Jump to content

కాశీమజిలీకథలు/ఏడవ భాగము/124వ మజిలీ

వికీసోర్స్ నుండి

124 వ మజిలీ.

గోమిని కథ

అమ్మ ! మొన్న రాజుగారితో వచ్చిన గోమిని‌ అను నామె ద్వారమున నిలువం బడియున్నది మీతో ముచ్చటింప వచ్చినదఁట. అయ్యగారు లోపలికిఁ దీసికొని పొమ్మని చెప్పినారు. తీసికొనిరానా అని పరిచారిక పద్మిని నడిగినది. పద్మిని యించుక యాలోచించి అయ్యగారు సెలవిచ్చిరా ? అగును. రాజుగారిచుట్టముకాదా? రమ్మనుమని పలికినంత నదివోయి గోమినిం దీసికొనివచ్చినది.

పద్మిని దానిం గూర్చుండ నియమించినది. అదియు నమస్కరించి కూర్చుండి తానుదెచ్చిన కానుకలు ముందిడి యువతీ ! నీ అదృష్టము మాబోఁటులు కొనియాడఁ జాలరు. రూపమా! త్రిభువనజనమోహజనకము. ప్రాయమా మొదటిది బుద్దియా బృహస్పతికి వంకలు పెట్టఁగలుగునంతకటిది. విద్యలకు సరస్వతివే ధనముచే కుబేరున కప్పు పెట్టఁగలరు. ఇన్నిలక్షణము లొకచోట పట్టుట. దుర్ఘటముగదా? ఈ పట్టణమేలెడు మహారాజుభార్యకు నీగుణములలో శతాంశమైనలేదు. వట్టియెడ్డిది? యేమియుం దెలియదు. మారాజునకు సరిపడినది కాదు. రాజుమాత్రము నవరస రసికుఁడు మంచి రూపముగలవాఁడు దైవము తగినవారికిఁ దగినభార్య నీయఁడుగదా? నీవాలభ్య మనుకూలమగునా? మారాజు నీవిఖ్యాతి విని మిగుల నానందించుచున్నాఁడు. పాండిత్యముగల స్ర్రీలచరిత్రము వినిన మనరాజునకుఁ బెద్దసంతోషము. ఈ పూవులు ఫలములు నీకుఁ గానుకగా నిచ్చెను. ఈపుట్టంబులు నీకుఁ గట్టఁబంపెను. మొన్న మీయింటికి వచ్చినది మొదలు మీయందు స్నేహభావము గలిగియుండెను. అని కడు నై పుణ్యముగాఁ బలుకుచుఁ దానుదెచ్చిన వస్తువులు ముంగలఁబెట్టినది.

పద్మిని వానిం జూడక మొగమున నించుక అలుక జనింప గోమినీ ? నీదూతికాకృత్యములు నాయొద్దఁ బ్రకటింపకుము. నీస్తోత్రపాఠములకు నేను బుబదానను గాను రాజు‌ రసికుండగుటయు స్త్రీవిద్యాలాలసుండగుటయు రాజ్యతంత్రమునకు ముఖ్యాంగములు గావు. ధర్మబుద్ధిఁగలిగి ప్రజల బిడ్డలగాఁ జూచుచు దుష్ట శిక్షణంబు శిష్టరక్షణంబు సేయుట రాజధర్మము. దుర్వ్యసనాసక్తుండగు రాజు సిరి వేషవిని మడువువలె క్షీణించును. నాగుణంబు లతండు వినుతించుటకుఁ గతంబులేదు. నాకీ కానుకలంపుట భావ్యముగాదు సన్నతం డెట్లెఱుంగును. సంసారి స్త్రీ చరిత్రతో అతని కేమిపనియున్నది నాచక్కఁదనము ప్రశంసింప అతనికేమి యక్కర నాకీ కానుక లక్కరలేదు. తీసికొనిపొమ్ము ఇట్టి మాట లెన్నఁడును నాయొద్ద జెప్పకుమని పలు కుచు నాకలికి అందు నిలువక అవ్వలికిం బోయినది. అప్పుడా గోమిని సిగ్గుపడి యేమిచేయుటకుం దోచక యొక్కింత తడవు ధ్యానించి యావస్తువులందే యుంచి క్రమ్మరి అమ్మనుజపతియొద్దకుఁ బోయినది.

అతండు పదియడుగు లెదురువచ్చి చేయిపట్టుకొని యేమి జరిగినది ? అను కూలపడినదియా ? నీబుద్దిబలమునకు లోఁబడని వారుందురా ? అక్కటా ? నీయాగ మనావకాశ సమయము యుగాంతరములట్లు తోచినదికదా ? అని యాతురతతో అడిగిన నది యించుక దిగులుదోపనాపతికిట్లనియె.

దేవా ? ఆపూవుఁబోణి సామాన్యురాలుగాదు అభిలాషయున్నను దెప్పున హృదయమిచ్చినది కాదు గంభీరురాలు. స్త్రీ చిత్తము దెలిసికొనుట కడుంగడు కష్టముగదా? మీ గుణంబులు పొగడితిని. మీ రూపము వర్ణించితిని మీసరసత్వము గొనియాడితిని అన్నింటి కన్నియు వంకలే పెట్టినది కానిండు. అని నిట్టూర్పు నిగుడించిన గుండె ఝల్లుమన అమ్మనుజవల్లభుం డిట్లనియె.

