కాశీమజిలీకథలు/ఏడవ భాగము/123వ మజిలీ
యర్దయామములో నుజ్జయినీపురంబు బ్రవేశింప జేసెను. తొల్లిపుష్పకారూఢుండై చనుదెంచిన శ్రీరాము౦డువోలెఁ బట్టణమునకు సతీపతి యుక్తముగా జనుదెంచిన విజయభాస్కరుని వృత్తాంతము విని పౌరలాశ్చర్య మందుచు గుంపులుగా వచ్చి యమ్మహారాజు కుటుంబమును జూడఁ దొడంగిరి.
వియోగ చింతాసాగరంబున మునిగియున్న హేమప్రభం గౌగలించుకొని బుజ్జగింపుచు విజయభాస్కరుఁ డామెకునుఁ దల్లికిని బరమానందము గలుగఁ జేసెను.
అట్లు విభీషణుఁడు వారినెల్ల స్వస్థానమునఁ బ్రవేశపెట్టి జయసింహ వీరసింహులఁ భార్యలతోఁగూడ నప్పు డప్పుడు తన పట్టణంబునకు వచ్చునట్లు నియమించి యొక విమానమర్పించి కుమారునితోఁగూడ నిజనివాసమున కరిగెను.
క. గిరియెక్కిపడిన ధర సా
గరమున మునింగినను బావకముజొచ్చిన భీ
కర ఫణులతోడ నాడిన
మరణకాలమురాదు మహినెవ్వరకిన్.
అనుపద్యమును దన దేశమెల్ల జాటింపఁజే యుచుఁ దాను బోయివచ్చిన వృత్తాంతము ప్రకటించి విజయభాస్కరుం డిరువుర పుత్రులతోఁ భార్యలతోఁబుడమిఁ బెద్దకాలము రాజ్యము గావించెను.
అని యెఱింగించి మణిసిద్ధుండు వత్సా ! విచిత్ర కధామనోహరంబగు విజయభాస్కరుని చరిత్రము జదివినను విన్నను పవిత్రుండై యభీష్టకామంబులం బొందఁ గలఁడు సుమీ! యని వివరించెను. శిష్యుండాకథవిని ప్రహర్షసాగరమున మునుఁగుచు నావృత్తాంతమే స్మరించుకొనుచు గురునితోఁ గూడ నవ్వలి మజిలీ చేరెను.
123 వ మజిలీ.
గురుదత్తుని కథ
ఉ. భూపతిజంపితి న్మగఁడు భూరి భుజంగముచేత జచ్చెఁ బై
నాపదజెందిచెంది యుదయార్కుని పట్టణమేగి వేశ్యనై
పాపము గట్టికొంటినటఁ బట్టి విటత్వము బూనిరాఁగ సం
తాపముజెంది యగ్గిఁబడి దగ్దముగా కిటు గొల్లభామనై
యీపని కొప్పుకొంటి నృపతీ! వగపేటికిఁ జల్ల చిందినన్
గోపకుమారుండా మజిలీయందలి పట్టణవిశేషంబులం జూడఁ బోయి యొక దేవాలయమున గోడమీఁదఁబై పద్యము వ్రాయఁబడి యుండఁ దానిం జదివికొని మొదటి పాదములు కొన్ని చెరపఁబడి యుండుటచే వాని విడిచి తెలిసిన వానినే వ్రాశికొని అతివేగముగా నయ్యగారియొద్దకు వచ్చి అప్పద్యము జదువుచు నిందేదియో మంచి కథ స్ఫురించుచున్నది. ఆ కథ యెవ్వరినడిగిన చెప్పలేకపోయిరి ముందుగా దీని వృత్తాంత మెఱింగింపుఁడని ప్రార్థించెను.
మణిసిద్ధుండు తనమణి మహిమ నయ్యుదంతమంతయుం దెలిసికొని వెరగుపడుచు నాకథ నిట్లు చెప్పందొడంగెను.
సముద్రతీరంబునఁ గుంభీనసఁ బకు నగరము గలదు. అప్పురంబున రత్నాకరుండను వర్తకుండు నౌకామూలకముగా ద్వీపాంతర వ్యాపారము గావించుచు నపారమైన ద్రవ్యము సంపాదించి కోటీశ్వరుండను ప్రసిద్దివడసి కాపురము సేయుచుండెను. అతనికి యుక్తకాలమున సంతానము గలిగినదికాదు. అక్కొరంతయే అతనికి సంతోషమును దిగమ్రింగుచుండెను.
సులక్షణయను పేరుగల యాబేహారిభార్య అసత్యరాహిత్యమునకు వగచుచు నొకనాఁడు భిక్షార్థమై అరుదెంచిన యొక బ్రాహ్మణుం జూచి నమస్కరించి బిచ్చము వేయుచు అయ్యా ! మీకుఁ బిల్లలెందరని అడిగినది.
ఆపాఱుండు కన్నీరునించుచు అమ్మా ! నాకు సంతతిలేదు. మేమేడ్వుర మన్నదమ్ములము. అందరిలో నేనొక్కరుండనే విద్యాధనసుతవిహీనుండనై పొక్కుచుంటిని. లేమికంటె బిడ్డలు లేమికై నా భార్య మిక్కిలి వగచుచున్నది. అన్నము తినదు. నిద్రవోవదు. సంతతముకంటఁ దడివెట్టుచుండును యాత్రలకుఁ బోవుదము రమ్మని వేపుచుండును తల్లీ దరిద్రులమెట్లుపోగలము అని తనకథ జెప్పుకొనియెను.
అప్పుడామే ఔరా? యీపౌఱుండు బిచ్చమెత్తికొనుచుండియు బుత్రరాహిత్యమునకుఁ జింతించుచున్నాడు అగునగు నందుల కాక్షేపింపరాదు. పుత్రానంద మందఱకును సమానమే? అని తలంచుచు నార్యా! మీకుఁ దీర్ఘయాత్రలకు గావలసిన ద్రవ్యము నేనిచ్చెదను. మీరు దేశములు తీర్థములు తిఱిగి సంతతి గలుగు మంత్ర తంత్రము లేవేని సంపాదించుకొనిరండు. పుడమి నెందైన మహానుభావు లుండకపోరు మీరు వచ్చువఱకు మీ భార్యను నేనుబోషించుచుండెద దైవకృప మనయభీష్టము దీరెనేని మిమ్ము మీఅన్నలకన్న భాగ్యవంతునిగా జేసెదనని చెప్పి అతని నొప్పించి కొంతసొమ్మిచ్చి అంపినది.
సుదక్షిణాప్రేరితుండై యాక్షితిసురుండు శుభముహూర్తమున నిల్లుకదలి కాశీ రామేశ్వరాది యాత్రలు సేవింపుచు నుత్తరారణ్యభూములన్నియుందిఱిగి మహాత్ముల దర్శించుచు సంప్రాప్తమనోరధుండై యింటికివచ్చి కిరాటవధూటి౦గాంచియాశీర్వచన పూర్వకముగా నిట్లనియె.
అమ్మా ! నీయుపదేశమునఁ బుడమి యంతయుం దిఱిగి తిరిగి బదరీవనంబున నొక యవధూత నాశ్రయించి మూడు సిద్దౌషదముల స౦పాదించుకొని వచ్చితిని. వినుము.
