కాశీమజిలీకథలు/ఏడవ భాగము/111వ మజిలీ

వికీసోర్స్ నుండి

గీ. దరికిరాకుండఁ గ్రూరుల దరిమినావు
    కనిన కూఁతురువలె ననుఁ గాచినావు
    పోయితివె నన్నువీడియా పుణ్యసీమ
    సకలగుణధామ! యోమృగ సార్వభౌమ.

చ. విడచితి సర్వబంధువుల వివేకములేక పురంబుబాసి కా
    ఱడవుల సంచరించితి మహావ్యధలందితిఁ గార్యసిద్ది జొఁ
    ప్పడ దదిగాక ప్రాణములఁ బ్రాణముల రోహిణి గోలుపోయితిన్‌
    గడపటిమిత్రు నన్నును బోకార్చె విధాత యిఁకేమిజేసెడిన్.

గీ. తండ్రి కరణి మేటిదాదియట్లు నినేయు
    బాతి, బిడ్డవోలె మాత రీతి
    నిన్ని నాళ్ళు కాచితీవెన్న నెయ్యంపు
    చెలివిగాక పెద్దపులివె నాకు.

గీ. త్యక్త మొనరించి తల యోగసక్త చెలిమి
    పురము బాపితి రోహిణి బొలియఁజేసి
    తాత్తమగు దీని గెడపితి వహహ దిష్ట !
    యేమి కావింపఁగలవు నన్నింకమీద‌.

అని అనేక ప్రకారముల నప్పులి కళేబరముపై దుఃఖింపుచుఁ గన్నీటిధారచే దానియొడలు దడుపుచుండెను.

అని యెఱింగించి - ఇట్లని చెప్పదొడంగెను.

111 వ మజిలీ.

పెద్దపులుల కథ

తండ్రీ ! వినుము పులి చచ్చినది. యా చిన్నది దాని మేనిపైఁబడి యూరక వగచుచున్నది అబ్బా! యెట్టి యాప్తబంధువులకైనను నట్లు విదారింపరు దానిగుణంబులం దలంచుకొని కన్నుల నశ్రుజలంబులు ప్రవాహముగాఁగార వెక్కి వెక్కి యేడ్చు చుండెను. ఆమె దుఃఖముజూడ నాకును శోక మాగినదికాదు. ఎన్నియో శోకోపశమములగు మాటలు జెప్పితిని కాని యామె వినిపించుకొనలేదు.

అప్పుడు నే నాలోచించి దేవీ ! నీకు దీనిచర్మము దీయించి యిచ్చెదఁ బరిధానముగా ధరింపుము. అని పలికిన నంగీకారము సూచించినది. అందే చర్మము దీయించి పరిశుభ్రము చేయించి యామె కర్పించితిని ఆమత్తకాశిని యాకృతి నాస్తరణగా నుపయోగింపక మడతపెట్టి దేవుని పెట్టివలెఁ బూజించుచుండెను. ఆమెకు దానియందు గట్టి విశ్వాసము గలదు. సర్వసంగత్యాగిని యైనను నామెకా పులి యందుగల మమకారము పామరులకైన నుండదు.

తరువాత నేను రెండు మూడుతేపలు పాలును ఫలములు పూవులు పట్టించుకొని యందు బోయితిని. కాని నాతో నేమియు మాటలాడినదికాదు. నా రాకయు నిష్టములేనట్లు గ్రహించి తరుచు పోవుట మానితిని.

నేఁటి యుదయమున పోయి చూడ నామెజాడ గనంబడలేదు. జనసంపర్క మొల్లక యెందో పోయినది. ఇదియే యామె వృత్తాంతమని ప్రభాకరుఁ డెఱింగించిన విని ప్రబ్యోతనుండు వత్సా ! జడభరతుండు లేడపిల్ల కై మమకారము నొందినకథ నీవు వినలేదా? మహాత్ముల చరిత్రలు విచిత్రములు ఆమె యత్తర దేశారణ్యములలోఁ దపము జేసికొనుచుండ నకస్మాత్తుగ యమునానది పొంగుటచేఁ బులితోఁ గొట్టికొని వచ్చినది. అది ఆశ్రమమృగమై యుండవచ్చును. పోనిమ్ము ఎవ్వరినేమని శపించునో యని వెరచుచుంటిని శాంతముగా నూరు దాటినదిగదా? అని పలుకుచున్న సమయంబున ద్వారపాలుఁడు వచ్చి దేవా ! నమస్కారము. రాజభటులొక యోగినినిం బట్టి కట్టి తీసికొని వచ్చి ద్వారమున వేచియున్నారు. ప్రవేశమునకు సెలవు? యని యడిగిన నా యొడయఁడు జరియుచు అక్కటా ! యోగిని నేమిటికిఁ గట్టన యు, నిది యపచారము గాదా ! సత్వరముగాఁ దీసికొని రమ్మని యోజ్ఞాపించెను.