గోమినీ ? నీవిట్లు తెల తెల్లపోవుచుంటివేమి ? చూచి మాటాడితివా ? యేమ న్నది అచ్చముగా నామాటలం జెప్పుమనుటయు అది జరిగిన కథయంతయుం జెప్పి నది. ఱేడు చింతించుచుండఁ దొందరపడవలదు. స్త్రీ చిత్తము క్షణమున కొకరీతి నుండును. కార్యము సాధించెదనని రాజును సమాధానపరచి పెక్కునెపములు పన్ని వారింటికి బలుమారు పోయినది కానీ పద్మిని దానిమాటలకు లోబడినదికాదు.

కొసకు వేసరి యాదాసరిది రాజునొద్దకువచ్చి దేవా ! నేనును భూమండల మంతయుం జూచితిని. కాని యిట్టి జంత నిట్టిరాగ, నిట్టిజాణ నిట్టివలంతి, నిట్టిగరాసు, నిటిప్రోఢ నెందును జూచి యెఱుంగ ఏమన్న నుఁదప్పుగా గణించి శ్లోకములు చదు వును మనకు నీతి యుపదేశించును. పెక్కేల దేవరనడవడి బాగులేదని యాక్షేపించి నది ఇఁక దానితో నెట్లు మాట్లాడుదునని చెప్పినంత యుగాంతవలాహకంబు పగిది గర్జిల్లుచు నేమీ ? యామోటుకొలముది మాకునుం దప్పలుపట్టినదిగా ? తన్ను వరించినందులకు అనుగ్రహముగాఁ దలంపక గరువముచే వెక్కిరించుచున్నదియా ? చాలుఁ జాలు. స్త్రీలు సామమునఁ జక్కఁబడరు. లోకాపవాదమునకు వెరచి యిన్ని నాళ్ళోర్చితిని. ఇఁక కాచికొనుమనుము నాక పటి సందేశ మెఱింగించి రమ్ము.

సామమున మాయేలికతోఁ గూడినఁ దోడిచేడియలలో నుత్తమురాలవై సామ్రాజ్య సౌఖ్యమనుభవింపఁగలవు. లేనిచో నిన్ను బలాత్కారముగానైననుఁ బరిభ వింపక మానఁడు నీభర్తనుఁ దల్లిదండ్రులను జెరఁబెట్టి సంపదయంతయు లాగికొ నును. పిమ్మట నీకడ్డుపడువారెవ్వరో చూతముగాక. అని నిర్భయముగాఁ జెప్పి రమ్ము. పొమ్మని పలికి ఆతండు. దానినంపెను. ఆదూతయు నిర్భయముగా నఱిగి కబురుసేయకయే పద్మినియున్న మేడకుం బోయు నాతీ! నీతో నొక రహస్యము చెప్పవలసియున్నది. యిటు రమ్మనిపలికినఁ బద్మిని చాలుఁ జాలు నీరహస్యములు నాకవసరములేదు. నీవు మాయింటికి దరుచు రావలదని చెప్పలేదా? మఱల నేమిటికి వచ్చితి వనవుఁడు నది తల్లీ! నీవు నాపైనఁ గోపింప నక్కరలేదు. ఇదియే కడపటిసందేశము. వినుము ఇఁక దాచనేల? ఆ రాజ పుత్రుఁడు నిన్ను వరించియున్నవాఁడు నీమీఁది మోహంబున నిద్రాహారములులేక కృశించి రాత్రింబగళ్ళు పరితపించుచున్నాడు. ఆతనియాపద దాటింతువేని స్త్రీలలో నీవంటి అదృష్టవంతురాలెందును లేదు. నీవతనింగూడిన నింద్రభోగము లనుభవింపఁ గలవు కాదంటివేని -


ఉ. నీదగుతల్లిఁ దండ్రి మగనిస్మరిఁగల్గిన బంధుకోటి మ
     ర్యాద యొకింతఁ జూడక రయంబున బద్దులఁజేసి మాన వి
     త్తాదికముల్‌ హరించి నినునందఱుఁ జూడఁగఁ బట్టితెచ్చి స
     మ్మోదముతోడఁ గూడునునృపుండెవ రడ్డమొచూతుమత్తరిన్‌.

మీకులంబునకెల్ల నీకతంబున ముప్పు వాటిల్లగలదని పలికినవిని అక్కలికి యులికిపడి యయ్యొడయం డట్టివాఁడు గాఁదలంచి యొక్కింత చింతించి చిఱునవ్వొ లయ నల్లన నిట్లనియె.

