కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/171వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్రీమహాగణాధిపతయేనమః

శ్రీరస్తు.

కాశీమజిలీ కథలు

తొమ్మిదవ భాగము

171 వ మజిలీ.

దుందుభి కథ

క. శ్రీవిశ్వనాధ హైమవ
   తీవల్లభ భావజిత రతిప్రియ మేరు
    గ్రావాధిప కార్ముక కా
    శీవాస ప్రమదప్రమథ సేవితచరణా !

దేవా : అవధరింపుము. మణిసిద్ధ సిద్ధప్రవరుండు క్రమప్రవర్థమానబుద్ధిశీలుండగు గోపబాలునితోఁ గూడ నూటడెబ్బదియొకటవ మజిలీ చేరి యందుఁ గాలకరణీయంబుఁ దీర్చికొని వింతలం జూడంబోయినశిష్యునిజాడ నరయుచున్నంత వాఁడును,

గీ. హర్షవికసితవదనుడై యరుగుదెంచి
   యతిపదంబుల వ్రాలి యిట్లనియె సామి :
   ఇల్లు విడచిన తరువాత నిట్టి వింత
   చూచి యెఱుఁగ మఱిచ్చోటఁ జోద్య మయ్యె.

అని తాను జూచిన విచిత్రవిషయంబా తాపసశిఖామణి కెఱిగించుటయు మణిసహాయంబున నయ్యుదంత మంతయు నంతఃకరణగోచరముఁ గావించుకొని సంతోషవిస్మయాదేశితచేతస్కుండై యమ్మహర్షి యిట్లనియె.

గీ. బాపురే! వత్స! సేబాసు! భళిర! గోప!
   నీవడిగినట్టి ప్రశ్నలన్నియును వింత
   కథలుగానుండు నవి యెప్డు వృథలు గావు
   కలుగదే! యిందులకు నొక్క కారణంబు.

నీవడిగిన ప్రశ్నయం దంత విచిత్రంబు లేకున్నను యేతత్కధా ప్రవరణంబున నద్భుతవిషయంబులు బొడగట్టుచున్నవి. అవహితుఁడవై యాకర్ణింపుము.

ఉ. ఏఁబదియారు దేశముల కేకశిరోమణియై నిరంతర
    శ్రీ బహుళ ప్రజావితతిచే విలసిల్లి సముల్లసత్సువి
    ద్వాబలదీప్తసత్కవియుతం బగుచుం దగు నాంధ్రదేశ ము
    ర్వీబృషదుత్త రీయమున విశృతశైలనదీపురాఢ్యమై.

అయ్యాంధ్రదేశమధ్యభాగంబునుండియే కదా భద్రాచల రామాచల పట్టసాచల పద్మాచల ధవళాచలాది పుణ్యశైలవిరాజమానతీరంబగు గోదావరినది ప్రవహించుచు నేడుమార్గంబుల వారాశియుం గలియుచున్నది. అట్టి తెలుగుదేశమునకుఁ బశ్చిమోత్తరభాగంబున నిరంతరకాంతారసంవేష్టితకూటంబు లగు పర్వతకోటు లనేకములు విరాజిల్లుచున్నవి.

అందొకానొకశైలమూలంబున విశాలసమచతురంబగు భూభాగంబు తృణకాష్ఠజలపూర్ణంబై యొప్పుచుండెను. ఆ ప్రదేశమునకుఁ బ్రాగుత్తరదిగ్భాగంబుల సమున్నతశిఖరంబులగు భూధరంబులును, దక్కిన రెండుదిక్కుల మిక్కుటముగా నల్లికొనియున్న వెదురుపిండంబులును బెట్టనికోటలై కాపుగాయఁ దదభ్యంతరమున,

సీ. జలపూరితంబులై సెలయేరు లెప్పుడు
              గిరికూటములనుండి క్రిందుజార
    సంపూర్ణముగా సర్వసస్యంబు లింపార
              ముక్కారు కేదారముల ఫలింప
    ఫల దళ కుసుమ సంపన్నంబులగు నద్రి
              కోన లొప్పార నుద్యానములుగ
    బహువిధ మంటప ప్రాసాద గృహచిత్ర
             శాలావళీ విశేషములు గ్రాల

గీ. నందుఁ పొలుపొందు పక్కణాభ్యతరమునఁ
    గాపురముసేయుఁ బ్రథితవిఖ్యాతితోడ
    దుందుభియనం దగు పుళిందుఁడు నిషాదు
    లధికసంఖ్యాకు లెపుడు త న్నాశ్రయింప.

