కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/177వ మజిలీ

వికీసోర్స్ నుండి

నదటింకనుం దీరకున్నది. ఇది మరల లేచి పీచమడంచునేమో యను భయముతో నిందు నిలువజాలము. ప్రాణదాతవైన నీ కులశీలనామంబులు దెలిసికొనుట యావశ్యకమే కాని మాకిందు నిలువధైర్యము చాలకున్నది. మీరు మావెంట మాయింటికి రావలయునని ప్రార్థించుచుండ నా వెదండ మొకఘీంకారము గావించినది.

అప్పు డదరిపడి వారు కాలికొలఁది పారిపోయి యొక యింటిలో దూరిరి. రాజవాహనుఁడు హుంకార మొనరించి దాని లేవకుండఁ చేసెను. అంతలోఁ జాటుగాఁ దిరుగుచున్న రాజభటులు తుపాకులం గాల్చి దానిం బంచత్వము నొందఁజేసిరి.

మదపుటేనుఁగ జంపఁబడినదని తెలిసినతోడనే రాజమార్గము లన్నియుం బ్రజలచే నిండింపఁబడినవి. ఇండ్లతలుపులు తెరువఁబడినవి. దాసదాసీజనంబులు పెక్కండ్రు వచ్చి వధూవరుల వెదకి వాహనంబు లెక్కించి కోటలోనికిఁ దీసికొని పోయిరి. ఎవ్వఁడో మహాపురుషుఁడు వచ్చి యా యుపద్రవముఁ దప్పించెనని జనులు చెప్పుకొనఁ దొడంగిరి.

అని యెఱిగించువఱకు వేళ యతిక్రమించినది. తరువాతికథ పైమజిలీ యందు జెప్పదొడఁగెను.

177 వ మజిలీ

రామచిలుక కథ

అశోకవతి యమ్మరునాఁ డందు నిలిచి రాజదర్శనముఁ జేసి పోవుదమని పలికినది. కాని యతం డందుల కంగీకరింపక నాఁటి వేకువజాముననే వారాయూరు బయలుదేరి పోవుచుఁ గొన్ని పయనములు సాగించిరి.

అట్లరుగుచుండ నొకనాఁ డొకచోట మార్గమున కనతిదూరములో నొక గ్రామము రాజవాహనునికి నేత్రోత్సవము గావించినది. అశోకవతీ? ఈ యూరిపేరేమి? గ్రామము చిన్నదైనను సుందరమందిరారామశోభితమై యొప్పుచున్నది అని యడిగిన నది చిఱునగవుతోఁ గుమారా! నీ వడుగకున్నను నిందలివింత యొకటి నీ కెఱింగింపఁ దలంచుకొంటి నందులకే యిందు బండి నిలిపితిని. వినుము, ఈ పల్లె యందుఁ దులాధారుఁడను వర్తకుఁడు గలడు. పూర్వపుణ్యవశంబున వానికెట్లో యొకరామచిలుక లభించినది. అది యతీతానాగతవృత్తాంతముల శకునములు చెప్పుచుండును.

దాని దేవమందిరమున బంగారుపంజరములో నునిచి నిత్యము దేవతావిగ్రహమువలె వాఁడు పూజించుచుండును. అది చెప్పు శకునమువలన నావైశ్యుఁడు మిక్కిలిగా ధన మార్జించుచు నీమేడలన్నియుం గట్టించెను. దూరదేశమునుండి మహారాజుల రాజపుత్రులు, రాజపుత్రికలు, శకునము లడుగ నిచ్చటికి వచ్చుచుంచుదురు. పరిజనుల నంపుచుందురు. దీని వాడుక భూమండల మంతయు వ్యాపించింది.

మారాజపుత్రిక దీనిం గొనవలయునని యెంతయో ప్రయత్నము చేసినది కాని యీ వర్తకున కదియె జీవిక యగుట నమ్మఁడయ్యెను. మన మిప్పు డిందాగి యావింత చూతమా? అని యడిగిన నతండు సందియమేలా? చూచుటయేకాక నేను కొన్ని శకునముల నడిగెదనని పలికి పరిజనులతోఁగూడి నతం డాపల్లెలోనికిఁ బోయెను.