శ్లో. ఋతుడివసె ఘృతసహితం పీత్వానవనాగ కేసరస్యరజః
దుగ్ధమనుసీయ రమణీ రమణిగతా గర్భిణీ భవతి
శ్లో. గోరేక వర్ణభాజః పయసా వంధ్యాపి ధారయే ద్గర్భం
పీత్వా కేకిశిఖాయాః పుత్రం జీవస్యవా మూలం.
శ్లో. పీత్వామునైన పయసారజసి స్నా త్వాచ లక్షమూలం
నస్తాంబుక్షాళితజలం భక్తం భుక్త్వానారీనుతం లభతె.
ఇవి కడు రహస్యములని యాయోగిజెప్పి యున్నవాఁడు మూడిటిలో నేత్రంతమునైనను వంధ్యయైన స్త్రీగర్భముధరించునఁట అయ్యోషధుల సంగ్రహించుకొని వచ్చితిని. తత్ప్రకారమునఁ గావింపుము. సిద్ధుల యుపదేశ మూరకపోదని యెరిగించి యాభూసురుండాశీర్వచన పూర్వకముగా అమ్మందులిచ్చి యట్లుకావింపఁ జేసెను.
తత్ప్రయోగమున వైశ్యాంగనయు విప్రపత్నియు అంతర్వత్నులై శుభలగ్నంబున నిరువురుపుత్ర రత్నములం గనిరి.
మనోహర రూపలక్షణ తేజోవిరాజితుండగు. కుమారునకు రత్నాకరుండు పండితుల యనుమతిని గురుదత్తుండని నామకరణము వ్రాసెను. బ్రాహ్మణపుత్రునకు గదాధరుఁడని పేరు పెట్టిరి ఆవర్తకుఁ డావిప్రుని బురోహితునిగా నియమించుకొని ద్రవ్య ప్రధానంబున దత్సమానులలో నుత్తమునిగాఁ జేసెను.
మఱియు గదాధరుని దనకుమారునితో సమముగాఁ బెంచుచు. యుక్తకాలంబున నిరువురం జదువవేసి సమర్దులగు నుపాధ్యాయుల నియమించి పెక్కు. విద్యల నేర్చించెను అక్కుమార శేఖరు లిరువురు నొజ్జలవలన అచిరకాలములోఁ బెక్కు విద్యలం గహించిరి.
విప్రపఠన యోగ్యములగు విద్యలతో మనకు బనియేమి? వ్యాపారరహస్యముల నేర్చికొమ్మని తండ్రి యెంత బోధించినను వినక తనివి ననక విద్యాగ్రహణాలసుండై గురుదత్తుండు పదియా రేఁడుల ప్రాయము వచ్చునప్పటికిఁ బండితప్రవరుండని వాడుక వడసెను.
గురుదత్తునికిఁ బదియేడుల యీడు వచ్చినది మొదలు పిల్లనిచ్చు తలంపుతో నిత్యము ధనికులగు వైశ్యోత్తములు కోరినన్ని కానుకలిత్తు మని యింటిచుట్టును దిఱుగు చుండిరి. పుత్రుని యౌవనోదయ మరసి రత్నాకరుండు పెండ్లిఁజేయు తలంపుతోఁ బ్రసిద్ధిజెందిన వర్తకుల పుత్రికల చిత్రఫలకముల గొన్నిటి దెప్పించి గదాధరుని రప్పించి వీని నీమిత్రునికుఁ జూపించి యిచ్చవచ్చిన మచ్చెకంటి నేరుకొమ్మని చెప్పుము..
అని యిచ్చి యంపుటయు వానింగొని గదాధరఁడు గురుదత్తు నొద్దకుం బోయి యా వృత్తాంతమంతయు నెఱింగించెను. గురుదత్తుండు మిత్రునితోఁ గూడ నాచిత్ర ప్రతిమల రూపము విమర్శించి వారిలో నొక్క రితయుఁ జక్కనిది కాకుండుట దెలిసికొని యాక్షేపించుచు తనకుఁ వివాహ మక్కరలేదని తండ్రికిఁ దెలియఁజేసెను.
ఆవార్తవిని యావర్తకుఁడు పరితపించుచు నొకనాఁడు గదాధరుని రప్పించి కుమారా ! లక్షలకొలఁది కానుకలతో బిల్లల నిత్తుమని పెక్కండ్రు కోటీశ్వరులు వచ్చుచుండిరి. నీ మిత్రుండొక కన్యక నంగీకరింపక పెండ్లి యాడనని చెప్పుచున్నాడేమి?
గదాధరుఁడు - అవును నీవు ద్రవ్యలాభమే చూచుచుంటివి కాని కన్యకాలక్షణంబులు పరీక్షించుట లేదు. నీవు చెప్పిన కన్యకలలో నొక్కరితయుఁ జక్కనిది లేదు. అందులకై అతండామాటఁ జెప్పెను.
రత్నాకరుఁడు - సరి. సరి. అదియా ? ఆలక్షణము లేవియో నాకుఁ దెలియవు కాగితముపై వ్రాసి యిమ్మనుము.
గదా - నీ కుమారుండు పద్మినీజాతి కన్యకంగాని పెండ్లి యాడనని చెప్పుచన్నాఁడు. సుంకమున కాసపడక యట్టిపడతిం బెండ్లి జేయుము.
రత్నా - పద్మినీజాతియా ? ఆ మాట నే నిదివఱ కెన్నడును వినియుండ లేదే? మాజాతికి నాజాతితో సంబంధమున్నదో లేదో చిన్నవారలు మీమాటల నమ్మి జీసితినేనిఁ గులములో వెలివేయుదురు.
గదా - (నవ్వుచు) పద్మినీ జాతియని మఱియొక కులము కాదు. స్త్రీ జాతిలో నుత్తమమైనది.
రత్నా - ఇదియే కదా ? నీమిత్రు నభిప్రాయము. ఎక్కువ కానుక లెవ్వ రిత్తురో వారి పిల్లయే పద్మినిజాతి యువతియని చెప్పుదము. తలిదండ్రులచేత నట్లు చెప్పింతము. తెలిసినదియా ?
గదా -- ఆహా ఏమి నీ మోహము. ఇత్తడి బంగారమనిన నమ్ముదురా ? ఆ లక్షణము లాకన్యకయం దుండవలయు. పద్మినీ జాతి లక్షణంబు లెఱింగించెద నాకర్ణింపుము.
శ్లో. కమలముకుళ మృద్వీపుల్ల రాజీవగంధః
సురతపయసి యస్సా స్సౌరభం దివ్యమంగె
చకిత మృగదృశాబె ప్రాంతరకై చనేత్రే
స్తవయుగళ మనింద్య శ్రీఫల శ్రీవిడంబి.
శ్లో. తిలకుసుమసమానాం విభ్రతీనాపికాంచ
ద్విజ గురు సుర పూజా శ్రద్ధధానా సదైవ
కువలయ దళకాంతిః క్వాపి చాంపేయగౌరీ
వికచ కమల కోశా కార కామాత పత్రా.
శ్లో. వ్రజతి మృదు శరీరం రాజ హంసీవ తన్నీ
త్రివళిళతమనుమధ్యా మంజు వాణీమవేషా
మృదుశుచిలఘు భుంకై మానినీ గాఢలజ్జా
ధవళ కుసుమవాసో వల్లభా పద్మినీస్యాత్
ఇట్టి లక్షణములు గలదియే పద్మినీజాతి యువతి.
