కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/176వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్లో. జాతిస్వభావ గుణదేశజ ధర్మచేష్టా
    బావేంగి తేషు వికలో రతితంత్రమూఢః
    లబ్ద్వాపి హి స్ఖలతి యౌవన మంగనానాం
    కిం నారికేళఫల మాప్య కపిః కరోతి.

జాతిస్వభావగుణవిశేషాదు లాగ్రంథమందుఁ జెప్పఁబడి యున్నవి.

రాజ — ఎవరిజాతిస్వభావాదులు? స్త్రీలవా, పురుషులవియా ?

అశో - ఒకరివి యొకరు.

రాజ — ఈశ్లోకములో నట్లులేదే. పురుషుఁడు స్త్రీయొక్క జాతిస్వభావగుణచేష్టాది విశేషంబులఁ దెలిసికొనవలసినదనియు నట్లు తెలియనివాఁడు రతితంత్రమూఢుఁడనియుఁ గోఁతికి గొబ్బరికాయ దొరకిన బ్రద్దలు కొట్టికొని తిననేరనట్లు స్త్రీల యౌవనముఁ బొందియుం దొట్రుపడును. అని యున్నది గదా? అది స్త్రీల కేమి యుపయోగము?

అశో - ఇంకనేమి? ఈమాత్రము పాండిత్య మున్నది గదా! చాలు కాంచనమునకుఁ బరిమళ మబ్బినట్లే. నీకు విద్యావాసన గలుగుట సంతోషమయినది. గుఱ్ఱము నిలిపెదవా నెక్కెద.

రాజ - (నిలిపి యెక్కించుకొని ముందరనే కూర్చుండ బెట్టుకొని) గుఱ్ఱము జూలు గట్టిగాఁ బట్టుకొనుము. వడిగాఁ దోలెదను.

అశో - నాకును గుఱ్ఱమెక్కు పాటవము గలదు, భయము లేదు. వడిగా దోలుము.

అనుటయు నతండు తత్తడిని వడిగా నడిపించి రెండుగడియలలో నాయడవి దాటించెను. ఆయరణ్య ముఖంబుననున్న కోయపల్లెలో దాని పరిజనులు యంత్రశకటముతో వేచియుండిరి. అక్కడ నుండి దేశముల మీఁదికి విశాలములైన రాజమార్గములు గలవు. అశోకవతి యందు గుఱ్ఱమును దిగినది. రాజువాహనుఁడును దిగి యాశకటమును బరీక్షించి చూచి వెఱఁగుపడఁజొచ్చెను ఆశోకవతి యతని నాబండిలోఁ గూర్చుండ రమ్మనియెను. అతం డంగీకరింపక గుఱ్ఱమును దానితో సమముగా నడిపించి వచ్చెదనని చెప్పెను. బండి, గుఱ్ఱము నొకసారి వదిలిరి. గుఱ్ఱమే ముందుఁ బోయి గమ్యస్థానము జేరినది. అతని యశ్వగమననైపుణ్యమునకు అశోకవతి వెఱఁగుపడినది.

176వ మజిలీ

శ్యామల కథ

పుళిందకుమారుం డశోకవతితో నరుగునప్పుడు దారిలోఁ గనంబడిన విశేషములెల్ల దాని నడుగుచుఁ దెలిసికొనుచుండును. అశోకవతియు నతనికి మార్గవిశే షములం జూపుటకై పయనములు మెల్లగా సాగించుచుండెను. తెఱవున కనతిదూరములో నేదియేని నగరముగాని గ్రామముగాని యున్నచోఁ దీసికొనిపోయి యందలి వింతలు జూపుచుండును.

ఒకనాఁడు దారికడ్డమై పెక్కండ్రు జను లెక్కడికో గుంపులుగాఁ బోవుచుండుటంజూచి యశోకవతి మీరెందు బోవుచున్నారని యడుగుటయు వాండ్రు ఓహో! జగత్ప్రసిద్ధమయిన యుత్సవవిషయములే మీకుఁ దెలియవా? ఈ ప్రాంతమందున్న శ్యామలానగరమున శ్యామలయను రాజపుత్రికకు వివాహము జరిగినది. నేఁ డూరేగింపు సేయుదురు. ఆయుత్సవము లోకాతీతముగాఁ గావింతురని ప్రకటనఁ జేసియున్నారు. ఆ వింతఁ జూచుటకై పోవుచుంటిమని యెఱిగించిరి.

