కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/172వ మజిలీ

వికీసోర్స్ నుండి

నందు, విలువిద్యయందు నిత్యము సాధనముఁ జేయుచుండును. అప్పుడప్పుడు తండ్రితో బ్రాంతారణ్యముల కరిగి వారు వేటపాటవముగూడ నేర్చుకొనుచుందురు. రాజవాహనుఁడు పదునాలుగేడులు పూర్తికాక మునుపే విలువిద్యలయందు, మృగగ్రహణమునందు, గజాశ్వారోహణల యందుఁ దండ్రికంటె నధికుండయ్యెనని వాడుక వచ్చినది.

నిషాదపుత్రుఁడు సింహశార్దూలాది క్రూరమృగంబులకు గజాశ్వసారంగాది సాధుమృగంబులకు వైరంబు లేకుండునట్లు వానినెల్ల ఒకశాల నిలిపి యాటలు నేర్పుచుండును. శ్రమణియుఁ బక్షిశాలకుఁ బోయి శుకశారికాప్రభృతివిహంగములకు సంగీతము నేర్పుచుండును.

ఒకనాఁడు దుందుభి మృగపక్షివిశేషంబులం దీసికొనిరా శబరసేనాపరివృతుండై దూరదేశారణ్యంబులకుం బోవుచుఁ గుమారుం జీరి వత్సా! వింధ్యారణ్యంబునకు నద్భుతమృగంబులు విచిత్రపక్షివిశేషములు చాల వచ్చియున్నవని యందున్న మన పరిజనులు వార్తలం దెచ్చియున్నారు! మఱియు మన శాలలన్నియుఁ జోటుగలిగి యున్నవి. ఈ నడుమ జాల అమ్మకమైనవిగదా! నేను గొత్తవానిం దెచ్చువఱకు నిందున్నవాని నమ్మవద్దు. ఈ లోపల నెవ్వరేని వచ్చినచో వారిం గౌరవించి మరల రమ్మని చెప్పుము. అని బోధించి యతండు బలములతో వింద్యారాణ్యమునకుంబోయె.

అని యెఱిగించువఱకు వేళయతిక్రమించినది. అవ్వలికథ పైమజిలీయందు జెప్పదొడంగెను.

172 వ మజిలీ

పుళిందిని - వత్సా! రాజవాహనా! మహేంద్రపురమునుండి రాజకింకరులు దాదులు కొందఱు వచ్చిరఁట. వారిం బరామర్శించి గౌరవించితివా? మీ తండ్రిగా రూరలేనిలోపము రానీయకుమీ. వా రేమిటికై వచ్చిరి?

రాజవాహనుఁడు - అమ్మా! మహేంద్రపుర భర్తయగు పసుపాలుండను నృపాలునకుఁ గల్పలతయను గారాల కూఁతురు గలదఁట. ఆమెకుఁ బక్షిజాతులయందు చాల ప్రీతియఁట, మనయొద్దనున్న వింత శకుంతముల రకమునకు జోడువడువున నన్నిజాతిపులుగులం బంపమని యాఱేఁ డుత్తరముతోఁగూడ నూర్వుర దాసదాసీజనంబులఁ బంపినాఁడు. వారికిఁ దగిన గౌరవము గావించితిమి.

పుళిందిని - వత్సా! మీ తండ్రి గారూర లేరుగదా! నీవు వెలలెట్లు చెప్పఁ గలవు?

రాజ - అమ్మా! వెలలకుఁ బతంగసంతతి చాల కొఱంతగా నున్నది. తండ్రిగారు వచ్చినంగాని రకములు దొరకవు. ఆ మాటయె ప్రత్యుత్తరము వ్రాయుచున్నాను.

పుళిందిని - పట్టీ! గొప్పవారికి జాబులు వ్రాయునప్పుడు వారివారి మర్యాదల ననుసరించి వ్రాయవలసియున్నది. ఏది యెట్లు వ్రాసితివో వినిపింపుము.

రాజ - అమ్మా ! నేను చెల్లితో నాలోచించియే వ్రాసితిని, వినుము.