చేతులకు నిగళంబులం దగిలించి రాజభటులొక యాగినిని రాజు ముందర నిలువంబెట్టిరి. ప్రభాకరుఁడామె యాకార మోగాదిగఁ జూచి తండ్రీ ! వేష మట్టిదేకాని యీమె యామెకాదు అనుటయు రాజు వెరచుచుఁ జేతిగొలుసులు విడదీయించి యీమె జేసిన తిప్పేమియో యెఱిగింపుఁడని యడిగిన దండనాధుం డిట్లనియె.

దేవా ! ఇది వేషమునకే యోగినిగాని క్రియలచే గజదొంగల మించినది వినుండు. కొలఁది దినములక్రిందట నొకఱేయి మత్సపురిలోనొక భాగ్యవంతుని యింటికింజని పండుకొనుటకు దావడిగినదట. సన్యాసిని యని పూజించి దీని నింటిలోనికిం దీసికొనిపోయి పండుకొనఁ బెట్టిరి ఈ రండ యింటి వారందఱు నిద్రించుచుండ నర్థ రాత్రంబున దలుపులుదీసి జాడలుజెప్పితోడిదొంగలచే నిల్లు కొల్ల బెట్టించినది.

తెల్లవారిన వెనుక నిల్లుజాచికొని యజమానులు గొల్లున నేడ్చుడుండ నీ గండ రగడం వారింకన్న నెక్కుడుగా. వగచినదఁట ఆ సమాచారము విని మేము వోయి జాడలుదీసి నిజము దెలిసికొని దీనింబట్టికొని తీసికొని వచ్చితిమి. ఎన్నిగొట్టినను మాటాడదు. ఇంత మొండిగరాసు పుడమిలో లేదు కుడువక త్రాగక యెన్ని దినములైన నుపవాసములు చేయఁగలదు. ఈ చేడిపై యవ్వల నెక్కడనో దొంగతనము జేసి యోగినీ వేషము వైచుకొని రాత్రికి రాత్రి యమునానది నీదికొని మత్స్యపురి జేరినదఁట. సాక్షులు విచారించి దీనికిఁ దగినశిక్ష విధింపవలయును. అని దండనాధుఁడు నివేదించుటయు రాజు ఇందుకు యాలోచించి సాక్షు లెవ్వరని అడిగెను.

మత్స్యముఖుడు జాలహస్తుడు అనువారల నెదర నిలువంబెట్టి వీరే ముఖ్య సాక్షులు. అని దండనాధుఁడు చెప్పినంత రాజు జాలహస్తు నవ్వలికిం బొమ్మని మత్స్యముఖునిం జూచి నీవేమిదూచితివో చెవ్పుమని యడగిన వాఁడు మ్రొక్కుచు నిట్లనియె.

స్వామీ ! ఏటికి వరద వచ్చినదని విని యొకనాఁడు తెల్లవారుజామున నేనును జాలహస్తుండును దెప్పలెత్తుకొని యమునకు బోయితిమి. మిన్నంటఁ బొంగిన యా నదిలో నప్పుడు మ్రాకులు మ్రాకులు కొట్టుకొని పోవుచుండెను మే మొక దారువుం జూచి మంచిదని యెంచి దెప్పలు వాలిచి యిరువురము నీదికొనిపోయి దానిం బట్టికొంటిమి. అదికర్రగాదు చచ్చినపులి ఆ పులిపై నీమె పండుకొని యున్నది. మొదట జడిసి పులి చచ్చినదని తెలిసికొని యీమెను మెల్లన మా తెప్పలపై నెక్కించుకొని యొడ్డు జేర్చితిమి.

