కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/173వ మజిలీ

వికీసోర్స్ నుండి

నయ్యిందువదన తొందరగా నన్నక్కడకు రప్పించుకొని దాని మాటలతెఱం గెఱింగించినది. అతండు దానిం దువ్వుచు నండజకులమార్తాండమా! భవద్దుండపాండిత్యప్రకర్షము తేటపడ నొక పాటపాడుము. ముద్దులమూటా! ఏదీ నీ స్వరప్రాగల్బ్యము గనుపరుపుము. అని ప్రార్ధించిన విని యా నీడజప్రపరంబు సంగీతభంగీతరంగితముగా నీశ్లోకము జదివినది.

శ్లో. ఓజోరంజనమేవ వర్ణరచనా శ్చిత్రా న కస్య ప్రియా
    నానాలంకృతయశ్చ కస్య స మనస్సంతోష మాతస్వలే
    కావ్వే కింతుసతాం చమత్కృతః సూక్తి ప్రబంధాస్ఫుటం
    తీక్ష్ణాగ్రాహ్యమి తిశ్రుతిప్రణయినః కాంతకటాక్షాఇవ

శ్లో. సరస్వతీ విభ్రమదపన్‌ణానాం
    సూక్తామృత క్షీరమహోదధీనాం
    సన్మాన సోల్లాససుధాకరాణాం
    కవీశ్వరాణాం జయతి ప్రకర్షః.

అని చదివిన విని వారిద్దరు బెద్దగా మురియుచు నా పక్షీంద్రమును ముద్దుపెట్టుకొని విహంగమ లలామా! నీ స్వరము హృదయంగమై యున్నది. మఱియు వినోదకరమైన కధ యేదైనం జెప్పి మాకు సంతోషముఁ గలుగఁజేయుమని కోరిన నా వికిరవరం బొక్క కథ యిట్లు చెప్పఁదొడంగెను.

173వ మజిలీ

విజయపాలుని కథ

కళింగదేశమున విజయపాలుఁడను నృపాలుఁడు తేజస్వినియను భార్యతో రాజ్యముఁ జేయుచుండెను. అప్పుడమిఱేఁడు దాక్షిణ్యవంతుఁడు పరాక్రమశాలి సత్యసంధుఁడని ప్రఖ్యాతివడసెను. అయ్యొడయునికడ సుమతి యను బ్రాహ్మణసచివుఁడు ఆంతరంగికమిత్రుండై మెలఁగుచుండెను. మిగుల గుణవంతుఁడగు సుమతి నిష్కాపట్యంబున రాజసేవ సేయుచుండెను. రాజదంపతులకడ సుమతికిఁ చాలచనువు గలిగి యున్నది. ఎంత పరిచయము మున్నను నతఁడు తఱి నెఱిఁగియే నడచుచుండెను.

ఒకనాఁడు రాజదంపతు లొకనాటకమును జూఁడబోయిరి. అందొక నటుని నాట్యము గుఱించి ప్రశంసింపుచుండ సుమతి యందలి స్ఖాలిత్యములఁ దెలియఁజేయుటకు రాజు నీకు నాట్యమందుఁ బరిచయమున్నదా? అని యడిగెను. కలదని యుత్తరముఁ జెప్పెను. ఏదీ మా యెదుట నీ నటనపాటవము జూపుమని యడిగిన నతండు దేవాసురమనుష్యనృత్యవిశేషంబులం జూపి వారి నాశ్చర్యపారావరమున నోలలాడించెను.

మఱియొకనాఁ డొకవైణికుని గాన మాలించి యిం దేమైన లోపము లున్నవా? అని యడిగిన సుమతి తాను మనోహరముగా వీణ వాయించి యితర వైణికునిపాటలో లోపములఁ దెలియఁజేసెను. రాజు సంతసించుచు నీకేయే విద్యలయందుఁ బరిచయము గలిగియున్నదని యడిగిన నన్నివిద్యలు వచ్చునని యుత్తర మిచ్చెను. వెఱగుపాటుతోఁ నీవు మల్లయుద్దముఁ జేయగలవా? అని యడిగినఁ జేయుదునని చెప్పినంత రాజే వాని దానిలోఁ బరీక్షించి యోడిపోయెసు. అదిమొదలు రాజునకు వానియందుఁ బ్రేమగలిగియున్నది. ఒకనాఁడు సుమతి రాజు భోజనముఁ చేయుచుండ దండను గూర్చుండి వినోదములగు కథలు చెప్పుచుండెను. అప్పుడు వంటవాఁ డేమియో పిండివంట వడ్డించెను. సుమతి వాని వైమనస్యము గ్రహించి యా వంటకముఁ దినకుండ నాటంకపఱచి యిందేదియో దోషమున్నదని నిరూపించి చెప్పెను.

రాజు దాని నావంటవానిచేఁ దినిపించుటయు వాఁడది తినిన గడియలోఁ గన్నులు దేలవైచుచు మహారాజా! నే నపరాధిని. నీ శత్రుఁడు మధువర్మ ప్రేరణంబున నీ యింట వంటవాడుగాఁ బ్రవేశించి వంటకంబున విషంబిడితిని. సుమతి నా కపటము గ్రహించెను. నిజము చెప్పితిని. నన్ను రక్షింపుము నా దారి నేను బోయెదనని ప్రార్థించెను.