మహారాజాధిరాజ రాజపరమేశ్వర రాజమార్తాండాది బిరుదాంకితులగు వసుపాల మహీపాల చక్రవర్తిగారి సముఖమునకుం పుళిందచక్రవర్తిగారి కుమారుఁడు రాజవాహనుఁడు వ్రాసికొన్న విజ్ఞాపనపత్రము. మీ కుమారిత కల్పలత నిమిత్తమై యుత్తమపతత్రములఁ బంపుమని మా తండ్రిగారిపేర మీరు వ్రాయించిన చిత్రలేఖ చేరినది. మా తండ్రిగారు పశుపక్షిమృగాదులం బట్టుటకై దూరికాంతారమున కరిగిరి. పదిదినములు తాళి వెండియు మీ దూతలం బంపితిరేని యుష్మత్పుత్రికారత్నమనోరథము సఫలముఁ చేయగలము. అని వ్రాసితిమి. బాగున్నదా!

తల్లి – పుత్రా ! ఈ బిరుదము లన్నియు మీకెట్లు తెలిసినవి ?

రాజ - వారి పరిజను లెఱింగించిరి.

తల్లి - మీ పత్రికలోఁ జివర వ్రాసినమాట వ్యంగ్యముగా నున్నది బాబూ! మనోరథము సఫలము జేయుదుమనిన శంకింతురు. అది తీసి మఱియొక మాట వ్రాయుము.

రాజ - పోనీ, నీ కూఁతురి యభిలాష తీర్తుమని వ్రాయవచ్చునా?

తల్లి - అదియును బాగులేదు.

రాజ - కోరికతీర్తు మనిన తప్పా?

తల్లి – మనోరథము, అభిలాష, కోరిక, ఇవి యన్నియుఁ బర్యాయ పదములే. ఆ మాట లేమిటికి? మీరు కోరిన పక్షులం బంపుచున్నామని వ్రాయ రాదా?

కూఁతురు - అమ్మా! శంకించుకొనిన నన్నియుఁ దప్పులుగానే కనంబడుచుండును. మనోరథ మనినఁ దప్పులేదు. తుడుపు వలదు. అదియే యుండనిమ్ము, అన్నా! పత్రిక మడిచి యిచ్చి వారిం బంపివేయము.

అనుటయు నగుమొగముతో రాజువాహనుఁ డా పత్రికపై వ్రాలుజేసి వారికిచ్చి యంపెను. మఱికొన్ని దినంబులకు దుందభి యనేక విధమృగపక్షిజాతులం బట్టించుకొని యట్టహాసముతో నింటికివచ్చెను.

వాని పరిజను లాయాసత్వంబులం బోనులం బెట్టియుఁ గట్టియు, బక్షిజాతులఁ బంజరంబులం జేర్చియు నాయాశాలలు నిండించిరి. రాజవాహనుఁడు చెల్లెలితోఁగూడఁ దండ్రియొద్దకుఁ బోయి వసుపాలుఁడు పంపిన వర్తమానము దెలియఁజేయుచుఁ దండ్రివెంటఁ గొత్తగాఁ దెచ్చిన జంతువులం జూడ నాయాయి సాలలకుం బోయి

సీ. ఇది మృగేంద్ర విశేష మీజంతువునుబట్ట
                 బదిదినంబులు పెట్టె నదను గాక
    యిది మహానాగంబు మదమెక్కి తిరుగంగఁ
                 బట్టికొంటిమి గోఁత బడఁగఁ జేసి
    శరభేంద్రమిది దీనిసంచార మెఱుఁగ ని
                 ర్వదిదినంబులువట్టె వలలు బన్న
    నిది వింతపులి యొక్క పదమునఁ బట్టితి
                 ముసికొల్పి కుక్కల నరమగతుల
గీ. ననుచుఁ దత్తన్మృగప్రగ్రహణవిధాన
    మెఱుఁగ జెప్పుచుఁ దండ్రి ముం దఱుగుచుండ
    వినుచుఁ జూచుచు వెనువెంటఁ జనిరి పిల్ల
    లక్కజముతోడ మృగశాల లన్ని తిరుగ.

తండ్రి వెనుకఁబోయి వారట్లు మృగవిశేషములన్నియుం జూచి సంతసించుచుఁ దరువాతఁ బతంగశాల కరిగి యందుఁ గ్రొత్తగా దెచ్చిన శకుంతసంతానముల నెల్ల బరికించుచు నందు,

సీ. ఱెక్కలు మృదువులై చక్కని మైచాయఁ
                బాలపిట్ట వితాన గ్రాలఁ గొంత
    నెమలిపించెముభాతిఁ గొమరార వాలంబు
                కుక్కుటంబున కట్లు కుచ్చు కలిగి
    బొలుపొంద రాయంచ పోలి యొకకొంత
                నడల శారిక బెడంగడరఁ గొంత
    యింద్రచాపమునిగ్గు లీను మాలిక కంఠ
                సీమ నొప్పార రాజిలుకబోలి
గీ. యరుణపదునాసికలు మనోహరత నమర
    లలితమణిభూషణాంబరాదుల ధరించు
    నట్లు చెలువొందు నొక్క విహంగమంబు
    వారి కాలోకనోత్సవమై రహించె.