ఒడ్డున నిలువంబడి యీమె కన్నులం దెరచి నలుమూలలు చూచుచు జితవతీ ! జితవేతీ ! సఖీ ! జితవతీ ! యన యెవ్వరినో పిలిచినది. ఎవ్వరుం బలుకలేదు. మీ రెవ్వరని మే మడిగిన మా కేమియు సమాధానము జెప్పక చేతులతో నేదియో సంజ్ఞ జేసినది. మా కేమియుం దెలిసినదికాదు. ఆమెను గట్టెక్కించి యూరి దారిజూపి మే మీతకుం బోయితిమి. మరునాఁడు రాజభటులు మా యింటికివచ్చి మమ్ముం బట్టికొని యేమేమో చెప్పుమని మాకు బోధించిరి. కాని యా మాటలేమియు జ్ఞాపకములేవు. ఇదియే నే నెఱింగినకథ యని మత్స్యముఖుఁడు. చెప్పెను. జాలహస్తునడుగ నా మాటలే చెప్పెను.

అప్పుడు దండనాధుఁడు దేవా ! వీండ్రు దీనివలన లంచములు దిని తిరిగి పోయిరి. మరికొందఱు సాక్షులు గలరు. గడువిచ్చునఁ దీసికొని వత్తుమని పలుకుచుండ నదలింపుచు చాలు చాలు మీ కల్పనలు దెలిసినవి. సాధుజనులపై నసత్యములు పలికినఁ బుత్రమిత్ర కళత్రాదులతో నశింతురుసుమీ? ఈమె కాదు మీరు శిక్షార్హులు పిమ్మట మీ పని విమర్శింతుము. పొండు పొండు అని రాజు వారిని మందలించి కుమారుని వంక జూచెను.

ప్రభాకరుఁడు తండ్రితో జనాంతికముగా నీ యోగినికి మొన్నవచ్చిన యోగినికి నెద్దియో సంబంధమున్నది. రూపభేదమున్నను నిరువురు గట్టిన పుట్టము లొక్కి టియే ఇరువురు పెద్దపులులతో యమునానదిం గొట్టికొని వచ్చిరి. వీరయం దెద్దియో యమానుష ప్రభావమున్నది. ఈమె నడిగి తెలిసికొనియెదంగాక సభ ముగించి యరుగఁడని చెప్పటయు నతం డట్టుకావించెను.

తరువాతఁ బ్రభాకరు డా యోగినికి నమస్కరింపుచు దేవీ ! నీ విధం బెఱుఁగక మా కింకరులు నీ కపచారము గావించిరి. మా తప్పు సైరింపవలయును. మఱియు నీ వలెనే పెద్దపులితో మొన్ననొక యోగిని యమునలోఁ గొట్టికొనివచ్చి కొన్ని దినములు మాయార నున్నది. పాప మాపులి సమసినది. విచారించుచు నమ్మించుఁబోణి మొన్ననే యెక్కడికో పోయినది. ఆ యోగిని వృత్తాంతము నీ వెఱింగియుందువు. మీ రెందలి వారలు. తొలిప్రాయములో నిట్టి వైరాగ్య ప్రవృత్తి వహించుటకుఁ గతంబేమి? మీ వృత్తాంత మెఱింగించి మమ్ము గృతార్ధులఁగావింపుము.

నాఁడు గట్టెక్కినతోడనే జితవతీ ! అని పిలిచితివఁట ఆ జితవతి యెవ్వతె ? నీ కెట్టి సఖురాలు? నేను బ్రభాకరుఁ డనువాఁడ ప్రద్యోతనుఁడను నరవరుండు నాకుఁ దండ్రి. మేమీ దేశాధిపతులము ఇదియే మా వృత్తాంతము ఇఁక నీ కథ యెఱింగింపక తీరదని మిక్కిలి వినయముతోఁ బ్రార్దించుటయు నా యోగిని మోమించుక యెత్తి యతని వంక జూచుచు నిట్లనియె.

రాజపుత్రా ! నా చరిత్రము కడువిచిత్రమైనది పిమ్మట నెఱింగించెద మీ యూరు వచ్చిన యోగిని యెన్నియేండ్లది? ఎట్లున్నది? ఎన్నెదినములు లిందున్నది? ఎందుబోయినది? పులితోవచ్చి గట్టెక్కినదా? అని యడిగిన నామె కాతఁడా యోగిని వృత్తాంతమంతయు వెండియు సవిస్తరముగా నెఱింగించెను.