రత్నా - ఔరా నీమిత్రుని కెన్నికోరికలున్నవి ? నీసహవాసంబున వానికీ యభిలాషగలిగినదని తలంచెదను సంసారస్త్రీల కందమేమిటికి? నీవు జదివిన టక్కులన్నియు బోగమువాండ్ర కుండవలయును. పద్మినీలు మాకులములో లేరు మీ బాపన కులంబున నుందుఱేమో నీవేరికొని పెండ్లియాడుము.
గదా - నీకొడుకు నాకంటెఁ జాల చదివెను. వానికి నా యుపదేశ మక్కర లేదు. నీవు కోటీశ్వరుండవై నీకుమారుఁడు జక్కనిపిల్లం బెండ్లి జేయుమని కోరుట తప్పుగా గణించుచుంటివి అహా?
రత్నా - బాబూ ! మీతో మేము మాట్లాడఁజాలము. కులవిద్య నేర్పింపక శాస్త్రములు జదివించుట నాది తప్పు పుస్తకములలో వ్రాసినట్టు భార్యలు ప్రవర్తింప వలయునని కోరుచుండిరి. ఆ కోరికలు సంకల్ప రాజ్యములవంటివే కాని సత్యములు కావు. కానిమ్ము ఇప్పుడు వలసినంత ద్రవ్య మిచ్చెదను. పరి వారమిచ్చెదను దేశాటనముజేసి మీయిష్టము వచ్చిన పద్మినీల నేరికొని పెండ్లి యాడుండు. అని యుపదేశించుటయు వారికంతకుఁ బూర్వమట్టి సంకల్పము గలిగి యుండబఁట్టి సంతోషముతో నంగీకరించెను.
తండ్రి యనుమతి గురుదత్తుండు గదాధరునితోఁ గూడ శుభ ముహూర్తమున నిల్లువెడలి కన్యార్థియై కొంతకాలము దేశాటనము గావించెను. ప్రతి గ్రామమునకుఁబోవుచు భాగ్యవంతులగువణిక్కులయిళ్ళకుంజని కన్యకల౦ బరీక్షించుచు రూపవతులై నను బుద్దిబలశూన్యులగువారిం బరిహరించుచు సంకల్పానుగుణ్యయగు కన్యకం బడయలేకపోయిరి.
ఒకనాఁడొక గ్రామమున నొకసత్రములో బసజేసి నానా దేశాగతులగు జనులతో ముచ్చటించుచుఁ గదాధరుం డందున్న కొందఱ బేహారులంగాంచి మీరెవ్వరు? ఎందుండి వచ్చుచుండిరి. యెందు బోయెదరు ? పనియేమి? అని అడిగిన వారిలో నొకఁడిట్లనియె.
అయ్యా ! మాది కుంభఘోణము. మేము వర్తకులము. మా యజమానుఁడు మిగులు భాగ్యవంతుఁడు. ఆతఁడు తన కుమారునికి మిక్కిలి చక్కనగు మగువం బెండ్లి జేయఁ దలంపుగలిగి దుర్గానగరంబునఁ గుముదాంగదుని కూఁతురు పద్మిని అను చిన్నది త్రిభువనాశ్చర్యకరములైన సౌందర్యచాతుర్యాది గుణవిశేషములచేఁ బ్రకాశించుచున్నదని లోకులవలనఁ దెలిసికొని యా కన్నె నడుగుటకై మమ్మందు లకుఁ బుత్తెంచెను.
మేమఱిగి యావైశ్యశిఖామణిచే నర్చితులమై యాయజమానుని విత్తాభిజాత్యాది భాగ్యవిషయములం బొగడుచు నతని సందేశమెఱింగించితిమి అతం డించుక విమర్శించుచు నాశెట్టిపట్టి విద్యారూపగుణంబులెట్టివని అడిగిన మేము అయ్యా ! అతండు గొడ్డువీఁగికనిన బిడ్డఁడగుటచే గారాబముగా బెంచి విద్యలు గఱపింప డయ్యెను. పురుషునికి రూపమేమిటికి ? “సర్వేగుణాః కాంచన మాశ్రయంతి” అనునట్లు వారి సిరియే యన్నిటికిం జాలియున్నది. నీపుత్రిక యింద్రభోగము లనుభవింపగలదు అని చెప్పిన విని అతండు నవ్వుచుఁ దనపుత్రికను రప్పించి అవ్విధంబెఱింగించిన నమ్మించుఁబోణి పెదవివిరచుచు మఱుమాట పలుకక అవ్వలికిం బోయినది.
అప్పుడతండు మాతో అయ్యా ! మాకు విద్యారూపశీలంబులు ప్రధానముగా నుండవలయును. సంపద నంతగాఁ బరిశీలింపము. . మాకీచిన్నది యొక్కరితయే దిక్కు. మాధనమంతయు నేమిజేయుదుము. మేమనుటఁగాదు మాపద్మినికి విద్యావ్యసనము మెండు. దానినిం దగిన పండితునికిం జేయకున్న నిందపాల్పడి పోమా ? అని యేమేమో చెప్పి మాకుఁ బయనమున కనుజ్ఞయిచ్చెను. మేమును ఫలవిముఖులమై పురాభిముఖులమై అరుగుచుంటి మని చెప్పిన విని గదాధరుఁడు సంతోషభరితహృదయుండై యిట్లనియె.
అయ్యా ! మీరాచిన్నదాని చూచితిరిగదా? సౌందర్యమెట్లున్నదని అడిగిన వారు అమ్మదవతి పదమూఁడేడుల ప్రాయములోనున్నది. అయ్యందము జూచితీర వలయు జెప్పుటకు మేము కవులముగాము. సామాన్యమైన నింతదూర మేలవత్తుమని పలుకుచుఁ బయనపు సమయమగుటయు నత్తెరవరులు మూటలుగట్టుకొని దక్షి ణాభిముఖముగా నరిగిరి.
గదాధరుఁడా మాటలువిని గురుదత్తునితో దమ్ముడా ? నీవు బద్మినినింగాని పెండ్లియాడనని నియమముజేసికొంటివి. నీశపథము సఫలమగునట్లున్నది. వీరిపలుకులు మన కుపశ్రుతులవలె నుదర్కమును సూచింపుచున్నవి. ఇఁక జాగుసేయనేల? వేగ మానగరంబునకుంబోవుదము లెమ్మని పలికినవిని యతండిట్లనియె.
అన్నా ! ఆచిన్నది నన్నుమాత్రము స్వీకరించునా ? నావిద్యారూపంబులు దానికి హృదయములగునో కావో ? అది మనకంటె జదివినదియేమో ? ఓడిపోయితిమేనిఁ బరాభవముకాదా? కానిమ్ము. నీ బుద్దిబలం బే తన్మాత్రంబే అనిపలుకుచు నాకలి కింజూచునుత్సుకత్వమెడ దంగందుకొన మిత్రునితోఁగూడ బయలుదేరి కతిపయప్రయాణంబుల నవ్వీటికఱిగెను.
