కాశీమజిలీకథలు/ఏడవ భాగము/122వ మజిలీ
జయసింహుని యుదంతము నేనెరుంగను. గూఢచారులవలన శత్రువులు గావించు కపటములన్నియు మనవారు తెలిసికొనుచుండిరి. మీరక్కడికి వచ్చిన అంతయుఁ దెలియఁగలదు. రండు రండు అని తొందర పెట్టుచు అందలంబుల నెక్కించి వారి నందరఁ బాతాళలోకమునకుఁ దీసికొనిపోయెను.
అని యెఱింగించి మణిసిద్ధుండు వేళ యతిక్రమించుటయు అవ్వలికథ పైమజిలీ యండిట్ల ని చెప్పఁదొడంగెను.
122 వ మజిలీ
మహాయోగికథ
మహారాజా! తమ శాసనముననుసరించి వజ్రదంష్టాది దానవవీరుల బద్దులం జేసి లంకాపురంబునంగల చెరసాల కనిపితిని. ఏలాపుత్రునిఁ బుత్రమిత్ర హిత మంత్రిసహితంబుగా నిందు బందీగృహంబునఁ బెట్టించితిని. రాక్షసులు విమత భుజంగాంగనల జోలికిఁబోకుండఁ గాపాడితిని. తలాతలముగూడ మనకు వశమైనది. కౌరవ్యునికిఁ పాతాళలోకరాజ్యంబునకుఁ బట్టముగట్టవలసి యున్నది. మనకు మహోపకారము గావించిన వీరుండింకను మూర్చనుండి లేవలేదు అతని కులశీల నామాదులు వివరముగాఁ దెలియలేదు. దేవర విమర్శింప వలయునని ప్రహస్తుండు విభీషణునకు నివేదించెను.
ఆ వెంటనే గూఢచారుండొకఁ డరుదెంచి నమస్కరించుచు దేవా! నేను సారణుండ మీయాజ్ఞవడువున నవ్వీరయోగింద్రుల చర్యల దెలిసికొని వచ్చితిని వినుండు. అయ్యోగివరుండు శత్రునగర బాహ్యోద్యానంబున వసించి హరిదాసు పాటునకును వజ్రకంఠాది దానవుల పరాభవమునకు మిక్కిలి వగచుచు శరణాగతులైన పన్నగులును దనుజులుం బరివేష్టింప హరిదాసున్న తావునకుఁబోయి యనల్పతేజంబున నిద్రించు సింగంబుభాతి మెరయునున్న యావీరకుమారుంజూచి విరక్తుండయ్యుఁ బామరుండువోలె దుఃఖించుచు అక్కటా? ఈ మహావీరుఁడెవ్వడో నేనెరుంగను. తలాతలమునకు వచ్చినది మొదలు పరిచయము గలిగినది. నాయందు వీనికి నిర్హేతుకముగా గురుభావము గలిగినది. ఈసంగరము తనకిష్టము లేకున్నను నామాట మన్నించి కావించెను. ఇట్టి పరోపకారపారీణుని నాయాయువిచ్చియైనఁ బ్రతికింపవలయును. లేకున్న నీ హత్య నాకుఁ దగులును అని తలంచుచు
ఉ. ఏను బదారువత్సరములేక గతింబొనరించు సత్తప
శ్రీనయసిద్దింజెంది విలసిల్లెడి దేనిఁ బరోపకార సం
ధాస పరుండనేనిఁ బరదార పరద్రవిణాభిలాషలం
బూనినవాఁడనేనిఁ నృపపుత్రుఁ డితండు నిరామయుండగున్.
అని పలికినంత అక్కుమార శేఖరుండు నిద్రించి మేల్కొనినట్టు లేచి కన్నులు నులిమికొనుచు అయ్యోగికి నమస్కరించెను.