ఆకథవిని యాయోగిని జితవతి కా నిశ్చయించి ఆహా ! ఈ ప్రభాకరునికే నాసఖురాలి నిచ్చుటకు నిశ్చయించిరి. మే మిక్కడికే రావలయునా? ఆమె యోగినీత్వమునకు శంకించుచు నితండు దరువాత బెండ్లి యాడుమనిన నాక్షేపించునేమో ఔరా! దైవమహిమ కానిమ్ము వీనికి మావృత్తాంత మెఱిగించి వీని సహాయమున నాసఖురాలిని వెదకి తెప్పించి యింటికిఁబోవు యత్నము గావించెదనని నిశ్చయించి రాజ నందనా ! మమ్ము నీవెఱుంగకున్నను నిన్ను మేమెఱుంగుదుము. మాయుదంతంబు మిక్కిలి హాస్యాస్పదముగా నున్నది. నీకంతయు నెఱింగించెద నాక్షేపింపక కర్తవ్య ముపదేశింపుము.

మీరిదివరకుఁజూచిన యోగినియే జితవతి. యుశీనరునికూతురు నే నామె సఖురాలను నాపేరు రోహిణియండ్రు. ఆమెకు యోగసక్తయను వసుపత్నితో మైత్రి గలిసినది. తననిమిత్తమై వసువులు శప్తులైరని విని వసిష్ఠాశ్రమమునకుఁ బోవుటకై యోగినీవేషము వైచినది. పురమువిడిచి మేము ప్రయాణములోఁ గొన్నిదినము లాయన వృత్తాంతము విమర్శించుచు వసించితిమి. కొందఱు యోగులు మమ్ము మాయ జేసి వసిష్టుండు చంపకారణ్యములో నున్నవాఁడు తీసికొనిపోయెదమని చెప్పి యొక యరణ్యములోనికిం దీసికొనిపోయిరి. అందు వారి కపటము దెలిసికొని యొకనాఁడు వారికిఁ దెలియకుండ నుత్తరముగా నడవులం బడిపోయితిమి.

అమ్మహారణ్యమధ్యంబున నడుచుచు జితవతి, ఔరా ! బైరాగులు యోగులు ఇంత కపటాత్ములని యెఱుఁగక పోయితిని. అయ్యో ! ఆబ్రహ్మానందయోగి యెట్టి శ్లోకములు చదివెను? ఎటువంటి యుపన్యాసమిచ్చెను. అఖండబ్రహ్మవేత్తవలె నభినయించుచుఁ నెట్టి నీచవృత్తి కవలంబించెను. సీ. సీ. బూడిదబూసికొని తిరిగెడు మన రూపువలచి యెంతకల్పనలు జేసిరి. చాలుఁ జాలుఁ మనపయనము చక్కఁగనే యున్నది. అక్కటా? మంచుబారిన యీ యిసుకనేల నడుచుటఁ గష్టముగా నున్నది. కాళ్ళు జివ్వుమనుచున్నవి. ఎట్లు నడుతును? మఱి యొకదారి జూపుమని పలికినఁ గన్నీరుగార్చుచు నే నిట్లంటిని.

తల్లీ ! నీదురవస్థం జూచుచుండ నాగుండె పగిలిపోవుచున్నది. నిన్నేమని యూరడింతును. అపాపాత్ములు ఎదురుపడుదురేమోయని మారుత్రోవం దీసికొని వచ్చితిని. ఈదారి మహారణ్యములోఁ బ్రవేశ పెట్టినది. ముందుదారి దోపకున్నదిగదా మఱియును--

సీ. రమణీయమణి కుట్టిమముల నల్లన చరిం
                 పఁగనె కందుఁ ద్వదంఘ్రి పల్లవములు
    పండువెన్నెలలు పైపై సోకినంతనే
                 వడ దాకుచుండు నీయొడలినిగ్గు
    అనురక్తిఁ బూలుగోసినమాత్ర శ్రమజలం
                మ్ములు గ్రమ్మ వాడు నీముద్దుమోము
    ఉపవనాంచితపతం గోచ్చ స్వనంబులా
                లించిన నీమది సంచలించు

గీ. నట్టి నీవిప్పుడీ కంటె కాటవులను
    దిఱుగుచుంటి వయో? తల్లి దిక్కుమాలి
    కటకటా! విధి యెటువంటి కఠినమతియొ
    నీగృతజ్ఞ మెచ్చి మన్నింపఁడయ్యె.