దుర్గానగరంబునఁ బద్మిని విద్యారూపవిశేషముల నెఱుంగని వారులేరు. ఎవరి నడిగినను బాపురే ? యాబాలికయా ? ప్రాయమునకు మించిన విద్యగలది మంచిరూపము. మంచిగుణమని పొగడుచుందురు. కుముదాంగదునకు రాచ కొలువులోఁ గులపరిపాటిగ వచ్చుచుండెడి విత్తగణకోద్యోగంబు (షరాబుపని) గలదు. అందలి ప్రజలు పద్మిని సౌందర్యాదివిశేషంబులు పొగడుచుండ విని యుబ్బుచు వారిద్ధరు నొకనాఁడు వారింటికిం బోయిరి. ఏడంతరములుగల యాతని మేడ వారికి మిక్కిలి వేడుక గలుగఁజేసినది. వీథి యరుగులు విశాలముగా నున్నవి. అందు గూర్చుండి లోపలినుండి వచ్చిన యొక దాదితో షరాబు గారున్నారా? అని యడుగుటయు నది బాబూ ? వారు కొల్వునకుఁ పోయిరి. సాయంకాల మారుగంటలకు వత్తురని అది యుత్తరముజెప్పి లోపలికిఁబోయి అంతలోవచ్చి తాము లోపలికిదయదేసి చావడిలోఁ గూర్చుండుఁడు మీనివాస దేశమెయ్యది? పనియేమి యని అడిగిన గదాధరుండు ఈతఁడు వణిక్కులశిఖామణి నేను బ్రాహ్మణుఁడ మేమిరువురము బాటసారులమై యీవీటి కరుదెంచితిమి. మాకాపురము కుంభీనసపురము వీనితండ్రి కోటీశ్వరుఁడు రత్నాకరుండనువాఁడు. ఈ నగరంబునఁ గుముదాంగదునివాడుక విని కులపరిపాటి నీతఁడు జూడవచ్చె. వేరొండు పనిలేదని చెప్పెను.
ఆమాటలు లోపలినుండి పద్మిని విని వేరొకపరిచారికచేఁ గనకకలశములచే బాదములు గడుగుకొనుటకై జలమంపినది. లోపలికిరమ్మని వెండియుం బలికించినది. కాళ్ళు గడిగికొని వారు లోపలిచావడిలోనికిం బోయి పీఠములపయిం గూర్చుండి సభావిశేషములం జూచుచు అందు గాంచనపట్టికాఘటితమగు దర్పణాంతరంబున మెఱయుచున్న యొక చిత్తరువుంజూచి గురుదత్తుండు వయస్యా! యాప్రతిమ జూచితివా. కమలవిచక చక్రాదిచిహ్నితములై రక్తాంగుళీసంగతములై మృదువులై పాణి పాదములు వెలయుచున్నవి.
గదా -- అవును పాణిపాదములే కాదు అనుపూర్వ వృత్తములగు పిక్క లొక్కటియే యిక్కలికి చక్కఁదనము నొక్కి. వక్కాణింపుచున్నవిగదా ?
గురు -- ఆహా కంబువృత్తబంధురంబైన కంధరంబు ఈ ప్రతిమ సుందరం బప్రతిమానమని చాటింపుచున్నది చూడుము.
గదా - అదియొక టేల ? వట్రువులై నడుమంగన్పడు కెంపుగలిగిని యధరంబు, సంక్షిప్తంబగు చుబుకంబును, కలియ వక్రములై నల్లనై సాంద్రములగు భ్రూఁలతలు, ధవళరక్తత్రిభాగ భాసురములై ధీరసంచారమంధరములైన దృష్టి ప్రసారములు చంద్రకళాసుందరమగు లలాటంబు నింద్రనీలప్రభారమ్యములగు నలకపంక్తీయుంగలిగి విరాజిల్లు ముఖకమలంబు సోయగ౦బు కన్నులపండువు చేయుచున్నదిగదా.
గురు -- ఈచిత్ర ఫలకములలోని కన్నియ యేజాతి యువతియో చెప్పఁగలవా?
గదా - పద్మిని పద్మినియే సందేహములేదు.
గురు - ఆహా! ఇంతదేశము దిఱిగియు బ్రత్యక్షముగాఁ బద్మినీజాతి యువతిం జూడలేకపోయినను నేఁడిందీ చిత్రఫలకమైనఁ గనంబడినది కృతకృత్యులమైతిమి గదా.
గదా -- ఇది చిత్రకారుని రచనాచమత్కృతి యనుకొనుచుంటివాయేమి కాదు.
గురు -- మఱియేమి ?
గదా - ప్రతిబింబమే.
గురు -- ఇప్పు డిప్పుడమి నిటువంటి వాల్గంటులు గలరా ?
గదా - లేనిచో భవదీయ విద్యాగుణభాగ్య విశేషంబులకు సాద్గుణ్యమెట్లు ?
గురు -- ఈకన్నియ ప్రాయమెంత యున్నదనియెదవు ?
గదా - బాల్య యౌవనాంతర ప్రాయంబుగలదని యవయవ స్థౌల్యంబు దెలియపరచుచున్నది.
గురు - అగునగు నీకుసుమగాత్రికి విద్యాసౌరభ్య ముండునని తలంచెదవా ?
గదా - లేనిచో చతుర్ముఖుని నిర్మాణ కౌశల్యము నిందితవ్యము కాదా ? అని వారు సంభాషించుకొనుచున్న సమయంబున నొక పరిచారిక ఫలముల కొన్నిదెచ్చి బల్ల మీఁదబెట్టి భుజింపుమని చెప్పినది. గదాధరుఁడు ఓసీ ఆచిత్రఫలక మెవ్వరిది? అని యడిగెను. మా అమ్మాయిగారిదేయని యత్తరము జెప్పినది. మీ అమ్మాయిగారి పేరేమి? యనుటయుఁ బద్మిని అని చెప్పినది. ఆమె చదువుకొన్నదా ? యని గురుదత్తుడడిగెను చదువు గిదువు నాకుఁ దెలియదు. మీరామెకు సమాధానము జెప్పఁగలరా? గొప్ప గొప్ప పండితులు వచ్చి యోడితిమని పలికి బోవుచుందురు. అని చెప్పుచుండ లొపలినుండి మందలింపుచుఁ పద్మిని సీ ! మూర్ఖురాల! యిటురా! తెలియక పలుకుచుంటివి వారికడనా ! నీ యభ్యాఖ్యానము చాలు చాలు. ఈవలకురా ? అని చీరినది
దుందుభిధ్వనివలె మనోహరమైన యాకంఠధ్వనివిని గదాధరుండుబ్చుచు బద్మినీ ? యిటురావమ్మా ? నీ విద్యావిశేషములు వినియే నిన్నుఁజూడ వచ్చితిమి. పండితులతో నీవు సంభాషింతువని వినియుంటిమిగదా హృదయంగమంబులగు నుపోద్ఘాతములచే మాకుఁ జెవులు పండువు గావింపవా? అని పలికెను.
శ్లో॥ వైదేహి! యాహి కలశోద్భవ ధర్మపత్నీం
ఆచక్ష్వ రావణవధాది కధాస్సమస్తాః
వృష్ట్వాపి మా పదపయోనిధి బంధనంమే
సైవాహ్యధశ్చు లికితాంబునిధే కళత్రం
సముద్రమంతయు నాపోశనమునగా గరతలంబున నిమిడ్చిన యగస్త్యమహర్షి భార్యతో ముచ్చటింపుచు సీతామహాదేవి తన భర్త సముద్రమునను సేతువును గట్టెనని ప్రగల్భముగొట్టిన నెట్లుండునో ? నేను మీకడవిద్వాంసురాలనని చెప్పికొనుట యట్లుండును మీరు మహావిద్వాంసులు ఎఱుఁగని దాదిమాట పాటింపవలదు ఫలముల భక్షింపుఁడు మాతండ్రి వచ్చు వేళయైనది. సంభాషింతురుగాక యని చెప్పిన గదాధరుండు వికసించిన మొగముతో గురుదత్తుని జూచి తమ్ముఁడా ? యెట్టి యుపమానము దెచ్చినదియో చూచితివా ? అని మెచ్చుకొనియెను.