ఆమాటవిని విభీషణుండు గుండెలు తడబడ దద్దరిల్లుచు నయ్యో ప్రవస్తా! ఆ వీరుండు మూర్ఛనుండి లేచెనఁట ఇఁక మనము గాచికొనవలయు నేమని విజయమునకు విపరీతము గలుగక మానదు. వాని ముందర మనము నిలువఁజాలము అయ్యోగి సత్తముని తపో మహత్వమున వానికట్టి సత్వము గలిగినది. దయాసత్య విహీనులైన దుర్మతుల కయ్యతి యుపకృతి జేయుచున్నాడేమి? మనముపోయి యాతని నాశ్రయింతమా! మనవీరుండు లేచు నుపాయమేదేనింగలదా! ఇప్పుడేమి జేయఁదగినదియో యాలోచింపుమని పలికిన విని ప్రహస్తుండు దేవా! వాఁడు దేవదాన వాజేయుండగుట నిక్కవము. వానికి మనవీరుఁడే తగినవాడు. యోగి వానిం బ్రతికించెను. దేవర వీనిం బ్రతికింపవలయును. అయినను దరువాత వృత్తాంతమువిని కర్తవ్యమాలో చింతము సారణా! అందు తరువాత నేమి జరిగినదియో చెప్పు మనుటయు వాడిట్లనియె.
దేవా! దేవరమాట కడ్డుజెప్పిన గోపింతురని యూరకుంటిని అందులకై మనమేమియుఁ దొందరపడవలసిన పనిలేదు వినుండు
అట్లు లేచిన యాహరిదాసుం గ్రుచ్చియెత్తి అయ్యోగి సత్తముఁడు కుమారా మన ప్రయత్నమంతయు రిత్తవోయినది. మనలను శరణుజొచ్చినవారలుశత్రుహస్తగతులైర. నీతోఁబోరినవీరుఁ డెవ్వఁడు వత్సా ! చెప్పుమని అడిగిన నతండు దీనస్వరముతోఁ నిట్లనియె.
తండ్రీ! నేను మహాపాపాత్ముండ నావంటికృతఘ్ను డెందును లేడు. పెంచిన బరిభవించితిని నాకు నిష్కృతిగలదా? అయ్యయో? నా నిమిత్తమై ఈ రాజపుత్రిక యెట్టియిక్కట్టు జెందుచున్నదో చూడుఁడు నావృత్తాంత మెవ్వరికిం జెప్పవలదని మా తల్లి శాసించుటచే మీకెఱింగించితి కాను. ఇఁక దాచినం బ్రయోజనంబులేదు. నేను విక్రమార్కుని మనుఁమడగు విజయభాన్కరునికిఁ గుమారుండ మాతల్లి పేరు కలభాషిణి నేను గర్భస్థుండనై యున్నపుడు రాక్షసుండొకఁడు భూసురవేషంబునఁ జనుదెంచి మా తల్లిదండ్రుల నెత్తి కొని పోయెను. మాతండ్రి నేమిజేసెనో దెలియదు. నేను బుట్టిన నెలలోపుగనే యెట్లో కౌరవ్యుని యింటికిఁ జేరితిని. ఆ దంపతులు నన్నత్యంతవాత్సల్యంబునం బెంచి విద్యలం గరిపి పెద్దవానింజేసిరి. తేజోవతి నన్నుఁ బెండ్లి యాడుటకు నిశ్చయించుకొన్నది. అందులకే యీ తగవు వచ్చినది. పారిజాతుని ప్రోత్సాహమున నే నిద్రించుచుండ నన్నుఁగట్టి తలాతలంబునఁ బడవై చిరి.
అదిఅంతయు నెఱింగియే మీతోఁ నాడినమాట దాటుట తప్పని యీయుద్ధము జేసితిని. ప్రతివీరుండు చదివిన పద్యమువిని నాకు సోదరుండట్ల తోచుచున్నది. భాతృవధయు, మిత్రవథయు నన్ను బాధింపకమానవు. విశ్వాసఘాతుపాతక మన్నింటికంటె బెద్దది మహా పుణ్యాత్ముఁడై న విభీషణుని మూర్ఛ నొందించిన నా దురితమునకుఁ బరిమితిగలదా? మహాత్మా ! నేనన్ని గతులఁబతితుండనై తిని. బంధువులకు వెలియైతిని తేజోవతి నేమొగముతోఁ జూడగందును. ఇఁక నాకు సంగరముతో బనిలేదు. మీ పదములమ్రోలఁ బ్రాయోపవిష్ణుండనై ప్రాణములు వదలెద ననుజ్ఞ యిండు” అని అడుగుల౦బడి వేడుకొనుచున్నాఁడు. ఇంతవట్టు చూచివచ్చితిని. వాఁడే జయసింహుఁడు ఇఁక పోరుసల్పఁడు వెరవకుఁడు అని యెఱింగించె.
