కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/175వ మజిలీ
నెవ్వరు నేర్పిరి? ఇంతకుముం దెందుంటివి? నీవు గృహ్యకపక్షివలె నుంటివి. నీ వృత్తాంతము చెప్పుమని యడిగిన నానీడిజం బిట్లనియె.
కల్పలతా! నేను నీచేఁ గొనఁబడుటచే నీ వస్తువనైతిని. నిన్ను సంతోష పరచుటయే నాపని. నాకు సంగీతమునందు సాహిత్యమునందు మంచిపాండిత్యము కలదు. నే ననేకవిచిత్రములైన కథలం జెప్పగలను. నాచూడని పురాణములు లేవు. శాస్త్రములన్నియుఁ జదివితిని. నీకేది కావలసినను బాఠముఁ జెప్పఁగలను. నే నాఁడుపక్షిని. నా భర్తయు, నేనును వింధ్యపాదమూలంబున సహకారతరుశాఖ నధిష్టించి యొకవసంతసమయమున వింతగా గానము సేయుచుండ నొక పుళిందుఁ డుచ్చు పన్ని నాభర్తం బట్టుకొనియెను. నేను దొరకక పారిపోయి వచ్చితిని. విధినియామక మెవ్వఁడును దాటలేఁడు. పిట్టప్రాణమున కెల్లరు నాసింతురు. మరియొకచోట నొక కోయవాఁడు నన్నుం బట్టుకొని పాపము చంపక మీ కమ్మెను. ఇదియే గొప్ప యుపకారము. తగినచోట నప్పగించి నాకు మంచి యుపకారము గావించెను. నాభర్త నా పుళిందుఁడు చంపెనో పెంచెనో తెలియరాదు. ఇంతపట్టు నీ కెఱింగించితిని. పై ప్రశ్నము లేవియు నన్నడుగవలదు. నీకుఁ గావలసిన విద్యల నేర్చికొమ్మని చెప్పి యూరకున్నది.
ఆ పడుచు ఆ యుపన్యాసము విని మిక్కిలి వెఱఁగుపడుచు మఱేమియు నడుగక కానిమ్ము. పుళిందుని మే మెఱుంగుదుము. అతఁడు పక్షులఁ బెంచునుకాని చంపఁడు. వెఱవకుము. నీ భర్తనుగూడ వెలయిచ్చి యిచ్చటికిఁ దెప్పించెద. అందున్న పక్షులనెల్లఁ గొనియెద. నాపుణ్యమున నీవు లభించితివి. నాకుఁ గథలనినఁ కాలయుత్సుకము. ఏదేని మంచికథ చెప్పి నాకు సంతసము గలుగఁజేయుమని యడుగుటయు నా యండజము మగువా! నవరసములలో శృంగారరసము ప్రధానము. ఆ రసము నీకభిరుచియైనచోఁ దద్రసప్రతిపాదకమైన కథయే చెప్పెద. లేదా వైరాగ్యము, హాస్యము, కరుణము, లోనగు నతర రసములుగల కధలు చెప్పుమనిన వానిం జెప్పెద. నీయభిప్రాయమే మనవుఁడు సిగ్గుపడి యాపడఁతి యూరకున్నంత నాసన్నవర్తిని యగు నశోకవతి యను పరిచారిక శారదా! నీవన్నియుం దెలిసిన శారదపు. ఈమె కిప్పు డేది యభిమత మగునో యట్టిదానిం జెప్పుము. వేఱె నిరూపింప నేల? అన్నిరసములు నీమె కభిమతములే. వరుసగా నన్నివిధముల కథలుం జెప్పవలయు ననియుత్తరముఁ జెప్పిన నవ్వుచు నవ్విహాయసంబిట్లు చెప్పందొడంగెను.
175 వ మజిలీకథ
అచ్చరల కథ
దేవలోకములో నప్సరసలని యొకతెగ మగువలుగలరు. వారికి దేవతావేశ్యలని పేరు. ఆ స్త్రీలు మిక్కిలి చక్కనివారు. రంభ, యూర్వశి, మేనక , తిలోత్తమ లోనగు ప్రసిద్ధదేవకాంతలెల్ల వారిలోనివారే వారిలో బదునాలుగు జాతులు గలవు. పంచభూతములు, సూర్యచంద్రులు, సముద్రము, బ్రహ్మ, మృత్యువు, మన్మధుఁడు, వేదములు దక్షపుత్రికలగు మునియు, నరిష్ట ఈ పదునాలుగురు నచ్చరలకు కూటస్థులు. మునియరిష్టలవలననే గంధర్వులు కూడ నుదయించిరి. గంధర్వకులమునందు స్త్రీ పురుషజాతులు రెండునుం గలవుగాని యచ్చరలలో బురుషజాతి లేదు. దేవలోకముల నన్నిఁట వారు స్వేచ్ఛగా విహరింపుచుందురు. అమరులు తమ యిచ్చవచ్చిన యచ్చర నేరికొని మిథునముగా విమాన మెక్కి తిరుగుచుందురు. వారికి వివాహములు లేవు. జరలేదు. చావు లేదు. నిత్యయౌవనులు. వారికి శృంగారలీలలుతప్ప నితర వ్యాపారములులేవు. ఒకనాఁడు కొందఱు అచ్చరలు నందనవనములోఁ బుష్పావచనముఁ గావించి పొలసి యలసి కల్పతరుకుసుమకిసలయవరాగవాసితములగు నమృతసరస్తోయముల జలక్రీడ లాడుచు నిట్లు సంభాషించుకొనిరి.