అదృష్టపూర్వమై గుజ్జుఱెక్కలతో ముద్దులమూటఁగట్టు వికిరప్రవరంబును గని యాబిడ్డ లిద్దరు నుబ్బుచు గొబ్బన నాది నాది యని దాని నంటుచుఁ దండ్రితో జనకా! ఈ వింతపతంగ మెందు దొరికినది? దీని పేరేమి? దీని యాకారమునకుఁ దగినట్లు స్వరమాధుర్యము గలిగినచోఁ గాంచనమునకుఁ బరిమళ మబ్బిన ట్లుండును గదా? దీని వృత్తాంతముఁ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

వత్సలారా! ఇది యేజాతి పతంగమో తెలిసినదికాదు. కొండవాండ్రెవ్వరు జెప్పకపోయిరి. ఇంతకు మున్నిట్టిదానిం జూచినవారు లేరు. ఒకనాఁడు సాయంకాలమున వింధ్యపాదంబున నొక చూతపోతము కొమ్మపై వసించి రెండు పక్షులు మనోహరస్వరంబున సంగీతము పాడుచుండెను. దేవత లెవ్వరో వచ్చి పాడుచున్నారనుకొని మేమా ప్రాంతములకుఁబోయి చూచితిమి. పతత్రములని తెలిసికొని మెల్లగా నుచ్చు లొగ్గించి వలలం బన్ని యతిప్రయత్నముతో నీపిట్టం బట్టుకొంటిమి. రెండవది పారిపోయినది. దానికొఱకుఁ బదిదినము లా యరణ్యము లన్నియు వెదకించితిని. దొరకినదికాదు. పట్టువడినది మొద లీపిట్ట మౌనముద్ర వహించినది. ఎన్నడైన నాఁడు పాడిన పాట పాడునని పరిశీలించుచుంటిమి. ఏమియు మాటాడదు. రెండు మూడు దినము లాహారము గుడిచినదికాదు. ఇప్పుడు తినుచున్నది. ఇదియే దీని వృత్తాంతమని యెఱింగించిన శ్రమణి యిట్లనియె.

తండ్రీ! దీని నేను బెంచుకొని మాటలాడించెద నెవ్వరికి నమ్మఁగూడదు. కల్పలత దీనకెంత సొమ్మిచ్చినను నమ్మనీయనని పలికిన నవ్వుచు దుందుభి కల్పలత యెవ్వతె! ఈ పతంగము తెఱం గదియే యెఱుంగునని యడిగిన రాజవాహనుఁడు కల్పలత యన వసుపాలుని కూఁతురు. ఆమెకుఁ బక్షిజాతులయందుఁ జాలప్రీతియఁట. వింతశకుంతమున కెంతసొమ్మైన నిచ్చి కొనునట. ఆమె పరిజనులు మీ రూరలేనప్పుడు వచ్చిరి. తిరుగాఁ బది దినములలో రమ్మంటిమి. అందుల కాబోఁటి కమ్మెదరేమోయని యనుచున్నదని చెప్పిన విని దుందుభి పుత్రికం గౌగలించుకొని ముద్దుపెట్టుకొనుచు తల్లీ! నీకంటె నాకా వాల్గంటి యెక్కువదియా! ఈ పక్షిని నీవే పెంచుకొనుము. అన్నయ్యకుగూడ నియ్యకుమని పలుకుచు నప్పుడే దాని బంగారుపంజరమునఁబెట్టించి శ్రమణి గృహంబున కంపెను.

పుళిందకన్యకయుఁ దన నెలవునకుఁబోయి యా పంజర మంతయుఁ దోమించి యా పిట్టను వేడినీళ్ళతోఁ గడిగి తడియొత్తి పొగవైచి దృష్టిదీసి మంచిఫలముల దినిపించి ముద్దు పెట్టుకొనుచుఁ బతంగపుంగవా! ఒక్క పలుకు పలుకుము. నీ స్వరమున మిక్కిలి మాధుర్యము గలదని వింటిమి. ఏదీ, ఏదీ పలుకుము. నిన్ను నా బిడ్డగాఁ జూచికొనియెద నెవ్వరికి నమ్మనీయను. దైవముతోడు. మాటాడుము అని బ్రతిమాలికొనియెను.