ఆకథవిని విభీషణుండు ఏమీ? వాఁడు జయసింహుఁడా ఔరా ! వాడెంత బలవంతుఁడు ఎట్టి సత్యసంథుఁడు ఇప్పటికి నా ప్రాణములు గూటఁబడినవి. దేవాసురుల యుద్ధములనేకములు జూచితినికాని వీనివంటి వీరుం జూచియెఱుంగను. ఈ శుభవార్త నంతఃపురకాంతల కెరంగించిరండు. మనమందఱము పోయి యాయోగిం బ్రార్థింతము మన వీరునిఁగూడ బ్రతికింపఁగలడు అని పలికి ప్రహస్తాదిమంత్రులతోఁ గూడికొని యా యుద్యానవనమునకఱిగెను.
అందయ్యోగీంద్రుండు జయసింహునిఁ దొడలపై నిడుకొనియెద్డియో ముచ్చటింపుచుండెను.
తన దర్శనార్థమైన విభీషణుఁడు వచ్చినాడని విని యాయోగి యట్టెలేచియెదురు వోయి నమస్కరించుచు నిట్లు స్తుతియించెను.
సీ. ధరణిశ్రీరామావతార తారకమూర్తి
గన్నులారఁగన్న పావనుడఁవీవు
ఖలులైన పొలనుఁ డిండుల నెల్ల వరతపో
ధనులఁ గావించిన ఘనుఁడ వీవు
హరిపాద కమల సేవా యత్తపృధు చిత్త
పరమభాగవత శేఖరుఁడ వీవు
బలిమృకండు తనూజపవనాత్మజుల మించి
చెలువొందు చిరకాల జీవివీవు
గీ. నిన్నుఁజూడగంటి నేను ధన్యుఁడ నంటి
వసుధలేడు నాదువంటి సుకృతి
కావుమయ్య పాద కమలంబులను నాశి
రంబునందు మోపి రాక్షసేంద్ర !
క. అనఘా ! జననంబున కే
దనుజుండవు గాని నితాంతతపశ్శాల
తనియత మానవ శుద్దికి
నెనవత్తురె యెట్టి తాపసేశ్వరులై నన్.
అట్టి నిన్నుఁ బ్రత్యక్షముగాఁ జూచితిమి మీ వంటి పుణ్యాత్ములు లేరని స్తోత్రములుజేసిన విని వీభీషణుండు అతనికి నమస్కరించుచు మహాత్మా! నీవద్భుత ప్రభావసంపన్నుఁడవని నీ చరిత్రములవలనఁ దెల్లమగుచున్నది. నీ తపస్సామర్థ్యంబుననే దుర్బలులైన రక్కసులుకు గలిగి విజయమందిరి. నీవు తపోధనుండవయ్యు నసాధువులగు యాతుధానుల కేమిటి కుపకారము గావించితివి ? నీవా తలాతలంబున కెట్లు వచ్చితివి? నీవృత్తాంతము విన వేడుకయగుచున్నది. మఱియు మీ వీరుండు కౌరవ్యునిచేఁ జంపబడినవాఁడే ? వానిం బ్రతికించినట్లే మా వీరునిఁ గూడఁ బ్రతికింపరా? అని ప్రార్థించిన విని యా యోగీంద్రుఁ డిట్లనియె.
దానవేంద్రా ! నా వృత్తాంత మింతవఱకుఁ గోప్యము జేసితిని. విష్ణుభక్తుండవగు నీ కడ నసత్యములాడరాదు. వినుము నేను విజయభాస్కరుండనువాఁడ విక్రమాదిత్యుని మనుమఁడనిక్షేపము నెపంబున భూసుర వేషముతో నొక రాక్షసుఁడు భార్యతోఁ గూడ నన్నెత్తికొని వచ్చి నన్నీ తలాతలంబునం బెట్టైను. అది ప్రారబ్దముగాఁ దలంచి యెవ్వరిని నిందింపక రాక్షసపీడితుండనై కొంతకాల మందుంటిని. రాక్షసులు నాకెన్ని యేని బాధలు గావించిరి. దైవవశంబున నా బాధలు నన్నంట లేదు. పిమ్మట వారికి నాయందు భక్తి విశ్వాసములు గలిగినవి గురవుగా నెంచి నన్నుఁ బూజించుచుండిరి. అందు నేను దపంబు గావింపుచుంటిని. మఱియొక నాఁ డీకుమారుని యొడలెల్లఁ గట్టించి పారిజాతుండు తలాతలంబునఁ బడద్రోయించెనఁట.