అని వగచుచు నే నామెను గొంతసేపందుఁ గూర్చుండఁబెట్టి పాదంబులొత్తి తిని. కొంచెము విశ్రాంతిగలిగినతోడనే లేవదీసి చేయిపట్టుకొని మఱికొంతదూరము నడిపించితిని. పోయినకొలది యరణ్యము మూసికొనిపోయి దారి కనంబడలేదు అబ్బా ఆమహారణ్యము తలంచికొనిన నిప్పుడు మేను ఝల్లుమనుచున్నది. యెండయేమియు గనబడదు. చలిబాధ చెప్పనలవిగాదు ఎటుపోవుటకు దారిదోపక యొకచెట్టుక్రిందఁ జతికిలబడి నేనామెం గౌఁగలించుకొని యధైర్యముదోపఁ సఖీ ! మన చారిత్ర మింతటితో ముగిసినది. నీసుగుణపుంజములన్నియు నీయరణ్యము పాలైనవి. ప్రొద్దు గ్రుంక వచ్చినది. అక్కటా ! చక్రవర్తి కడుపునఁబుట్టి సకలవిద్యలంజదివి రూపమున పేరు పొంది ఇంద్రభోగము లనుభవించెడు నీకీ యడవినడుమ జావు విధింపఁబడినది. ఆహా ! విధి యెత్తికోల.

సీ. ధర్మమా! నీకేది ? తావలంబిటమీఁద
              శీలమా? నీవెందుఁ జేరెదింక
    శాంతి? నీవెందు విశ్రాంతి గైకొందువో
              సత్యమా? నీకు నిశాంతమేది?
    కనికరంబా? యెందుఁజని వసించెదవీవు
              త్యాగమా? యెందుఁ బోఁదలఁచినావు
    వైరాగ్యమా? యేదిదారి నీకిటుపైన
              శౌచమా? యెటఁ దల దాచుకొందుఁ

గీ. వహాహ మీకెల్ల నాటపట్లైన కొమ్మ
   యార్యగుణములబ్రోగు సౌందర్యరాశి
   జితవతీ సతియైహికస్థితులవదలిఁ
   యఱుగుచున్నది పరలోక మరయుఁ డింక.

అని నేను దుఃఖించుచుండ నామె లేచి నాకన్నీరు దుడుచుచు సఖీ ! నాకతంబున నీకీ వెత గలిగినది. నీవు సకలసుఖముల బంధువుల విడచి నాతోవచ్చి కష్టముల పాలైతివి. జన్మజన్మమునకు నీకు దాసురాలనై యుండునట్లు భగవంతునిఁ బ్రార్థించెద నింతకన్న నీకేమి యుపకారము చెప్పగలను. చావు వచ్చునని నాకేమియు వెరపు లేదు. కాని నీనిమిత్తమై వగచుచుంటిని. మనపురాకృత సుకృత మిట్లుండ మనకు మంచి యెట్లు జరుగును. పోనిమ్ము భోగములు అస్థిరములని మనము చదివితిమి

గదా ? యెప్పుడో వానికంతమున్నది. మనకు మొదటనే వచ్చినవి గావున భగవంతుని ధ్యానము చేసికొందము. విచారింపకుము అని నాకు బోధించుచు చేతులుజోడించి కన్నులు మూసికొని

ఉ. పరమేశ! యోవరద! యో జగదీశ్వర! నా నిమిత్తమై
    శాపము జెందియున్న వసుసత్త ములం గరుణించి వీతసం
    తాపులజేసి తద్గతఘవ్యధలం ఘటియింపు నాకు న
    య్యాపదలే భరింతు నిదియౌనని నా తుదికోర్కె దీర్పవే.

అని ప్రార్థించి సఖీ ! చీకటి పడినది. క్రూరమృగముల యార్పులు వినంబడుచున్నవి. ఇక్కడనుండి పరలోకమున కరిగి సుఖింతము. అంత్య కాలస్మరణము జేసికొనుమని పలుకుచు నా తొడలపై శిరంబిడి చేతులు జోడించి ధ్యానించుచుండెను. నేనును జితవతి శిరంబు దొడలపై నిడుకొని నా శిరమందు మోపి అంక్యకాల స్మరణము చేయుచుంటిని.

