కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/178వ మజిలీ

వికీసోర్స్ నుండి

వివాహము కాదు. మఱి రెండునెలలు గతించినతరువాత వచ్చినచో నీకగు కన్యకతెఱం గెరింగించెదను. అని యుత్తరము వ్రాయబడియున్నది. అప్పుడు పుళిందకుమారుఁ డాయుత్తరముల విమర్శించుచు నిందలి నిజానిజంబు లిప్పుడు తెలియవు. నిలకడమీఁద దెలియునని పలుకుచు సుమంతుని మైత్రితోఁ బదిదినములు దృటిగా వెళ్ళించెను.

తరువాత రాజవాహనుఁ డడిగిన ప్రశ్నముల కిట్లుత్తరము వచ్చినది. కిరాతకులము అను దానిమీద గీటు పెట్టఁబడియున్నది నీవు కోరినవస్తువు వెంటనే నీకు లభింపదు. కొన్నిదినములు గతించిన తరువాత స్వకీయముగా లభింపఁగలదు.

దాని ముమ్మారు చదివికొని రాజవాహనుఁడు చాలుచాలు. ఈచిలుక చెప్పు శకునమొక్కటియుఁ దత్కాలమున నిదర్శనమేమియు గనంబడదు. స్ఖాలిత్యము లగఁబడుచున్నవి. నాది కిరాతకులము కాఁదట. ఇంతకన్న నసత్య మేమి యున్నది? లోకులకు నీతిలేదు. సుజ్ఞానసంపన్నులగు మనుష్యులకు, యుక్తాయుక్తవివేకశూన్యములగు పక్షులు శకునములు చెప్పుటా? ఆహా! ఎంత చోద్యముగా నున్నది. ఏదో చెప్పునని నేను వృధగాఁ బదిదినములు గడిపితినే? కానిండు. ఇందువలన మీసాంగత్యలాభము గలిగినదని పలికిన విని సుమంతుఁ డిట్లనియె. వయస్యా! ఈ శుక మట్టిది కాదు. దీని మాటలయం దొక్కటియు నసత్యముండదని వాడుక. తొలుత నీవలెనే దీని నాక్షేపించినవారే తిరుగవచ్చి ప్రశ్నల నడుగుచుందురఁట నిడివిమీఁదఁ గాని నిజము తెలియదుగదా? ఇది ముఖప్రీతివాక్యములఁ జెప్పదు. నే నుండగనే యొక రాజపుత్రునకు మీరు రాజ్యపదభ్రష్టులగుదరని వ్రాయించి యిచ్చినది. తరువాత నట్లు జరిగితీరు నని యతం డుపన్యసించెను.

నా కులముబట్టియే యది యసత్యము చెప్పునను నేను తలంచుచున్నానని రాజవాహనుఁడు వాదించెను. అందేమి దేవరహస్యము లున్నవో యని సుమంతు డనువదించెను. ఈరీతి వారు పెద్దయుఁ బ్రొద్దు చిలుకం గుఱించి ముచ్చటించుకొనిరి. అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథఁ దరువాత నెలవునఁ జెప్పం దొడంగెను.

178 వ మజిలీ

అశోకవతి కథ

కల్పలత తనచెంతకు వచ్చి యశోకవతిం జూచినతోడనే మోము వికసింప నెచ్చెలీ! యాపక్షిం దెచ్చితివా? విశేషము లేమని యడిగినది.

అశో -- ఆ పనికంటు సుందరమైన వస్తువుం దెచ్చితిని.

కల్ప - స్వజాతియా ? విజాతియా ?

అశో - స్వజాతికాదు కాని స్వజాతియే. విజాతియుఁ గాదు విజాతియే.

కల్పలత — నీమాట లేమియు నాకర్థము లగుటలేదు. నన్ను వేపక యేమి జరిగినదియో సత్యము చెప్పుదూ?