గోమినీ యింతదనుక భూపతి హృదయాశమేమిటికి వెల్లడించితివికావు? నీవు సందిగ్ధముగాఁ జెప్పుచుండ నెఱింగియునట్లే యుత్తరము జెప్పుచుంటిని. రాజుకోరిన సమ్మతింపని వెంగలి యెందైనంగలదా ? సిరివచ్చుండ మోకాలడ్డు పెట్టుదురా? నీగడు సుతనంబంతయు నాయెడఁ గనపరచిన హృదయమిచ్చితినికాను నేఁడు వెల్లడిదచితివి. కావున నంగీకరించితిని. నేను మగనాలినిగదా? నామగఁ డనుమానముగలవాఁడు సతతము నింటనేయుండును నీవు పలుమారు వచ్చుచుండ శంకించుచున్నాఁడు. రాజుతోఁగలిసికొనుట సామాన్యమా? మంచియుపాయ మాలోచింపవలయును. కావున నీవు నాలుగుదినములుండిరమ్ము ఉపాయము చెప్పెదనని నొడివిన విని యత్యంతసంతోషముతో దూతిక యానాతివీపు తట్టుచు నీవు మంచిజాణవగుదువు మెచ్చికొంటి నీచిత్తము దెలిసికొనలేక పోయితిని నీవు చెప్పిననాఁడే వచ్చెదనని పలు కుచు దీవించి రాజునొద్ద కఱిగినది.

గురుదత్తుఁడు రాజు తన యింటికి వచ్చుటయు దూతికను బంపుచుండుటయు లోనగు విషయములన్నియుఁ బరిశీలించి యానాఁడు గోమినియుఁ దన భార్యయు మాటలాడుచుండ గదిలోనుండి చెవియొగ్గి వినెను. యించుకదూరమగుటఁ గొన్ని మాటలు మాత్రమే వినంబడినవి. నాలుగు దినములలోరమ్ము ఉపాయము చెవ్పెదను నామగడనుమానము గల వాఁడు తరచు రావలదు అను మాటలు చెవినిఁ బడినంత నతండత్యంత చింతా క్రాంత స్వాంతుండై యిట్లుతలంచెను.

ఆహా ! స్త్రీల చేష్టితములు పలుమారు చదివియు నేల మోసపోవుచున్నాను.


అ. పడఁతినొక్కదాని విడిచి యించుట యమృ
    తంబులేదు భువి విష౦బు లేదు
    అమృతలత లతాంగి యనురాగ వతియైనఁ
    గాక మెలఁగెనేని గరళవల్లి

రాజు దీనిఁజూచి మోహించి దూతికలుఁ బంపెను. దూతిక కిట్లు చెప్పినది. ఇక దీనిం బతివ్రతగా నెట్లు నమ్మదగినది. అయ్యో పద్మినీజాతి యువతి మంత్రౌ షధములకు వశవర్తినికాదు మహా పతివ్రత యగునని కొక్కోకుఁడు చెప్పినమాట నమ్మిదీనిం బెండ్లియాడితిని దీని కపట ప్రేమలన్నియు యధార్థములని సంతసిం చుచుఁ దల్లిదండ్రుల జూడక యిందే పడియుంటిని. నావంటి మూర్ఖుఁ డెందునులేడు. తరుచు చదువుకొన్న స్త్రీలకే తెలివిగల వనితలకే చాతుర్యముగల పొలఁతులకే శృంగారలీలలయం దభిలాషగలిగి యుండును. మగవాండ్రు అట్టి పొలంతులు పన్నిన వ్యూహములోఁ బడిపోవుదురు. సామాన్య కన్యం బెండ్లి యాడిన నాకీ ముప్పు రాకపోయెడిది? ఈచెడి పె కథవినిన మాగ్రామవాస్తవ్యులెల్ల నవ్వుదురు. గదాధరుఁ డింటికిఁబోయి యింకను రాడయ్యెను. ఇప్పుడేమిచేయఁదగినది. చెప్పకుండలేచి పోవు దునా? కానిమ్ము నాలుగు దినములలో నది మరల వచ్చునుగదా? అప్పటి సంభాష ణము విని యుక్తానుసారము గావించెదనని యోచించి తత్సమయ మరయుచుండెను.

గోమిని రాజునొద్దకుఁబోయి మొగమున సంతసము వెల్లివిరియదేవా? నీయ భీష్టము దీరినది పద్మిని వశవర్తినియైనది కరటునిఁ బన్నిదములో గెలిచితిని అని సంక్షేపముగాఁ జెప్పుటయు నుబ్బుచు నతడు ఆహా ! అమృతబిందువులవలె నీపలు కులు నాచెవింబడినవిగదా? ఎట్లు వశవర్తినియైనది? ఏమన్నది ? చెప్పుము చెప్పుము. ఇదిగో ముందుగా నీకుఁ బారితోషికముగాఁ గడియ మిచ్చుచుంటినని పలికి యవ్వలయ మిచ్చుటయు నది యిట్లనియె.

దేవా ! నేనెంత శ్రమపడితిననుకొంటిరి. అబ్బా ! అదికడు జాణ విరహవేదనచేఁ గొట్టికొనుచుండియు గుట్టు తెలియనిచ్చినది కాదుగదా! నేనన్యాపదేశముగా మాట్లాడ నదియు నట్లే యుత్తరము జెప్పినది. సందేశము వెల్లడించిన ననుమోదించినది చేతిఁ జిక్కినది. తిరుగారమ్మన్నదని పలికిన నాతఁడిట్లనయె. గోమినీ ! నేననుకొనుట కాదుగాని నారూపము, నారసికత, నాయౌవనము జూచిన యువతి రసికురాలైనచో విరాళిఁజెందకుండునా! సరే కానిమ్ము ఎప్పుడు రమ్మన్నది మనపరుషోక్తులు వినలేదుగద అని యడిగిన నది స్వామీ ! చెప్పియుం జెప్పనట్లభినయించితిని నాలుగు దినములఱుగవలయునని యీవృత్తాంత మెఱింగించి నది.