అలంబుస – మిశ్రకేశీ! మొన్న రంభ చేసిన వ్రతమునకు నీవు వచ్చితివా? దాని కెంత గర్వ మనుకొంటివి? తాంబూలమాల్యానులేపనాదులు స్వయముగా నీయక మరియొకరిచేత నిప్పించినది. తనపాటి చక్కఁదనము మనకు లేదనియా యేమి ?
మిశ్రకేశి – అది చక్కఁదనము గరువము కాదు. ఐశ్వర్యమత్తత. నలకూబరునకు నచ్చిన ప్రియురాలినని.
విద్యుత్పర్ణ – అతఁడు ఇంద్రసూనుండగు జయంతునికన్న నధికుండా యేమి? తిలోత్తమ కంతగరువము లేదేమి ?
తిలోత్తమ — నలకూబరుని రంభయం దెట్టి ప్రీతియో యట్టి ప్రీతి జయంతునకు నాయందుఁ గలదా యేమి? దానివలె నెందులకు గర్వపడుదును?
అరుణ - మనప్రభుపుత్రుఁడు జయంతునకన్న గొప్పవాఁడా యేమి నలకూబరుఁడు?
సురజ - ఇంద్రుఁ డధికుఁడా? కుబేరుఁ డధికుఁడా?
సుప్రియ - సరి సరి. ఇది బొత్తుగా ముగ్ధవలె నున్నది. దిక్పతులకెల్ల నధికుం డింద్రుఁడా కాఁడా?
సురజ - అయిననేమి? కుబేరునకు జగత్పతియగు మహేశ్వరుని మైత్రి యున్నది. దానింజేసి కుబేరుఁడే యధికుఁడని నా యభిప్రాయము.
సుప్రియ – మీ రెప్పుడు దేవసభకు మేళమునకురాలేదా యేమి? ఆ సభలో నింద్రుఁడెక్కడఁ గూర్చుండునో కుబేరుఁ డెక్కడఁ గూర్చుండునో ఈశానుఁ డెక్కడఁ గూర్చుండునో చూచినచో వారి వారి తారతమ్యములు దెలియఁబడఁగలవు.
సురజ — ఎట్లు కూర్చుందురు ?
సుప్రి - మనోరమ నడుగుము.
సుర - దాని సాక్ష్యమేల? నీవే చెప్పరాదా!
సుప్రి - సుధర్మామధ్యభాగంబునఁ జింతామణీపీఠంబున మహేంద్రుఁడు గూర్చుండఁ జుట్టును దిగువపీఠంబుల దిక్పతులు అనుచరులవలెఁ గూర్చుఁదురు. ఆయన లేచిన వీరందరు లేతురు. వీరిలో నెవరు లేచినను మహేంద్రుఁడు లేవఁడు. దీనంబట్టి వారి న్యూనాధిక్యములు తెలిసికొనవచ్చును.
సుర - ఇదియా! కారణము బాగుగ నున్నది. అది యింద్రుని యిల్లు. వారింటిలో వారియిష్టము వచ్చినట్లు కూర్చుందురు. అంతమాత్రముననే యధికుం డనరాదు.
సుప్రి - కేశినీ! దీనికేమియుం దెలియదే? నీ వైనం జెప్పుము.
కేశి - ఆ విషయము నాకంతగా తెలియదుకాని వారిద్దరి పుత్రులు సమానప్రతిపత్తిగాఁ దిరుగుటఁ జూచితిని.
సుర - నీ వలకాపురములో జరిగిన సభకు రాలేదు. కనుక నింతగా వాదించుచుంటివి. కుబేరుని యింటనున్న యొక రత్నమునకు నింద్రుని యెశ్వర్య మంతయు సరిపడదు.
అలం - చాలు చాలు. ఊరకొనుఁడు. నేనొకటి చెప్పిన మఱియొకవాదములోఁ దిగెయెద రేల?
అరు - గరువము రంభకు గాక మనకేలఁ గలుగవలయును? దేవవేశ్యలలోఁ బేరుబ్రతిష్టలు దానికే గలవు. ఎప్పుడు మేళముగట్టినను రంభయో, యూర్వశియో, తిలోత్తమయో, మంజువాణియో, ఘృతాచియో ముందు నాట్యము చేయుచుండ మనము వెనుక నిలువంబడి తాళము వాయించుట తప్ప ఎప్పుడైన గజ్జెఁగట్టి ముందుకు బోయితిమా యేమి? రంభయందు నీకింత యసూయ యేమిటికి?
అలం – రంభ మాత్రపు సౌందర్యము ఆటపాటలు నాకునుం గలవు. పెక్కుసారులు దేవతాసభలలో నాట్యములుచేసి బిరుదములందితిని. నీ వెఱుంగవు కాఁబోలు. నేను వెనుక నిలువంబడుదానను కాదు.
అరు - నీ యెదుట నాడినఁ గోపముగాని రంభకంటె నెక్కువ గర్వము నీకునుం గలదు. నావంటి యందకత్తె లేదని నీకు మనసులో నున్నది. నలకూబరుఁడు నీకుఁ గావించిన పరాభవ మెవ్వరికిం దెలియదనుకొంటివా యేమి ?
సురత - అక్కా! ఏమి గావించెనో చెప్పుము.
అరు - ఏమియును లేదు. నలకూబరుని వలచి యిది నందనవనములో నతఁడు విహరింపుచుండ నాసపడి వెనువెంట దిఱిగి యాశ్రయించినది. దీని మొగమైన నతఁడు చూడలేదు. అందులకే దీనికి రంభపై కోపము.
అలం - ఓహోహో! నలకూబరుడు జయంతునికన్న నందమైనవాఁడా యేమి? జయంతుఁడు నన్నెక్కుడుగాఁ బ్రేమించుచుండ వాని నే నెందుల కాశింతును? ఇది దీని కల్పన సుప్రియ నడుగుము.