అశో - త్రిభువనాశ్చర్యకరసౌందర్యశౌర్యధైర్యవిశిష్ట మగు వస్తువుం దెచ్చితినని చెప్పలేదా?

కల్పలత — ఆ యాశ్చర్య మేదియో చూపుము. అనుటయు నగుమొగంబుతో నశోకవతి తాను వ్రాసి తెచ్చిన రాజువాహనుని చిత్రఫలకము తీసి యామెచేతి కిచ్చి యిదియే నేను దెచ్చిన వస్తువని చెప్పినది.

కల్పలత - భ్రూలతాయుగళంబు ఫాలతలం బెగంద్రోయ నాచిత్రఫలకం బంది పుచ్చుకొని యబ్బురపాటుతోఁ జూచుచుఁ బ్రతి ప్రతీకళోభాచమత్కారసౌష్టవం బభివర్ణించుచు సఖీ! ఈ చిత్తరువు కంతువసంతజయంతాదులలో నెవ్వరిఁదో కావచ్చును. సర్వావయవసుందరుఁడగు నిట్టి పురుషరత్నము మానవజాతిలో నుదయించుట యసంభవము. దీని నెక్కడఁ దెచ్చితివో నిజము చెప్పుమని యడిగిన సప్పడఁతి యిట్లనియె.

అశో - ఇట్టి సుందరుఁడు పుడమిలో లేఁడని నీవెట్లు చెప్పగలవు ?

కల్పలత — ఇదివఱకు మనము భూమండలమ్మునం గల రాజపుత్రుల చిత్రఫలకముల నెన్ని జూచితిమి? ఒక్కటైన నిట్టి సౌందర్యము గలిగినది కసంబడినదా?

అశో - రాజపుత్రులలోఁ గాక యితరులలో సౌందర్యశాలు రుండరనియా నీ యాశయము?

కల్పలత - అభిజాత్యము లేని సౌందర్యము సంస్తుత్యము కాదని నా తలంపు. మఱియు నుత్తమసౌందర్యవంతు లుత్తమకులంబునంగాని బుట్టరని నిరూఢముగాఁ జెప్పఁగలను.

అశో - పోనిమ్ము. ఇట్టిసుందరునిం దీసికొని వచ్చిన నాకేమి పారితోషిక మిత్తువు?

కల్పలత - నా యెశ్వర్యమే నీది. వేర పారితోషిక మీయనేల? నిజముగా నిది మనుష్యకుమారుని రూపమే?

అశో - అగుననియే చెప్పఁగలను.

కల్పలత - నీవు చూచితివా? వింటివా?

అశో - చూడక వినిన మాటలం బట్టి చెప్పుదునా?

కల్పలత - వీఁ డెవ్వని కుమారుఁడు?

అశో - చక్రవర్తి కుమారుఁడు.

కల్పలత - అట్లైన వీఁడే నాభర్త.

అని పలుకుచు నా చిత్రఫలకమును గౌఁగిటం చేర్చుకొని ముద్దుపెట్టు కొన్నది. అశోకవతి నవ్వుచు జవ్వనీ! నీకింత తొందరయేల? వీని కులశీలాదులఁ దెలిసికొనక చక్రవర్తికుమారుండని నంతనే భర్తయని నిరూపింతువా? చాలు జాలునని యాక్షేపించుటయు నాయించుబోఁడి ఏమో భగవంతుఁడు నానోట నిట్లనిపించెను నేను స్వయముగాఁ దెలిసి యనిన మాటగాదు. వాఁడు క్షత్రియకులుఁడు కాఁడా యేమి? యా రహస్యమేమో తెలియఁ జెప్పుమని యడిగిన నశోకవతి యిట్లనియె.