వీ డందుగల రక్కసులనెల్ల నుక్కుమాపి పీడించుచు మన్నియోగంబున శాంతుడై యందుఁ గొన్ని దినంబులు వసించెను. వజ్రకంఠుని యాశ్రయంబున నిక్కపటంబు దెలియఁక నేనే వీనిని యుద్ధంబునకుఁ బొమ్మంటిని. ఈ జయసింహుఁడు నాకుమారుండు కలభాషిణీ పుత్రుండు. మీ అనుగ్రహంబున నిందు గలిసికొంటిమి కలభాషిణి మీ యొద్దనున్నదని వింటి యీ జయసింహుడు తన్నుఁ బోషించినవారి బరిభవించితినని దుఃఖించుచుఁ బ్రాణత్యాగము జేసికొనఁబూనుచున్నాఁడు అందుల గుణదోషంబుల నిరూపించి వీరికిఁ బ్రాయశ్చిత్తం బెఱింగింపుము. నీ కంటె ధర్మాధర్మ వివేచనము సేయ మఱియొకనికి సమర్ధత లేదు. అని పలికిన విని విభీషణుండు పులకితగాత్రుండై యిట్లనియె.
ఒహోహో ? నేఁడెట్టి సుదినము. నా చిరకాల జీవితమునకు సాద్గుణ్య మిప్పటికిఁ గలిగినది. మహాపుణ్యపురుషుల మిమ్ము బొడగంటిని. మీ తాతగారి సాహస వితరణాది గుణ గుణంబులు వియచ్చరులు పొగడుచుండఁ బెక్కుసారులు వింటిని. మీ జయసింహుడు గావించినపని త్రిలోక వీరలోక సంస్తుత్యమై యొప్పుచున్నది. ఇట్టి సత్యసంధు నెందునుం జూచి యెఱుంగను. గురువచనంబునందలి గౌరవంబునం జేసి తన కత్యంత ద్రోహుండైన శత్రువుపక్షము వహించి ప్రాణబంధువుల కపకారము గావించెను. ఇట్టి సౌజన్యనిధి యెందుఁగలఁడు. అని అతని సుగుణంబులఁ గైవారము సేయుచు వారిరువుర గౌరవ్యుని మందిరమునకు రమ్మని ప్రార్థించెను.
జయసింహుఁడు సిగ్గుపడుచుఁ దన్నఁ దప్పుజేసిన వానిఁగాఁ దలంచుకొనుచు, గౌరవ్యుని యింటికి వచ్చుటకు సమ్మతింపడయ్యెను. అప్పు డాలోచించి విభీషణుఁడు తమ వీరలనందల మెక్కించి అక్క డకుఁ దీసికొనిరమ్మని నిరూపించటయు దూతలు వోయి వానిం దీసికొనివచ్చిరి.
విజయభాస్కరుఁడు వాని యాకారలక్షణంబులు పరిక్షించి వీఁడు హేమప్రభ కుమారుండాయని యాలోచించుచుండెను.
ఆకారసాదృశ్యము జూచి యిరువురు అన్నదమ్ములని చూపఱులు నిశ్చయించిరి. జయసింహుఁడు సహోదర భావంబున వానిపైబడి విలపించుచుండెను. అప్పుడు విభీషణ ప్రోత్సాహంబున విజయభాస్కరుఁడా కుమారుని మేను నివురుచు
క. మాతాత విక్రమార్కుడు
పూతచరిత్రుండు ధర్మబుద్ధి వితరణ
ప్రీతుండై త్రిభువన వి
ఖ్యాతుండగు నేని వీఁడనామయుఁడగుతన్.
అని పలికినంత వీరసింహుండు మహావీరా ! నిలు. నిలు. పోకు పోకు. మని పలుకుచు దిగ్గున లేచెను. అంత జయసింహుం డతనింగౌఁగలించుకొని అన్నా ! నేనిందే యుంటిని నేను శత్రుండగాను. మన మన్నదమ్ములము ఎఱుంగక యొరు లకై పోరాడి మూర్ఛ మునింగితిమి నీవు జదివిన పద్యమువలన నీవు నాకు సహోదరుఁడవని తెలిసికొంటిని. నీవు హేమప్రభ కుమారుఁడవని తలంచుచుంటిమి. ఇతఁడే మనజనకుఁడు విజయభాస్కరుఁడు. కనువిచ్చి చూడుము. నీ వెట్టు వచ్చితివి ? నీ వృత్తాంత మెఱింగింపుమని పలుకుచుఁ దన కథ యెఱింగించిన విని వీరసింహుఁడు విభ్రాంతుండై కొంతసేపు సంతోషము పట్టజాలక వివశుండై యెట్టకేలకు దెప్పరిల్లి తండ్రికి నమస్కరించి యతనిం గౌఁగలించుకొనుచు నిట్లనియె.