అశోకవతి యావార్త విని పయన మాపి తమశకటంబుల నాదెసకు మరలించినది. ప్రొద్దుగుంకకపూర్వమే యానగరముఁ జేరి యొకసత్రంబున బసఁ జేసిరి. దూరదేశములనుండి యా వైభవము జూచుటకై ప్రజలు సంఘములుగా వచ్చిచేరిరి. రాజమార్గము లన్నియుఁ బ్రజలతో నిండియున్నవి. పట్టణమంతయు విచిత్రముగా నలంకరించిరి. వీధులన్నియు విద్యుద్దీపములచే మెఱయుచుఁ బట్టపగలుగా నొప్పుచుండెను. అది స్వర్గమేమోయని చూచువారి కాశ్చర్యము గలుగఁజేయుచుండెను.

పెందలకడ భోజనముఁ జేయించి యశోకవతి రాజవాహనుని చేయిపట్టుకొని యా యుత్సవములోఁ ద్రిప్పుచుండెను. విల్లమ్ముల దరించి తిరుగుచున్న రాజవాహనుం జూచి జనులు వీరపురుషుఁడని వెఱచుచు దూరముగాఁ దొలఁగుచుండిరి.

ఎనిమిది గంటలు కొట్టినతోడనే యుత్సవము కోటలో నుండి బయలుదేరినది.

సీ. బిరుదువాద్యములు ముందర మ్రోగ నావెన్క
             మంగళగీతముల్ నింగిముట్ట
    వారాంగనాతాండవంబు లావెన్కఁ గృ
             త్రిమచిత్రమృగగటనములు వెనుక
    కోపు లావెన్క బాకులరౌతు లావెన్క
             బుట్టబొమ్మలు వెన్క బట్టువాండ్రు
    నాగవాసంబు వెన్కనె రాజబంధుల్
             వన్నేకాం డ్రావెన్క మన్నెగాండ్రు
గీ. ఇరుగడల సాదు లశ్వంబు లెక్కి నడువ
    రాజబంధు వధూబాలరాజి సదృశ
    వాహనము లెక్కి వెనువెంట వచ్చుచుండ
    నడుమ నొప్పారు భద్రదంతావళమున.

నవరత్నప్రభలచే గన్నులకు మిఱుమిట్లు గొలుపు రత్నపుటంబారియందు వధూవరులు గూర్చుండిరి. ఒకవంక బాణసంచ కన్నులపండువ సేయుచుండె అప్పు డాయుత్సవము రెండుక్రోశములు వ్యాపించి రాజమార్గంబునఁ దూరుపుగా నడచుచుండెను.

రాజవాహనుఁ డాయుత్సవమునకు ముందు దూరముగా నశోకవతితోఁ దిరుగుచుండ వినోదవిశేషము లన్నియు నశోకవతి వానికిఁ జెప్పుచుండెను. ఆయూరేగింపు కొంతదూరము వచ్చుసరికి వెనుక నల్లరి బయలుదేరినది. తూర్యనాదము లాగి హాహాకారములు నింగిముట్టినవి. గట్టు తెగిన ప్రవాహమువలె జనులు గుంపులు నలుమూలలకుఁ బరుగిడుచుండెను. కారణ మేమియో యెవ్వరికిం దెలియదు వెనుకవారు పరుగిడి త్రోసికొని వచ్చుచుండ ముందరివారును బరుగెత్తుచుండిరి. అయ్యో, అయ్యో, ఎంతప్రమాదము. చచ్చెఁ జచ్చె ననుశోకాలాపములు వినంబడఁ జొచ్చినవి. రాజమార్గము పట్టక ప్రజలు సందుగొందుల వెంబడి పారిపోవుచుండిరి.

రాజవాహనుఁ డాయల్లరి యేమని యశోకవతి నడిగెను. అది కొంతదూర మేగి తెలిసికొని బాబో, బాబో, పట్టపేనుఁగకు మదము దిగినదఁట దొరకినవారినెల్లఁ దొండముతో మోదుచుఁ గాళ్ళఁజిదుముచు, జిత్రవధఁ జేయుచున్నదఁట తొలుతనే మావటీని నేలఁ బడఁద్రోచి కాలరాచి చంపినదఁట ముందరివారిని వేయిమందిని బరిమార్చినదట. బాబూ! దూరముగాఁ బారిపోవుదము. రమ్ము ఈయూరి కేమిటికి వచ్చితిమో గదాయని పరితపించుచుండ విని నవ్వుచు రాజువాహనుఁ డిట్లనియె.