ప్రియసఖి! వినుము. నే నాపతత్రమునిమిత్తము పుళిందునొద్ద కరిగితిని గదా! ఆ నిషాదునకు బుత్రికయుఁ బుత్రుఁడుం గలిగియున్నారని మనము విని యున్నారము నే నీయాటవస్తువుల దీసికొని పుళిందుని కర్పించితిని. అతండు తన బిడ్డ లాతోటలో నున్నారు. వారికిమ్మని నన్నందుఁ బంపెను. అప్పుడు వా రాపక్షి ప్రవరముతో ముచ్చటించుచున్నారు. తరుణీమణీ! నేను వా రిద్దరం జూచి వెఱఁగుపాటుతో గడియవరకు నేమియు మాటాడలేక పోయితిని. ఆహా? ఏమి వారి సౌందర్యము! అం దాకుమారునిబుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకొనవలయునని బుద్ధి పుట్టినది ఏ రాజకుమారుఁడు ఏమారుఁడు ఏసుకుమారుఁడు ఏ వీరుఁడు వానింబోలఁగలడు? మన వస్తువులచే వారు లోభపడుదురా? వానిసౌందర్యము నీకుఁ జూపు దలంపుతో మనయొద్దనున్న పక్షినే నీకిప్పింతునని చెప్పి వానిం దీసికొని వచ్చితిని. శ్యామలాపురంబునఁ బ్రజలకు మహోపద్రవంబుఁ దప్పించె వీఁడే యా పురుషరత్నము. వీఁడే పుళిందకుల జక్రవర్తి కుమారుఁడు. అని తాను పోయి వచ్చిన వృత్తాంతమంతయు నెఱింగించినది.

అప్పు డక్కాంతారత్నంబు చింతాకులస్వాంతయై యొక్కింత సేపేమియుం దోచక ధ్యానించి తల యూచుచు బోఁటీ! నీ మాటలచే నేను మోసపోయితిని. చక్రవర్తికుమారుఁడంటివి కాని పుళిందకుల చక్రవర్తి కుమారుడంటివేని నేను తొందర పడకుందునుగదా! వీఁడే నా భర్తయని పలికి మరల వెనుక తీయుట యెట్లు? కిరాత కుమారునెట్లు పెండ్లియాడుదు? ఇప్పుడు కర్తవ్యమేమి? అని యాలోచించుచు వెండియు నా చిత్రఫలక ముపలక్షించి చక్కదనం బభివర్ణించుచుఁ గులము మాట మరచిపోయి మరల ముద్దు పెట్టుకొనుచు నశోకవతీ! యీ సుందరు నెందు విడిచి వచ్చితివి? మీయింటఁ బెట్టితివా యేమి? వేగఁబోయి దీసికొనిరా. అని యాజ్ఞాపించుటయు నా జవరాలిట్లనియె.

నాతీ! నీతోఁ జెప్ప మరచితిని. దారిలో శకునములు చెప్పు చిలుకను వాఁడు కొన్ని ప్రశ్నము లడిగెను వానియుత్తరములఁ బడయుటకై పదిదినములం దుండవలసి వచ్చినది. తరువాత వానివెంట బెట్టుకొని రమ్మని మన పరిజనులనందుంచి ముందువార్త నీకుఁ జెప్పుటకై వచ్చితిని. ఆ మితి నిన్నటితో ముగిసినది. నాలుగుదివసములలో రాఁ గలఁడని చెప్పినది.

మరల స్సృతి నభినయించుచు రాజపుత్రిక అశోకవతీ! మరచిపోయితిని. అతండు నిషాదకుమారుఁ డంటివికాదా! కులహీను నెట్టువరింపమే. యేమనియెదవు? అని యున్మత్తవోలెఁ బలుకుచున్న కల్పలతతో నశోకవతి యిట్లనియె.

సఖీ! అతండు వచ్చిన తరువాతఁ జూచి యిప్పటికి తోచినరీతిఁ గావింప వచ్చును. ఇప్పు డీ తర్కములతోఁ బ్రయోజనములేదని చెప్పినది. అగునగు ననుమతించితిని. అతని నీవు వెంటఁ బెట్టికొనిరాక యందు దిగవిడిచి వచ్చితివేల? ఇప్పుడే పోయి తీసికొనిరమ్ము. పొమ్మని యాజ్ఞాపించినది.