అన్నన్నా ! విధిపరిపాకము యెంతచోద్యమైనది తేజోవతివలన నీ వృత్తాంత మంతయును వింటిని. ఆ చిన్నది నీ నిమిత్తమై పడిన దుఃఖమునకు మేరలేదు గదా? అట్టివారిపై గత్తిగట్టితివి. అది వీర ధర్మము. నీ పని యెఱింగిన వారింత చింతిల్లకపోవుదురు. పాపమా కౌరవ్యుఁడు కొన్నిదినములు శత్రువులకు లొంగియుండెంగదా ? మన తండ్రిగారి శాంతమే యింత వింత గలుగఁజేసినది. వారు దలంచుకొనినఁ దలాతలవాసులు విజృంభింతురా? పై పెచ్చు వారికే వుపకారము జేయించిరి. దుర్జనుల కుపకారము జేయుటచే సుజనులకుఁ బీడ గలుగుచున్నది. అక్కటా ! దండ్రీ ! నీ వొక్కండవు దిక్కు మాలి పాపుల మధ్యమున నాతలాతలమున నిన్నినాళ్ళెందులకు వసించితివి. నీవె తలంచిన లోకములు తలక్రిందులుకావా? అని పలుకుచుఁ దాను జనించినది మొదలు నాఁటి తుదదనక జరిగిన కథ యంతియు నెఱింగించెను.
ఎల్లరు విస్మయము జెందిరి. విజయభాస్కరుం డిరువురకుమారుల నక్కునం జేర్చుకొని ముద్దువెట్టుకొనుచు వత్సలారా ! మనమెందులకును స్వతంత్రులము గాము. అంతయు దైవమే చేయించుచుండును. కర్మానుసారముగా బుద్ది బొడముచుండును. నే నప్పుడే యా రక్కసుని కంఠము పిసికినచో నింతకథ యెట్లు జరుగును. అందులకే కలభాషిణి బోధించుచున్నను నాకట్టిబుద్ధి పుట్టినదికాదు. ఈ మహానుభావుని దర్శనము మానవుల కెవ్వరకేని దొరుకునా ? మన పురాకృతము పండుటచే లభించినది. ఆరక్తాక్షుం డీరూపమున మన కుపకారి యయ్యెను. లేకున్నఁ గూపకూర్మమువలె మన మింటియొద్దనేయందుము గదా. దైవ మనుకూలుఁడయ్యె నేని అపకార ముపకారమగును. ప్రతికూలుఁడైనచో నుపకార మపకారమగును అని పెద్దగా నుపన్యసించెను.
అంతకుఁ బూర్వ మంతఃపుర కాంతలతో వచ్చి యాసంవాద మాలించుచున్న కలభాషిణి తటాలున వచ్చి హా! ప్రాణేశ్వరా! అని పలుకుచు భర్త పాద౦బులంబడి దుఃఖించినది. అతండు లేవనెత్తి గారవింపుచు, బ్రేయసీ ! విచారింపకుము. నీవు కౌరవ్యునింట బిడ్డతోవసించి కాలక్షేపము జేసితిని. నీయుదంత మెఱింగితిని. దైవ మిప్పటి కనుకూలుఁడయ్యెను. మనకు మానవదుర్లభమైన లంకాధిపతి దర్శనమైనది మఱియుం బాతాళలోకము మర్త్యులకుఁజూడశక్యమైనదియా ? ఈ పయనములో మన కపూర్వవస్తు సందర్శనలాభము గలిగినది రక్తాక్షు డే మనకీ యుపకారము గావించెనని పలికి యూరడించెను.