అరణ - నలకూబరుని యందము, పాటవము, దక్షత, జయంతుని కేమియును లేదు.
అలం - చాలు చాలు. నీ మాట నీవే మెచ్చుకొనవలయును. జయంతుఁ డెంత పరాక్రమవంతుఁడు? అనేక దేవాసురయుద్ధములలోఁ బేరుపొందిన శూరుఁడు. నలకూబరుని రంభాసంభోగసమరవిజయుండని మాత్రము పొగడుము.
అరుణ – నీవు పూర్వోత్తరసందర్భములు తెలియక వాదించుచుంటివి. ఇప్పుడు పరాక్రమముమాట యేమిటికి? జయంతుడు మహా పరాక్రవంతుఁడని నే ననుమతించెదను. నలకూబరుండువోలె సౌందర్యచాతుర్యకళావిదగ్దుండు కాఁడని నే ననుచుంటిని. తెలిసినదియా?
అలం – ఆతం డెంత నేర్పరియో నీ వేమి యెఱుంగుదువు. తిలోత్తమ నడుగుము, ఘృతాచి నడుగుము.
అరుణ - తిలోత్తమ జయంతుని పక్షమే పలుకక వే రెట్లు చెప్పును? ఒకరి నననేల? ఇందున్నవారి నందఱి నడుగుదము. నలకూబరుండు చక్కనివాడా? జయంతుఁడు చక్కనివాఁడా? శృంగారలీలావైదగ్ద్య మెవ్వరియం దెక్కువయున్నది. ఈ రెండు విషయములే మనమడుగవలసినది. అని యందున్నవారి నందరిని ఆ విషయమై పక్షపాతము విడచి న్యాయబుద్ధితోఁ జెప్పవలయునని యడిగిరి.
కొందఱు నలకూబరుండనియుఁ గొందఱు జయంతుఁ డధికుండనియుఁ జేతులెత్తిరి. లెక్కింప నిరుపక్షములవారు. సమసంఖ్య గలవారగుట నే పక్షమునకు గెలుపు గలుగదయ్యెను. ఆ విషయమై వారు పోట్లాడుచున్న సమయంబున నా దారిని నారదుం డరుగుచు నచ్చరులారా! మచ్చరముతోఁ బోట్లాడుచుంటిరేమని యడుగుటయు వారు సిగ్గుపడి యందరు లేచి చేతులెత్తి మ్రొక్కిరి.
అప్పుడు తిలోత్తమ వారి వివాదప్రకార మంతయు నెఱింగించి మహాత్మా! మీరు త్రికాలవేదులు. సర్వజ్ఞులు. జయంత నలకూబరులలోఁ గళావిదగ్దు డెవ్వఁడని యడిగిన నమ్మహర్షి నవ్వుచు జవ్వనులారా! అది మేము చెప్పవలసినదికాదు. ఈ నందనవనములోఁ గల్పవృక్షశాఖల పారావతశకుంతలములు రెండు గూఁడుకట్టుకొని కాపురము చేయుచున్నవి. అవి చాల తెలిసినవి. ఆ పక్షులకు వారిద్దరి తారతమ్యము తెలియు నడుగుఁడనిచెప్పి యమ్మునిపుంగవుం డెందేనిం బోయెను.
అప్పుడు అలంబుస తిలోత్తమా!సిగ్గు సిగ్గు. ఇటువంటి మాట లమ్మహర్షి నడిగెదరా! నేఁడు మన యదృష్టము బాగున్నది. శాంతస్వభావముతో నుత్తరముఁ జెప్పెను. కోపించి యేమని శపించునో యని గుండెలు చేతం బట్టుకొని యుంటి. గండము గడచినది. అయ్యయ్యో ఇటువంటి తుచ్ఛపుమాటల నడిగెదవా ? అని యాక్షేపించినఁ దిలోత్తమ నవ్వుచు వారి ముఖవిలాస ముపలక్షించియే యడిగితిని. నే నామాత్ర మెఱుఁగనా? అని సమాధానముఁ జెప్పినది.
తరువాత వారిలోఁ గొందఱు యిఁక నీ సంవాదము చాలింపుడు. ఇంద్రునికిఁ దెలిసిన శిక్షించు ననిరి. మఱికొంద రది కాదు. నారదమహర్షి వచనప్రకారము దప్పక పక్షుల నడగవలసినదే అని పట్టుపట్టిరి. ఆ వాదమే నిలఁబడినది. అప్పుడు వారందఱు నందనవనమంతయుఁ దిరిగి కల్పవృక్షములఁ బరిశీలించి యా శకుంతమిధునమును గనుఁగొనిరి.
ఓ పారావతశకుంతమాలారా! మీకు నమస్కారము. మీరు ప్రాజ్ఞులని నారదమహర్షి చెప్పిపోయెను. మాలో మాకొకవిషయమై తగవు వచ్చినది. హెచ్చు కుందులు మీరు సెప్పవలసియున్నది. వినుండు. దేవలోకములో సుప్రసిద్ధ సౌందర్యశాలలు చంద్రుడు, వసంతుడు, కంతుఁడు, జయంతుఁడు, నలకూబరుండునుగదా! వారిలోఁ జంద్రుఁడు గ్రహము. కంతునకు రూపము లేదు. వసంతుఁడు వృక్షసంక్రాంతుడు. కావున వారు మువ్వురు లెక్కలోనివారుకారు. జయంతుఁడు నలకూబరుఁడు సంపదచేతఁ బ్రభుత్వముచేత వయసుచేతం బొగడఁదగి యున్నవారు. శృంగారలీలానుభవము సౌందర్యము కళావిదగ్ధత వారిద్దరిలో నెవ్వరియం దెక్కువగా నున్నదో చెప్పవలసియున్నది. కొంద రతఁ డనియుఁ గొంద రితఁ డనియు వాదించుచున్నారు. మీ మాటలు శ్రుతివాక్యముగా మన్నింతుము. తారతమ్యముల విచారించి వక్కాణింపుఁడని ప్రార్థించిన నప్పతంగపుంగవము లిట్లనియె.