అంతలో నామెకుఁ జదువు జెప్పిన పండితుఁ డచ్చటికి వచ్చి పద్మినీ ! యని పిలుచుటయు నామె సిగ్గుచే నీవలకురాక లోపలినుండియే అయ్యగారూ ! అందుఁ గూర్చుండుఁడు. వారు పండితులు వారితో ముచ్చటింపుఁడని పలికినది. ఆతండా మాటవిని శంకించుకొనుచు జిత్రఫలకమునే చూచుచున్న వారింజూచి అయ్యా ? మీరెవ్వరు ? పండితులనినది మీరేనా? యేమి చదివికొన్నారు. అని యడుగు నంతలో గదాధరుఁడా సంస్కృతభాషతో నుపన్యసించి తన విద్యాపాటవము జూపి యతని కచ్చెరువు గలుగఁజేసెను అతని యుపన్యాసమును విని తుది మొదలు తెలియక తెల తల పోవుచున్న యాయాచార్యుని పక్ష మవలంబించి గురుదత్తుఁడు గదాధరుని యుక్తులగొన్ని ఖండిం చుచు నుపన్యసించుటయు నాయిరువురకుఁ గొంత ప్రసంగము జరిగినది. ఆ ప్రసంగ మందు వారి. కళాప్రవీణతయంతయు వెల్లడియగటయు లోపలినుండి వినుచున్న పద్మిని విద్యాభిలాషిణియగుట నక్కజమందుడెందముతో గవాక్షమునుండి తొంగి చూచి గురుదత్తుని విద్యా ప్రౌఢిమయు రూపసంపత్తియుఁ దనచిత్తమును సంకల్పశతా యత్తమును గావింప నానందపరవశయై ధ్యాన నిశ్చలదృష్టియై పరికింపుచుండెను.
ఆచార్యులును దదీయ నిరవద్య విద్యావావదూకత్వమున కబ్బురముజెందుచుఁ జేతులు జోడించి కోవిద వసంతులారా? మీ ప్రాయంబు కడుచిన్నది. మీకళాపాట వంబు దుర్మదబుథహృదయ పాటవంబు గావింపుచున్నది గదా మీదేయూరు ? ఇందుల కేమిటి కరుదెంచితరి. మీకులశీలనామంబు లెఱింగించి నాకుశ్రోత్రపర్వముగావింపుదురా? అని అడిగిన గదాధరుండు తమకథ యెఱింగించి యీ వైశ్యపుత్త్రికారత్నంబు విచిత్ర కళా కళాపదీపితయని జను లనుకొనవిని స్వకులాభివృద్ధి నభిలషించువాఁడ గుటంజేసి మాగురుదత్తుండు మీపద్మినితో ముచ్చటింప నిచ్చగలిగి యిందు వచ్చిన వాఁడు అచిన్నది మీశిష్యురాలేకదా? విద్యాకరగ్రహణలాలసయని వింటిమే? ఈతం డును విద్యాకరగ్రహణలాలసుఁడే కావున నాపూవుఁబోణిని౦దు రప్పింపుఁడు ఇరువురు నొకసారి మచ్చటింతురు. అని పలికిన విని యగ్గురు వరుండెంతేని సంతసించుచు అమ్మా ! పద్మినీ! యిటురా!. నీ హృదయాభిలాష తీరగలదు. నేఁటికి నీవు గోరిన పండితవరుండు లభించె వచ్చి ముచ్చటింపుమని పిలిచెను.
పద్మినియు నగ్గురుడిచ్చిన సమాధానవచనంబులకు నిచ్చిమెచ్చుకొనుచు నల్లన గుమ్మము దాపునకువచ్చి గురువరా! వారుశ్లేషకవులు వారితో మనము ముచ్చటింపఁ గలమా? తనహాశ్లేష గంభనముల కలరని బేలలుందురా? వారియాశయగ్రహణాభిలాష నాకు మిక్కిలి గలిగియున్నది. విభుధవరప్రసాదంబునంగాని యదిసిద్దించునేయని యుత్తరంబిచ్చినది. అప్పుడు గదాధరుఁడు కుమారీ ! నీసుముఖత్వంబితనికి హృదయ గమంబైనది. నీవు వీరితో ముచ్చటించుచు సిగ్గుపడుచున్నట్లుతోచుచున్నది. కానిమ్ము పోయివత్తు మనుజ్ఞ యిమ్ము. మీ తండ్రివచ్చిన పిదప మఱల వత్తుమనుటయు నాచి న్నది గదాధరునకు నమస్కరింపుచు నార్యా ! మాతండ్రి వచ్చువేళయైనది మీరువచ్చిన కార్యంబేదియో అతని కెఱి గించినఁ దీర్పఁగలఁడు నేను జిన్నదానను నాకేమియుం దెలియదు. అదియునుంగాక మీసహాధ్యాయులు మావారుగదా? వారిందే కుడుతురు మీరు మాగురునింట భుజింతురు గాక తొందరయేల? అని వినయముతోఁ పలికినది. అమృతపు సోనవలె నప్పలుకులు తనచెవులకు ముదము గలుగఁ జేయుటయు గురుదత్తుండు వికసితముఖారవిందుడై గదాధరు నుపలక్షించెను.
ఆసన్నగ్రహించి యాసన్నవర్తియగు గురుండు పద్మినీవరుండు రాగానుషం గుడై విశ్రమింపఁ బశ్చిమాచలనిలయంబు చేరుచున్నవాఁడు పద్మినీగురుండును వచ్చు వేళయైనది మీరెక్కడ కేగెదరు: ఇందే యుండవచ్చును అని పలుకుచు అతండు భాగ్యవిభవంబులు నడుగుచు వారిలో మచ్చటింపుచున్న సమయంబునఁ గుముదాం గదుఁ డోలగమునుండి యింటికివచ్చి అందున్న క్రొత్తవారింగాంచి వారెవ్వరిని యడు గుటకు సందేహించుచుండ నొజ్జలు వారి యుదంత మెఱింగించిరి.
రత్నాకరుని వాడుక వినియున్న వాఁడగుటఁ గుముదాంగదుఁడు గురుదత్తు నత్యంత గౌరవప్రతిపత్తి జూపుచు దానింటలేనితఱినరుదెంచుటచే నెఱుఁగమి నింటి లోనివారలు దగినమర్యాదజేయలేదని చెప్పఁబోవుచు గదాధరుండు కల రూ పెఱింగించి పెద్దగాఁ బద్మినిం బొగడెను. కముదాంగదుండు మిగులఁ జెలగుచు నాఱేయి నుపాధ్యా యునింటికి గదాధరుం గుడవఁబంపి తనయింటఁ గురుదత్తునకుఁ బెద్డగా విందు గావిం చెను.
అతఁడు రాత్రి భార్యతో రహస్యముగా నతని కులశీలరూపవిద్యాధనగౌర వంబు లుగ్గడించుచుఁ బద్మిని నతనికి వివాహము చేయుదమా ! అని యాలోచించి కుమారి యభిప్రాయము తెలిసికొమ్మని నియమించుటయు ఆమె నవ్వుచు నిదివరకే దాని మానసంబు వానిపై వ్యాపించినది. దాది చెప్పినదని నుడువుటయు నతడును బుత్రికను జాటుగాఁ బిలిచిఅమ్మా ! నీవందరికిని వంకలు పెట్టుచుందువు. ఈగురుదత్తుఁ డెట్లుండెను? విద్యలోఁ బరీక్షించితివా? అని యడిగిన బాల ముసిముసి నగవులు నవ్వుచు మీరు పెద్దవారలు మీకంటె నాకు దెలియునాయని చెప్పినది.