అప్పుడు విభీషణుండు మహారాజపుత్రా ! నేసు రాత్రించరుల నరుల బాధ పెట్టకుంట శిక్షింప నియమించియే యుంటివి వజ్రకంఠుని ప్రోత్సాహమున సముద్ర మధ్య గృహంబుననున్న హేమప్రభను దీసికొని వెళ్ళుటకు తదనుచరుండైన రక్తాక్షుం డరుదెంచి యందాసుందరిం గానక నీవు దీసికొనిపోయినవిధం బెఱింగి కోపించి తొలుతఁ దన దూతల దీర్ఘదంతశూలసఖులను వారు నిన్నుఁ గట్టి తీసికొనిరమ్మని నీయొద్ద కనిపెనఁట భవదీయ ద్వారపాలకుండైన భేతాళుండు కోటలోఁ బ్రవేశించు చుండ వారిరువురం బట్టికొని దీర్ఘదంతునిదంతం బూడబెరికి శూరనఖుని చేతులు విరచిపాదంబులం బట్టికొని గిరగిరంద్రిప్పి విసిరి పారవైచెనఁట.
వాండ్ర పరిభవము జూచి రక్తాక్షుండు భేతాళునకు వెరచి బ్రాహ్మణవేషంబున నీయొద్దకువచ్చి కోటలోనికి రాక మాయజేసి మిమ్ముఁ తీసికొనివెళ్ళెను. ఆకథ మొన్ననే నాకు మాదూతలు నివేదించిరి హేమప్రభాపుత్రుఁడు మాకుఁ దోడుపడి యుపకారముగావించెను . హేమప్రభ రాక్షసవంశ సంజాతయేకావున మాకుఁ జుట్టమైనది. నీ యిద్ధరి పుత్రులతో వచ్చి మాలంకాపట్టణము పాలింపుము. నేను బెద్ద వాఁడనైతిని సామర్థ్యములేదు. ఉన్నవారి పాలనము సమంజసము కాకపోవుటచేతనే మీకీబాధ గలిగినది అని ప్రార్థించుచుండగనే కౌరవ్యుఁడు సబంధుకముగా వచ్చి విజయభాస్కరుని పాదంబులంబడి యిట్లనియె.
ఆర్యా ! నీభార్యయుఁ బుత్రుఁడును మాయింటవసించి మమ్ముఁ గృతార్థులఁగావించిరి, ఎఱుఁగక వారి నేమేని న్యూనతపరచితిమేమో క్షమింపవేడుచున్నాను. నీవును మాచుట్టరికము తెలియక యేలాపుత్రునకు సహాయము జేసితివి. నీకుమారుం డెఱింగియు ధర్మమునకై పోరాడెను. తొల్లినాగదౌహిత్రుండగు బభ్రువాహనుఁడు తండ్రితోఁ బోరలేదా ? అది వీరథర్మము ? అందుల కతండు సిగ్గుపడుచున్నాడని వింటిని. ఆ పనియే వానికీర్తికి మెఱుఁగు బెట్టుచున్నది. మా తేజోవతి వానిని వరించినది. కావున పాతాళలోకరాజ్యముతోఁ గూడ మాపిల్లం బరిగ్రహింప నీపుత్రుండు పాత్రుండై యున్నవాఁడని కోరుకొనియె
అప్పుడు విజయభాస్కరుఁడు కౌరవ్యుని మిక్కిలి స్తుతిజేయుచు తండ్రీ నీకతంబున భార్యాపుత్రులు బ్రతికిరి - నీయట్టి హితుండు నాకుఁ గలడా ? నీయుపకార మెన్నటికిని మఱువఁ దగినదియా ? యావజ్జీము నీకుఁ గృతఁజ్ఞుఁడనై యుండెదను నీకు నేను జేసిన ఉపకారము మరువుమని ప్రార్థించెను.
అప్పుడు కౌరవ్యుఁడు వారినెల్ల బ్రార్దించి వాహనంబు లెక్కించి తన రాజధానికిఁ దీసికొని పోయెను. అందుఁ బద్మావతి యంతఃపురంబున దనుజపన్నగ కాంతలతోఁ గూడికొని వీరసింహ జయసింహుల దీసికొనిరమ్మని పరిచారకుల నంపినది. జయసింహుం డంతఃపురమున కఱుగుటకు సిగ్గుపడుచుండ వీరసింహుఁడు అన్నా? వెరచెదవేమిటి పోదమురమ్ము. ఆమె నిన్నుఁ బెంచినదికాదా! తేజోవతి నీకు సహాధ్యాయిని పదపద యని పలుకుచు నతని వెంటఁబెట్టికొని శుద్ధాంతమునకరిగెను. అయ్యంతఃపురము వింతగా నలంకరింపబడి యున్నది. తదీయ శోభావిశేషములు వీరసింహుని హృదయంబునకు విస్మయము గలుగఁజేసినవి.
