయి యందలి విషయములు కన్నులార చూడవలయునని యున్నది. నామనోరథ మెట్లుతీరును?

గురు -- ఈ మనుష్యదేహముతో జూచుట శక్యముకాదు.

రాజ -- భూలోకమే ప్రధానలోకమగును సూర్యచంద్రాదులు భూలోకసంరక్షణకొఱకే సృజించినట్లు కనంబడుచున్నది. చూచితిరా?

గురు - అవును. అట్లే కనంబడును.

రాజ --- ఆ లోకములన్నియు మనుష్యుల కొఱకే నిర్మింపబడినవియా?

సిద్ధా - అవి స్వతంత్రలోకములై భూలోకమునుగూడ గాపాడుచున్నవనియె నా యభిప్రాయము.

రాజ - అవియు భూలోకమువంటివే యనియు నందుగూడ జను లుందురని యొప్పుకొనియెదరా?

సిద్ధా - సందియమేలా? అవియన్నియు లోకములని స్కాందమున జెప్పబడియున్నది. సూర్యలోకమున వైకుంఠము, చంద్రలోకమున స్వర్గాదిలోకములు గలిగియున్నవని పురాణగాథ లున్నవి.

గురు - ఆమాట సత్యమే, సూర్యలోకము భూలోకముకన్న పెద్దది. చంద్రలోకము భూమియంతయేయున్నది అని జ్యోతిశ్శాస్త్రము చెప్పుచున్నది.

రాజ - వయస్యా! నాలోకవిశేషము లెట్టివో చూడవలయునని యభిలాష గలుగుచున్నది. సాధన మేదియో యూహింపుము.

సిద్ధా - మణిమంత్రౌషధీశక్తులవలన బోవచ్చును. అవి తపస్సాధ్యములు.

గురు - మీరు వెర్రిపోకలం బోక విద్యలన్నియు బూర్తిజేయుడు. పట్టాభిషిక్తులై భూమిం బాలింపుడు. సూర్యచంద్రాదు లేవి యెట్లయిన మనకేమి?

రాజ - భూలోకవిశేషము లన్నియుం జూడవచ్చును. చూచినవారు పటములే చిత్రించియున్నారు అందొక విశేషములేదు. ఆ కనంబడు నక్షత్రములకు గొన్నిటికి మాత్రమే పేరులు వ్రాసియున్నారు కోట్లకొలది యున్నవన్నియు నేమియో వ్రాయలేదు. చూచినవానిలో నొకదానినైన జూడవలయును. లేకున్న మడగులోబడి చావవలయును ఇందులకు సాధనము లాలోచింపుడు. ఈ చదివిన చదవు చాలును. ఎంతచదివినను జర్వితచర్వణమే కాదా!

సిద్దా - వయస్యా! మొదటినుండియు నీవు క్రొత్తవిశేషములందు వేడుకపడుచుందువు. హేతువాదముల విమర్శింపుచుందువు. ఇప్పుడు నీవు కోరినకొలది తపస్సాధ్యము, తపశ్శాలుల యనుగ్రహంబునను బడయవచ్చును. కానిమ్ము ఆలోచింతముగాక ఇప్పు డీగురుం డెఱింగించు సిద్ధాంతసాధ్యముల నాకలి్ంచుకొనమని యుపదేశించిన విని రాజపుత్రుండు చెవియొగ్గి యవహితుండగుటయు ఆగమములు జ్యోతిష ఖగోళ విశేషములన్నియు నుప్యసించెను. రాజపుత్రుని బుద్ధిమాత్రము సర్వత తత్వగ్రహణమందే సక్తమయి యుండెను. అంతటితో నాటికి విధి ముగిసినది.

అని యెఱింగించు నప్పటికి గాలాతిక్రమంబు యగుటచయు మణిసిద్ధుడు అవ్వలివృత్తాంతము పైమజిలీయందు జెప్పందొడంగెను.