పెద్దపులుల కథ

కొంత సేపటికి యొక పులి దేనినో జంతువును నోట గఱచికొని పొదలెల్ల నదర రొదజేయుచు మేము గూర్చున్న పొదరింటిదరి కరుదెంచినది. అప్పుడు జితవతిపై నా శిరముగప్పి చేతులతో నాచిపట్టుచుమమ్మా జంతువు మ్రింగినట్లే తలంచియుంటిమి. అ వ్యాఘ్రంబు జూచియో చూడకయో మా మీదకి రాక యాదఱి దాను దెచ్చిన జంతువను సగము ప్రాణముతో గొట్టుకొనుచు వికృతస్వరముతో రొద జేయుచుండ నలిపి నలిపి దానిం జంపి తినుచుండెను. అంతలో వేరొక చారల మెకము గోళ్ళ నేలంగీరుచు నచ్చటికి వచ్చినది. దానిం జూచి మొదటిపులి గాండ్రుమని అరచినది. ఆ యఱపు విని మా ప్రాణములు పోయినవియే యనుకొంటిమి. రెండవపులి మొదటి పులిమీదఁ బడి రక్కుచు దాని నోటనున్న యాహారమును లాగికొనిపోయినది. అప్పుడారెండు పులులకుఁ పెద్ద యద్దము జరిగినది పొదలదరు నట్లొండొంటిని గెంటివైచుచుఁ గాలూతదొరకిన నిలిచి వెనుకకు దరముచుఁ గ్రిందుమీదగుచుఁ గొంతసేపు పోట్లాడినవి.

అందొకటి. బలము తఱిగి వెనుకకు తిరిగి పరచుటయు దానిందరుముకొని రెండవపులి పోయినది. అంతలోఁ దెల్ల వారినది. రవితేజము దెసనెల్లె డల వ్యాపించినది. పక్షుల ధ్వనులు వినఁబడుచున్నవి. అప్పుడు జితవతి రోహిణీ ! మనమిప్పు డెందుంటిమి సమసితిమా? అని పలికిన నేనులేచి నలుమూలలు చూచి విస్మయ సంభ్రమములతో నౌరా! ఎంత చిత్రము. పులులు వానిలో నవి కొట్లాడి మనలఁ జూచినవికావు. ఈ యడవి యంతయు వాని పెనుకవచే నరికినట్లే విచ్చిన్నమైనది. తెరిపిగా దారి కనంబడుచున్నది. చూడుమనుటయు జితవతి లేచి పరికించి యిట్లనియె.

సఖీ ! భగవంతుని యుద్యమము నాకుఁ దెలిసినది వినుము. మన పురాకృత మతిక్రూరము ఇంకను జిక్కులు పడవలసిన యోగమున్నది. అందుకై మనల పెద్దపులుల కాహారము సేయుఁడయ్యె. ఇఁక మనము బ్రతికిన ప్రయోజనములేదు. పులుల వెదకికొనుచుఁ బోవుదము. నోఁటిలోఁ దలపెట్టినను మ్రింగవాయేమి? పదపద. మనకు దారిజేసినవని పలికిన విని నేనును తత్కాలోచితమైన మాటలచే నాబోటికిఁ బ్రత్యుత్తర మిచ్చితిని.

అప్పు డిద్దరము లేచి తెరపిచేయఁబడిన తెరవున మెల్లగా నడువఁ దొడంగితిమి. కొంతదూరము నడిచినంత నా క్రూరమృగముల ధ్వనులు మా చెవులఁ బడినవి. అప్పుడు నేను భయకంపితిగాత్రినై గద్గస్వరముతో జితవతీ ? అవిగో రాత్రి పులులు మనదెసకు వచ్చుచున్నవి. ఇప్పుడు విడువవు. చంపగలవు. అయ్యో, అయ్యో, అని వగచుచుండ వారించుచు, జితవతి నవ్వుచు, రోహిణి? నీకాభయ మేమిటికి? క్షణకాల మోర్చితిమేని నీ యిక్కట్టు లన్నియుం బాయునుగదా. ఆడంబోయిన తీర్దమెదురైనట్లు మన మా పులుల కొరకు వెదకుచుఁ బోవుచుండ నవి యెదురైనవి. సంతసము జెందక దుఃఖించెద వేమిటికి? అని బోధించుచు నాచేయిపట్టుకొని వానికెదురుగాఁ దీసికొనిపోయినది.

క్రమంబున నా పులులు రెండును మా దాపునకు వచ్చి వచ్చి మచ్చికజేసిన వానివలెఁ తోకలాడించుచు మా పాదములు నాకదొడంగినవి. అప్పు డామగువ మృగరాజనులారా ! మమ్ము భక్షించి మీ యాకలి యడంచుకొనుడు అని పలికి కన్నులు మూసికొన్నది.

అ మ్మెకంబులు పెంపుడు కుక్కలవలెఁ బ్రక్క నిలువంబడి తోకలాడించుచు నడుగులు నాకుచుఁ జేతులు మూర్కొనుచు మమ్మాశ్రయించు సూచన లబినయించినవి అప్పు డబ్బురపాటుతో నాబోఁటి‌ యిదియేమి వింత? పులులు శాంతమూర్తులైన వేమి? ఇవి మరియొక జంతువులు కావుగదా యని యడిగిన నే నిట్లంటి.