ఆహా! ఏమి యీ యూరివీరుల ధైర్యము? కొనియాడఁదగినదియే? పెంచిన ఏఁనుగకు మదము దిగిన వారింపలేకుండిరా? చాలుచాలునని యాక్షేపించిన విని యశోకవతి బాబూ! మద మెక్కిన దంతావళము నెవ్వరు బట్టగలరు? తుపాకులఁ గాల్చి చంపవలయును. అట్లు చేసిన దానిపైనున్న బెండ్లికొడుకు బెండ్లికూతురు మడియగలరు. ఏయుపాయము లేకయే వీరులుగూడఁ బారిపోవుచున్నారు. పదపద మన మవ్వలఁ బోవుద మనుటయు నతండు ఓసీ? పిరికిదాన! దీనికి నేను వెఱతునా? మహారణ్యమధ్యంబునఁ గొండలవలె మదమెక్కి తిరుగు మహాగజంబుల కెదురువోయి దంతములు బట్టుకొని నిలబెట్టఁగలము నీకు భయమయిన దూరముగాఁబొమ్ము. నేనా యేనుఁగురాక వేచి యిందే యుండెదనని బీరములు పలికిన విని యాకలికి యులికిపడి కుమారా! నీవు చిన్నవాఁడవు. ఇవి మీ ఏనుఁగులవంటివి కావు. మత్తుపదార్థములు తిని పొగరెక్కి యుండును. పోవుదము రమ్మని బ్రతిమాలికొనియెను.

అతం డందుండి కదలక దారి కడ్డముగా నిలువంబడి దానిరాక వేచియుండెను. అంతలో నామార్గము లన్నియు శూన్యములైనవి. జనులు నలుదెసలకు బారిపోయిరి. అప్పు డాయేనుఁగు తొండముచేఁ దనపై నంబారీలోనున్న వధూవరులం గొట్టుచు మార్గమున కిరుప్రక్కలఁ బాతిన దీపస్తంభములఁ దన్ని నేలఁ బడవేయుచుఁ జనులందరును కొని యామార్గమున వచ్చుచుండెను. గుఱ్ఱపురౌతులు బాకులరౌతులు వీరభటులు ఎవరిప్రాణములు వారు దక్కించుకొని పారిపోయిరి. ఒక్కవీరుండైన దానింబట్టుకొను నుపాయము నాలోచింపఁ డయ్యెను. ఆ మేళములు, ఆ తాళములు, ఆ వాద్యములు ఎందుఁ బోయినవో యొక్కటియుఁ గనఁబడలేదు. ఇంద్రజాలమువలె నా యుత్సవము గడియలో నదృశ్యమైనది. ఒక్కయేనుఁగమాత్రమే నిరాటంకముగా రాజవీధింబడి వచ్చుచుండెను. పైనున్న వధూవరుల తొండము వ్రేటులఁ దప్పించుకొనుచు నొంటిప్రాణములోనుండి చెట్టుగాని మేడగాని చేరిన నెక్కి యసువులఁ దక్కించుకొన వలయునని చూచుచున్నారు.

నిర్మానుష్యంబై యున్న యావీధిలో నడ్డముగాఁ నిలువంబడి యున్న రాజవాహనునిఁ జూచి యాకరివరం బతిశయంబున నతనిమీదికి వచ్చుచుండెను. అప్పు డశోకవతి అదిగో! మదగజంబు సమీపించుచున్నది. నీపైకే వచ్చుచున్నది. పారిపోవుదము రమ్మని కరమ్ముపట్టి లాగినది. అతండు కదలడయ్యెను. అప్పుడది హాహాకారముతో నందు నిలువక దూరముగాఁ బారిబోయి చాటుననుండి రాజవాహనునిం జూచుచు వానిం గతాంసుగా నిశ్చయించుకొని శోకించుచుండెను.

ఇంతలో నాదంతావళము వానియంతికమునకు వచ్చినది. అప్పుడు రాజువాహనుఁడు అమ్ము చేతం బూని పదియడుగులు దాని కెదురుపోయి హుంకారము సేయుచు మాతంగా! నిలునిలు నేనెవ్వఁడనో యెఱుంగుదువా పులిందచక్రవర్తి కుమారుండ. గదలిన నీమద మడఁగింతునని ఘీంకారపూర్వకముగా గొన్నిధ్వనుల వెలయఁజేసెను.

అప్పు డాదంతీంద్రంబు మంత్రించినట్లు శపించినట్లు, కట్టుకట్టినట్లు కదలక మెదలక యట్టె నిలువంబడినది. పిమ్మట నవ్వనచరకుమారుండు దాని దాపునకుఁ బోయి మనుష్యరుధిరమేధఁ కర్దమంబైన తదీయశుండాదండంబు బట్టుకొని దువ్వుచు నశోకవతీ! ఆశోకవతీ! ఎందున్నదాన విటురా అని పెద్దకేక పెట్టెను. దూరము నుండి చూచుచున్న యాపరిచారిక వానిసాహసమునకు వెఱఁగుఁ జెందుచున్న నటు పోవకున్ననుఁ దెగువమై వానిచెంత కరిగిననది.