ఆహా! మీరు దేవకాంతలు. శృంగారలీలాచాతుర్యాదివిశేషముల లెస్సగ నెఱిఁగినవారు. అనుభవైకవేద్యమగు వారివిదగ్ధత మా కెట్లు తెలియును? అయినను నారదమహర్షి యా భారము మాపైఁ బెట్టెను. కావున వారియానతి కన్యధాత్వ మాపాదింపఁగూడదు. ఆ సుందరు లిద్దరు, భార్యలతో నచ్చరలతో నీ వనములోఁ గ్రీడించుచుండ బెక్కుసారులు చూచితిమి కాని పరీక్షింపలేదు. ఇందులకు రెండు మాసములు గడువీయుఁడు. అందలి తత్వంబుఁ దెలిసికొని వక్కాణింతుమని పలికిన సంతసింపుచు నానిలింపకాంతలు తమనెలవులకుఁ బోయిరి.
అని యెఱింగించి యా పక్షీంద్రము మౌనముద్ర వహించుటయుఁ గల్పలత హృదయలత పల్లవింప నిట్లనియె శకుంతమా! మీ జాతియందెట్టి గౌరవ మున్నదియో చూచితిరా! నారదుఁ డంతటివాఁడు పారావతముల నడుగుమని యానతిచ్చెను. ఆ పక్షు లెంత తెలిసినవియో అని స్తుతియించుచు. నీవు చెప్పినకథ చాల బాగున్నది. తరువాతి వృత్తాంతము వినుడనుట తోచుటలేదు. కావున వేగ మవ్వలికథఁ జెప్పుము. వారిలో నెవ్వఁడధికుఁడని చెప్పినవియో వినవలయునని కుతూహలముగా నున్నది. ఎరింగింపుమని యడిగిన నప్పక్షిప్రవరంబు అయ్యో కల్పలతా! నే నేమిచేయుదును. నీ కీకథ చెప్పకపోయినను బాగుండును. నా కీకథ ఇంతవఱకే వచ్చును. పైవృత్తాంతము నాకేమియుఁ దెలియదు నా జోడుపక్షికి వచ్చునని చెప్పినది.
అక్కటా! యెట్టి చిక్కు వచ్చినది? పతంగమా! నిజముగా నీ కీకథాశేషము రాదా! ఆహా! మంచియంతరములో నంతరాయము గలిగినదే అని పరితపించుచుఁ గల్పలత శోకవతియను పరిచారికతో సఖీ! పుళిందకుమారుఁడు సెప్పినగడువు దాటి చాలదినములైనది, పక్షులనిమిత్తము వెండియుఁ గింకరులఁ బంపమని జెప్పుము. దీనిజోడు పక్షి నాపుళిందుఁడు పట్టుకొనెనని యీశకుంతమె చెప్పినదిగదా? దాని నెంతవెలకైనఁ గొనుమని ప్రత్యేకముగాఁ జెప్పుమని బోధించి దాని నప్పుడ తండ్రియొద్ద కనిపినది.
ఆ పరిచారిక వసుపాలునికిఁ గూఁతురి సందేశ మెఱింగించుటయు నప్పుడే యానృపతి యపరిమితధనముతోఁ గింకరుల నాపుళిందునొద్ద కనిపెను.
రాజభటులు పటురయంబునఁ గిరాతనాథునింటికింబోయి యుత్తరముతో నతనిసందేశ మెఱింగించిరి. సత్యవంతుఁడు బిడ్డలతోఁ జెప్పి అప్పటికి సిద్ధముగా నున్న పక్షివిశేషములనెల్ల నేఱి పంజరములతోఁ గూడ వారి కర్పించి తగినవెలలఁ దీసికొని ప్రత్యుత్తర మిట్లు వ్రాసెను.
వహారాజా! మీరు వ్రాయించిన జాబు చేరినది. మాయొద్ద నున్న పిట్టల రకములన్నియు నుచితమగు వెలఁ దీసుకొని మీకింకరుల కిచ్చితిమి. మఱియు మీరు వింతశకుంతము జోడుపక్షి మీయొద్ద నున్నట్టున్ను రెండవది మాకుఁ జేరినట్లున్ను దాని నెంతవెలఁ దీసికొనిననుసరే తప్పక పంపవలయునని వ్రాసిరి. దాని నాకూఁతురు, గొడుకును స్వయముగాఁ బెంచుకొనుచున్నారు. దాని నెంతవెల యిచ్చినను నియ్యనీయరు. మీకవసరములేక రెండుపిట్టల నొకచోటఁ జేర్పవలయునని సంకల్పము గలిగియున్నచో మీరు కొనినవెల కిబ్బడియిత్తును మీయొద్దనున్న వింతశకుంతము మా యొద్ద కనుపుఁడని మీకు వ్రాయుటకు సాహసించుచున్నాను. క్షమించవలయును.
ఇట్లు పుళిందచక్రవర్తి
అని వ్రాసి యాపణిథుల కిచ్చి యంపెను. ఆ భృత్యులు సత్వరముగా మహేంద్రనగరంబున కరిగి పత్రికతో నాపతత్రముల నెల్లఁ గల్పలత యంతఃపురమున కనిపిరి.
రాజపుత్రిక యాపతత్రముల నెల్లఁ దిలకించి కొన్నిటిం బలికించి సంతసించుచుఁ దరువాత రాజునకుఁ బుళిందుఁడు వ్రాసిన యుత్తరముఁ జదివికొని మనసు దిగ్గుమన నొక్కింత యలోచించి చెంతనున్న యశోకపతి కిట్లనియె.