సఖీ ! తెలిసినది. పులులు నీ శీలమునకు మెచ్చి యిట్లు వశమైనవి. మహర్షుల యాశ్రమముల మృగములు జాతి వైరములు విడుచునని మనము వినియుండలేదా. నీవు బాషితుల్యవైతివి. ఇఁక మృత్యువు నిన్నేమియుం జేయఁజాలదు. నీ సహవాసమున నేనును కృతకృత్యనైతిని. ఇఁక నీ మనోరథము సఫలము గాఁగలదు.

అని పొగడిన వినిపించుకొనక జితవతి పులుల వీపుపైఁ జేయివైచి ఱాచుచు జూలు దువ్వుచు ముద్దుపెట్టుకొనుచు మృగములారా? వీండ్రు కృతఘ్నురాండ్రని మా మేనిమాంస మేమాగించితిరా? అగునను కృతఘ్నుని మాంసము కుక్కయు ముట్టదండ్రుఁ మీ మాట జెప్పనేల యని యేమేమో పలుకుచుండ నవి పిల్లి కూనలవలె నణఁగి మా యడుగులమ్రోలఁ బండుకొన్నవి. పిమ్మట మేము లేచి నడువఁ దొడంగిన నవియు మా ముందర నడచుచుండు నవి నిలఁబడిన నిలువఁబడును. తావులేనిచో లతాగుల్మాదుల ఖండించి దారిజేయునవి. మృత్యుతుల్యములగు నాసత్వములు భృత్యకృత్యములు గావింపుచుండఁ బశ్చిమ ముఖముగా గొంతదూరము పోయితిమి. అ౦దొక నది మా కడ్డమైనది. ఇంద్రనీల ప్రభాధగద్దగితములగు నదీజలంబులు గన్నుల పండువు గావింప నది యమున యని తెలిసికొని తత్పవిత్రోదకంబుల స్నానము గావింపుచుండఁ బులులును మా ప్రక్కనే క్రుంకులు పెట్టుచుండెను. ఆ వినోదము జూచుచు మేము గొంతసేపు వానితో గూడ జలక్రీడ లాడితిమి. అట్టితఱి చిన్న మబ్బుబట్టి వామనదేహమట్లు క్రమంబున విస్తరిల్లి యింద్రజాల ధూమమువలె విజృంభించి దెసల జీమట్లుక్రమ్మ మొగులు మూసికొని పెద్ద వర్షము గురియఁ దొడంగినది.

మ. కరకాచ్ఛాదితమై ఘనాఘనబృహద్గర్దాకవో పేతమై
     వరవిద్యుల్లవతి ప్రబలమై వాస్తోష్పతిష్యాన---
    ధురిమై సర్వదిశాభిభాగములు నస్తోకాంబుపూర్ణంబుగా
    గురిసెవ్వర్షము నీడజవ్రజము సంక్షోభింప భీమంబునన్.

ఆ వృష్టిపాతకంబునకు వెరచుచుఁ గంఠదఘ్న జలంబున నిలిచి వృధుధారాతా నంబున శిరోవేదన జనియింప జలంబుల మునుగుచుఁ దేలుచుఁ గొంతసేపెట్లో యా సంకటము సైరించితిమి. క్రమంబున నవ్వర్షో ప్రదవంబు బ్రళయకాలంబో యన వెరపుగలుగఁజేయ దొడంగినది.

అంతలో నా ప్రవాహమునకుఁ గ్రొత్తనీరు దగిలి పొంగుట ప్రారంభించినది. మా పాదములు తేలిపోయినవి. నీటిలో మునుగుటకు సిద్ధపడితిమి. అప్పుడు దాపున నున్న పులులఁ జెరియొక దానిం బట్టికొంటిమి. అవియు విన్నాణముగా మమ్ముఁదమపై కెక్కించుకొని యోడలవలె నా ప్రవాహములో నీద మొదలు పెట్టినవి. కొండంత యెత్తునఁ బొంగి యా ప్రవాహము శరవేగముగాఁ బారుచుండెను. తీరభూరుహములు వ్రేళ్ళతోఁగూడ గుభాలుమను చప్పుళ్ళతో నేటిలోఁ బడి కొట్టుకొని పోవుచుండెను.