ఆ వర్తకుఁ డందు వచ్చిన వారికి సమస్తసదుపాయములుగల బసలనేకములు గట్టించి యుంచెను. వా రొకదానిలోఁ బ్రవేశించి శకునము లడుగుటకై యా చిలుకయొద్దకుఁ బోయిరి. అది దినమునకు నలుగురకుమాత్రమే శకునములు చెప్పును. అది చెప్పినమాట లావర్తకుఁడు పత్రికలపై వ్రాయించి యిచ్చుచుండును. అడుగువారు గూడ బత్రికలపై వ్రాసియే యడుగవలయును. ప్రవేశక్రమంబునఁ బ్రత్యుత్తరములు వ్రాసియిచ్చి యంపుచుందురు రాజవాహనుఁ డొకపత్రికపై కొన్ని ప్రశ్నముల వ్రాసి యందుల కీయవలసిన విత్తముతోఁ గూడ నాపత్రిక వారి కర్పించెను. అంతకుమున్ను పెక్కండ్రు వ్రాసియిచ్చిన పత్రికలు నిలువయున్నకతంబుననాఁటికిఁ బదపదివసంబు నీప్రశ్నముల కుత్తర మీయఁబడునని తెలియఁజేసిరి. కావున నంత దనుక నతండందుండక తీరినదికాదు.

అప్పు డశోకవతి యాలోచించి రాజవాహనా! నే నిల్లుబయలుదేరి చాల దినములై నది. మా రాజపుత్రిక నారాక వేచియుండును. నీకుఁ దగిన పరిచారికల నిందుండ నియమించెదను. పదిదినము లిందుండి ప్రశ్నలం దెలిసికొని పిమ్మట వీరి వెంట మహేంద్రనగరంబునకు రమ్ము, ముందుగా నేను బోయి మీరాక రాజపుత్రిక కెఱింగించి తగిన సన్నాహము గావించెదనని చెప్పి యొప్పించి నమ్మకమైన పరిజనుల నిందుంచి యాయశోకవతి మహేంద్రనగరంబున కరిగినది.

రాజవాహనుఁడు నాటిసాయంకాలమున నేమియుం దోచక గుఱ్ఱమెక్కి యందందు విహరింపుచుండెను. మఱియొక రాజకుమారుఁ డశ్వారూడుఁడై యతని కెదురు పడియెను. ఇరువురు సంజ్ఞలఁగా బల్కరించుకొని విచిత్రప్రచారంబుల దమగుఱ్ఱముల నడిపించుచుఁ గొంతదూరము పోయిరి.

ఆ రాజపుత్రుఁడు రాజవాహనునితో సమముగా, గుఱ్ఱమును నడిపింప లేకపోయెను. మఱియుఁ దదీయతురంగారోహణ పాటవముఁజూచి యక్కజ మందుచు నొక్కచోఁ దనవారువము నాపి యారాజపుత్రుఁడు రాజవాహనునిం బ్రార్ధించి గుఱ్ఱమును దింపి హస్తగ్రహణము చేయుచు నిట్లనియె.

రాజ - పురుషసింహమా? మీ దేయూరు? యెవ్వని కుమారుండవు? ఈ యశ్వారోహణపాటవ మెందు నేర్చుకొంటివి ?

పులింద - మా గ్రామము పర్వతప్రాంతమందున్నది. నేను పులింద చక్రవర్తి కుమారుఁడను. నాపేరు రాజువాహనుఁ డందురు. ఇప్పుడు నాపాటవ మేమి చూచితిరి? మీగుఱ్ఱముతో సమముగా నడిపించుటచే విచిత్రగతు లేమియుం జూపుటకు వీలుపడినదికాదు.

రాజ - ఆహా! మీ వాహనము నింతకన్న జమత్కారముగా నడిపింపఁ గలరా?

పులింద — మదీయవిహారచమత్కారము చూతురుగాక యని పలుకుచు వెండియు గుఱ్ఱమెక్కి యా సందిద, ధోరితర, రేచిత, వల్గిత, ప్లుత, పంచవిధ గతివిశేషములం జూపుచు రాజకుమారుని హృదయము నాశ్చర్యసాగరంబున మునుఁగఁజేసెను.

రాజ - రాజవాహనునిఁ గౌగలించుకొని మహావీరా! నీ వశ్వశిక్షణమందు నకులుని మించితివి. ఇన్ని గతు లెఱింగినవాని నేను జూడలేదు. నీకు శిష్యుండ నయ్యెద నా కీపాటవము నేర్పెదవా?

పుళింద - మీరెవ్వరు ?

రాజ - నేను దుర్గనరాధీశ్వరుని కుమారుఁడ. నాపేరు సుమంతుఁడందురు.

పుళింద - మీరిక్కడి కేమిఁటికి వచ్చితిరి?

రాజ - చిలుకను గొన్ని ప్రశ్నలడుగుటకు.

పుళింద — అడిగితిరా? యథార్థముఁ జెప్పినదియా?

రాజ - అడిగితిని. ఎల్లుండి ప్రత్యుత్తరమిచ్చు దివసముగా నిరూపించిరి.

పుళింద - మీ రెందులకై యడిగితిరో చెప్పవచ్చునా? రహస్యమా?

రాజ - చెప్పకేమి? వివాహవిషయమై.

పుళింద - మీకేనా?