మఱియు నిరూపింపఁబడిన దివసంబున గోమిని పద్మిని యింటికి వెళ్ళి మాట్లాడివచ్చి రాజుతో నిట్లనియె.

దేవా! యెల్లుండి యమవసనాఁడు రాత్రి పెరిటివైపుననున్న పశువులశాలలోనికి రమ్మన్నది. తలుపుతీసియుంచునఁట. అందుమంచము వైచునఁట ఒకరాత్రి యెట్లో కష్టపడిన దివ్యసుఖం బనుభవింపవచ్చునని చెప్పినది దీపములేని లోపము మున్ముందు తీర్చఁగలదట చాలాప్రీతిగా మాట్లాడినది అని చెప్పిన విని రాజు కానిమ్ము. ఒక్క రేయిగదా? యెట్లో కష్టపడియెదను ఒకసారి కలసిన వెంటఁబడి వచ్చునట్లు చేయనా? నాచాతుర్యము చూతువుగాక అనుచు నింకను అమవస మూడుదినములున్నదే, ఈ కాలవ్యవధి యెట్లు సహింతునో తెలియదు. ఈకష్టమంతయు దానికెప్పుడు విన్న వించెదనో, ఎప్పుడది పశ్చాత్తాపపడునో అని యుఱ్ఱూతలూగు చిత్తముతో గడియలు లెక్క పెట్టుచుండెను. నాలుగవదినంబునఁ బద్మిని దూదికతో మాట్లాడిన విషయంబు లన్నియును గురుదత్తుఁడు చెవియొగ్లి విని దారుణవిషాద మేదురహృదయుండై ఛీ! ఛీ! ఆడుజాతికి గుణముండదన్నమాట సత్యము కొక్కోకుఁడేకాక. వాత్సాయనాది మహర్షులును పద్మినీజాతియువతి యత్తమురాలని వ్రాసిరి అది సౌందర్యవిషయము గాని గుణవిషయము గాదు. స్త్రీలలోఁ బ్రతివ్రతయేలేదని చాటిచెప్పఁగలను. అన్నన్నా ! పద్మిని నాయెడజూపు నక్కవినయములునమ్మి ప్రాణపదముగాఁజూచు కొంటిని అక్కటా ! యిట్టిదే యిట్టి తుచ్చకృత్యములకు బాల్పడుచుండఁ దక్కిన వారిమాట చెప్పనేల? కానిమ్ము. అమావాస్యచర్యఁజూచి వారిద్ధరికి నామంచముమీఁదనే కడతేర్చి యింటికిఁ బోయెదనని నిశ్చయించి కత్తినూరుచుండెను.

అమావాస్యనాఁడు తెల్లవారినది మొదలు సురూపుఁడు గడియలు లెక్క పెట్టు చుండెను. పర్వదివసంబై నను క్షురకృత్యము జేయించి మీసములు దిద్దించెను. పన్నీట జలకమాడెను. అద్దము జూచుచుఁ గనుబొమ లెగురవైచుచు గోమినిం జీరి యోసీ? సూర్యరథ గమనము నేడింత మందమైనదేమి? యెంత సేపటికి ప్రొద్దు క్రుంకకున్నదే నాకే దుస్తులు సొంపుగా నుండునో చెప్పుము. అని పలుకుచుఁ బది దినుసుల నగలును, దుస్తులు ధరించి విడిచి యడుగుచుండును. గోమినియు దేనికదియే చక్కగా నున్నదని రాజును స్తుతియింపఁ దొడంగి నది. ప్రొద్దు క్రుంకినది. ఇఁక బయలు దేరుదుమా? అనుటయు నది నవ్వుచు దేవా! రాత్రి పండ్రెండు గంటలుగొట్టిన నిమిషమున నందుండవలయును. ఈలోపలఁ బోయినను, దలుపుతీయదు. వీధినిలువంబడిన నొరులుచూచి శంకింతురు. తాళుము తాళుము జాము సేపు తాళుము అని చెప్పుచుండెను.

రాజు గంటగంటకు నడుగుచునే యుండెను. పది గంటలుగొట్టినతోడనే యతనిమేనఁ గంపము జనించినది. ఇఁక నిలువలేను పదపద అని తొందర పెట్టుచు నుద్యానవనమునుండి బయలుదేరెను. రాజు గోమిని ముందుదారిఁ జూపుచుండ నీలాం బరము. మేలిముసుఁగు వైచికొని మెల్లగా నడచుచు నొరులు కనంబడిన ప్పుడు పెడకొసరిల్లుచుఁ గొంతవడికిఁ గుముదాంగదుని పెరటిగుమ్మము దాపునకుఁ బోయెను.

గోమిని ముందుగాఁబోయి తలుపు గొణ్ణెము లేక యోరగా వైచియుండుటకు సంతసించుచు లోపలికిఁబోయి చీకటిలోఁ దడిమికొనుచు మంచమున్న తావరసి చేఁతితోమంచమునుఁదట్టి మరల నీవలకువచ్చిరాజు చేయిపట్టుకొని లోపలి కిదీసికొనిపోయి మంచముపైఁ గూర్చుండఁబెట్టి నేను వాకిటనుండెద నాపడఁతి యిప్పుడే రాఁగలదని మెల్లగాఁ జెప్పి తలుపు చేరవైచి గుమ్మములోఁ గూర్చుండెను.