కిరాతచక్రవర్తియని ప్రఖ్యాతి వడసిన యా దుందుభి యా యరణ్యభూభాగంబుల కధికారియై శబరులం బాలింపుచు మహాపురంబువలె మెఱయుచున్న యప్పట్టణంబున వసించి పులిందిని యనుభార్యయందు రాజవాహనుండను కుమారుడు, శ్రమణి యనుకూఁతుల బడసి సంసారసుఖం బనుభవించుచుచుండె.

మఱియు నతండు ...........సాధనంబుల బూని అనుచరులతోఁ గూడికొని మహారణ్యమధ్యంబులకుం బోయి గోతులు ద్రవ్వి పగ్గంబు లొగ్గి యురులు బన్ని యుచ్చులు బిగించి చిక్కంబులం గట్టి గజసింహశరభశార్దూలాది క్రూరరసత్వంబుల పికశారికా ప్రభృతి విచిత్రపతత్రంబుఁ జంపకుండఁ బట్టికొని బోనులం బెట్టించుచుండెను. అదియునుంగాక,

సీ. ఎఱవట్టి తిరుగు కేసరినయిన నట లూని
                  మోము నే లంటంగఁ బ్రామగలఁడు
    మదమెక్కి కడిమిఁ గ్రుమ్మరు మహాకరినైనఁ
                  దెగువ దంతముపట్టి తిగయఁగలఁడు
    కడుదెబ్బ దిని బొబ్బలిడు బెబ్బులి మొగానఁ
                 గరమిడినేలఁ ద్రొక్కంగఁగలఁడు
    పరుగుడు శరభంబు దరిమి యడ్డము వచ్చి
                గోళ్ళఁ బట్టి విదల్చి కూల్చఁగలఁడు

గీ. ననగఁ దక్కిన సత్వసంతతులు వాని
    భుజబలంబున కెంత నభోగములను
    గూతలిడి చెంతకరుదేరఁ జేతబట్టి
    దుందుభి బకాసిఁదొంటి దుందుభి యనంగ

అక్కిరాతపతి యట్లు బహువిధమృగంబుల విచిత్రపతత్రంబులఁ జంపకుండఁ బట్టికొని బోనులం బెట్టించి యింటికిం దీసికొనిపోయి యాటపాటల నేర్పి మహారాజులకును నాటకాండ్రకును నామృగాదుల నమ్మి బహుధనం బార్జించుచుండెను. ఆశ్రమమృగంబులవలె నందలి మృగాదులు దుందుభి శిక్షణంబునం జేసి యన్యోన్యవైరంబులు విడిచి మైత్రితో మెలంగుచుండునవి.

వానియింటి కెటుచూచినను నాలుగు యోజనములవరకు మహారణ్యమే కాని తెరపిలేదు. అయ్యడవిలో గుఱ్ఱములు నెద్దులు తప్ప బండ్లు మొదలగు యానములు నడువవు. అట్లయినను నానాదేశములనుండి మృగంబులఁ బక్షులఁ గొనుటకై మహారాజప్రేషితులగు పరిజనులు నాటగాండ్రును వాని యింటికి సంతతము వచ్చుచుం బోవుచుందురు.

అందు నేనుఁగులకు గుఱ్ఱములకు మృగములకు పసులకు విశాలముగా వేరువేర శాలలు నిర్మింపబడి యున్నవి. వాని పరిజనులు సంతతము మృగముల కాటపాటలు నేర్పుచుందురు. వానిమందిరము మహరాజు మందిరముకన్న సుందరమై యున్నది.