రాజు సుమతిం గౌగిలించుకొని ప్రాణదాత వైతివని పొగడుచుఁ దదనుమతిని వంటవానికి విషగ్రసనమగు నోషధి నిప్పించి మన్నించి విడిచివేసెను. రాజునకు నాటంగోలె సుమతియందు మఱియు ననురాగ మధికమై ప్రాణముకన్న నెక్కువగాఁ జూచుచుండెను. విజయపాలునకు సహజవిరోధియగు మధువర్మ వంటవానివలన సుమతివృత్తాంతము విని శత్రు డధికుండై యున్నవాఁడని తలంచి మిక్కిలి బలవంతుఁడగు మందపాలుఁ డనునృపాలు నాశ్రయించి విజయపాలునిమీదికి దండెత్తఁ దోడురమ్మని కోరుకొనియెను.

ఇరువురురాజులు చతురంగబలముతో బయలుదేరి హటాత్తుగా నొకనాఁటి సాయంకాలమున విజయపాలుని నగరము ముట్టడించిరి. విజయపాలుండది యెఱింగి శత్రుబరాధిణ్ణమునకు వగచుచు సుమతిం జేరి యిప్పుడు మనమేమి చేయఁగినది దీనుండై యడుగుటయు నతండు ధైర్యముతో మహారాజా! వెఱవకుఁడు సూర్యోదయములలోపల శత్రుబలముల మనపురము విడిచిపోవునట్లు చేసెదఁ జూడుము నాప్రజ్ఞ అని ధైర్యము గఱపి నాటి యర్థరాత్రమున లేపనాలంకృతవిగ్రహుండై తనకుఁ గలిగియున్న యంజనప్రభావమున నదృశ్యుండై మదనపాలుడున్న....బోయి నిద్రించుచున్న యతని లేపి భూపా! నే నింద్రునిదూతను. మాయింద్రుడు నీ కిటుల జెప్పిరమ్మని నన్నంపెను. వినుము. విజయపాలుఁడు మిక్కిలి ధర్మాత్ముండు. జనప్రియుడు. మధువర్మ కడు దుర్మార్గుఁడు. వాని ప్రోత్సాహమున నీవు సుగుణారతుండగు విజయపాలునిమీఁదికి దండెత్తివచ్చితివి. ఇది మాకుఁ బ్రియముకాదు. అధర్మము. రేపు సూర్యోదయము కాకుండ నీయూరు విడిచి పొమ్ము. లేకున్న మేము నీమచ్చ మాపుదుమని మహేంద్రుడు మీ కెఱిఁగింపుమనియె. దీనికిఁ బ్రత్యుత్తర మేమిత్తురని యడిగిన గడగడలాడుచు నాయొడయఁడు ఇతఁడెట్టివాఁడు కానిచో నీవ్యూహమధ్యమునకు రాఁగలడా? ఇది సత్యము కావచ్చునని నిశ్చయించి చేతులు జోడించి యోహో| త్రిలోకాధిపతియగు నింద్రుని సందేశము మన్నింపకుండుటకు నేనెంతవాఁడ! వారి సెలవు ప్రకారము కావించెద ననుగ్రహింపుఁడని చెప్పుము. అని పలికి యతని నంపి సూర్యోదయము కాకుండఁ దన బలముల మరలించుకొని నిజనగరంబునకుఁ బోయెను. నిస్సాహాయుఁడగు మధువర్మ బలములను విజయపాలుని వీరభటులు సులభముగాఁ బారదోలిరి.

రాజు సుమతి చేసిన యుపకారమును వేతెఱంగులఁ గొనియాడుచుఁ దన భార్య యొద్ద నతని సుగుణములఁ బెద్దగా నగ్గించెను. సుమతి గుణవంతుఁడేకాక మిక్కిలి రూపవంతుఁడు. పిన్నవయస్సువాఁడు. రాజుభార్య వానిం జూచినప్పుడెల్ల నుల్లమున నించుక వికారము నొందుచు నంతలో నడంచుకొనుచుండునది. వాని గుణగౌరవము వినిన కొలఁది క్రమంబున నయ్యనురాగము వృద్ధి నొందు చుండెను.

శ్లో. కులీనా రూపపత్యశ్చ నాధత్యశ్చ యాషితః
    మర్యాదాసు నతిష్టంతి స దోషః స్త్రీయం నార్యః

స్త్రీలు మంచి కులంబునంబుట్టినను రూపపతులై నను భర్తగల వారయ్యును నియమము గలిగియుండరూ. స్త్రీలయందుగల పెద్దదోషమిదియే. మఱియు

శ్లో. స్త్రీయంహి యః ప్రార్దయతే నన్ని కర్షంచగచ్చతి
    ఈషచ్చ కురుతే సేవాం స్పృహయంతి కులస్త్రియః.

స్త్రీలు సమీపమందుండి యాశ్రయించు వాఁడెట్టివాఁడై నను వాని ననుగ మింతురు.

