Jump to content

కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/174వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఆ విషయమున వారిరువురకు సంవాదము జరిగినది. ఆ శకుంతమేదియుఁ జెప్పలేకపోయినది. తరువాతకథ వచ్చిన పక్షి యెందన్నదో యరసి తెప్పించి దాని వలన నందలి నిజానిజంబులు గ్రహింపవలయునని నిశ్చయించుకొనిరి.

అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించుటయుఁ దరువాతి వృత్తాంతము పైమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.

174 వ మజిలీ

కల్పలత కథ

మహేంద్రనగరాధీశ్వరుండైన వసుపాలునకుఁ గల్పలతయను కూతుఁ రొక్కరితయే యుదయించినది. అమె మిక్కిలి చక్కనిదని వర్ణించుటకంటె నట్టి సౌందర్యవతి మనుష్యలోకమున నిప్పటికిఁ బుట్టలేదని చెప్పిన సులభముగాఁ దెలియును. అప్పుడుమిఱేఁ డప్పడఁతి చెప్పినదే విధివాక్యముగా నెంచుచు నమ్మించుఁబోడి యేమి కోరినను దెప్పించి యిప్పించుచుండును. ఆ బాలికారత్నమునకుఁ జిన్నతనము నుండియుఁ బక్షిజాతియందుఁ జాలప్రీతిఁ గలిగి యున్నది. ఎక్కడ నెట్టి వింతపిట్ట లున్నవని విన్నను నెంత రొక్కమైన నిప్పించి తెప్పించుచుండును. వింతపక్షులను దెచ్చినవారికి వారు కోరిన వెల నిప్పింతునిని దేశదేశములయందుఁ బ్రకటించియున్నది. పుళిందుని ప్రఖ్యాతిఁ విని యందుగల పక్షిజాతి నంతయుఁ బంపుమని వార్తనంపినది. అందప్పు డేమియు బక్షులు లేకపోవుటచే నందలి పులుగులు సంప్రాప్తించినవికావు.

ఒకనాఁడు సత్యవంతునికిఁ జిక్కక పారిపోయిన రెండవపక్షి యొకబోయవానికి దొరికినది. వాఁ డాపిట్టం బట్టుకొని దానియాకారసౌష్టవమున కచ్చెరువందుచు మహేంద్రనగరంబున వింతపక్షుల కెక్కుడు వెలయిచ్చి కల్పలతయను రాజపుత్రిక కొనుచున్నదను వార్తవిని యానగరంబునకుం బోయి యందలి రాజపురుషుల కత్తెఱం గెఱింగించెను.

వారు వానికి జెప్పి పంజరముతో గూడ నాపతత్రమును రాజపుత్రిక యంతఃపురమున కనిపి వాఁడు చెప్పినవెలఁ దెలియఁజేసిరి. ఆ పక్షిం జూచినతోడనే యాచేడియ వేఱుమాట పలుకక వాఁడు సెప్పినవెల కిబ్బడిగా నిచ్చి యంపి దానిరత్నపంజరముఁ బెట్టించి ముద్దుపెట్టుకొనుచుఁ బలురకములఁ బండ్లఁ దినిపించి మెల్లగాఁ మాటాడించుటయు నాపతంగ మిట్లనియె.

రాజపుత్రీ! కల్పలతా! రాజపుత్రీ! కల్పలతా? అని రెండుసారులు పిలిచినది. దాని కంఠమాధుర్యము కచ్చెరువడి యప్పడఁతి దాపునకు వచ్చి యేమి పతంగపుంగవా? నన్నుఁ జీరుచుంటివి. నాపేరు నీకెవ్వరు. సెప్పిరి? నీ కీమాటల నెవ్వరు నేర్పిరి? ఇంతకుముం దెందుంటివి? నీవు గృహ్యకపక్షివలె నుంటివి. నీ వృత్తాంతము చెప్పుమని యడిగిన నానీడిజం బిట్లనియె.

కల్పలతా! నేను నీచేఁ గొనఁబడుటచే నీ వస్తువనైతిని. నిన్ను సంతోష పరచుటయే నాపని. నాకు సంగీతమునందు సాహిత్యమునందు మంచిపాండిత్యము కలదు. నే ననేకవిచిత్రములైన కథలం జెప్పగలను. నాచూడని పురాణములు లేవు. శాస్త్రములన్నియుఁ జదివితిని. నీకేది కావలసినను బాఠముఁ జెప్పఁగలను. నే నాఁడుపక్షిని. నా భర్తయు, నేనును వింధ్యపాదమూలంబున సహకారతరుశాఖ నధిష్టించి యొకవసంతసమయమున వింతగా గానము సేయుచుండ నొక పుళిందుఁ డుచ్చు పన్ని నాభర్తం బట్టుకొనియెను. నేను దొరకక పారిపోయి వచ్చితిని. విధినియామక మెవ్వఁడును దాటలేఁడు. పిట్టప్రాణమున కెల్లరు నాసింతురు. మరియొకచోట నొక కోయవాఁడు నన్నుం బట్టుకొని పాపము చంపక మీ కమ్మెను. ఇదియే గొప్ప యుపకారము. తగినచోట నప్పగించి నాకు మంచి యుపకారము గావించెను. నాభర్త నా పుళిందుఁడు చంపెనో పెంచెనో తెలియరాదు. ఇంతపట్టు నీ కెఱింగించితిని. పై ప్రశ్నము లేవియు నన్నడుగవలదు. నీకుఁ గావలసిన విద్యల నేర్చికొమ్మని చెప్పి యూరకున్నది.

ఆ పడుచు ఆ యుపన్యాసము విని మిక్కిలి వెఱఁగుపడుచు మఱేమియు నడుగక కానిమ్ము. పుళిందుని మే మెఱుంగుదుము. అతఁడు పక్షులఁ బెంచునుకాని చంపఁడు. వెఱవకుము. నీ భర్తనుగూడ వెలయిచ్చి యిచ్చటికిఁ దెప్పించెద. అందున్న పక్షులనెల్లఁ గొనియెద. నాపుణ్యమున నీవు లభించితివి. నాకుఁ గథలనినఁ కాలయుత్సుకము. ఏదేని మంచికథ చెప్పి నాకు సంతసము గలుగఁజేయుమని యడుగుటయు నా యండజము మగువా! నవరసములలో శృంగారరసము ప్రధానము. ఆ రసము నీకభిరుచియైనచోఁ దద్రసప్రతిపాదకమైన కథయే చెప్పెద. లేదా వైరాగ్యము, హాస్యము, కరుణము, లోనగు నతర రసములుగల కధలు చెప్పుమనిన వానిం జెప్పెద. నీయభిప్రాయమే మనవుఁడు సిగ్గుపడి యాపడఁతి యూరకున్నంత నాసన్నవర్తిని యగు నశోకవతి యను పరిచారిక శారదా! నీవన్నియుం దెలిసిన శారదపు. ఈమె కిప్పు డేది యభిమత మగునో యట్టిదానిం జెప్పుము. వేఱె నిరూపింప నేల? అన్నిరసములు నీమె కభిమతములే. వరుసగా నన్నివిధముల కథలుం జెప్పవలయు ననియుత్తరముఁ జెప్పిన నవ్వుచు నవ్విహాయసంబిట్లు చెప్పందొడంగెను.

175 వ మజిలీకథ

అచ్చరల కథ

దేవలోకములో నప్సరసలని యొకతెగ మగువలుగలరు. వారికి దేవతావేశ్యలని పేరు. ఆ స్త్రీలు మిక్కిలి చక్కనివారు. రంభ, యూర్వశి, మేనక ,