నెచ్చలీ! వింటివా! పుళిందునియింట నాపక్షి యున్నదఁటకాని వానిబిడ్డలు దాని నమ్మనిచ్చిరి కారఁట. ఎదురు మనపతంగమునే కొనియెదరట. అగునగును వాని కేమి? మనరాజ్యమమ్మిననుఁ గొనఁగలఁడు. అది యట్లుండె. మన యభీష్టము తీరుట యెట్లు? సాధన మేమి? అని యడిగిన నశోకవతి యిట్లనియె.
రాజపుత్రీ! ఆ పిట్టను వా రమ్మనిచ్చిరి కారనిన నీ కింతకోపమేల? వారు మాత్రము నీవంటివారు కారా? నీతండ్రికి నీ యందెంత ప్రీతియో పుళిందునికిఁ దన బిడ్డలయం దంతప్రీతియున్నది. తప్పేమి? కాకిపిల్ల కాకికి ముద్దుగాదా! అని యుత్తరముఁ జెప్పిన విని కల్పలత యిట్లనియె.
ఓసీ మూర్ఖురాలా! నేను వాని నాక్షేపింపలేదు. జరిగినసంగతి చెప్పితిని. పరిహాసవచనముల కేమి? ఆ పక్షి నిందుఁ దీసికొనిరావలయును. తరువాయి కథ దానివలన వినవలయు నిందులకుఁ దగినసాధన మాలోచింపుమని పలికిన విని యశోకవతి భర్తృదారికా! నీ వెట్లు చెప్పిన నట్లు చేయుదును. నీకంటె నే బుద్ధిమంతురాలనా? అనుటయుఁ గల్పలత యిట్లనియె. సఖీ! నాకొక యుపాయము తోచుచున్నది.
కిరాతులయొద్ద నెంత ధనమున్నను జాతిలక్షణ మూరకపోవదు. మనయొద్ద నున్న యంత్రవిగ్రహములు, బంగారుబొమ్మలు, రత్నమండపములు లోనగు వింత వస్తువు లన్నియుం దీసికొనిపోయి యాపిల్లల మోహపరచి యెట్లో యాపక్షిని తీసికొని రావలయును. నీవు తలఁచికొనిన నెట్టికార్యమైనను సాధించుకొనిరాఁగలవు. నీ బుద్ధిబలము నేనెఱుంగనిదికాదు. మాతండ్రి నడిగి కావలసినంత ధనముఁదీసికొని వెళ్ళుము. నామనోరథముఁ దీర్పుము అని చెప్పిన నప్పడఁతి యొప్పుకొని యానాడేఁ రాజు సెలవుఁ బొంది విచిత్రవస్తువాహనములతోఁ దగుపరిజనులఁ గూడికొని పుళిందుని నివాసదేశమునకుం బోయినది.
అశోకవతి చాలనేర్పరి, విద్వాంసులురాలు, వృద్ధసేవిని, కల్పలతకు ధాత్రి, సఖి, పరిచారిక, విశ్వాసపాత్రురాలు. తిన్నగా సత్యవంతునొద్దకుఁబోయి గౌరవింపఁ బడి అయ్యా! నేను వసుపాలుని పుత్రిక యగు కల్పలత సఖురాలను. నాపేరు అశోకవతి యండ్రు. మా భర్తృదారిక మీరు పంపిన పక్షివిశేషములకెల్ల మిగుల నానందించుచు నీబిడ్డల కీకానుకలు పంపినది. యీ యాప్తత్త్వము కోరుచున్నదని పలికిన విని దుందుభి యిట్లనియె.
అమ్మీ! మాపక్షుల మీభర్తృదారిక కూరక యీయలేదు. వెలఁదీసికొని యిచ్చితిని. ఆమె కోరినశకుంతము నీయలేకపోయితిని. అట్లైనను మీరాజపుత్రిక నాయందు దయఁ దలఁచుట నామె సుగుణముకాక వేరుకాదు. చాల సంతోషమయ్యెను. నాబిడ్డ లాతోటలో నున్నారు. ఈవస్తువు లన్నింటిని బట్టించుకొని వెళ్ళుము. వారే ప్రత్యుత్తరము వాయుదురని పలుకుచుఁ దగుమనుష్యుల నిచ్చి యాముచ్చెకంటి నావస్తువులతో బిడ్డలయొద్ద కనిపెను.
అప్పుడు వారొక యుద్యానవనసౌధము ముంగల గున్నమామిడిశాఖకు వ్రేలంగట్టిన బంగరుపంజరములోనున్న వింతశకుంతముతో ముచ్చటింపుచుండిరి. అశోకవతి వారిద్దరిం జూచి దద్దరిల్లి యుల్లమున విస్మయరసంబు వెల్లి విరియ అమ్మ నేజెల్ల! వీరెక్కడి కిరాతసూతులు ఆహా! ఏమి? యీకుమారుని సౌందర్యము? కంతువసంతజయంతాదులు వీనిగోటికి సాటిరారే! అయ్యారే! వీనిమొగ మెంత వింతగా నున్నది? వీనిబుగ్గలు గిల్లిన పాలుగారునట్లున్నవిగదా. ఆ వెలికన్నులచెన్ను తళ్కు వేయేండ్లు చూచినను దనివితీరునా? ఓహోహో! ఎక్కడి యరణ్యదేశము? ఎక్కడి కిరాతకులము? ఎక్కడి చక్కదనము? నిజముగ వీఁడు పుళిందచక్రవర్తి కాఁడు. నరేంద్రచక్రవర్తియే! కానిచో నిట్టి సంతానముఁ బడయునా? అని యాశ్చర్యముగా వారివంక చూచుచు నేమియు మాటాడలేక నిలువంబడి యుండెను.