వానికుమారుఁడు రాజవాహనుఁడు, కూఁతురు శ్రమణియుఁ బ్రాయంబున రెండేడులు వైషమ్యము గలవారయినను జూచువారికిఁ గవలపిల్లలని తోచకమానదు. వారి సౌందర్యము వర్ణనాతీతమై యున్నది. కిరాతకంబులనేకాక మహారాజవంశంబులం గూడ భూమండలంబున నట్టిచక్కనిబిడ్డలు పుట్టలేదని చెప్పుట యతిశయోక్తిగాదు.

రాజవాహనుఁడు చెల్లెలితోఁగూడ గజాశ్వారోహణమునందు, వ్యాయామము నందు, విలువిద్యయందు నిత్యము సాధనముఁ జేయుచుండును. అప్పుడప్పుడు తండ్రితో బ్రాంతారణ్యముల కరిగి వారు వేటపాటవముగూడ నేర్చుకొనుచుందురు. రాజవాహనుఁడు పదునాలుగేడులు పూర్తికాక మునుపే విలువిద్యలయందు, మృగగ్రహణమునందు, గజాశ్వారోహణల యందుఁ దండ్రికంటె నధికుండయ్యెనని వాడుక వచ్చినది.

నిషాదపుత్రుఁడు సింహశార్దూలాది క్రూరమృగంబులకు గజాశ్వసారంగాది సాధుమృగంబులకు వైరంబు లేకుండునట్లు వానినెల్ల ఒకశాల నిలిపి యాటలు నేర్పుచుండును. శ్రమణియుఁ బక్షిశాలకుఁ బోయి శుకశారికాప్రభృతివిహంగములకు సంగీతము నేర్పుచుండును.

ఒకనాఁడు దుందుభి మృగపక్షివిశేషంబులం దీసికొనిరా శబరసేనాపరివృతుండై దూరదేశారణ్యంబులకుం బోవుచుఁ గుమారుం జీరి వత్సా! వింధ్యారణ్యంబునకు నద్భుతమృగంబులు విచిత్రపక్షివిశేషములు చాల వచ్చియున్నవని యందున్న మన పరిజనులు వార్తలం దెచ్చియున్నారు! మఱియు మన శాలలన్నియుఁ జోటుగలిగి యున్నవి. ఈ నడుమ జాల అమ్మకమైనవిగదా! నేను గొత్తవానిం దెచ్చువఱకు నిందున్నవాని నమ్మవద్దు. ఈ లోపల నెవ్వరేని వచ్చినచో వారిం గౌరవించి మరల రమ్మని చెప్పుము. అని బోధించి యతండు బలములతో వింద్యారాణ్యమునకుంబోయె.

అని యెఱిగించువఱకు వేళయతిక్రమించినది. అవ్వలికథ పైమజిలీయందు జెప్పదొడంగెను.

172 వ మజిలీ

పుళిందిని - వత్సా! రాజవాహనా! మహేంద్రపురమునుండి రాజకింకరులు దాదులు కొందఱు వచ్చిరఁట. వారిం బరామర్శించి గౌరవించితివా? మీ తండ్రిగా రూరలేనిలోపము రానీయకుమీ. వా రేమిటికై వచ్చిరి?

రాజవాహనుఁడు - అమ్మా! మహేంద్రపుర భర్తయగు పసుపాలుండను నృపాలునకుఁ గల్పలతయను గారాల కూఁతురు గలదఁట. ఆమెకుఁ బక్షిజాతులయందు చాల ప్రీతియఁట, మనయొద్దనున్న వింత శకుంతముల రకమునకు జోడువడువున నన్నిజాతిపులుగులం బంపమని యాఱేఁ డుత్తరముతోఁగూడ నూర్వుర దాసదాసీజనంబులఁ బంపినాఁడు. వారికిఁ దగిన గౌరవము గావించితిమి.

పుళిందిని - వత్సా! మీ తండ్రి గారూర లేరుగదా! నీవు వెలలెట్లు చెప్పఁ గలవు?

రాజ - అమ్మా! వెలలకుఁ బతంగసంతతి చాల కొఱంతగా నున్నది. తండ్రిగారు వచ్చినంగాని రకములు దొరకవు. ఆ మాటయె ప్రత్యుత్తరము వ్రాయుచున్నాను.