అబ్బొ? ఈ పెద్దఱిక మింతకుమున్ను మాయందుంచితివా? మేమిష్టపడినవారిని నెందఱదూఱితివి. ఇప్పుడు నీకిష్టమయ్యెం గావున నిట్లనుచుంటివి. కానిమ్ము మాకది యును సంతోషమే భాగ్యముతో బనిలేదు. విద్యలో నెంతవాఁడని యడిగినఁ దండ్రీ ? ఇక దాచనేల గొప్పవిద్వాంసులు మనదేశములో నింతవారుఁ బేరని పొగడినది.
అంతలో నాచార్యునితోఁగూడ భుజించి గదాధరుఁడు వచ్చినవాఁడను వార్తవిని కుముదాంగదుండు చావడిలోనికివచ్చి చమత్కారముగా ముచ్చటించుచు గురునితోఁ దనయభిప్రాయము సూచించెను. బోజనపు వేళ గదాధరుండా గురునితో గురుదత్తుల యభిలాషయెఱిగించయున్నవాఁడగుట గదాధరునితోఁ గుముదాంగదుండు విననిట్ల నియె. విబుధేంద్రా? గురుదత్తుండు భాగ్యంబున మహేంద్రుం దిరస్కరించువాఁడని లోకమెఱింగినదియే. అది యట్లుండె విద్యారూపశీలంబుల ననవద్యుండగుట మాపద్మిని వరించినది. జగన్మిత్రుండగు నితనిబద్మిని వరించుట యబ్బురముగాదు. మరియొక కోరిక మిమ్ముఁ గోరుచుంటిమి వినుండు. ఈవైశ్యునకు లేక లేక పద్మిని యొక్కతియే పుట్టినది. దానివిడిచి యీదంపతులుక్షణము జీవింపలేరు. గురుదత్తుండు బద్మినిం బెండ్లి యాడి యిందే యీ భాగ్యముననుభవించు చుండవలయును. ఇందుల కంగీకరింపుఁడు శుభముహూర్తము నిశ్చయింతమని పలికినవిని గదాధరుఁడు గరుదత్తు మొగము జూచెను.
అత౦డెట్లైన నక్యన్యకారత్నము హృదయమున నిడుకొనుటకు వేగిరపడు చున్న కతంబున నంగీకారము సూచించెసు. అంతలోఁ బద్మినివచ్చి లజ్జావిభ్రమలోల దృష్టిప్రాసారముల నతని జూచుచు గురుదత్తు మెడలోఁ బుష్పదామంబు వైచినది.
అప్పుడు కుముదాంగదుండు మిగుల సంతసించచు దన్నుగృతకృత్యునిగాఁ దలంచుకొని గదాధరుని స్తుతియించుచు నప్పుడు శుభముహూర్తము నిశ్చయింపఁజేసి రత్నాకరునికిఁ దెలుపకయే మహావైభవముతోఁ బద్మినిని గురుదత్తునికిచ్చి వివాహము గావించెను.
గురుదత్తుండాడిన మాటవడువున వెండియు నింటికింబోక యందేయుండి సమారూఢ యౌవనయైన పద్మినితోఁ గూడికొని యసమకుసుమశరక్రీడా పరతం త్రుండై యౌవనలాభంబు సాద్గుణ్యము నొందఁజేయుచుండెను.
అని యెఱింగించి మణిసిద్ధుండు వేళయతిక్రమించుటయు నవ్వలికథ పైమజిలీయం డిట్ల ని చెవ్పదొడంగెను.
123 వ మజిలీ కథ
సురూపుని కథ
దుర్గానగరంబు సుప్రసిద్ద పట్టణములలో నొకటి. ఆదేశంబున కదియే రాజ ధాని. సురూపుండను రాజకుమారుం డాదేశాధిపతియై ప్రజల బాలింపుచుండెను. పట్ట భద్రుండైన కొలది కాలమునకే రూపమదము, యౌవనమదము, విద్యామదము రాజ్య మదమునుం గలసి యతనిచిత్తమును విపరీత క్రియాయత్తము గావించినది. సప్త వ్యసనములలో మొదటివి నాలుగును వానికి నిత్యకృత్యములయ్యెను.
శ్రోత్రియుల మన్నింపఁడు. విద్వాంసుల దూషించును. మంత్రులనిరాక రించును. విటుల గౌరవించును. జూదరుల నాదరించును. మద్యవులఁ జేరదీయును. పరాంగనానంగమమున రావణుని మించినవాఁడని వాడుక బడసెను. రూపవతియగు యువతి అతని కన్నులంబడిన గవయక విడువఁడు. గోమినియను దాడియుఁ గరటుండను పరిచారకుండును వానికిఁ దత్కృత్యంబులఁ బరమమిత్రులై తిరుగు చుందురు.
ఒకనాఁ డతండు డుద్యానవనంబునందలి క్రీడాసౌధంబునవసించి పండు వెన్నెలలు గన్నులపండువు సేయుచుండ గోమినిని రప్పించి విరహాతురత్వంబు ప్రకటింపుచు నిట్లనియె.
గోమినీ! నీవు నిత్యమును గ్రొత్తక్రొత్త పూవుఁబోండ్లం దీసికొనివచ్చి ముచ్చ టలుదీర నా కుత్సాహంబు గలుగఁజేయుచుంటివి. అబ్బా ! నేఁటిబాధ నేనెన్నఁడును పడియుండి యెఱుంగను. నామేను ముట్టిచూడుము. మండిపోవుచున్నది. ప్రతీకారము గావించి బ్రతికింపుము అని నిట్టూర్పులు నిగుడఁ బలికిన విని యాదూతిక యాతు రతతోనిట్లనియె.
అయ్యో ? దేవరకిట్టి బాధపడ నవసర మేమివచ్చినది? మీరు కోరిన యే నారీ మణి యనుమతింపదు? ఏయువతిం దలంచి మీరిట్టియవస్థవహించితిరి వేగమ యాగజ గామినిం బేర్కొనుఁడు. మీ పాదాక్రాంతురాలిం గావించెదను ఆమదవతి మిమ్ము నిరాకరించుట కరుంధతియా? సతియా? ఆవ్రతమెట్టిదో చూచెదంగాక యానతీయుఁ డని పలికిన విని యారాజకుమారుం డిట్ల నియె.
గోమినీ ! వినుము. నావలపంత వింతయైనది. ఆ కలకంఠికుల నాకులశీంబులు తెలియవు. మొన్నటి విజయదశమి యుత్సవమునాడు. రాతిరి పట్టపేనుఁగునెక్కి వెంకటేశ్వరుని రథముతో ముంగిల నూరేగుచుంటిని ఒక మేడయొద్ద నిలువంబడి బడియుండ నాయింటిలో నుండి యొక వాల్గంటి యీవలకు వచ్చి స్వామికి నివాళి యిచ్చినది.