రాజపత్ని సుమతి యారాజు బరాక్రమమును తలంచుకొని విదాళిం గుందుచు నొకనాఁడు భర్తతో నిట్లనియె. ప్రాణేశ్వరా! నాకు వీణాపరిశ్రమ చేయవలయునని చాలాకాలమునుండి యుత్సాహము గలిగియున్నది. అయ్యుత్సుక యెప్పుడు మీతోఁ జెప్పక మనసులోనే యడంచుకొని యుంటిని. మీరు మదంకతలంబునఁ దల నిడి వినోదముగా నాకర్ణింపుచుండ మనోహరముగా వీణ పాడవలయునని కోరిక, అయ్యభిలాష తీర్పరా! అని యడిగిన నతండు ఓహో! దీనికి నన్నింత ప్రార్దింప నేల? మంచి వైణికుడు మనయింటనే యున్నవాఁడు గదా! అతఁడు నీ కిష్టుడే. వానివలన నేర్చుకొనుము అని చెప్పెను.

ఆమాట విని రాజుభార్య అవజ్ఞా! మీ సెలవు లేని దెట్టియే కార్యమును చేయనిదాని నగుట ని ట్లడిగితిని. మీరే వాని నాజ్ఞాపింపుడు. అని పలికిన విని యతండు సుమతిం బిలిచి మిత్రుఁడా! తేజస్వినికి వీణ నేర్చుకొనవలెనని యభిలాష గలిగిన దఁట. నీవు మాకాంతరంగిక మిత్రుఁడ వగుట నీ కేయాటంకమును లేదు. ఆమె కోరినప్పు డెల్ల బోయి వీణ నేర్పుచుండుమని నియమించెను.

సుమతి మహాప్రసాదమని మంచి సుముహూర్తమునఁ బ్రారంభించి నిర్వికారమనస్సుతో నామెకు వీణ నేర్పుచుండెను. ఆచంచలాక్షి పరిజనుల దనదాపున నుండనీయక యేకాంతప్రదేశమునఁ గూర్చుండి సుమతియొద్ద వీణ నేర్చుకొనుచుండెను. ఒకటి చెప్పిన నొకటి జేయును. స్వరము చెప్పిన గీతము గీతమనిన పదము, పదమనినఁ గృతిపాడును. ఒకరాగము పాడమనిన వేరొకరాగము పాడి నవ్వుచు నాక్షేపించుచు విలాసముగా మోముపలక్షించుచు శృంగారలీలలఁ బ్రకటించుచుండెను.

సుమతి యామె రాజపత్నియను గౌరవమున నేమియు మారుపలుకక యాచేడియ యేది పాడిన దానితోనే తప్పులు దిద్దుకొనుచు నేర్పుచుండెను. నాలుగు దినములట్లు గడచిన నొకనాఁడా చపలనేత్ర వారచూపు లతనిమోముపై వ్యాపింప జేయుచు నోహో! విచక్షణుఁడా, నీ శిక్షణము చక్కగాఁనున్నది. క్రొత్తకల్పన యేదియుం జెప్పవు. నేను బాడినదానిలో నందుకొని గొణెగదవు. నీ మనస్సు వేఱొకచోట నున్నదికాబోలు. నీసాంగత్యము నాలుగుదినములనుండి గలుగుచున్నది. ఇంచుకంతయును ఫలము గనఁబడలేదని పలికిన విని యులికిపడి యతండిట్ల నియె.

సుమతి — అమ్మా ! నామార్గము ననుసరింపక నీయిష్టము వచ్చినట్లు పాడుచుంటివి. నేనేమి చేయుదును ?

రాజపత్ని — అమ్మా అనుటకు నేను ముసలమ్మను గానుఁ దేవీ అనరాదా? తరుణీ అనరాదా! మఱియును అట్లు చేయరాదని నన్ను మందలింపరాదా? నీవసవర్తినై యుంటిని. ఇటుపిమ్మట నీయిష్టము వచ్చినట్లు నియోగించుము. అడ్డము చెప్పితినేని శిక్షింపుము.

సుమతి - తల్లీ నీవు రాజపత్నివి. నిన్నుఁ దరుణీ యని పిలువవచ్చునా? మఱియు నిన్ను శిక్షించుటకు నేనెంతవాఁడను?

రాజ — నీకు నేను వృద్ధురాలుగాఁ గనబడుచుంటిని కాఁబోలు పోనిమ్ము. శిష్యురాలిని మందలింపఁగూడదా?

సుమ - నిన్నేమని మందలింపను? మందలించుటకుఁ జిన్నదానవా?

రాజ — అవును. నీమనస్సులో నేను పెద్దదానననియే యున్నది. నాకుఁ దెలియును. అందులకే యుపేక్షించుచుంటివి. కానిమ్ము, చిన్నదాననో పెద్దదాననో నావైదగ్ధ్యము చూచిన పిమ్మట నీకే తెలియగలదు.

సుమ - నీమాటలు నాకేమియుం దెలియవు. నే నవ్వలికిఁ బోవలసి యున్నది. సారెల సవరించి తంత్రుల నాలాపింపుము.

రాజ -- ఏతీగపైనే వ్రేలెట్లు నొక్కవలయునో నాకుఁదెలియదు. నీచేతితో నావ్రేళ్ళు పట్టుకొని తీగలపైనొక్కి పలికింపుము.

సుమ - అయ్యో! బొత్తుగా వీణాపరిశ్రమ లేనిదానివలెఁ జెప్పుచుంటివే? ఓనమాలు గూడిఁ జెప్పవలయునా యేమి?

రాజ - తప్పక చెప్పవలయు; నేనంతయు బరవశనై మరచిపోయితిని.

సుమ - పరవశత్వ మేల ?

రాజ - నిన్నుఁ జూచుటచే నీవయసు, నీరూపము, నీగుణంబులు నా హృదయ మాకర్షించినవి. హృదయశూన్యురాలి కేమి చెప్పిన దెలియును?