గురుదత్తుండు అమావాస్యనాఁడు రాత్రి ప్రొద్దుపోయిన తరువాతఁ బశువుల చావడిలోనికిఁ బోయి తలుపుగొణ్ణెము వైవకుండుటయు, మంచముపరువఁబడియుండు టయుఁ దిలకించి పద్మిని నిక్కముగా దుర్వృత్తికిఁ బూనుకొనెనని నిశ్చయించి నూరిన కత్తి మంచముప్రక్క నిడుకొని వాఁడు కపటనిద్రఁబోవఁదొడంగెను.

పద్మిని మనోహరుని గుఱ్ఱువిని మెల్లగలేచి యొక కాగితము దీసికొని దీపము వెలుగున నిలువంబడి యిట్లు వ్రాసినది.

ఓమహాజనులారా ! ఈరాజు పరస్త్రీలోలుండై మంచిచెడ్డల విచారింపక నన్నుఁజూచి మోహించి నాతల్లి దండ్రులఁ జుట్టములను నిర్బంధించి చెరసాలఁ బెట్టించి నన్ను బలాత్కారముగాఁ దీసికొనిపోయెదనని దూతికాముఖంబునఁ దెలియఁజేసి యున్నవాఁడు. బంధు పరిభవమునకును మానహానికినివెరచి యొండు తెరవుగానక యొడంబడినట్లభినయించుచు నేఁటిరాత్రి మాయింటికి రమ్మని సాంకేతిక మేర్పరచితిని. యిప్పుడీ దుష్టాత్ముని నాకౌక్షేయకంబునకుఁ బలియిచ్చి‌ మదీయపాతి వ్రత్యము గాపాడుకొంటిని ఇట్టి పాపాత్ముఁడు రాజుగా నుండుటకంటె బ్రజలకు మఱియొక యపకారములేదు. మఱియు నీ ద్రోహుని మూలమున సత్యసంధుండును దయాహృదయుండునునై తల్లి దండ్రుల ధనధాన్యములవిడిచి నాకడవసించి తన ప్రాణముకన్న నన్నెక్కుడుగాజూచు మదీయ ప్రాణనాధుని నాపత్సముద్రమున ముంచి ప్రాణముల విడుచుచుంటిని. ఓరాజబంధువులారా? ఈ కృత్యము నా మనో హరుండుగానిఁ నా తలిదండ్రులుగాని యించుకయు నెరుంగరు మీరు వారినేమియు దండింపవలదు. జన్మజన్మమునకు నాకు గురుదత్తుఁడే భర్త కావలయును. పూర్వ జన్మచరిత దురితంబునంజేసి సుగుణసంపన్నుండగునట్టి మనోహరునితో సుఖింప కుండ నిట్లు బలవన్మరణము నాకు దటస్థించినది. అందులకు నిదేనమస్కారము.

ఓ మనోహరా? గురుదత్తా? నీవు నన్నుఁ బరీక్షించి పెండ్లిఁజేసికొంటివి. నీమన్ననలచే బ్రహ్మానందము జెందుచుంటిని. తల్లిదండ్రుల విడిచి, ధనధాన్యముల విడిచి, బంధువులవిడిచి, దేశమువిడిచి, నానిమిత్తమిందు వసించితివి యిట్టినీతో సుఖిం చుటకు నాకుయోగములేకపోయినది. నాఁడు దేవతోత్సవములలోఁ నన్నుఁ జూచినది మొద లీదుర్మార్గుఁడు పంపెడు వార్తలకు మేరలేదు. మీతోఁ జెప్పిన నేమందురో యని త్రోసిపుచ్చితిని చివరకుఁ బ్రాణసంకటమైనది. నన్ను మీరు దుష్టురాలిగాఁ దలం చితిరేని‌ నాకుత్తమలోకములు గలుగవు. పుణ్యలోకమునకుఁ బోవునట్లు దీవింపుఁడు. మీకిదేకడపటి నమస్కారము ఓ తల్లి దండ్రులారా? మిమ్ము దుఃఖాంబుధిలోఁ బడివైచి యరుగుచుంటి నా కొరకు శోకింపక విరక్తిఁగలిగి పుణ్యకార్యము. లాచరిం పుడు మీకిదే నాచివరిమ్రొక్కులు అని వ్రాసి మడచి‌ యాచీటినందు విడచి వస్తువులు తీయుటకై మఱియొక గదిలోనిలికిఁబోయినది.

అదియంతయుఁ గ్రీగంటఁ జూచుచున్న గురుదత్తుఁడు అహా ! రంకుమగని కేదియో చీటి వ్రాసినది. చూచెదంగాకయని తలంచి మెల్లనలేచి యాచీటిని సం గ్రహించిమరల మంచముపైఁ బండుకొని యెఱుగనివానివలెనిద్రనభినయించుచుండెను.