మమ్మా పెద్దపులులు వీపుపై నాపికొని ప్రమాదము రాకుండ నీది యీది యవ్వలిదరి జేరవలయునని ప్రయత్నించినవి. శక్యమైనదికాదు. రెండుపులులు విడి పోయినవి. నేనెక్కిన పులి బలహీనమై కాళ్లుతేలవైచి‌ నీరుమ్రింగి కొంత సేపటికిఁ బ్రాణములు విడిచినది. నేను దాని కళేబరము విడువక యొక కర్రతోఁ జేర్చి పట్టుకొని యా రాత్రి యెల్ల గొట్టుకొని పోయితిని. తెల్లవారుజామున నీ పల్లె వాండ్రు వచ్చి నన్నుఁ దెప్పలపై కెక్కించుకొని తీరము జేర్చిరి ఆనాఁడు రాత్రి యా పల్లెలో నొక గృహస్తునింట బండుకొంటిని. దొంగలా రేయి వారిల్లు కొల్ల బెట్టినమాట వాస్తవము ఆ నేరము నాయందు మోపి రాజభటులు నన్ను మీ యొద్దకుఁ దీసికొనివచ్చిరి. అదియే నావృత్తాంతము అని యెఱింగించిన విని యా రాజపుత్రుఁడు ముక్కు పై వ్రేలిడుకొని పెద్దతడ వట్టె నిలువంబడి ధ్యానించచు నౌరా? యెట్టిచిత్రము వింటిని. ఆ యోగిని జితవతియా? చిత్రఫలకము చూచి యుండుటంబట్టి యామె రూపమెప్పుడో కాంచినట్లే యున్నది. భళిరే? యెంత చోద్యము? బాపురే? యెంత యాశ్చర్యము? అట్టి కృతజ్ఞురాలికి దైవము తోడుపడకుండునా? క్రూరమృగము లూడిగములు జేయుట యబ్బురమా? అని యూరక వెరగుపడుచు నయ్యయో ? అంతఃపురముల మెలంగెడిమీరెక్కడ? వసిష్ఠమహర్షి యాశ్రమ మెక్కడ? జితవతికి వెఱ్ఱియెత్తిన నీవు వలదనక పెద్దవారలకుఁ జెప్పక యట్లు చేయుదువా? ఆమెంగానక తల్లిదండ్రు లెంత చింతించుచుందురో? కానిమ్ము గతంబునకు వగచినం బ్రయోజనములేదు. ఇప్పుడామె యుత్తర దిశనున్న అరణ్య మార్గమునఁ బోయినదని జాడలు దెలిసినవి మనము పోయి పట్టుకొని కట్టి పెట్టి బలవంతమున నామె నింటికిం దీసికొని పోవుదము. జితవతియని తెలిసిన నేనప్పుడే చేయిపట్టుకొని యాటంకము చేయకపోవుదునా? అని చెప్పి అతండు తండ్రి కా తెరం గెఱిగించి యుచిత పరివారముతోఁ గూడికొని రోపాణి వెంటబెట్టుకొని యుత్తర దేశారణ్యములు తిరుగుచు నామెను వెదకుచుండెను.

అని యెఱింగించి మణిసిద్దుండు - ఇట్లని జెప్పందొడంగెను.

112 వ మజిలీ.

సన్యాసుల కథ

అమ్మా! లెమ్ము లెమ్ము. ఎన్ని దినము లిట్లాహారము గుడువక కృశించెదవు? జితివతి రోహిణియుఁ బ్రయాగమున కవ్వల అడవులలో దిరుగుచున్నట్లు జాడలు తెలిసినవట. ప్రయాగ నగరాధీశ్వరుండు కొందఱ సన్యాసుల మన రాజధానికిఁ బంపెను. వారి అభియోగము విచారించుచు అయ్యగారు మీకీవార్త దెలుపుమని పరిచరునిఁ బంపిరి. అనుటయు జితవతితల్లి అట్లే లేచి యేమీ! నాపట్టి బ్రతికి యున్నట్లు వార్తలు వచ్చినవియా? అయ్యయ్యో ? అరణ్యములలో దిరుగుట కేమి కారణము? ఎవ్వరు చెప్పిరి? ఏమని చెప్పిరి? అని అడిగినఁ దిలక యను పెద్దదాసి అమ్మా ! పరిచరుఁ డీమాట చెప్పెను. అతఁడు ద్వారమున నున్నవాఁడు రప్పింపనా? అనుటయు నామె వాని రాక కనుజ్ఞ యిచ్చినది. తిలక పోయి వానిం దీసికొనివచ్చి అమ్మగారితో సవిస్తరముగాఁ జెప్పుమని నియోగించిన నాకింకరుం డిట్లనియె.