సుమ - తల్లీ! పుత్రునిగుణంబులు తల్లికిఁ బ్రియములగునట్లు నాగుణంబులు నీకు మనోహరములైన నగుంగాక దానం దప్పేమి?

రాజ - వయసుకాఁడా! నీ వెడగునొడుపులు నాచెవిం బడవు. గడుసువాఁడవు. నాచే నననిపించుదనుక నెఱుంగ నట్లభినయించెదవు. నిజము దాచనేల? వినుము. నే నీ వీణాపాదన నెపంబున నిన్నిందు రప్పించితిని కాని నాకు దీనియందు బ్రియము లేదు. నీయందు గాఢానురాగము గలిగినది. నిన్నుఁ గామించితిని. నాయభిలాషఁ దీర్పుము. తెలిసినదా?

సుమ - (చెవులు మూసికొని) దేవీ! నీవు స్వామిభార్యవు. నాకేగాక లోకమున కెల్లఁ దల్లివి. నీవు దుష్టురాలవై తేని రాష్ట్రమంతయుం జెడును. ధర్మ విరుద్ధము. అట్టిపనికి నేనంగీకరింపను.

రాజ — ఇది యధర్మమని యెట్లు చెప్పఁగలవు? ధర్మమేయని నేను వాదింపగలను. వినుము. స్త్రీలు పక్వాన్నము వంటివారు. అందరును భుజింపఁదగినవారు. అని శాస్త్రములోనే వ్రాయఁబడియున్నది.

శ్లో. పక్వాన్న మివ రాజేంద్ర! సర్వసాధారణా స్త్రియః
    తస్మా త్తాను న కుప్యేత న రజ్యేత రమేతచ.

అని యుండగా మొన్నమొన్ననే లోకమర్యాదనిమిత్తము పరస్త్రీగమనము నిషేధించుచు శ్వేతకేతుఁడను మహర్షి స్త్రీలకు గమ్యాగమ్యవివక్షతఁ దెచ్చిపెట్టెను.

శ్లో. మద్యపానా న్నివృత్తిర్చ | బ్రాహ్మణానాం గతోస్సుతాం
    పరస్త్రీభ్యశ్చ లోకానా మృషే రౌద్ధాలకేరపి !
    తతః పితు రనుజ్ఞానా ద్గమ్యూగమ్యప్యస్థయా
    శ్వేతకేతు స్తపోనిష్ట స్సుఖం శాస్త్రం నిబద్దనాన్.

లేనిపోనిశాస్త్రమును గల్పించి స్త్రీల కపకారము చేయఁజూచిన శ్వేతకేతుని మాటయే వేదవాక్యమా? అంతకుఁ బూర్వము వారందరు భ్రష్టలైరా? భ్రష్టులేయైనచో వారి సంతతివా రుత్తము లెట్లగుదురు? ఇదంతయు లోకవిడంబనము నిమిత్తము గల్పించినది దీనం బరమార్ధహాని యేమియు లేదని నేను ఘంటాపథముగా వాదింపఁగలను.

సుమ - నీ వాదము వేశ్యాలాపమువలె నిరర్ధకము, నే నంగీకరింపఁజాలను. ప్రభుద్రోహపాతకము నన్ను బాధింపక మానదు.

రాజ - సీ! మూర్ఖుఁడా ఇట్టి రూపవతి యాసించి వచ్చి ని న్నభిలషింప నిరసత్వముఁ జూపుచుంటివి. నీ కళావైదగ్ధ్యము కాల్పనా?

సుమ - దేవీ! కళావైదగ్ధ్యము పరదారపరిగ్రహణమునకా? చాలు జాలు నీ చిత్తము మరలించుకొనుము.

రాజ - ఆహా? మిక్కిలి యనురాగముతో నిన్నుఁ గామించి పరవశనై వచ్చిన నన్నుఁ దిరస్కరింపుచుంటివి. దయాశూన్యుఁడా? నా కిఁక మరణమే శరణము. కాని నీ యంతము జూచిన పిమ్మట మృతి నొందెదను.

సుమ - శ్లో॥ వరం యద్ధర్మపాశేన క్షణ మేకంహి జీవితం
                వరం న యదధర్మేణ కల్పకోటి శతాన్యపి.

తల్లీ! అధర్మమున బెక్కేండ్లు జీవించుటకంటె ధర్మపాశబద్ధుండై క్షణకాలము జీవించుటయే శ్రేయము. అకృతపాపుండనగు నా కిప్పుడు మరణమే మేలు. నీతోఁ గలుసుకొనుట నరకపతనమునకు హేతువు.

రాజు – నా మాట వినుము. వ్యర్థముగా మన యిద్దరి ప్రాణములేల పోఁగొట్టెదవు? రాజు నా మాట జవదాటఁడు. వారితోఁ జెప్పి నీ కనేకగ్రామము లిప్పించెదను. సామంతుల నెల్ల నీ పాదాక్రాంతుల గావించెదను. పెక్కేల! గుణోజ్వలుఁడవగు నీవే యీ రాజ్యమున కధిపతి వగుదుపు. నిన్నుఁ బరిభవించువాఁ డెవ్వఁడు? నిశ్శంకముగా నా యౌవన మనుభవింపుము.