అశోకవతి హుటాహుటి పయనంబులఁ బోయి చిలుకయున్న పల్లెఁ జేరి మున్ను బసఁజేసిన యింటికి బోయి తనవారేమైరని యడిగిన నాయింటివారు, ఇందుండి నాలుగు దినముల క్రితమే వెళ్ళిపోయిరని చెప్పిరి. అప్పుడది యోహో? మాయూరికి కాక వారెందుఁబోయిరి? దారితప్పి మఱియొక చోటికిం బోయిరి కాఁబోలు నా కెదురు పడలేదే? అక్కటా? నేఁ జేసిన సన్నాహ మంతయు రిత్తయైపోవునా? వాఁడు విసుఁగుఁ జెంది యింటికే పోయెనా? అని యనేక ప్రకారముల దలపోయుచు దిరుగమార్గములు పరికించుచు మహేంద్రనగరాభిముఖంబుగా బోవఁదొడంగినది మహేంద్ర నగరంబున కనతిదూరములో మఱియొక మార్గమునుండి వచ్చుచున్న కింకరులు గనంబడుటయు వారిం జూచి పల్కరించి మీరింత యాలసించితిరేల? ఎందు బోయితిరి? రాజవాహను డేఁడి? యని యడిగిన నా రాజభటు లిట్లనిరి.

అమ్మా! మీ సెలవు ప్రకారము మేమాయన కుపచారములు సేయుచుఁ బదిదినము లాపల్లెలో నుంటిమి. ఆయన యడిగిన ప్రశ్నములకుఁ జిలుక యుత్తర మిచ్చినది. అందుఁ దాను కిరాతకులమని వ్రాసికొనిన దానిమీఁద గాదని తెలియుటకై గీటు వ్రాయించినదఁట. అందులకై యాయన కాచిలుక మాటలయందు విశ్వాసము కుదిరినదికాదు. అప్పుడే యక్కడనుండి బయలుదేరితిమి. అతని గుఱ్ఱము వెంట మేమును వచ్చుచుంటిమి.

ఒకచోట మార్గము చీలి రెండు విధములుగాఁ బోయినది. మన యూరికి వచ్చు మార్గమిది యని మే మెఱింగించితిమి గాని యతని గుఱ్ఱ మీదెసకు మరలక యా రెండవదారిం బరుగెత్తినది. మేమును వెంటఁబోయితిమి. ఆ మార్గము జయపురమునకుఁ దీసికొని పోయినది. మందపాలుఁడు మధువర్మయను రాజు లిద్ద రేకమై కొన్నిసంవత్సరముల క్రిందట తన్నగరాధీశ్వరుఁడగు, విజయపాలుం బరిమార్చి యాదేశ మాక్రమించుకొని తమ ప్రతినిధుల నందుంచి పాలించుచున్నారఁట ఇప్పు డాదేశమును జెరిసగముఁ బంచుకొనుటకై వచ్చి యప్పురంబున బసఁ జేసి యున్నవారఁట. పట్టణ మంతయుఁ జక్కఁగా నలంకరించిరి. వారివురు పాదచారులై రాజమార్గమున విహరించుచు నగరసుందరముఁ జూచుచుండిరఁట. అట్టి సమయమున మే మనుగమింపఁ బట్టణము నడివీథిం బడి రాజవాహనుం డశ్వారూఢుండై యరుగుచుండెను. పౌరులు వింతగా నతనిం జూడఁ దొడంగిరి.

కొంతదూర మేగువరకు రాజకింకరు లాటంకపరిచి పోవలదు. గుఱ్ఱము దిగుము. మా ప్రభువులు పాదచారులై తిరుగుచుండ నీ వెవ్వడ వశ్వమెక్కి పోవుచుంటి వాగు మాగుమని యదలించిరి. అతండు వారిమాట లేమియు వినుపించుకొనక పురవిశేషములఁ జూచుచు దత్తడిని నడిపించు చుండెను. అప్పు డేదియో యీల యూది నంత బెక్కండ్రు రాజభటు రాయుధపాణులై యరుదెంచిరి.