అంతలోఁ బద్మిని‌ వస్తువులన్నియుం దీసి నడుము బిగించి కత్తి చేతంబూని ప్రాణనాధుని మంచమునకు మూడు ప్రదక్షిణములుజేసి కన్నీటిధారం బాదంబులు దడియమ్రొక్కుచుఁ దానువ్రాసిన చీటినందుఁగానక నలుమూలలు వెదికివెదకి యెందుంచినదిజ్ఞాపకము లేక తిరుగుచుండెను. ఇంతయేల మఱియొకచీటి వ్రాసెదనని తలంచి యక్కా౦త ఇంకొకగదిలోఁ గూర్చుండి వ్రాయుచుండెను.

ఆయవకాశము జూచి గురుదత్తుండా చీటిని దీపము వెలుగునఁ జదివెను. మేను ఝల్లున్నది. గుండెలు కొట్టుకొనఁ దొడంగినవి మనసు నీరైనది. అదివరకా మదిరాక్షి పైగల కోపమంతయు నటమటపైపోవ నిండించిన వాక్యములు దలంచికొని నేలం జతికిలపడి యేడువఁదొడంగెను. అంతలోఁదొందర పుట్టినది. అగదిలోనికింబోయి చూచినంత నామె అందు గనఁబడలేదు. వేగముగా మేడమెట్లుదిగి పశువులసాలకడ కరిగెను. అప్పుడు యాచిన్నది రాజుచెంత కరిగినది. ఆమె నందుచూచి గురుదత్తుఁడు కాచికొనియుండెను.

పద్మిని పాదధ్వని విని రాజు తొందరఁజెందు డెందముతో సుందరీ! యిందు రమ్ము. నేనిందు వేచియుంటి గడియ యుగమగుచున్నది. అనిమెల్లగాఁ బిలిచెను.

పద్మిని దాపునకుఁబోయి తడుముచు నెడమచేతితో వానిశిరము పట్టుకొని వంచి గురిచూచి కుడిచేతనున్న పెద్దకత్తితో వానికంఠముపై పెద్దవ్రేటు వైచినది. హా ! చచ్చితిని. హా ! చచ్చితిని. అని వికృతస్వరముతోఁబలికి యాపాపాత్ముఁడు గిలగిల కొట్టికొని ప్రాణములు విడిచెను. అయ్యార్తధ్వనివిని గోమిని భయపడుచుఁ దలుపుతీసికొని లోపలికి వచ్చి దేవా? దేవా? అనిపిలిచి అతండు కొట్టుకొనుచుండఁ బరికించి తన్నుఁగూడ జంపుదురని వెరచికాలికొలఁదిపారి యింటికిం బోయినది.

గురుదత్తుఁడు భార్యచేసిన సాహసము కన్నులారా చూచి వెరగుపడుచుఁ దటా లునవచ్చి కౌఁగిటవానిపట్టి కత్తిలాగికొని ప్రమూదము ప్రమాదము చేసితివని గద్గదస్వరముతోఁ బలికెను‌.

భర్తంగురుతుపట్టి యాశెట్టిపట్టి అయ్యో మీరిక్కడి కెట్లువచ్చితిరి? నాయుద్య మమున కంతరాయము గావించితిరేల? విడువుఁడు విడువుఁడు. ఈక్రూరుని శిరంబు ముట్టితి జీవనముల విడిచెదనని పలికిన ఆతఁడిట్లనియె.

ప్రేయసీ! ఆత్మహత్య మహాపాతకముగాదా? యిట్టి కృత్యమున కుద్యోగించితి వేల? వీఁడెవ్వఁడు? ఇక్కడికెట్లువచ్చెను. వీని నేమిటికిఁ జంపితివని యెరుఁగనివాడుఁ వలె నడిగిన జరిగిన కథ అంతయుఁ బూసగ్రుచ్చినట్లు చెప్పి అప్పుడంతి తన్ను విడు వుఁడని బ్రతిమాలినది.

అతండు నవ్వుచుఁ బువ్వుఁబోణీ? లోకకంటకుండగు నీ రాజుంజంపి యుప కారము జేసితివి. ఇది నీకు పాపము కానేరదు. కీర్తికే హేతువగును. తొల్లి ద్రౌపది సింహబలుని జంపించలేదా? దాననామె కేమిపాపమువచ్చినది. ఉడుగుము. పదపద అని పలికిన నక్కలికి నాధా! మనమీతనిని జంపినవార్త విదితముకాకమానదు. రాజ పురషులు మనల విడుతురా? నేనిందులకు బరియయ్యెద. మీరు సుఖింపవచ్చునని చెప్పిన నతండు చాలు, జాలు. నీవులేని సుఖము నేననుభవింతునా? భయము విడువుము. మనము దేశాంతరమరిగి సుఖింతము అని యేమేమో యుపాయములం జెప్పెను. ఆమెయు నంగీకరించినది.

అప్పు డిద్దరు రాచపీనుగను సాయముబట్టి వీధిలో దూరముగా బారవైచిరి. ఆపుణ్య దంపతు లిరువురు తెల్లవారకమున్న యెవ్వరికిం జెప్పకయే యేకాంతముగా నిల్లు విడిచి దేశాంతర మఱిగిరి.