సుమ - (ఇంచుక యాలోచించి) దేవీ! నీకింత యభిలాషగా నుండిన నట్లే కావించెదను. తొందరపడిన రహస్యభేదము కాగలదు. కొన్నిదినములు సైరింపుము. సర్వనాశనకరమగు నీ విరోధము నా కేల? అని యామె కాస కొలిపి సంతోషపరచి యాపట్టు తప్పించుకొని అమ్మయ్యా! అని నిట్టూర్పు నిగుడింపుచు నవ్వలకిఁ బోయెను.

రాజపత్ని యతనియందు బద్దానురాగయై వాని ననుసరించి క్రుమ్మరుచు నెప్పుడెప్పుడని యడుగుచుండ నిదిగో యదిగోయని కొన్ని దినములు గడపెను. కాలవ్యవధి సహింపక యాచంపకగంధి వీణారాదనకైతవంబున వానిని దాపునకు రప్పించుకొని గట్టిగా నిర్భంధించి యడిగినది. ప్రాణత్యాగమునకైన సమ్మతింతును గాని, యప్పని కొప్పుకొననని యతఁ డప్పు డామెతోఁ జెప్పక తీరినదికాదు.

క్షణకాల మామె యవయవములన్నియు విడిపోయెనట్లు కదలలేక నిలువంబడియుండెను. అంతలో హృదయమున మన్యుదేవత యావేశించినది. మేనఁ జమ్మటలు గ్రమ్మినవి. ఓరీ! దురాత్మా! ఆసన్నమృత్యుండ వగు నీకు నా మాటలు చెవి కెక్కునా! నీ విట్టి బొంకరివని యెఱుంగక నీ మాట నమ్మి యింతకాల ముపేక్షించితిని. నాఁడే నీ పని పట్టవలసినది. నీ యాయుశ్శేష మిన్నదినము లీడ్చుకొను వచ్చినది సీ! సీ! నీవు వట్టి నిర్భాగ్యుడవు. నీ శీల మెఱుంగక నిన్ను గామించుట నాదే తప్పు అని నోటికి వచ్చినట్లుగా వానిం దిట్టుచు నొడలు చీరుకొన తొడవులు దీసి తల విరియఁ బోసికొని కోపగృహంబునఁ బండుకొనియుండెను.

రాజు వాడుకప్రకార మంతఃపురమునకు వచ్చి యందు భార్యం గానక నలుమూలలు వెదికి కోపగృహంబున నున్నదని తెలిసికొని యచ్చటికిఁ బోయి తద్వికారమును బరిశీలించి గ్రుచ్చి యెత్తికూర్చుండఁబెట్టి ప్రేయసీ! యిది యేమి కర్మము? ఇట్టి వికార వేషమేమిటికిఁ బూనితివి? నీ న్నెవ్వ రవమాన పరచిరి? నిజము చెప్పుమని గ్రుచ్చి గ్రుచ్చి యడుగుటయు, నక్కుటిలకుంతల కుంతలముల నెగఁద్రోసికొని కన్నీరుఁ దుడుచుకొనుచు నిట్లనియె.

రాజా! సుమతి మహాగుణవంతుఁడనియు నీతిమంతుఁడనియుఁ బలుమారు నా యొద్దఁ బొగడుటం జేసి నిజమని సంగీతము నేర్పింపుమని మిమ్ముఁ గోరికొంటిని. పిన్నవాఁడు రూపవంతుఁడగు పరపురుషుని నా యొద్దకుఁ బంపమనుట నాదే తప్పు. వాని టక్కరితన మంతయు యధార్థమని నమ్మి మీరందుల కంగీకరించిరి. వాఁడు వట్టి ద్రోహుఁడు ఒకటి రెండు దివసంబులు నేర్పినట్లే నేర్పి పరిహాసమాడ మొదలుపెట్టెను. ఎరుగునట్లుగాఁ గొన్ని దినములు వినిపించుకొనక సంగీతము ధోరణినే యుంటిని. వాఁ డదేపనిగా శృంగారలీలలు వెలయింపుచు నాకు మనస్సంకటమగలుగ జేసెను. వీణగానమందుఁగల నభిరుచిచే నితరాంతరాయములఁ బరిగణింపక యెట్లో విద్య నేర్చుకొనుచుంటిని. సిగ్గు, సిగ్గు, నిన్న వాఁడు చేయఁబూనిన పని చెప్ప సిగ్గు. పెక్కేల ? నా పాతివ్రత్యభంగము కాకుండ వానిచేతినుండి తప్పించుకొని యీవలఁ బడుట మదీయపురాకృతముకాక వేరు కాదు. అగ్ని నొడిగట్టు కొనినట్లు వానిందెచ్చి యింటఁ బెట్టితిరి నా వ్రతమునకే కాక రాజ్యమునకుఁ గూడ భంగము చేయదలంచు కొనినట్లు తెలియవచ్చినది. వానిచేతికీలుబొమ్మవలె నెట్లు త్రిప్పిన నట్లాడుచుంటిరి. వాఁడు శత్రుపక్షపాతి. సూదకారునిచే విషముఁ బెట్టించుటయు శత్రువులచే నగరము ముట్టడింపఁ జేయుటయు నంతయువాఁడు చేయించినదేనఁట. భయము గలుగఁజేసి దానిం బోగొట్టినట్ల భినయించుచు నమ్మకము గలుగఁ జేసి యెప్పుడో రాజ్యము పరాధీనముఁ జేయింపఁదలంచుకొనియెను. ఇది యంతయు నా కొకపరదేశి మూలమునం దెలిసినదని వానిపైఁ జెప్పవలసిన మాటలన్నియుఁ జెప్పి రాజునకు హృదయంబునఁ గ్రోధాగ్ని రవులుకొనఁజేసినది.