వాని గుఱ్ఱమున కడ్డము నిలిచి పోవలదు, దిగు దిగుమని నిర్భధించిరి. అతండు నాదారిం బోయెద. బోనిండు గుఱ్ఱముదిగి నడచువాఁడను కానని పలుకుచు గాలిమడమలతో గుఱ్ఱము కడుపుటకై నొక్కినంత నది రెక్కలుగలదివోలె రివ్వున నెగిరి వారిం దాటి యవ్వల బోఁ దొడంగినది. రాజభటులు బటురయంబున బరుగిడికొని పోయి వెండియు గుర్రమున కడ్డమైన కసలం దీసికొని యశ్వముఖంబున గొట్టుటయు నది చిందులు త్రొక్కుచు గొందఱ ఖురపుటాఘాటనంబులఁ బడనేసి గతాసులం గావించినది. ఆ వార్త విని యిరువురు రాజుల సైన్యములు ప్రోగుపడి వానిపయిం బడినవి. అప్పుడు రాజవాహనుడు రౌద్రాకారముతో నశ్వమును విచిత్రగమనంబుల నడిపించుచు విల్లెక్కువెట్టి యిట్టట్టనరాని పాటవంబున రాజభటుల బెక్కండ్ర యుద్ధవిముఖులఁ గావించెను.

ఎట్లయిన నొక్కఁడు పెక్కురతోఁ బోరుట గష్టము గదా! అట్లు వారితో మించిన పరాక్రమమున యుద్ధము చేయుచుండ హఠాత్తుగా నతనిచేతినుండి విల్లు జారి నేలంబడినది. ఎట్టి బలశాలియైనను దైవము మీరువాఁ డుండఁడుగదా! అశ్వముమీద నుండియే యా ధనుస్సందుకొనవలయునని తలంచి తన ఘోటకమును బాటవముగా దాని చెంతకుఁ జేర్చుచుండ నీలోపల శత్రువీరుఁ డెవ్వండొ యా కోదండ మెత్తికొని యవ్వలికి బారిపోయెను.

ఆయుధశూన్యుండయ్యుఁ బెద్దతడవు వారితోఁ బోరెను. అంతలో నేల యీనినట్లు వీథులన్నియు శత్రుసేనలచే నిండింపఁపడినది. ఆయుధశూన్యుఁడై యెటు బోవుటకుం దెరపి దొరకక చివరకు వారికిఁ జిక్కక తీరినదికాదు. చేత విల్లుండిన వాని మూఁడులోకము లేకమై వచ్చినను బట్టుకొనలేరు. అట్టి మహావీరుండు శత్రువులకుం జిక్కిపోయెను. రాక్షసులు హనుమంతుని బట్టికొనినట్లు రాజకింకరు లతనిం బంధించి తీసికొనిపోయి రాజశాసనంబునఁ జెఱసాల బడవేసిరి. మేము వాని వారమని తెలిసికొనిన మమ్ముఁగూడఁ బట్టికొందురని దెలుపక రెండుదినము లందుంటిమి. ఆ వీటిలో వానిం దలంచి కంటఁదడిపెట్టనివారులేరు. వాని పరాక్రమమును మెచ్చుకొనని వారును లేరు. ఆ రాజులు దుర్మార్గులఁట. వాని నేమి చేయుదురో తల్లి? వాని శత్రుపాలు చేసివచ్చితిమని పలుకుచు నాకింకరులు గోలున నేడువఁదొడంగిరి.