అప్పుడు రాజువాహనుఁడు జవ్వనీ! నీ వెవ్వరిదానవు? ఎవ్వరి నిమిత్త మిందు వచ్చితివి? ఆ పెట్టెలో నేమి యున్నది? చెప్పుమని యడిగినఁ దదీయమృదుమధురగంభీరస్వరమునకు మఱియు మురియుచు నమస్కరించి యిట్లనియె.
తరుణీమనోహర! నేను మహేంద్రనగరాధీశ్వరుని పుత్రిక కల్పలత పరిచారకును. నా పేరు అశోకవతి యండ్రు. మిమ్ములఁ జూచుటకే యిక్కడికి వచ్చితిని. మా రాజపుత్రిక మీమైత్రి కోరి మీకుఁ గొన్ని వింతవస్తువులు పారితోషికముగాఁ బంపినది. ఆ పెట్టెలలో నున్నవస్తువు లవియే యని చెప్పిన నవ్వుచు శ్రమణి యిట్లనియె.
అన్నా! నీకుఁ గల్పలత యన నెవ్వతయో తెలిసినదా? మన ముద్దులమూట నీ వరాలపేటిక నెంత సొమ్మిచ్చియైనఁ గొని తీసికొనిపోదలంచిన మించుబోఁడి. ఇప్పు డందులకే మరల నీజవరాలిం బంపఁబోలు ఏమమ్మా! నిజము చెప్పుము ఆ చిన్నది మాకుఁ గానుకల నేల పంపవలయును?
అని యడిగిన ముసిముసినగవుల నవ్వుచు అమ్మయ్యో! అమ్మాయీ? మీ యూహలు బహుకల్పనలతో నొప్పుచున్నవే. మా రాజపుత్రిక యంతఃపురముఁ జూచిన నిట్లనకుందువుగదా. పని మాటకేమి? మీ సౌందర్యచాతుర్యాదివిశేషములు పరిజను లెఱింగింప విని యానందించి మీ మైత్రికొఱకుఁ గానుకల నంపినదిగాని మీరియ్యమనిన మీపిట్టను బలవంతముగ లాగికొని పోవునా యేమి? ఆమె యౌదార్యము కడు విచిత్రమైనది. మీరు వచ్చి యామెయొద్దనున్న వస్తువేది యైనను సరే యడిగిన నీయక మానదు. స్నేహమే ప్రథానము అని యామెగుణములఁ బ్రశంసింపుచుఁ దాను దెచ్చిన యాటవస్తువులఁ గనకమణిగణఘృణినికరంబులు గన్నులకు మిఱిమిట్లు గొలువఁ బెట్టెలనుండి తీసి వారి కర్పించినది. అందు -
మరచక్రము త్రిప్పి బల్లపై నిలిపినంత వడిపడి నడుచు నేనుగులు, గుఱ్ఱములు, రథములు, కాల్బలములు, వింతగా నెగురు పక్షులు చిత్రముగాఁ బ్రాకు పురుగులు మిక్కిలి విస్మయము గలుగఁ జేసినవి. అయ్యాటవస్తువులం జూచి మెచ్చుకొనుచు వసుపాలుని యైశ్వర్య మెట్టిదో యనియుఁ గల్పలతయం దెంత ప్రీతియో యనియుఁ దలంచుచు శ్రమణి యన్నతో జనాంతికముగా సహోదరా! కల్పలత కిన్ని వస్తువులు వెలగలవి యూరక మనకంపుటకుఁ గారణ మూహింపుము. మన మొకరిమొగ మొకరము చూచి యెఱుంగము. మనము పంపిన పక్షిజాతులకు వెలలు తీసుకొని యుంటిమి. అకారణవాత్సల్యురా లామె మైత్రి స్తోత్రపాత్రము కాదా? అనవుఁడు రాజవాహనుం డిట్లనియె.
రాజుల ధనమంతయు రాళ్ళపాలను సౌమెత వినియుండలేదా? అయినను మన మిన్నివస్తువు లూరక యామెవలనఁ గొననేల? ఈ పక్షినిమిత్త మీయెత్తు పన్నిన దేమో? ఎట్లయినను వీనికి బదులుగా నిజమగు నేనుఁగులు గుఱ్ఱములు మొదలగు సజీవజంతువుల నంపుదముగాక! అదియే మర్యాదయని చెప్పెను. వారిద్దరు పెద్దతడ వావిషయమై ముచ్చటించుకొనిరి.
రాజపుత్రిక మైత్రిని గుఱించి స్తోత్రము జేయుచు నా వస్తువులన్నియు స్వీకరించి యద్దముల పేటికలయం దుంచి యశోకవతిని కొన్నిదినములం దుండుమని కోరిరి. అశోకవతియు వారితోఁ జనువు గలుగఁజేసికొని యిష్టముగా మాట్లాడుచు నొకనాఁడు ప్రస్తావముగా నిట్లనియె.