శ్లో. అదా వసత్మవచనం పశ్చాజ్ఞాతాహి కుస్త్రియః
    స్త్రీవచో ప్రత్యయా హంతి విచారం మహతామపి.

ముందుగా నసత్యవాక్కులు తరువాత దుష్టస్త్రీలు జనించిరి. స్త్రీల మాటలనే నమ్ముట చేత మహాత్ములకు సైతము సత్యాసత్యవిచారము గలుగనేరదు.

సీ. భార్య చెప్పిన మాట పాటించియేకాదె
               పంపెఁ గానకు రాముఁ బంక్తిరథుఁడు
    భార్య చెప్పిన మాట పాటించియే కాదె
              దండించె సారంగధరునిఁ దండ్రి
    భార్య చెప్పిన మాట పాటించి యుత్తాన
              పాదుండు ధ్రువు పదభ్రష్టుఁజేసె
    భార్యబోధనెకాదె పరిభవించె సునందు
              వసుమిత్రుఁడను మహివల్లభుండు
గీ. ధాత్రి నెటువంటి యుత్తమోత్తములకైన
    నాలివాక్యంబు వేదవాక్యంబు సూవె
    తమరు భార్యను గావించు తప్పులన్ని
    యొరుల పైబెట్టి నిందింతు రూహలేక.

విజయపాలుండు భార్య చెప్పిన మాటలన్నియు నాకర్ణించి క్రోధాగ్నిజ్వాలలు నిట్టూర్పు గాడ్పులఁ బ్రజల్వరిల్లంజేయుచు అన్నా, సుమతి కుమతియై యెట్టి ద్రోహము చేయుట కుద్యమించెను! అగునగు! దలంచుకొననంతయు నిక్కమని తెల్ల మగుచున్నది. ఏమియు నెఱుంగనివాని కంతలో వంటకమున విషం బిడిన ట్టెట్లు తెల్లమగును? దుర్మంత్రంబునం గాక యొక్కఁడు పోయి యేదియో చెప్పినంతనే సేనల మరలించుకొనిపోవునా! అదె యంతయు నభినయమే కావచ్చును. ఇఁక వీఁడుండిన ననర్ధము కాకమానదు. అని యాలోచించి భార్య నూరడించి నాఁడు పెందలకడ సభకుఁ బోయి కూర్చుండెను.

సుమతియు వాడుకప్రకారము నియమితకాలమునకు వీరభటవేషముతో సభకుఁ బోవుచుండ దారిలో నపశకునములైనవి. దానందన యేలిక కేమి యమంగళము గలుగునోయని స్తుతిశ్లోకములం జదువుచు నోలగంబునకుం బోయి ముందు రాజునకు నమస్కారముఁ గావించెను. నమస్కార మందికొనక పెడమోము పెట్టి చూపుల నిప్పుల గ్రక్కుచు నతండు పీఠముపై గూర్చుండిన వెంటనే సభ్యులతో వినుండీ సుమతి సుమతి యని నమ్మి చిరకాలమునుండి యాశ్రయించికొనియున్నమంత్రుల బెక్కండ్ర దగ్గించి యనేకగ్రామములు గానుకలగా నొసంగి సమానప్రతిపత్తితోఁ జూచుచుండ వీఁడు శత్రుపక్షపాతియై యీ రాజ్యమునకు హానిచేయఁ దలంచుచున్న వాడు. అదియునుంగాక యతఃపురద్రోహము సేయుటకుగూడ బ్రయత్నించెను. వీనిం బట్టించి బందీగృహంబునం బెట్టించి శిక్షింపఁదలంచుకొంటి. నిందులకు మంత్రులు, సామంతులు ననుమతింపవలయునని భార్య చెప్పిన మాటలన్నియు నుగ్గడించుచు నుపన్యసించుటయు, నంతకుముందు వానియం దీసుఁ బూనియున్న సామంతులు, మంత్రులు నందుల కంగీకరించితిమని చేతులెత్తి కేకలు పెట్టిరి.

అప్పుడు రాజు వానిఁ పట్టుకొనుటకు భటుల కాజ్ఞాపించెను. వాండ్రు పెక్కండ్రు విచ్చుకత్తులతో నతనిం జుట్టుకొని పట్టుకొనఁ బోయినంత నావీరుఁడు రౌద్రావేశముతో నొక్క భటుని చేతినుండి కత్తిలాగికొని మండలాకారముగాఁ ద్రిప్పుచు నందున్న వీరభటుల నెల్లఁ బరిభవించి సభ్యులకు రాజునకుఁగూడ దమ్ముఁ జంపునేమో యని వెరపు గలుగఁజేయుచు లఘుగమనంబున నయ్యోలగము దాటి యెందేనిం బోయెను.

వానితలిదండ్రు లెవ్వరో భార్యాపుత్రు లెవ్వరో యేదేశమువాఁడో యెప్పుడును రాజు వాని నడిగియుండలేదు. అతండును జెప్పలేదు. వాఁడు లేచిపోవుట గొప్పముప్పు దాటినట్టు రాజు సంతసించుచు నప్పట్టణము ప్రాంతదేశములు వాని గుఱించి విమర్శించెను గాని వానిజాడ యేమియుం దెలిసినదికాదు.