కుముదాంగదుఁడు వాడుకప్రకారము పెందలకడలేచి ప్రాతఃకృత్యములు నిర్వర్తించి అల్లునితో ముచ్చటింప నతని గదిలోనికిం బోయెను. తలుపులు మూయఁ బడి యున్నవి. గురుదత్తా? లెమ్ము లెమ్ము ప్రొద్దెక్కినది. నేను ఆస్థానమున కరుగు చున్నాను. రాజు రేపువచ్చునప్పుడు నిన్నుఁగూడ. నగరికిఁ దీసికొనిరమ్మని చెప్పి యున్నాడు పోవుదము అన చీరియు నెంతసేపటికినిఁ బ్రతివచనము గానక తలుపు త్రోసి లోపలికిఁబోయి నలుమూలలు వెదకి యెందునుం గానక తొందరపడుచుఁ బడక గదిలోనికిం బోయి కొమరితం బిలిచెను.

ఆమెయుం గనపడలేదు భార్యంబిలిచి మనవాళ్ళు మేడమీఁద లేరేమి? నీతోఁ జెప్పి యెక్కడికైనం బోయిరా? అని అడిగిన నా యిల్లాలు అయ్యో! నాకేమియుం దెలియదు. ఎందుఁబోవుదురు? అమ్మాయి యింత ప్రొద్దెక్కుదనుక లేవలేదని శంకించు కొనుచుంటి చూఁడుడు అని తొందరగాఁ బలికినది. ఇరువురు మేడలన్నియు వెదకిరి ఎందునుం గనంబడలేదు. భార్య దుఃఖించుచుండ నూరడింపుచు నాకు రాజసభకుఁ బోవువేళయైనది. రాజుతోఁజెప్ప సెలవుతీసికొని వత్తును తొందరపడకుము. రాత్రి పండుకొనిరిగదా? మన మొల్లమని చెప్పకుండ బుట్టినింటికిఁ దీసికొనిపోయెనేమో? ఎద్దులును, బండియు నేకమైన మనమేమి చేయగలము. అని వలుకుచుఁ దాను రాజ సభకుఁబోయెను.

నాఁడు రాజు సభకు రాలేదు. మంత్రులు అత్యవసరకార్యములకై రాజ్ఞ నిమిత్తము వేచియుండి శుద్ధాంతరక్షకుల రాజువార్త నడుగుటయు వాండ్రు రాత్రి‌ యుద్యానవనములోఁ బండుకొనిరి. యింటికి రాలేదని చెప్పిరి.

కొందఱుమంత్రులు కేళీవనమున కరిగిరి. అందురాజు లేడనువార్తఁదెలిసి, కొని శంకాకులితస్వాంతులై వితర్కపూర్వకముగా వెదకింపఁదొడంగిరి. కరటు నడుగుటయు నతండు నాకేమియుం దెలియదు. గోమిని నడుగుఁడని మంత్రులకుఁ జెప్పెను. విమర్శింప రాత్రి గోమినియు నృపతియు నాయుద్యానవనములో నేకాంత మాడినట్లు తెలియ వచ్చినది.

గోమినిని రప్పించి నీవు రాత్రి రాజుతో మాట్లాడినట్లు తెలిసినది. ఆతండెందుఁ బోయె నెఱిగింపుమని యడుగుచుండ నది సందియమందు డెందముతో నాకేమియుం దెలియదని యుత్తరమిచ్చినది. అంతలో రాజభటులు హాహాకారధ్వనులతో వచ్చి సురూపునెవ్వరో కత్తితో నరికి పెంటకుండులోఁ బారవైచిరి. పురసమ్మార్జన కారులా పెంటనెత్తుచుండ నడుగున నొడయని శవము గనంబడినది. పౌరులెల్లరు గుమిగూడి చూచుచుండిరి. కుముదాంగదునియింట ముంగలకుండులోఁ గనంబడెనని మంత్రుల కెరింగించిరి.

మంత్రులందఱు దండనాథపురస్సరముగా నచ్చటికిబోయి కంఠము నరకఁబడి యున్న రాచపీనుఁగునుజూచి మంత్రులు విలపింపఁదొడఁగిరి. మేనంతయు మణిమ యాలంకారములచే నలంకరింపఁ బడియున్నది.

ఆశవమును పల్లకీ పై నెక్కించి నగరిలోనికిం దీసికొనిపోయిరి రాజభార్యలు బంధు వులు విలపింపదొడంగరి. కారణమెవ్వరికిందెలియదు. మంత్రులు గోమినినిఁనిర్భంధించి యడుగుటయు నది యధార్థముజెప్పినది అప్పుడు మంత్రులు రక్షకభట యుక్త ముగాఁ గుముదాంగదుని యింటిఁకి బోయి ముట్టడించిరి పశవులశాలలో రక్తచిహ్న ములన్నియుం గనంబడినవి ఇల్లుశోధింపఁ బద్మిని వ్రాసిని యుత్తర మొకటి‌ దొరికి నది.

రాజు చేసిన దుర్నయమే రాజుంజంపినదని మనంబులఁ దలంచియు మంత్రులు దండనీతిప్రకారము కుముదాంగదుని నిర్భంధించి మీవారెందుఁ బోయిరో చూపింపు మని అడిగిరి.