రాజవాహనా! మీయొద్దనున్న శకుంతము మా రాజపుత్రికయొద్దనున్న శకుంతము భార్యాభర్తలు. ఇది మగది. అది ఆడుఁదియు పక్షిజాతి జంట విడఁదీసిన జీవింపదని చెప్పుదురు. ఇవి యాశ్రయబలంబునం జేసి కాబోలు సంతోషముతోనే యున్నవి దీనిమాట చెప్పలేను కాని మాయొద్దనున్న పని పౌరాణికుఁడగు సూతుండని చెప్పవచ్చును. అన్ని పురాణగాథలు, చమత్కారకథలు వినోదముగాఁ జెప్పగలదు. కాని దానియందొక దోషమున్నది. ఏకథ చెప్పినను బూర్తిగాఁ జెప్పఁజాలదు. సగము సగముగాఁ జెప్పును. ఒక శృంగారకథ సగము చెప్పినది. తరువాయి వినుటకు మా రాజపుత్రిక మిక్కిలి యుత్సకముఁ జెందుచున్నది. ఆ కథాశేషము మీ యొద్దనున్న పక్షికి వచ్చునఁట. అందులకై నన్నుఁ బ్రత్యేకము మీయొద్ద కనిపినది దీన నమ్మనక్కఱలేదు. మీకుఁ గోరినంత ధనము మీయొద్ద తాకట్టుగా నుంచుదము. ఈపక్షి నొక్కసారి నాచేతి కియ్యుఁడు. నేను దీసికొనిపోయి యా కథాశేషము చెప్పినతరువాత వెండియుం దీసికొనివత్తు నిదియే మా కోరిక. అని యుక్తియుక్తముగా నుపన్యసించిన విని రాజవాహనుఁడు చెల్లెలిమొగము జూచెను. అప్పు డా చిన్నది మీ రాజపుత్రిక కెట్టి సంకల్పమున్నదో మాకును నట్టియుత్సాహమే కలిగి యున్నది. ఈ ఖగపతికూడ మాకొక కథ సగముఁ జెప్పి తరువాయి కథ తనకు రాదనియు రెండవపిట్టకు వచ్చుననియుం జెప్పినది. ఆ కథాశేషము వినవలయునని మాకునుం జాల కుతురముగా నున్నది. తొలుత నీవాపక్షి నిక్కడికిఁ దీసికొనిరమ్ము. దానివలన శ్రోతవ్యముల వినినపిమ్మట దీనిని దీసికొని పోవుదువుగాక. ఆ పతంగ లలామమునకై మేము మహారణ్యములన్నియు వెదకించుచుంటిమని చెప్పిన విని యశోకవతి యిట్లనియె.
శ్రమణీ! యెట్లైన జోడు గూర్పవలయు ననియే నా తలంపు వినుము. నాతో నీయన్న గారిని మానగరమున కనుపుము. ఆయన కాపిట్ట నిప్పించెదను. మా రాజపుత్రిక యౌదార్యమును జూతురుగాక! మీ పిట్టవిషయమై తిరువాత నెట్లు తోచిన నట్లు చేయవచ్చునవి చెప్పిన విని యుబ్బుచుఁ బుళిందకన్య యిట్లనియె.
అశోకవతీ! నీవు నిక్కముగా నాపక్షి నిప్పింతువేని తప్పక మాయన్న నీతో రాఁగలడు. పెద్దవారలకుఁ దెలిసిన ననుమతింపరు రహస్యముగా నీవెంటఁ దీసికొని పొమ్ము. అనిచెప్పి యన్నతో మాట్లాడి యప్పయనమున కంగీకరింపఁ జేసినది.
అశోకవతియు నాకుమారుని పయనము వలన మిక్కిలి సంతసించుచు వారిత్తుమన్న కానుకల నేమియు నందుకొనక వెండియు వచ్చి తీసుకొందునని జెప్పి యొప్పించి బయలుదేరినది. రాజువాహనుఁ డశోకవతి నడవి దాటించి వత్తునని తండ్రికిం జెప్పి యస్వారూఢుఁడై దానివెంట బోయెను. పుళిందపుత్రి యన్నకుఁ జెప్పవలసిన మాటలన్నియుం జెప్పి కొంతదూరము వారిని సాగనంపి వెనుకకు మరలినది.
దారిలో నడచునప్పుడు రాజువాహనుఁడును నశోకవతియు నిట్లు సంభాషించుకొనిరి.
రాజ - అశోకవతీ! మీగ్రామ మెంతదూరమున్నది? ఎన్ని దినములకుఁ బోవుదుము?
అశో - ఈయడవి దాటిన తోడనే మాయంత్రశకటంబు లందున్నవి. వానిమీఁద మూడుదినములకుఁ బోగలము. ఇక్కడికి మారాజధాని నూరామడదూర మున్నది.
రాజ - యంత్రశకటము లననేమి ?
అశో - వానికి జంతువులఁ గట్టము, యంత్రము లావిరిబలమున నడచుచు నతివేగముగాఁ బోఁగలవు.
రాజ - యంత్రమున కావిరి యెట్లు వచ్చును ?
అశో - అదియొక విధమగుచమురు. దానిమూలమున వచ్చును.
రాజ - నాగుఱ్ఱముకన్న వేగముగాఁ బోవునా ?
అశో - నీగుఱ్ఱమునకుఁ గొంతదూరము పరుగెత్తిన నాయాసము వచ్చును. యంత్రము నిర్జీవము. ఎంతదూరమైన నొక విధముగానే పరుగెత్తును.
రాజ - అదియా! మేలు! క్రొత్త వింతలు చూడబడు చున్నవి. ధన్యుండెనే.
అశో - అది యొక్కటియే! అలాటి వెన్నియేనిం జూతువుగాక.
రాజ – మరేమి వింత లున్నవి?
అశో - నీవు జనించిన తర్వాత నరణ్యమేకాని పట్టణములును, పల్లెలును చూచి యెఱుంగవు. భూమిపై నెన్ని విచిత్రనగరములు, నెన్నియూళ్ళు ఎన్ని వింతలున్నవి ? వానిం జూచినఁ దిరుగ నీవు మీయింటికిఁ బోవుదువా?
రాజ — సరిసరి. మాతలిదండ్రులకు జెప్పకుండ వచ్చితిని. నాకొఱకు మాచెల్లెలు బెంగఁ బెట్టుకొనగలదు నేనెన్నియో దినములు నిలవను. మీరాజపుత్రిక నాకు వెంటనే పిట్టనిచ్చునా?