సుమతిం బరిభవించినది మొదలు వాఁడు శత్రురాజులం గూడి యేమి యపకారము గావించునో యని నిద్రాహారములు క్షీణింప విజయపాలుండు మనసుచెడి వెఱ్ఱివాఁడుం బోలె వర్తింపుచుండెను. నిరపరాధుల దండించిన పాప మూరక పోవునా? మఱి పది దినములకే మధువర్మ మందపాలునితోఁ గూడఁ జతురంగవాహినీసమేతముగా వచ్చి పట్టణము ముట్టడించి రణభేరి గొట్టించెను.

ఆ ధ్వనితోఁగూడ నా వృత్తాంతము విని విజయపాలుం డసువులూడినట్లు బెదరుచుఁ గర్తవ్య మేమియో తెలియక కోటతలుపులు మూయింప నాజ్ఞాపించెను. కాని యంతలో శత్రుబలములు సముద్రమువలె విజృంభించి కోట ముట్టడించి తలుపులు మూయనీయక లోపలఁ బ్రవేశించి కనంబడినవారి నెల్లఁ బట్టుకొని కొట్టుచు బంధించుచు గవాటంబులఁ బగులఁ గొట్టుచు, గోడలుఁ గూలఁద్రోయుచు, మణివేదికలఁ ద్రవ్వుచు, రత్నంబుల దోచుకొనుచు, స్త్రీల జెఱఁబెట్టుచు బెక్కువిధంబుల నట్టహాసముగాఁ గోట మట్టుమాయఁ జేయుచుండిరి. కొందఱు వీరభటులు రా జెక్కడెక్కడని యుక్కుమిగిలి పైమేడ కెక్కి వెదకుచుండిరి. ఆ యలజడి యంతయుఁ దెలిసికొని విజయపాలుండు భార్యపైఁ బడి దుఃఖించుచుఁ బ్రేయసీ? మన యాయువు లిక గడియలో ముగియుచున్నవి. సుమతియే యీయాపదఁ గలుగఁజేసెను. వానిం బాటవంబునఁ బట్టుకొనవలసినది. పొరపాటు జరిగినది వా డిట్టిద్రోహుడని తెలిసికొనలేకపోయితిమి. అని వానిని నిందించుచుండ వారించుచు నామె చేతులు జోడించి యిట్లనియె. మహారాజా! నాకిఁక గడియలో మరణమగునని చిహ్నములు గనంబడుచున్నవి. ప్రాణోత్ర్కమణసమయంబునఁ దాను జేసిన పాతకముల నుగ్గడించినచో యమదండన లేదని యార్యులు సెప్పుదురు. నాజన్మమున కెల్ల గొప్పపాతకము జేసితిని. ఈ మహోపద్రవమునకుఁ గారణభూతురాలను నేనే యైతిని. వినుండు అని కన్నీరు గార్చుచు గద్గదకంఠముతో సుమతి మహానీతిశాలి, పుణ్యాత్ముఁడు పరమోత్తముఁడు, పరదారాపరధనపరాఙ్ముఖుఁడు. జితేంద్రియుఁడు. అట్టి సుగుణాకరుని నిరపరాధి నపరాధియని దండింపఁజేసిన పాపాత్ముఁరాలను నేనే. ఇఁక దాచనేల? స్త్రీ చాపల్యంబునంజేసి వాని సోయగమునకుఁ జిక్కి మక్కువతోఁ గోరినదానను నేనే. ధర్మబద్ధుండై యత డంగీకరింపక నన్నుఁ దల్లిగా భావించి పరమార్థోపవేశము గావించినను యౌవనమదంబున నావేశింపఁబడి లేనిపోనికల్పనలఁ జేసి మీతోఁ జెప్పి వానిఁ బరాభూతుం గావించితిని. మహాత్మా! రక్షింపుము. నిజము చెప్పితిని. నాకుత్తమలోకము గలుగునట్లను గ్రహింపుమా. సుమతి నిరపరాధి. నిరపరాధి. ఐదుసారులు మిమ్ము మృత్యుముఖంబు నుండి తప్పించిన పరమోపకారి. విమర్శింపక వానిం బరిభవించిన మీకు జయమెట్లగునని పలుకుచున్న సమంయంబున శత్రువీరులు కొందఱు వచ్చి యమ్మచ్చెకంటి కొప్పుబట్టికొని యీడ్చుచున్న సమయంబున రాజు తనచేతనున్న కరవాలంబునఁ దొలుత నాప్రోయాలి శిరంబుత్తరించి తరువాత నాకింకరులఁ బలువురం బరిమార్చి కటారి నేలం బారవైచి గుప్తగృహంబునకుం బోయి యందుఁ బండుకొని యాత్మహత్యఁ గావించు కొనియెను.

తరువాత శత్రుభూనేత లిరువురు నయ్యుదంతము విని పరమానందముతోఁ గోట నాక్రమించుకొని రెండు భాగములుగాఁ బంచుకొని పాలించుచుండిరి. కథ కంచికిఁ బోయె నే నింటికి వచ్చితినని యా శకుంతము కథఁ జెప్పినది.