అతడు తనకావిషయము మించుకంతయుఁ దెలియదనియు వారిజాడఁ దెలిసి కొనుటకే సెలవు కోరుటకై రాజసభకు వచ్చితిననియు లోనగు మాటలు చెప్పి దృష్టాంతములుజూపి చెరసాలఁ బెట్టకుండఁ దన్నుఁ గాపాడు కొనియెను.

మంత్రులు సురూపున కపరసంస్కారములు నిర్వర్తింపజేసి సామంతచక్ర వర్తియగు గజేంద్రవాహనుని యాజ్ఞానుసారము తామే రాజభారమువహించి పాలిం చుచు గురుదత్తునిఁ బద్మినినిఁ గనంబడిన వెంటనే పట్టుకొని తీసికొనివచ్చనట్లు నానా దేశములకు దూతలం బంపుచు నాయాభూపతులకు వారు చేసిన రాజ్యద్రోహపరాధ మును బ్రకటించిరి. మరియు గూఢచారులు బెక్కండ్ర నియమించిరి. కుంభీనసపు రంబునకుఁ గొందఱు రాజభటులు పోయి అందున్న రాజు నానతిఁగైకొని రత్నా కరుని యిల్లుముట్టడించి వారిం బరీక్షించిరి. కాని యందునుఁ గనంబడలేదు.

రత్నాకరుఁ డావార్తవిని పిడుగు మొత్తినట్లు నిశ్చేష్టితుండై కొంతవడికి తెప్పి రిల్లి గదాధరుని రప్పించి యిట్లనియె.

గదాధరా ! నీవు మావానిం దీసికొనిరాక యత్తవారింటి కడ విడిచి వచ్చితివి. వానిభార్యను రాజువలచుటచే వానిం గడదేర్చి వారిద్దరు పారిపోయిరఁట పట్టుకొనుటకు రాజభటులు దేశములు తిరుగుచున్నారు. దొరికిన వారిం బ్రతుకనీయరుగదా భయపడి బలత్కారంబున సమసిరో తెలియదు. మీ శాస్త్రపాఠమువలనఁ గలిగిన ఫలమిది పద్మినీ జాతి కన్యం బెండ్లియాడినందులకు నీరీతిఁ బరిణమించినది. తిరుగా నాకన్నులం బడ లేదు. ఇప్పుడేమిచేయుదు? ఈధనమంతయు నెవ్వరి వశము చేయదుము. నీసహవా సంబుచే మాకీ ముప్పువాటిల్లి నదని విలపింపఁ దొడంగెను.

అప్పుడు గదాధరుఁడు పెద్దగ దుఃఖించుచు రత్నాకరా! నీకోడలు మూడులోక ములు మెచ్చుపని చేసినది. అందులకు వగవఁబని లేదు. నలదమయంతులవలె వారు ప్రచ్ఛన్నముగా గొంతకాలము సంచరించి తిరుగా వైభవము లనుభవింపకమానరు ధర్మకవచభూషితులకు నాపదలంటవు. నీవు బెండ్లి యాడి శీఘ్రము రావలయుఁజుమీ? ఆలసించితివేని మేము నిలువలేమని చెప్పిన మిత్రుని వెంటనే చూచు భాగ్యము నాకు లేకపోయినది.

శెట్టీ ! నీకోడలు గుణంబులు బుద్దివిశేషములు పొగడ శేషుఁడు చాలఁడుగదా? ఆమహాపతివ్రతను చెరపఁదలచిన నీచుఁడు సమయక నిలుచునా? మీరు విచారింప వలదు. నేను దేశములు తిరిగి వారిని వెదకి తీసికొనివచ్చెదను. కొంతకాలము గతిం చిన నీయపరాధము మాసిపొవఁగలదు. వారికేమియు భయములేదని బోధించి మంచి ముహూర్తమున నిల్లువెడలి రామదుర్గనగరమునకుఁ బోయెను.

అప్పురంబునబద్మినిం బొగడుచు సురూపునినిందింపని వారులేరు. రాజభటు లకుఁ తొలఁగుచు రూపము మార్చికొని కుముదాంగదుని యింటికింబోయి గదాధరుఁడు తన్నెఱింగించుటయు నావైశ్యద౦పతులువానిం గౌఁగలించుకొని బిట్టువాపోవఁ దొడం గిరి. గదాధరుఁడు తదీయశయనాసన బజనాదులఁ జూచి పరితపించుచు నలుమూ లలు వెదకినంత నొక పుస్తకములో గురుదత్తునిచేఁ వ్రాయఁబడిన యీపద్యము గనఁ బడినది.


క. నలుఁడును రాముఁడు పాండవు
   లిల విధి గతి వెతలఁ బడయరే? మనమును వా
   రలకన్న ఘనులమే? యిది
   దెలిసిన వగమాని ముక్తి తెరవెఱుఁగ వొకో.

అను పద్యము జదివికొని గదాధరుఁ డించుక యాలోచించి మే మడవిలో దాగి యుండెదము తెఱవు తెలిసికొని నీవురమ్మని యభిప్రాయముతో వ్రాయఁబడినది. కావున నేనరణ్యవిశేషములే వెదకఁదగినవని యాలోచించి ఆవైశ్యదంపతులతోఁ జెప్పి యుత్తరాభిముఖుండై అరిగెను.

అని యెఱింగించి,