కప్పుర హారతి వెలుతురున నా సుందరి మోము చక్కఁదనమెంతయుఁ గన్నులపండువు గావించినది. అయ్యారే! అలి కన్నులు గిన్నులుకావు. యువజన హృదయాకర్షకములగు మదనుని యంత్రమత్స్యములని తలంచెదను. ఆహా ? ఆచెక్కుల తళ్కు చూచితీరవలయును. వెయ్యేల? అయొయ్యారము, ఆనీటు, ఆవగలు, ఆబిం కము, ఆపొంకము, పుడమి పడఁతుల కెందును గలిగియం౦డుట చూడలేదు. అచ్చరలా మచ్చకంటికి దాస్యము సేయఁ బనికిరారు. అట్టి అందముగల సుందరి మనయూర నున్నదని యెన్నఁడును జెప్పితివి కావుగదా? నిత్యముపట్టణమంతయుఁ దిఱిగి చక్కనివారిని వెదకుచుంటినని చెప్పచుందువు. ఆరమణీమణింగాంచి పంచశరవిద్ధ హృదయుండనై మోహపరవశుండనై అంబారిపైఁ బడిపోయితిని. తరువత నేమి జరి గినదో నాకుఁ దెలియదు. ఇంటికి వచ్చిన పిమ్మట మెలకువవచ్చినది. అమ్మగువమొగము కన్నులకుఁ గట్టినట్లున్నది. అప్పటినుండియు నేమియుం దోచదు. నిద్రపట్టదు. ఆహారము రుచింపదు. నీకొఱకెన్నియో వార్తల నంపితిని. తరువాతి కృత్య మాలోచింపుము. ఇదియే చింతాకారణమని పలికిన విని యాదూతికి యిట్లనియె.
దేవరవారి అభిలాష సమంజసమైనదియే కాని యామానవతి యున్న గృహ మైన గుఱుతు జూచితిరికారు. ఈవీటిలో నే నెఱుంగనిబోఁటి యెవ్వతెగలదు. పేరు దెలిసినఁదృటిలో మీగౌఁగిటలో జేర్పించెద నావీధియైన జ్ఞాపకమున్నదియా? అని అడిగిన ఆతండు నాకేమియుందెలియదు. వీధిమాటగాకయా దిక్కు గూడఁజెప్పఁజాల నని యుత్తరమిచ్చెను.
అప్పుడా గోమిని యించుక సేపాలోచించి అతనిచెవులోనేదియో చెప్పినది. దానియుపాయమున కతండు మిగుల సంతసించుచు నప్పుడే ప్రధానమంత్రిని రప్పించి సచివోత్తమా! మనము మొన్న నొక పొరపాటుపని జేసితిమి. విజయదశమినాఁడు హరిహరుల నిరువుర నూరేగింపక హరికి మాత్రమే యుత్సవము జేసితిమి. దానం గోపించి భక్తసులభుండగు శంభుండు నాకలలోవచ్చి నన్నవమానపరచెదవా? యని యేమేమో ముచ్చటించి పోయెను.
దేవతా ద్రోహములనఁ బ్రమాదము రాకమానదు. కావున రేపటి సోమ వారము రాత్రి శంకరునకు వెనుకటికన్న గొప్ప యారేగింపు టుత్సవము జేయింప వలయును. మొన్న నేయేవీధులకుఁ ద్రిప్పిరో యాయా వీధులకుఁ దప్పక పోవలయు. మేళతాళములు మిక్కుటముగా నుండవలయునని చేయవలసిన కృత్యములన్నియుఁ బెద్దగా బోధించెను. మంత్రియు రాజాజ్ఞానుసారముగా సర్వము సంసిద్ధము గావించెను.
నాఁటిఱేయి నారాజకుమారుండు చక్కగా అలంకరించుకొని భద్రదంతావళ ముపై అధిష్టించి గోమినినిఁ దన ప్రక్కనుండ నియమించి యామించుఁబోణి మాటలే చెప్పచు నూరేగింపుతోఁ బోవుచుండెను.
స్వామిరథము ముంగలఁ బల్లకియుఁ బల్లకి ముంగలఁ దనయేనుఁగయు, దాని మ్రోలబోగము మేళము, తరువాత భజనలు, పైనగోపులు పిమ్మట వేణువీణాది గాన విశేషములు నడుచునట్లు నియమించెను. తనయేనుఁగ కదలుదనుక అందఱు నిలువవలయునని నిరూపించెను.
అతండుఁ మేడలుగలచోట్లఁ బెద్దతడవు నిలుపుచుండు. హారతులిచ్చు స్త్రీల నిరూపించి చూచుచుండును. ఆ రీతి రెండు యామముల దనుకఁ బోవునంత నొక సౌధంబుమ్రోల నుత్సవము నిలిపి రాజు గురుతుగా నామేడఁ జూచుచుండ నామేడలో నుండి మబ్బు వెల్వడిన మెఱపుతీగియంబోలి మానినీరత్నం బొకర్తుక తలుపులు తెఱచుకొని పీతాంబరధారిణియై మోడ్పుకేలుతో స్వామిని స్తుతించుచు ద్వారమున నిలువంబడినది. దీపముల వెలుఁగున ఢగద్దగాయమానంబులగు నాభరణ కాంతులు మిఱుమిట్లు గొలుప అద్భుత లావణ్య పరిపూర్ణయై ప్రకాశించు అక్కాంచన గాత్రి మోముపలక్షించి రాజు తడఁబడు పలుకులచే అదిగో అదియే మదీయ హృదయచోర కురాలు అని ముమ్మారు పలికి మోహవివశుండయ్యెను.
అప్పుడు గోమిని యేనుఁగును దిగి తదీయ కులశీలాదులఁ దెలిసికొనివచ్చి నృపతిని బ్రబోధితుంజేసి యిట్లనియె. దేవా ! యీ మేడ విత్తగణకుఁడు (షరాబు) కుముదాంగదునిది. ఆమదవతి అతని కూఁతురు. పేరు పద్మినియఁట. మంచి చక్కనిది. మీరు వరింపఁదగినదియేయని పొగడినది.
రాజు విస్మయ మభినయించుచుఁ బెద్దతడనందునిలిచి అక్కలికి సోయగ మాపోవని చూడ్కు.ల నరయుచుండెను. పద్మిని స్వామికి నివాళియిచ్చి స్తుతియించి ప్రసాదము గైకొని యందు నిలువక మేళ తాళములు చూడక లోపలికిం బోయి నది.
అప్పుడు రాజు కుముదాంగదుని రప్పించి గౌరవించుచు సెట్టి యీ మేడ నీదఁటకాదా ?. బహురమణీయముగా నున్నదే? మాకెప్పుడును జూపితివికావేమి ? అని యడిగిన అతండు చిత్తము చిత్తము మా పూర్వులు గట్టినది. దివాణపుదయ వలనం గలిగినదియే మేముతమజనముకామా ! లోనికి దయచేయుఁడు అని వినయం బునఁ బ్రార్దించుటయు నారేఁడు ఇప్పుడు ప్రొద్దుపోయినది రేపు జ్ఞాపకము చేయుము. సౌయంకాలమున వచ్చి చూచెదంగాక ? మా పరిజనముల సంపదలు మాకు సమ్మోద జనకములు అని పలికీ అతని నంపి యా యుత్సవముతోఁ గొంత దూరము పోయి నిద్రకు నిలువలేనని యింటికిం బోయెను.