అప్పుడు రాజవాహనుఁడు మిక్కిలి సంతసించుచుఁ బతంగపతీ ! మంచి కథఁ జెప్పితివి. మెచ్చితిమి కాని సుమతిమాట యేమియుం జెప్పితివికావు. అతం డెందుఁ బోయెను? శత్రువులం గూర్చుకొని వచ్చినవాఁ డతఁడా కాఁడా? వారంతట వారే వచ్చిరా యెఱింగింపు మనవుఁడు నాయండజము బిడ్డలారా! నాకేమియుఁ దెలియదు. సుమతి యేమయ్యెనో నే నెఱుఁగ నాకు వచ్చినకథ చెప్పితిని తరువాతి వృత్తాంతము నాజోడుపిట్టకు వచ్చును. నాకేమియు రాదు. విజయపాలుండు గుప్తగృహంబునుండి పారిపోయెనని యొక వదంతి యున్నది. నే నెఱింగిన కథతో సమసినట్లే యున్నదని చెప్పినది.

అప్పుడు రాజవాహనుఁడు చెల్లీ! సుమతి విషయమై నీయభిప్రాయమేమి? శత్రువులఁ గలిసెనా? లేదా? అని యడిగిన నాబాలిక కలిసియే యుండును. లేకున్న వారిరువురు నంతలో గోట ముట్టడింపరని చెప్పినది. లేదులేదు సుమతి గుణవంతుఁడు అట్టి కృతఘ్నత్వకార్యముఁ గావింపఁడు. వాని కేమియు దెలియదని నా యభిప్రాయము. సుమతి లేఁదని యెఱింగి వారు ముట్టడించి యుందురు. అని పలికినఁ గాదు ఎరిగియే శిక్షింపజేసె నని చెల్లెలు వాదించినది.

ఆ విషయమున వారిరువురకు సంవాదము జరిగినది. ఆ శకుంతమేదియుఁ జెప్పలేకపోయినది. తరువాతకథ వచ్చిన పక్షి యెందన్నదో యరసి తెప్పించి దాని వలన నందలి నిజానిజంబులు గ్రహింపవలయునని నిశ్చయించుకొనిరి.

అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించుటయుఁ దరువాతి వృత్తాంతము పైమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.

174 వ మజిలీ

కల్పలత కథ

మహేంద్రనగరాధీశ్వరుండైన వసుపాలునకుఁ గల్పలతయను కూతుఁ రొక్కరితయే యుదయించినది. అమె మిక్కిలి చక్కనిదని వర్ణించుటకంటె నట్టి సౌందర్యవతి మనుష్యలోకమున నిప్పటికిఁ బుట్టలేదని చెప్పిన సులభముగాఁ దెలియును. అప్పుడుమిఱేఁ డప్పడఁతి చెప్పినదే విధివాక్యముగా నెంచుచు నమ్మించుఁబోడి యేమి కోరినను దెప్పించి యిప్పించుచుండును. ఆ బాలికారత్నమునకుఁ జిన్నతనము నుండియుఁ బక్షిజాతియందుఁ జాలప్రీతిఁ గలిగి యున్నది. ఎక్కడ నెట్టి వింతపిట్ట లున్నవని విన్నను నెంత రొక్కమైన నిప్పించి తెప్పించుచుండును. వింతపక్షులను దెచ్చినవారికి వారు కోరిన వెల నిప్పింతునిని దేశదేశములయందుఁ బ్రకటించియున్నది. పుళిందుని ప్రఖ్యాతిఁ విని యందుగల పక్షిజాతి నంతయుఁ బంపుమని వార్తనంపినది. అందప్పు డేమియు బక్షులు లేకపోవుటచే నందలి పులుగులు సంప్రాప్తించినవికావు.

ఒకనాఁడు సత్యవంతునికిఁ జిక్కక పారిపోయిన రెండవపక్షి యొకబోయవానికి దొరికినది. వాఁ డాపిట్టం బట్టుకొని దానియాకారసౌష్టవమున కచ్చెరువందుచు మహేంద్రనగరంబున వింతపక్షుల కెక్కుడు వెలయిచ్చి కల్పలతయను రాజపుత్రిక కొనుచున్నదను వార్తవిని యానగరంబునకుం బోయి యందలి రాజపురుషుల కత్తెఱం గెఱింగించెను.

వారు వానికి జెప్పి పంజరముతో గూడ నాపతత్రమును రాజపుత్రిక యంతఃపురమున కనిపి వాఁడు చెప్పినవెలఁ దెలియఁజేసిరి. ఆ పక్షిం జూచినతోడనే యాచేడియ వేఱుమాట పలుకక వాఁడు సెప్పినవెల కిబ్బడిగా నిచ్చి యంపి దానిరత్నపంజరముఁ బెట్టించి ముద్దుపెట్టుకొనుచుఁ బలురకములఁ బండ్లఁ దినిపించి మెల్లగాఁ మాటాడించుటయు నాపతంగ మిట్లనియె.

రాజపుత్రీ! కల్పలతా! రాజపుత్రీ! కల్పలతా? అని రెండుసారులు పిలిచినది. దాని కంఠమాధుర్యము కచ్చెరువడి యప్పడఁతి దాపునకు వచ్చి యేమి పతంగపుంగవా? నన్నుఁ జీరుచుంటివి. నాపేరు నీకెవ్వరు. సెప్పిరి? నీ కీమాటల