నాగకాంతలు వారినిరువురఁ జెరియొక రత్నపీఠంబునం గూర్చుండంబెట్టి స్తుతిగీతంబులం బాడుచు మంగళహారతులిచ్చిరి.
అప్పుడు తేజోవతి పుష్పమాలికాహస్తయై అల్లనతగ్గి వెనుకనొదిగి నడుచుచు జయసింహుని దాపున నిలువంబడి అమ్మా ? యీతండేనా మన జయసింహుండు ! వీరి పరాక్రమమేగదా మనల నందఱ లంకాపురంబు బ్రవేశ పెట్టినది అందులకు వీరి కెద్దియేని గానుక లీయవలయుంగదా? ఇదిగోదీనితోఁ గూడ మదీయహృదయం బర్పించుచున్నదాననని పరిహాసమాడుచు నతని మెడలోఁ బుష్పమాలికవైచినది.
అతండు సిగ్గుపడుచు నౌను నేను జేసిన పని తప్పే మీయింటఁ గుడిచి మీకే యపకారముగావించితి నా యపరాధము సైరింపుమని పద్మావతి పాదంబులంబడి నమస్కరించెను. ఆమె గ్రుచ్చి యెత్తి బాబూ! తేజోవతి నిన్నుఁ బరిహాసమాడినది అందులకుఁ దగినమాటాడక వగచెదవేమిటికి? నీవు జేసిన పనికెల్లరు మెచ్చుకొనుచున్నారు. సంతోషముతోనే తేజోవతి యట్ల నుచున్నది లెమ్ము లెమ్ము. తేజోవతి మెడలో నీపూఁదామము వై పుము. అని మరియొక మాలిక యందిచ్చినది.
అతండందికొని తేజోవతీ! తప్పుఁజేసితిని క్షమింపుము యిదియే క్షమార్చణము అని పలుకుచు నాపుష్పదామంబా కామినీమణిమెడలోవై చెను. అప్పుడందున్న పన్నగకాంతలెల్ల వారిపైఁ బుష్పవర్షము గురిపించిరి.
పిమ్మటఁ జామరిక లేచి యువతులారా? యీ జయసింహుడు మనకు భయ ప్రదుడైనను దేజోవతి హృదయమిచ్చి యర్చించినది. అభయప్రదుఁడైన యీవీరసింహునెట్లు పూజింపవలయునో తెలియకున్నది. తండ్రితాతల కుపకారము గావిం చిన వీని నర్చించుటకు రాక్షసరాజపుత్రిక యగు నీచంపక యామోదించుచున్నది. అని పలుకుచు అవ్వనితను నియోగించినది.
అప్పుడు చంపకలేచి పుష్పమాలంబూని వీరసింహుని దాపునకుబోయి ఆర్యా ! నీవదృశ్యుండవై మాయంతఃపురమునకు వచ్చి మా హృదయంబు హరించినచోరుండవు నిన్ను బద్ధుంజేయవలసినదియేకాని మాపక్షము వహించి పోరిమాకు విజయము గలుగఁజేసితివి కావున గానుకగా నీ మాలిక నర్పించుచుంటి మదీయ చిత్తం బిదివరకే నీయధీనమైనది కై కొనుమని పలుకుచు మెడలో వైచిరి.
అతండు వేరొకమాలికనందుకొని యామె మెడలో వైచెను. స్త్రీలు పూవుల జల్లిరి. జయ జయ ధ్వానములతో దదీయ విజయగీతములతో సభముగిసినది.
మరునాఁడు విభీషణుఁడు సపుత్రకముగా నేలాపుత్రు రప్పించి నీవు రాజ్యార్హుండవు గావని అతండు గావించిన తప్పులన్నియు నిరూపించి నిందించుచుఁ గొన్ని గ్రామంబులు మాత్ర మిప్పించి నాగరాజ్యమునకెల్లఁ గౌరవ్యునే బట్టభద్రుం గావించెను. కౌరవ్యుఁడు లంకాధిపతి అనుమతివడసి శుభముహూర్తంబునఁ దేజోవతిని జయసింహునకిచ్చి వివాహము గావించెను. పాతాళలోక విశేషములు జూచుచుఁ బది దినములు వారందుండిరి.
తరువాత విభీషణుఁడు వారినెల్ల లంకాపురంబునకు సగౌరవముగాఁ దీసికొనిపోయి మహావైభవముతో వీరసింహునకుఁ జంపక నిచ్చి వివాహము గావించెను.