అశో - (నవ్వుచు) నీకిష్టమైనప్పుడే యుందువుగాక? బలవంతము సేయుము. మాటవరుస కంటిని.
రాజ - అయ్యో! నీవు నాగుఱ్ఱమును నెంత ముందుగా నడిపించినను నడువలేకున్నాను. అడవి యింక చాలచూరమున్నది. గుఱ్ఱము వెనుకభాగమునఁ గూర్చుండెదవా? వేగముగా నడిపింతును?
అశో - ముందేకాని వెనుకఁ గూర్చుండఁ జాలను. మార్జాలకిశోరన్యాయము గాని మర్కటకిశోరన్యాయము పనికిరాదు.
రాజ - నీవు పెద్దమాటలు సెప్పుచుంటివి, ఏమయినం జదివితివా ?
అశో - చదువురానివారల దివాణములలో నంతఃపురకాంతలకుఁ బరిజనులుగా నుండనిత్తురా? చదివితిని.
రాజ - ఏమి చదివితివి ?
అశో - మారాజపుత్రిక జదివిన దంతయు నాకును వచ్చును.
రాజ - మీరాజపుపుత్రిక యేమి చదివినది ?
అశో - అబ్బో! గొప్ప గొప్ప విద్వాంసులే యామెతో మాట్లాడనేరరు. శాస్త్రములు, సంగీతములు, సాహిత్యము, వ్యాయామము పెక్కు విద్యలు వచ్చును. కామశాస్త్ర మంతయు నామెకుఁ గంటోపాకమే.
రాజ — కామశాస్త్ర మనఁగా నేమి? వ్యాకరణమాఁ తర్కమా ?
అశో - తర్కవ్యాకరణములు కావు అందు స్త్రీ పురుషలక్షణములు, కన్యావిస్రంభము, సంభోగవిధానము, దేశకాలప్రకృతి లక్షణములు, వశ్యౌషధములు, మంత్రములు, తంత్రములు, మొదలగు శృంగారవిశేషము లన్నియు నుండును. దానిం జదివినవారే రసికులు నీవేమి చదివితివి?
రాజ -- నేను మా తండ్రిగారి యొద్దనే శాస్త్రము, తర్కవ్యాకరణములు చదివితిని కాని కామశాస్త్రము చదువలేదు. దాని విధాన మెట్లుండునో శ్లోక మొకటి చదువుము.
అశో - వినుము.
శ్లో. జాతిస్వభావ గుణదేశజ ధర్మచేష్టా
బావేంగి తేషు వికలో రతితంత్రమూఢః
లబ్ద్వాపి హి స్ఖలతి యౌవన మంగనానాం
కిం నారికేళఫల మాప్య కపిః కరోతి.
జాతిస్వభావగుణవిశేషాదు లాగ్రంథమందుఁ జెప్పఁబడి యున్నవి.
రాజ — ఎవరిజాతిస్వభావాదులు? స్త్రీలవా, పురుషులవియా ?
అశో - ఒకరివి యొకరు.
రాజ — ఈశ్లోకములో నట్లులేదే. పురుషుఁడు స్త్రీయొక్క జాతిస్వభావగుణచేష్టాది విశేషంబులఁ దెలిసికొనవలసినదనియు నట్లు తెలియనివాఁడు రతితంత్రమూఢుఁడనియుఁ గోఁతికి గొబ్బరికాయ దొరకిన బ్రద్దలు కొట్టికొని తిననేరనట్లు స్త్రీల యౌవనముఁ బొందియుం దొట్రుపడును. అని యున్నది గదా? అది స్త్రీల కేమి యుపయోగము?
అశో - ఇంకనేమి? ఈమాత్రము పాండిత్య మున్నది గదా! చాలు కాంచనమునకుఁ బరిమళ మబ్బినట్లే. నీకు విద్యావాసన గలుగుట సంతోషమయినది. గుఱ్ఱము నిలిపెదవా నెక్కెద.
రాజ - (నిలిపి యెక్కించుకొని ముందరనే కూర్చుండ బెట్టుకొని) గుఱ్ఱము జూలు గట్టిగాఁ బట్టుకొనుము. వడిగాఁ దోలెదను.
అశో - నాకును గుఱ్ఱమెక్కు పాటవము గలదు, భయము లేదు. వడిగా దోలుము.
అనుటయు నతండు తత్తడిని వడిగా నడిపించి రెండుగడియలలో నాయడవి దాటించెను. ఆయరణ్య ముఖంబుననున్న కోయపల్లెలో దాని పరిజనులు యంత్రశకటముతో వేచియుండిరి. అక్కడ నుండి దేశముల మీఁదికి విశాలములైన రాజమార్గములు గలవు. అశోకవతి యందు గుఱ్ఱమును దిగినది. రాజువాహనుఁడును దిగి యాశకటమును బరీక్షించి చూచి వెఱఁగుపడఁజొచ్చెను ఆశోకవతి యతని నాబండిలోఁ గూర్చుండ రమ్మనియెను. అతం డంగీకరింపక గుఱ్ఱమును దానితో సమముగా నడిపించి వచ్చెదనని చెప్పెను. బండి, గుఱ్ఱము నొకసారి వదిలిరి. గుఱ్ఱమే ముందుఁ బోయి గమ్యస్థానము జేరినది. అతని యశ్వగమననైపుణ్యమునకు అశోకవతి వెఱఁగుపడినది.
176వ మజిలీ
శ్యామల కథ
పుళిందకుమారుం డశోకవతితో నరుగునప్పుడు దారిలోఁ గనంబడిన విశేషములెల్ల దాని నడుగుచుఁ దెలిసికొనుచుండును. అశోకవతియు నతనికి మార్గవిశే