రాజ — అగును. మాతండ్రి నాకొక కన్యకను వివాహము జేయఁదలంచు చుండెను. అది నాకిష్టములేదు. అది తప్పునా? జరుగునా? అదియుఁ దప్పినచో నేదెస నెన్నినాళ్ళకు జరుగును, అని యడిగితిని.

పుళింద— ప్రత్యుత్తర మేమని యిచ్చునో చూడవలసినదే.

రాజ — మీరేమి యడిగితిరి! మీ నిరూపణదివసం బెప్పుడు?

పుళింద— నేనొకవస్తువుం గోరి యరుగుచుంటి నది లభించునా, లభింపదా? యని యడిగితిని. గడువింక పదిదినము లున్నది.

రాజ - (సంతస మభినయించుచు) ఈ పదిదినములు మీ శిశ్రూషఁ గావించెదఁ దురగవిద్యాపాటవము నేర్పుఁడు.

అని కోరికొనియెను. ఇరువురకు గాడమైన మైత్రి కలిసినది. నిత్యము కలిసి వాహ్యాలి సేయుచుందురు. ఆ మరునాఁడు సుమంతుఁ డడిగిన పశ్నములకు నుత్తరములు వచ్చినవి. అందిట్లున్నది. మీతండ్రి చేయఁదలచుకొన్న చిన్నది నీకు వివాహము కాదు. మఱి రెండునెలలు గతించినతరువాత వచ్చినచో నీకగు కన్యకతెఱం గెరింగించెదను. అని యుత్తరము వ్రాయబడియున్నది. అప్పుడు పుళిందకుమారుఁ డాయుత్తరముల విమర్శించుచు నిందలి నిజానిజంబు లిప్పుడు తెలియవు. నిలకడమీఁద దెలియునని పలుకుచు సుమంతుని మైత్రితోఁ బదిదినములు దృటిగా వెళ్ళించెను.

తరువాత రాజవాహనుఁ డడిగిన ప్రశ్నముల కిట్లుత్తరము వచ్చినది. కిరాతకులము అను దానిమీద గీటు పెట్టఁబడియున్నది నీవు కోరినవస్తువు వెంటనే నీకు లభింపదు. కొన్నిదినములు గతించిన తరువాత స్వకీయముగా లభింపఁగలదు.

దాని ముమ్మారు చదివికొని రాజవాహనుఁడు చాలుచాలు. ఈచిలుక చెప్పు శకునమొక్కటియుఁ దత్కాలమున నిదర్శనమేమియు గనంబడదు. స్ఖాలిత్యము లగఁబడుచున్నవి. నాది కిరాతకులము కాఁదట. ఇంతకన్న నసత్య మేమి యున్నది? లోకులకు నీతిలేదు. సుజ్ఞానసంపన్నులగు మనుష్యులకు, యుక్తాయుక్తవివేకశూన్యములగు పక్షులు శకునములు చెప్పుటా? ఆహా! ఎంత చోద్యముగా నున్నది. ఏదో చెప్పునని నేను వృధగాఁ బదిదినములు గడిపితినే? కానిండు. ఇందువలన మీసాంగత్యలాభము గలిగినదని పలికిన విని సుమంతుఁ డిట్లనియె. వయస్యా! ఈ శుక మట్టిది కాదు. దీని మాటలయం దొక్కటియు నసత్యముండదని వాడుక. తొలుత నీవలెనే దీని నాక్షేపించినవారే తిరుగవచ్చి ప్రశ్నల నడుగుచుందురఁట నిడివిమీఁదఁ గాని నిజము తెలియదుగదా? ఇది ముఖప్రీతివాక్యములఁ జెప్పదు. నే నుండగనే యొక రాజపుత్రునకు మీరు రాజ్యపదభ్రష్టులగుదరని వ్రాయించి యిచ్చినది. తరువాత నట్లు జరిగితీరు నని యతం డుపన్యసించెను.

నా కులముబట్టియే యది యసత్యము చెప్పునను నేను తలంచుచున్నానని రాజవాహనుఁడు వాదించెను. అందేమి దేవరహస్యము లున్నవో యని సుమంతు డనువదించెను. ఈరీతి వారు పెద్దయుఁ బ్రొద్దు చిలుకం గుఱించి ముచ్చటించుకొనిరి. అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథఁ దరువాత నెలవునఁ జెప్పం దొడంగెను.

178 వ మజిలీ

అశోకవతి కథ

కల్పలత తనచెంతకు వచ్చి యశోకవతిం జూచినతోడనే మోము వికసింప నెచ్చెలీ! యాపక్షిం దెచ్చితివా? విశేషము లేమని యడిగినది.

అశో -- ఆ పనికంటు సుందరమైన వస్తువుం దెచ్చితిని.

కల్ప - స్వజాతియా ? విజాతియా ?

అశో - స్వజాతికాదు కాని స్వజాతియే. విజాతియుఁ గాదు విజాతియే.