మరునాఁడు కరటుని రప్పించి విప్రకుమారా! నీవు శృంగార లీలాతరంగిత ములై గ్రంధములు పెక్కు చదివితివి. కామశాస్త్రమంతయు నీకుఁ గంఠస్థమై యున్నదిగదా ! వాత్స్యాయనసూత్రములు నీకు సంధ్యావందనముకన్న గట్టిగా వచ్చును. రాత్రి నేను జూచిన చిన్నదానిచరిత్రము నీకుఁ జెప్పితినిగదా ? ఆవాల్గంటి వంటి వన్నెలాడి పుడమిలో నేనిదివరకుఁ జూచియుండలేదు. కోమటింట నట్టి సొగసు కత్తె పుట్టుట వింతగదా ? అక్కాంతనాచెంతకెప్పుడు తీసికొనివత్తువు ?.ఉపాయ మేమి ? నిమిషము యగములాగున్నది. విరహవేదన భరింపలేకున్నవాఁడనని పలి కిన విని యాబ్రాహ్మణపుత్రుం డిట్లనియె. దేవా ! దాని చరిత్ర మిదివఱకు నేనెఱింగినదియే ? అది యుత్తమ జాతి యువతి. నేను పెక్కుసారులు శోత్రియ వేషముతో వారింటికేగితిని. పల్కరించి చూచితిని. మోమెత్తి చూడదు. ముఖవిలాసము లరయవలయునని యెంతయో ప్రయ త్నించితిని. ఇంచుకయు నవకాశ మిచ్చినది కాదు. సంతతము దేవతాతిధిసత్కార ములు జేయుచుండును. విద్యలలో సరస్వతిని మించినది ఆ బోటితో నవకాశమిచ్చి నను మా బోటులు మాటాడఁగలరా ? అసాధ్యమని తలంచియే యక్కాంత వృత్తాం తము దేవరకెఱింగించితిని కాను. అని చెప్పిన విని యన్నరపతి గోమినిని రప్పించి యిట్లనియె.
గోమినీ ! కరటుండు మనయెడ కపటము చేయుచున్నవాఁడు పద్మిని మహా పతివ్రతయట కన్నెత్తి యెవ్వనిఁజూడదఁట. స్త్రీలటక్కులు స్త్రీలకేకాక యొరులకుఁ దెలియవుగదా ! పద్మినివశవర్తింజేసి వీని నోడించితివేని నీకు లక్షరూప్యములఁ గాను కగా నిచ్చెద నేమనియెదవని యడిగిన నది మూపులెగరవైచుచు నిట్టనియె.
దేవా ! యిది యెంతపని కాలవిలంబము సైచితిరేని నరుంధతివంటి వాల్గంటి నైననుఁ బుంశ్చలిం జేయగలను. ఈ వైశ్యపుత్రిక మాట లెక్కయేల ? ఏదో కైత వంబున మీరొకసారి యానారీరత్నము కన్నులంబడి రండు తరువాత మీగుణ గణంబుల బొగడి తానంతవచ్చి మిమ్ముసేవించునట్లు చేసెద నామాయలఁ బడని పడఁతి గలదా యని పలికిన విని రాజుమిగుల సంతోషించెను. కరటుండు నవ్వుచు కపటకృత్యముల నీవాసతీ తిలకమును వశవర్తినిం జేసితివేని సిఖాయజ్ఞోపవీతములఁ దీసి సన్యాసినయ్యెద నిదియే నాశపధము.
కం. లంజ పడంతుల కడనే
రంజించు న్నీదువాక్యరచనలు మఱిసా
గంజెల్ల వామె కడపద
భజించు నిన్ను వామ పదవాతిఁబలుకన్.
నీమాయాడాంబికా డంబరములా కంబుకంఠికడ నుపయోగింపవని యెత్తి పలి కిన గోమినియు నామత్తకాశినిం దెత్తునని పెద్ద శపధము జేసినది. అక్కారణంబున వారిద్దరికి బెద్ద కలహము జరుగుటయు రాజు గోమినిపక్షముగా మాట్లాడుచు గరుటుని మందలించెను. ఇంతలోఁ గుముదాంగదుండు దర్శనార్థియై వచ్చెనని ద్వారపాలుండు వచ్చి చెప్పినంత నయ్యనంతాకాంతుఁడు సంతోషముతో నెదురేగి పాణీఁబాణింబీడిం చుచు సుఖాసనాపవిష్ణుంజేసి యెఱుంగనివాడుంబోలె నాగమనకారణం బడుగుటయు ధనగణకుఁడు దేవా? రాతిరి సెలవిచ్చిన మాటమరచితిరా ? నేఁటి సాయంకాలము మాయింటికిఁ దయచేయుదుమని చెప్పలేదా ? పిలువ వచ్చితినని పలికెను. సంభ్రమముతో అయ్యో ! ఆ మాటయె మరచితిమి గోమినీ ! ఈతండు మాకు ముఖ్య స్నేహితుండు వీరి సంపదల కానందించితిమి సౌధము నా స్వాంతము నకు వింతగొలిపినది. చూచి వత్తము రమ్మని పలుకుచు నప్పుడే యశ్వశకటము దెప్పించి వర్తకునిఁ బ్రక్కనిడుకొని గోమిని వెనుక నిలువ నతివేగముగాఁ గుముదాంగ దుని యింటికరిగెను. అలంకార శోభితమైనను రాజు చూచునని యా వర్తకుఁడు మేడను గొత్తగా నలంకరించెను.
బండి దిగిన వెంటనే వర్తకుఁడు రాజునకుఁ గైదండ యొసంగి అల్లన యింటిలోనికిఁ దీసికొనిపోయెను. గోమిని వెంటనంటిరా నా అంతరము లన్నియుఁ జూచుచు మెచ్చుకొనుచుఁ బద్మిని గనంబడునేమో అని నలుమూలలు తొంగి తొంగి చూచుచుండెను. తిరిగి తిరిగి యెందును నాసుందరిం గానక యొక చావడిలోఁ గూర్చుండి రుక్మాంగదునితో సెట్టీ ? నీకుఁ బిల్ల లెందరని యోగక్షేమమడుగుటయు నతం డిట్లనియె.
దేవా ! నాకు లేక లేక యొక్కరితయే కూఁతురు గలిగినది. పురుషసంతతి లేదు. కుంభీనసపుర వాస్త వ్యుఁడగు రత్నాకరుఁడను వైశ్యపుత్రుఁడు గురుదత్తుఁడను వానికిచ్చితిని. అల్లుడు మా యింటనే యున్నవాఁడని పలుకుచుఁ బరిజనునంపి అతని రప్పించెను.
గురుదత్తునిఁజూచి రాజు లోపలవిస్మయముజెందచు నోహో? నీఅదృష్టము మంచిది మంచి అల్లుడే అని పలికెను. దేవా ! యీతనికి సిరిచాలగలదు. విద్యలలోఁ బ్రసిద్దిపడినవాఁడు మిక్కిలి విన్నాణి అని చెప్పగా నట్లయిన నిందూరకుండనేల? మన యాస్థానమునకు రమ్మనుము. వేతన మేర్చరచెదను. పండితగోష్ఠి నృపునకు నవశ్యకరణీయముగదా అని పలికెను.
ఆమాటలేమియు వినుపించుకొనక గురుదత్తుండు కొంతతడవందుండి అంతలో నేదియో పనికల్పించుకొని అవ్వలికిఁ బోయెను. పెద్దతడ వున్నను బద్మిని గనం బడమిఁ జింతించుచు రాజు మఱల మఱల నరల శోధించి శోధించి పరితపించచుఁ గొంత సేపటి కింటికింబోయెను. గోమినికినిఁ బద్మినిం జూచు నుపాయమేదియుం దోచి నదికాదు. కావున రాజుతో నఱిగినది. అని యెఱింగించువరకు