ఆ వార్తవిని కరవాలఖండితకరియుంబోలె అశోకవతి నేలబడి మూర్ఛిల్లినది. కొంతడికి తెప్పరిల్లి హా! మహావీరా! హా! పురుషసింహా! హా! సుగుణ సాగరా! హా! సౌందర్యమందిరా! నిన్నింటికడ సుఖముగా నుండనీయక యాపత్సముద్రములో ముంచుటకై లేవదీసికొని వచ్చితిని. పెద్దపులుల వశ మైతివి. నిన్నెవ్వరు విడిపింపఁగలరు? నీ శౌర్యమున కసూయఁ జెంది యీ దుర్మార్గులు నిన్ను జంపక విడుతురా? అయ్యో? నేనేమి చేయుదును. ఈ వార్త వినినఁ గల్పలత ప్రాణములు భరింపగలదా? తలిదండ్రు లేమి సాహసముఁ జేయుదురో? శ్రమణి యెంత చింతించునో యన యనేకవిధంబులఁ బలవరించుచు నక్కటా? వాని కనుసన్నల మెలఁగు నాయశ్వం బీదారినిరాక యా దారిఁ బోవుట దైవసంకల్పితమని తలంచెదను కానిమ్ము. మా వసుపాలునకుఁ బెక్కండ్రు మిత్రులు ధాత్రీపతులు గలరు. వారి కందరుకుం జెప్పి యెట్లయిన వాని విడిపుంచుతెరు వరసెదంగాక. ఈ వార్తవినిన శ్యామలాపుర భర్త సహాయముఁ జేయకుండునా? అని యనేక కోపాయము లాలోచించుచు ముందుగా నీ వార్త కల్పలత కెఱింగించి తరువాతఁ దగు ప్రయత్నము సేసెద నని నిశ్చయించి యనుచరులుగూడరా మహేంద్రపురంబున కరిగినది. అని యెఱింగించి యవ్వలి మజిలీయం దిట్లు చెప్పదొడంగెను.

179 వ మజిలీ.

ఆదిత్యవర్మ కథ

మహేంద్రనగరమునుండి జయపురంబున కరుగు మార్గములో దక్షిణదేశమునుండి యుత్తరదేశమున కడ్డముగా నొకబాట పోయినది. ఆ నాలుగుతెరువులు గలిసినచోట వసుపాలునిచే నొకసత్రము గట్టింపబడి యున్నది. మార్గస్థులు వచ్చి వంటఁజేసికొని భుజించి పోవుచుందురు. అందులకుఁ దగిన సదుపాయము లన్నియు నందున్నవి.

అందొకనాఁడు ఆదిత్యవర్మయను బ్రాహ్మణుఁడు తగుపరిజనులతో వచ్చి బసచేసి వంటఁ జేసికొనుచుండెను. అంతలో వసుపాలుని దూతలు కొందఱు వచ్చి మహారాజుగారి యుద్యోగస్తులు వచ్చుచున్నారు. ఇం దెవ్వరు నుండఁగూడదు. చోటు చేయుఁడను కేకలుపెట్టిరి బాహ్మణుఁడు వంటఁజేసికొనుచున్నాఁడు. సగము వంట యైనది. భుజించిన తరువాత వెళ్ళిపోయెదమని యాదిత్యవర్మ భృత్యుడొకడు వారికి సమాధానముఁ జెప్పెను.

అట్లు పనికిరాదు. గదులు మాకు కావలయు నిప్పుడే లేచిపోయి యవ్వలగదులలో వండుకొనుమనుము. ఇది గొప్పవారు దిగుచోటు. ఇందు సామాన్యులు వసింపరాదు. తొలగుండు అని కింకరులు తొందగ చేసిరి. సార్ధవాహుడును "నాబ్రాహ్మణుఁడు గొప్పవాఁడే. మహారాష్ట్రదేశప్రభువునకు మిత్రుఁడు. పనిగతిని యుత్తరదేశమునకు రాజు నానతి నరుగుచున్నాడు. భుజించి పోయెద" మనిప్రత్యుత్తర మిచ్చుచుండెను.