అతండు నశోకవతీ? నేనండ నుండ నీవేదండమున కింకను వెఱచెద వేమిటికి? దీనిం బండుకొనఁ బెట్టెదఁ గట్టెదురకు రమ్ము అని పలికి కరస్థితచరప్రచలనంబునం సంజ్ఞచేసి నందివలె దానిం బండుకొనబెట్టెను. అప్పుడు అశోకవతి వెఱ పుడిగి దరి కరిగి యతనిం గౌఁగలించుకొని, వీరాగ్రేసరా? నీ పరాక్రమము, నీ ధైర్యము త్రిభువన స్తుత్యమై యున్నది. నీకతంబున నీవధూవరులు బ్రతికిరి! బహులోకోపకృతి గాంచితివని పొగడుచుండెను.

అప్పుడందున్న వధూవరు లతిశయంబుగా యేనుఁగం దిగి రాజవాహనుని పాదంబులంబడి మహాత్మా! నీవు మా ప్రాణములఁ గాపాడవచ్చిన భగవంతుఁడవని నమస్కరించుంటిమి. ఒరుల కీ యుపుద్రవము దాటించ శక్యమా? మూయుదల నదటింకనుం దీరకున్నది. ఇది మరల లేచి పీచమడంచునేమో యను భయముతో నిందు నిలువజాలము. ప్రాణదాతవైన నీ కులశీలనామంబులు దెలిసికొనుట యావశ్యకమే కాని మాకిందు నిలువధైర్యము చాలకున్నది. మీరు మావెంట మాయింటికి రావలయునని ప్రార్థించుచుండ నా వెదండ మొకఘీంకారము గావించినది.

అప్పు డదరిపడి వారు కాలికొలఁది పారిపోయి యొక యింటిలో దూరిరి. రాజవాహనుఁడు హుంకార మొనరించి దాని లేవకుండఁ చేసెను. అంతలోఁ జాటుగాఁ దిరుగుచున్న రాజభటులు తుపాకులం గాల్చి దానిం బంచత్వము నొందఁజేసిరి.

మదపుటేనుఁగ జంపఁబడినదని తెలిసినతోడనే రాజమార్గము లన్నియుం బ్రజలచే నిండింపఁబడినవి. ఇండ్లతలుపులు తెరువఁబడినవి. దాసదాసీజనంబులు పెక్కండ్రు వచ్చి వధూవరుల వెదకి వాహనంబు లెక్కించి కోటలోనికిఁ దీసికొని పోయిరి. ఎవ్వఁడో మహాపురుషుఁడు వచ్చి యా యుపద్రవముఁ దప్పించెనని జనులు చెప్పుకొనఁ దొడంగిరి.

అని యెఱిగించువఱకు వేళ యతిక్రమించినది. తరువాతికథ పైమజిలీ యందు జెప్పదొడఁగెను.

177 వ మజిలీ

రామచిలుక కథ

అశోకవతి యమ్మరునాఁ డందు నిలిచి రాజదర్శనముఁ జేసి పోవుదమని పలికినది. కాని యతం డందుల కంగీకరింపక నాఁటి వేకువజాముననే వారాయూరు బయలుదేరి పోవుచుఁ గొన్ని పయనములు సాగించిరి.

అట్లరుగుచుండ నొకనాఁ డొకచోట మార్గమున కనతిదూరములో నొక గ్రామము రాజవాహనునికి నేత్రోత్సవము గావించినది. అశోకవతీ? ఈ యూరిపేరేమి? గ్రామము చిన్నదైనను సుందరమందిరారామశోభితమై యొప్పుచున్నది అని యడిగిన నది చిఱునగవుతోఁ గుమారా! నీ వడుగకున్నను నిందలివింత యొకటి నీ కెఱింగింపఁ దలంచుకొంటి నందులకే యిందు బండి నిలిపితిని. వినుము, ఈ పల్లె యందుఁ దులాధారుఁడను వర్తకుఁడు గలడు. పూర్వపుణ్యవశంబున వానికెట్లో యొకరామచిలుక లభించినది. అది యతీతానాగతవృత్తాంతముల శకునములు చెప్పుచుండును.

దాని దేవమందిరమున బంగారుపంజరములో నునిచి నిత్యము దేవతావిగ్రహమువలె వాఁడు పూజించుచుండును. అది చెప్పు శకునమువలన నావైశ్యుఁడు మిక్కిలిగా ధన మార్జించుచు నీమేడలన్నియుం గట్టించెను. దూరదేశమునుండి మహారాజుల రాజపుత్రులు, రాజపుత్రికలు, శకునము లడుగ నిచ్చటికి వచ్చుచుంచుదురు. పరిజనుల నంపుచుందురు. దీని వాడుక భూమండల మంతయు వ్యాపించింది.