అప్పుడా వికిరవరము కుడిచరణ మెత్తి బాలా! నీ లాలన వలన నాకుఁ జాలసంతసము కలిగినది. మీరు కిరాతులు. హింసింతురని యంతదనుక మౌనము వహించి నుంటి. నీ చర్యలు పరీక్షించితిని. మీ రుత్తమజాతివారు కారణజన్ములు. మనిషి దా పాదపము జూసి ..రానంద మాపాదించుచుండెదంగాక. నాకు సమస్తభాషలు వచ్చును. నింగితములో నే నెఱుంగనిరహస్యములు లేవు. నాకు బురాణగాథలన్నియుఁ గంఠస్థములై యున్నవి. నేది నీ కభిరుచియో దానిం జెప్పుచు సంతోషము గలుగఁ జేసెదను. అని యుపన్యసించిన ఆమె బ్రహ్మానందముఁ జెందుచు నయ్యిందువదన తొందరగా నన్నక్కడకు రప్పించుకొని దాని మాటలతెఱం గెఱింగించినది. అతండు దానిం దువ్వుచు నండజకులమార్తాండమా! భవద్దుండపాండిత్యప్రకర్షము తేటపడ నొక పాటపాడుము. ముద్దులమూటా! ఏదీ నీ స్వరప్రాగల్బ్యము గనుపరుపుము. అని ప్రార్ధించిన విని యా నీడజప్రపరంబు సంగీతభంగీతరంగితముగా నీశ్లోకము జదివినది.

శ్లో. ఓజోరంజనమేవ వర్ణరచనా శ్చిత్రా న కస్య ప్రియా
    నానాలంకృతయశ్చ కస్య స మనస్సంతోష మాతస్వలే
    కావ్వే కింతుసతాం చమత్కృతః సూక్తి ప్రబంధాస్ఫుటం
    తీక్ష్ణాగ్రాహ్యమి తిశ్రుతిప్రణయినః కాంతకటాక్షాఇవ

శ్లో. సరస్వతీ విభ్రమదపన్‌ణానాం
    సూక్తామృత క్షీరమహోదధీనాం
    సన్మాన సోల్లాససుధాకరాణాం
    కవీశ్వరాణాం జయతి ప్రకర్షః.

అని చదివిన విని వారిద్దరు బెద్దగా మురియుచు నా పక్షీంద్రమును ముద్దుపెట్టుకొని విహంగమ లలామా! నీ స్వరము హృదయంగమై యున్నది. మఱియు వినోదకరమైన కధ యేదైనం జెప్పి మాకు సంతోషముఁ గలుగఁజేయుమని కోరిన నా వికిరవరం బొక్క కథ యిట్లు చెప్పఁదొడంగెను.

173వ మజిలీ

విజయపాలుని కథ

కళింగదేశమున విజయపాలుఁడను నృపాలుఁడు తేజస్వినియను భార్యతో రాజ్యముఁ జేయుచుండెను. అప్పుడమిఱేఁడు దాక్షిణ్యవంతుఁడు పరాక్రమశాలి సత్యసంధుఁడని ప్రఖ్యాతివడసెను. అయ్యొడయునికడ సుమతి యను బ్రాహ్మణసచివుఁడు ఆంతరంగికమిత్రుండై మెలఁగుచుండెను. మిగుల గుణవంతుఁడగు సుమతి నిష్కాపట్యంబున రాజసేవ సేయుచుండెను. రాజదంపతులకడ సుమతికిఁ చాలచనువు గలిగి యున్నది. ఎంత పరిచయము మున్నను నతఁడు తఱి నెఱిఁగియే నడచుచుండెను.

ఒకనాఁడు రాజదంపతు లొకనాటకమును జూఁడబోయిరి. అందొక నటుని నాట్యము గుఱించి ప్రశంసింపుచుండ సుమతి యందలి స్ఖాలిత్యములఁ దెలియఁజేయుటకు రాజు నీకు నాట్యమందుఁ బరిచయమున్నదా? అని యడిగెను. కలదని యుత్తరముఁ జెప్పెను. ఏదీ మా యెదుట నీ నటనపాటవము జూపుమని యడిగిన నతండు దేవాసురమనుష్యనృత్యవిశేషంబులం జూపి వారి నాశ్చర్యపారావరమున నోలలాడించెను.