అంత
మ. జయసింహుఁడును వీరసింహుఁడును యోషారత్న ముల్మాసనఁ
ప్రియముల్సేయఁగ వారిఁ గూడి మదనక్రీడాపయోరాశిన
వ్యయసౌఖ్యంబున దేలి యాడిరి మనోజ్ఞా రామ కేళీళిలో
చ్చయవాపీతటినీతటస్థలుల స్వేచ్ఛాయుక్త సంచారులై.
అట్లు వారు పరమానందభరితులై లంకాపట్టణ విశేషంబులం జూచుచుఁ గొన్ని దినంబులందు వసించిరి. వీరసింహుఁడు మత్స్యంబువలనఁ దనకు లభించిన రత్నంబు పారిజాతునిదని యెఱింగి యమ్మణి నతనిం బుచ్చుకొమ్మని ప్రార్థించెను. కానియతం డంగికరింపలేదు.
పిమ్మట స్వదేశదర్శనలాలసుండైని విజయభాస్కరుని యభిలాష యెఱింగి విభీషణుండు విమానశాల నుండి వారినిమిత్త మొక విమానము దెప్పించి యనర్ఘ కాంచనమణీ వస్తువిశేషంబు లెన్నియేని వారికిచ్చి తేజోవతి చంపకలకు దాసీ సహస్రము లరణమిచ్చి యందఱ విమాన మెక్కించి కుమారునితోఁ దానుగూడ నెక్కి యర్దయామములో నుజ్జయినీపురంబు బ్రవేశింప జేసెను. తొల్లిపుష్పకారూఢుండై చనుదెంచిన శ్రీరాము౦డువోలెఁ బట్టణమునకు సతీపతి యుక్తముగా జనుదెంచిన విజయభాస్కరుని వృత్తాంతము విని పౌరలాశ్చర్య మందుచు గుంపులుగా వచ్చి యమ్మహారాజు కుటుంబమును జూడఁ దొడంగిరి.
వియోగ చింతాసాగరంబున మునిగియున్న హేమప్రభం గౌగలించుకొని బుజ్జగింపుచు విజయభాస్కరుఁ డామెకునుఁ దల్లికిని బరమానందము గలుగఁ జేసెను.
అట్లు విభీషణుఁడు వారినెల్ల స్వస్థానమునఁ బ్రవేశపెట్టి జయసింహ వీరసింహులఁ భార్యలతోఁగూడ నప్పు డప్పుడు తన పట్టణంబునకు వచ్చునట్లు నియమించి యొక విమానమర్పించి కుమారునితోఁగూడ నిజనివాసమున కరిగెను.
క. గిరియెక్కిపడిన ధర సా
గరమున మునింగినను బావకముజొచ్చిన భీ
కర ఫణులతోడ నాడిన
మరణకాలమురాదు మహినెవ్వరకిన్.
అనుపద్యమును దన దేశమెల్ల జాటింపఁజే యుచుఁ దాను బోయివచ్చిన వృత్తాంతము ప్రకటించి విజయభాస్కరుం డిరువుర పుత్రులతోఁ భార్యలతోఁబుడమిఁ బెద్దకాలము రాజ్యము గావించెను.
అని యెఱింగించి మణిసిద్ధుండు వత్సా ! విచిత్ర కధామనోహరంబగు విజయభాస్కరుని చరిత్రము జదివినను విన్నను పవిత్రుండై యభీష్టకామంబులం బొందఁ గలఁడు సుమీ! యని వివరించెను. శిష్యుండాకథవిని ప్రహర్షసాగరమున మునుఁగుచు నావృత్తాంతమే స్మరించుకొనుచు గురునితోఁ గూడ నవ్వలి మజిలీ చేరెను.
123 వ మజిలీ.
గురుదత్తుని కథ
ఉ. భూపతిజంపితి న్మగఁడు భూరి భుజంగముచేత జచ్చెఁ బై
నాపదజెందిచెంది యుదయార్కుని పట్టణమేగి వేశ్యనై
పాపము గట్టికొంటినటఁ బట్టి విటత్వము బూనిరాఁగ సం
తాపముజెంది యగ్గిఁబడి దగ్దముగా కిటు గొల్లభామనై
యీపని కొప్పుకొంటి నృపతీ! వగపేటికిఁ జల్ల చిందినన్
గోపకుమారుండా మజిలీయందలి పట్టణవిశేషంబులం జూడఁ బోయి యొక